ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ తాజా పర్యటనలో భాగంగా యూఏఈతో దీర్ఘకాలిక లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ) మనదేశంలో ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 30 మిలియన్ బారెళ్లకు పెంచేలా కుదిరిన ఒప్పందం మనదేశ ఇంధన భద్రత పరంగా అత్యంత కీలకం. గుజరాత్‌లోని ధోలేరాలో నిర్మాణమవుతున్న 11 బిలియన్ల డాలర్ల విలువైన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌కు అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి డచ్ దిగ్గజం ‘ఏఎస్‌ఎంఎల్’ తో కుదిరిన ఒప్పందాన్నీ చారిత్రాత్మకమనే చెప్పాలి.
యూఏఈతో కీలక ఒప్పందాలు
ప్రధాని నరేంద్రమోదీ మే 15న యూఏఈలో కేవలం రెండున్నర గంటల పాటు జరిపిన పర్యటన ఎంతో కీలకంగా మారింది. ఆయన యూఏఈకి వెళ్లడానికి ఒక్కరోజు ముందు ఇజ్రా•••ల్ ఒక ఆశ్చర్యకర ప్రకటన చేసింది. ఇరాన్-యు.ఎస్. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని రహస్యంగా యూఏఈ అధ్యక్షుడిని కలిసారన్నది ఆ ప్రకటన సారాంశం. అంతేకాదు ఐర•న్ డోమ్ టెక్నాలజీ, యాంటీ మిస్సైల్ బ్యాటరీలు ఇజ్రాయెల్, యూఏఈకి ఇచ్చింది. ఇంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూఏఈకి తప్ప మరే ఇతర దేశానికి ఇవ్వలేదు. ఈ ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో యూఏఈ, ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇరాన్‌కు తెలిసినా, దీన్ని బయటకు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేక మిన్నకుండిపోయింది. అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వ ప్రకటనను యూఏఈ అధికారికంగా ఖండించడంతో ఈ రెండు దేశాల మధ్య స్వల్ప విభేదాలు పొడచూపిన తరుణంలోనే మోదీ యూఏఈ వెళ్లడం గమనార్హం. యూఏఈపై, ఇరాన్ చేసిన దాడులను మోదీ తన పర్యటన సందర్భంగా ఖండించడం ఇక్కడ కీలకం. అంతకు రెండు రోజుల ముందు యూపీలో సంభవించిన ఆకస్మిక తుపానులో వంద మందికి పైగా మరణించడంపై యూఏఈ సంతాపం తెలపడం గమనార్హం.
ఇదిలావుండగా యుద్ధం వల్ల నష్టపోయిన యూఏఈ ఎక్కువ చమురు ఉత్పత్తి చేసి నష్టాన్ని పూడ్చుకోవాలనుకోవడాన్ని ఓపెక్ దేశాలు అంగీకరించనందున ఈ గ్రూపునుంచి బయటకు రావడం మన దేశానికి కలిసొచ్చింది. ముఖ్యంగా ఓపెక్ దేశాల నుంచి బయటకు వస్తున్నట్టు యూఏఈ ప్రకటించిన తర్వాత ప్రధాని పర్యటన జరగడం విశేషం. మనకు ఇంధన భద్రత పరంగా, పెట్టుబడుల పరంగా యూఏఈతో మరింత సన్నిహిత సంబంధా లకు ఈ పర్యటన దోహదం చేసింది. •••ఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాలలో పలు వ్యూహాత్మక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. హార్మూజ్ జలసంధి మూత వల్ల చమురు సరఫరా దెబ్బతిని మనదేశం తీవ్రంగా నష్టపోయింది. అందువల్ల ఈ జలసంధితో సంబంధం లేకుండా మనదేశానికి చమురు సరఫరా చేయగలిగిన దేశం యూఏఈ మాత్రమే!
ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వస్ లిమిటెడ్ (ఐఎస్‌పీఆర్‌ఎల్), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ)ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, భారతదేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలలో (ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని చండీఖోల్) •••ఏఈ 30 మిలియన్ బారెళ్ల ముడి చమురును నిల్వ ఉంచనుంది. అత్యవసర సమయాల్లో ఈ చమురును ఉపయోగించుకునే మొదటి హక్కు మన దేశానికే ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), అడ్నాక్ (ఏడీఎన్‌ఓసీ) గ్యాస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మనకు నిరంతరా యంగా ఎల్‌పీజీ సరఫరా అవుతుంది. ఇరు దేశాల మధ్య ఉన్న కేవలం ‘కొనుగోలుదారు-విక్రేత’ సంబంధాన్ని మార్చి, సంయుక్తంగా సైనిక సామాగ్రిని తయారుచేసేందుకు ఒక సమగ్ర రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేశారు.
నెదర్లాండ్స్ (డచ్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం
ప్రధానమంత్రి మోదీ, నెదర్ల్లాండ్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం’’ స్థాయికి పెంచేందుకు నిర్ణయించారు. రక్షణ, సెమికండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ సాంకేతిక రంగం వంటి రంగాలు సహా మొత్తం 17 వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. గుజరాత్‌లోని ధోలేరాలో ఏర్పాటు చేస్తున్న 11 బిలియన్ డాలర్ల టాటా సెమీకండక్టర్ ప్లాంట్‌కు అధునాతన లితోగ్రఫీ టూల్స్ సరఫరా చేయడానికి డచ్ కంపెనీ ‘ఏఎస్‌ఎంఎల్’తో వాణిజ్య-సాంకేతిక ఒప్పందం అత్యంత కీలకం. 2026 – 2030 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పెట్టుబడుల రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసేందుకు ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ ప్రణాళిక ద్వారా సరఫరా శృంఖలాల పునరుద్ధరణ, ఉపాధి కల్పన, పెట్టుబడుల విస్తరణను వేగవంతం చేయనున్నారు. కృత్రిమమేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, అంతరిక్ష రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు నిర్వ హించేందుకు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉమ్మడి రంగంలో రక్షణ పరికరాల తయారీ, జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు వీలుగా రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించేం దుకు ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భవిష్యత్తులో ఇంధన, సాంకేతిక అవసరాలకు అవసరమైన ‘‘క్రిటికల్ మినరల్స్’’ సరఫరా కోసం భారత గనుల మంత్రిత్వశాఖ, నెదర్లాండ్స్ విదేశీ మంత్రిత్వశాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల సురక్షిత ప్రయాణాలకోసం ‘‘మైగ్రేషన్-మొబిలిటీ’’పై ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. దీనివల్ల భారతీయ ఐటీ, ఇంజినీరింగ్ నిపుణులకు వీసా పక్రియ మరింత సులభం కావడంతో పాటు, ఏటా వెయ్యిమందికి రెండేళ్లపాటు పని అనుమతులు కల్పించే ప్రత్యేక ‘యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్’ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి ఇరుదేశాలు అంగీకరించాయి. రేవులు, అంతర్గత జలమార్గాల ఆధునికీకరణకు, పర్యావరణ అనుకూల రవాణాకు వీలుగా ‘‘గ్రీన్ అండ్ డిజిటల్ సీ కారిడార్’’ పేరుతో వ్యూహాత్మక ప్రణాళికను అమలుపరచనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నెదర్లాండ్స్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయం తమ వద్ద గల చోళుల కాలంనాటి విశిష్ట ‘అనైమంగళం రాగి శాసనాలను’ (లైడెన్ శాసనాలు) భారత్‌కు తిరిగి అప్పగించింది.
స్వీడన్‌తో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
ప్రధాని నరేంద్రమోదీ స్వీడన్ పర్యటనలో భాగంగా ఆ దేశంతో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది.ఓస్లోలో జరిగిన ‘‘3వ ఇండియా-నార్డిక్ సదస్సు’’ (నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్‌లను నార్డిక్ దేశాలుగా వ్యవహరిస్తారు)మోదీ పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ఉల్స్ క్రిస్టర్‌సన్‌తో జరిగిన చర్చల్లో, ఇరు దేశాల మధ్యగల ద్వైపాక్షిక సంబంధాలను ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం’’ స్థాయికి పెంచారు. 2026-30 మధ్యకాలానికి రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ఇరుదేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. కృత్రిమమేథ, 6జి, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష రంగాల్లో పరిశోధనలకోసం ‘‘ఇండియా- స్వీడన్ టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్’’తో పాటు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్‌నర్‌షిప్ 2.0ను ప్రారంభించారు. ‘‘మేకిన్ ఇండియా’’, ‘‘మేక్ విత్ స్వీడన్’’ చొరవ కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, రక్షణ ఉత్పాదనలపై ఒప్పందాలు కుదిరాయి.
నార్వేతో ఐదు కీలక ఒప్పందాలు
నార్వే ప్రధాని జొనాస్ గర్ స్టోర్‌తో జరిగిన సమావేశంలో పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించిన 5 కీలక ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసింది. స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ షిప్పింగ్, బ్లూ ఎకానమీ (సముద్ర వనరుల అభివృద్ధి) లక్ష్యంగా ‘‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’’ ప్రకటించారు. సముద్రతీర పవన విద్యుత్, కార్బన్ క్యాప్చర్, వ్యర్థాల రీసైక్లింగ్ సాంకేతిక పరిజ్ఞాన ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ అధీనంలోని సీఎస్‌ఐఆర్, ఆ దేశ ప్రముఖ పరిశోధనా సంస్థ ఎస్‌ఐఎన్‌టీఈఎఫ్‌ల మధ్య ఒప్పందాలు కుదిరాయి. మనదేశానికి చెందిన యూపీఐ, ఆధార్ వంటి డిజిటల్ వ్యవస్థలను గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంయుక్తంగా అందించడానికి ముక్కోణపు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నార్వే రాజు 5వ హెరాల్డ్, ప్రధాని నరేంద్రమోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేశారు.
మరో స్థాయికి ఇటలీ సంబంధాలు
ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన చర్చల అనంతరం ఇరుదేశాల బంధాన్ని ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి విస్తరించారు. ఇందుకోసం 2025-29 మధ్య కాలంలో ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాలని నిర్ణయిం చారు. 2029 నాటికి ఇటలీ మనదేశంలో 20 బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 14 బిలియన్ యూరోలుగా ఉన్న వాణిజ్యాన్ని 2029 నాటికి 22 బిలియన్ యూరోలకు పెంచాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. భారత్- ఈయూ దేశాల మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా అమల్లోకి వస్తే ఈ లక్ష్యాలు సత్వరం నెరవేరతాయని ఇరుదేశాల ప్రధానులు అభిప్రాయ పడ్డారు. మిలిటరీ హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్‌ల ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి కోసం ఒక ఖచ్చితమైన రక్షణ రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం హెలికాప్టర్లు, నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లు, మెరైన్ ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలకు సంబంధించిన రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి. రక్షణ, హై-టెక్ పరిశ్రమలకు అత్యంత అవసరమైన లీథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల సరఫరా, ప్రాసెసింగ్ కోసం ముఖ్యమైన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
అంతర్జాతీయ ఉగ్రవాదానికి నిధులు నిలిపివేత, మనీలాండరింగ్ నియంత్రణ కోసం భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ),ఇటాలియన్ గార్డియా డి ఫైనాంజా మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఏఐ, సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, అధునాతన సాంకేతిక రంగాల్లో ఉమ్మడిగా పనిచేసేందుకు వీలుగా ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో భాగంగా రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ‘‘ఎఫ్‌ఏఓ అగ్రికోలా మెడల్’’ బహూకరించారు. భారత్‌లో ఆహారభద్రత, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా నరేంద్రమోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్