ధర్మశాస్త్రాలలోనూ, పురాణాలలోనూ ఆదర్శ గృహిణి అనే పదం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తమ జీవితాల్లో ఎదురైన క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, తమ వ్యక్తిత్వంతో పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారు అహల్య, సీత, తార, మండోదరి, ద్రౌపది, కుంతి. ఈ ఆరుగురు స్త్రీవ•ర్తులు భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తికి వివిధ రూపాలు. ఆరు లక్షణాలను వేర్వేరు సందర్భాల్లో తమదైన శైలిలో నిరూపించుకున్నారు.

అహల్య గౌతమ మహర్షి భార్య. ఇంద్రుని మాయ వల్ల శాపానికి గురైనా, శ్రీరాముని పాదస్పర్శతో తిరిగి తన రూపాన్ని పొందింది. ఇది క్షమాగుణానికి, నిరీక్షణకు నిదర్శనం. ద్రౌపది పంచపాండవుల ధర్మపత్ని. అపారమైన మేధస్సు, పట్టుదల కలిగిన వ్యక్తిత్వం. అధర్మంపై యుద్ధం చేయడానికి ప్రేరణనిచ్చిన శక్తి స్వరూపిణి. సీత సహనానికి, పాతివ్రత్యానికి మారుపేరు. భూదేవి పుత్రికగా కష్టాలను ఓర్చుకుంటూ ధర్మాన్ని నిలబెట్టిన ఆదర్శవ•ర్తి. తార వాలి భార్య. అత్యంత తెలివైనది, రాజనీతిజ్ఞురాలు. కష్టకాలంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగల వివేకవతి. మండోదరి రావణుని భార్య. భర్త అధర్మ మార్గంలో వెళ్తున్నా, అతనికి హితబోధ చేస్తూ తన ధర్మాన్ని పాటించిన నిశ్చల భక్తురాలు. పాండురాజు భార్య కుంతిని శ్రీకృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు, ఆమె ‘ఎప్పుడూ కష్టాలనే ఇవ్వు’ అని కోరింది. ఎందుకంటే, కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుని స్మరణ ఎక్కువగా ఉంటుందని ఆమె భావన. ఇది ఆమెలోని అత్యున్నతమైన వైరాగ్యానికి, భక్తికి గుర్తు. కుంతి పాత్ర మనకు నేర్పే పాఠం ఏమిటంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఒంటరిగానైనా సరే ధర్మాన్ని నమ్ముకుని బిడ్డలను సరైన మార్గంలో పెంచడం ఎలాగో అని.

‘అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తధా పంచకన్యాం స్మరేన్నిత్యం మహాపాతక నాశనం’ వీరందరూ అయోనిజలు. అంటే తల్లి గర్భం నుంచి పుట్టినవారు కాదు. అందుకే వారికి ఏ దోషాలు అంటవు. మహా పతివ్రతలు. వీరిని రోజుకు ఒక్కసారి తలుచుకుంటే చాలు మహాపాతకాలు కూడా నశిస్తాయి. కొన్ని సంప్రదాయాలలో ‘సీత’కు బదులుగా ‘కుంతి’ పేరును కూడా చేరుస్తారు. ఈ ఆరుగురు తమ ఇంద్రియాలను, మనస్సును కష్టకాలంలో ఎలా అదుపులో ఉంచుకున్నారో అది ఒక పరిపాలన వంటిదే. ధర్మ పరిపాలన అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచి పెట్టకుండా జీవించడం. రాజ్యాల్లో తలెత్తిన సంక్షోభాలను (వాలి మరణం తర్వాత తార, రావణుడి మరణం తర్వాత మండోదరి, పాండురాజు మరణం తర్వాత కుంతి) తమ విజ్ఞతతో చక్కదిద్దారు.

అహల్య

మొదటి వ్యక్తిగా అహల్యను పేర్కొనడానికి ప్రధాన కారణం ఆమె సహనం. ఇంద్రుని మాయ వల్ల తాను తెలియక తప్పు చేసినా, భర్త ఇచ్చిన శాపాన్ని మౌనంగా భరించి, కొన్ని వేల ఏళ్లు తపస్సు చేస్తూ శ్రీరాముని రాక కోసం నిరీక్షించింది. భూదేవికి ఉండేంత ఓర్పు ఆమె సొంతం. గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆమె చేసిన సేవలు అనన్యం. రూపేషు లక్ష్మి అన్నట్లుగా బ్రహ్మదేవుడు అహల్యను సృష్టించి నప్పుడు, ఆమెను అత్యంత సౌందర్యవతిగా తీర్చి దిద్దాడు. ఆమె రూపం సాక్షాత్తు లక్ష్మీదేవిని తలపిస్తుందని పురాణాలు చెబుతాయి. అహల్య కేవలం ఒక అందమైన స్త్రీ మాత్రమే కాదు, ఆమె జ్ఞానానికి ప్రతీక. అహల్య అంటేనే ‘హల్య’ (దున్నడం/కల్మషం) లేనిది అని అర్థం. అంటే ఎటువంటి మాలిన్యం లేని మనస్సు కలది. అహల్య తన జీవితంలో ఎదురైన ఒడుదొడుకులను ఎదుర్కొని, పశ్చాత్తాపంతో తపస్సు ద్వారా తిరిగి తన పవిత్రతను నిరూపించుకుంది. గౌతమ మహర్షి పత్నిగా అహల్య ఆశ్రమ విధులను అత్యంత భక్తితో నిర్వహించేది. మహర్షి తపస్సుకు, ఆయన దైనందిన అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక దాసి వలె వినమ్రతతో సేవలు చేసేది. ఆమె సేవాగుణం ఆశ్రమానికి ఒక పవిత్రతను ఇచ్చేది. ఆమె గౌతమ మహర్షి వంటి జ్ఞాని పక్కన ఉంటూ, ఆమె ధర్మ సూక్ష్మాలను గ్రహించింది. వివేకంతో మెలగడం ఆమె సహజ గుణం. ఆశ్రమానికి వచ్చే అతిథులకు, భర్తకు ప్రేమతో భోజనం సమకూర్చడంలో ఆమె తల్లి వంటి ఆప్యాయతను చూపేది. ఆమె చేతి వంట ఆశ్రమవాసులకు తృప్తినిచ్చేది. భర్త మనసును ఎరిగి, ఆయనకు మానసిక ఉల్లాసాన్ని, సుఖాన్ని అందించడంలో ఆమె రంభ వలె ప్రియమైన అర్ధాంగిగా ఉండేది. అహల్య పాత్ర ద్వారా మనకు తెలిసే గొప్ప సత్యం ఏమిటంటే మనిషికి పరిస్థితుల ప్రభావం వల్ల తెలియక పొరపాటు జరిగినా, పశ్చాత్తాపం, నిరీక్షణ ద్వారా తిరిగి తన పవిత్రతను, గౌరవాన్ని పొందవచ్చు. అందుకే ఆమెను మొదటి వ్యక్తిగా స్మరిస్తాము.

సీతామాత

రాజకుమారిగా పుట్టి, కోడలిగా అడుగుపెట్టిన సీత, అరణ్యవాస సమయంలో రామునికి సేవ చేయడంలో ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించలేదు. కారడవుల్లో రాముని అవసరాలను గుర్తిస్తూ, ఒక దాసి వలె వినమ్రతతో ఆయనకు సేవలు అందించింది. భోగభాగ్యాలను వదిలి భర్త అడుగు జాడల్లో నడవడం ఆమె సేవానిరతికి నిదర్శనం. రాముడు ఏదైనా ధర్మసంకటంలో ఉన్నప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సీత ఒక మంత్రిలా సరైన సలహాలు ఇచ్చేది. దండకారణ్యంలో ఉన్నప్పుడు మునులను రక్షిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు, అహింస గురించి, ఆయుధధారణ వల్ల కలిగే మార్పుల గురించి సీత చేసిన హితబోధ ఆమెలోని వివేకానికి, మంత్రిత్వానికి గుర్తు. సీత సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం. ఆమె సౌందర్యం కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు, పవిత్రతతో (అంతర సౌందర్యం) కూడినది. లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు కూడా ఆమె తన తేజస్సును కోల్పోలేదు. శ్రీరాముడు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, రాజభోగాలను తృణ ప్రాయంగా వదిలేసి, కారడవుల్లో భర్త అడుగుజాడల్లో నడిచిన ఆమె సహధర్మచారిణి అనే పదానికి నిలువెత్తు రూపం. రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్లి నప్పుడు, అపారమైన సంపదను, వైభవాన్ని చూపి ప్రలోభపెట్టినా ఆమె చలించలేదు. అశోకవనంలో ఒక చిన్న గడ్డిపోచను అడ్డం పెట్టుకుని రావణుడితో మాట్లా డింది. ఆ గడ్డిపోచ ఆమె ఆత్మగౌరవానికి, పాతివ్రత్యానికి ప్రతీక. పరపురుషుడిని కన్నెత్తి చూడని ఆమె నిష్ఠ రావణుడిని సైతం భయపెట్టింది. రావణుడి చెరలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలు ఆమెను ఎన్నో రకాలుగా వేధించారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు వారిని శిక్షిస్తానంటే, సీతమ్మ వారించింది. ‘కేవలం రాజు ఆజ్ఞను పాటించారు తప్ప వారిలో తప్పు లేద’ని వారిని క్షమించింది. జీవితాంతం అగ్నిపరీక్షలు, బహిష్కరణలు ఎదురైనా ఆమె రాముడిని ద్వేషించలేదు. రాముడు ఆమెను అడవులకు పంపినప్పుడు ఆమె గర్భవతి. వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ లవకుశులను ఒంటరిగానే పెంచింది. వారిని అజేయులైన వీరులు గానే కాకుండా, రామాయణాన్ని గానం చేసే సంస్కార వంతులుగా తీర్చిదిద్దింది. తండ్రి తనను అడవికి పంపినా, పిల్లల మనసులో తండ్రిపై గౌరవం తగ్గకుండా పెంచడం ఆమె గొప్పతనం. సీత తన కర్తవ్యం ముగిసిందని భావించే లోకానికి తన సచ్ఛీలతను చాటిచెప్పి, తిరిగి భూమాత ఒడిలోకి వెళ్లిపోయింది. ఇది ఆమె నిశ్చలమైన ఆత్మగౌరవానికి నిదర్శనం.

సీతమ్మ కేవలం ఒక పురాణ పాత్ర కాదు; కష్టాల్లో ఉన్న ప్రతి మహిళకు ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తి. ‘జనక నందిని’గా పుట్టి, ‘రామపత్ని’గా జీవించి, ‘లోకమాత’గా నిలిచిపోయిన సీతమ్మ గొప్పతనం అనంతం. అందుకే ఆమె పేరును రాముడి కంటే ముందే చేర్చి ‘సీతారామ’ అని పిలుచుకుంటాం. రామునికి భోజనం వడ్డించేటప్పుడు ఒక తల్లిలా ఆప్యాయతను కురిపించేది. కందవ•లాలు అయినా, రుచికరమైన ఆహారం అయినా ప్రేమతో వడ్డించి ఆయన ఆకలిని, అలసటను తీర్చేది.

భర్తకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించడంలో ఆమె రంభ వలె అత్యంత ప్రియమైనదిగా ఉండేది. మానసిక ప్రశాంతతను ఇచ్చే అర్ధాంగిగా ఆమె రాముని హృదయంలో నిలిచింది. సీతమ్మ కేవలం భార్యగానే కాకుండా, కష్టాల్లో తోడుండే స్నేహితురాలిగా, పాలనలో సలహాలిచ్చే మంత్రిగా, సేవలో దాసిగా రాముని జీవితంలో అంతర్భాగ మైంది. అందుకే ఆమెను ‘‘ఆదర్శ గృహిణి’’గా లోకం కొలుస్తుంది. అహల్య పశ్చాత్తాపానికి, నిరీక్షణకు ప్రతీక అయితే, సీత త్యాగానికి, ధర్మానికి నిలువెత్తు రూపం.

తారాదేవి

వానర రాజు వాలి ధర్మపత్ని అయిన తారాదేవి కేవలం ఒక రాణి మాత్రమే కాదు, అసాధారణమైన మేధాశక్తి కలిగిన మనీషి. తార తన భర్త వాలి పట్ల అత్యంత అనురాగం, అంకితభావం కలిగి ఉండేది. వాలి అజేయుడైన పరాక్రమవంతుడు. అటువంటి వీరుడికి భార్యగా, అతని అవసరాలను గుర్తించి, ఒక దాసి వలె వినమ్రంగా సేవలు అందించేది. వాలి సుగ్రీవుల యుద్ధం సమయంలో కూడా ఆమె తన కర్తవ్యాన్ని మరువలేదు. తారకు ఉన్న అత్యున్నత లక్షణం ఇది. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, వాలికి ప్రధాన సలహాదారు. సుగ్రీవుడికి అయోధ్య రాజకుమారులైన రామలక్ష్మణుల సాయం లభించిందని ఆమె వాలికి హెచ్చరిక చేసింది. రాముడు సామాన్య మానవుడు కాదని, ఆయన  సాధువులకు కల్పవృక్షం (నివాస వృక్షః సాధూనామ్‌) ‌వంటివాడు అని, శరణు కోరిన వారిని రక్షించే గుణం కలవాడని ఆమె వివరించింది. రాముని బాణం అమోఘమని, ఆయనతో వైరం పెట్టుకోవడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనని ఆమె వాలిని వారించింది. ఆమె మాట వినకపోవడం వల్లే వాలి ప్రాణాలు కోల్పోయాడు. తార అత్యంత సౌందర్యవతి. ఆమె రూపం లక్ష్మీకళతో ప్రకాశించేది. వాలి మరణం తర్వాత సుగ్రీవుడు రాజ్యాన్ని చేపట్టినప్పుడు, తార తన వ్యక్తిత్వంతో, రూపంతో రాజ్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. తార జీవితం అనేక కష్టాలతో కూడుకున్నది. తన భర్త వాలి తన సోదరుడైన సుగ్రీవుని భార్య రుమను అపహరించినప్పుడు ఆమె ఎంతో బాధపడినా, ఓర్పుతో వాలిని మార్చడానికి ప్రయత్నించింది. వాలి మరణం తర్వాత, కుమారుడైన అంగదుని భవిష్యత్తు కోసం నిలబడింది. ఆమె వాలికి తల్లిలా ఆప్యాయంగా భోజనం సమకూర్చేది. వానర రాజ్యంలో ఆమె అందరి దగ్గర తల్లిలాంటి గౌరవాన్ని పొందింది. వాలికి తారపై ఉన్న అపారమైన ప్రేమకు కారణం ఆమెలోని సౌందర్యం, భర్త మనసుని రంజింపజేసే గుణం. వాలి ఎంతటి మొండివాడైనా, తార మాటను గౌరవించేవాడంటే ఆమె అతనిపై చూపిన అనురాగం అంతటిది. తార ‘రాజనీతిజ్ఞతకు’ మారుపేరు. వాలి మరణం తర్వాత లక్ష్మణుడు కిష్కింధకు ఆగ్రహంతో వచ్చినప్పుడు, అతని కోపాన్ని తన మాటల చాతుర్యంతో తగ్గించిన ఘనత తారదే.

వాలి మరణశయ్యపై ఉన్నప్పుడు, రాముని సైతం ప్రశ్నించిన విధానం ఆమెలోని ధైర్యాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైనప్పుడు, రాజ్య క్షేమం కోసం ఆమె తన సలహాలను అందిస్తూ కిష్కింధకు అండగా నిలిచింది. అహల్య, సీత, ద్రౌపది, మండోదరి, తార వేర్వేరు సందర్భాల్లో ‘‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి…’’ అనే సూత్రానికి జీవం పోశారు. తార పాత్ర మనకు సమయస్ఫూర్తిని, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే ధీరత్వాన్ని నేర్పుతుంది.

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE