సమాజంలో అత్యంత సున్నితమైన ‘మతాన్ని’ అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే సంస్కృతి ఆంధప్రదేశ్‌లో ఆందోళనకరంగా మారుతోంది. ప్రజల్లో సానుభూతి పొందడానికి, తమకంటూ రాజకీయ ఉనికిని సృష్టించుకోవడానికి కొందరు నాయకులు, స్వయం ప్రకటిత మేధావులు అత్యంత దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. తమపై తామే దాడులు చేయించుకుంటూ నాటకాలు ఆడటం ఒక ఎత్తైతే, సొంత తప్పిదాల వల్ల జరిగే ప్రమాద మరణాలను సైతం ‘‘రాజకీయ హత్యలుగా’’ చిత్రీకరించి మెజారిటీ హిందువులపై, హిందూ సంఘాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మరో ఎత్తు.
కడప ప్రాంతానికి చెందిన పాస్టర్ అభినవ్ దర్శన్ తనపై తానే దాడి చేయించుకున్న వ్యవహారం, పాస్టర్ పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. ఇవి చీకటి రాజకీయాలకు అద్దం పడుతు న్నాయి. ఈ రెండు ఘటనల వెనుక ఉన్న అసలు నిజాలు, రాజకీయ కుట్రలను విశ్లేషిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పాస్టర్ అభినవ్ దర్శన్ ఆడిన ‘‘నకిలీ దాడి’’ నాటకం
పాస్టర్ అభినవ్ దర్శన్ నటుడు కూడా. తన ఉనికిని బలంగా చాటుకోవాలనే ఆరాటంతో, ఇటీవల అతను ‘భరోసా పార్టీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించి, తనకు తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నానంటూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగా, చింతపల్లి మండలంలోని నీరుతోటపాలెం సమీపంలో తన కారును కొందరు ముసుగు దుండగులు అడ్డగించారని, కారుపై కోడిగుడ్లు విసిరి, అద్దాలు పగులగొట్టి, తనను సమీపంలోని కాఫీ తోటల్లోకి లాక్కెళ్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. తాను నొప్పితో విలవిలలాడుతున్నట్లున్న ఆ వీడియోను వైరల్ చేసి, రాత్రికి రాత్రే హీరో అయిపోవాలని కలలు కన్నాడు. ‘పాస్టర్ ప్రవీణ్ లాగే నన్ను కూడా చంపాలని చూస్తున్నారు’ అంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని కూడా ప్రకటించాడు. తనపై దాడులు జరిగినట్లు ఉచిత పబ్లిసిటీ తెచ్చుకోవడం, క్రైస్తవ మైనార్టీ వర్గాల్లో విపరీతమైన సానుభూతి కూడగట్టుకోవడం, రాబోయే ఎన్నికల్లో మతపరమైన ఎజెండాతో నాయకుడిగా ఎదగడం ఆయన లక్ష్యం.
సోషల్ మీడియా సాక్ష్యాలతో డ్రామా బట్టబయలు
మొదట్లో ఈ ఘటనను నిజమైన హత్యా యత్నంగా మైనార్టీ సంఘాలు భావించి హిందూ సంస్థలు, సంఘాలపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే పోలీసుల సమగ్ర విచారణలో అసలు నిజాలు బట్టబయలయ్యాయి. అభినవ్ దర్శన్ ఆడిన ఈ ‘నకిలీ దాడి’ నాటకాన్ని పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించారు. పోలీసులు సేకరించిన ఇన్స్టాగ్రామ్ ఆడియో క్లిప్పులు, వీడియోలు, వైద్య నివేదికలు ఈ దాడి ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని తేల్చాయి. దాడి ఎక్కడ జరపాలి, సన్ని వేశాన్ని ఎలా చిత్రీకరించాలి.. అనే విషయాలపై అభినవ్ తన అనుచరులతో జరిపిన చర్చలు ఆడియో మెసేజ్‌ల ద్వారా బయటపడ్డాయి. స్వయంగా అభినవ్ దర్శన్ దగ్గరుండి స్క్రిప్ట్ రాసి, దర్శకత్వం వహించి, తన అనుచరులతోనే దాడి చేయించుకొని, ముసుగు దుండగుల సృష్టించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కుట్రలో ఏ1గా పాస్టర్ అభినవ్, ఏ2గా బిల్లా కిరణ్, ఏ3 కె.బెన్హర్, ఏ4 భానుప్రసాద్‌లతో పాటు సహకరించిన మరి కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంపై ‘శవ రాజకీయం’
ఇదే తరహాలో మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన మరో కీలక ఘటన ‘పాస్టర్ పగడాల ప్రవీణ్’ మృతి. 2025 మార్చి 25న రాజమహేంద్రవరం సమీపంలో 45 ఏళ్ల పాస్టర్ ప్రవీణ్ మోటర్ సైకిల్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్థానిక పోలీసులు దీనిని సాధారణ ప్రమాదంగానే నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో, ప్రమాదానికి ముందు పాస్టర్ ప్రవీణ్ కోదాడ వద్ద రూ. 650 విలువైన మద్యం కొనుగోలు చేశారని, మద్యం తాగి వాహనం నడపడం వల్లే పలుచోట్ల కింద పడిపోయి చివరకు ప్రాణాలు కోల్పోయారని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కానీ, ఈ వాస్తవా లను పక్కనపెట్టి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మరికొందరు పాస్టర్లు, వైఎస్సార్సీపీ సానుభూతి పరులు ఇదొక పక్కా ప్రణాళికతో జరిగిన ‘రాజకీయ హత్య’ అని దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై హైకోర్టులో పిల్ వేయగా, కోర్టు తీవ్రంగా స్పందిం చింది. ప్రవీణ్ మరణానికి హిందువులే కారణమని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని హర్షకుమార్‌ను సూటిగా ప్రశ్నించింది. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫొటో ఆధారాలతో సహా కోర్టు సైతం వ్యాఖ్యానిం చింది.
సోషల్ మీడియా వేదికపై ప్రచారం
సంఘటనలు జరగ్గానే క్రైస్తవ మత ప్రచారకులు, ప్రతిపక్ష అనుకూల విశ్లేషకులు, అనుకూల టీవీ ఛానళ్లలో చర్చలు నిర్వహిస్తారు. దాడులు చేసింది హిందూ సంఘాలుగా ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి ఈ తతంగం జరుగుతుంది. చర్చలు చేసే వారు. సాధారణ ప్రజలకు అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడతారు. హిందూ సంఘాలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం విపరీతంగా జరుగుతోంది. ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు కూడా ఇస్తారు. ఈ అంశంపై కోర్టు తీర్పులో హిందూ సంఘాలది తప్పు లేదని తేలినా వీరు కోర్టు తీర్పులను సైతం తప్పుపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఫాస్టర్ పవన్ కల్యాణ్ తలకు వెలకట్టి బహిరంగంగా మాట్లాడి వైరల్ అయిన సంఘటనపై మాత్రం ఈ విశ్లేషకులు నోరు మెదపలేదు.
హిందువులే ఎందుకు లక్ష్యం?
ఒకరు ఉచిత పబ్లిసిటీ కోసం నకిలీ దాడి నాటకం ఆడినా, మరొకరు సొంత తప్పిదంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. ఈ రెండు ఘటనలను ‘మతపరమైన దాడులుగా’ చిత్రీకరించడం వెనుక అతిపెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ మైనార్టీ వర్గాలను భయభ్రాంతులను చేసి•, ‘మెజారిటీ హిందువులు మిమ్మల్ని అంతమొందిస్తున్నారు’ అనే ఒక తప్పుడు భావనను వారిలో సృష్టించడం. ప్రభుత్వా నికి, హిందూ సమాజానికి మచ్చ తీసుకురావడం ద్వారా మైనార్టీలను ఒక వర్గం వైపు తిప్పుకోవడం. రెండు మతాల మధ్య విద్వేషాలు రగులుకుంటే, తాము మైనార్టీల ‘రక్షకులం’ అని చెప్పుకునే అవకాశం దొరుకుతుందని హర్షకుమార్ లాంటి నాయకుల వ్యూహం.
వీరి వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది?
సాధారణ పాస్టర్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులంటే భయం లేకుండా పక్కాగా స్క్రిప్టులు రాసుకుని మరీ దాడుల డ్రామాలు ఆడుతున్నారంటే వీరి వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా రాజకీయంగా ఒక వర్గాన్ని దెబ్బ తీయడానికి, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కొన్ని శక్తులు వీరిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ పాస్టర్ల ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, వీరి నాటకాల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో బయటపడటం ఖాయం.
కూటమి విడగొట్టేందుకు ప్రయత్నం
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది.దాని పాలన పట్ల సంతృప్తి కనిపిస్తోంది. టీడీపి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జనసేనతో పాటు బీజేపీ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ వ•డు పార్టీలు కలిసి ఉండడం ప్రతిపక్షానికి ఇబ్బందికరమే. కులపరంగా, మత పరంగా రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కూడా పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం పదేళ్ల నుంచి సమాజం చూస్తోంది. ప్రతిపక్షం ఇలాంటి అసత్య ఆరోపణలు, సంఘటనలు ఆధారంగా చేసుకుని కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
మత విద్వేషాలతో లబ్ధికి ప్రయత్నం
అభినవ్ దర్శన్ లాంటి వారు పోలీసుల విచారణలో దొరికిపోయినా, ఇంకా కొంతమంది అదే మొండితనంతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. రాష్ట్రంలో కుల, మత సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈ పాస్టర్ల ఆటలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చింది. దేవుడి పేరు చెప్పి మోసాలకు పాల్పడే ఇలాంటి నకిలీ పాస్టర్ల వల్ల నిజమైన ఆధ్యాత్మికవేత్త లకు కూడా చెడ్డపేరు వస్తోంది.
పాస్టర్ అభినవ్ దర్శన్ పబ్లిసిటీ డ్రామా అయినా, పాస్టర్ ప్రవీణ్ మరణంపై జరిగిన శవ రాజకీయా లైనా.. ఈ రెండింటి వెనుక ఉన్న ఉమ్మడి లక్ష్యం మత విద్వేషాలను రగిలించి ఓటు బ్యాంకులను పదిలపరుచుకోవడమే. కొంతమంది పాస్టర్లు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడటం, సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఆధారాలు లేకుండా మెజారిటీ వర్గాలపై విషం చిమ్మడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. అల్లూరి జిల్లా పోలీసులు డిజిటల్ ఆధారాలతో సత్వరమే ఈ నాటకాలను బట్టబయలు చేయడం అభినందనీయం. ఈ ఘటనలు సమాజా నికి ఒక మేలుకొలుపు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆరోపణను గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను గ్రహించి, స్వార్థ రాజకీయశక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్