తెలంగాణలో అన్నదాతలు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఆనందపడాల్సింది పోయి, కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి పడిగాపులు కాచే పరిస్థితి దాపురించింది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో అలసత్వం రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యాన్ని కొనుగోలు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు కాంటా కోసం 15 నుంచి 25 రోజుల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఎండల్లో, వర్షాల్లో ధాన్యపు రాశుల వద్దే రైతులు కాపలా కాస్తున్నారు. కష్టాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారం భించినా, అక్కడ తగినంత సరైన సిబ్బంది లేకపోవడం, కాంటాలు వేయడానికి ఏర్పాట్లు లేకపోవడం, హమాలీల కొరత, లారీలు అందు బాటులో లేకపోవడంతో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. కాంటా వేసిన తర్వాత కూడా ధాన్యాన్ని మిల్లులకు తరలించే పక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ధాన్యం తరలింపునకు లారీలు సమయానికి రాకపోవడం మరింత సమస్యగా మారింది. ఈ ఆలస్యం రైతులకు ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఎండల్లో రోజులు తరబడి ధాన్యం ఉంచడంతో బరువు తగ్గిపోతోంది. కొంతమంది లారీ యజమానులు బస్తాకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండల్లో రోజులు తరబడి ధాన్యం ఉంచడంతో బరువు తగ్గిపోతోంది. తూకాల పక్రియ, తరుగు సమస్య సమస్యలుగా పరిణమించాయి. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ అధికారులు ధాన్యాన్ని తిరస్కరించడం, తరుగు పేరుతో అదనపు కోతలు విధించడం రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతం దాటితే కోతలు విధిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇష్టం వచ్చినట్లు తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మార్కెట్ ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులు, క్వింటాల్‌కు నాలుగు నుంచి ఐదుకిలోల వరకు అదనపు కోతలు విధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల బస్తాకు అదనపు బరువు వేస్తున్నారని, తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు పెరిగి అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు ఈ తరహా కోతలు మరింత ఆర్థిక భారం మిగులుస్తున్నాయి.
అకాల వర్షాలు.. రైతు గుండెల్లో గుబులు
వాతావరణ పరిస్థితులు కూడా రైతులను తీవ్రంగా భయపెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం మొదలవడంతో అనేక జిల్లాల్లో గాలి వానలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి పడివున్న ధాన్యం వర్షాలకు తడిసి రంగు మారుతోంది. తేమ పెరగ డంతో అధికారులు తిరస్కరిస్తారేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. కొన్ని ముందుస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం టార్పాలిన్లు, తాత్కాలిక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అలాంటివి కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గోదాముల కొరత.. రవాణా అస్తవ్యస్తం
కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల వద్ద గోదాముల కొరత ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి సరిపడా స్థలం లేకపోవడంతో కొనుగోలు పక్రియ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తమ వంత ఎప్పుడోనని స్థానిక రైతులు ఎదురు చూస్తూ గడుపుతున్నారు.
రైతులకు భరోసా ఎక్కడ?
ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద ఎత్తున హమీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, వేగవంతమైన కొనుగోళ్లు… అన్న హమీలు అంతగా అమలు కాక రైతు అప్పుల బారిన పడుతున్నాడు. పంట అమ్ముడుకాక కొత్త సాగుకు పెట్టుబడి దొరకడం లేదు. కొనుగోళ్లలో జాప్యం, ప్రభుత్వ యంత్రాంగం పనిలో సమన్వయ లోపం, కొనుగోలు పక్రియలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, సరఫరా వ్యవస్థలో గందరగోళం కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం సమీక్షలు.. పరిష్కారం కాని సమస్యలు
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ‘మిషన్ మోడ్‌లో కొనుగోళ్లు పూర్తి చేయాలి’, ‘రైతులకు ఇబ్బంది కలగకూడదు’, ‘నిర్లక్ష్యాన్ని సహించం’ అని అధికారులకు హెచ్చరికలతో కూడిన ఆదేశాలు ఇచ్చారు. గోనె సంచులు, హమాలీలు, లారీలు అందు బాటులో ఉండాలని సూచించారు. అవసరమైతే ఫంక్షన్ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక గోదాములుగా ఉపయోగించాలని చెప్పారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారులను నియమించాలని కూడా ఆదేశించారు. కానీ ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల వ•సివేత?
పెద్ద సంఖ్యలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నిటిని త్వరలో వ•సివేయాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చారనే వార్తలు రైతుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంకా దాదాపు లక్షల టన్నుల ధాన్యం బయటే ఉండగా కొనుగోలు కేంద్రాలు వ•సేస్తే మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పనిచేయకపోతే రైతులు ప్రైవేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు కొనుగోలు చేయడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మక్కలు, జొన్నల కొనుగోళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
‘రైతుగోసకు బీజేపీ భరోసా’
ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలుస్తామంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘‘రైతుగోస – బీజేపీ భరోసా’’ పేరుతో చేపట్టిన యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చను లేవనెత్తింది. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసు కునేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు వ•డు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వికారాబాద్, గజ్వేల్, భువనగిరి, వరంగల్, భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను ఈ బృందాలు సందర్శించాయి. రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమస్యలను నమోదు చేశాయి. కాంటాల జాప్యం, తరుగు కోతలు, గన్నీ సంచుల కొరత, లారీలు లేక రవాణా సమస్యలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై రైతుల నుంచి నేరుగా వివరాలు సేకరించారు.
రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యలు లేనిదిగా తీర్చిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. ‘‘రైతుగోస – బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రైతులతో సమావేశమై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న అవస్థలకు తీవ్రంగా స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె స•ంచులు, రవాణా సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్‌రావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు మానసికంగా కుంగి పోతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ‘తమ పార్టీ యాత్ర ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం హడావిడిగా ఏర్పాట్లు చేస్తోంది. తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. వరితో పాటు మక్కలు, జొన్నల కొనుగోళ్లలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు పంట అమ్ముకునే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. దళారులు, ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకు లాభం చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని, ప్రతి గింజా కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తామని ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.
హడావిడి సమీక్షలు
బీజేపీ యాత్ర ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం వరుస సమీక్షలు నిర్వహించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. రైతుల సమస్యలు నెలలుగా కొనసాగుతున్నా.. అప్పటివరకు కనిపించని అత్యవసర పరిస్థితులను ప్రభుత్వం ఒక్కసారిగా చూపించడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు ఉండాలని, లారీలు అందుబాటులో ఉంచాలని, తాత్కాలిక గోదాములు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం,ఒక్కసారిగా ముందస్తు ప్రణాళికలో వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వమిస్తుండగా, మరోవైపు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
పంట పండించడం రైతు బాధ్యత అయితే… పండించిన పంటకు గిట్టుబాటు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బలంగా వినిపిస్తోంది. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి పోతుంటే, ప్రభుత్వం సమీక్షలతో సరిపెడుతోందనే భావన రైతుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రైతు సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ చేపట్టిన ‘‘రైతు గోస – బీజేపీ భరోసా’’ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.
రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ చెబు తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికైనా కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. రైతాంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అలాంటి రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, కొనుగోళ్లలో సమన్వయం లేకపోవడం, రైతులను ఇబ్బందుల పాలుచేయడం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068