కీ।।పూ।। 2,3 శతాబ్దంలో శాతావాహనుల కాలం ప్రారంభమైన తరువాత తెలుగుభాషకు శ్రీకారం చుట్టినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి మహా విద్వాంసురాలు, చక్కటి రాజనీతిజ్ఞురాలు. ఆమే తెలుగు భాషకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తున్నది. ఆమె ప్రతిభా పాటవాలకు ముగ్ధుడైన శాతకర్ణి, తన పేరును గౌతమీపుత్ర శాతకర్ణి అని గర్వంగా ప్రకటించుకొన్నాడు. ఈ రాజవంశంలోని 17వ రాజు హాలుడు చక్రవర్తే  కాకుండా స్వయంగా కవి. అంతకు మంచి కవిపోషకుడు. ఆయన ‘గాథా సప్తశతి’ సాహిత్యాన్ని విలువలతో తూకం వేసే ప్రమాణ గ్రంథ•ంగా నిలుస్తుంది. ఇది ఒక కాలానికి చెందినది కాదు. త్రాసులో ఒక తక్కెడలో బంగారాన్ని, మరో తక్కెడలో అక్షరాలను ఉంచితే – రెండూ సమానంగా తూగుతాయన్నదే వీరి భావన.

‘‌వర్ణా వళీమస్య జానంతో లోకాలోకైర్గౌర వాభ్యధికాః /సువర్ణకార తులా ఇవ నిరక్షరాలిపి స్కంధై రుద్యంతే।।

ఈ శ్లోకం గాథాసప్తశతిలోని అక్షరాల విలువను తూకం వేస్తుంది. ఈ గ్రంథం ప్రధానంగా పల్లెటూరి ప్రేమ, శృంగారం, విరహం, ప్రకృతి వర్ణనలతో కూడిన చిన్న చిన్న కవితల (గాథల) సంకలనం. దీనిని ప్రాచీన రోమన్‌ ‌కవి ‘‘ఓవిడ్‌’’ ‌రాసిన ‘‘ఆర్స్ అమటోరియా’’తో పోల్చవచ్చును. లేదా క్రీ।।పూ।। 7వ శతాబ్దం నుండి కీ।।శ।। 10వ శతాబ్దం వరకూ వివిధ గ్రీకు కవులు రాసిన ‘‘పాలటైన్‌ అం‌థాలజీ’’ (చిన్న కవితల)తో పోల్చవచ్చును. అయితే హాలుడు బృహత్‌ ‌కథ•ను సంకలనం చేయడం వెనుక ఓ పెద్ద విషయమే ఉంది.

గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్‌కథ రాశాడు (అది ఇప్పుడు అలభ్యం). దానిని ఆధారంగా చేసుకొని సోమదేవుడు 11వ శతాబ్దంలో సంస్కృతంలో కథా సరిత్సాగరం రాశాడు. కాశ్మీర్‌ ‌రాజు అనంతదేవుని పట్టమహిషి సూర్యమతీదేవి వినోదం కోసం ఈ కథ•లు రాసినట్లు తెలుస్తుంది. ఈ కథల్ని 18 పుస్తకాలుగా, 124 అధ్యాయాలుగా 21000 శ్లోకాలతో రాశారు. దీనిని వేదం వేంకటరాయశాస్త్రి గారు ఆంధ్రీకరించారు.

గాథా సప్తశతిని సంకలన కర్త హాలునికి అస్సలు సంస్కృతం రాదు. ఆ భాషలో పాండిత్యం గల సింహాళ దేశపు రాకుమార్తె ‘మలయవతి’ని వివాహం చేసుకున్నాడు. ఒకనాడు ఆమె కొలనులో స్నానం చేస్తూ ఉండగా హాలుడు ఆమెపై నీళ్లు చల్లాడు. ఆమె సంస్కృతంలో ‘‘మోదకై స్తాడయా’’ (మా ఉదకైః తాడయా) నీళ్లతో నన్ను కొట్టవద్దు అంది. పదాలకు అనేక అర్థాలు ఉంటాయి. మోదకములు అంటే లడ్లు (తినుబండారములు) అనే అర్థం కూడా ఉంది. హాలునికి రెండవ అర్థం స్ఫురించి సేవకులను పిలిచి లడ్లు తెప్పించాడు. దానికి మలయవతితో పాటు చుట్టూ ఉన్న పరిచారికలు నవ్వారు. రాజు తలదించు కున్నాడు. అక్కడి సందర్భం నీళ్లు చల్లుతుంటే వద్దు అంది. ఉదాహరణకి ‘‘దయ చేయండి’’ అనే పదాన్ని రావడానికి, వెళ్లడానికీ వాడతారు. అయితే అక్కడ గల సందర్భాన్నిబట్టి దాని అర్థం ఉంటుంది.

ఈ అనుభవంతో, తనకు సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించాలని ఉందని, అందుకు మార్గమేమిటని ఆస్థాన పండితులు గుణాఢ్య, శర్వవర్మలను సంప్రదించగా, ఆరు సంవత్సరాలలో సంస్కృతం నేర్పగలనన్నాడు శర్వవర్మ ‘రాజుకు నీవు ఆ గడువలో సంస్కృతం నేర్పగలిగితే నేను సంస్కృత ప్రాకృత భాషలను వదలి, అడవుల్లో జీవిస్తూ పైశాచిక భాషలో గ్రంథ రాస్తాను’ అన్నాడు గుణాఢ్యుడు. ఈ పందెంలో శర్వవర్మ గెలిచాడు. గుణాఢ్యుడు అడవులకు పోయి ఏడేళ్లు ఏడు ఆశ్వాసాల గ్రంథం ‘బృహత్‌ ‌కథ’ రాసి హాలుని వద్దకు పంపగా ఆయన ఆ గ్రంథాన్ని స్వీకరించలేదు. దానితో కోపించిన గుణాఢ్యుడు గ్రంథ•ంలో ఆరు ఆశ్వాసాలను అగ్నికి ఆహుతి చేయగా ఏడవ దానిని మాత్రం హాలుడు రక్షించగలిగాడు. అందులోని కొన్ని కథలు ఉపకథలు కలిసి నేడు బృహత్‌కథ•గా ప్రసిద్ధమైంది.

రెండు వేల సంవత్సరాల నాటి ఈ కథలు అరేబియన్‌ ‌నైట్స్, ‌పంచతంత్రం, హితోపదేశం, బేతాళ, పంచవింశతి కథలుగా రూపాంతరం చెందాయి, అయితే బృహత్‌కథ కర్త గుణాఢ్యుడు తెలుగువాడు కావటం విశేషం. హైదరాబాద్‌ ‌దగ్గరలోని కొండాపూర్‌ ఆయన పుట్టిన ఊరని ప్రజల నమ్మకం.

వేదభాష ప్రజా వ్యవహారాల నుంచి దూరమై సంస్కృత మేధావులకు పరిమితం కావటంతో బౌద్ధ ద్యమాల కాలంలో ప్రాకృత, పాళీ రూపాలకు వ్యాప్తి పెరిగింది. మహారాష్ట్ర, శౌరసేన, మగధి, పైశాచి లాంటి ప్రాకృత భేదాలు ఏర్పడ్డాయి. అందుకే హాలుడు సేకరించిన కథలు మహారాష్ట్ర ప్రాకృతంలో ఉ న్నాయి. తెలుగు నేలకు సంబంధించినంత వరకు తొలినాళ్లలో పాళీ, ప్రాకృతాలు రాజాద•రణ పొంది సాహిత్య భాషలుగా వికసించాయి. సంస్కృతానిది ద్వితీయ స్థానంకాగా, ఆంధ్రభాష మూడవ స్థానంలో కొనసాగింది. ‘లలితమైన మధురాక్షరాలతో నిండిన ప్రాకృతం ఉండగా, సంస్కృత కావ్యాలను ఎవరు చదువుతారు?’ అని ఒక గాథ ప్రశ్నిస్తుంది, గాథా సప్తశతి ఇతర ప్రాకృత కావ్యాలు ఉత్తరాది రాష్ట్రాలలో సజీవంగా ఉన్నాయి. తెలుగు నేలపై ‘‘శ్రీ ఉత్పత్తి పిడుగు’’ అనే ఒక శైవసంస్థ గదను లోగోగా ధరించి శూన్యవాదం ప్రబోధించే వారి పాలిట (బౌద్ధ్దుల) పిడుగులా పనిచేసింది తద్వారా ప్రాకృతం కనుమరుగైంది.

హాలుడు తన కాలంలో జానపదుల నోటిని వెలువడిన వేలాది గాథల నుంచి ఉత్తమమైన 700 గాథ•లను సేకరించి, సంకలనం చేశాడు. 8వ శతాబ్దానికి చెందిన పాకృత కవి ‘ఉద్యోతన సూరి’ కువలయమాల కావ్యం రాశాడు. ‘ఆంధ్రులు సుందరంగా ఉంటారని. సౌందర్య పిపాస ఎక్కువ. వాళ్లకి అందగత్తెలంటే మహా మోజు. యుద్ధ జీవులు. కదన రంగాన ముందుంటారు. సహజంగా భోజన ప్రియులు. కమ్మని రుచులు, కొత్త రుచులను ఆస్వాదించే తత్వం ఉన్నవాళ్లు’ అని దానిలో ఆంధ్రులను గురించి రాశాడు.

గాథా సప్తశతి ధ్వని శాస్త్రానికి మచ్చుతునక. కావ్య సౌందర్యానికి ప్రతీక. ఆనందవర్ధనుడు సాహిత్య శాస్త్రంలో ధ్వని లక్షణాలకు గాథాసప్తశతిలోని వాటిని ఉదాహరణలుగా ఉపయోగించాడు.

హర్షవర్ధనుడి ఆస్థాన కవి బాణుడు తన ‘హర్షచర్రి ఉపోద్ఘాతంలో ఒక శాతవాహన రాజు ఉత్తమ కావ్యకోశాన్ని (యాంథాలజీని) రూపొందించి నట్లు పేర్కొన్నాడు. ‘‘గాథా సప్తశతి కావ్య సౌందర్యంతో కూడిన, అక్షయమైన రత్నాలను సమకూర్చిన కోశం’’ అనటం చాలా విలువైన ప్రశంస.

ప్రాకృతం అంటే ప్రకృతి. అంటే మూలభాష సంస్కృతం అంటే సస్కరించబడినది అని ఒక వాదన ఉంది. సంస్కృతంలో ‘‘ధర్మ’’ అనే కంటే పాకృతంలో ‘‘దమ్మ’’ అనటం తేలిక. అయినా గాథా సప్తశతి మహారాష్ట్ర పాకృతం తొలినాటి రచన. శాతావాహ నుల తరువాత ఐదారు శతాబ్దాల కాలం ఈ ప్రాకృత భాష పరిణామక్రమం కొనసాగింది. అందువలన శాస్త్రరీత్యా మహారాష్ట్ర ప్రాకృత లక్షణాలు పూర్తిగా అందులో ఉండకపోవచ్చు కూడా! కులబాలదేవుడు, గంగాధర భట్టు, వీరణారాయణుడు, సర్వజ్ఞ చక్రవర్తి, పెదకోమటి వేమారెడ్డి, ఇలా చాలామంది కవులు సంస్కృత వాఖ్యానాలు రాశారు.

‘‘బరువులెత్తే కార్మికుడి లాగా మేఘుడు వాన పగ్గాలు వేసి భూమిని పైకి లాగుతూ ఊపిరి బిగబట్టి బిగ్గరగా మూలిగినట్టు ఉరుములు మోగుతున్నాయి’’ అంటుంది ఓ గాథ. ఇలాంటి ఊహాలు జనకవులకు వచ్చినట్లు రాజకవులకు రావంటారు ఆచార్య తిరుమల రామచంద్ర. నాగలి దున్నేటప్పుడు ఎద్దుల కన్నులలో కనిపించే శ్రమ మనసును కదిలిస్తుంది. ఇందులో జీవకారుణ్యం జాలువారుతోంది. ఇది పశుపోషణ. పశువులను కన్న బిడ్డల్లా చూసుకోవాలి, ఎద్దులు యాంత్రిక సాధనాలు కావు.. జీవన సహచరాలు. శాతవాహన సమాజంలో వ్యవసాయం ఒక సజీవ సంబంధాల వ్యవస్థ.

గాథాసప్తశతి సామాజిక, సాంస్కృతిక జీవితానికి ప్రతిబింబం. గ్రామీణ జీవనం, రైతుల శ్రమ, రుతుచక్రం, పంటలు, పండుగలు, స్త్రీ పురుషుల మధ్య సున్నితభావాలు, ప్రేమలు, విరహాలు, కుటుంబ సంబంధాలను సహజ సౌందర్యంతో చిత్రించింది.

కుటుంబ వ్యవస్థలో వృత్తి విభజన కనిపిస్తుంది. ఈ గాథలలో గ్రామీణ-పట్టణ జీవన వ్యత్యాసాలు కన్పిస్తున్నాయి. నాగరికులు ధనార్జన, వాణిజ్య ఆలోచనలతో జీవిస్తే గ్రామీణులు, జీవనానుభూతు లతో జీవిస్తున్నారని గ్రామీణులు సంగీతం, నృత్యం, కోడిపందాలు, పొట్టేళ్ల పందాలు, ఎద్దుల పందాలు వంటి ఎన్నో పోటీలు నిర్వహించి నట్లు ఈ గాథ•ల ద్వారా తెలుస్తున్నది.

పుళింద అనే ఆటవిక జాతి స్త్రీ… తన భర్త పరాయి స్త్రీతో సరస సల్లాపాలు చేయడంపై ఈర్ష్య పడడాన్ని ఒక గాథలో వర్ణితమైనది. కులాంతర వివాహాలు ముమ్మరంగా జరిగేవని తెలుస్తున్నది.

భర్త పొలంలో కష్టపడుతుంటే, ఇంటి పని భారంతో భార్య అలసిపోతుంది. ఉత్పాదకతలో స్త్రీ పురుషుల సమభాగస్వామ్యం కన్పిస్తుంది. రైతు మాత్రమే కాదు, రైతు కుటుంబమే ఉత్పత్తి సాధనం. ఇది ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలకు ముందే ఉన్న గ్రామీణ వాస్తవం.

సంస్కృతంలోగానీ, ప్రాకృతంలోగానీ, దేశ భాషలలోగానీ, గాథా సప్తశతితో సరితూగ గల కవితా సంపుటి మరొకటి లేదనేది సాహిత్య లోకంలో ప్రసిద్ధమే, అత్యధిక సామాజిక జీవనం. దీనిలో ప్రతి బింబించడమే దీనికి మూలకారణం.

శాతవాహనుల కాలంలో రోమ్‌, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం జోరుగా సాగేది. వ్యాపారులను శ్రేష్ఠులు లేక శెట్ట్టిలు అనేవారు. గ్రామాల్లోని రైతులకన్నా భిన్నంగా ఉండేవారు. విలాసవంతమైన గృహాలు. విశాలమైన గదులు కలిగి ఉండేవారు. సన్నని పట్టువస్త్రాలు, విదేశీ దుస్తులు, రత్నఖచిత ఆభరణాలు ధరించేవారు. నాడు బట్టను కత్తిరించడం, కుట్టడం భారతీయ సాంప్రదాయం కాదు. కాబట్టి ‘కొలతలు సరిగ్గా ఉండి, వెడల్పూ, పొడవు బాగుండి ఉతికితే రంగు వెలసి పోకుండా, కట్టుకుంటే సుఖంగా ఉండే బట్టను ఇవ్వు’ అని బట్టల కొట్టాయన్ని ఓ నాయక అడిగిన గాథ ఉంది. చెప్పులు కుట్టువారున్నారు కానీ, బట్టలు కుట్టే (దర్జీలు ) వారు లేరు. ఒకదాన్ని పంచెగానూ, రెండవదాన్ని నడుముకు కట్టుకొనేవారు.

దూర ప్రాంతాలకూ, విదేశాలకూ వ్యాపార నిమిత్తం వెళ్లేటప్పుడు గుంపులు గుంపులుగా ప్రయాణించేవారు. దారిలో ఊళ్ల వద్ద పెద్ద మర్రి చెట్టు చూసుకుని సరుకుదించి వ్యాపారం చేసేవారు. అందుకే వారికి ‘బనియా’అని పేరు వచ్చింది. అలాంటి ఉత్తరాది వ్యాపారులకు బనియాలు అని పేరు వారికి ఆశ్రయం ఇచ్చేది కాబట్టి వటవృక్షాన్ని ‘‘బనియన్‌ ‌ట్రీ’’ అన్నారు. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ముత్యాలు, రత్నాలు ఆ రోజుల్లో ముఖ్య వ్యాపార వస్తువులు. వ్యాపారులు నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలకు వెళ్లి ముడిసరుకు, ముఖ్యంగా ప్రత్తి, ధాన్యం పంటపండే కాలంలో సేకరించేవారు. రైతుకు ముందుగాపెట్టుబడి పెట్టి ఆకట్టుకొనేవారు. గ్రామీణ యువతులు పట్టణం నుండి వచ్చిన శెట్టీల వేషధారణను, వారి వింత ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసేవారని హాలుడు రాశాడు. వ్యాపారవేత్తలు సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొనేవారు, ధర్మకార్యాలు, ఆలయనిర్మాణం, సత్రాల నిర్వహణ, కరవుకాలంలో ప్రజలను ఆదుకోవడం చేసేవారు. వాణిజ్య సంఘాలను శ్రేణి అనేవారు, వీరే రాజుల వద్ద ప్రతినిధులుగా ఉండేవారు, నాడు ప్రధాన రేవు పట్టణాలు భరుకచ్చం, ప్రతిష్టానపురం, ఘంటశాల బాగా ప్రసిద్ధి పొందాయని హలుడు వివరించాడు

పాళీ, ప్రాకృతాలలో తెలుగుపదాలు అనేకం చేరాయి. తెలుగు ‘నాగలి’ (రుగ్వేదంలో లాంగల) పాళీ భాషలో ‘నాంగల’గా చేరింది. ప్రాకృతము, పాళీ, సంస్కృతం భాషలు ముప్పిరి గొనటం వలన క్రీస్తు పూర్వం., శకం వరకూ తెలుగు సాహిత్య భాషగా ఎదగలేదు. అంతవరకు తెలుగువాడుక భాషగానే ఉంది. గాథా సప్తశతిలోని గాథల రచయితలు తెలుగు, కన్నడ, మరాఠీ వారై ఉండాలి అని అభిప్రాయ పడుతున్నారు భాషావేత్తలు.

మూలం:

1. గుణాడ్యుడి బృహత్‌ ‌కథ బై శారదా ప్రసాద్‌.

2. ‌సంచిక (తెలుగు సాహిత్య వేదిక) హాల శాతవాహనుని గాధాసప్తశతి బై డా।।.జి.వి. పూర్ణచందు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE