‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
బయట ఏదో కలకలం.. గణపతిదేవుని అంగరక్షకులు ఒక్క ఉదుటన ఓ మహిళను లోపలికి విసిరేశారు. ఆమె వచ్చివచ్చి గణపతిదేవునికి, కేయూరకు మధ్య ముద్దలా పడింది.
కేయూర వెనక్కు తగ్గగా.. గణపతిదేవుడు కాళ్లు వెనక్కు తీసుకున్నాడు.
ఆమె కవ్వల.. బాల కవ్వల!!
చివ్వున లేచింది. లిప్తకాలంలో నడుములో దోపిన చురకను చివ్వున లాగింది. ఒక్క ఉదుటన గణపతిపైకి శివమెత్తిన కాళికలా లంఘించింది. “రేయ్..” అంటూ పెద్దపెట్టున అరచింది.
అంతే.. లిప్తలకాలంలో ఆరుగురు లెంకలు ఆమెను దోమను పట్టినట్లు పట్టి చుట్టుముట్టి గణపతిదేవుని నుండి పక్కకు లాగారు. ఆ చురకను గుంజి.. కర్రముక్కలా ప్రక్కకు గిరాటేశారు. నిజానికి ఆమె మహిళ కాబట్టి ఆ మాత్రం కనికరం చూపారు. లేకుంటే ఆమె వేలితోనే ఆమె మెడవద్ద నరాలను నొక్కి ఊపిరి ఆపేస్తారు. ఒక్కొక్క అంగమూ విరుస్తూ ముక్కలు ముక్కలు చేసి అటూ ఇటూ గిరాటేస్తారు. ఇదంతా లిప్తల కాలంలోనే చేసేస్తారు.
గణపతిదేవునికి కాలం స్థంభించినట్లయ్యింది. తనపైకి లంఘించిన మహిళ ఎవ్వరో లిప్తకాలంలో గుర్తుపట్టాడు.
బాలకవ్వల!!
కర చరణాలు స్థంభించిపోయాయి. నిలువుగుడ్లు వేసుకుని రెప్పవేయకుండా ఆమెనే చూడసాగాడు. అంగరక్షకులు కాళ్ల మధ్య ఆమె. పెనుగులాడు తోంది.. వికటాట్టహాసాలు చేస్తూ అరుస్తోంది.
అదంతా విభ్రమంగా.. కరచరణాదులు కదిలించకుండా కొయ్యబారిపోయి చూస్తున్నాడు గణపతిదేవుడు.
తనపై హత్యాయత్నం చేసింది అనే స్పృహ లేదు.
మళ్లీ లేచి అరుస్తూ ఏడుస్తూ కలబడింది కవ్వల. అంగరక్షకులు చిన్న బొమ్మను పట్టుకున్నట్లు పట్టుకున్నారు.
పూర్తి స్పృహలోకి వచ్చాడు గణపతిదేవుడు.. ఒకనాటి కవ్వల ప్రేమికుడు.
చేయెత్తాడు ఆగమన్నట్లు.. అంగరక్షకులు మొత్తంగా మొత్తం వెనక్కు జరిగారు.
కవ్వలనే చూస్తున్నాడు. రొప్పుతోంది..
నలభై ఐదేళ్ల కవ్వల. నిలువుగా ఎదిగిన బలిష్టమైన శరీరం. వయసురీత్యా కొంచం ఒళ్లుచేసి కాసింతబొద్దుగా నిండుగా ఉంది. మరాఠీ రాజోచిత మహిళా దుస్తులలో దర్పంగా ఉంది. కానీ ఆమె శరీరమంతా పగతో భాస్వరంలా మండుతోంది. ముప్పై ఏళ్లుగా లోలోన రగిలి పోతున్నజ్వాల ఆమె కన్నుల్లో ప్రతిఫలిస్తోంది.
కానీ విచిత్రంగా ఆమెను ఎన్నోఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుడిలా ఆప్యాయంగా మృదువుగా చూస్తున్నాడు గణపతిదేవుడు. కళ్లలో చిన్నపాటి తడి.. స్పందనతో ఆ కళ్లు కదలాడు తున్నాయి.. తడితడిగా.
దేవగిరి కారాగారం నాటి ప్రేమ ఆ తొలి ప్రణయ స్పందనలు.. ఆయనలో నిత్య పరిమళ భరితమైన ఆ స్నేహ మధురిమలు ఈరోజు కూడా ఆయనలో కొత్తగా పువ్వుల్లా పుట్టి విప్పారి సుమధుర పూలపరిమళాలను విరజి మ్ము తున్నాయి.
రెండు పెళ్లిళ్లు జరిగినా.. ముగ్గురు భార్యలతో సంసారం పంచుకున్నా.. ఒక భార్య చనిపోయినా.. ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని ఒడుదొడుకులు లేకుండా నడిపిస్తున్నా.. ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు కలిగి వాళ్లంతా పెరిగి పెద్దవారయినా.. ఇద్దరి కూతుళ్ల వివాహం చేసినా.. ఆయన ఎప్పుడూ.. ఆనాడు కవ్వలతో గడిపిన సంఘటనలు.. చెప్పుకున్న ముచ్చట్లు.. ఆ రాత్రి.. అదే చివరి రాత్రి అయిన ఆ రాత్రి కూడా.. ఓ పెళ్లి మండపం నుంచి చాటుగా వచ్చేసి ఓ మందిరంలో పంచుకున్న చిలిపి కబుర్లు.. ఆ శారీరక దగ్గరితనం.. ఓహ్..
అలాంటి ఆ కవ్వల చెల్లెలు ఈ కవ్వల.. బాలకవ్వల.. ఆనాడు ఆ వివాహ మండపంలో ఈమెను చూసి కూడా ఆమె అనుకుని పొరబడిన సంగతి కూడా గుర్తుకొచ్చింది. అలాంటి తన కవ్వల కానీ ఈ కవ్వల ఇన్నేళ్ల తర్వాత కంటపడిందనే గొప్ప అనుభూతితో ఆమెను రెప్పవేయకుండా ఆనందంతో చూస్తున్నాడు.
కానీ తన సోదరి మరణానికి ఇతడే కారణం అని అతనిపై పగ పెంచుకుని దానితో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుని.. అతన్ని.. అంటే ఇతన్ని చంపేయాలి.. ఇతని రాజ్యాన్ని సర్వనాశనం చేసేయాలి అని ఏకైక ధ్యేయంతో బతుకుతున్న ఈ బాలకవ్వల మళ్లీ గణపతిదేవునిపైకి దూకింది.
“రేయ్.. నీచుడా.. ఎంత దుర్మార్గుడివిరా నువ్వు.. నిన్నే ప్రేమించి నీతో బయటకు వచ్చిన నా అక్కను ఖండ ఖండాలుగా నరికించి చంపించావ్. ద్రోహి. నీచుడా. నికృష్టుడా.. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్నిప్పుడే చంపేస్తా.. నీ రక్తం తాగుతా.. నిన్ను చంపే స్తాను. నీ చావుతో నా అక్క ఆత్మ శాంతిస్తుంది..”
ఎగిరి మళ్లీ గణపతి భుజాలు పట్టి గుంజింది. అంగరక్షకులు చేతులు పిసుక్కుంటూ నిలబడ్డారు. కేయూర ముందుకు ఉరికి ఆమెను పట్టుకుని ఇవతలకు లాగుతున్నాడు. ఆమె భల్లూకంలా గణపతిని విడువడంలేదు.
“కేయూరా.. బాలకవ్వలను విడిచిపుచ్చు..” స్థిరంగా అన్నాడు గణపతిదేవుడు.
ఆయనకు ఈ దృశ్యం వింతగా ఊహాతీతంగా ఉంది. బాలకవ్వల భరిస్తున్న విషాదాన్ని అప్పుడు ఆయన పసి గట్టాడు. తన హృదయంతో తన బాధనే ఇంతకాలం భరిస్తూ..ఎవరు చంపారో తెలియక బాధపడుతూ..రోజులు వెళ్లదీస్తున్నాడు కాని కవ్వల కుటుంబసభ్యులు ఎంత క్లేశం అనుభవిస్తున్నారో అనేది ఆలోచించలేదు. ఇప్పుడు ఈ కవ్వల ఆక్రోశం.. తనపై పెంచుకున్న పగ, ప్రతీకారవాంఛ గుర్తిస్తే అది సహజం అనిపించింది! తనే ఆమె మరణానికి అసలు కారణం.. తననేమి చేసినా పాపం లేదు. ఆ స్థితిలో తానున్నా ఎవరున్నా ఇలాగే పగ పెంచు కుంటారు. కనబడితే ఇలాగే తిరగబడతారు.
తన కాకతీయు సైనికులు ఆమెను చంపారని ఈమె నమ్ముతోందని గణపతిదేవునికి అర్థమైంది.
మౌనంగా చేతులు దగ్గరగా పెట్టుకుని తల వంచుకుని ఆమె ముందు నిలబడ్డాడు గణపతి దేవుడు.
కవ్వల అరుస్తోంది. తిడుతోంది. కొడుతోంది. చెంపలు వాయిస్తోంది. ముఖాన పొడుస్తోంది. గోర్లతో రక్కుతోంది.
ఆయన ముఖమంతా లిప్తల కాలంలో సన్నని రక్తపు చార.. ముఖమంతా వాచిపోయింది. కనురెప్పలు, చెవులు, నాసిక.. సున్నితమైన భాగాలన్నీ పొంగి ఉబ్బిపోయాయి.
కత్తి.. కరవాలం.. బరిసె.. దగ్గరగా లేవు.. ఉంటే దానితో ఆయనను చంపేసి ఉండేది బాలకవ్వల.
కొట్టి కొట్టి ఏడ్చి ఏడ్చి తిట్టి తిట్టి కుప్పకూలి పోయింది బాల కవ్వల.
అన్ని భరించాడు. కొడుతున్నా అడ్డుకోలేదు.. తిడుతున్నా ఒక్కమాట కూడా అనలేదు గణపతి దేవుడు.
ఆ గోల్లెనలోనే ఓ పక్కగా వణుకుతున్న చేతులు పిసుక్కుంటూ కేయూర.. వెనగ్గా అరివీర భయంకరు లైన మహామండలేశ్వరుని అంగరక్షక శ్రేణి. అందరూ తలవంచుకుని మౌనంగా దీనంగా ఆయనను క్రీగంట చూస్తున్నారు.
“నిన్ను ఏమి చేసినా నా పగ చల్లారదురా నీచుడా..” రొప్పుతూ అరుస్తోంది.
మహాబలిష్టుడైన యోధుడు గణపతిదేవుడు కూడా కవ్వల దెబ్బలతో ముక్కు ముఖం ఏకమై కాసేపటికి మెల్లగా కిందికి జారిపోయి కవ్వల ముందు చతికిలబడ్డాడు. ఆమె తీవ్రంగా అసహ్యించు కుని కాండ్రించి ఆయన ముఖాన ఊసి.. అయన దగ్గరితనాన్ని భరించలేనట్లు చివ్వున మరో వైపు తిరిగింది.
“నన్ను లక్ష్యంగా చేసుకుని నీ బాధ ప్రకటించావ్.. మరి నా బాధ..? నాకు ఎవ్వరు లక్ష్యం?? ఎవరిని తిడితే కొడితే నా బాధ తీరుతుంది కవ్వలా..??” అందామనుకున్నాడు. అనలేదు. దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకున్నాడు.
అప్పుడే బయట ఎవరిదో జవనాశ్వం సకలించి పరుగున వెళ్లిపోయింది.
* * *
అనుమకొండ రాజ ప్రాసాదం
అంతఃపురంలోకి ప్రవేశించాడు గణపతిదేవుడు.
కవ్వల కొట్టిన దెబ్బలకు కాదు ఆమె అన్న మాటలకు మనస్సంతా మొద్దు బారిపోయింది. శరీరమంతా ఏవిటో తెలియని బాధతో ముడుచుకు పోయింది. పచ్చిపుండులాగా చెప్పరాని నొప్పి. చెప్పుకోలేని మానసిక అశాంతి.
బట్టలన్నీ మాసిపోయాయి. మార్చుకోబుద్ది కాలేదు. జుత్తు చెదరిపోయింది. సరిచేసుకోలేదు. స్నానం చేశాడో లేదో కూడా గుర్తులేదు. ఎటు చూసినా ఏది విన్నా ఒక్కటే!
అక్షరమో.. మాటో.. వాక్యమో.. అది కవ్వల! కవ్వల!! కవ్వల!!!
‘చనిపోయిన అక్కకవ్వల.. బతికిఉన్న బాలకవ్వల.. ఇద్దరూ తనను దుర్మార్గుడిని చేశారు. సమాజం ముందు ఓ ఆడపిల్లను క్రూరంగా చంపించిన ద్రోహిగా నిలబెట్టారు అప్పాచెల్లెళ్లు.
తననెందుకు ఓ భగ్న ప్రేమికుడిగా.. చిన్నకవ్వల గుర్తించలేదు??
దగ్గరలో ఉన్న పల్యంకంలో కూలబడ్డాడు. మునగదీసుకుని కూర్చుండి పోయాడు.
ఆనాటి రాత్రి జరిగిన సంఘటనలు కళ్లముందు గిర్రున తిరుగుతున్నాయి.
పెద్దకవ్వల మరణంతో ఆ కుటుంబం ఛిద్రమైపోయిందని తనకు తెలుసు. తర్వాత ఈ బాలకవ్వలకు ఏమి జరిగిందో! ఎవరితో ఎలా వివాహమయ్యిందో కేయూర వచ్చి చెప్పేదాకా తెలియదు. దేవగిరిలో ఎలాంటి సమాచారం తనకు లభించలేదు.
ఈ బాలకవ్వల తనపై ఇంత పగ పెంచు కుంటుందని ఏమాత్రం ఊహించలేదు..
గణపతిదేవుడు పల్యంకంలో ముడుచుకుని కూర్చుని తన లోకాన తాను ఉండగా పరిచారికలు, ప్రతిహారి తదితరులు ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ.. ఆయనను వింతగా చూస్తున్నారు. కారణం ఆయన ఇలా డీలాపడిపోయి ముడుచుకుపోయి కూర్చుం డటం వాళ్లెప్పుడూ చూడలేదు. వంటకత్తేలు బంగారు పళ్లెరాలలో ఏవేవో తినుబండారాలు తెచ్చి ఆయన ముందు చూపుతూ ఉంచుతున్నారు కానీ ఆయన వాటిని చూడటం లేదు.
ఉన్నట్టుండి ఏదో ఆలోచన ఆయన బుర్రలో మెరుపులా మెరిసింది.
కారణం ఎదురుగా నిలబడినట్లు కనపడిన మనిషి..పట్టమహిషి సోమలదేవి..
గతంలో ఇక్కడ దొరికిన లేఖల్లో చిల్లాదేవి సోమలకు రాసిన లేఖల్లో బాలకవ్వల పేరు ప్రస్తావనకు వచ్చింది.
ఆ సంగతి ఇప్పుడు సోమలను చూడగానే బుర్రలో మెరిసింది.
చటుక్కున కదిలి నిటారుగా కూర్చున్నాడు.
సోమల ఆయన ముఖంలోకి ఆందోళనగా.. వింతగా చూస్తోంది. ‘ఏమైంది ఈయనకు??’ అన్నట్లు.
చివ్వున లేచి ఆమె చెయ్యి పట్టుకుని అంతరింగిక మందిరంలోకి లాక్కు పోయాడు. తల్పంపైకి తోసి, “కవ్వల.. కవ్వల నీకు తెలుసా?” అన్నాడు ఆమెనే తీక్షణంగా చూస్తూ గూఢచారిలా.
ఆమె వింతగా చిరాగ్గా ఆయనను ఎగాదిగా చూసింది. “తెలియడం ఏవిటి. కవ్వల మా మేనత్త గారి అమ్మాయి. మేమంతా దినమూ వ్యాయామ శాలకు వచ్చేవాళ్లం. అక్కడే తమరిని తొలిసారి చూడటం..” అంది.
చప్పపడిపోయాడు గణపతిదేవుడు. ‘నిజమే కదా..’
“ఆమె పెద్ద కవ్వల.. కానీ మరొకామే.. ఆమె..”
“ఇద్దరూ కవలలు. ఇద్దరూ వ్యాయమశాలకు వచ్చేవారు కూడా. పెద్ద కవ్వలను ఎవరో..అదే మీ కాకతీయ సైనికులే చంపేశారని చెప్పుకున్నారు. ఏమో నాకు తెలియదు. అయినా ఇప్పుడా సంగతి ఎందుకు అడుగుతున్నారు? ఈ రోజు ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తెలుగుచోడ రాజులు యుద్ధంలో విజయులయ్యారట. రుద్రమ్మ వచ్చిచెప్పింది. కానీ మీరేవిటో విచిత్రంగా.. రోజూ ముద్దుల భార్యగారి అంతఃపురంలో దూరతారుగా. ఈరోజు నా మంది రానికి వచ్చినప్పుడే అనుకున్నా. మహారాజులుంగారు ఇలా వేంచేశారంటే ఏదో విశేషం ఉండాలి అని. ముఖమేవిటి మరీ గండుచీమలు కుట్టినట్లు ఉబ్బిపోయింది. కత్తి దెబ్బలు, బల్లెపు పోట్లు కాదు. ఎవరో ముఖాన్ని పచ్చడి పచ్చడిగా చితక్కొట్టారు. ఎవరు.. ఎందుకు.. మహామండలేశ్వరునే కొట్టడమా! అంగరక్షకులు ఏమయ్యారు??”
ఆమె ధోరణిలో అలా చిరచిరలాడిపోతూ మాట్లాడుతోంది.
నిజమే. గణపతిదేవుడు సాధారణంగా ఎక్కువగా రెండవభార్య నారాంబ అంతఃపురానికి వెళతాడు. ఒకప్పుడు రెండూ వేరువేరుగా ఉంచాడు కానీ ఇటీవల ఇద్దరి మధ్య సయోధ్య సాధించి ఒక్కటే అంతఃపురం..అందులో రెండు శయన మందిరాలు ఉన్నాయి. రుద్రమ వివాహం ఇద్దరూ కలిసిమెలిసి ఘనంగా జరిపారు. రుద్రమ కూడా నారాంబతో అన్యోన్యంగా ఉండటంతో మొత్తంగా కలిసిపోయి ఆప్యాయంగా ఉంటున్నారు.
తను ఈరోజు ఎందుకు సరాసరి సోమల మందిరంలోకి వచ్చాడు??
ఆయన ఆలోచనలన్నీ ఇప్పుడు కవ్వల గురించి సోమల, చిల్లాదేవి మధ్య నడిచిన లేఖల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే కాబోలు అన్య మనస్కంగాఅడుగులు ఇటే పడ్డాయి.
“ముఖం చూస్తే ఏమి తిన్నట్లు లేదు. ఇదిగో ఈ రెండు తేనె గారెలు తినండి. కాస్త స్నానం చేస్తే ఆ బడలిక పోతుంది. ఈ రోజు కొలువు కూటానికి వెళ్లకండి. కాస్త విశ్రాంతి తీసుకోండి..”
పళ్లెరం ముందుకు చాచింది. యాత్రికంగా అందుకున్నాడు. వెనుక వచ్చిన పరిచారిక నీటి కోర పక్కన పెట్టింది. ‘ఎక్కడో గందరగోళంగా ఉంది. కన్ను కూడా కనిపించి చావడంలేదు. అదేవిటి ఆ బాలకవ్వల అలా కొట్టింది.. ముఖాన ఊసింది కూడా. ఇంతటి రాజ్యాధీనేతకు ఎంత అవమానం! వదిలేస్తే అంగరక్షకులు ఆమెను పిండిపిండి చేసేవారు. రక్తం బొట్టు కూడా కింద పడేది కాదు. వాళ్ల ముందే తనపై ఊస్తే.. ఊరుకున్నారు.
పాపం వాళ్లకు ఎంత అవమానం..’
ఆలోచనలు అలా సాగిపోతున్నాయి.
“అసలు మా మేనత్త, మామగారు కవ్వల మరణం తట్టుకోలేక పిచ్చివాళ్లై పోయారు. కవ్వల శవాన్ని చూసి అది.. బాలకవ్వల.. స్పృహ తప్పి పోయింది. చాలాకాలం అలాగే మగతలో మంచాన ఉంది. మా అమ్మే ఏవేవో పూజలు వ్రతాలు చేసి దాన్ని బతికించింది. అన్నట్లు దాని పెళ్లి కూడా అప్పుడే.. అది.. ఆ మగతలో ఉన్నప్పుడే అన్నే దగ్గరుండి చేయించాడు. పెళ్లి చేస్తే బతుకుతుందని ఎవరో అమ్మకు చెప్పారట. అతను కూడా మా అన్నదమ్ములవాడే. కాకపోతే రండాపుత్రుడు.. అంటే తెలుసుగా..” ఓరగా చూస్తూ చెప్పుకుపోతోంది.
ఎక్కడో టక్కున వెలిగింది గణపతిదేవునికి. మగతలో మంచాన పడి ఉన్నప్పుడు పెళ్లి చేయిం చడం ఏవిటి.. అది సహాయమా.. ద్రోహమా?? లేచాక చేయిస్తే వాడి సొమ్మేం పోతుందిట?!! అయినా ఎందుకు వాడికి ఆ కుటుంబంపై అంత ప్రేమ?!! ఆ పెళ్లేదో కులీనుడితో చెయ్యాలి కదా! వాళ్లు రోజూ అసహ్యించుకునే కేయూరతో ఎందుకు చేసినట్లు..
అప్రయత్నంగా అన్నాడు గణపతిదేవుడు. “కేయూర తెలుసా??”
ఆమె మళ్లీ చిరాగ్గా చూసింది.
“కేయూర కూడా వ్యాహ్యాళికి వచ్చేవాడు. మిమ్మల్నే అంటిపెట్టుకుని తిరిగేవాడు. మీరు మర్చిపోయారేమో.. నాకు గుర్తుంది..”
మళ్లీ బుర్రలో పెద్ద విస్ఫోటనం..
‘ఈవిడకు కేయూర వచ్చి తనను కలసినట్లు.. అతనికి పడమటి సరిహద్దు వద్ద వెల్లూరు రాజధానిగా ఓ రాజ్యాన్ని ఏర్పరచి మహారాజును చేసినట్లు, ఈ యుయుద్ధానికి అతడే నాయకత్వం వహించినట్లు ఈమెకు తెలియదులా ఉంది.’
అంతా గందరగోళం.. గజిబిజిగానం!!
బుర్ర తిరిగిపోతోంది. బయటకు నడిచాడు గణపతిదేవుడు.
ఆయన ద్వారం దాటేవరకూ చూసి లోపలికి వెళ్లడానికి వెనుదిరిగింది సోమల.
తన ముందే ఉన్న వ్యక్తిని చూసి తెల్లబోయింది. గావుకేక వేయబోయి ఆగిపోయింది.
ఆమె కన్నకూతురు రుద్రమదేవి! ఎప్పటినుండో అక్కడే ఉంది అన్ని విన్నట్లుంది ఆమె నిలబడిన తీరు.
రుద్రమ వెనగ్గా కనిపించి కనిపించకుండా తలవాల్చి చూస్తోంది ఆమె అంతరంగిక పరిచారిక మంధర. ఆమె చేతిలో లేఖల పొత్తం. అవన్నీ తనకు తల్లి రాసిన లేఖలు. దాచిపెట్టుకున్నవి. అవి మంధర కంటపడ్డాయని.. ఆమె రుద్రమకు చూపిందని.. రుద్రమ అన్నీ చదివిందని.. ఇప్పుడు ఇక్కడ తన భర్తతో జరిగిన సంభాషణ కూడా రుద్రమ విన్నదని.. సోమలకు అర్థమైంది.
“నాకు అన్నీ తెలిశాయి అమ్మా! నేను నిన్నేమీ అనడంలేదు. జరిగింది న్యాయమా! అన్యాయమా! అనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఆ బాలకవ్వల నా తండ్రి గారిపై పగబట్టింది. తండ్రిగారిని తన స్వహస్తాలతో ఆమె కొట్టడం నేను కళ్లారా చూశాను. ఆమె పగతో రగిలిపోతోంది. ఆమె తండ్రిగారిని హత మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆయన యుద్ధంలో మరణిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ కానీ ఆయన చెయ్యని నేరానికి ఆమే ఆయనను ఏమి చేసినా.. గోరుతో గిచ్చినా.. నేను సహించను. ఆమెను చంపగలను. కానీ ఆమె మూర్ఖురాలు. ఆమెకు జరిగింది చెప్పి ఆమెను సాంత్వన పరచాలని అనుకుంటున్నాను. ఆమె మనసు మార్చగలదానివి నువ్వే. ఆమెకు నిజం చెప్పాలి. జరిగిన నిజం.. చెప్పాలి. సరేనా??” సూటిగా చూస్తూ అంది రుద్రమ.
దిమ్మేరపోయినట్లు నిలబడిపోయింది సోమల.
“ఇకపై ఆమెను తీవ్రంగా అనుసరిస్తాను. యుద్ధం అంటుందా.. నా తండ్రి కోసం పోరాడి దాన్ని చంపగలను.
ఆమె మనసు మార్చే అవకాశం వస్తే…రావాలనే ఆ కాకతమ్మను కోరు కుంటాను. అప్పుడు నువ్వు రావాలి. ఆమెకు చెప్పాలి. నిజం.. జరిగిన నిజం.. అదేవిటో నాకు తెలియదు. నాకు అక్కరలేదు కూడా. కాని నా తండ్రి నాకు కావాలి. అందుకు ఆ పిచ్చిరాక్షసి మనసు మార్చాలి. అది నీ బాధ్యత.. సరేనా అమ్మా.. సరేనా??”
రెట్టించి గొంతెత్తి అడిగింది రుద్రమ.
తల్లికి కూతురు పోరాట పటిమ, మాటల్లో ప్రవర్తనలో కనబరిచే స్థిరత్వం సోమలకు అవగతమే.
గబగబా తల ఊపింది తల్లి సోమలదేవి.
కుటుంబంలో జరిగిన పాత గాయాలపై పోరాటానికి కూతురు సిద్ధ పడుతోందని ఆ తల్లి మనసు చెబుతోంది.
“ఆ ప్రయత్నంలో నేను ఎక్కడ ఉన్నా నీకు లేఖ ద్వారా తెలియజేస్తాను. నువ్వు సిద్ధంగా ఉండాలి. అర్థమైందా అమ్మా..? ”
ఆమె ప్రశ్నలు సోమలను భయపెడుతున్నాయి.
వెనుదిరి వెళుతున్న రుద్రమతో అంది సోమల.
“ఒక్క మాట రుద్రమతల్లి..”
ఆగింది రుద్రమ. కాని తల్లి వైపు తిరగలేదు.
“ఆ మహానుభావుడు నీ తండ్రి కాకముందు నా భర్త రుద్రమా!నా భర్త!! నా మాతృరాజ్యంలో బందీగా ఉన్న వాడిని నేను పెళ్లి చేసుకున్నాను.. అది నువ్వు గుర్తించుకుంటే.. చాలు!”
తన కంట నీరు కనపడకుండా అటే వెళ్లి పోయింది ఆ జంటకు పూచిన రుద్రపుష్పం.. రుద్రమదేవి!!
* * *
స్కంధావారంలో ఆరోజు గణపతిదేవునికి జరిగిన అవమానం కేయూరను చాలా కృంగదీసింది.
ఆమె కాండ్రించి ఉమ్మి వేయడం మరచి పోలేకున్నాడు. సింధు ఖండంలో దక్షిణాపథంలోని మహాసామ్రాజ్యంగా వెలిగిపోతున్న కాకతీయరాజ్య మహామండ లేశ్వరుడు గణపతిదేవునికి.. ప్చ్.. ఎంత అవమానం!
ఆయన దైవస్వరూపుడు కాబట్టి కవ్వల ప్రేమికుడుగా ఆమె దారుణ మరణానికి తానే మూలకేంద్రంగా భావించి..ఆ పిచ్చిదాని పిచ్చి పగను అర్థం చేసుకుని భరించి క్షమించి ఆమె చేసిన శారీరక హింసను మన్నించాడు. అదీ ఆయన అంగరక్షకుల సమక్షంలో. లక్షమంది ఒక్కసారిగా దాడిచేసినా సునాయా సంగా ఆయనపై ఈగ వాలకుండా కాపాడగల మహావీరులు.. ఆయన ఆజ్ఞపై చేతులు కట్టుకుని తలవంచుకుని నిలబడ్డారు.
అంత అవమానం జరిగిన తర్వాత కూడా.. నిన్న అనుమకొండలో జరిగిన విజయోత్సవంలో నవ్వుతూ భుజం తట్టి నాలుగు ప్రోత్సహపు మాటలు మాట్లా డాడు కానీ నిన్నటి సంఘటనను గుర్తు చేయలేదు. ముఖంలో విజ యోత్సాహమే కానీ అవమాన భారం మచ్చుకయినా లేదు.
తలుచుకున్నకొద్దీ కేయూరకు ఆమెపై అసహ్యం పుడుతోంది. ఎంత సంయమనం పాటించాడు గణపతిదేవుడు.. ఆయన హిమాలయ పర్వత శృంగంలా ఆ ఎత్తున కనిపిస్తున్నారు. కవ్వల మరణంతో ఆయన పొందిన మానసిక వ్యథ ఈమె అర్థÁ్ధం చేసుకుని ఉంటే ఈమెను ఆయన హృదయానికి తీసుకుని ఎంతో గౌరవించే వాడు. ఓ గొప్ప సువర్ణావకాశాన్ని పోగొట్టుకుంది.
ఆ రోజు ఆమె తిరిగివెళుతున్నప్పటి సంఘటన గుర్తొచ్చి మరింత అసహ్యం కలిగింది ఆమెపై.
చివ్వున లేచి బయటకు పరుగుపెట్టింది బాలకవ్వల.. పరుగున వెంట వెళ్లాడు కేయూర.
వేగంగా అశ్వాన్ని అధిరోహించింది.
“నన్ను మోసం చేశావ్. వాడి చెప్పులు నాకుతూ నా ప్రేమను అవమాన పరచావ్. ముప్పైఏళ్లు నిన్ను మాత్రమే మనసులో పెట్టుకుని పూజించాను. ఇంతకింత అనుభవిస్తావ్. వాడ్ని, నిన్ను.. చంపేవరకు నిద్రపోను. నా పగ చల్లారదు..” వేగంగా వెళ్లిపోయింది.
నిరుత్తరుడై నిలబడిపోయాడు.
‘దైవ సమానుడుగా కాకతీయ ప్రజలు కొలుచుకునే మహానాయకుడాయన. అలాంటివాడు నువ్వు కొట్టిన చేతి దెబ్బలను మౌనంగా భరించాడు. తప్పు తనది అనే బాధ్యతను స్వీకరించాడు కాబట్టి ఎదురు చెప్పలేదు. అంగరక్షకులను మూలన నిలబెట్టి నీ ఆవేశానికి తలవొగ్గాడు. ఇకనైనా నీ మూర్ఖత్వం తగ్గించుకో..’ అని చెబుదామనుకున్నాడు.
ఆమెలో ఆ ఆవేశం, క్రోధం ఏమాత్రం తగ్గలేదు. తనను కూడా వదిలించుకున్నట్లు ప్రకటించి వెళ్లిపోయింది.
ఇప్పుడు పూర్తిస్థాయి మహారాజుగా గెలుపుబాట పట్టిన యోధుడుగా తోటి సామంత రాజులు గౌరవిస్తుంటే.. దగ్గరగా తిక్కనమహాకవి, దూరాన గణపతి దేవుడు తనను ఓ సాహిణిగా గుర్తించి ప్రకటించినా ఆనందం కలగడం లేదు.
బాలకవ్వల తనతో కలిసి తన రాజ్యానికి వచ్చేస్తే ఓ పూర్తిస్థాయి పట్ట మహిషిగా స్వీకరించి పట్టాభిషేక మహోత్సవం జరిపించుకోవాలని కేయూర అనబడే గంగయసాహిణి పరితపిస్తున్నాడు.
నిరంతరమూ అదే ఆలోచన..
ఆ కోరిక అణచుకోలేక మరి కొన్నాళ్ల తర్వాత బాల కవ్వల కోసం కంపిలి వెళ్లి సిద్దప్పరుసుశెట్టి భవంతికి వెళ్లాడు గంగయసాహిణి.
భ్రమ! ఆమె అక్కడ లేదు.
“అప్పుడే యుద్ధానంతరమే ఇక్కడినుండి వెళ్లిపోయారు మహారాజా! గతమాసం సింఘణదేవుల వారు కూడా వాకబు చేశారు ‘కవ్వలాబాయివారు ఎక్కడ’ అని. నాకు కూడా సమాచారమివ్వకుండా వెళ్లిపోయారు. మహారాజులకు కూడా తెలియదు అంటే ఆమె దేవగిరి వైపు కూడా వెళ్లలేదు..”అర్థ్ధోక్తిలో ఆపాడు శెట్టి.
మిణుకు మిణుకుమంటున్న కాస్త ఆశ కూడా అడియాస అయ్యింది గంగయకు.
నిరాశగా నిలుచుండిపోయాడు.
అప్పుడన్నాడు శెట్టి.. గంగయ సాహిణి ముఖంలోని చూస్తూ ఒక్కొక్కమాట.
“మరో సంగతి. ఆమె.. మీరు మరోలా అనుకోకపోతే.. మార్జువాడి రాజ్య ప్రాంతంలోని మరో శెట్టిని వివాహ.. మాడి.. నట్లు..”
పొడిచింది. గుండెల్లో గుచ్చింది. తల ఎత్తలేక పోయాడు.
చెప్పవద్దు అన్నట్లు చేయి ఎత్తాడు. ఆయన మరేమీ చెప్పలేదు. మౌనంగా వెనుదిరిగి గుర్రం అధిరోహించాడు బాలకవ్వల భర్త కేయూర అనబడే గంగయ సాహిణి!!
* * *
దేవగిరి నగరం.
“అమ్మా.. మాదాకబళం తల్లీ.. కాస్త.. రెండు ముద్దలు అన్నం పెట్టండి తల్లీ..”
కోట దగ్గరగా ఉన్న నివాసవాడలలో అడుక్కుంటున్నాడు కుంటోడు అనబడే నాగతిస్య. అలవాటైన ఈ వాక్యాలు అనాలోచితంగా పెదాలు ఉచ్చరిస్తున్నాయి. కానీ మనస్సు ఎక్కడెక్కడో గిరికీలు కొడుతోంది.
కాకతీయ గూఢచారి నాగతిస్యను ఐదేళ్లు కారాగారంలో బంధించి జీవిచ్ఛవాన్ని చేసి విడుదల చేశారు.
అతని జీవితం సర్వనాశనం అయిపోయింది.

(సశేషం)