‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

ముదిగొండ రాజ్యం, వరదగూడెంలో దెయ్యాన్ని వదిలించే మంత్ర తంత్ర పూజా కార్యక్రమం.

జరుగులప్ప ఇంటిచుట్టూ ఎవ్వరిని రానివ్వ కుండా కట్టడిచేసి వీధిదీపాలు వెలిగించకుండా ఆపించి, భర్తను మరువలేక ఏకధాటిగా ఏడుస్తున్న సోమిదమ్మ గదిలోకి ఎవరూ వెళ్లకుండా దిగ్బంధనం చేసి దాని బయట పూజా కార్యక్రమం ప్రారంభిం చాడు శంకణభట్టు.

ఊరు.. ఊరంతా ఓ ఉన్మాద, పైశాచిక ఆనందంతో నిశ్శబ్దంగా ఉంది. దెయ్యం – వదలిపోయే దృశ్యం గ్రామంలో ఉత్తములకు, పాపాలు చెయ్యని గొప్ప వారికి మాత్రమే కనిపిస్తుందని ఓ గొప్ప నమ్మకం. దాని కోసం అందరూ వారి వారి ఇళ్లల్లో మేల్కొని చెవులు రిక్కించి సోమిదమ్మ ఏడుపు అంటే…ఆమెను ఆవహించిన దెయ్యం ఏడుపులను.. అంటే ఆమెను వదలిపోయేముందు ఆ దెయ్యం పెట్టే పెడబొబ్బలను వినడానికి సిద్ధŠ్దంగా ఉన్నారు.

మంత్రోచ్చారణ పెద్దగొంతుతో ప్రారంభించాడు శంకణభట్టు.. ఊరు ఊరంతా భయభక్తులతో చేతులు జోడించి కళ్లు మూసుకుని ఆయన మంత్రాలను వింటున్నారు. అదొక గంటసేపు సాగింది.

 హఠాత్తుగా మౌనం!! అంటే భట్టుగారు ఆమె ఉన్న గదిలోకి ప్రవేశించాడన్నమాట.

కాసేపు పెనుగులాట.. మరి కాసేపటి తర్వాత.. ఆమె అరుపులు మొదలయ్యాయి. ఆమె అరుపులతో పాటు శంకణభట్టు అరుపులు కూడా వినవస్తున్నాయి. మరి కాసేపటికి ఆమె అరుపుల కంటే శంకణభట్టు అరుపులు పెరిగాయి.. అవి పెడబొబ్బలుగా ఊరివారికి తెలుస్తున్నాయి.

అంతా సంభ్రమం!!

ఇదేవిటి.. సోమిదమ్మ నోటి నుండి వినాల్సిన ఏడుపులు పెడబొబ్బలు.. భూతప్రేతపిశాచి శాఖిణీ ఢాకిణీ లాంటి మహాశక్తులను వశపరచుకున్న మహాపూజారి శంకణభట్టు నోటి నుండి వినరావడం ఊరందరికి అర్థ్ధం కావడం లేదు.

అప్పుడే జరుగులప్ప ఇంటి చుట్టూ పక్కల వాళ్లు మరికొన్ని ఊహాతీతమైన దృశ్యాలను చూశారు. ఇంటి చుట్టూ మొహరించి ఎవ్వరిని ఆ దరిదాపులకు రానివ్వని భట్టు శిష్యులపై ఎవరో మరో బృందం దాడి చేసింది. ఎవరో ఆ చీకట్లో తెలియడం లేదు కాని ఆ ఆగంతకుల బృందం దెబ్బలకు పూజల బృందం తట్టుకోలేకపోతోంది. ఆ బలిష్టులు వాళ్లను తరిమితరిమి కొడుతున్నారు. ఆ పూజారులంతా పంచెలు ఎగగట్టి పరుగులు పెడుతున్నారు.

అప్పుడే లోపల ఎవరో చావగొడుతున్నట్లు శంకణభట్టు కూడా పిచ్చికేకలు పెట్టసాగాడు. సోమిదమ్మ పెద్దగా అరుస్తూ భట్టును కొడుతున్నట్లు బయటివారు గుర్తించారు. గ్రామ పెద్దలంతా అయోమయంతో జరుగులప్ప గృహం వద్దకు పరుగు పరుగున వచ్చారు.

లోపలి నుంచి ‘నాకు పట్టిన దెయ్యం నువ్వేరా..’ అంటూ సోమిదమ్మ అరుపు వినిపిస్తోంది. ‘అమ్మో అయ్యో..’ అంటూ శంకణభట్టు ఏడవడం తెలుస్తోంది.

అంటే లోపల శంకణభట్టు సోమిదమ్మను వేపమండలతో కొడుతూ ‘దెయ్యం మాయం’ పూజా కార్యక్రమం నిర్వహించడంలేదు. సోమిదమ్మే అతనిని చావగొడుతున్నట్లు బయటఉన్నవారికి స్పష్టంగా తెలుస్తోంది. బయట ఆ ఆగంతకుల బృందం పూజా బృందాన్ని అప్పటికే లేవకుండా చావగొట్టి ఓ పక్కన కూర్చోబెట్టింది.

మరికాసేపటికి ఆ గృహం తలుపులు తెరుచు కున్నాయి.

పీనుగులాంటి శంకణభట్టును బయటకు ఈడ్చుకుంటూ తీసుకువచ్చి గ్రామ సమయశెట్టి కాళ్ల మీద పడేశాడొక ఆగంతకుడు.

అందరూ అతన్ని గుర్తించారు. అతడు డిండిమ!!

వేపమండలతో రొప్పుతూ బయటకు వచ్చింది సోమిదమ్మ. ఆమె స్వయంగా శంకణభట్టును చావగొట్టిందని.. లోపల ఆమెతో ఆ పని చేయించిన వాడు డిండిమ అని అందరికి అవగతమయ్యింది.

“దెయ్యం పట్టడం అనేది ఓ భ్రమ. ఎవ్వరూ అలాంటి పని చెయ్యవద్దు అని నేను ఊరూరా తిరిగి చెబుతూనే ఉన్నాను. కాని శంకణభట్టు లాంటి మూర్ఖులు చేస్తూనే ఉన్నారు. అది తప్పు అని తెలిసిన పెద్దలు కూడా.. ‘ఏమో దెయ్యాలు నిజమేనేమో.. దెయ్యం నన్ను పట్టుకుంటే ఎలా..’ అని ఆలోచిస్తూ ఇలాంటి దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది దారుణం.. ఇది అన్యాయం. తోడపుట్టిన అక్కా చెల్లెళ్లను ఇలాగే హింసించి చంపుకుంటున్నాం. ఇకనైనా మారాలి. ఇలాంటివి మా గ్రామంలో ఇకపై జరగనివ్వమని అందరూ ప్రమాణం చెయ్యండి..” ఆయన కంఠం దృఢంగా పలికింది.

అందరూ అతని మాటలకు స్పందించి ప్రమాణం చేశారు.

ఈ వార్త గణపతిదేవుని చేరింది.. ఉలిక్కిపడ్డాడు గణపతిదేవుడు.

“ఇలాంటివి జరగకుండా మత సైనికులను కూడా ఏర్పాటు చేయమన్నాను. ఎలా జరిగింది?!” సాలోచనగా అడిగాడు సభా సహాయకుడు మయభట్టును.

“అన్ని రాజ్యాల్లో అన్ని నాడులలో కూడా ఏర్పాటు చేశాం ప్రభూ! కానీ కాని.. మతాచారాలలో దూకుడుగా ప్రవర్తించడానికి ఆ మత సైనికులు కూడా వెనుకాడుతున్నారట.. వేగుల సమాచారం.’

“కానీ కాని.. డిండిమ!! అతగాడేలా వెళ్లాడబ్బా?!”

మయభట్టు వద్దనుండి జవాబు రాలేదు. ఇద్దరి ముఖాలలో చిన్నపాటి విస్మయం.. ఓ చిటికెడు సంభ్రమంతో కూడిన విస్మయం..

కానీ గణపతిదేవునికి చేరని ఇలాంటి మరో సంఘటన వెలనాడు రాజ్యంలో చోటుచేసుకుంది. రాజధాని సనదప్రోలుకు దగ్గరగా ఉన్న నిడుబ్రోలు గ్రామంలో నిర్విఘ్నంగా జరిగింది. అక్కడికి డిండిమ వెళ్లలేదు. సమాచారం గణపతిదేవుని చేరలేదు.

అన్ని రంగాలలో గణపతిదేవుడు నిర్దేశించిన ఆదేశాలు ఖచ్చితంగా అమలు జరుగుతుండటం వల్ల కాకతీయ రాజ్యం, సామంత రాజ్యాల ప్రజలు పూర్తి సంతోష సంబరాల్లో మునిగితేలుతూ తమ దెనందినాన్ని ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారు.

ఒక్క మత, ఆచార.. ముఖ్యంగా చాదస్తపు మంత్ర తంత్ర నమ్మకాల, క్రతువుల అంశాల్లో రాజాజ్ఞలు ధిక్కరించి మరీ!!

* * * *

కాకతీయరాజ్యంలో.. గణపతిదేవుని కుటుంబంలో మరో గొప్ప సంఘటన జరిగింది.

అది రుద్రమాంబ వివాహం.

ఒకప్పుడు దక్షిణావర్తమంతా పాలించి ప్రభావితం చేసిన మహోన్నత చోళవంశం కాలగతిలో అనేకానేక చీలికలు పీలికలై చిన్నచిన్న ప్రాంతాలను పాలించే వారిగా మిగిలారు. వారిలో నిడుదవోలు రాజ్య పాలకుడు మహాదేవరాజు కుమారుడు ఇందు శేఖరుడు ప్రస్తుత జకపాలకుడు. అతడు గణపతి దేవునికి సామంతుడిగా.. మంచి మిత్రుడిగా ఉన్నాడు. ఈశాన్య రాజ్యాలపైకి దండెత్తడానికి కాకతీయ సైన్యం వెళ్లాలంటే ఇందుశేఖరుని సహాయం అవసరం. నిడుదవోలు పొలిమేరల్లోనే కాకతీయసైన్యం స్కంధావారం ఏర్పాటు చేసుకుంటుంది.

ఇటీవల జరిగిన కొలని యుద్ధŠ్దంలో రుద్రమదేవి మొదటిసారి పాల్గొంది. శత్రువులు ఆమెను చుట్టుముట్టి గాయపరచి బంధించబోతుండగా, ఆమెను రక్షించి నిడుదవోలు తీసుకెళ్లి అప్పటి కప్పుడు వైద్యం అందించి కాపాడినవాడు ఇందుశేఖరుని రెండవ కుమారుడు, నిడదవోలు యువరాజు వీరభద్రుడు.

ఇందుశేఖరుడు ఒకానొక రోజు పూర్తి సంప్రదాయబద్ధంగా పురోహిత బంధువర్గాన్ని వెంటపెట్టుకుని రాజలాంఛáనాలతో అనుమకొండ వచ్చి తన కుమారుడు వీరభద్రునికి రుద్రమదేవిని ఇచ్చి వివాహం జరుపవలసిందిగా కోరాడు. అది ఇంటిల్లిపాదికి, రుద్రమాంబకు కూడా అంగీకారం కావడంతో ఆ వివాహం నిశ్చయమైంది.

మేనకోడలు వివాహానికి దేవగిరి పాలకుడు సింఘణదేవుడు..తమ్ముళ్లు, బంధువులు మొత్తం దేవగిరి నగరమే తరలివచ్చిందా అన్నట్లు వేలాది మందితో మందీమార్బలంతో అట్టహాసంగా వచ్చాడు. పెళ్లి వేడుకలు నిర్వహిస్తోన్న జాయసేనాపతి కూడా సింఘణదేవుని బంధుమిత్రపరివారాన్ని చూసి ఆశ్చర్య పోయాడు. దేవగిరి ఆస్థాన సంగీతకారుడు సారంగ దేవుడు, జాయసేనాపతి మంచి మిత్రులు. ఈ వివాహ సందర్భంగా గొప్ప సంగీత నాట్యగోష్టి, ప్రదర్శనలు జరిగాయి.

అప్పుడే పిడుగులాంటి వార్తను గణపతిదేవునికి తెలియజేశారు గూఢచారులు. ‘అప్పటివరకు కన్నడరాజ్యాలను జయిస్తూ నైరుతిదిశగా జైత్రయాత్ర చేస్తున్న దేవగిరి సైన్యం హఠాత్తుగా తెలుగుచోడ రాజ్యలపై దాడిచేసి వెల్లూరు, పాకనాడు, కొణిదెల.. రాజ్యభాగాల లోపలికి చొచ్చుకు వచ్చింది’ అన్నది గూఢచారుల సమాచారం.

దిగ్భ్రమకు లోనయ్యాడు గణపతిదేవుడు.

ఇక్కడ మేనకోడలు వివాహానికి హాజరయ్యి బంధుజనులతో సరససల్లాపాలతో కాలక్షేపంచేస్తూ అక్కడ తెలుగు చోడ రాజ్యాలపైకి సైనికదాడి చేయడం..??.. గణపతిదేవుడు కోపోద్రిక్తుడై పళ్లు పటపటా కొరికాడు.

జాయచోడునికి విషయం చెప్పి వివాహ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలుగకూడదని ఆదేశించి వెనువెంటనే సైన్యాధ్యక్షులను సమావేశపరచాడు. అప్పుడే ఆయా రాజ్యపాలకులు గంగయదేవుడు, చక్రనారాయణుడు, నందపాలునితో పాటు నెల్లూరు పాలకుడు తిక్కభూపతి నుంచి యుద్ధ వర్తమానాలు అందాయి.

ప్రత్యేకించి తిక్కనామాత్యుని నుంచి కూడా….

“దొంగదెబ్బ తీశాడు సింఘణదేవుడు. ఇంతకాలం కన్నడరాజ్యాలను మరాఠిమయం చేస్తోన్న అతని అనుచరులు, వణిజశ్రేణులు, గ్రామ సమయ పెద్దలు ఈ దాడికి పాల్పడ్డారు. వీళ్లకు సింఘణ తరఫున ఓ మహిళ మంత్రాంగం నెరపుతోంది. చాలా కాలంగా ఆమే ఆయా సరిహద్దు నగరాల్లో, గ్రామాల్లో తిష్టవేసి గ్రామీణులను.. ముఖ్యంగా తెలుగువాళ్లను ఊచకొత కోస్తోందని నాకు తెలియవచ్చింది. కరవు కాలంలో కూడా ఆమె గంజి కేంద్రాలు తెరువనీయ లేదు సరికదా సరిహద్దులోని తెలుగువాళ్లు గంజి కోసం మన గ్రామాల్లోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేయించింది. తక్షణ కర్తవ్యం ఆలోచించండి.” అని సమాచారం అందింది.

మ్రాన్పడిపోయాడు గణపతిదేవుడు. రుద్రసేనాని, మల్యాలచౌండ లాంటి కురువృద్ధులు కూడా ఎవరో మహిళ ఇదంతా చేస్తోందని విని నోరు వెళ్లబెట్టారు.

పృధ్వీశెట్టి అశీకాలశెట్టి కూడా అప్పుడే గణపతి ఆదేశంపై అక్కడికి వచ్చాడు.

తీవ్రంగా చర్చ జరిగింది.

“సరే.. వాళ్లు ఎవరైనా.. మన సామంతుల భూభాగంలోకి చొచ్చుకు వస్తే అది మనకు అవమానమే. అందుకు బావమరిది అయినా.. వాడి బాబు అయినా.. క్షమించేది లేదు. కాని ఈసారి సంప్రదాయ యుద్ధం కాకుండా మరోలా ఆలోచించాలని మీ అందరిని కోరుతు న్నాను. ఇటీవల అదే ప్రాంతంలో మన నాట్యవేత్త జాయచోడుడు గొప్ప మతయుద్ధం చేశాడు. శైవవైష్ణవులను తన కళారూపాల ద్వారా మనసు మార్చి ప్రాణనష్టం నివారించాడు. అలాంటిదే మరో ఆలోచన నాకు కలుగుతోంది. అది వాణిజ్య యుద్ధం. అది చేస్తే ఎలా ఉంటుందో యోచించి చెప్పండి..” అన్నాడు గణపతిదేవుడు.

“అంకాలా.. ఈ యుద్ధంలో నీదే ప్రముఖ పాత్ర..” అంటూ తన మనసులోని యుద్ధ తంత్రాన్ని వివరించాడు.

 * * * *

“దేవగిరి సర్వసైన్యాధ్యక్షులు పంపనార్యులకు నమస్సులు. నేను వెల్లూరు రాజ్య మహారాజు శ్రీశ్రీశ్రీ గంగయదేవుల వారి సంధివిగ్రహిని. వారి సందేశం మీకు వినిపించడానికి వచ్చాను. మీరు ఎలాంటి యుద్ధసంప్రదాయాలు, చర్చలు.. లేకుండా మా రాజ్యభాగాలపై దాడి చేశారు. సరిహద్దులు దాటారు. ఇది క్షంతవ్యం కానీ నేరం. వెనువెంటనే మీరు మీ హద్దులలోకి వెళ్లవలసినదిగా కోరుతున్నాం. లేకుంటే జరిగే నష్టానికి మేము బాధ్యులం కాము.’ ఇది మా మహారాజులు మీకు పంపిన సందేశం. మీ జవాబు తెలియజేయగలరు..”

“రాజ్యం వీరభోజ్యం. మేమేమీ తెలియక ఈ భూభాగం లోపలికి రాలేదు. మేము వచ్చాం అంటే జయించినట్లే. చేతనయితే మీ భూభాగాన్ని తీసుకోండి.. ఇందులో చర్చలేవిటి? సంధి విగ్రహితో పనేమిటి..”

దేవగిరి సర్వ సైన్యాధ్యక్షుడు పంపనార్యుడు ఇచ్చిన సమాధానం.

మొత్తం నాలుగు రాజ్యాల సైన్యం ఏకీకృతమైంది.

కొన్నిగంటల్లోనే సరిహద్దు వెంటనున్న తెలుగు చోడరాజ్యాల సైన్యాలన్నీ సరిహద్దు దాటి నిలబడ్డాయి. సింఘణ దేవుడు జయించిన హోయసల రాజ్యభాగం పొడవునా.. కింద నైరుతిలో కంపిలి నుండి పైన వాయవ్యంలో దేవగిరి వరకు.. సరిహద్దు వెంబడి మహారాజు చక్రనారాయణుడు నాయకత్వాన పాకనాడు రాజ్యసేనలు మొహరించాయి.

సరిహద్దు వెంబడి ఉన్న అన్ని గ్రామాలలో.. అన్ని పురాలలో తిష్ఠ వేసుకున్న మరాఠి వాణిజ్యశెట్టిల కోష్టాగారాలను గంగయదేవుని నాయకత్వాన వెల్లూరు సైన్యం దిగ్బంధనం చేసింది. అంటే ఇకపై సరిహద్దు ఆవల కోష్టాగారాల నుంచి సరుకులేవీ దేవగిరి సైన్యానికి చేరవు.

అప్పుడు ఆక్రమణకు వచ్చిన దేవగిరిసైన్యంపై నందరాయడు నాయకత్వాన కొణిదెన సైన్యం తీవ్ర దాడి ప్రారంభించింది. కొన్నిగంటలకు దేవగిరి సైన్యానికి ఎటువంటి సహాయం అందకుండా తెలుగు చోడ సైన్యాలు ఆవల వైపు పూర్తిగా దిగ్బంధనం చేసినట్లు గుర్తించింది.

అప్పుడిక నందరాయడు తన సైన్యాన్ని వెనక్కు యుద్ధ భూమినుండి స్కంధావారానికి పంపాడు.

దేవగిరి సైన్యంలో చచ్చినవారు చావగా మిగిలిన క్షతగాత్రులకు వైద్యం లభించడంలేదు. మందులు, వైద్యులు.. ఏమీ రావడం లేదు. రాత్రికి తిండి అందలేదు. అంతా ఏడుపులు పెడబొబ్బలు.. తిరిగి వెళదామంటే సరిహద్దు పొడవునా శత్రుసైన్యాలు మోహరించి ఉన్నాయి.

సర్వ సైన్యాధ్యక్షునికి వార్త వచ్చింది. మొత్తం అన్ని కోష్టాగారాలు శత్రుసైన్యాలు చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయని.

అక్కడ అనుమకొండలో రుద్రమాంబ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సింఘణదేవుడు, గణపతిదేవుడు చెట్టాపట్టాలు వేసుకుని అన్ని సంప్రదాయసంబరాల్లో బంధు మిత్రులతో ఆడిపాడుతూ ముచ్చట్లలో మునిగితేలుతూ పరవశిస్తున్నారు.

ఇక్కడ యుద్ధభూమిలో పరోక్షయుద్ధం జరుగుతోంది.

దేవగిరి స్కంధావారంలో సైనికులు బయటకు పోకుండా పూర్తిగా దిగ్బంధనం చేసింది తెలుగుచోడ సైన్యం. బయటకు వచ్చిన ఓ సైనికుడిని ఖండఖండా లుగా నరికి లోపలికి విసిరేశారు. ఆకలి యుద్ధం చేస్తూ.. అంతా లోపల లోపలే.. కుళ్లిపోతున్నారు. దినమూ వందలమంది సైనికులు చచ్చిపోతున్నారు.

కరవుకాలంలో గంజి కేంద్రాలు కూడా పెట్టకుండా.. పక్క రాజ్యం వాళ్లు ఎక్కడిికి వెళ్లనివ్వ కుండా అడ్డుకున్న పాపం.. ఊరికే పోదు. ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది.

ఇలా మరో మాసం దాటింది. మరికొన్ని వందల సైనికులు పీనుగులై పోయారు.

అక్కడ అనుమకొండలో రుద్రమాంబ వివాహ సంబరాలు ఘనంగా ముగిశాయి. ఆమె అత్తవారికి వెళ్లిపోయింది. మేనమామ సింఘణదేవుడు అపూర్వమైన కానుకలు మేనకోడలు రుద్రమాంబకు అందజేసి, ఆశీర్వదించి దేవగిరికి పయనమయ్యాడు. వివాహానికి హాజరైన బావమరిదికి వీడ్కోలు పలికాడు గణపతిదేవుడు. ఇద్దరూ కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగలించుకుని ఆనందబా²ష్పాలతో వీడ్కోలు తీసుకున్నారు.

 అక్కడ తిక్కభూపాలుడు, తిక్కనామాత్యుని యుద్ధతంత్రాలను తెలుగు చోడరాజులు, పృధ్వీశెట్టి అంకాల తు.చ. తప్పకుండా నిర్వహిస్తున్నారు.

సరిహద్దు ఆవల ఈవల ఓ విచిత్ర యుద్ధం జరుగుతోంది.

మధ్యలో తెలుగురాజ్యాలపైకి దండెత్తి వచ్చి కొంతభాగం ఆక్రమించుకున్న దేవగిరి సైన్యానికి తిరిగి తమ రాజ్యానికి వెళ్లడం ఎలాగో ఇప్పుడు తెలియడం లేదు. అక్రమించుకున్నచోట స్కంధా వారం చుట్టూ శత్రుసైన్యం చుట్టు ముట్టి బయటకు వెళ్లనివ్వడం లేదు. బహిర్భూమికి వెళ్లాలని యత్నించిన ఓ సైనికుడిని ఖండఖండాలుగా నరికేసి కాకులకు గద్దలకు వేశారు. స్కంధావారం నిండా పెంటలు, మూత్రం .. వాసనా.. కంపు. దానితోనే కొందరు వాతులు చేసుకుని చనిపోయారు.

బయట సరిహద్దు ఆవల ప్రతి పట్టణంలోనూ ప్రముఖ వణిజశెట్టి కోష్టాగారాలు ఉన్నాయి. వాటికి కూడా చుట్టు ముట్టి.. కత్తి కాదు గదా.. కత్తికి సానపెట్టుకొనే రాయి కూడా బయటకు రాకుండా మూసేయించారు. ఇక పరిస్థితి తెలుసుకుని దూరం నుండి సహాయంగా వస్తోన్న సైన్యాన్ని.. ఆమడ దూరంగానే ఎదుర్కుంటున్నాయి పాకనాడు సైనిక దళాలు.

నెల్లూరు నుంచి యుద్ధాన్ని సమన్వయపరుస్తున్న తిక్కభూపాలుడు, తిక్కనామాత్యుడు, అంకాలశెట్టి అనుమకొండకు వర్తమానం పంపారు.

“అన్ని మన అధీనంలోనే ఉన్నాయి. యుద్ధ తంత్రం రెండవ దశ నిర్వహించబోతున్నాము.” అని.

* * * *

కంపిలి నగరం, సిద్దప్పరుసుశెట్టి భవంతి..

అర్ధరాత్రి కావస్తోంది.

భవంతి పైఅంతర్వు నుంచి అంతా కలయ చూస్తోంది బాల కవ్వలాబాయి. దుర్గంధాన్ని భరించలేక కప్పుకున్న శాలువాతో ముక్కు మూసుకుని ఉంది.

ఆరునెలలుగా నగరమంతా యుద్ధ వాతావరణం. వీధులన్నీ భయంకరమైన వాసన. సైనికుల శవాలు బయట పడేయడంవల్ల అవి కుళ్లిన వాసన కలగలిసిన దారుణం. యుద్ధ వాతావరణం ఆ పరిసరాలను, సైన్యం విడిది చేసిన స్కంధా వారాలను, ఆ చుట్టుప్రక్కల గ్రామాఇందులోలనే కాదు.. మొత్తంగా ఆ రాజ్యాన్నే అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా కోష్టాగారాలను శత్రుసేనలు దిగ్భంధనం చేసి ఆక్రమించుకున్నాయి. కోష్టా గారాలను దిగ్బంధనం చేయడం ఎప్పుడూ వినలేదు. అంటే సైనికులను కత్తులతో కాక ఆకలితో అలమటించేలా చేసి చంపడమే.

ప్రస్తుతం శెట్టి భవంతిలో కూడా శెట్టి కుటుంబ సభ్యులు పదిమందితోపాటు దాదాపు వందమంది ఉద్యోగులు, పరిచారికలు, సేవకులు, బానిసలు ఉన్నారు. వారంతా కూడా ఆకలితో నకనకలాడు తున్నారు.

సరిహద్దు వెంబడి ఉన్న అన్ని పట్టణాలలోని కోష్టాగారాలను దిగ్బంధనం చేసిన వెల్లూరు పాలకుడు గంగయ అనే కేయూరదేవుడు కంపిలిలోనే తిష్ఠŸ్టవేసుకుని కూర్చున్నాడు.

‘రాజ్యాల గొడవలు మాకు తెలియదు. పృధ్వీశెట్టి మాటను చప్పన్న రాజ్యాల్లో వణిజులు, వాణిజ్య శ్రేణులు జవదాటడానికి లేదు. ఆయన మాట దాటితే నాకు భవిష్యత్తు ఉండదు. ప్రపంచ వణిజులంతా నన్ను వర్తకం నుంచి బహిష్కరిస్తారు..” అని భయ పడుతూ కవ్వలాబాయితో చెప్పాడు సిద్దప్పరుసుశెట్టి.

మూగబోయింది కవ్వలాబాయి.

ఇప్పుడు సిద్దప్పరుసుశెట్టి కూడా ఆకలితో నకనకలాడుతున్నాడు.

రెండురోజులుగా ఒక ఆలోచన ఆమెను అతలాకుతలం చేస్తోంది. దగ్గరలో స్కంధావారంలో ఉన్న తన భర్త.. కేయూరను కలిసి బతిమిలాడితే కనీసం తినడానికయినా కొన్ని వస్తువులు లభిస్తాయి. యుద్ధానికి ముగింపు ఏవిటి? ఎప్పుడు? అని ఆతనిని నిలదీయవచ్చు. తనతో ఎన్నో ముచ్చట్లు చెప్పిన కేయూర తిరిగి రాజ్యానికి వెళ్లగానే ఆ కాకతీయుడి పాదాలు నాకుతున్నాడు కాబట్టి దూరంగానే ఉంచింది కాని ఇప్పుడు క్షుద్బాధ!!

తెలుగుచోడ రాజ్యాలను ఆక్రమించడానికి అనుజ్ఞ ఇచ్చిన సింఘణదేవుడు తెలివిగా కాకతీయుడి కూతురు వివాహానికి హాజరయ్యాడు. ‘వాడు ఏడవలేక నవ్వే దృశ్యాన్ని తనివితీరా చూడాలని వెళుతున్నా’నని తనకు వర్తమానం పంపాడు. కానీ ఆ కాకతీయుడు తక్కువ తిన్నాడా! తమపైకి సైన్యంతో పాటు పృధ్వీ సెట్టిని కూడా ప్రయోగించాడు. వాడు వణిజశ్రేణి సభ్యులందరినీ నియంత్రించాడు. అన్ని కోష్టా గారాలను దిగ్బంధించి తిండికి లేకుండా చేశాడు.

కేయూరదేవుడు కంపిలి స్కంధావారంలోనే ఉన్నట్లు సమాచారముంది. అదొక్కటే తనకు ఆశాదీపం.

అప్పటికప్పుడు గుర్రాన్ని ఏర్పాటు చేసుకుని ఒంటరిగా శత్రుసైన్యం ఉన్న స్కంధావారం వైపు వెళ్లింది. దారిలో వీధులన్నీ మళ్లీ కరవు వచ్చినట్లు భయంకరంగా ఉన్నాయి. దారంతా శవాలు.. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, కోళ్లు, ఎలుకల కళేబరాలు.. దుర్గంధం..

మనసు చెబుతోంది.. అందుకు కారణం నువ్వే అంటోంది.

‘నీ కక్షతో ఆ కాకతీయుడిని ఏమీ చేయలేక పోతున్నావు కానీ సామాన్య మానవులను చంపేస్తున్నావు కదా..’

కళ్లు మూసుకుని గుర్రపు వేగాన్ని పెంచింది. అప్పుడప్పుడు నడుము వద్ద దాచుకున్న చురకను తడుము తోంది చేతితో.

స్కంధావారం చేరింది. బహు విశాలంగా కనిపిస్తోంది అది.

దూరంగా గుర్రంపై మహిళ కనిపించగానే రక్షణ సైనికులు పరుగున వచ్చి గుర్రాన్ని పట్టి ఆపేశారు.

ముసుగు తీసి చెప్పింది, “కేయూరా.. గంగయదేవుల ధర్మపత్ని కవ్వలాబాయి వచ్చిందని చెప్పండి వారికి..”

సందేహంగా చూస్తూనే లోపలికి ఒకరు పరుగుపెట్టగా ఇద్దరు ఆమె వద్దనే ఉన్నారు.

చివ్వున స్వయంగా వేగంగా బయటకు వచ్చాడు కేయూర.

“ఇదేవిటి మహారాణి.. ఇది యుద్ధŠ్దభూమి. ఇక్కడికి ఎందుకు వచ్చారు..?” అన్న ప్రశ్నకు జవాబివ్వకుండా లోపలికి వెళ్లసాగింది. తన ప్రత్యేక గోల్లెనకు దారి చూపాడు. లోపలికి వెళ్లగానే చటుక్కున తమకంగా అతనిని హత్తుకుంది కవ్వల. ఆ పరిష్వంగాన్ని మరింత దగ్గర చేసుకున్నాడు కేయూర.

కాసేపటికి ఆమెను విడివడి ఓ పల్యంకంపై కూర్చోబెట్టాడు.

“ఏవిటి.. చిక్కి శల్యమయ్యారు దేవిగారు?”

మూడు పూటలా మూడు ముద్దలు తిని మూడు వారాలయ్యింది అనలేదు కవ్వల. తమరి మీద బెంగతో.. అనబోయింది కానీ అనలేకపోయింది. ఆమె పరిస్థితి గ్రహించాడు కాబోలు చప్పట్లు కొట్టి బయటున్న సైనికుడిని పిలిచి పళ్లెరం నిండా వరి అన్నం, రెండుమూడు వ్యంజనాలతో తెప్పించి ఆమెకు అందించాడు.

“ముందు కాస్త ఎంగిలి పడు. తర్వాత మాట్లాడు కుందాం.”

అందుకుని గబగబా కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు చేసి గబగబా తిన్నది. మళ్లీ ముద్దలు కలుపుకుంటోంది.

అప్పుడే గొల్లెన వద్ద కలకలం.. ఎవరో ముఖ్యులు వచ్చినట్లు.

ఇద్దరూ ఆశ్చర్యంగా చెవులు రిక్కించి విన్నారు. సైనికులు గోలగోలగా పరుగులు పెడుతున్నారు.

“మహారాజు”..

“మండలేశ్వరులు”..

“మహామండలేశ్వరులు..”

కంగారుగా కదిలాడు కేయూర. నోటివద్దకెళ్లిన ముద్ద పళ్లేరంలో వదిలేసి చివ్వున లేచింది కవ్వల.

ఇద్దరికి ఒకటే భావన.. వచ్చినవాడు మహామండ లేశ్వరుడు గణపతిదేవుడు కాదు కదా..

ఊహాతీతమైన పరిస్థితి! చటుక్కున పళ్లెరం క్రిందపెట్టి వెనక్కు గొల్లెన చాటుకు పరుగు తీసింది బాలకవ్వల.

సాక్షాతూ మన్మహామండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులుంగారు ఆ గోల్లెనలోకి అడుగుపెట్టారు.

బయట పూర్తిగా నిశ్శబ్దం. కాకతీయ మహా మండలేశ్వరుల అంగరక్షకులైన లెంకల బృందం మొత్తం స్కంధావారాన్ని స్వాధీనం చేసుకుంటారు. చీమ చిటుక్కుమనకూడదు.

కేయూర గందరగోళమైపోతున్నాడు. బిక్కచచ్చి పోయాడు. ఆయనను చంపడానికి ముప్పై ఏళ్లుగా పగబట్టి ఎదురుచూస్తున్న ఓ ఆడది ఇప్పుడు ఇక్కడే ఉంది.

బాలకవ్వల, గణపతిదేవుడు.. ముప్పై ఏళ్ల తర్వాత ఎదురు కాబోతున్నారు. ఆమె పగబట్టి ఉంది. ఆకలితో నకనకలాడుతోంది. తింటున్న పళ్లెరం అక్కడే ఉంది. ఆమె గొల్లెన వెనుక ఉంది. ఆయన అంగరక్షకులు అణువణువూ గాలిస్తారు. చీకటిలో ఉన్న ఆమె.. వాళ్లకు కనిపిస్తే ఖండఖండాలుగా నరికేస్తారు.

ఓ దేవుడా ఇప్పుడేవిటి దారి??

“ఊ.. ఏమి కేయూరా.. క్షమించాలి గంగయ దేవా. హహ్హహ్హా.. తమరిని ఏ పేరుతో సంబోధించాలి? హహాహ్హాహా..”

ఆయన ముందు కొచ్చి వంగి వంగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు కేయూర.

యుద్ధ విజయాలు మహారాజులను స్వర్గంలో విహరింపజేస్తాయి. ఆ ఆనందపు విరాట్ విశ్వరూపం గణపతిదేవునిలో వీరవిహారం చేస్తోంది. శరీరమంతా విజయ భావనలతో కలిగిన చిరుకంపన.. మాటి మాటికి చేయి మీసం మీదికి వెళుతోంది.

“మహాప్రభూ..! అది.. అది తమరి ఇష్టం దేవా. మీరు నా దైవస్వరూపులు. మీరు ఏ పేరుతో పిలిచినా నాకు తన్మయమే దేవా..”

చెబుతున్నాడు కానీ ముఖంలో నవ్వులేదు.. రావడంలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాడు కేయూర. అదేదో గుర్తించినట్లు ఆశ్చర్యంగా అన్నాడు గణపతిదేవుడు.

“ఏమి.. చమటలు..? ఏమైంది కేయూరా??”

అప్పుడే ఊహించనిది జరిగింది.

(సశేషం)

మత్తి భానుమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE