భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘అమ్మా’’ అంటూ వచ్చి గదిలో ఉన్న తల్లిని ప్రేమగా చుట్టేశాడు వర్ధన్.
చిరునవ్వు నవ్వి ‘‘థాంక్యూ నాన్నా’’ అన్నది విశాలాక్షి.
‘‘నేను ఏమి చెప్పకముందే అలా అంటున్నా వేమిటమ్మా’’ అడిగాడు వర్ధన్.
‘‘ప్రతి సంవత్సరము ఈరోజున నువ్వు వచ్చి చెప్పేది మాతృదినోత్సవ శుభాకాంక్షలే కదురా. అందుకే ముందుగానే ధన్యవాదాలు చెప్పాను’’ విశాలాక్షి మాటల్లో నిర్లిప్తత.
‘‘మా అమ్మ జీనియస్.. హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. ఇదిగో నీకు ఇష్టమని సోంపాపడ్ తెచ్చాను’’ అంటూ తాను తెచ్చిన సోంపాపడ్ తీసి తల్లి నోటికి అందించాడు వర్ధన్.
కొడుకు పెట్టిన స్వీటు తీసుకున్నది విశాలాక్షి.
‘‘అత్తయ్యా..నాకు, ఆయనకు, బాబుకు బాక్సు పెట్టుకున్నాను. మిగిలినవన్నీ టేబుల్ మీద పెట్టాను. మధ్యాహ్నం పెట్టుకు తినండి. మేము సాయంత్రం రావడం ఆలస్యం కావచ్చు..మా కోసం చూడకుండా మీరు తినెయ్యండి. రండి..బాబును దించేసి మనం ఆఫీసులకు వెళదాం’’ అని బాణంలా వచ్చి తాను చెప్పాల్సినది చెప్పి, బయలుదేరుతున్న కోడలు విశదను అనుసరించాడు కొడుకు వర్ధన్.
విశాలాక్షి పెదవులపై పేలవమైన నవ్వు మెరిసింది.
పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఆమె జీవిత మేమిటో ఆమెకే అర్థం కావడం లేదు. ‘‘బతుకు తున్నాను..నాదొక బతుకటంచు’’ అన్న చందాన కాలం వెళ్లదీస్తున్నది. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి నేటివరకు తన జీవితం ఎన్ని మార్పులకు లోనయిందో తెరమీద బొమ్మల్లా కనుల ముందు కదలాడేసరికి తలంతా దిమ్మెక్కి మంచంమీద వాలిపోయింది. ఇది ఆమెకు క్రొత్తేమి కాదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది.
* * *
విశాలాక్షికి అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టరుగారు, శారీరకంగా ఆమెలో వయసుతోపాటు వచ్చే బలహీనతలు తప్ప ఎటువంటి వ్యాధులు లేవని, ఆమెది మానసిక రుగ్మతే తప్ప, శారీరక రుగ్మత కాదని ధ్రువీకరించారు. తల్లి అంతగా మధన పడడానికి కారణం అర్థంకాని వర్ధన్ ఆమెను విశద చిన్ననాటి స్నేహితురాలైన మానసిక వైద్యనిపుణురాలు డాక్టర్ వైదేహి దగ్గరకు తీసుకువచ్చాడు.
‘‘వైదేహి.. మా అత్తగారు ఉన్నట్టుండి అపస్మారకస్ధితిలోకి వెళ్లిపోతారు. అరగంటసేపు మనలోకంలోకి రారు. మేము గమనించకపోతే ఒక్కొక్కసారి అయిదారుగంటలైనా అలానే ఉండి పోతారు. మేము ఇద్దరం ఉద్యోగస్థులం కావడంతో ఆమె గురించి మాకు దిగులుగా ఉంటున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా కూడా ఉన్నది’’ చెప్పింది విశద.
‘‘అవునండి.. ఆమెకు కావలసినవన్ని సమకూరు స్తున్నా, ఆమె ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నది. ఏదైనా అనారోగ్యమేమోనని డాక్టరుకు చూపించి, అన్నిరకాల టెస్టులు చేయించాం. ఆమెకు అనారోగ్యమేది లేదని, మానసికంగా చెప్పలేని బాధతో ఉన్నదని డాక్టర్లు చెప్పారు. మీరైతే తెలిసినవారని, కొంచెం శ్రద్ధచూపి, ఆమె స్థితికి కారణం తెలుసుకోగలరని వచ్చాము. అమ్మను లోపలికి తీసుకు రమ్మంటారా’’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు వర్ధన్.
‘‘చూడు విశద..మీ అత్తగారి గురించి మీరేమి దిగులుపడకండి. ఆమె ఎందుకు బాధగా ఉంటున్నదో, ఎందువలన ఆమెకు అచేతనావస్థ ఏర్పడుతున్నదో కనుక్కుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఆమెను ఆసుపత్రిలో కొంతకాలం ఉంచండి. నేనుకూడ కొన్ని పరీక్షలు చేయాలి. ఆమెతో నేను ముఖాముఖి మాట్లాడాలి. మీరు ఇక్కడే ఉంటే ఆమె మనసువిప్పి మాట్లాడలేక పోవచ్చు. అందుకని ఆమెను ఇక్కడ వదిలేసి మీరు వెళ్లండి’’ అని వైదేహి చెప్పడంతో, విశాలాక్షిని ఆసుపత్రిలో వెళ్లిపోయారు వర్ధన్ దంపతులు.
‘‘యామిని..హాలులో విశాలాక్షిగారు ఉంటారు. ఆమెను తీసుకెళ్లి ప్రయోగశాలలో పరీక్షలు చేయించు. తరువాత పాలు ఇచ్చి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమను. నేను ఇంటికివెళ్లి గంటలో వస్తాను. వచ్చాక ఆమెతో మాట్లాడతాను’’ అని పరీక్షల జాబితాను రాసి యామినికిచ్చి వెళ్ళింది వైదేహి.
* * *
‘‘అమ్మా.. భోజనం చేశావా?’’ తల్లి గదిలోకి వచ్చి అడిగింది వైదేహి.
ఎటో శూన్యంలోకి చూస్తున్న రేణుక ఆమెకు సమాధానం చెప్పలేదు. మరల అదేమాట అడిగింది వైదేహి.
‘‘ఆ..తిన్నాను’’ ఉలిక్కిపడి చెప్పింది రేణుక.
‘‘ఏమిటి అంత పరధ్యానంగా ఉన్నావు’’
‘‘ఏమిలేదు’’
‘‘పర్వాలేదు చెప్పమ్మా. తోచడంలేదా..టి.వి పెట్టనా?’’
‘‘వద్దు’’
‘‘మరెందుకలా ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటావు. ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా కనిపిస్తావు’’
మాట్లాడలేదు రేణుక.
‘‘పార్వతి నిన్ను బాగానే చూసుకుంటోందా.. ఏమైనా ఇబ్బందిపెడుతోందా’’
‘‘బాగానే చూసుకుంటుంది’’
‘‘పార్వతి.. ఇలారా’’
‘‘వస్తున్నానమ్మా’’ అంటూ వచ్చింది పనిమనిషి పార్వతి.
‘‘అమ్మకు అన్నీ సమయానికి అందిస్తున్నావు కదా. మధ్యాహ్నం ఆకలనిపిస్తున్నదేమో..స్నాక్స్ చేసిపెట్టు. తోచలేదంటే టి.వి పెట్టు’’
‘‘అలాగే అమ్మగారు’’
‘‘సరే.. వెళ్లు’’ అని పార్వతిని పంపి, ‘‘సరేనమ్మా.. నేను ఆసుపత్రికి వెళ్లాలి.నీకేదైనా కావాలంటే పార్వతిని అడుగు’’ అని వెళ్లెబోతూతల్లి ప్రక్కనవున్న డైరీని చూసింది.
‘‘ఏమిటమ్మా ఆ డైరీ?’’ అడిగింది వైదేహి.
ఆమాట వినగానే గతుక్కుమన్నది రేణుక. డైరీని తలగడ క్రిందకునెడుతూ, ‘‘ఏమిలేదే.. అందులో అన్నమయ్య కీర్తనలు రాసి ఉన్నాయి. తోచనప్పుడు అవి చదువుకుంటుంటాను..అంతే’’ అన్నది తడబడుతూ.
‘‘సరే…నేను వెళ్లొస్తాను’’ అని వెళ్లింది వైదేహి.
కూతురు ఎక్కడ డైరీ చూస్తుందోనని భయపడిన రేణుక, వైదేహి ఆ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లడంతో ఊపిరి పీల్చుకుంది.
డైరీని తెరిచి ఒకసారి చూసుకుని అందులో ఏదో రాసి మరల తలగడ క్రింద పెట్టుకుని పడుకుంది. నిదురకు దూరమైన ఆమె కళ్లు నీటి బిందువులను మోయసాగాయి.
* * *
‘‘మీరు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి. కానీ మీరు అప్పుడప్పుడు ఏదో లోకంలోకి వెళ్లిపోయి స్తబ్దతలో ఉంటూ అచేతనంగా తయారవుతున్నారు. అంటే మాన సికంగా మీరేదో చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు. అవునా?’’ విశాలాక్షిని అడిగింది వైదేహి.
మాట్లాడకుండా తలవంచుకుంది విశాలాక్షి.
‘‘మీ కొడుకు, కోడలు వలన మీకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నదా?’’
‘‘లేదు. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు’’
‘‘మీ భర్తగారిని మర్చిపోలేక పోతున్నారా?’’
‘‘నా మీద అంత ప్రేమ ఆయన ఏనాడు చూపించలేదు’’
‘‘పోనీ..మీ పిల్లలు మీతో గడపలేక పోతున్నారని బాధపడుతున్నారా?’’
‘‘వాళ్ల ఉద్యోగాలతో వాళ్లు సతమతమవు తున్నారు. నాతో గడపలేరని నేనెలా అనుకుంటాను’’
‘‘మరి మీ మానసిక అనారోగ్యానికి కారణం ఏమిటి? మీరు లోలోపల దేని గురించైనా బాధ పడుతున్నారా.. మొహమాటం లేకుండా చెప్పండి. మనోవేదనకు మందులేదు అంటారు. మీ వేదనకు కారణమేమిటో చెప్పండి. దానికి పరిష్కారం నేను ఆలోచిస్తాను’’
‘‘అందరూ నన్ను వాళ్లకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు తప్ప, ‘నేనుకూడ మనిషినే..’ అన్న స్పృహ ఎవరికీ కలగడం లేదు. చిన్నతనంలో తల్లిదండ్రులు వాళ్లకు నచ్చిన రీతిలో ప్రవర్తించారు. పుట్టింటిగౌరవం కోసం తలవంచాను. ఇంటికిదీపం ఇల్లాలని మాయచేసి మెట్టినింటివారు నా కోరికలకు కొరత వేశారు. నన్ను దేవతను చేసి పిల్లలు వాళ్ల అవసరాలు తీర్చుకున్నారు. నాకంటూ గుర్తింపులేక, స్వతంత్రంలేక, ఆశలకు, ఆశయాలకు ఉరివేసి బ్రతుకుతున్నాను. నన్ను ఎవరూ ఒక మనిషిగా గుర్తించడం లేదు, నా వ్యక్తిత్వానికి ఎవరూ విలువను ఇవ్వడం లేదు. గదిలో మంచంవేసి, సమయానికి అంత ముద్ద విసిరేసి తమ బాధ్యత నెరవేర్చామను కుంటున్నారు తప్ప, తల్లికూడ ఒక మనిషేనని, తనకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు. అది తలచుకున్నపుడల్లా మెదడు మొద్దుబారి పోతుంది. తీవ్రమైన మనోవ్యధతో తల బరువెక్కిపోతుంది. నా మూగబాధను అర్థం చేసుకునే వ్యక్తులే లేరని హృదయం బరువెక్కుతుంది’’ చెప్పి కళ్లు మూసు కుంది విశాలాక్షి. ఆమె కనులనుండి నీటిబిందువొకటి జారి చెక్కిలిని తాకింది.
ఆమె మాటలలో వేదన విన్న తరువాత ఆమె మనోవ్యథ ఏమిటో అర్థమయింది వైదేహికి. విశాలాక్షికి చిన్నతనం నుంచి ఏదో ఒక వ్యాపకం మీద మనసు ఉండి ఉంటుంది. దాన్ని ఆమోదించే వారు లేక మానసికవ్యధను అనుభవిస్తున్నది. ఇక ఎక్కువగా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆమెను గదిలోకి పంపింది.
* * *
‘‘చూడు విశద.. ఇది చాలామంది మహిళలలో కనిపించే వ్యాధికాని వ్యాధి. ఒక స్త్రీ తల్లిగా మారడం శారీరకమార్పే కాదు..ఒక న్యూరో సైకలాజికల్ పరిణామం. దీనివలన హార్మోనులలో మార్పులు సంభవించడంతో పాటు ప్రసవానంతర డిప్రెషనుకు చాలా మంది తల్లులు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివలన పిల్లల పట్ల విపరీతమైన ఆనందం, బంధం, భావోద్వేగాలు ఏర్పడుతాయి. దీనివలన పిల్లలతో విపరీతమైన అటాచ్‌మెంటును పెంచు కోవడం జరుగుతుంది. వీరే మధ్యవయసుకు వచ్చిన తరువాత కుటుంబ భారాన్ని మొత్తం తమపై వేసుకుని, తాము లేనిదే కుటుంబమే లేదనే దశకు చేరుకుంటారు. దీన్నే సంచిత ఒత్తిడి లేదా క్యుములేటివ్ స్ట్రెస్ అంటారు. అప్పుడు వీరు తమతోటి కుటుంబసభ్యుల నుంచి సహకారాన్ని కోరుకుంటారు. అది లభించని పక్షంలో డిప్రెషనుకు లోనవుతారు. అక్కడే కొంత వ్యాధితీవ్రత అధికమవుతుంది. పిల్లలకు పెళ్లిళ్లయిన తరువాత, వారు వారి జీవితభాగస్వాములతో ఎక్కువకాలం గడ• •వలసి• వస్తుంది. అప్పుడు వీరిలో ఒంటరితనపు వేదన అధికంకావడంతో పాటు ‘ఇక నా అవసరం ఎవరికీ లేదు’ అన్న ఆలోచన ఉత్పన్నమవుతుంది. కట్టుకున్న తోడు కాలంచేసి పిల్లల పంచన చేరినపుడు, వారికి గతం గుర్తుకు వచ్చిన పుడల్లా.. ‘నేను అందరికీ అన్నీచేశాను. కానీ నా అవసరానికి ఎవరూ రారు. నన్నొక మనిషిగా కూడ గుర్తించరు’ అన్న ఆత్మన్యూనత ఎక్కువవుతుంది. ‘ఎవరు లేని ఒంటరిని’ అన్న భావన పెరిగి అది మానసిక రుగ్మతకు దారితీస్తుంది. అప్పుడు పిల్లలు వారితో ఎక్కువకాలం గడపాలి. వారికి ఇష్టమైన వ్యాపాకాన్ని గుర్తించి అటువైపుగా వారిని ప్రోత్సహిస్తూ దానికి అనువైన పరిస్థితులను కల్పించాలి. అప్పుడు వారు కుటుంబ బాధ్యతలవల్ల ఎటువంటి అవకాశాలను కోల్పోయారో, వాటిని ఇప్పుడు అందిపుచ్చుకోవడం వల్ల, ఆ పనిలో నిమగ్నమైపోయి, ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతారు. తల్లిని సూపర్ ఉమన్‌గా చూడడమే కాదు, ఆమె కూడా మ నిషేనని గుర్తించి, ఆమెను విమర్శించ కుండా, తనకు తానుగా బ్రతికే హక్కు ఆమెకు ఉన్నదనే అవగాహన కల్పించాలి. అప్పుడే వాళ్లు డిప్రెషన్ నుంచి బయట పడి హుషారుగా, ఆరోగ్యంగా ఉండ గలుగుతారు. ఇప్పుడు విశాలాక్షి గారు అదే ఒత్తిడిలో ఉన్నారు. ఆమెకు ఎటువంటి వ్యాపకం ఇష్టమో గుర్తించి, ఆమెను అందులో నిమగ్నమయేలా చూడండి. ఒత్తిడి తగ్గడానికి కొన్ని మందులు రాసిస్తాను, వాడండి. ఆమెతో రోజుకు ఒక గంటసేపయినా గడుపుతూ, ఆమెలోని కోరికలను గుర్తించండి. నీకు తోడుగా మేమున్నామనే భరోసాను ఆమెకు కల్పించండి. నిజం చెప్పాలంటే, ఆమె ఆరోగ్యం మీ చేతులలో..’’ అని నవ్వింది డాక్టర్ వైదేహి.
‘‘థాంక్యూ వైదేహి. తప్పుమాదే. ఆమెకు తిండి, నిద్ర చాలనుకున్నామే తప్ప, ఆమెలోని మనిషిని గుర్తించలేకపోయాము. మాకళ్లు తెరిపించావు. అత్తయ్యను డిశ్చార్జిచేస్తే మాతోపాటు తీసుకు వెళతాము’’ అన్నది విశద.
‘‘ధన్యవాదములు డాక్టరుగారు..మా కర్తవ్యాన్ని గుర్తుచేశారు’’ అని నమస్కరించాడు వర్ధన్.
‘‘డాక్టరుగా అది నా బాధ్యత’’ అన్నది వైదేహి.
* * *
కారులో ఇంటికి వెళుతున్న వైదేహికి తల్లి రేణుక గుర్తుకు వచ్చింది. బహుశ తన తల్లికూడ ఇటువంటి మానసికరుగ్మతనే అనుభవిస్తున్నదా? అందుకే తనతో ముభావంగా ఉంటున్నదా? ఇంతవరకు ఆమెకు విశాలాక్షి కేసువంటి కేసు తారసపడకపోవడంవల్ల తల్లి విషయంలో అటువంటి ఆలోచన రాలేదు. మనసుపెట్టి ఆలోచిస్తే తల్లిపట్ల తను చూపుతున్న నిర్లక్ష్యం గుర్తుకురాసాగింది వైదేహికి. అత్తగారి విషయంలో విశద ప్రవర్తనకు, తల్లి విషయంలో తన ప్రవర్తనకు పెద్ద తేడా కనిపించలేదు. ఉదయం ఆసుపత్రికి వెళుతూ, ‘అమ్మా..టిఫిను చేశావా. పదకొండింటికి పార్వతి జ్యూసు ఇస్తుంది తాగు. ఆసుపత్రికి వెళ్లొస్తా’ అని చెప్పడం, మధ్యాహ్నం ‘భోజనం చేశావా’ అని, సాయంత్రం వెళ్లగానే అలిసిపోయి పడుకోవడం తప్ప, తను తల్లితో గడుపుతున్న సమయం ఎపుడు?.. తనతీరు గుర్తుకు రాగానే తన తప్పు తెలిసివచ్చి ఆమె కళ్లుచెమర్చాయి. ‘పొత్తిళ్ల బిడ్డ పెదవులకు స్తన్యాన్ని అందించి తొలి ఆకలి తీర్చిన తల్లిని, పసిపాదాలు గుండెలపై కాళిందినృత్యం చేస్తుంటే పులకించి పోయిన తల్లిని, వయసుమళ్లిన వేళ ఒక బాధ్యతగా మోస్తున్నామేతప్ప, మనిషిగా చూడడమే లేదు. తప్పు చేస్తున్నాము.. సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాము. అందరిలా నేను చేస్తున్నాను. దిద్దుకోవాలి.. తప్పును ఇకనైనా దిద్దుకోవాలని’ అనుకుంటూ ఇల్లు చేరుకుంది వైదేహి. కారుదిగి నేరుగా తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడ రేణుక లేదు. తలగడ దగ్గర డైరీ కనిపించింది. తెరవ కూడదని అనుకుంటూనే తెరిచి చూసింది. ముత్యాల వంటి అక్షరాలతో చిన్న కవితలు కనిపించాయి.
‘‘వార్ధ్దక్యము వరము కాదు.. శాపము కాదు
వైరాగ్యాన్ని మోసుకు తిరిగే ఒంటరితనం’’
‘‘నేనిప్పుడొక తోక తెగిన గాలిపటాన్ని
ముళ్లమధ్య కాకుండా, నాలుగు గోడలమధ్య ఉంటున్నాను’’
చదువుతుండగా తలుపుతీసిన చప్పుడయింది. డైరీని మూసి తిరిగి అక్కడే పెట్టి హాలులోకి వెళ్లింది. రేణుక ఎదురయింది.
‘‘అన్నం తిన్నావా అమ్మా’’ అడిగింది వైదేహి.
‘‘తిన్నానమ్మా..నువ్వుకూడ తిని పడుకో’’
‘‘లేదమ్మా.. నువ్వుకూడ నాతో రా.. నీతో మాట్లాడుతూ తింటాను’’
‘‘బాగా అలిసిపోయి ఉంటావు. తిని పడుకో తల్లి. రేపు మాట్లాడుకుందాములే’’
‘‘లేదమ్మా..నీతో మాట్లాడుతూ తింటాను’’ అని తల్లి చెయ్యి పట్టుకుని డైనింగు టేబుల్ వద్దకు తీసుకువెళ్లింది. భోజనం చేస్తున్నంతసేపు తల్లితో నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుతూనే ఉన్నది వైదేహి. కూతురు అలా మనసువిప్పి మాట్లాడుతుంటే రేణుక కళ్లకు స్కూలు రోజులలో ఆమె పెట్టే ముద్దలు తింటూ, క్లాసులో విషయాలన్ని పూసగుచ్చినట్లు చెప్పే పసి వైదేహి జ్ఞాపకానికి వచ్చింది. ఆమె మనసు ఆనందంతో పురివిప్పింది. రాత్రి తల్లి ప్రక్కనే పడుకుంది వైదేహి.
ఆరోజు నుంచి ఇంటికి రాగానే తల్లితో ఎక్కువసేపు కాలక్షేపం చేస్తూ, ఆమె మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయసాగింది వైదేహి.
* * *
‘‘వైదేహి..నీకు చాలా రుణపడిపోయానే నేను. నీ సలహా పాటించి అత్తగారి విషయంలో మేము పద్ధతి మార్చుకున్నాము. తల్లిగా తనకు బాధ్యతలే తప్ప ఆశలు, ఆశయాలు ఉండవన్న భ్రమలో నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు మేమంతా కలిసే భోజనం చేస్తున్నాము. మేము ఎక్కడికివెళ్లినా ఆమెను తీసుకునే వెళుతున్నాము. ఇప్పుడు ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమె మనసులో మాటను చెప్పింది. తనకు సంగీతమంటే ఇష్టమని, చిన్నత నంలో కుటుంబ బాధ్యతల వల్ల అది వీలుకాలేదట. అది తెలుసుకుని మాకు పరిచయమున్న సంగీత మాస్టారుతో మాట్లాడి, ఇంటికివచ్చి ఆమెకు సంగీతం నేర్పే ఏర్పాటు చేశాము. ఇప్పుడామె చాలా సంతోషంగా ఉన్నారు. మాలో ఒకరుగా కలిసి పోయింది. ఇదంతా నీ ట్రీట్మెంట్ మహత్యమే వైదేహి’’ ఆనందంతో చెప్పింది విశద.
‘‘అందుకే డాక్టర్..వచ్చే మాతృదినోత్సవానికి అమ్మకు శుభాకాంక్షలతో పాటు వీణను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము’’ చెప్పాడు వర్ధన్.
‘‘మంచి నిర్ణయం తీసుకున్నారు. ‘సంతోషం.. సగం బలం’ అని పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పారు. కళలకు సంబంధించిన వ్యాపకాలు ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడ ఇస్తాయి. ఇక విశాలాక్షిగారిని ఏ అనారోగ్యము దరిచేరదు..’’ అని వారికి అభినందనలు తెలిపింది. ఆమెకు మరొకసారి ధన్యవాదములు తెలిపి వెళ్లి పోయారు వర్ధన్ దంపతులు.
ఆలోచనలోపడింది వైదేహి. విశదలా తనుకూడ తల్లికి బహుమతిగా ఏదైనాయిస్తే.. వెంటనే ఆమె మెదడులో మెరుపు మెరిసింది. తన తల్లి రాసిన కవితలను సంపుటిగా ముద్రించి ఇస్తే, ఆమె అక్షరాలకు శాశ్వతరూపాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. అవును.. అదే సరియైనది. ఒక కవికిగాని, కథకునికి గాని, తన రచనలను పుస్తకరూపంలో చూసుకుంటే వచ్చే ఆనందం అంతాయింతా కాదని చాలాచోట్ల విన్నది. కానీ విషయం అమ్మకు తెలియ కుండా చూడాలి. ఆమె కవితలను చదవాలనిచెప్పి తీసుకుని వాటిని ముద్రణకు ఇవ్వాలి. ఆ పుస్తకాన్ని మాతృదినోత్సవం రోజున తల్లికి బహుమతిగా ఇచ్చి ఆమె ముఖంలో తొణికిసలాడే ఆనందతరంగాలను చూసి మురిసిపోవాలి. అమ్మలో బాధ్యతలను మోసే తల్లినేకాదు, హక్కులను కాపాడుకోవాలనుకునే మనిషిని కూడ గుర్తించానని ఆమె తెలుసుకోవాలి. ‘నీ కడుపున ననుమోసి, నాకొక ఉనికిని ఇచ్చిన నీకు కూడ నేను ఉనికిని ఇస్తానమ్మా. ఒక రచయిత్రిగా నిన్ను లోకానికి పరిచయం చేస్తాను. ఇలాగైనా తల్లి రుణం కొంతైనా తీర్చుకుంటాను’ అనుకుంటూ సంతోషం మనసున ఎగిసిపడుతుంటే, కారు దిగి తల్లి పరిష్వంగంలో కరిగిపోవాలని ఆమె గదిలోకి పరుగెత్తింది వైదేహి.
శింగరాజు శ్రీనివాసరావు