భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
వైదేహి…! ఆ పేరులోని మాధుర్యాన్ని, ఆమె రూపలావణ్యాన్ని మనసులో నిక్షిప్తపరుచుకున్న అభిరాం ఆ ఇంటిని చూసాడు.
ముంగిట అందంగా అల్లుకున్న సన్నజాజి తీగ,కొన్ని రంగుల పూల చెట్లు, మరిన్ని పచ్చని చెట్లు, ప్రశాంతమైన ఆవరణలో రంగుల పొదరిల్లులా ఉంది. ఆ ఇల్లు వైదేహి రంగుల కల.
అభిరాం జీవితంలో వైదేహి అడుగు పెట్టిన క్షణమే అతని ప్రపంచం రంగులమయమైంది. వైదేహి ప్రపంచం కొత్త సొబగులను సంతరించు కుంది. తొలిరాత్రి సొంతిల్లనే రంగులకలను అభిరాంతో పంచుకున్నాకనే, తన శరీరాన్ని అతనితో పంచుకుంది. వైదేహి ప్రోది చేసిన సొంత ఇంటి కలల వెలుగులు తెలుగు మాష్టారైన అభిరాంని కంకణ బద్ధుడ్ని చేసాయి. ఆమె ఆశల హరివిల్లు అతని మనోకాశంలో విరిసి, అతని కలల కలనేతలో ఓ పొదరిల్లుగా ఆకృతి దాల్చింది. అది కేవలం వైదేహి కోరికగా భావించని అభిరాం, దాన్ని తనకు కూడా ఆపాదించుకున్నాడు. గోదారి గ్రామంలో తన తాతకు లంకంత కొంప ఉండేదని వినడమేగాని, దాని ఆనుపానులు తండ్రికే తెలియవు. అది ఒకప్పటి మాట. తాత ఇల్లు తండ్రికి రాలేదు. విల్లు రాసే అవసరం తన తండ్రికి రాలేదు. ఆయన చెప్పించిన చదువునే ఆస్తిగా భావించి సొంతూరు వదిలి, బతుకు తెరువు వెదుక్కుంటూ వేరే ఊరు వెళ్లక తప్పలేదు అభిరాంకి. అటు పల్లెకు ఎక్కువా, పట్నానికి తక్కువగా ఉన్న ఆ ఊర్లో జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మాష్టారుగా అవతరించాడు.
ఛందస్సుతో మత్తేభాలని, శార్దూలాలని అవలీలగా మట్టుబెట్టగల తెలుగు మాష్టారికి తన చిరు సంపాదనతో చందమామ లాంటి భార్య కోరికను తీర్చడం అంత వీజీ కాదనే తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అయినా భార్యాభర్తలు చిరుకోర్కెలను నానపెట్టి, సొంతిల్లనే పెను కోర్కెకు పాదుకట్టారు. పందిరికెక్కిన పాదు పిందె వేసినట్టు, పందిరి మంచమెక్కిన జంట కడుపు పండి కాయ కాసింది. కొడుకు పుట్టిన తరుణంలో పొదుపు కాస్త అదుపు తప్పింది. మొక్కలా ఎదుగుతున్న కొడుకుతో బాటు మొక్కవోని దీక్ష వంగని మానయ్యింది. అయినా తమ ఆశయసాధనకు కావాల్సిన సమిధలను సమకూర్చు కోవడంలో వెనుకడుగెయ్యలేదు. కూడుకు మాత్రం సరిపోయే సంపాదనలో కూడబెట్టిన సొమ్ము తోడుపెట్టిన పెరుగులా గట్టిపడడానికి జీవితంలో అర్థభాగం ఖర్చై పొయింది అభిరాంకి.
కురవక కురిసిన వాన సగం చేనును మాత్రమే తడిపినట్టు, బతుకుకు వెరవక దాచిన ధనం సగం కోరికను మాత్రమే తీర్చింది. ఇంటికోసం తపన పడుతున్న దంపతులకి, ఊరుకి దూరంగా కొంత స్థలం కొనడంతో కాస్తంత ఊరట కల్గింది. కొత్తగా రెక్కలొచ్చిన పిట్టకు మల్లే వైదేహి మనసు ఆనందంతో గెంతులేసింది.
“మన ఇంటికి కావాల్సిన జాగా వదిలి, మిగిలిన దాంట్లో మొక్కలు వేసుకుందాం. చక్కని పూలమొక్కల నడుమ ఇంచక్కని పర్ణశాలను కట్టుకుందాం. ఇది సన్నజాజి తీగ దీన్ని ముందువైపు పాతుదాం. మనం ఇల్లు కట్టుకునే సమయానికి పెరిగి పరిమళాలను వెదజల్లుతుంది. అలాగే ఓ మామిడి మొక్క,, ఓ జామమొక్కతో బాటు పెరట్లో నూతి చప్టా దగ్గర అరటిపిలకలు పాతుదాం. నాకైతే ఇంకా ఎన్నో మొక్కల్ని నాటాలనుంది. మనకంటూ ఓ ఇల్లు చిన్నదైన పర్వాలేదు, అది కేవలం నాల్గుగోడలు, పైకప్పుతోకూడిన నివాసమే కాదు. ప్రాణమున్నంత వరకే కాకుండా ప్రాణం పోయిన తర్వాత కూడా ఓ భరోసా నిచ్చే ఆవాసం కావాలి.” ఆనందోద్వేగాలు మిళితమైన స్వరంతో అంది వైదేహి.
“మనం పొదుపు చేసిన దాంతో ఈ స్థలం మాత్రమే కొనగలిగాం. ఇప్పటికి నీ కల పాక్షికంగా మాత్రమే నెరవేరింది. మరి నీ కలల పొదరిల్లు ఎప్పటి కవుతుందో? ఇంకా నాకు మూడేళ్ల సర్వీసే ఉంది.” ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ అన్నాడు అభిరాం.
“ఇంకా మూడేళ్లు ఉందిగా. మనబ్బాయి కూడా చేతికందాడు. మీరేం ఇదవ్వకండి. మనం చేరాల్సిన దూరం తగ్గింది కదా? కొంత ఆలస్యమైనా గమ్యం చేరతామనే నమ్మకముంది కనుక, ఇప్పుడు పొందిన దాన్ని చూసుకుని ఆనంద పడాలి.” అనున యించింది.
మామిడిచెట్టు కింద పడక్కుర్చీలో కూచున్న అభిరాం మనసులో వైదేహి స్మృతుల ప్రవాహం ఆగడం లేదు.
ఉద్యోగ విరమణకు కొద్దినెలల ముందుగా తయారైన కొత్తింటిని కనులారా చూసుకుని మురిసిపోతున్నాడు.అభిరాం. ఇక గృహప్రవేశమే తరువాయి వైదేహి ముచ్చట తీరే రోజు ఇంకెంతో దూరం లేదు. తనుంటున్న ఇంటికి ఆనందంగా బయల్దేరాడు.
“వైదేహి…వైదేహి!” భార్యను పిలుస్తూ లోపలి కొచ్చాడు. లోపల గదిలో మంచంపై పడుకున్న వైదేహి మెల్లగా లేచి కూర్చుంది.కళ్లు తిరిగినట్లనిపించి మళ్లీ మంచంపై వాలిపోయింది. “మన కొత్తింటికి రంగులేయడం పూర్తయ్యింది. రేపోసారి ఇల్లు కడిగించేస్తే…” నిస్సత్తువుగా మంచంపై పడుకున్న భార్యను చూసి కంగారుపడ్డాడు.
“ఏమైంది వైదేహి?ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా?” ఆత్రంగా ఆమె పక్కన కూర్చుని అడిగాడు.
కళ్లు మూసుకునే, “మీరు వెళ్లిన తర్వాత వికారంగా అనిపించింది. వాంతి అయ్యింది. కళ్లు తిరిగినట్టై మంచంపై పడిపోయాను. కళ్లు తె`రిస్తే చాలు గిర్రున తిరుగుతున్నట్టుంది. నాకేమిటో అయిపోతోంది. ప్రాణాలు పోతాయేమో ననిపి స్తోంది,” బలహీనంగా అంది వైదేహి. కాసేపు అభిరాంకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎల్లుండి గృహప్రవేశం. ఆ కార్యక్రమానికి కావాల్సిన పనులు ముగించుకుని వచ్చిన అభిరాంకు వైదేహి అనారోగ్యం ఆందోళన కల్గించింది. కొడుకు వేణుకి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి సిద్ధమై, వైదేహిని అనునయిస్తూ, “నువ్వేం భయపడకు డాక్టర్ దగ్గరకెళ్దాం” అని వేగంగా మేడ పైకి పరిగెత్తాడు.
“రామ్మూర్తి గారు… రామ్మూర్తి గారు…! బిగ్గరగా పిలుస్తూ తలుపు కొట్టాడు. ఇంటి ఓనర్ రామ్మూర్తి తలుపు తీసి ఏమిటన్నట్టు చూసాడు. అభిరాం చెప్పింది విని ఆయన తన కారులో వైదేహిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.
హార్ట్ ఎటాక్ అని ఐసీయూలో చేర్చిన వైదేహి మర్నాటి సాయంకాలానికి కన్నుమూసింది. సొంతింటి కల నెరవేరే లోపలే వైదేహి లోకం నుంచి నిష్క్రమించడంతో అభిరాం దుఖానికి అవధులు లేకుండాపోయాయి. వైదేహి పార్థివ దేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తరలించే ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రామ్మూర్తి అభిరాంతో ,
“నన్ను క్షమించండి మాష్టారు! మీకు తెలుసు కదా, రేపు మా అమ్మాయి నిశ్చితార్థం. మరి…” మనసులోని మాటను సూటిగా చెప్పలేక మౌనంగా వెళ్లిపోయాడు. ఆ మాట శరాఘాతంలా తగిలి కూల బడిపోయిన అభిరాంను అక్కున చేర్చుకున్నాడు వేణు.
“నాన్నా! అద్దిల్లు మనల్ని ఆదుకోపోతే మనకు వేరే దారి లేదనుకుంటే ఎలా? మనకు ఇప్పుడో ఇల్లుంది నాన్నా. అమ్మ కలలు కన్నఇల్లు. మీరెంతో కష్టపడి, ఇష్టపడి కట్టించుకున్న పొదరిల్లు. ఓ మంచి ముహూర్తంలో అమ్మతో కల్ణఇ గృహప్రవేశం చేసుకుందామనుకున్నాం. ‘ప్రాణమున్నంత వరకే కాకుండా ప్రాణం పోయిన తర్వాత కూడా ఓ భరోసానిచ్చే ఆవాసం’ కావాలనుకుంది అమ్మ. అమ్మ చనిపోలేదు నాన్నా. మనతోనే, మనలోనే ఉంది. ఆమె కలలు కన్న పొదరింటికి ఆమెను తీసుకెళ్దాం. ఆప్పుడే అమ్మ ఆత్మకు తృప్తి కలుగుతుంది. మీరు బాధ పడకండి నాన్నా.” కన్నకొడుకు కన్నతండ్రిలా ఓదారుస్తుంటే వ్యక్తపరచలేని ఉపశమనాన్ని అనుభవించాడు అభిరాం.
వైదేహి తనని ఒంటరిని చేసి వెళ్లిపోయి మూడేళ్లయ్యైనా ఆమె స్మృతులు అతనిని విడిచి వెళ్లడం లేదు. నిత్యం ఆమె ఆలోచనలతో గడుపుతున్నాడు.
* * * *
మొబైల్ రింగవ్వడంతో వైదేహి స్మృతుల నుంచి బయట పడ్డాడు.
తన స్కూల్లోనే గుమస్తాగా పనిచేసిన నీలకంఠం చనిపోయాడన్న వార్త విని అవాక్కయ్యాడు. పదిరోజుల క్రితం నీలకంఠాన్ని హాస్పిటల్లో చేర్పించా రని విన్నాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. రిటైరయ్యే నాటికి నెత్తికి ఓ గూడు కూడా లేకుండా షావుకారు శేషారావింట్లో అద్దెకుండి బతికేసాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వాడు దేశాంతరం పట్టిపోయి నాల్గేళ్లయ్యింది. ఎక్కడున్నాడో ఆచూకి లేదు. కూతుళ్లిద్దరికి పెళ్లి చేసేసరికి రిటైర్మెంట్ డబ్బు కాస్త కరిగిపోయింది. పెళ్లయిన తర్వాత సంక్రాంతి పండగకు అత్తారింటికి బైక్ మీదొస్తున్న పెద్ద అల్లుడిని లారీ గుద్ది చంపేస్తే, వేరే గత్యంతరం లేక కూతురు కల్పన పుట్టింటికి చేరింది. రెండో కూతురు అర్చన అన్యకులం వాడిని ప్రేమించి ఇంట్లోంచి పారిపోతే, వెతికి తీసుకొచ్చి ఆ ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసాడు. కట్నకానుకలివ్వక తప్పలేదు.
గరళాన్ని గొంతులో దాచుకున్న ఆ నీలకంఠుడికి మల్లే ఈ నీలకంఠం కూడా తన జీవితంలోని కష్టాలని విషంలా గొంతులోనే దాచుకున్నాడు తప్ప, ఎప్పుడూ ఎవరిముందు ఏకరువు పెట్టేవాడే కాదు.
ఇప్పుడతని చావు ఈ దిక్కులేని ఆడపిల్లకు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. నీలకంఠం శవాన్ని ఇంటిలోకి తీసుకురావడానికి శేషారావు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ ఒక్కరాత్రికి తండ్రి శవాన్ని అరుగుమీద పెట్టుకోడానికి అనుమతివ్వమని, రేపు ఉదయమే అంత్యక్రియలు జరిపిస్తామని కల్పన విలపిస్తూ అతన్ని ప్రాధేయపడుతోంది. ఆమె కన్నీళ్లు శేషారావు కరకు మనసును కరిగించలేదు.
గూడులేని పక్షిలా విలపిస్తున్న కల్పన దిక్కులేని స్థితి అభిరాంను కన్నీళ్ల పర్యంతం చేసింది. చూపుకి అడ్డుపడిన కన్నీళ్లను తుడుచుకుని కల్పనను చూసాడు. వానకు తడిసి ముడుచుకుపోయిన పువ్వులా ఉంది. జీవితపు వెలుగులను పూర్తిగా అనుభవించక మునుపే ఆమెను కలుగులో ఎలుకలా మార్చిన దేవుణ్ణి నిందించకుండా ఉండలేకపోయాడు.
కల్పన దగ్గరకొచ్చి “చూడమ్మా! నువ్వలా ఏడుస్తూ ఏమాత్రం మానవత్వం లేని మనిషిని ప్రాధేâûయ పడాల్సిన పనిలేదు. మీ నాన్న ఎటువంటి మనిషో నాకు తెల్సు. నేనేటువంటివాడ్నో చెప్పడానికి మీ నాన్న ఇప్పుడు లేడు. అంతమాత్రాన నా స్నేహధర్మాన్ని విస్మరించలేను. మీకు అభ్యంతరం లేకపోతే మీ నాన్నను గౌరవప్రదంగా పంపడానికి ఏర్పాట్లు నే చేస్తాను.” అంటున్న అభిరాం కాళ్లపై వాలిపోయింది కల్పన.
ఆమెను భుజాలు పట్టుకుని లేపి,“లోపలికెళ్లి నీకు, అమ్మకు కావలిసిన బట్టలు తెచ్చుకుని అంబులెన్స్‌లో కూర్చో.” అన్నాడు. కాసేపటికి అంబులెన్స్ బయల్దేరింది.
* * * *
అంబులెన్స్‌ను తన ఇంటి ముందు ఆపాడు అభిరాం.
వరండాలో చాపేసి అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో నీలకంఠాన్ని పడుకోబెట్టి లోపలికెళ్లి ఓ ప్రమిద తెచ్చాడు. “ఈ దీపం వెలిగించి మీ నాన్న తల దగ్గర పెట్టి, నువ్వు మీ అమ్మా స్నానాలు చేయండి. ఈలోగా మీరు తినడానికి ఏదైనా తీసుకొని వస్తాను. మిగతా కార్యక్రమం గురించి రేపు ఆలోచిద్దాం.” అన్నాడు.
ఆ రాత్రి అభిరాంకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆరోజు జరిగిన సంఘటనలు కల్పన నిస్సహాయత, ఏ మాత్రం కనికరంలేని శేషారావు ప్రవర్తన అతనిని అశాంతికి గురిచేసాయి. వైదేహిని కోల్పోయినప్పుడు తను పడిన వేదన కళ్ల ముందు కదలాడింది. ఆ బాధను అనుభవించాడు కాబట్టే, ఇప్పుడు కల్పన పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోగలిగాడు.
నీలకంఠం అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి గౌరవప్రదంగా అతనికి వీడ్కోలు పలికాడు.
“మాష్టారు గారు!మీరు లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోడానికే భయమేస్తోంది. ఈ విషాద సమయంలో మీరు మాకుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచారు. మీ సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేం మాష్టారు.”కన్నీళ్లతో, గొంతులో వణుకుతో కల్పన,ఆమె తల్లి అభిరాంకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు వారి కళ్లల్లో కేవలం కృతజ్ఞత మాత్రమే కాకుండా, ఒక కొత్త ఆశ చివురించడం గమనించాడు అభిరాం.
* * * *
కొన్ని రోజులు గడిచాయి. తండ్రిని చూడడానికి వచ్చిన వేణుకు కల్పనతో మాట్లాడే అవకాశం లభించింది. ఆమె పడిన కష్టాలు, ఆమె నిస్సహాయత వేణు మనసును కదిలించాయి. వేణు మదిలో ఒక కొత్త ఆలోచన రూపు దిద్దుకుంది. కల్పనలోని నెమ్మదితనం, ఆమె కళ్లల్లోని బాధ అతడిని లోతుగా ప్రభావితం చేశాయి. అతనో నిర్ణయానికొచ్చాడు. తండ్రి ముందు తన మనసులోని మాటను చెప్పాడు, “నాన్నా!కల్పనను నేను ఇష్టపడ్డాను. మీరంగీకరిస్తే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.” నిశ్చయంగా అన్నాడు.
అభిరాం ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కొడుకు అభిప్రాయం తెలిసి చాలా ఆనందపడ్డాడు. “నీ నిర్ణయం గొప్పది. కాని కల్పన ప్రస్తుత పరిస్థితుల మీద జాలి పడి మాత్రం నువ్వా నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను అంగీకరించను. ఆమెను మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తే తప్పకుండా నీకు నా ఆశీస్సులు ఉంటాయి.” అభినందనగా అన్నాడు అభిరాం.
తండ్రి అంగీకారం లభించడంతో, వేణు కల్పన పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం తెలిపాడు. జీవితంలో కష్టాలను, నష్టాలను చవిచూసిన కల్పన, వేణు ప్రేమ, అభిరాం ఆదరాభిమానాలకు చలించి పోయింది. తల్లి అంగీకారంతో వేణు ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
* * * *
జంటగా తన ముందు నిల్చున్న వేణును, కల్పనను మృదువుగా అక్కున చేర్చుకుని, “నాకు దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. మంచి జీవితాన్ని, మంచి మనసున్న భార్యను, మా ఇద్దరి ఆదర్శాలను గౌరవించే కొడుకును ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడిగా నేనెంత మందికో ఎన్నో పాఠాలు చెప్పాను. విధి వైచిత్రం, వైదేహిని కోల్పోయిన రోజున, నాకు తెలియని, నేను చెప్పని ఒక బాధాకర మైన పాఠం నాకు బోధపడింది.” వాళ్లను చూస్తూ స్థిరంగా అన్నాడు.
“అదేమిటంటే, ఒక ప్రాణి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సంతోషించే కుటుంబం, అదే ప్రాణి మరణించినపుడు అవసరమైన సంస్కారాలను చేయడానికి అనువైన వసతి లేక బాధ పడటం. నీలకంఠంకుటుంబం కూడా ఆ పరిస్థితిని ఎదుర్కో వడం బాధాకరం. గూడు, నీడా లేకుండా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక వసతి కావాల్సిన ఆవశ్యకత తెలిసొచ్చేలా చేసింది.వారి నిస్సహాయ స్థితిని తలచుకొని గుండె బరువెక్కింది. దానికి పరిష్కారంగా ఏదో చేయాలనే తలంపు, సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే సంకల్పం నామనసులో పుట్టింది.ఆ ఆలోచన నా మనసులోని వేదనను తొలిగించి ఒక ప్రశాంతతను, ఓ వింత అనుభూతిని కల్గించింది.”
“నా భార్య వైదేహి కలల నిలయం ఈ ఇల్లు. ఇల్లు అంటే కేవలం సిమెంట్, ఇసుక కలిపి కట్టిన నాలుగు గోడలు, ఒక పైకప్పు కాదు, మనిషి చీకటి సమయాల్లో వెలుగుని, దుఃఖ సమయంలో శాంతిని ఇచ్చే ఒక ప్రదేశమని నాకు అర్థమైంది.అందుకే వైదేహి కలల పొదరిల్లును ఆ పుణ్యకార్యక్రమాలకు అనువుగా మార్చాలని నిర్ణయించుకున్నాను. దానికి మీ ఇద్దరి సహాయ సహకారాలు కావాలి. నేనున్నంత కాలమే కాదు నా తర్వాత కూడా ఈ పని జరగాలి. నా తదనంతరం ఈ కార్యాన్ని నిరాటంకంగా నిర్వర్తించే బాధ్యత మీ ఇద్దరిదే.” వైదేహి కలలకు నెలవైన ఆ ఇల్లును చూపిస్తూ భావోద్వేగంగా అన్నాడు అభిరాం.
వేణు కల్పనలు ఆ ఇంటిని ఆరాధనగా పరికించారు.
పచ్చని చెట్లు, విశాలమైన ఆవరణ, ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఆ ఇల్లు ఎందరో దుఃఖిత హృదయాల కన్నీళ్లను పంచుకోబోతోంది, ఎందరో అభాగ్యులకు, నిస్సహాయులకు ఆశ్రయాన్ని ఇవ్వబోతోంది. అంతేకాదు ఒక నూతన బంధానికి వేదిక కాబోతోందన్న ఊహ వారిరువురుని ఉత్తేజభరితులను చేసింది.
“నాన్నా! ఎవరూ, చేయని, చేయలేని సమాజ హితమైన ఆలోచనకు రూపుదిద్దిడమే కాకుండా మనసా వాచా దాన్ని ఆచరణలో పెట్టడానికి నిర్ణయించుకున్న మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. ఇటువంటి ఉన్నతాశాయాలున్న తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం.” వేణు గద్గద స్వరంతో అన్నాడు.
“మావయ్యా! ఇటువంటి ఆదర్శకుటుంబంలో కోడలిగా అడుగు పెట్టడం నా పూర్వజన్మ సుకృతం.” అంటూ అభిరాం పాదాలకు నమస్కరించింది కల్పన.
వైదేహి అభిరాం, వేణు కల్పనల ఆదర్శానికి ఆనవాలుగా రూపుదిద్దుకోడానికి సన్నద్ధమైనట్టుగా ఉందా ఇల్లు ఇప్పుడు.
– ఎమ్.ఏ. పద్మనాభరావు