భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– ‌డా।। దుగ్గరాజు శ్రీనివాసరావు

‌ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ సోషియాలజిలో దిట్ట. ప్రొఫెసర్‌గా, వైస్‌ఛాన్సలర్‌గా యూజీసీ మెంబర్‌గా పనిచేసి 15 ఏళ్ల క్రితం రిటైర్‌ అయ్యాడు. అయినా ఇప్పటికి ఎకడమిక్‌గా చురుకుగా ఉండి, దేశవిదేశీ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్‌ ‌ప్రొఫెసర్‌గా వెళ్లి లెక్చర్స్ ఇస్తుంటాడు. ఐరోపా ఖండ దేశాలకు ఆహ్వానం మీదవెళ్లి, పక్షం రోజులు లెక్చర్స్, ‌కాన్ఫరెన్స్‌లు ముగించుకుని క్రితం రోజే తిరిగి ఢిల్లీ వచ్చాడు.
ఢిల్లీలోని తన పాతకాలపు బంగళాముందు లాన్‌లో కూర్చుని, టీ తాగుతూ ఆ పక్షం రోజుల్లో వచ్చిన పోస్ట్ ‌చూసుకుంటున్నాడు. అందులో పుస్తకాలు, ఆహ్వానపత్రాలు వంటివి ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తున్న శ్రీవాత్సవ కళ్లు ఒక ఇన్విటేషన్‌ ‌కార్డ్‌మీద పడి ఆగిపోయింది.
మరుసటిరోజు కానిస్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ‘నో..ఐ యామ్‌ ‌నాట్‌ ఎ ‌హిందూ’ అనే పుస్తకం ఆవిష్కరణ సభ ఇన్విటేషన్‌. ‌రచయిత ప్రొ।। కంచయ్య. ఆ పుస్తకం ముందు తన మాతృభాషలో రాయగా ఆ తర్వాత అటువంటి ఆలోచనలకు విస్తృత ప్రచారం ఇచ్చేందుకు పనిచేస్తున్న కొందరు ఆంగ్లంలోకి అనువదించినదని అర్థమయ్యేలా ఇన్విటేషన్‌ ‌కార్డ్ ‌వెనుక రచయిత గురించి రాసిన దానిలో ప్రస్తావించారు.
ఆ పుస్తకం టైటిల్‌, ‌రచయిత పేరు రెండు వింతగా అనిపించాయి ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ్‌కి. మన దేశ రాజ్యాంగం మత స్వాతంత్య్రం ఇచ్చింది. ఏ మతం అయినా స్వీకరించవచ్చు. ఇప్పటికే చాలామంది తమకు ఇతరత్రా లభించే లబ్ధినిబట్టి మతం మారటం చేస్తున్నారు. అలా మతం మార్చుకునేవారిని ఎవరు బలవంతంగా ఆపటం లేదు. నువు మా మతం వదిలి వెళ్లిపోతే మా మతం ఏం కావాలి! అని ఎవర్నీ ఎవరు అడగటంలేదు. అందునా హిందూ మతస్తులు అస్సలు అడగరు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవారు కాబట్టి వాడి ఖర్మాన వాడు పోతాడు అని సర్దిచెప్పుకుంటారు.
అంతటి మతస్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో ‘నో ఐ యామ్‌ ‌నాట్‌ ఎ ‌హిందూ’ అని రాయటం ఏమిటి! అన్నది ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవకి వచ్చిన సందేహం. తనకు ఇష్టం వచ్చిన మతంలోకి మారే స్వేచ్ఛ ఉన్నచోట హాయిగా కొత్త మతం పుచ్చుకుని ఆ మతం కొత్త గుర్తులు ప్రదర్శించక, హిందూమతంలోనే ఉంటూ ‘నో ఐ యామ్‌ ‌వాట్‌ ఎ ‌హిందూ’ అనే పేరుతో పుస్తకం రాయటం అంటే రచయితకు కొంచెం తిక్క అయినా ఉండాలి, లేకుంటే మరేదో ఎజెండా అయినా ఉండి ఉండాలనుకున్నాడు ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ. కాబట్టి రేపు తప్పని సరిగా ఆ మీటింగ్‌ ‌వెళ్లి ఆ రచయిత ఏం చెబుతాడో విని తీరాలని తన అప్పాయింట్‌మెంట్స్‌లో నోట్‌ ‌చేసుకున్నాడు.
ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయాడు ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ. ఇంట్లోవాళ్లు అది జెట్‌ల్యాగ్‌వల్ల అనుకున్నారు. కాని శ్రీవాత్సవకి మాత్రమే తెలుసు అది ఆ పుస్తకం టైటిల్‌, ‌రచయిత పేరు మీద తన్నుకు వస్తున్న ఆలోచనల వల్ల నిద్రపట్టలేదని. ఆ రచయిత పేరు కంచయ్య అనేది కొత్తగా ఉన్నా ఎక్కడో విన్నట్టు, పరిచయం ఉన్న పేరులా వినిపిస్తున్నది ఆయనకు.
ఎడతెగని ఆలోచనతోనే మరుసటి రోజు కానిస్టిట్యూషన్‌ ‌క్లబ్‌కి చేరాడు శ్రీవాత్సవ.
అక్కడ అందరూ పరిచయస్తులే. చాలామంది ఆయనకు దగ్గర చదువుకున్నవారు కూడా. అంత పెద్దాయన ఓపిక చేసుకుని వచ్చినందుకు సంతోషపడుతున్నవారు కొందరైతే, ఈయన్నెందుకు పిలిచారు అని కంగారు పడుతున్నవారు కొందరున్నారు. అందులో ముఖ్యుడు ఆ పుస్తక రచయిత ప్రొ।। కంచయ్య.
మీటింగ్‌ ‌ప్రారంభానికి సమయం ఉందని వి.ఐ.పి.లకు కేటాయించిన గదిలో కూర్చున్నాడు ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ. అందరూ అక్కడికి వచ్చి ఆయన్ని పలకరించి, నమస్కారం జెప్పి వెళుచున్నాడు. అక్కడున్న ఇతర ఎకడమిక్‌ ‌ప్రముఖులతో మాట్లాడుతున్న శ్రీ వాత్సవ దగ్గరకు ఆ ఫంక్షన్‌ ‌నిర్వాహకులు వచ్చి ‘వీరే పుస్తక రచయిత ప్రొఫెసర్‌ ‌కంచయ్య, ఫలానా యూనివర్సిటీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు’ అని పరిచయం చేశారు.
ఆ కంచయ్యని చూడగానే, అతని వాటం, పెట్టిన నమస్కారం తీరు కలిపి ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవని 40 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లింది. అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ పేరు ఎక్కడా, ఎప్పుడు విన్నది. వయసుతో వచ్చిన మార్పు తప్పించి నలభై ఏళ్లక్రితం తాను చూసినపుడు ఉన్న మిడిగుడ్లు, దొంగచూపులలో ఏ మార్పు లేదు.
సభ మొదలయ్యే సమయానికి ప్రొఫెసర్‌ శ్రీ ‌వాత్సవని ముందు వరుసలో తీసుకవెళ్లి కూర్చోపెట్టారు. వేదిక మీదున్నవారు తమ తమ బాధ్యతగా ప్రసంగాలు చేస్తుంటే ప్రొఫెసర్‌ శ్రీ ‌వాత్సవ తన ఆలోచనల్లో తానున్నాడు.
నలభై సంవత్సరాల క్రితం ఒక విశ్వవిద్యాలయ టీచింగ్‌ ‌పోస్ట్‌ల సెలక్షన్‌ ‌కమిటీలో యూజీసీ నామినీగా తాను వెళ్లినపుడు జరిగినది గుర్తుకొస్తున్నది ఆయనకు.
మిగిలిన అన్ని సబ్జక్ట్ ఇం‌టర్వ్యూలు అయిపోయాయి. ఇక సోషియాలజీ విభాగం, తన సొంత సబ్జక్ట్ ‌కాబట్టి ఈ తరం పరిశోధక విద్యార్థులను శ్రద్ధగా ఇంటర్వ్యూ చేసి వారికి సూచనలు ఇవ్వాలి అనుకుంటున్నాడు ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ. సరిగా ఆ సమయంలో అక్కడికి వచ్చాడు కంచయ్య.
ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేదు. ఇతగాడి కన్న ఎంతో మెరిట్‌ ఉన్న విద్యార్థులు వచ్చారు. అందులో ఒకరిని సెలక్ట్ ‌చేస్తే యూనివర్శిటీకి, డిపార్ట్‌మెంట్‌కి మేలు అనుకుంటుండగా, సెలక్షన్‌ ‌కమిటీ హోదాలో వైస్‌ఛాన్సలర్‌ ఆ ‌పోస్ట్‌కి కంచయ్యని సెలక్ట్ ‌చెయ్యాలనటం ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవకి ఆశ్చర్యం కలిగించింది.‘‘నోరు విప్పని వాడికి లెక్చరర్‌ ఉద్యోగం ఏమిటి?’’ అని అడిగాడు కూడా.
‘‘ఈ విషయంలో నేను నిస్సహాయుడిని ప్రొఫెసర్‌. ఆ ‌పోస్ట్ అతని సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వ్ ‌చేయబడున్నది. ఆ సామాజిక వర్గంకి చెందిన ఏకైక క్యాండిడేట్‌ అతనే. కంచయ్యకి రాజకీయ పెద్దలతో మంచి పరిచయాలు న్నాయి. వారి ద్వారా ఒత్తిడి తెచ్చి సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌ ‌పోస్ట్, ‌తన సామాజిక వర్గానికి వచ్చేలా రోస్టర్‌ని మార్పించాడు కూడా! ఇప్పటికే అడ్డమైన వాగుడు క్యాంపస్‌లో వాగుతున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని కాదన్నామనుకోండి, మీరు నేను అగ్రకులాల ప్రొఫెసర్లం కాబట్టి అణగారిన వర్గాలను పైకి రాకుండా కిందికి తొక్కే ప్రయత్నం చేశారంటూ కొత్త ప్రచారం చేస్తాడండీ’’ అనాడు వైస్‌ ‌ఛాన్సలర్‌.
‘‘ఒక్క రీసర్చి పబ్లికేషన్‌లేదు. ఐదేళ్లు గడిచినా థీసిస్‌ ‌రాసే ప్రయత్నం చెయ్యటం లేదు. కేవలం తన కులాన్ని ఆయుధంగా పెట్టుకుని ఉద్యోగం సంపా దించాలను కుంటున్నాడా ఈ కంచయ్య..?’’ అని ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ ప్రశ్నిం చాడు.
‘కులాన్ని పట్టుకుని ఎదగాలనుకుంటున్న ఈ కంచెయ్యల వల్ల మీ యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది జాగ్రత్త…’ అని తాను చేసిన హెచ్చరిక కూడా గుర్తుకు వచ్చింది ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవకి.
వీడి పేరు మాత్రమే కాదు బుద్ధి కూడా విచిత్రంగానే ఉంది అనుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో కంచయ్యని ఉద్యోగానికి సెలక్ట్ ‌చేయాల్సిన వైనం మదిలో తిరిగింది.
అలా నలభై ఏళ్ల క్రితం తాను చేసిన సెలక్షన్‌ ‌పాపం ఇప్పుడు ఈ రూపంలో కానిస్టిట్యూషన్‌ ‌క్లబ్‌ ‌వేదికని ఎక్కింది.
డబ్బు ఏదైనా చెయ్యగలదు మన దేశంలో అనే మాట స్థానంలో కులం అడ్డుపెట్టుకుని ఏదైనా చెయ్యగలరు కొందరు అనేది కొత్త మాటగా చేర్చాలి అనుకున్నాడు శ్రీవాత్సవ.
వేదికమీద నుండి కంచెయ్య, ఆయన వర్గీయులు చేస్తున్న ప్రసంగాలు, రచయితను ఆకాశానికి ఎత్తుతున్న తీరు, అతని మేధస్సు, అతగాడు తీసుకువచ్చిన కొత్త సామాజిక వాదనల మీద పొగడ్తలతో నిండిపోనున్నాయి. అవి విన్న తర్వాత తాను తన మనసులోని మాటను చెప్పకుండా వెళ్లిపోతే సమాజానికి ద్రోహం చేసినట్టవుతుంది అనిపించింది ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ్‌కి. ఆ విషయమే చిన్న స్లిప్‌ ‌మీద రాసి సభ అధ్యక్షస్థానంలో ఉన్నవారికి పంపించాడు.
కాదనలేక, అత్యంత ఇబ్బందికరమైన ముఖంతోనే ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవను ప్రసంగించవలసిందిగా ఆహ్వానించారు.
చేతికర్ర సహాయంతో నెమ్మదిగా వేదిక ఎక్కిన ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ ఏం మాట్లాడతాడోనని అంతా ఎదురు చూస్తున్నారు. తన మాటలతో సభను ఏం చేస్తాడోనన్న భయం ఆర్గనైజర్స్‌ది. కంచయ్య ముఖంలో ఆందోళన.
గొంతు సవరించుకుని, ఈ వయసులో తాను ఎంత కష్టపడి వచ్చింది చెప్పి ఆ తర్వాత ప్రొ।। కంచయ్యకి అభినందనలు అన్నాడు. ప్రొఫెసర్‌ శ్రీ ‌వాత్సవ ఎంత అణుచుకుందామనుకున్నా ఆయన గొంతులో అభినందనలు అనే పదంలోని వ్యంగ్యం స్ఫురించింది.
‘‘పుస్తకం టైటిల్‌ ‘‘నో ఐ యామ్‌ ‌నాట్‌ ఎ ‌హిందూ’’. మన స్వాతంత్య్రం ఇచ్చిన దేశంలో ఇటువంటి టైటిల్‌లో పుస్తకం రావటమే ఒక చిత్రం’’ అని చిన్న పాజ్‌ ఇచ్చాడు. ఇక ఆయన తదుపరి మాటలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి పెరిగింది సభికుల్లో.
‘‘కంచెయ్యగారు చెప్పినట్టు హిందూ మతంలో కులం ఉంది. అది వరమో! శాపమో! తెలియదు. కాని ఇప్పటికి ఉంది. ఆ కుల వ్యవస్థను వ్యతిరేకించవచ్చు. అలా ఎందరో వ్యకిరేకించారు. కొందరు నాస్తికులయ్యారు, మరికొందరు ఇతర మతాలలోకి వెళ్లారు. ఇదీ వాస్తవం’’ అంటూ కంచయ్య వైపు చూశాడు. తన వాదానికి ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ నుండి మద్దతు వస్తున్నదన్న ఆనందం కంచయ్య ముఖంలో కొద్దిగా కనిపించింది.
కాని ఇంతలోనే అతని ముఖ కవళికలు మారిపోయాయి. ‘‘కంచయ్యగారు తన జీవితమంతా హిందూమతంలోని కులాన్ని పట్టుకునే గడిపారు. అతనికి ఉద్యోగం దక్కింది అతని కులంవల్ల.ఎందరో మెరిటోరియస్‌ ‌యువతీ యువకులను కాదని, అతని కులం ఆధారంగానే కంచయ్యను అప్పుడు ఆ లెక్చరర్‌ ‌పోస్ట్‌కి ఎంపిక చేసిన వారిలో నేనూ ఉన్నాను. అతగాడు కులం ఆధారంగానే రీడర్‌ అయ్యాడు, ప్రొఫెసర్‌ ‌కూడా అయ్యాడు. కులం ఆధారంగా ఉన్నత స్థానానికి చేరిన కంచయ్య ఇప్పుడు ‘‘నో ఐ యామ్‌ ‌నాట్‌ ఎ ‌హిందూ’’ అంటూ పుస్తకం రాసి, దేశమంతా ప్రచారానికి తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. అరవై ఏళ్లకు పైబడి హిందూమతంలో ఉండి, ఆ మతం ద్వారా అందే అన్ని రకాల లబ్ధి పొంది, ఎదిగి చివరికి ఇలా రాశాడంటే అతని మెంటాలిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి!’’
‘‘అన్నింటిని, అందరిని ప్రశ్నించమంటూ లెక్చర్స్ ఇచ్చే కంచయ్యని మనం ఈ విషయంలో ప్రశ్నించవద్దా! ఇక్కడ ఆర్గనైజర్స్, ‌సభికుల్లో ఉన్నవారిలో అధిక శాతం కూడా ‘ప్రశ్నించాలి’ అని సూచించే వర్గంలోనివారే కదా! మరి వారికి కంచయ్యను ప్రశ్నించాలనే ఆలోచన ఎందుకు రాదు! కంచయ్యలాంటి నిచ్చెన మెట్లు వాడుకుని పైకి ఎక్కి అసలు నిచ్చెనే లేదు… ఉన్నా నాకెన్నడూ సహాయపడలేదు అనేవారి వల్ల సమాజానికి, దేశానికి ప్రమాదం…’’ అలా ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ ప్రసంగం చేస్తుంటే ఆయన ముఖంలోని ఆవేదన, అలసట గుర్తించిన ఒక యువకుడు మంచినీళ్ల గ్లాసు తెచ్చి ఇచ్చాడు.
శ్రీవాస్తవ మంచి నీళ్లు తాగి, ముఖం తుడుచుకుని ఒక్కసారి కంచయ్యవైపు చూద్దామనుకుని తల తిప్పేసరికి కంచయ్య కూర్చున్న కుర్చీ ఖాళీగా ఉంది. పక్కన కూర్చున్న మరో ఇద్దరు కుర్చీలు వదిలేసి వెళ్లిపోయారు. ఎదురుగా శ్రోతల్లో కొందరు నిలబడి చప్పట్లతో హాలుని మారుమోగిస్తున్నారు.
ఇక ఇంతకన్నా చెప్పాల్చిన పనిలేదని ప్రొఫెసర్‌ శ్రీ‌వాత్సవ వేదిక దిగి కిందికి వస్తుంటే అవతల దూరంగా నిలబడి బిక్కముఖం వేసుకుని నిలుచున్న కంచయ్య కనిపించాడు. తన ఇమేజ్‌ ‌మొత్తాన్ని చెరిపేసి, నగ్నంగా నిలబెట్టిన పెద్దాయన శ్రీవాత్సవను చూస్తూ…

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE