‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
తిక్కనార్యుని నివాసం, పెన్నా తీరం తిక్కనా మాత్యుని కంటే కేతనామాత్యుడు గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఎదురుగా చేతులు కట్టుకుని తలవొంచుకుని దోషిలా నిలబడి ఉన్నాడు కపర్ది.
“అలా ఎలా జరిగింది? అంత కళ్లు మూసుకు పోయాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ఇంటిని ఎలా చుట్టుముట్టారు? లోపల ఏమి జరుగు తుందో తెలుసుకోవాలనే ఆత్రుత తప్ప వాళ్లు గుర్తిస్తే ఏమి జరుగుతుందో తెలియదా..!”
కపర్ది ఒంచిన తల ఎత్తడం లేదు.
చేతులు వెనక్కు కట్టుకుని అటూ ఇటూ తిరుగు తున్న తిక్కనామాత్యుడు అన్నాడప్పుడు..
“సరే సరే.. మనవాళ్లు ఎంతమందిని వాళ్లు పట్టుకున్నారు? మనవాళ్లు ఎంత మంది తప్పించు కున్నారు?”
“మనవాళ్లు ఇద్దరిని ఆ దుండగులు పట్టి బంధించారు..” తల ఎత్తకుండానే చెప్పాడు కపర్ది.
“అయ్యో.. ఎంత పని చేశార్రా?!.. వాళ్లు దుర్మార్గులు. మనుషులను చంపే మానవత్వం లేని..”
కేతన ఉద్రేకంగా అరుస్తున్నట్లు మాట్లాడుతుంటే అడ్డుకున్నాడు తిక్కనార్యుడు.
“సరే సరే.. తక్షాణ కర్తవ్యం??”
“మిగిలిన వాళ్లం పారిపోయి వచ్చాం..”
“భగవంతుడా.. ఇది ఎక్కడ ఏ రాజ్యంలో ఏ గ్రామంలో జరిగింది?’
“కేతకిపురం, పిల్లలమఱ్ఱి రాజ్యం. అనుమ కొండకు దగ్గర.. దగ్గరలో ఉన్న మండలాధికారికి ఫిర్యాదు చేశాను.
పిల్లలమఱ్ఱి బహుశా సామంతరాజ్యం కావచ్చునేమో మహామాత్యా..”
“అవును.. కాకతీయ సామంతరాజ్యమే. ఏది ఏమైనా మనవాళ్లకు ప్రాణహాని ఉంది. తక్షణమే బయలుదేరు దాశీ..”
శాలువా నడుముకు కట్టుకుంటూ పరుగులాంటి నడకతో కదిలాడు తిక్కనార్యుడు.. వెనక కేతన, కపర్ది.
* * * *
గణపతిదేవుని ఆంతరంగిక మందిరం. అనుమ కొండ రాజప్రాసాదం.
గణపతిదేవుని ప్రక్కగా తిక్కనామాత్యుడు, కాకతీయ సర్వ సైన్యాధిపతి రేచర్ల లోకచమూపతి కూర్చుని ఉండగా హరిహరయ్య, కవి కేతన, మరి ఇద్దరు వెనగ్గా చేతులు కట్టుకుని తలవాల్చి నిలబడి ఉన్నారు.
“ఏది ఏమైనా మీరు దూరంగా ఉండి ఆ దొంగ నపుంసక దేవత ఎవరో గుర్తించాలి కానీ వాళ్లున్న నివాసం లోకి దూరితే జరిగేది దారుణమే. వాళ్లు శైవులూ కాదు. వైష్ణవులూ కాదు. కేవలం ఇద్దరినీ రెచ్చగొట్టి మతఘర్షణలు సృష్టించి ప్రశాంత కాకతీయరాజ్యంలో చిచ్చుపెట్టాలని పకడ్బందీగా నిర్వహిస్తున్న కుట్రదారులు. ఈ సంఘటన నా రాజ్యంలో జరిగింది కాబట్టి ఆ ఇద్దరిని రక్షించగలిగాము. మరో రాజ్యంలో అయితే.. ఈ సంఘటన తప్పక వాళ్లు కోరుకున్నట్లు పెద్ద యుద్ధానికి దారితీసేది..” అన్నాడు రేచర్ల లోకయ.
మహావీరుడు రేచర్ల రుద్రయ కుమారుడే రేచర్ల లోకయ. ఆయన వృద్ధాప్యం కారణంగా రేచర్ల లోకయ రాజ్యానికి వచ్చాడు. ఊహాతీతంగా ఈ గ్రామం రేచర్లవారు పాలిస్తున్న పిల్లలమఱ్ఱి మండలం లోనిది. ఆయనకు తెలియకుండా అక్క డ గడ్డిపోచ కూడా కదలదు.
“రాజ్య గూఢచారులు అనుమానాస్పదంగా వెళుతున్న గుర్రపుబండిని గుర్తించి పరిశీలిస్తే అందులో ఇద్దరు కట్టిపడేసి ఉండటం కనిపించింది. ఆశ్చర్యంతో ప్రశ్నిస్తే మొత్తం దుర్మార్గం బయట పడింది. ఆ దేవతను బంధించి.. ఆమెతో ఉన్న వాళ్లను అక్కడికక్కడ నరికేశారు.మన వాళ్లను రక్షించి నాకూ, మహామండలేశ్వరులకు తెలియజేశారు మా సైనికులు..” వివరించాడు లోక చమూపతి.
“కృత్ఞఙతలు మహావీరా.” అన్నాడు తిక్కన ఆయన చేతులు పట్టుకుని, ఆర్ద్రంగా.
“రాజ్య ప్రశాంతత, అమాయకుల రక్షణ మాకు అత్యంత ముఖ్యం మహామంత్రివర్యా..” అంటూ మహాకవిని తిరిగి గౌరవ పురస్కారంగా ఆసనంపై కూర్చోబెట్టాడు లోకచమూపతి.
అంతా పరికిస్తున్న గణపతిదేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఆయన లోలోన ఏవేవో ఆలోచనలు తీవ్రంగా కదలాడుతున్నాయి.
గిరిరాజమ్మ దేవత!!
ఈ సంగతి ఆయన చెవిన లోకచమూపతి వేసినప్పుడు.. ఈ దేవత పేరు ఎక్కడో విన్నట్లుగా తోచింది.
“సాధారణ శైవ బృందాలను, వైష్ణవ బృందాలను తిక్కన హరిహరబృందాలు సహనంతో ఎదుర్కొంటు న్నాయి అని విన్నాను. కాని ఈ దేవత ఎవరో.. అది మన రాజ్యం కాబట్టి సరిపోయింది. మరో రాజ్యమైతే రక్తపాతాలే.. అంటే ఆ దుష్టుల పన్నాగం విజయవంతమయ్యేది.” అన్నాడు.
కానీ ఈ గిరిరాజమ్మ??
చటుక్కున గుర్తొచ్చింది. ఈ దేవత పేరు సోమలదేవికి తల్లి చిల్లాదేవి రాసిన లేఖల్లో దొర్లిన పేరు అని. వేగంగా లోపలికి వెళ్లి దాచిపెట్టిన ఆ లేఖను తీసి చూశాడు.
అవును. గిరిరాజమ్మ దేవతను చిల్లాదేవి, బాలకవ్వల, సోమలదేవి పూజిస్తున్నవారిలో ఉన్నారు.
అదే ఆ లేఖల్లో రాసి ఉంది.
ఈమెను చిల్లదేవి, సోమల మాత్రమే కాదు బాలకవ్వల కూడా కొలుస్తోంది. ఈమె దేవగిరి రాజ్యంలో ఉన్న దేవత కదా! తెలుగు రాజ్యాలలోకి ఎందుకు వచ్చింది? శైవులను సమర్దిస్తూ వైష్ణవులను చంపడం.. వైష్ణవులను సమర్దిస్తూ శైవులను చంపడం.. ఇద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణలకు ఆజ్యం పోయడమే కదా!
ఈ ఆలోచనలు గణపతిదేవుని మనస్సు నుండి తొలగిపోవడం లేదు. తిక్కనామాత్యుడు బయలు దేరుతూ శలవు కోరినా యాంత్రికంగా ఆయనకు వీడ్కోలు పలికాడే కాని మనసులోని ఆలోచనలకు వీడ్కోలు చెప్పలేకపోతున్నాడు.
గిరిరాజమ్మ దేవత ఓ నపుంసకుడు.. ఆమెకు చిల్లాదేవికి, బాలకవ్వలకు ఏమి సంబంధం?
* * * *
అనుమకొండ రాజప్రాసాదం..
గణపతిదేవుడు, రేచర్ల లోకచమూపతి, గంగయ సాహిణి కోట లోలోపలికి కారాగారాల వైపుగా వెళుతున్నారు. ఓ కారాగారం వద్ద ఆగారు. దండనాయ కుడు ముందుకు వెళ్లగా కారాగార రక్షణ భటుడు ద్వారం తెరిచాడు. లోపల గిరిరాజమ్మ దేవత. నపుంసకుడు.. మూలగా ముడుచుకుని పడుకుని ఉన్నాడు. బలిష్టమైన నపుంసక శరీరుడు.. అమాయ కుడు.. ఒంటిపై పూసుకున్న రంగులు కడిగినట్లు తెలుస్తోంది.
“వీడే ఆ దేవత ప్రభూ..” అన్నాడు రేచర్ల లోకయ.
వాడు లేచి లిప్తకాలం తల ఎత్తి చూసి వెంటనే తలవాల్చి చేతులెత్తి నమ స్కరిస్తూ మోకాళ్లపై కూలబడ్డాడు.
గణపతిదేవుడు, గంగయ సాహిణి తీక్షణంగా చూశారు అతన్ని. వెంటనే స్పందించాడు గంగయ.
“అరె.. వీడా..!వీడు మా అంతఃపుర ప్రతీహారి. నిజమే నపుంసకుడు.. వీడు దేవత ఏవిటి..?!”
గణపతిదేవుడు అడిగాడు, “వివరంగా చూశావా కేయూరా?”
“అయ్యో నాకు తెలియకపోవడం ఏవిటి ప్రభూ! వీడు మా కల్వకోల రాజ్య రాజప్రాసాదంలో అంతఃపుర ప్రతీహారి.
పేరు దీపులప్ప. ఆమెకు.. మా పట్టమహిషి బాలకవ్వలకు రక్షణాధికారిగా ఉండేవాడు. చెప్పరా.. నువేవ్వరో.. చెప్పు”
వాడు తలెత్తి, “అవును మహాప్రభూ..” అని మళ్లీ తల వాల్చాడు.
చివ్వున కదిలాడు గణపతిదేవుడు. “వాడిని అనుమకొండ స్థల న్యాయాలయానికి తరలించండి లోకయా..” వేగంగా వెళుతూ చెప్పాడు.
తలవంచి శలవు తీసుకుంటున్నట్లు నమస్కరించి వెనుకనే ఆగిపోయాడు లోకయ. గణపతిదేవునితో పాటు వేగంగా నడుస్తూ రాజప్రాసాదంలోకి వెంట వచ్చాడు గంగయ.
“వీడిని దేవతగా ప్రవేశపెట్టి తెలుగు రాజ్యాలలో మత ఘర్షణలు సృష్టించాలని ఆమె ఎత్తుగడ”
పూర్తిగా అర్థÁ్ధమైంది. ఆయన అదే మౌనం.. చాలాసేపు మౌనమే..
“తప్పు నాదైతే.. శిక్ష నాకు గాని నా ప్రజలకు ఎందుకు శిక్ష కేయÖరా? పాపం వాళ్లు అమాయ కులు” ఆయన గొంతు గాద్గదికమయ్యింది.
నిర్వేదంగా తలవంచుకున్నాడు కేయూర.
* * * *
తిక్కనామాత్యుని పండితారామం.. పెన్నా తీరం
తెలుగురాజ్యాలలో మతజాఢ్యం పెరిగి పెరిగి మతాన్ని కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగించడం అనే దుర్మార్గం పెరిగిపోవడం తిక్కనామాత్యుని ఆలోచనలో పడేసింది.
గిరిరాజమ్మ ఉదంతం తర్వాత కూడా హరిహర బృందాలు యధావిధిగా గ్రామాలలో తిరుగుతూ ‘శైవం వద్దు, వైష్ణవం వద్దు.. హరిహరతత్వమే ముదు’్ద అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. శైవుల మరణాలు, ఘర్షణలు వింటున్న సాధారణ ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య పౌరులకు కావలసింది ప్రశాంత దైనందినంతో కూడిన జీవనోపాధి. ఈ మతకలహాలు తమ జీవనోపాధిని నష్టపరుస్తాయని వాళ్లు అనుభవంతో గుర్తించారు. అందువల్ల వాళ్లు హరిహర తత్వాన్ని ఆహ్వానిస్తున్నారు.
“అనాది నుంచి వైదిక దేవతలను కొలిచేవారి మధ్య ఈ వైరుధ్యాలు.. పరస్పరం చంపుకోడాలు ఉంటూనే ఉన్నాయి కేతనా! ఈ హరహరతత్వం, శివకేశవ అభేదŠం అంశాలు కూడా అప్పుడూ ఉన్నవి. ఈ ఆధునిక కాలంలో ఈ గొడవలు తగ్గకపోగా మరింత కొత్త రూపు తీసుకుంటున్నాయి. ఈ పీఠాధిపతుల కంటే ఈ పండితులు, కవులు, గాయకులు ఎక్కువ హాని చేస్తున్నారయ్యా కేతనా..!”
“నిజం గురుదేవా..”
కాసేపు దీర్ఘంగా ఆలోచించి అన్నాడు తిక్కన.
“ఈ సిద్ధాంత ప్రవచనం కంటే ఈ హరిహర దేవునికొక స్వామి రూపం కల్పించి ఆ స్వామికి దేవాలయాలు నిర్మిస్తే బావుంటుందేమో. సామాన్యు లకు కావలసింది సుభాషితం కన్నా స్వామి రూపం. బౌద్ధం తొలినాళ్లలో బుద్ధుని మానవ రూపం కంటే భక్తిని ప్రేరేపించే ఆయన పాదుకలు, బోధివృక్షం.. లాంటి వాటిని పూజించేవారు. తర్వాత్తర్వాత వైదిక దేవుళ్లకు జరిపిస్తున్న పూజాదికాల తంతులను.. వాటికి లభిస్తున్న ఆదరణను గుర్తించాక.. బౌద్ధులు కూడా బుద్ధుని రూపాన్ని పూజించడం మొదలైంది. నాకొక ఆలోచన కలుగుతోంది. దీనిని కాకతీయ ప్రభువు మన గణపతిదేవుల బవారితో చర్చిస్తే..?!”
ఆయన ఆలోచన ఎప్పుడూ తప్పు అనడు గణపతిదేవుడు. తిక్కన పంపిన లేఖను అర్థం చేసుకుని వెనువెంటనే ఆచరణలో పెట్టాడాయన. కాకతీయ రాజ్యంలోని అందరు మండలేశ్వరులకు, స్థల అధిపతులకు, విషయాధిపతులకు.. అన్ని సామంత రాజ్యాలకు.. తన ‘విధానం’ లిఖిత పూర్వకంగా పంపించాడు.
అనతికాలంలోనే రాజ్యాలన్నిటా ఉన్న శిథిóల దేవాలయాలు, బౌద్ధారామాలు, జైన బసదులు, పూజాపునస్కారాలు లేని చిన్నచిన్న గుళ్లు .. అన్ని తిరిగి పూర్తిస్థాయి పూజాపునస్కారాలతో దేవాల యాలుగా కళకళలాడసాగాయి.
ఇప్పుడు ఆ దేవాలయాలలో ప్రధాన దేవుడు రామలింగేశ్వరుడు..
“ఈ స్వామి రామలింగేశ్వరుడు.. సామాన్యుడు కాదు. సమస్త పాపాలను కడిగివేసి మన జీవితాలను స్వర్గమయం చేసే మహిమాన్వితుడు. ఈ స్వామిని ప్రతిష్టించినవాడు సామాన్యుడు కాదు. సీతామహా సాధ్విని అపహరించుకు వెళ్లిన రావణాసురుడిని సంహరించేందుకు వానరసైన్యంతో సముద్రతీరానికి చేరిన వైష్ణవదేవుడు శ్రీరాముడు సముద్రాన్ని దాటేముందు రామేశ్వరం పర్వతంపై పూజించిన లింగరూప దేవుడే ఈ రామలింగేశ్వరుడు. మరి రామరావణ యుద్ధŠ్దంలో శ్రీరాముడు విజయుడై సీతతో తిరిగి అయోధ్య చేరాడు. రామాయణం పరిపూర్ణమైంది ఈ స్వామీ కృప వల్లనే..”
అనుమకొండ నగరంలో పునర్నిర్మించిన దేవాలయంలో కొత్త దేవుడు రామలింగేశ్వరుని ప్రతిష్టాకార్యక్రమంలో మహాకవి తిక్కనామాత్యుడు చేసిన ప్రవచనం ఇది.
శైవులను లింగరూపం.. వైష్ణవులను రామ శబ్దం పులకింపజేసింది.
ఇలాంటి రామలింగేశ్వర దేవాలయాలు తెలుగురాజ్యాల వ్యాప్తంగా కొన్ని వందలు ఏర్పాటు అవుతున్నాయి.
వీరశైవులు, వీరవైష్ణవులు కాస్త శాంతించారు. అంతా “రామలింగేశ్వరా.. పాహిమాం..” అంటూ కొత్త దేవుడిని పూజిస్తూ కొత్త గుర్తులతో శైవులు, వైష్ణవులు.. ఇద్దరూ కలిసిమెలిసి తిరుగాడుతున్నారు.
అందరూ విబూది.. దానిపై నిలువుగా ఎర్రెర్రని తిలక ధారణ!
కొత్తమతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ కదా!!
‘కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం
కిం కాలకూటః కిం వా యశోదా స్తన్యం
తవ స్వాదు వద ప్రభూ మే’
(నీకు పుర్రెలమాల ఇష్టమా? కౌస్తుభం ఇష్టమా? కాలకూటవిషం ఇష్టమా? యశోదా స్తన్యం ఇష్టమా? ఇది పరిష్కరించు ప్రభూ! నీవెవరివో తెలుపు. హరివా? హరుడివా?)
విష్ణు రూపాయ నమఃశివాయ..”
* * * *
ఎనిమిదవ మెట్టు: సామ్రాజ్య నిర్మాణం
ప్రాచీన వాణిజ్యంలో అక్కడెక్కడో హరప్పా మహెంజోదారో అనే పట్టణాలలో వాణిజ్యం ఉండేదని ఇప్పుడు తెలుస్తోంది కాని ఆ ప్రాచీనకాలం లోనే మన దక్షిణావర్తంలోని సముద్రతీరాలలో.. అటు పడమర, ఇటు తూర్పు తీరాలలో ఎన్నో రేవులు ఉండేవి. విశేషం ఏవిటంటే మన దేశీయవాణిజ్యం విస్తరించని రోజుల్లోనే మనకు విదేశీ వాణిజ్యం విస్తృతంగా ఉండేది. మన సాధారణ ప్రజలకే కాదు మన మహారాజులు, కులీన వర్గాలకు కూడా మంచి బట్ట లభ్యం కాని రోజుల్లోనే మనవాళ్లు నేసినబట్ట అంతా అటు రోము, పెర్షియా దేశాలకు, ఇటు తూర్పు, ఆగ్నేయ దేశాలకు ఎగుమతి అయ్యేది. ఒక నౌక బంగారం ఇస్తేనే ఒక నౌక బట్ట ఇచ్చేవాళ్లు మనవాళ్లు. రానురానూ దేశీయ వాణిజ్యం కూడా జనాభా, జనసాంద్రతను బట్టి విస్తరిస్తూ పోతోంది. ఇప్పటి వరకు వస్తువులను సేకరించి ఎడ్లబళ్లపై పెట్టుకుని వందలాది బళ్లతో నదీతీరం వరకూ పోతూ మధ్య మధ్య సంతలు, పెంటలలో ఆగుతూ అమ్ము కుంటూ పోతారు. ఆ తర్వాత పురాలలో పట్టణాలలో అమ్మకం దుకాణాలు, మఠాయలు, అంగళ్లు వచ్చాయి. మీరు గ్రామాలలో పట్టణాలలోని వీధులలో మహిళలు నెత్తిన బుట్టలు పెట్టుకుని అమ్ముకోవడం అనే కొత్త ఆలోచన చేశారు. అలాగే చిన్న చిన్న వస్తు సరఫరాదారులకు సహాయ సహకారాలు అందించి పెద్ద వణిజులతో అనుసంధానం చేశారు. ఇట్లా మన రాజ్య వాణిజ్యం విస్తృతం అవుతోంది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల లభ్యత పూర్తిగా వర్తకుల చేతుల్లో ఉంది. వీళ్లు తలచుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని రాజ్యాలలో కొన్ని గ్రామాలలో ఒక్క వస్తువు కూడా ప్రజలకు అమ్మకుండా చేయ గలరు. దాంతో వీళ్లను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని కొందరు మహా రాజులు, మత త్రీవవాదులు, సంఘ విద్రోహ శక్తులు దారుణాలు చేస్తున్నాయి. వాటిని అరికట్టి ప్రజలకు అన్ని వస్తువులూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అంకాల శెట్టి, చింతనా శిబిరంలో.
* * * *
అనుమకొండ పట్టణం.
రాచవీధికి సమాంతరంగా కుడివైపు వీధి..
ఉదయం చల్లచల్లగా ఆహ్లాదంగా ఉంది వాతావరణం.
పల్లకిలో వెళుతోంది రుద్రమాంబ. అయినవోలు దేవాలయంలో అమ్మవారి దర్శనార్థం..
రెండు అంచెల ఎక్కటీలు అంగరక్షకులుగా ముందూ వెనుకా అరబ్బీ అశ్వాలపై ప్రత్యేక దుస్తులలో.. తళతళ మెరిసే పొడవైన శూలాలు పట్టుకుని ఓ అమరికలో అందంగా పల్లకి ఒయ్యారా లకు తగినట్లు మెల్లగా హుందాగా గుర్రాలను నడిపిస్తుండగా ఆ యువరాణి రాజోచిత పటాలం వీధిలో సాగిపోతోంది. వీధులలో వస్తోన్న పౌరులు మనోజ్ఞమైన ఆ దృశ్యాన్ని మళ్లీ దొరకదేమో అన్నట్లు అపురూపంగా రెప్పవెయ్యకుండా చూస్తున్నారు. పల్లకిలో ఉన్నది తమ యువరాణి అని గుర్తించాక అప్రయత్నంగా వారి హస్తాలు ముకుళితంకాగా ఆ పల్లకి వైపు వినమ్రంగా వంగి నమస్కరిస్తూ ప్రక్కకు తప్పుకుంటున్నారు.
బలిష్టులైన బోయీలు పల్లకిని అపురూపంగా పువ్వును మోస్తున్నట్లు అలవోకగా సున్నితంగా మోస్తూ కదలుతుండగా ఆమె వ్యక్తిగత సహాయకుడు కుశనాయడు.. రుద్రమాంబ కరవాలాన్ని పట్టుకుని ఆమె అనుజ్ఞ కోసం ఎల్లవేళలా సిద్ధŠ్దమన్నట్లు ఆ పల్లకి ప్రక్కగా బోsTÖల నడకతో కాలు కదుపుతూ నడుస్తున్నాడు.
వీధి మధ్యగా పల్లకి పోతుండగా అటూ ఇటూ అశ్వాలు.. మత్తగజాలు.. మరి కొన్ని ఎడ్లబళ్లు సాగిపోతున్నాయి. అప్పుడప్పుడూ ఏనుగుల ఘీంకారాలు.. గుర్రాల హయఘోష.. ఎడ్ల మెడల్లోని గంటల చప్పుడు.. ఆ ఉదయవేళ మధురంగా సంఘటించిన మాధుర్యధ్వని తరంగాలు వీధి అంతటా రసరమ్యంగా వినిపిస్తున్నాయి.
ఆ వీనులవిందైన శబ్దాల మధ్య వీధిలో ఓ ప్రక్కగా ఓ ఎడ్లబండి పోతోంది మెల్లగా.
దాని తొట్టిలో కూర్చున్న యువకుడు..
“ఉప్పు.. అమ్మా ఉప్పు.. బందరు ఉప్పు.. తెల్లగా తెలిమబ్బులా.. ఉప్పు.. రాళ్ల ఉప్పు.. రతనాల ఉప్పు..” అని గళమెత్తి అరుస్తున్నాడు.
అతడు ఆపాక బండి ప్రక్కగా నడుస్తున్న ఫ్రౌఢ వయస్కుడు తండ్రి కాబోలు.. అరుస్తున్నాడు. “ఉప్పమ్మా.. ఉప్పూ..”
వాళ్లు ఒకరి తర్వాత ఒకరు అరుస్తూ బండిని ముందుకు తోలుకుపోతూ వీధి పక్కనున్న నివాసాల గుమ్మాల వంక ఆశగా చూస్తున్నారు కానీ వీధిలో పోతున్నవారిని ఈ తండ్రీకొడుకులు పట్టించుకోవడం లేదు.
ఆ బండి పక్కగా అప్పుడే రుద్రమాంబ పల్లకి వచ్చింది. ఉప్పు అమ్మకం కేకలు విన్న రుద్రమాంబ పల్లకికున్న తెర సున్నితంగా తొలగించింది.
లిప్తకాలంలో కుశనాయడు తన చెవిని ఆమె నోటి వద్దకు చేర్చాడు.
“కుశా.. ఆ ఉప్పు అమ్మకందారులు ఎవరో తెలిసినవారులా ఉంది.. ఆ పెద్దాయన గొంతు ఎక్కడో విన్నట్లుంది..”
ఆగి బండి వంక వివరంగా చూస్తూ వాళ్ల అమ్మకం పిలుపు మళ్లీ వింటూ బండి వద్దకు వెళ్లి ఆ పెద్దమనిషిని వివరంగా నిశితంగా చూసి నివ్వెరపోయాడు.
కుశనాయడుని చూసిన ఆ పెద్దమనిషి తల తిప్పుకున్నాడు.
అప్పటికే రుద్రమాంబ ఆ గొంతును పోల్చి వీధి ప్రక్కగా పల్లకిని ఆపించింది. అప్పటికే ఉప్పుబండి ఆ పల్లకీని సమీపించడం.. రుద్రమదేవి ఆ బండి పక్కగా నడుస్తున్న పెద్ద మనిషిని గుర్తించడం జరిగింది. ఆయన చివ్వున తలవాల్చగా ఆమె నివ్వెరపోయి కంపిస్తున్న స్వరంతో చిన్నగా అంది.
“అంకాల మామా!!”
కాకతీయరాజ్యంలో అత్యంత ధనవంతుడు, ఒకప్పుడు చప్పన్నదేశాలను శాసించిన పృద్వీశెట్టి, అనుమకొండలో మకుటంలేని మహారాజుగా వెలిగినవాడు, మహారాజులకు అప్పులు ఇచ్చినవాడు, కాకతీయరాజ్య పాలకుడు గణపతిదేవ మహారాజు లకు అనుంగు స్నేహితుడు అంకాలశెట్టి.. అదే అనుమకొండ వీధుల్లో ఓ బండిలో ఉప్పు అమ్ము కోవడం.. హతవిధీ.!!
కాకతీయ యువరాణి రుద్రమాంబ నోటమాట రాక నిలబడిపోయింది.
* * * *
గణపతిదేవుని మందిరం.
ఆయన ఆసనంలో కూర్చుని ఉండగా ఆ సింహాసనం పక్కగా నిలబడి ఉంది రుద్రమాంబ.
ఎదురుగా తలవాల్చి నిలబడి ఉన్నారు తండ్రీ కొడుకులు అంకాలశెట్టి, ఉప్పుశెట్టి అనే సంజయశెట్టి.
“ఇంత దారుణమా!నా ప్రాణస్నేహితుడు.. ఒకప్పటి పృద్వీశెట్టి.. నాలుగు మూడు చిన్న రాజ్యాలను కొనగల మహా ఐశ్వర్యవంతుడు.. ఓ చిన్న ఎడ్లబండిలో ఉప్పు అమ్ముకోవడమా!ఏవిటిది అంకాలా..?”
ఆయన క్షుదిత హృదయం ఆయన వాక్కులలో బయల్వేడలుతోంది.
అంతా మౌనం.. పూర్తి మౌనంగా.. నిర్లిప్తంగా.. నిర్వికారంగా ఉంది అంకాల శెట్టి ధోరణి.
మళ్లీ అన్నాడు గణపతిదేవుడు.
“అసలు.. నువ్వేనా ఇలా నా ముందు నిలబడింది.. నమ్మలేకున్నాను మిత్రమా..!”
తండ్రి వేదన తెలిసినట్లు అంకాల జవాబుకోసం చూస్తోంది రుద్రమ. ఆమెకు అనుమకొండ వాణిజ్య సమాజంలో అంకాలకు ఎంతటి గౌరవ ప్రపత్తు లున్నాయో ఆమె స్వయంగా చూసింది ఎన్నోసార్లు.
అందులో ఓ సంఘటన ఆమెకు బాగా గుర్తు.
అంకాల కొడుకు సంజయశెట్టి, రుద్రమాంబ మంచి స్నేహితులు. ఓరోజు అంకాల, సంజయ, రుద్రమ మఠియ వాడలోకి వచ్చారు. అంకాలను చూసిన మఠియదారులు లేచి ఆయనకు వందనాలు చేయసాగారు. ఆయన ప్రతి నమస్కారం చేస్తూ.. పిల్లలతో మాట్లాడుతూ.. ముందుకుపోతున్నాడు.
సహజంగా రుద్రమను గుర్తించిన వాళ్లు తక్కువ.
ఓ అంగడిలో కనిపించిన బెల్లపు ఉండలను చూసి నోరూరింది రుద్రమకు.
“మామా.. నాకా బెల్లపు ఉండలు తినాలని పిస్తోంది.. కొనుక్కుంటా..” అంది చిన్నపిల్లలా.
ముగ్గురూ ఆ అంగడి వద్దకు వెళ్లగా బెల్లంపాకపు ఉండలు కావాలని అడిగింది. శెట్టి తను ఇవ్వకుండా మరో అంగడివైపు చూపి అక్కడ కొనుగోలు చేయవలసినదిగా అభ్యర్థ్ధించాడు. ఆశ్చర్యపోయింది. అప్పుడతను ఆ అంగడి ముందున్న ఆసనాన్ని చూపి అంగళ్లవీధి సంప్రదాయాన్ని వివరించాడు. ప్రతి అంగడి ముందు కొనుగోలుదారుల కోసం ఓ చెక్క ఆసనం ఉంటుంది. ఉదయం మొదట వచ్చిన కొనుగోలుదారుడు తన కొనుగోలు అయ్యాక ఆ ఆసనాన్ని ఎత్తి అంగడిశెట్టికి అందజేస్తాడు. అంగడి ముందు ఆసనం లేకుంటే మొదటి బేరం.. అంటే బోణి అయినట్లు గుర్తు. అంటే ఏ అంగడిముందు ఆసనం ఉన్నదో ఆ అంగడిలో బోణి కాలేదన్నమాట. బోణి అయిన అంగడివాడు కానివాడికి సహకరించి అతనికి కూడా బోణి అయ్యేలా చూస్తాడు. ఇది ఆ మఠియవాడ ‘సమయ’ ధర్మం. ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టినవాడు పృద్వీశెట్టి అంకాల.
ఇది ఆ అంగడిశెట్టి చెప్పినప్పుడు నివ్వెర పోయింది రుద్రమదేవి. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వణిజుడు అంకాల శెట్టి. అప్పటినుండి ఆమె ఏ అంగడికి వెళ్లినా అంగడి ముందు ఆసనం ఉన్నాదా? లేదా? అని చూసేది.
అలాంటి వాడు ఇప్పుడు కేవలం దినం గడుపుకోవడానికి ఇలా ఉప్పు అమ్ముకునే అతి దీనస్థితిలో ఉండటం ఆ తండ్రి కూతుళ్లను కలచి వేస్తోంది.
గణపతిదేవుడు అడిగాడు. అంకాలశెట్టిది అదే మౌనం. ఈసారి అంకాల కొడుకును అడిగాడు.
“ఎందుకు ఈ స్థితి వచ్చింది.. నీ పేరేమి టన్నావ్..” అన్నాడు అంకాల కొడుకును ఉద్దేశించి.
“ఉప్పుశెట్టి మహారాజా..”
“ఉప్పు.. ఉప్పు.. ఉప్పు! నోర్మూయ్ రా వెధవా.. నేనడుగుతోంది నీ పేరు.. ఏం వినోదంగా ఉందా?” మందిరం అదిరిపోయేలా అరిచాడు గణపతిదేవుడు. తండ్రీకొడుకులిద్దరూ నేలపై సాగిలపడిపోయారు.
“క్ష.. క్ష.. క్షమించండి మహారాజా. సంజయ శెట్టి.. సంజయశెట్టి నా పేరు.”
బట్టల్లో మూత్రం చేసుకున్నట్లు వణికిపోతూ అన్నాడు సంజయశెట్టి.
“లే.. అంకాలా.. లేచి ఇలా రా. ఈ ఆసనంలో కూర్చో. అడుగుతోంది నేను..అర్థ్ధమైందా??” ఆయన కోపం తగ్గడం లేదు.
“అర్థÁమైంది మహారాజా..”
“నేను నీ మిత్రుడ్ని. మహారాజా అని పిలవడం ఎప్పుడు నేర్చుకున్నావ్?” మళ్లీ గర్జించాడు గణపతిదేవుడు.
“క్షమించు మిత్రమా! భటుడిని కూడా గౌరవించడం అవసరమని గ్రహించి కొద్దికాలమే అయ్యింది..” అంకాల గొంతు జీవితానుభవాన్ని చెబుతూ గాద్గదికమయ్యింది.
“నిలబడతాను మిత్రమా! మీ పక్క ఆసనాన్ని కోరే అర్హత నాకు ఇప్పుడు లేదు.” అంటూ తలదించు కుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఒకనాటి మహా వణిజుడు అంకాలశెట్టి. మందిరమంతా నిశ్శబ్దం.
గణపతిదేవుడు ఆసనం దిగాడు. అంకాల దగ్గరకు వెళ్లాడు. అతన్ని ఆర్ద్రంగా హత్తుకున్నాడు.
అతన్ని తీసుకుని వచ్చి పక్క ఆసనంపై కూర్చుండబెట్టాడు.
“చెప్పు. నీ ఈ దుస్థితికి కారణం ఎవ్వరు? నాకు సమాధానం కావాలి. మౌనం సమాధానం కాదు అంకాలా..” మమకారంగా అడిగాడు
‘మౌనమే మనుగడకు ఆలంబన’ అని అంకాల ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. చెప్పకుంటే గణపతి దేవుడు వదిలిపెట్టేలా లేడని గుర్తించాడు. కాస్త తల ఎత్తాడు.
(సశేషం)

మత్తి భానుమూర్తి