భానువారం. అలుపెరగని ఈ జీవన ప్రయాణంలో ఉద్యోగి ఒడలికి కాస్త బడలిక తీరే రోజు.
తొలిసంధ్య వేళ రాఘవాచార్యులు సంధ్యా వందనం ముగించి వసారాలో మడత కుర్చీలో కూర్చోని కాలాన్ని కరిగించడానికి దినపత్రికని నిదానంగా చదువుతున్నాడు.
‘‘ఏవండీ కాఫీ’’ అంటూ చేతికి అందించింది భార్య జానకి.
* * *
రాఘవాచార్యులు పాత తరానికి ప్రతినిధి. నడుస్తున్న తరానికి ఓ సాక్షి. కొత్త తరానికి వారధి.
త్రికాల సంధ్యలు క్రమం తప్పకుండా పాటిస్తాడు. వేకువజాము నడక, మితమైన ఆహారం, మితభాషి. నాలుగు వేదాలు ఔపోసన పట్టిన చతుర్వేది. ఇంచు మించు ఆరడుగుల ఆజానబాహుడు. విశాలమైన నుదురు, నుదుటికి ఎప్పుడూ ఉండే ఊర్ధ్వపుండ్రం. మనిషి మాటలోనూ నడతలోనూ దైవత్వం ఉట్టిపడుతుంది.
రాఘవాచార్యుల గతమెంతో ఘనకీర్తి. తాత ముత్తాతల గొప్పదనాలు గోడమీదకి పటాలుగా చేరాయి. నూనూగు మీసాల వయసులో కుటుంబ భారాన్ని పైన వేసుకుని… ఇంకా ఎంతో చదవాలని ఉన్నా ఆ ఆశని వదిలి చదివిన చదువుకి వచ్చిన కోర్టు గుమస్తా ఉద్యోగంలో చేరాడు.
మన అనుకునే వాళ్లు ఏ సాయానికి ముందుకు రాకపోయినా గుచ్చి గుచ్చి అడిగేవారు ‘‘గుమస్తా గిరి చేస్తున్నావా?’’ అని. విద్యతో వచ్చిన జ్ఞానం వయసుకు మించి వచ్చిన ఓర్పుతో ఓ చిరునవ్వు నవ్వి నిష్క్రమించేవాడు. మేనమామ మాత్రం తనకి అంత స్తోమత లేకపోయినా అవసరానికి వీలైన సహాయం చేసేవాడు. అందుకేనేమో మేనరికం వద్దన్నా మేనమామ కూతురు జానకిని అర్ధాంగిగా చేసుకున్నాడు. జానకి అందం అణుకువ కలగలిపిన బాపుగారి బొమ్మలా ఉంటుంది. స్కూలు విద్యతో ఆపేసింది.
‘‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’’ నినాదం బాగా మనసుకి చేరి ఒక్క సంతానంతోనే ఆపేశారు. కాలానికి అనుగుణంగా కొడుకుకి ‘‘మాధవ్‌’’ అని నామకరణం చేశారు
* * *
జానకి భర్తకి కాఫీ అందించి తను ఓ కప్పు తీసుకుని అరుగుమీద కూర్చుంది. ఆమె కూర్చునే భంగిమ చూసి మనసులో అనుకున్నాడు ‘‘ఏదో కోరిక కోరబోతుంది అని’’
‘‘ఏమేవ్‌ ‌మన మాధవ్‌ ఎక్కడ?’’ అని జానకిని అడిగాడు.
‘‘వాడు ఆటల్లో ఉన్నాడు అండి’’ అంటూ భర్త మనసెరిగిన జానకి నిదానంగా విషయానికి వచ్చింది.‘‘ఏమండీ! మన మాధవ్‌కి ఇప్పుడు ఎనిమిదేళ్లు వచ్చాయి…’’ అంటూ భర్త వైపు చూసింది. భర్త ముఖంలో ఏ మార్పు… ఆసక్తి లేకపోయేసరికి స్వరం పెంచి ‘‘ఏమండీ… మన మాధవ్‌కి ఇప్పుడు ఎనిమిదేళ్లు వచ్చాయి..!’’
తనకి తెలుసు భార్య ఇంకా ఏమి చెప్పబోతుందో. ఐనా ముభావంగా అడిగాడు ‘‘ఐతే…?’’.
జానకికి ఓర్పు కాస్త సడలి చిరుకోపంతో ‘‘మీకు తెలియదా…?… ఇప్పుడు ఏమి చేయాలో..? అది కూడా నా నోటినుండే చెప్పించాలా?
ఇహ తప్పదన్నట్టు ఖాళీ కాఫీ గ్లాసుని పక్కన పెడుతూ….’’ నాకు తెలుసే, వాడికి ఏడేళ్లు నిండి ఎనిమిదో ఏడు. ఇప్పుడు ఉపనయనం చేయాలి అంతే కదా?’’.
‘‘మరి అంతా తెలిసి దానిగురించి ఆలో చించరేం?’’
‘‘చూడు జానకీ! దానికి యజ్ఞోపవీతం ఒక్కటే సరిపోదు కదా? ఎంత తంతో నీకూ తెలుసు! ఒక పెళ్లికి అయ్యేంత ఖర్చు. అందుకే మౌనంగా ఉన్నాను’’. కాస్త ఆగి ఓ నిట్టూర్పుతో ‘‘నేనా చిరుద్యోగిని …పైసా పైసా కూడబెడుతున్నది వాడి చదువు కోసం. నా పరిస్థితి వాడికి రాకూడదు. అందుకే ఒక వైపు ఇన్సూరెన్స్ ‌కడుతున్నాను. నాకేమైన.. జరిగితే…’’. అని పూర్తి చేసేలోపు జానకి తన చేతిని భర్త నోటికి అడ్డం పెట్టి, ‘‘ఆపండి శుభవిషయానికొస్తే అశుభ మాటలు..’.అంటూ గదమాయించింది.
భర్త ఆలోచనని అర్థం చేసుకున్న జానకి… లాలనగా అడిగింది ‘‘మరేం చేద్దామనుకున్నారు?’’ అని.
‘‘ఇంకా ఏమనుకోలేదు… ఆలోచిస్తున్నా!’’. అని మనసులో ఉన్న తన ఆలోచనని బయటకు రానీయకుండా నిట్టూర్పుగా అన్నాడు.
జానకి వెంటనే ‘‘ఏమండీ మీరేమి కోపగించు కోరంటే నాదో సలహా!’’
‘‘నేనెందుకు కోపగించుకుంటాను? చెప్పు’’
‘‘మరేమీ లేదండీ… వచ్చే నెల రామాలయంలో సామూహిక ఉపనయనం చేస్తున్నారట. కాస్త సంభావన, వస్త్రాల ఖర్చు మాత్రమే మనం భరించాలి అంతే. మిగతాదంతా ఆలయ కమిటీ చూసుకుంటుం దంట. మనము మన మాధవ్‌ ‌పేరు ఇద్దామంటరా?’’ అని చెప్పాల్సిన విషయం చెప్పి ‘‘అయినా మీ ఇష్టం’’ అంటూ కొసమెరుపుగా తగిలించింది.
‘‘ఈ విషయం నీకు ఎలా చెప్పాలా…ఎలా ఒప్పించాలా..అని మనసులో తర్జనభర్జన… పడు తున్నాను. ఇంకేముంది.. అంతా నీ ఇష్టమే… ఆ… రాములువారి అనుగ్రహం మనమీద ఉంది కాబట్టి ఈ భారాన్ని ఇలా గట్టెక్కిస్తున్నాడు’’ అని మనసులోని బరువుని దింపి చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు. మనస్సులో భక్తితో రాముని స్మరించుకున్నాడు.
అలా…ప్రతి ఆపదలోను నమ్మిన దైవం మనిషి రూపంలో …మరో రూపంలోనో గట్టెక్కించేది.. దానికి తోడు అన్నీ అర్థ్ధం చేసుకునే భార్య …చెప్పిన మాట వినే పిల్లాడు. ప్రశాంత జీవితం అంటే ఇదేనేమో!.
కాలం పరుగులు తీస్తూనే ఉంది. వయసుతో బాటు వేదన కూడిన శ్రమతో ఇద్దరి ఆరోగ్యంక్షీణిస్తోంది. జానకి ఆరోగ్యం ఇంకా ఎక్కువగా క్షీణిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అవ్వాలన్న ఆశ వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయనివ్వలేదు. మందులకు పెట్టే ఖర్చులు చదువుకి ఆటంకం కాకూడదు అని.
ఇప్పుడు మాధవ్‌ ‌పెరిగి పెద్దయి, ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ ‌పాసయ్యాడు. అన్నీ అనుకూ లించాయి. పేరుగాంచిన బహుళ జాతీయ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం. రాఘవాచార్యులు, జానకిల సంతోషం అంబరాన్ని అంటింది. కానీ వెంటనే పెళ్లి విషయం వచ్చేసరికి సంతోషం ఆవిరి అయిపోయింది. అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి ‘‘మాధురి’’తో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి తతంగం ముగించారు. పెళ్లైన వెంటనే కొడుకు, కోడలు అమెరికా వెళ్లిపోయారు. ఏదైతేనేం ఓ బాధ్యత తీరినందుకు వారి మనసుకు కాస్త ఊరట.
కొడుకు ప్రయోజకుడు అయ్యాడన్న ఆనందం కంటే ఎన్నో యోజనాలు దూరంగా వెళ్లాడు అన్న బాధే ఎక్కవగా ఉండేది. మాధవ్‌ ‌మాత్రం తన ఎదుగుదలే చూసుకున్నాడు. కొడుకు కోడలు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. రాఘవాచార్యులు జానకిలు తాతయ్య నాన్నమ్మలు అయ్యారు. మనవడి పేరు మహేష్‌. ‌వయసు అంకెలు రాఘవాచార్యులుకి ఉద్యోగ విరమణ తెచ్చాయి దాంతో ఇంట్లో, మనసులో తెలియని నిశ్శబ్దం ఆవహించింది.
మాధవ్‌ ‌మొదట్లో తల్లితండ్రులను తనతో తీసుకెళ్లాలి అన్న ప్రయత్నం మాత్రం ఫలించలేదు. కొన్నాళ్లు గడిచాయి. మనిషి ఆశలు.. అంతస్తులు పెరిగాయి. ఆలోచనా పరిధి మారింది. ఒకప్పటి ఆచారాలు ఇప్పుడు అపచారాలు అయ్యాయి. నేటి సాంకేతిక అడవిలో మనుషులు మర మనుషులు అయ్యారు. కాలం ఇవేమీ పట్టించుకోకుండా… పరిగెడుతూనే ఉంది.
మనవడికి ఆలనా పాలనా అంతా ఆయాల చేతుల మీదే. వాళ్ల అవసరాలకు సెలవులకు ఈ దేశం వచ్చేటప్పుడు ఏదో అరపేరకొర అవకాశం జానకికి వచ్చేది. తనివితీరా మనవడితో ఊసులు ఆడే అవకాశం లేక ఆ బాధని తనలోనే దిగమింగు కుంది. దూరం ఎప్పుడూ మనసుకి భారమే.
ఇప్పటి అంతర్జాల కాలంలో అంతరాలు ఇంకా పెరిగాయి. మనవడు ఇప్పుడు ఎనిమిదో ఏట అడుగు పెట్టాడు. మనసుని ఎంత స్వాంతన పరిచినా జానకికి మనవడి ఉపనయనం పైనే ధ్యాస. కనీసం ఇదొక్కటి తన కళ్ల ముందు జరగాలని. ఎందుకంటే అప్పుడు కొడుకుకి స్తోమత లేక సామూహికంగా చేసేసారు. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. భర్తతో చెప్పింది తన మనసు గోడు ‘‘ఏవండీ మనవడి ఉపనయనం చేయాలి . వాళ్లని ఇక్కడకు రమ్మనండి ..లేదా మనమే అక్కడకు వెళ్దాం’’
‘‘ఏదో పని ఉందని ఈ ఏడు ఎలాను ఇక్కడికే వస్తున్నారు. పనిలో పని నీ ముచ్చట తీరుతుంది’’ అని చెప్పి భార్యని స్థిమిత పరిచాడు రాఘవా చార్యులు. కానీ…మనసులో ఏదో తెలియని అనుమానం. కొడుకు కోడలు ఇష్టాలు ఏమిటా అని! ఎందుకంటే అన్నీ మొక్కుబడి మాటలే. ఎక్కువగా మాటలు పెదాల నుంచే వచ్చేవి.ఏ మాట ఎద లోతుల్లోనుంచి వచ్చేది కాదు. అందుకే తన మాట చెల్లుతుందా? అని ఓ అనుమానం.
కొడుకు కోడలు మనవడు వచ్చే రోజు రానే వచ్చింది. వయసు అంత సహకరించపోయినా మనోల్లాసంతో జానకి వేకువజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కొడుకుకి ఇష్టం అని నానేసిన మినపప్పు రుబ్బి పాకం గారెలు చేసింది. కొడుకు అప్పటి ఇష్టాలు తెలుసు. కానీ మనవడి ఇష్టాలే తెలీదు. తెలుసుకునే అవకాశం రాలేదు .
రాఘవాచార్యులు కొడుకు వద్దన్నా విమానా శ్రయానికి వెళ్లాడు. కాస్త చూపు మందగించినా, రక్తసంబంధం దూరం నుంచే పసిగట్టేసింది. మనవడు ‘‘గ్రాండ్‌ ‌ఫా’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. రాఘవాచార్యుల ఆనందం అనంతం. ‘నేను తాతయ్యను రా’ అంటూ మనవడిని ముద్దులతో ముంచేశాడు. అందరూ ఇంటికి చేరారు. గుమ్మంలో ఎదురుచూస్తున్న జానకి వాళ్లకి దిష్టి తీసి లోపలకి సాగనంపింది.
సాయం సంధ్య వేళ ప్రయాణ బడలిక తీర్చుకుని కొడుకు కోడలు మనవడు హాల్లోకి వచ్చారు.
జానకి కాఫీ చేసి అందరికీ ఇచ్చింది. మనవడికి హార్లిక్స్ ‌కలిపి తాగించింది. మనవడిని తన ఒడిలోకి తీసుకుని వాడి ముద్దుముద్దు తెలుగు మాటలకు మురిసిపోతూ తన మనసులో మాటని బయట పెట్టింది జానకి ‘‘ఒరేయ్‌ ‌కన్నా! నీకు మీ నాన్నకంటే గొప్పగా ఉపనయనం చేయాలి రా!’’
మనవడు ‘‘గ్రాండ్‌ ‌మా ఉపనయనం అంటే ఏంటి…ఎందుకు చేయాలి?’’ అని అమాయకంగా అడిగాడు.
‘‘మీ తాతయ్య నీకు చాలా చక్కగా వివరించి చెబుతారు. అడుగు బాబూ! ’’అంటూ మనవడిని రాఘవాచార్యులు వద్దకు పంపి ‘‘ఏవండీ వాడి సందేహం తీర్చండి’’ అని చెప్పింది .
రాఘవాచార్యులు చిరునవ్వు నవ్వి ‘‘ రారా ఇలా’’ అని మనవడిని తొడలపై కూర్చోబెట్టుకుని ‘‘నీకు ఇప్పుడు ఏడేళ్లు అదే సెవెన్‌ ఇయర్స్ ‌కంప్లీట్‌ అయ్యాయి. ఉపనయనం చేయాలి. అంటే నీకు జంధ్యం.. శాక్రెడ్‌ ‌త్రెడ్‌ ‌వేయడం. అది మన ఇంటి సంప్రదాయం..ట్రడిషన్‌. ‌మన ఉనికి, అస్తిత్వానికి ప్రతీక. అవర్‌ ‌రూట్స్, ‌సింబలైజింగ్‌ అవర్‌ ‌ప్రెజెన్స్ అం‌డ్‌ ఎగ్జిస్టెన్స్. ఉపనయనం వేదాలతో, విజ్ఞానంతో సంబంధం కలిగించే గొప్ప పక్రియ. గ్రేట్‌ ‌ప్రాసెస్‌ ఆఫ్‌ ‌రిలేటింగ్‌ ‌టు వేదాస్‌. ఇది కేవలం సంప్రదాయం కాదు, మన శాస్త్రీయ విజ్ఞానానికి, సనాతన ధర్మానికి మార్గ దర్శనం బాబూ. ఇట్‌ ఈస్‌ ‌సైంటిఫిక్‌ ‌నాలెడ్జ్ ‌విత్‌ అర్తోడొక్స్… ‌పెద్దయ్యాక నీకే తెలుస్తుంది.’’
జానకి లేచి మనవడిని తల మీద చేతితో తడుముతూ కొడుకుని ఉద్దేశించి ‘‘ఒరేయ్‌ ‌వధవ చిన్నప్పుడు నీకు ఉపనయనం చెయ్యడానికి అప్పట్లో అంత స్తోమత లేక ఏదో అలా కానిచ్చేసాం. ఇప్పుడు మనకి ఆ దేవుని దయవలన అన్నీ ఉన్నాయి. ఎలానూ వీడికి ఏడేళ్లు నిండాయి. సమయానికి మీరందరూ ఇండియా వచ్చారు. ముహూర్తం చూసి మీరు వెళ్లే లోపు ఆ ఉపనయనం చేసేద్దాము రా.!’’ అంటూ కొడుకు సమాధానం కోసం ఎదురు చూడకుండా ‘‘మీరేమంటారు?’’ అని రాఘవా చార్యులు వైపు చూసింది.
విమానాశ్రయంలో తనని కోడలు పలకరించిన తీరు గుర్తొచ్చి ‘‘నువ్వు చెప్పింది బాగుంది… కానీ వాడు, కోడలు ఆలోచించుకోని’’ అంటూ కొడుకు వైపు చూసి ఒరేయ్‌ ‌మాధవ ‘‘నువ్వేమంటావ్‌ ‌రా?’’
జానకి మధ్యలో కలుగజేసుకుని ‘‘దీంట్లో ఆలోచించడానికి ఏముందండీ..? ఎలాగూ చెయ్యాలి కదా ఇప్పుడు చేసేద్దాము అంతే! మీరు ముహూర్తం ఎప్పుడో చూడండి’’ అంటూ ఆజ్ఞ వేసింది.
ఇంతలో కోడలు కలగజేసుకుని ‘‘అత్తగారూ ఏంటి …అంతా మీ ఇష్టమేనా? మా అభిప్రాయం తెలుసుకోరా?’’ అంటూ ‘‘నువ్వు చెప్పొచ్చు కదా మాధవ్‌ ‌మీ అమ్మకి’’ అంటూ చూపు మాధవ్‌ ‌వైపు తిప్పింది.
ఊహించని కోడలు తీరుకి జానకి స్థాణువై.. కోపం తెచ్చుకోలేక అలానే మౌనంగా ఉండి పోయింది. కళ్లు తెలియకుండానే చెమ్మగిల్లాయి.
రాఘవాచార్యులు పరిస్థితి అర్థం చేసుకుని ‘‘మీ ఇష్టం అమ్మా,!ముందు మీరు వచ్చిన పనులు పూర్తి అయ్యాక తీరిక ఉండే సమయం చెప్తే అప్పుడు మాట్లాడదాం, ఆలోచిద్దాం ఏమి చేయాలో’’
మాధురి వెంటనే కోపంగా ‘‘దీంట్లో మాట్లాడే దేముంది? ఆలోచించేదేముంది? మీవన్నీ పాత పద్ధతులు. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. కాలం మారిపోయింది. ఇప్పుడు ఉపనయనం అనేది అవసరమా? నాకు ససేమిరా ఇష్టం లేదు. వాడికి ఆ వేలాడే దారం ఇబ్బంది. పైగా అందరిలో నామోషీగా ఉంటుంది. వద్దు అంటే వద్దు’’
మాధవ్‌ ఏమీ మాట్లాడలేకపోయాడు. కోడలి ఆలోచనకు కోపం వచ్చినా కొడుకు ఏమీ మాట్లాడక పోయేసరికి ఏమీ అనాలో పాలుపోలేదు రాఘవా చార్యులకు. జానకిదీ అదే పరిస్థితి. జానకి నియంత్రించుకోలేక కోడలి మీద, మౌనంగా ఉన్న కొడుకు మీద కోపం వచ్చి ‘‘పద్ధతులకు పాత కొత్త ఉండదు. ఇది మన కుటుంబ ఆచారం. చదువుకున్న దానివి. ఉపనయనం, ద్విజులు అంటే తెలీదా? అయినా మన సంప్రదాయం మనకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? దీంట్లో నామోషీ చెందేది ఏమీ లేదు. పద్ధతులు తెలియక పోతే తెలుసుకోండి అంతే కాని ఇలా అధునాతనం అని సనాతనాన్ని గంగలో కలిపేయ కండి’’ ఆగి కొడుకు వైపు చూస్తూ ‘‘ఏరా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నావేమిటిరా? నీకు తెలుసుకదా? చెప్పి ఒప్పించడం తెలీదా?’’
తను ఎప్పుడూ చూడని కోపంతో జానకి కొడుకుని కోడలికి ఇలా చీవాట్లు పెట్టడం చూసి ఆశ్చర్యం వేసింది రాఘవాచార్యులకు. అయినా ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టం లేక మనవడి అవస్థ చూసి ‘‘జానకీ! ఇంక ఆపు.తల తిరుగుతుంది నువ్వు వెళ్లి కాస్త కాఫీ కలిపి తీసుకు రా! మనవడుని కూడా లోపలికి తీసుకెళ్లు’’ అంటూ అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశాడు.
కానీ కోడలు కోపంగా ‘‘వాడు ఇక్కడే ఉంటాడు’’ అని పిల్లాడిని చేయి పట్టుకుని జోరుగా లాగింది. పిల్లాడు ముందుకు పడబోయి తమాయించు కున్నాడు. ఇంకా కోపంతో మాధవ్‌ ‌వైపు చూస్తూ ‘‘అయినా నన్ను ఇలా తిట్టించాలనే కదా మీ ప్లాన్‌. ‌డైరెక్ట్‌గా మా అమ్మ వాళ్ల ఊరు వెళ్దాం అన్నాను. కానీ నా మాట వినక ఈ కొంపకి తీసుకువచ్చారు’’ అంటూ అత్తమామల మీద, మాధవ్‌ ‌మీద రుస రుస లాడింది.
రాఘవాచార్యులు ‘‘వదిలేయ్‌ అమ్మాయి ఆ విషయం. మీరు వచ్చిన పని కానీయండి. మీకు ఇష్టం లేకపోతే వద్దులే. మీ అత్త ఏదో పిచ్చిది. అప్పట్లో డబ్బులు లేక వీడికి ఉపనయనం ఏదో గుంపులో గోవిందలా కానిచ్చేసాం. ఇప్పుడు డబ్బుకు ఏ లోటూలేదు. అందుకే దాని ముచ్చట తీరుతుందని ఏదో ఆశతో చేద్దాం అంది. ఎలానూ చేయాల్సిన తంతు కదా అని. పిల్లాడి వయసు మీరితే కుదరదు’’
‘‘ఒంటి మీద దారం పోగులు వేయడం ఓ సంప్రదాయం, పైగా వేయడానికి పెద్ద ఖర్చు..’’
ఆమె మాటకు రాఘవాచార్యులు వచ్చిన కోపాన్ని పంటికింద అణుచుకుని ‘‘చూడమ్మాయ్‌.. ‌మీకు ఇష్టం లేకపోతే లేదు. కానీ కుటుంబ పద్ధతులను, సనాతన ఆచారాలని, ధర్మాలను తక్కువచేసి మాట్లాడకూడదు. ఈ దేశంలో పుట్టి పెరిగావు పైగా చదువుకున్నావ్‌. ‌పాటించడం సంగతి అటువైపు ఉంచు కానీ ఈ దేశ హైందవ సంస్కృతి తెలుసుకోవడం భారతీ యురాలుగా కనీస ధర్మం. నువ్వు అన్నట్టు దారం పోగులు కావు.. దారంతో చేసిన యజ్ణోపవీతం పరమ పవిత్రమైనది. దారాల పోగులు ఆత్మ స్థితులను, గుణాలను తెలియజేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు రుషి ఋణం, పితృరుణం, దేవరుణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది. పైగా ఉపనయనం వాడికి అర్హతను తెచ్చిపెడుతుంది’’
అంతా విన్నాక ‘‘మరి మీ అబ్బాయి ఏమీ అనలేదు ..అంటే నా మాటకు ఓకే అన్నాడు కదా? మరి మీ అబ్బాయికి ఎందుకు నేర్పలేదు ఈ సనాతన… సంస్కృతి’’ అంటూ వ్యంగ్యంగా మాధురి తన మామని నిలదీసింది.
ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ఊహించని ఈ ప్రశ్నకు మాధవ్‌ ఉలిక్కిపడ్డాడు కానీ ఏమీ మాట్లాడలేదు. రాఘవాచార్యులు మాత్రం ‘‘ఔనమ్మా తప్పు నాదే. కొడుకు ప్రయోజకుడు అవ్వాలని చదువు చదువు అంటూ వెంటబడ్డాను.. అల్లారు ముద్దుకి చెడిపోతాడు అని హాస్టల్‌లో ఉంచి చదివించాను. మంచి ఉద్యోగం లక్షల్లో జీతాలు అనే సరికి దేశం దాటుతాను అంటే ఒప్పుకున్నాను. నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అంటే సరే అన్నాను కానీ ఇలా కుటుంబ సాంప్రదాయాలను, మూలాల్ని విస్మరిస్తాడు అనుకోలేదు. ప్రతి తరం వారి సంసృతిని సాంప్రదాయాలను కాపాడితేనే అవి సజీవంగా నిలుస్తాయి’’ తండ్రిని మాధురి అలా అనడం, తండ్రి ఆవేదన చూసి మాధవ్‌ ‌కోపంతో ‘‘మాధురి.. ఇంక నువ్వు ఆపుతావా? లోపలకి వెళ్లు’’ అని గట్టిగా అరిచాడు.
‘‘లోపలికి కాదు ..ఇప్పుడే మనం ఇక్కడి నుండి బయలుదేరాలి. మీరు వస్తారా లేక నన్నే వెళ్లి పోమంటారా’’ అంటూ పిల్లాడిని లాక్కొని బయటకు వెళ్లబోతే మాధవ్‌ ‌భార్యని ఆపి ‘‘అక్కరలేదు అందరం వెళ్దాం’’ అని విసవిసా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. కొంతసేపటికి మాధవ్‌ ‌టాక్సీతో వచ్చాడు. ముగ్గురు బయలుదేరారు. రాఘవా చార్యులు జానకి ఎంత వారించినా వినలేదు.
వాళ్లు వెళ్లిపోతున్న బాధ కంటే రాఘవాచార్యు లుకు తరం మధ్య ఆలోచనా భేదాలు, కొడుకు కోడలి సాంకేతిక ప్రపంచ దృక్పథం, అధునాతనం, ఆచారాలకు సంబంధించిన అభిప్రాయ భిన్నతలు మనసును వేధించాయి. ఆపడం ఇక అనవసరం అనిపించి ‘‘ఒరేయ్‌ ‌నీ ఇష్టం వెళ్తే వెళ్లు. వయసు వచ్చిన కొడుకుకి నేను ఇంతకన్నా ఏమీ చెప్పలేను. నువ్వు మమ్మల్ని ఎదిరించి వెళ్తున్నావు అనుకుంటున్నా వేమో కాదు… నువ్వు నీ మూలాల్ని ఎదిరించి వెళ్తున్నావు. ఎక్కడ ఉన్నా ఒకటి మాత్రం గుర్తుంచుకో సాంప్రదాయం సనాతన ధర్మం అనేది జీవన విధానం, అది కాలానుగుణంగా మలచుకోవడం నేర్పుతుంది. కానీ మన ధర్మం, విజ్ఞానం, ఆచారాల విలువ ఎప్పటికీ ఉంటాయి. వాటిని మరిచిపోకు. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగు. నీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అందులోనే ఉంది’’ అంటూ మనవడిని ఎత్తుకుని గుండెకు గట్టిగా హత్తుకున్నాడు.
ఏమీ తెలియని పసిమనసు ‘‘మీరు మాతో రండి గ్రాండ్‌ ‌ఫా… తాతయ్య’’ అన్న మాటకు రాఘవచార్యు లుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పిల్లాడిని దింపి కండువాతో కళ్లు తుడుచుకున్నాడు.
వాళ్లు వెళ్లాక నోటికి పైట చెంగు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ‘‘ఉదయాన్నే వచ్చిన చుట్టం ఉదయాన్నే వచ్చిన వాన ఉండవు అంటారు..కానీ ఉదయాన్నే వచ్చిన కొడుకు కూడా ఉండడు అని తెలియలేదు .. అంతా నాతలరాత’’.
రాఘవాచార్యులు జానకి భుజం మీద చేయి వేసిలోపలికి తీసుకువెళ్లాడు.
కొడుకు మాధవ్‌ అమెరికా వెళ్లిపోయి మూడు నెలలు అయింది. సాయం సంధ్య. రాఘవాచార్యులు వాలు కుర్చీలో కూర్చుని ఆలోచనలతో శూన్యం లోకి చూస్తూ ఉన్నాడు. ఆలోచనలను చీలుస్తూ గదిలో పురాతనమైన గోడ గడియారం శబ్దం మాత్రం స్పష్టంగా వినపడుతుంది. లోపల భార్య జానకి కాఫీ తీసుకు వచ్చింది.
మాధవ్‌ ‌వెళ్లినప్పుడు నుంచి ఏదో రెండు మూడు సార్లు మొక్కుబడిగా ఫోన్‌ ‌చేశాడు. ఓసారి ఫోన్‌లో ‘‘కన్నవాళ్లను ఇలా అనాథల్లా వదిలేసావు కదరా’’ అని జానకి అంటే ‘‘అక్కడ నాన్న గారిని ఇల్లు అమ్మేసి మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయండి’’ అని అన్నాడు. ‘‘మేము అక్కడికి రాము రా నువ్వే ఇక్కడకు వచ్చేయ్‌’’ అనేసరికి చాలా కోపంగా మాట్లాడాడు ‘‘అక్కడే ముంది ఇక్కడ మంచి దేశం ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడకు వస్తే మీరు మీ ఆలోచనలు మీ సనాతనాలు అన్నీ మారిపోతాయ్‌’’
‘‘ఒరేయ్‌ ‌నువ్వు చూస్తున్నది ఓ మాయా ప్రపంచం. జీవితం అంటే జీవించి ఉండడం కాదు మన అనే నలుగురితో ఆనందంగా జీవించడం. ఎప్పటికీ నీవు అక్కడ పరాయి వాడివే అది మాత్రం గుర్తుంచుకో ’’ అంటూ ఫోన్‌ ‌పెట్టేశాడు.
ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు. వాగ్యుద్ధం తరువాత రాఘవాచార్యులు మనోవేదనతో బాధపడుతున్నాడు. ఎప్పుడో తరాలు నాడు తమ తాతలు కట్టిన ఈ మండువాలోగిలి ఇప్పుడు మాధవ్‌ అమ్మకం పెట్టమన్నాడు. తమను కూడా దేశం దాటమంటున్నాడు. వాడు ఎందుకిలా మారిపోయాడు అని ఆలోచనలో పడ్డాడు.
‘‘ఏంటండీ అదోలా ఉన్నారు ..ఇంకావాడి గురించే ఆలోచిస్తున్నారా?’’
‘‘అవును జానకి..’’
‘‘వాడు మారతాడు లెండి’’
‘‘లేదు జానకి.. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు అంటారు. వీడు మారతాడు అనే ఆశ పోతుంది’’
‘‘కాలం మారుతుంది…వాడిని మారుస్తుంది అని నా ఆశ’’
‘‘ఉహ్‌.. ‌మనం కాలం మారుతుంది అనుకుం టాం. కానీ చూశావా ఆ గోడ గడియారం మాత్రం తనపని తానే చేసుకుంటుంది నేను మా రలేదు. నా పేరు చెప్పి మీరే మారిపోతున్నారు అని చెప్తున్నట్టు ఉంది కదూ’’
జానకి భర్త దగ్గరగా వచ్చి చిన్నపిల్లలా ఆయన ఒడిలో తలపెట్టి ‘‘ఎందుకండీ ఇంత వైరాగ్యం! మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమైపోతారో అని నాకు భయమేస్తుంది’’
‘‘లేదు జానకి, వాడు అమ్మమన్నది ఇల్లు కాదు తరాల సంస్కృతిని, సాంప్రదాయాన్ని. పూర్తిగా ఇక్కడ అస్తిత్వాన్ని ఉనికిని రూపుమాపాలని విదేశీ మోజులో పడి ఇక్కడ తమ తరాల అస్తిత్వాన్ని మర్చిపోతున్నాడు. మార్పు జీవిత ఎదుగుదలలో రావచ్చు కానీ వీళ్లు చేస్తున్నది ఏమిటి? ఎక్కడో డాలర్ల మోజులో పడి మన హైందవ ధర్మాన్ని నియమనిష్టలను మంటగలిపి నియాన్‌ ‌లైట్ల కాంతిలో విలాస భవనాల్లో గడపటమా వీళ్ల సుఖం? వీళ్లు భ్రమ పడుతున్న ఈ జీవితాలు శాశ్వతం కాదు. మండుతున్న అగ్ని కూడా కాసేపటికి ఆవిరి అయిపోవాల్సిందే… అలాగే మధ్యలో వచ్చే ఈ కించెత్‌ ‌భోగాలు కూడా సగంలోనే కూలి పోతాయి. మట్టివాసన పీల్చని మహానగరాల్లో కాలుష్యాన్ని ఎంతకాలమని తాగుతారు. గాలి వేయని కృత్రిమ గాలుల మధ్య ఎంత కాలమని ఊగుతారు. పచ్చని చెట్లు పక్షులు కిలకిల రావాలు, వర్షించే మేఘాలు వీళ్లు ఎప్పుడైనా చూసారా చూడాలనుకున్నా అక్కడ కనిపించవు. వేకువ జామున కోకిల పాటలు, రాత్రులు కీచు రాళ్లు ధ్వనులు వినిపించవు. ఇదా వీళ్లు బతుకుతున్న కంటికి కనిపించని అంబరాల్లో అద్భుతమైన జీవితం. దీన్ని జీవితమందామా?…దీని కోసమా మనం ..మన కడుపు మాడ్చుకున్నాం?’’
‘‘మనమే కదండీ వాడు ప్రయోజకుడు అవ్వాలని కలలు గన్నాం’’
‘‘అవును …కలలు కన్నాము ..వాడి బాగు కోసం ..ఏదో ఉద్యోగం చేసి వాడు కొన్నాళ్లకు ఈ లోగిలి కి వస్తాడు అనుకున్నాను. వాడు అక్కడే ఆ దేశంలో ఉండి పోతాడు అనుకోలేదు. వాడి చదువుకి నేనే కాదే ఈ దేశం కూడా ఖర్చు పెట్టింది. ఏమి జీవితమే మనది …ఆఖరికి మన మనవడితో ముచ్చటగా మూడు గంటలు కూడా తృప్తిగా గడపలేక పోయాం’’
‘‘ఇంకా ఆ విషయం వదిలేయండి. మన బాధ్యత నెరవేర్చాము. ఎక్కడున్నా వాడు సంతోషంగా ఉంటే చాలు’’
‘‘లేదు జానకీ! మనం వాడు ఉన్నతంగా ఎదగడమే మన భాద్యత అనుకున్నాము.. ఇప్పటి తరం ఇంతే లే అనుకుని మనల్ని మనం మోసం చేసుకుని వాడికి మన సంస్కృతి ఆచారాలు పూర్తిగా నేర్పలేక పోయాం. భారతీయ సంస్కృతి తరతరాలుగా ధర్మం, ఆచారాలు, శాస్త్రాలు, విజ్ఞాన సంపదను పరిరక్షిస్తూ ముందుకు సాగిపోవడానికి వారే నే వారధులు…జీవన వారధులు బహుశా నేను సరిగా నిర్మించలేకపోయానేమో. తప్పు మనది కూడా జానకీ•’’
‘‘హర్షించాల్సిన సమయంలో తప్పొప్పులు ఎందుకులేండి’’ నిట్టూరుస్తూ అంది.
‘‘ఆకలితో అలమటించలేని అభాగ్యుల్లేని ఆ దేశంలో ఆస్తులు కూడపెట్టుకుని అర్ధాంతరంగా మాయమవడాన్ని మనం హర్షిద్దామా జానకీ? ఇది నా ఆవేదన మాత్రమే. వాడొక్కడినే ఉద్దేశించి అన్న మాటలు కావు. నేడు నా దేశం నుండి వలసలు పోతున్న మాధవ్‌ ‌లాంటి యువత గురించి, మనలాగే వారి తల్లి తండ్రులు పడే వేదన గురించి. పెద్ద చదువులు చదువుకోవడానికి వెళుతున్నారు. చదువుకుంటూ ఏ రెస్టారెంట్లలోనో, ఏ మాల్‌లో, పెట్రోల్‌ ‌బంకుల్లోనో పని చేస్తూ జీవితం గడుపుతూ మధ్యలోనే కొన్నిసార్లు తుపాకీ గుండ్లకు బలైపోయిన యువకుల గురించి పేపర్లో చదువుతుంటే నా గుండె బరువెక్కుతుంది. ఇక్కడే మన పిల్లలను ఉన్న దాంట్లో కడుపు నింపుకుని పెంచుకుంటే ఈ మొక్కలు పెరిగి మహా వృక్షాలై మళ్లీ తిరిగి పిల్లలని పెడతాయి కదా జానకి’’.
సమయం గడుస్తూ వేదన మనసుని కదిపినా మనిషిని కదపలేక మెల్లగా అలానే ఆమె అతనిని ఓదారుస్తూ చిన్నపిల్లలా అతని ఒడిలో అలా నిద్రలోకి జారుకుంది. జానకిని అలానే చూస్తూ తనని లేపడం ఇష్టం లేక అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. గడియారం మాత్రం మెలకువగానే ఉంది టిక్‌ ‌టిక్‌ ‌మంటూ.
కాలం అనేది మనసుకి అయ్యే గాయాల మాన్పుకి మందు. కరిగిపోయిన వేదనతో మెలకువ వచ్చి చూశాడు. తొలి వేకువ ఝాము… భానుడు కిరణాలతో చీకటిని మెలమెల్లగా ఎత్తుతూ పార బోస్తున్నాడు. సంధ్యావందన సమయం అవుతుందని గోడగడియారం వైపు చూసాడు.. అది అర్ధరాత్రే ఆగిపోయింది. జానకిని లేపబోతే శరీరం గడ్డ కట్టుకు పోయింది. వరద ఉధృతికి వేర్లు తెగిన మానులా, మెల్లగా కిందకు ఒరిగిపోయింది.
జానకీ అంటూ ఒక్కసారిగా గుండెలు పగిలేలా అరిచాడు. అప్పుడే కొడుకు చేస్తున్న కాల్‌కి ఫోన్‌ ‌రింగ్‌ అవుతూ ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE