దేశంలో విద్యారంగాన్ని, విద్యాబోధనను సవ•లంగా సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సంవత్సరానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ప్రకటించిన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు సరితూగే కొత్త విద్యా వ్యవస్థను ఆవిష్కరించే దిశగా సాగబోతోంది. వాస్తవానికి, 2020లో ప్రకటించిన జాతీయ విద్యావిధానం మరింత పటిష్ఠంగా, మరింత పకడ్బందీగా అమలుపరిచే ఉద్దేశంతో ఈ  విద్యావిధానాన్ని కొద్ది సవరణలతో ప్రకటించడం జరిగింది. ఈ విద్యావిధానం విద్యారంగంలో సవ•లమైన సంస్కరణలు తీసుకు వచ్చే దిశగా సాగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, భవిష్యత్తుకు సరికొత్త బాటను నిర్మించడమే ధ్యేయంగా, సమగ్రంగా, దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది.

ఇం‌దులో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, విద్యా సంస్థల నిర్వహణ కమిటీలకు భావి విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సరైన బాటలో పురోగతి చెందించడానికి మార్గ దర్శకాలను అందజేయడం జరిగింది. జాతీయ విద్యావిధానానికి సంబంధించిన లక్ష్యాలను, ఆశయాలను కార్యాచరణలో పెట్టి, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల పాఠశాలలను ప్రగతి బాటలో నడిపించడానికి ఈ మార్గదర్శకాలు తోడ్పడ తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యా రంగ సమగ్ర, సంపూర్ణ పురోగతిలో సమాజాన్ని భాగస్వామిగా చేయడంతో పాటు, విద్యారంగంలో జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, వ్యవస్థలకు, ప్రభుత్వానికి మధ్య ఈ విద్యాసంస్థల నిర్వహణ కమిటీలు వారధిలా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

విద్యాబోధనతో పాటు ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సు, సంక్షేమం, మానసిక ఆరోగ్యం, విద్యార్థు లకు ఆలంబన వంటివి ఈ విద్యా సంస్థల నిర్వహణ కమిటీల ప్రధమ ప్రాధాన్యాలు కావాలని, యావత్‌ ‌సమాజం ఇందులో భాగస్వామి కావాలని, విద్యార్థు లకు అడుగడుగునా చే•••తనందివ్వాలని, విద్యా సంస్థలను పటిష్ఠం చేయడానికి కూడా ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్వహణ కమిటీలు కాలక్రమేణా ప్రజా ఉద్యమాలుగా రూపాంతరం చెందాలని, సంస్కృతికి బలమైన ఊతమివ్వాలని కూడా ఈ మార్గదర్శక సూత్రాలు సూచిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రిటిష్‌ ‌వారు దేశంలో అడుగు పెట్టే వరకు ఒక సామాజిక నాయకత్వం కిందే వర్ధిల్లాయని, ఇటువంటి చరిత్ర మరే దేశంలోనూ లేదని ప్రధాన్‌ ఇటీవల ఢిల్లీలో ఈ మార్గదర్శకాలను విడుదల చేస్తూ గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో మళ్లీ సామాజిక నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని పెంచి దీన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ అభిమతంగా కనిపిస్తోంది. భారతదేశ విద్యా సంస్కృతికి పూర్వ వైభవాన్ని, ఉన్నతిని తీసుకు వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

మార్గదర్శకాలను విడుదల చేయడంతోనే ప్రభుత్వ బాధ్యత తీరిపోలేదు. విద్యా వ్యవస్థను మరింత లోతుగా సంస్కరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పరివర్తన చెందించడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. భారతదేశం 2047 నాటికి ఒక అగ్రరాజ్యంగా ఎదగాలన్నా, ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానంలో ఉండాలన్నా దానికి దేశంలోని తరగతి గదుల తోడ్పాటు చాలా అవసరం అని ప్రధాన్‌ ఈ ‌సంద ర్భంగా అన్నారు. ఈ సంస్కరణలు,  పరివర్తనల్లో ఈ మార్గదర్శకాలే కీలకమని కేంద్రం భావిస్తోంది. గతంలో విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విద్యా సంస్థల నిర్వహణ కమిటీలకు రూపకల్పన చేయడం జరిగింది. అయితే, అవి కేవలం పర్యవేక్షణ, ప్రాథమిక సదుపాయాలు, సమర్థవంతమైన పాలనా వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే, ఆ తర్వాత కొత్త సవాళ్లు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలు ప్రవేశించాయి. అప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ఆధునిక విద్యా ప్రమాణాలు

ఆధునిక విద్యా ప్రమాణాలకు తగ్గట్టుగా పాఠశాలల్లో ఇక నుంచి డిజిటల్‌ ‌విద్యను కూడా బోధించడం జరుగుతుంది. నగరాలు, పట్టణాల్లోనే కాక, గ్రామస్థాయి పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం డిజిటల్‌ ‌విద్య అందుబాటులోకి వస్తుంది. గ్రామ స్థాయి పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం డిజిటల్‌ ‌విద్య చేరే విధంగా 200 టీవీ చానల్స్‌ను, స్మార్ట్ ‌తరగతులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిజిటల్‌ ‌విద్యను బోధించడంతో పాటే ఆధునిక నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణనిచ్చి ఉద్యోగాలకు తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రభుత్వం పిల్లలను అత్యధిక సంఖ్యలో పాఠశాలల్లో చేర్పించడం మీద కూడా దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు నూరు శాతం పాఠశాలల్లో చేరాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్య, పరిశోధన మండలి (ఎన్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి)కి చెందిన పాఠ్య పుస్తకాలను పటిష్టం చేసే కార్యక్రమంలో ఇప్పటికే నిమగ్నం అయింది. ఇందులో ఆధునిక నైపుణ్యాలను చేర్చడంతో పాటు, భారతీయ భాషలకు కూడా ప్రాధాన్యం పెంచుతోంది.

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలను పరిపుష్టం చేయడానికి, విద్యావ్యవస్థను ఆధునీకరించడానికి మరికొన్ని చర్యలను కూడా ఇప్పటికే చేపట్టింది. విద్యారం గాన్ని సరైన దారిలో నడిపించడానికి ఉద్దేశించిన ఎన్‌.ఎ.ఎ.‌సి, ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌ ‌వంటి సంస్థలకు స్వయం నిర్ణయాధికారాన్ని అప్పగించింది. ఇవి మరింత బాధ్యతగా, జవాబుదారీతనంగా, పారదర్శకంగా, ఉన్నత ప్రమాణాలతో వ్యవహరించడానికి వీటికి స్వయంప్రతిపత్తిని కల్పించింది. విద్యాబోధనను మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యారంగాన్ని సంస్కరించడం వంటివన్నీ సమష్టి బాధ్యతలని, చైతన్యవంతమైన, జాగృతమైన విద్యావ్యవస్థను రూపొందించాలన్న పక్షంలో ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలందరి చే•••త అవసరమని ప్రధాన్‌ అన్నారు.

అంతర్జాతీయ విలువలు

విద్యా వ్యవస్థలో క్రమంగా విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, ప్రాథమిక స్థాయి అక్షరాస్యత, డిజిటల్‌ ‌పారదర్శకత, సరికొత్త విద్యా బోధన పరికరాలు, సామాజిక భాగస్వామ్యం వంటివి క్రమంగా ప్రాధాన్యం సంతరించుకోవడం ప్రారంభించాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే కొత్త మార్గదర్శక సూత్రాలను రూపొందించడం జరిగింది. ఈ మార్గదర్శకాల వల్ల ఈ విద్యా సంస్థల నిర్వహణ కమిటీలు కేవలం పర్యవేక్షణ సంస్థలుగా ఉండిపోయే అవకాశం ఉండదు. అవి విద్యా సమాజ పాలనా సంస్థలుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధి మీద ఇవి దృష్టి పెట్టడం ప్రారంభం అవుతుంది. ఒక పక్క విద్యారంగ ప్రమాణాలను పెంచుతూనే మరొకపక్క విద్యార్థుల సంక్షేమాన్ని, భద్రతను, భాగస్వామ్యాన్ని, డిజిటల్‌ ‌నిర్వహణను, పారదర్శకతను పెంపొందించడానికి కృషి జరుగుతోంది. విద్యా వ్యవస్థలో సామాజిక భాగస్వా మ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ఈ మార్గదర్శకాల వల్ల విద్యా ప్రమాణాలు, నాణ్యత, విలువలు పెరగడంతో పాటు, విద్యావిషయకంగా, వైజ్ఞానికంగా భారత దేశాన్ని అగ్ర రాజ్యంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా, విద్యాబోధన ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నా సామాజిక భాగస్వామ్యం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు మధ్య ఉన్న అంతరాలు, అవాంతరాలు తొలగిపోతాయని, విద్యా వ్యవస్థ ప్రపంచ స్థాయికి ఎదిగే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ విద్యా సంస్థల నిర్వహణ కమిటీలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతినిధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఉదాహరణకు వంద మంది విద్యార్థులున్న పాఠశాలలో పది నుంచి పదిహేనుమంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీలో టీచర్లు, తల్లితండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆశా వర్కర్లు, స్థానిక విద్యావేత్తలు, నిపుణులు, పాత విద్యార్థులు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన చేసే పాఠశాలల్లో ఈ కమిటీలు ఏర్పడతాయి. ఇవి నెలకొకసారి సమావేశమై మార్గదర్శకాల అమలును సమీక్షించడం జరుగుతుంది.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE