రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని విమర్శిం చడం లక్ష్యంగా పెట్టుకున్న తమిళనాడులో కొన్ని పార్టీలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. ప్రధానంగా డీఎంకే పార్టీ రాష్ట్రంలో బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆ పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌ ‌సనాతన ధర్మంపై అక్కసు వెళ్లగక్కు తున్నారు. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఆశలు పెట్టుకున్న ఉదయనిధి అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో పట్టు కోసం సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూశారు. ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడంతో దిమ్మతిరిగిన యువరాజు ఉదయనిధి ఇప్పుడు తమిళనాడులో డీఎంకే ఉనికి కోసం సనాతన ధర్మంపై మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ రాకీయాల కోసం హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతున్నా వీరి వక్రబుద్ధి మారకపోవడం శోచనీయం.
ఐదు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఒంటెత్తు ఆధిపత్యానికి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు చరమగీతం పాడారు. పార్టీ స్థాపించి పట్టు మని మూడేళ్ల కాకమునుపే ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేని సినీ నటుడు విజయ్‌ ‌నేతృత్వంలోని టీవీకే పార్టీకి పట్టంకట్టి ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే పాలనలకు స్వస్తి పలికారు. సనాతన ధర్మంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే డీఎంకేని ప్రజలు తిరస్కరించడం స్వాగతించాల్సిన అంశం. ఉదయనిధి స్టాలిన్‌ ఆయన చేసిన వ్యాఖ్యలతో తమిళ నాడులోని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే వారు డీఎంకే పార్టీని వ్యతిరేకిస్తూ వారిని ఓడించే పార్టీగా టీవీకేని గుర్తించి గెలిపించారనడం వాస్తవం.
‘‘తమిళనాడు ప్రజలిచ్చిన తీర్పును మేం తలవంచి ఆమోదిస్తున్నాం…’’ అంటూ ఓటమి అనంతరం ప్రకటించిన ఉదయనిధి స్టాలిన్‌ ‌తన పంథాను మార్చుకోకుండా తలపొగరుతో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ వివాదంగా మాత్రమే కాకుండా, కోట్లాది హిందువుల విశ్వాసాలు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంపై జరిగిన దాడిగా చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా తమిళనాడులో ద్రావిడ రాజకీయాల పేరుతో హిందూ సంప్రదాయాలపై విమర్శలు జరుగుతున్నా, ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవు తోంది. ఒకవైపు హిందూ ఆలయాలకు వెళ్లి పూజలు చేసే రాజకీయ నాయకులు, మరోవైపు సనాతన ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. మే 12న తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ ‌ప్రభుత్వాన్ని ఏర్పాటు సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ‘‘ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించా ల్సిందే’’ అంటూ అసందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో 2023లో జరిగిన ఒక సమావేశంలో ‘‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వ్యాధుల మాదిరి.. దాన్ని నిర్మూ లించాలి’’ అని వ్యాఖ్యానించి దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి కారణమయ్యారు. నాడు హిందూ సంస్థలు, ఆధ్యాత్మిక పీఠాలు, మతపరమైన సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కోట్లాది హిందువులు విశ్వసించే సనాతన ధర్మాన్ని వ్యాధులతో పోల్చడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని విమర్శలు వచ్చాయి. కుక్కతోక వంకరే అన్నట్టు ఆయన తన బుద్ధిని మార్చుకోకుండా మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారు.
సనాతన ధర్మం అనేది కేవలం మతపరమైన భావన కాదు. అది భారతీయ నాగరికతకు వేల ఏళ్లుగా ఆధారంగా నిలిచిన జీవన విధానం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహా భారతం, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక సంపదల ఆధారంగా అభివృద్ధి చెందిన విశ్వమానవ తత్వం. కుటుంబ వ్యవస్థ, గురు-శిష్య పరంపర, ప్రకృతి పట్ల గౌరవం, సహనం, పరస్పర గౌరవం, భిన్నత్వంలో ఏకత్వం వంటి అనేక విలువలు సనాతన ధర్మానికి వ•లస్థంభాలుగా ఉన్నాయి. అలాంటి సంప్రదాయాన్ని ‘‘నిర్మూలించాలి’’ అనడం సాధారణ రాజకీయ విమర్శ కాదు, అది కోట్లాది ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలపై ప్రత్యక్ష దాడిగా కనిపిస్తోంది.
ఉదయనిధి స్టాలిన్‌ ‌గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మీరు బాధత్యగల మంత్రి. మీ మాటల ప్రభావం ఏమిటో తెలుసుకోవాలి. ఆర్టికల్‌ 19, 25 ‌హక్కులను దుర్వినియోగం చేయకూడదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే మద్రాస్‌ ‌హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అనే వ్యాఖ్యలు హేట్‌ ‌స్పీచ్‌లా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. కోట్లాది ప్రజలు విశ్వసించే ధార్మిక సంప్రదాయాలపై ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో మాట్లాడాలని కూడా న్యాయస్థానాలు పరోక్షంగా సూచించినా వీరిలో మార్పు రావడం లేదు.
ఉదయనిధి వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టినా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. తాను హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదన్నారు. సామాజిక న్యాయం కోసం మాట్లాడానని సమర్థించుకున్నారు. దీనిపై తాను క్షమాపణ చెప్పబోనని దురుసుగా సమాధానం ఇచ్చారు. అయితే ‘‘సామాజిక న్యాయం’’ పేరుతో హిందూ విశ్వాసాలను అవమానించడం ఒక సాకు మాత్రమే అనేది బహిరంగ రహస్యం. భారత దేశంలో ఇప్పటివరకూ ఎన్నో సంస్కరణోద్యమాలు జరిగినప్పటికీ, ఎవరూ సనాతన ధర్మాన్ని ‘‘నిర్మూ లించాలి’’ అనేలా విర్రవీగలేదు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, సనాతన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించే డీఎంకే నేతలే ఎన్నికల సమయంలో, వ్యక్తిగత సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లి పూజలు చేసిన విషయాలు మీడియాలో వెలుగుచూశాయి. ఉదయనిధి స్టాలిన్‌ ‌తండ్రి ఎమ్‌.‌కే.స్టాలిన్‌ ‌గతంలో తిరుక్కోష్టి•••ర్‌లోని వైష్ణవ ఆలయాన్ని సందర్శించి ఆలయ మర్యాదలు స్వీకరించారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి ముందు ఉదయనిధి స్టాలిన్‌ ‌చెన్నైలోని సెంగేని అమ్మన్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని వ్యాఖ్యా నించిన నాయకుడే ఎన్నికల ముందు ఆలయాలకు వెళ్లడం రాజకీయ అవసరాల కోసమా లేదా ఒక సామాజిక వర్గాన్ని వంచించి ఓట్లు పొందడానికా అనే వాటిపై వారు సమాధానం చెప్పాలి. సాధారణ హిందూ భక్తులు ఆలయాలను భక్తి కేంద్రాలుగా చూస్తారని, కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం ఆలయాలకు వెళ్లి, తర్వాత అదే హిందూ సంప్ర దాయాలపై విమర్శలు చేస్తూ వారి ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారు.
తమిళనాట డీఎంకే రాజకీయ చరిత్రలో హిందూ సంప్రదాయాలపై విమర్శలు కొత్త విషయం కాదు. ద్రావిడ రాజకీయాల ఆరంభం నుంచే హిందూ ఆచారాలపై విమర్శలు, మతపరమైన సంప్రదాయా లపై వ్యంగ్య వ్యాఖ్యలు వారి రాజకీయాలో భాగమయ్యాయి. పెరియార్‌ ‌ప్రభావంతో ఏర్పడిన ఈ రాజకీయ ధోరణి ఇప్పటికీ డీఎంకే నేతల మాటల్లో కనిపిస్తోంది. తాము హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని, కుల వివక్షకు వ్యతిరేకమని చెబుతూ వారు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. కుల, సామాజిక వర్గా వివక్ష కేవలం హిందూ ధర్మంలోనే ఉన్నట్టు, మరే ఇతర మతంలోనూ లేనట్టు వారు వ్యవహరిస్తున్న తీరు బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనం. వీరి ఓట్ల రాజకీయాలు ఎక్కడి దాకా వెళ్లాయంటే లౌకికవాద మంటూ హిందువులను, వారి ఆలయాలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు పన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల ఓడిపోయిన డీఎంకే ప్రభుత్వం తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆలయ సంప్రదాయాలకు సంబంధించి మరో వివాదానికి తెరదీసింది. తిరుప్పరంకుండ్రం ప్రాంతం లోని కార్తిగై జ్యోతి వెలిగించే సంప్రదాయం విషయంలో తమిళనాడు ప్రభుత్వ వైఖరి తీవ్ర వివాదాస్పదమైంది. అక్కడ శతాబ్దాలుగా కొనసాగు తున్న జ్యోతి వెలిగించే సంప్రదాయాలపై డీఎంకే ప్రభుత్వం పరిమితులు విధించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై ‘‘ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వం అవసరానికి మించి జోక్యం చేసుకో కూడదు’’ అని మద్రాస్‌ ‌హైకోర్టు స్పష్టం చేసింది. ధార్మిక సంప్రదాయాల నిర్వహణలో ఆలయ పరిపాలనకే ప్రధాన హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి లోనై తమిళనాడులో ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతోంది అని నిరసనలు చేపట్టాయి. రాష్ట్రంలోని వేలాది ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండటం, ఆలయ నిధుల వినియోగం, సంప్రదాయాల నిర్వహణ వంటి అంశాలపై తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఇతర మత సంస్థల విషయాలను పట్టించుకోని ప్రభుత్వాలు హిందూ ధర్మంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయని హిందువులు ప్రశ్నిస్తేనే వీరికి బుద్ధి వస్తుంది.
తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఎంతగా హిందూ సంప్రదాయాలను విమర్శించినా, ప్రజలలో హిందూ ఆధ్యాత్మికత మాత్రం బలంగా కొనసాగుతోంది. తమిళనాడు ఆలయ సంస్కృతికి కేంద్ర బిందువుగా నిలిచిన రాష్ట్రం. చెన్నై నగరాని టెంపుల్‌ ‌సిటీగా పిలుస్తారు. ఆ రాష్ట్రంలో మీనాక్షి అమ్మన్‌ ఆలయం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, పళని, తిరువణ్ణామలై వంటి మహాక్షేత్రాలు కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
భారతదేశం అనేది విభిన్న మతాలు, భాషలు, సంప్రదాయాలు కలిసిన దేశం. అలాంటి దేశంలో పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమైన అంశం. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సామాజిక సంస్కరణలపై చర్చలు జరగొచ్చు. కానీ కోట్లాది ప్రజలు విశ్వసించే సంప్రదాయాలను అవమానిం చడం దురదృష్టకరం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాటకు సామాజిక ప్రభావం ఉంటుందని, అందుకే వారు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు కల్పించింది. అదే సమయంలో ఇతరుల మత విశ్వాసాలను గౌరవిం చడం కూడా ప్రజాస్వామ్య సమాజంలో కీలకమైన బాధ్యత. ఒక మతం లేదా సంప్రదాయంపై విమర్శలు చేయాలంటే అవి నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ అవమానకరంగా కాకూడదు. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ వంటి వ్యాఖ్యలు జాతీయ ఐక్యతకు మంచివి కావు. అవి దేశంలో విభజనాత్మక రాజకీయాలకు దారితీసే ప్రమాదం ఉంది.
ఒకవైపు డీఎంకే నేతలు తమ వ్యాఖ్యలను సామాజిక న్యాయం కోణంలో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా, మరోవైపు కోట్లాది హిందువులు మాత్రం తమ విశ్వాసాలను అవమానించడాన్ని సహించబోరు. ‘‘సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి వెన్నెముక’’ అని, దానిని కించపరచడం అంటే భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని అవమానించడమే. సహనానికి మారు పేరుగా ఉండే హిందువులను ఏమన్నా పట్టించుకోరని, వారిని ఎంత విమర్శిస్తే రాజకీయంగా అంత లబ్ది చేకూరుతుందని విశ్వసించే రాజకీయాలు ఉన్నంత కాలం సనాతన ధర్మానికి ఇలాంటి నేతలచే అవమానాలు వస్తూనే ఉంటాయి. వీటికి ముగింపు పలకాలంటే హిందువుల్లో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పత్రికల్లో, టీవీలో చర్చలు, వీధుల్లో నిరసనలతో ఎలాంటి ఫలితాలుండవు. కొంత కాలం తర్వాత మర్చే పోతారు. అవసరమొచ్చినప్పుడు మళ్లీ రెచ్చగొడుతుంటారు. అందుకే సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రజలు మేల్కొని ఇలాంటి నేతల రాజకీయ నేతలు, పార్టీల పునాదులను కూల్చివేసి వారి భవిష్యత్తును నాశనం చేసేలా సమయమొచ్చి నప్పుడు వారికి రాజకీయంగా బుద్ధి చెప్పాలి.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE