భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‌పైడిపాల

గురుమూర్తి పేరున్న లెక్కల మాష్టారు. వృత్తిని దైవంగా భావించే లెక్కల్లో మాష్టారు. సాధారణంగా లీవుల సదుపాయాన్ని కూడా వినియోగించుకోకుండా యేటా వాటిని మురగబెట్టే ఉద్యోగ నిష్ఠ గల నిజాయుతీ పరుడు. విద్యార్థులేగాక సహాధ్యాపకులు కూడా ఆయన అంకిత భావాన్ని బోధనా పటిమను మెచ్చు కుంటారు. అందరి మెప్పు పొందుతున్నా ప్రభుత్వం మంచి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకోలేక పోతున్నానని ఆయన చింత, అసంతృప్తి. పదవీ విరమణ వయస్సు దగ్గరపడుతున్నకొద్దీ ఆ పురస్కారాన్ని పొందే స్థాయికి ఎదగలేకపోతున్నాననే ఆత్మన్యూనతా భావం ఆయనను వేధిస్తోంది. ఆ పురస్కారం తన ప్రతిభకు కొలబద్దకాదని సన్నిహిత మిత్రులెంతగా నచ్చజెబుతున్నా అది ఓదార్పుగానే మిగులుతోంది. ఆ పురస్కారమే జీవితాశయం, లక్ష్యమూ అయిన ఆయనకు ఆ ఆశ, ధ్యాసనిరంతరం మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

శారదమ్మ మాష్టారి అడుగులతో నడిచే అనుకూలవతి అయిన ఇల్లాలు. ఆవిడ అతిభక్తి, చాదస్తాలు తనకు నచ్చకపోయినా, వాటికి ఆయన అడ్డు చెప్పడు. అనునిత్యం పూజలు, ఉపవాసాలు చేసే శారదమ్మ ఏ కష్టమొచ్చినా కాపాడే భారం దేవుళ్లదేనని పేరుపేరునా మొక్కులూ, ముడుపులూ చెల్లిస్తుంటుంది. ప్రస్తుతం కూతురు వాగ్దేవికింకా కడుపు పండలేదని, కొడుకు నాని ఇంటికి దూరమై దారి తప్పాడని ఆమె బెంగ. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న అల్లుడు వ్యసనపరుడు కాదు కాని అనుమాన రోగంతో అర్ధాంగిని ఇంటి గోడలకే పరిమితం చేస్తాడు. తప్పనిసరి అయితే తప్ప పుట్టింటికి కూడా పంపించడు – అదీ ఒకరోజు పాటే! కొడుకు నానీకి తండ్రిపట్ల ద్వేషం- ఆయనతో గొడవ పడి, ఇల్లు విడిచి వెళ్లిపోయి చాలా కాలమైంది!

కూతురు తర్వాత వంశోద్ధారకుడి కోసం గుళ్ల చుట్టూ తిరిగి మొక్కుకున్న శారదమ్మకు ఆ కోరిక చాలా ఆలస్యంగా సిద్ధించింది. లేక లేక పుట్టిన పుత్ర రత్నానికి అన్నీ దేవుళ్ల పేర్లను కలిపి చాంతాడంత పేరు పెట్టి, పిలవడానికి కష్టమై ‘నాని’ అనే ముద్దుపేరు పెట్టుకొంది. అల్లారు ముద్దుగా పెరిగిన నానీకి మాటలు రావడం ఆలస్యం కావడంతో తల్లిదండ్రులేకాక చూసిన వాళ్లంతా ఆ కుర్రాడికి మాటలు రావనుకున్నారు. కాని మాట్లాడ్డం ప్రారంభించిన తర్వాత వాడి నోటికి అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. ఎదుగుతున్నకొద్దీ అతనినోటి దురుసునూ, పెళుసునూ భరించలేని ఇరుగూ పొరుగూ చేస్తున్న ఫిర్యాదులు విని గురుమూర్తి అతని పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతగాడి తీరు మారలేదు. చదువులో చురుగ్గానే ఉన్నా, నానీకి వాగుడుతోపాటు తాగుడు కూడా అలవాటైందని విన్న గురుమూర్తి ఆగ్రహోదగ్రుడయ్యాడు. కొడుకు వల్ల కుటుంబ పరువు మర్యాదలు మంటగలుస్తున్నాయని కుమారుడిని తీవ్రంగా మందలించినా అతనిలో మార్పు రాలేదు. పైగా తండ్రి క్రమశిక్షణ నీడన ఉండడం తనవల్ల కాదని తల్లి ఎంతగా బతిమాలినా వినకుండా ఆ ఇంటితో తెగతెంపులు చేసుకొని హైదరాబాద్‌ ‌వెళ్లిపోయాడు. మాటకారి కనుక సినీ పరిశ్రమను ఆశ్రయించి, చిన్నచితకా వేషాలు వేస్తూ, చిరుద్యోగాలు చేస్తూ తన ఒంటరి బతుక్కి లోటు లేకుండా బండి లాగిస్తూ కన్నవాళ్ల కష్టసుఖాల గురించి పట్టించుకోవడం మానేశాడు.

శారదమ్మ మాత్రం కడుపు తీపి చంపుకోలేక కూతురి ద్వారా కొడుకు యోగక్షేమాలు తెలుసు కొంటూ ఊరట పొందుతోంది. అలా కొడుకు యెక్కడో చోట సుఖంగా ఉన్నాడని సరిపెట్టు కొంటున్న ఆమెకు పదిరోజుల క్రితం ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది- నానీ ‘డ్రగ్స్’ ‌కేసులో పట్టుబడి అరెస్టు అయ్యాడని! ఆ వార్త విని తల్లడిల్లిపోయిన శారదమ్మ కొడుకును ఆ ఆపద నుండి కాపాడమని సమీపంలో ఉన్న ప్రసన్న విఘ్నేశ్వర స్వామికి మొక్కుకొంది. స్వామి ఆమె మొరాలకించాడో ఏమో! రెండ్రోజుల్లోనే నానీ బెయిల్‌మీద విడుదలయ్యాడనే శుభవార్త చెవిని పడంది. దాంతో శారదమ్మ తల మునకలయిన ఆనందంతో ‘అంతా ఆ స్వామి దయ’ అని భావించి సంకటహరణ చతుర్థి అయిన ఆ రోజే స్వామి దర్శనానికి బయలుదేరుతూ తనతోపాటు భర్తను కూడా రమ్మని పట్టు బట్టింది. ఆమె ప్రతిపాదన విన్న గురుమూర్తి అది విద్యార్థులకు పరీక్షల సమయ మని, రావడం వీలుపడదని కరాఖండిగా చెప్పాడు. ప్రయాణాన్ని మరో రోజుకు వాయిదా వెయ్యమని, తప్పదంటే ఒక్కతివే వెళ్లిరమ్మని సలహా ఇచ్చాడు. కాని శారదమ్మ ఆ ఒక్కసారికి తన ‘సెంటిమెంటు’ను మన్నించమని భర్తను ప్రాధేయ పడింది. ఆమె కోర్కెను కాదనలేక అనిష్టంగానే గురుమూర్తి తలూపాడు. గుడి కంటే• బడికే ప్రాధాన్యమిచ్చే భర్త తనతో దైవదర్శనానికి బయలుదేరడం స్వామి మహిమగా, తన అదృష్టంగా భావించిన శారదమ్మకు ఆదిలోనే దురదృష్టం ఎదు రైంది. ఊరు పొలిమేర దాటుతుండగానే వాళ్లెక్కిన ఆటోను ఒక స్కూల్‌ ‌బస్‌ ‌ఢీకొట్టింది. ఆటోడ్రైవరూ, శారదమ్మా స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడగా గురుమూర్తికి తీవ్రమైన గాయా లయ్యాయి. రోడ్డుమీద బోర్లాపడి పోవటంతో తలకూ, ముఖానికి తగిలిన దెబ్బలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొన్ని గంటలు గడిచిన తర్వాత కాని ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్ధారించలేకపోయారు. శారద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భర్తను సమీపించి పలకరించే సరికి నెత్తురు స్రవిస్తున్న ఆయన నోట మాట రాలేదు! జరిగిం దేమిటో ఆమెకు అర్థమయ్యే సరికి ప్రమాదంలో మాష్టారి నాలుక పూర్తిగా ఛిద్రమైన విషయం బయటపడింది. అధైర్య పడవద్దనీ, శస్త్ర చికిత్సతో నాలుక యథాస్థితికి వచ్చే ఆశ ఉందనీ వైద్యులు ఆమెను ఓదార్చారు.

రోజులు గడుస్తున్న కొలదీ శారీరకమైన గాయాలు తగ్గుముఖం పట్టినా, నాలుక పరిస్థితి మెరుగుకాకపోవడంవల్ల గురుమూర్తిని మానసిక వ్యథ కుంగదీస్తోంది. దగ్గరుండి సపర్యలు చేస్తున్న శారదమ్మ భర్త దుస్థితికి తనే కారకురాలినని అపరాధ భావంతో బాధపడుతోంది. పరిచయస్థులెందరు వచ్చి పరామర్శించి వెళుతున్నా కన్నపిల్లల ఉదాసీనత గురుమూర్తికి జీవితం మీద విరక్తిని కలిగిస్తోంది. కూతురు వాగ్దేవి వచ్చి చూసి కన్నీళ్లు పెట్టుకొంది తప్ప భర్త ఆజ్ఞకు లోబడి ఒక్కరోజు కూడా ఉండలేదు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్న నానీ వస్తే తండ్రికి మెరుగైన వైద్యం చేయిస్తాడనే ఆశతో శారదమ్మ ఫోన్లు చేయగా చేయగా అతగాడు రాలేననడమే కాకుండా తన నాలుక చీరేస్తాననే తండ్రికి దేవుడు తగిన శిక్ష విధించాడని కసిగా మాట్లాడ్డం చెవిని పడిన గురుమూర్తి మనసు కకావికలమైంది!

చూడ్డానికి వచ్చిన వాళ్ల ధైర్యవచనాలు, ఓదార్పులు గురుమూర్తికి ఉపశమనం కలిగించడం లేదు. అది కేవలం కంటి తుడుపుల్లా అనిపిస్తున్నాయి. అన్నింటి కంటే ఏకైక పుత్ర రత్నం తనను శత్రువులా చూస్తూ తగిన శాస్తి జరిగిందనడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది? నోరులేని తనింక పాఠాలు చెప్పడానికి పనికిరాడు. ఉద్యోగం కూడా ఉంటుందో, ఊడుతుందో తెలియదు. ఉత్తమ అధ్యాపకునిగా తను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు క్రమంగా మాసి పోతాయి. సమాజంలో ఎందుకూ కొరగాక తను చులకనైపోతాడు. ‘పూలమ్మిన చోట కట్టెలమ్మే’ సామెతగా జీవచ్ఛవంలా దయనీయమైన బతుకును సాగించడం కంటే చావే మేలు. శాపం లాంటి మూగతనాన్ని భరించడం తనవల్ల కాదు…. ఇలా ఈగల్లా ముసురుతున్న ఆలోచనలతో జీవితం మీద విరక్తి కలిగిన గురుమూర్తి శాశ్వత నిద్రకు సిద్ధపడి, చికిత్సలో భాగంగా సుఖనిద్ర కోసం వైద్యులిచ్చిన నిద్ర మాత్రలన్నిటినీ ఒకేసారి మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. భర్తను అహర్నిశలూ కంటికి రెప్పలా కనిపెట్టుకొని చూస్తున్న శారదమ్మ ఆ ప్రయత్నాన్ని గమనించి అరచి గోల పెట్టడంతో సకాలంలో హాజరయిన డాక్టర్లు ఆయన ప్రాణాన్ని నిలబెట్టగలిగారు. బతికించిన వైద్యులతో సహా విషయం తెలిసినవాళ్లంతా మాష్టారి అవివేకాన్ని, తొందరపాటును గర్హించారు. శారదమ్మ కన్నీటితో తడిసిన మాంగల్యాన్ని కళ్లకద్దుకొని, ఇంకెపుడూ అలాంటి అఘాయిత్యానికి పాల్పడనని ఆయన చేత ఒట్టేయించుకొంది.

మాష్టార్ని చూడ్డానికి పూర్వ విద్యార్థులెందరో వస్తున్నారు. ఆయన చెప్పిన పాఠాల్ని గుర్తుచేసి అలాంటి గురువు దగ్గర చదువుకోవడం తమ అదృష్టమని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వాళ్లలో చాలామందిని గురుమూర్తి గుర్తుపట్టలేక పోతే వాళ్లే ఆనాటి సంఘటనలను, అనుభవాలను జ్ఞాపకం చేసి ఆయనకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తున్నారు. ఆనందాశ్రువులతో బతుకుమీద ఆశ చిగురిస్తున్న మాష్టార్ని ‘‘ఇది కలా? నిజమా?’’ అని నమ్మలేనంత విస్మయానికి గురిచేసింది-ఆ జిల్లా కలెక్టర్‌ ఆయనను చూడ్డానికి రావడం! ముందుగా పళ్లబుట్టతో వచ్చిన సిబ్బంది ఆయన రాకను తెలియజేస్తే గురుమూర్తితో పాటు శారద కూడా అప్రతిభురాలై, తర్వాత తేరుకొని క్షణాలమీద ఆ గదిని శుభ్రంగా సర్ది భర్త పక్కమీద దుప్పటిని సరిచేసింది. కలెక్టర్‌ ‌వస్తూరాగానే శారదకు పాదాబి •వందనం చేస్తే ఆమె విస్తుపోయింది. ‘‘నన్ను గుర్తుపట్టారా అమ్మా? నేను శీనుని. నాలాంటి అల్లరోడికి సార్‌ ‌ట్యూషన్‌ ‌చెప్పనంటే మీరు నచ్చజెప్పి వొప్పించారు. మీ ఆశీస్సులతోనే ఈ స్థితికి ఎదిగాను’’ అంటూ తనను పరిచయం చేసుకొని, తనకు నమస్కరించబోయిన మాష్టారి రెండు చేతులు పట్టుకొని ఆయనకు ప్రత్యభివాదం చేశాడు.

‘‘మాష్టారూ, నాకు మీ గురించి ఆలస్యంగా తెలిసింది. మాలాంటి ఎందరికో విద్యాబుద్ధులు చెప్పిన జ్ఞానప్రదాత మీరు. మీకు తిరిగి పాఠం చెప్పేటంతటి వాణ్ణి కాదు. మీ పాఠాలే మీకు అప్పగిస్తున్నందుకు మన్నించాలి. జీవితం దేవుడిచ్చిన వరం. దానిని కడవరకు ఆస్వాదించాలే తప్ప శరీరంలో ఏ భాగం లోపించినా జీవితాన్నే ముగించా లను కోవడం విజ్ఞత కాదు. దృష్టి లోపాన్ని అధిగమించిన మిల్టన్‌, ‌చిలకమర్తి మొదలైన కవుల గురించి, వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గురించి సందర్భవశాత్తు మీరే చెప్పారు. స్వరపేటికను తొలగించిన తర్వాత కూడా కృష్ణశాస్త్రి అద్భుతమైన పాటలు రాశారు. మన విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేస్తున్న అంధులెంతమంది లేరు? ఇటీవల మీరు కూడా పత్రికల్లో చదివే ఉంటారు- చూపు కోల్పోయిన ఓ స్త్రీ వంటను వృత్తిగా చేసుకొని లక్షలు సంపాది స్తుందని! ఆ మాట కొస్తే ‘మయూరి’ చిత్ర కథా నాయిక సుధ నృత్య ప్రతిభకు అవిటితనం అ్డ చ్చిందా? ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పొచ్చు. మనిషికి అన్ని అవయవాలు ముఖ్యమే కాని వాటిలో ఏదైనా లోపించినా ప్రతిభ, పట్టుదల ఉంటే ఆ లోపాన్ని పూడ్చుకునే శక్తి కూడా దేవుడే ఇచ్చాడు. మీ నాలుక స్వాధీనంలో లేనంత మాత్రాన మీ వృత్తికీ, మీ లక్ష్యమైన ‘బెస్ట్ ‌టీచర్‌ అవార్డు’కీ దూరమౌతు న్నట్టుగా దిగులుపడుతున్నారని నాకు తెలిసింది. శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మీరిలా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. విద్యా బోధనకు డిజిటల్‌ ‌పద్ధతి వచ్చింది కదా. ఇక నాలుక గురించి పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు మామూలు నాలుకను మించిన కృత్రిమ ఎలక్ట్రానిక్‌ ‌నాలుకను రూపొందించారట! అందువల్ల మీరు ఆశావహ దృక్పథంతో ఉండండి. ఈ ఉద్యోగం ఎక్కడికీ పోదు. అలాగే మీ లక్ష్యమైన ‘ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఈ లోపం అనర్హత కాదు. నిజానికి నాలాంటి ఎందరో శిష్యులకు కొత్త జన్మలనిచ్చి మా హృదయాల్లో శాశ్వతంగా గురుదేవుడిలా కొలువు తీరడానికి మించిన గొప్ప అవార్డు ఏముంది? అయినా మీ న్యూనతాభావం పోవడానికి చంద్రునికో నూలుపోగు లాంటి ఆ పురస్కారం కూడా మీకు దక్కాలని ఆశిస్తూ, అందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. నేను మీ మానసిక స్థితికి బాధపడుతూ ఎక్కువగా మాట్లాడినందుకు క్షమించండి. మీరేమీ అనుకోకుండా నాతో వస్తే కొసమెరుపుగా మీకో సృష్టిచిత్రాన్ని చూపిస్తాను…’’

నివ్వెరపడి చూస్తున్న గురుమూర్తి సమాధానం కోసం ఎదురు చూడకుండా కలెక్టర్‌ ‌చేయూతతో ఆయనను తన వాహనం ఎక్కించి పక్కన కూర్చోబెట్టు కోవడం ఆయన సిబ్బందినీ, చుట్టూ మూగిన జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. కలెక్టర్‌గారి వాహనం, అనుసరించిన సిబ్బంది వాహనాలు ఒక చెవిటి మూగ విద్యార్థుల పాఠశాల ముందు ఆగాయి. వాహనం దిగగానే శ్రీనివాస్‌ ‌గురుమూర్తిని తన వెంట పెట్టుకొని పాఠశాల ఆవరణలోనికి తీసుకెళ్లాడు. మంత్రముగ్ధుడిలా శ్రీనివాస్‌ను అనుసరించిన గురుమూర్తి అక్కడ సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా ఆనందంగా ఆడుకొంటున్న పిల్లల్ని చూసి, శ్రీనివాస్‌కేసి ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘మాష్టారూ, వీళ్లను చూశారు కదా. వీళ్లంతా పుట్టుకతోనే చెవిటి మూగ వాళ్లయిన అనాథలు. వీళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాల ఇది. పుట్టుకతోనే లోపాలున్న ఈ పిల్లలు ఏ చీకూచింతా లేకుండా ఎంత హాయిగా ఆడుకుంటు న్నారో గమనించారా? మరి సగంపైగా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన విజ్ఞులైన మీరు దురదృష్టవశాత్తు ఇప్పుడొచ్చిన చిరు లోపానికి ఇంతగా కుంగిపోవడం…’’

శ్రీనివాస్‌ ‌పాఠం పూర్తి కాకుండానే పశ్చాత్తాపా నికి సంకేతాలైన సజల నయనాలతో తలదించు కున్నాడు గురుమూర్తి….!

About Author

By editor

Twitter
YOUTUBE