‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
కళింగ, ఆంధ్ర రాజ్యాలకు మధ్య అతిపెద్ద శక్తి గోదావరి నది. అనుమకొండ నుండి బయలుదేరిన మహా సైనిక పటాలం ఆ నదీ తీరానికి వచ్చి ఆగింది.
తెలుగు సామ్రాజ్యం కోసం అహర్నిశం కృషి చేస్తున్న కాకతీయ రాజ్య యుద్ధ వ్యవస్థలో నదీ నిపుణులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణ, గోదావరి, పెన్నా..పెద్ద నదులతో పాటు,పాతిక ఉప, చిన్న నదులు తెలుగునేలపై ఉన్నాయి. కాబట్టి గొప్ప నదీ నిపుణులు ఉండటంలో విశేషం ఏమీలేదు.
గోకర్ణుడు..
ఈ కళింగ యుధ్ధవేళ కాకతీయ సైన్యాన్ని గోదావరి నది దాటించడానికి గణపతిదేవుడు ఎంపిక చేసిన నదీ నిపుణుడు కర్ణుడు. యుద్ధ నిపుణుల్లో అత్యంత ముఖ్యుడు. వేల లక్షల సైనిక పారావారాన్ని నదులను దాటించడంలో దక్షిణావర్త రాజ్యాలలో పేరెన్నికగన్న ఒకరిద్దరిలో అగ్రగణ్యుడు. పూర్తిగా తెలుగువాడు. అతని తండ్రి తాతలు కరికాలచోళుని కాలంలో కావేరి నది తీరాల వద్ద జరిగిన యుద్ధ్దాలలో పాల్గొన్నవారు.
గోదావరినదిపైన, నదిలోపల అంగుళం అంగుళం తెలిసినవాడు. నదీ మతల్లి తెలుగు రాజ్యాలలోకి ప్రవేశించిన చోటు నుండి సముద్రంలో కలిసే చోటు వరకు, ప్రధాన నదీ మతల్లితో పాటు ఆమెకు ఎన్ని ఉపనదులు, ఎన్ని పాయలు ఉంటే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎంతెంత లోతు ఉంటుందో, ఏ కాలంలో ఏ మాసంలో గోదావరి తల్లి వేగం ఎలా ఉంటుందో,రాత్రి అమ్మ ఎలా నిదురిస్తుందో, పగలు ఎలా కబుర్లు చెబుతుందో, కోపం వస్తే ఎలా రెచ్చిపోతుందో.. కొన్ని తాళ్ల లోతున ఆ తల్లి.. అట్టడుగున ఎలా ఉంటుందో క్షుణ్ణంగా తెలిసినవాడు ఈ గోకర్ణుడు.
చిన్నకళ్లు, నిడుపైన ముక్కు. బలుపు తక్కువ- కండ పటిష్టం ఎక్కువ. నీటిలో నాని నాని నాచు పట్టినట్లు నలుపు ఆకుపచ్చల మిశ్రమ శరీర వర్ణం.. ఓ మహా మత్తగజం అంత ఎత్తులో ఉన్నాడు. ఏ వైపునకైనా అతివేగంగా దూసుకుపోయే ఓ చురుకైన మహా మత్స్యంలా కనిపిస్తున్నాడు.
‘‘అంతా సిద్ధ్దమా గోకర్ణా..! ఎక్కడ మనం గోదావరితల్లిని దాటగలమో.. నిర్ణయం తీసుకున్నారా? మనం ఎప్పుడు కదలాలి? వంతెనలు పూర్తి అయ్యాయా? ఎన్ని నిర్మించారు?’’ అడిగింది రుద్రమదేవి.
చిన్నగా నవ్వాడు గోకర్ణుడు.
‘‘అది అనుకున్నంత చిన్నపని కాదమ్మా.. గోదావరినదిపై ఏమీ నిర్మించలేదు.’’
‘‘అరె?!.. అనుమకొండలో మహామండ లేశ్వరులు నిర్ణయం తీసుకున్న సమా వేశంలో మీరు కూడా ఉన్నారు కదా..!దాదాపు ఏడాది దాటింది మనం నిర్ణయం తీసుకుని. ఇప్పటివరకు ఎందుకు నిర్మించలేదు?ఇన్ని లక్షలమంది ఇంత సామగ్రితో, ఏనుగులు, గుర్రాలు, ఎడ్లబళ్లు.. ఇవన్నీ ఎలా.. ఎలా.. దాటాలి?’’ అన్నదామె.
ఎంత ఖడ్గ యోధురాలో.. అంత నిర్వహణా సమర్ధురాలు రుద్రమ. దాదాపు పాతికేళ్లుగా తండ్రి గణపతిదేవునికి సహాయంగా నిలబడి.. మహా యోధులతో కలసిమెలసి యుద్ధ తంత్రాలు రచిస్తూ స్వయంగా యుద్ధాలు చేస్తోంది. గొప్ప యోధురాలుగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
రుద్రమదేవి ప్రతిభ గోకర్ణుడు విని ఉన్నాడు. కాని ఓ మహానదిని మహా సైనిక పారావారం దాటడం అంటే ఏదో పడవలోనో.. వంతెన మీదనో.. దాటడం అని రుద్రమ భావిస్తున్నట్లు గోకర్ణుడు గుర్తించాడు.
‘‘ఏం గోకర్ణా.. ఎందుకు నిర్మించలేదు??’’ తన ధోరణిలో మళ్లీ రెట్టించింది.
‘‘నిర్మిస్తే కళింగులు ఇప్పటికే ధ్వంసం చేసేసి ఉండేవారమ్మా..’’
నాలిక కరుచుకుంది రుద్రమ. ‘అవును కదూ..’ మరి ఎలా అన్నట్లు చూసింది.
‘‘ఒకసారి నది వద్దకు వెళదాం యువరాణి..’’ అన్నాడు వినయంగా తలవాల్చి.
‘‘ఓ.. అది నాకెంతో సంతోషం. పద పద..’’ ఉత్సాహంగా కదిలింది. ఆమె ప్రధాన పరిచారిక కైక, ప్రధాన సహాయకుడు కుశప్ప, అంగరక్షకుల బృందం అప్పుడే అక్కడికి చేరుకున్నారు. అందరిని గొల్లెనలోనే ఉండమని చెప్పి ఆమె గోకర్ణుని వెంట బయటకు నడిచింది.
పరమపావని గోదావరి నది ప్రశాంతంగా రుద్రమకు స్వాగతం చెబుతోంది. వినీల కుంతలాలు ఉదయపు నీరెండకు ఆరబెట్టు కుంటున్నట్లు..కనుచూపు పొడవునా నేలా నింగి కలిసిన బిందువు వరకు గోదారమ్మ చిన్నగా కదలాడుతోంది. ఆకాశంలో ఆమెపై రంగురంగుల పిట్టలు ఎగురుతూ ఆమె ఒడిలో కదలాడుతున్న పిల్లచేపలతో కబుర్లు చెబుతున్నాయి. ఆ ముచ్చటగొలిపే పిట్టలతో నీటి నుండి పైకెగసి ఏవేవో ముచ్చట్లు చెబుతున్న చేపలు. అవి తిరిగి నీటిని చేరినప్పటి బుడుంగు శబ్దం.. గిర్రున శబ్దిస్తూ గిరుగిర్రున వేగంగా పల్టీలు కొడుతూ అక్కడే తిరుగుతున్న రకరకాల పిట్టలు.. వెనగ్గా పైన నీలినీలి ఆకాశం..
ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది రుద్రమకు. ఆమె కోసమే ప్రత్యేకంగా కుట్రపు వారు కుట్టిన యుద్ధ దుస్తులలో ఆమె చాలా సౌకర్య వంతంగా కదలుతోంది. శలాకలా..బాగా నూరిన మహాఖడ్గంలా..నిత్యవ• నిర్వహించే వ్యాయామం, యోగాసనాలతో పాటు తపస్సులాంటి ధ్యానంతో నునపుదేరిన బిగుతైన శారీరక పటుత్వంతో మువురమ్మల యువ వ•లపుటమ్మలా ఉంది తప్ప ముగ్గురు ఆడ పిల్లల తల్లిలా లేదు రుద్రమదేవి. ఎంతటి మహావీరుడయినా ఎదురుపడితే విన యంగా వంగి నమస్కరించాలనిపించే గొప్ప వ్యక్తిత్వ ఆకర్షణ ఆమె సొంతం. ఆమె స్త్రీలతో ఎంత సౌకర్యవంతంగా ఉండగలదో మగయోధులతోనూ అంతే కలివిడిగా ఉండగలదు.
తాను పోరాడేది మగవీరులతో అని రుద్రమ ఎప్పుడూ మరచిపోదు.
ఉదయపుగాలి సన్నని ఈలపాట పాడుతూ రుద్రమను చుట్టి జానపదాలు అలపిస్తోంది. ఆ ఆహ్లాద ఉదయాన్ని ఆస్వాదిస్తున్న రుద్రమతో…
‘‘అలా..అదిగో..అటు..ఆ దూరంగా ఓసారి దృష్టి సారించండి యువరాణీ..’’ అన్నాడు గోకర్ణుడు.
‘‘ఎటు?..’’
అతడు వేలితో చూపుతున్నవైపు చూస్తూ అక్కడ గోచరమౌతున్న ఏవో కదలికలు గుర్తించడానికి కళ్లు చికిలించి చూస్తోందామే.
‘‘అదిగో..అక్కడ నదికి అవతల. కళింగ సైనికుల శిబిరం అది. మనం సగం గోదాట్లో ఉండగానే విష పుబాణాలో..బరిసేలో విసిరి మనల్ని చంపేస్తారు.’’
చివ్వున ఆమె చేయి అప్రయత్నంగా కటి వద్ద ఉన్న చురక పైకి వెళ్లింది.
‘‘నదిని దాటడం దిగ్విజయంగా జరిగితే మనం యుద్ధం సగం గెలిచినట్లే..’’
కళింగపై యుద్ధం అనగానే తండ్రి అన్నమాట రుద్రమకు స్ఫురించింది. అప్రయత్నంగా అంది.
‘‘మరి.. ఆవల ఒడ్డున శత్రువులు సిద్ధంగా ఉన్నప్పుడు..మనం నదిలోకి రాగానే దాడి చేయ గలిగినప్పుడు.. మనం నదిని దాటడం ఎలా?’’
గోకర్ణుడు ఆమె యువరాణి అని కూడా మరచి పెద్దపెట్టున నవ్వాడు.
రుద్రమ కోపగించుకోకపోగా తానే ఏదో తప్పు మాట్లాడినట్లు అమాయకంగా అతన్ని చూస్తోంది.
గోకర్ణుడు తమాయించుకుని, ‘‘క్షమించండి యువరాణి. అదే ఖండ ఖండాత•రాల నుండి సముద్రాలు దాటి వచ్చి రాజ్యాలు గెలిచినవారు. నదుల అవతల, ఇవతల రాజ్యాల పోరాటాలు.. అన్ని ఈ అంశం చుట్టూనే తిరుగుతాయి.
వేల లక్షల సైన్యాన్ని నదులు దాటించాడంలోనే అసలు సిసలు యుద్ధం ఉంది.అలెగ్జాండరు మన పంచ నదులను ఎలా దాటాలో తెలియక, దాటడానికి నానా కష్టాలు పడి అక్కడే సగం చచ్చాడు.’’ అంటూ కదిలాడు.
‘‘వీడెవడో చిన్నవాడు కాదు..అందుకనే తండ్రి గారు ఇతన్ని అంతగా అభిమానిస్తారు’’ అనుకుంది రుద్రమ.
గోదావరి నీటి అంచును తాకుతూ నడుస్తూ గోకర్ణుడు ఆమెకు తన ప్రణాళికను వివరిస్తుంటే ఎన్నడూ వినని ఆ గొప్ప విషయాలు విభ్రమంగా ఆలకిస్తూనే.. రేవు అవతల కళింగ సైన్యపు సంసిద్ధ్దతను పరికిస్తోంది రుద్రమ.
దాదాపు గంట కాలం తన ప్రణాళికలు వివరించాడు గోకర్ణుడు.
అతని ప్రతిభకు చేతులెత్తి నమస్కరించాలి అనిపించింది రుద్రమకు.
అంతా విన్నాక మాత్రం ఓ ముఖ్యమైన ప్రశ్న వేసింది.
‘‘నది వెడల్పు ఎక్కువగా ఉన్నచోట నదిని దాటుతారా?లేక నది వెడల్పు తక్కువగా ఉన్నచోట దాటుతారా?’’
గోకర్ణుడు ఆమెను అభినందించాడు.
‘‘మంచి ప్రశ్న యువరాణీ!గోదావరి వెడల్పు ఎక్కువగా ఉంటే లోతు తక్కువగా ఉంటుంది. నిజమే. కానీ దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. మనం మునిగినా ప్రాణాపాయం తక్కువ. కానీ శత్రువు వల్ల అపాయం చాలా ఎక్కువ. వెడల్పు తక్కువగా ఉంటే లోతు ఎక్కువగా ఉంటుంది. వెడల్పు తక్కువ వల్ల శత్రువు గుర్తించే లోపుగానే మనం ఆవలి తీరం చేరవచ్చు. కానీ లోతు ఎక్కువ వల్ల మనం మునిగిపోయే ప్రమాదం ఎక్కువ.’’
రుద్రమ ఆలోచనలో పడిపోయింది. ఏది ఏమైనా నది దాటడం ఓ అద్భుతమే అనుకుంది.
‘‘తమరికి ఆసక్తి ఉంటే నదీగర్భంలోకి వెళ్లి అక్కడ ఏనుగులను ఎలా నిలబెట్టాలో వివరిస్తాను. వస్తారా?’’ అడిగాడు గోకర్ణుడు.
ఉత్సాహంతో ఆమె కళ్లు పెద్దవి అయ్యాయి. ‘‘ఏంటేంటి!! ఏనుగులను నీళ్ల లోతుల్లో నిలబెడ తారా?భలే భలే. ఓ..నేను సిద్ధ్దం.. పదపద..’’ అంది చిన్నపిల్లలా.
అప్పుడే దగ్గరగా నవ్వుల కలకలం వినిపించింది.
తమ్ముడు మురారిదేవుడు. ఓ బృందంతో గోలగోలగా కబుర్లు చెబుతూ వస్తున్నాడు. అక్కను చూసి చేయి ఊపాడు. ఆ స్నేహితులు చేతులు జోడించి వినయంగా వంగారు. అందరూ కులీన కుటుంబాల యువకుల్లా కనిపించారు.
రుద్రమ ఆశ్చర్యపోయింది. ఇక్కడికి వచ్చి కేవలం రెండు రోజులయ్యింది. ఈ రెండు రోజుల్లోనే పదిమంది కుర్రాళ్లను జేరబెట్టడం..అనుమకొండలో మిత్రులతో తిరుగుతున్నట్లు తిరగడం చూసి తమ్ముడి తత్వం తెలిసిన రుద్రమకు ఆశ్చర్యం కలిగించలేదు కాని మురారి యుద్ధాన్ని కూడా ఏదో కాలక్షేప పక్రియగా తీసుకుంటున్నాడా?అన్న ఆలోచన కొంత ఇబ్బంది పెడుతోంది.
చురుగ్గా అంది. ‘‘మురారీ!ఈయన గోకర్ణుడు. తండ్రిగారు నది దాటడం కోసం నిర్దేశించిన నదీ నిపుణులు.’’
గోకర్ణుడు అప్పటికే మురారిని పైకి క్రిందికి పరిశీలనగా చూస్తుండగా రుద్రమ చెప్పగానే మోకాళ్లపై కూర్చుని తలవంచి వినయంగా నమస్క రించాడు. ‘‘యువరాజులకు వందనాలు.. నాపేరు గోకర్ణుడు..’’
మురారి తల పంకించి అతని వందనాన్ని స్వీక రించాడు. మళ్లీ రుద్రమ ‘‘తమ్ముడూ!నేను గోకర్ణుడితో నదీగర్భంలోకి వెళుతున్నాను. అక్కడ వరుసగా ఏనుగులను రెండు వరసలుగా మొహరించి వాటిపై తాత్కాలిక తెప్పలను నిర్మించి సైనికులను దాటి స్తారట. నాకు చాలా ఆసక్తిగా ఉంది. నువ్వూ వస్తావా..?’’ అడిగింది ఉత్సాహంగా.
మురారి ముఖం చిట్లించుకున్నాడు. ‘‘అది ఆ ఉప్పరులు, జాలరుల పని.. మనమెందుకు వెళ్లడం అక్కా! నీకు ఆసక్తి ఉంటే వెళ్లు. నేను రాను. నాకు గోదావరిని దాటే సమయం చెబితే చాలు. నువ్వు ఆయనతో చర్చించి నిర్ణయించు. నేను కళింగ మహారాజు తల నరికి కందుక క్రీడ ఆడడానికి ఉత్సాహపడుతున్నా..’’
ఇద్దరూ మరేమీ మాట్లాడలేదు.
మిత్రులతో వెళ్లిపోయాడు మురారిదేవుడు.
తిరిగి గొల్లనలోకి వెళ్లారు ఇద్దరు. ముఖ్య యుద్ధ వీరులనందరిని సమాయత్తపరచి వారికి గోకర్ణుని పరిచయం చేసింది. ఒక్కరోజు కాదు..రెండు రోజులు అంతా క్షుణ్ణంగా గోదావరి నది దాటడంపై తంత్రాలు చర్చించారు.
వ•డవరోజు గోకర్ణుడు తన బృందాన్ని కూడా రంగంలోకి దింపాడు. దాదాపు వెయ్యిమంది. వాళ్లంతా కోన మండల రాజ్యాలలో సుప్రసిద్ధ్దులైన సగరులు, ఉప్పరులు, జాలరులు. నిత్యవ• గోదావరి నదీ పాయల్లో, కాలువల్లో తిరుగుతుంటారు. కోన రాజ్యాలలోని అన్ని మండలాలలో, స్థలల్లో, గ్రామాల మధ్య ఎన్నో కాలువల రూపంలో గోదావరి ప్రవహిస్తుంటుంది. అందుచేత అక్కడ సహజంగా ఎక్కువ మంది నీటి నిపుణులుగా ఎదిగారు.
అలాంటి వారిలో మెరికల్లాంటి వారిని ఏరుకుని తన బృందంగా చేసుకున్నాడు గోకర్ణుడు.
కేవలం నడుముకు చిన్న గుడ్డముక్క కట్టుకుని ఎదురుగా నిలబడిన ఆ నదీ నిపుణుల బృందాన్ని చూసి కాకతీయ యోధులు తెల్లబోయారు. ఈ గోచిగాళ్లకు అపార నైపుణ్యాలున్నాయా? అన్నట్లు చూశారు.
‘‘వెయ్యి మంది వెయ్యి గోకర్ణులు కావచ్చు’’ అనుకుంది రుద్రమ.
నీటిస్తంభన విద్య, మహాతుఫానులు, వరదల్లో కూడా నీటిలో ఈదడం, నీటి అడుగున కూడా స్పష్టంగా చూడ గలగడం, నీటి జంతువులతోనూ, చేపలతోనూ కూడా మాట్లాడగలగడం, నీటి అలల కదలికలను బట్టి వాతావరణాన్ని పసిగట్టడం, వర్షాన్నిబట్టి నది ఎంత లోతు పెరిగిందో,నీటి ఉధృతి ఎంత ఉందో చెప్పగలగడం..
రాత్రి నది..ఉదయం నది.. మధ్యాహ్నం నది.. సంధ్యవేళ నది.. ఇలా గోదావరమ్మ ఏ కాలంలో ఎలా ప్రవర్తిస్తుందో వారందరికీ క్షుణ్ణంగా తెలుసు.
తమ నైపుణ్యాన్ని రంగరించి యుద్ధ సమయాల్లో నదుల వద్ద వీరు చేసే వీరోచిత అద్భుతాలు వర్ణించడానికి పండితుల భాష, కల్పన చాలవు. మహా వృక్షాలను సునాయాసంగా విరిచి తెప్పలుగా చేసేసి ఏటికి ఎదురు ఈదగలరు. నది ఆ చివర నుండి ఈ చివరకు మోకు కట్టి మనుష్యులను నది దాటించగలరు. ఏనుగు తోక, గుర్రం మెడ పట్టుకుని సముద్రాలు దాటగలరు. నీటి అడుగున పెద్ద తిమింగలమంత చేపను కూడా నీటిలోనే పట్టి బంధించగలరు. ముఖ్యంగా సాధారణ వ్యక్తులు పట్టుకోలేనంత లావైన తాళ్లు, మోకులు నడుముకు చుట్టుకుని మునిగిపోయిన పడవలను, నది అడుగున బురదలో కూరుకుపోయిన ఓడలను పట్టి బయటకు లాగగలరు.నీటిపాములు కరచినా, మహాచేపలు నోరు తెరిచి మింగినా ఏమీ కాదు. వాటిని ఛేదించి చక్కగా ఈదుతూ బయటపడగలరు.
విశేషం ఏవిటంటే ఇంతటి నిపుణులు చాలా అమాయకుల్లా ఉండటం. వెర్రిచూపులు చూడటం. తక్కువ మాట్లాడటం.ఎదుటివారితో వాదనకు దిగక పోవడం.ఎవరు ఏం చెప్పినా తల ఊపి వినడం. అన్నింటిని మేళవించి అద్భుత సాహసాలు చేయడం వారికి తాత ముత్తాతల నుండి వస్తోన్న సంప్రదాయ విద్య.
ఇక్కడికి వచ్చిన కాకతీయయోధులకు గోకర్ణుడి బృందపు శక్తియుక్తులపై అనుమానాలున్నా.. నది దాటడానికి ఈ బృందాన్ని మహామండలేశ్వరులు నిర్ణయించారు కాబట్టి అంతా ఆ బృందంతో నది దాటే విధానాలపై చర్చించడానికి సమాయత్త మయ్యారు.
‘‘మనం ఐదు బృందాలుగా ఐదు ప్రదేశాల నుండి నదిని దాటబోతున్నాము. అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశాము. అ ఐదు బృందాలకు నా మిత్రులు బాణమయ, లాలప్ప, సంగరప్ప, బాలయ, వరదయ ఐదుగురు నా మిత్రులు నాయకత్వం వహిస్తారు.’’
గోకర్ణుడు వారిని పరిచయం చేస్తుండగా ఒక్కొక్కరు లేచి వందనం చేస్తున్నట్లు వంగి మళ్లీ కూర్చుంటున్నారు.
‘‘మహాయోధులారా! మీరు కూడా మా వాళ్లతో కలిసి పనిచేయడానికి ఐదుగురు నాయకులను చెప్పండి. ఈ లోగా నేను, రుద్రమాంబ అమ్మవారు నదీగర్భంలోకి వెళ్లి వస్తాము. అమ్మవారికి అన్ని చూపి వివరిస్తాను’’అంటూ లేచాడు గోకర్ణుడు. రుద్రమ కూడా ఉత్సాహంగా లేచి అతని వెంట కదిలింది.
గొల్లెన బయటకు వచ్చారు. వెంట ఆమె పరిచారికలు, అంగరక్షకులు కూడా వచ్చారు. అందరిని అక్కడే ఉండమని ఆజ్ఞాపించి రుద్రమ గోకర్ణుడితో అతడు చెప్పిన చోట అతనితో నదిలోకి ప్రవేశించింది.
రుద్రమకు సహజంగా చిన్ననాటినుండి ఈత తెలుసుకాని ఆమె నిర్మిత తటాకాలలో, మెట్ల బావులలో స్నానం చేస్తూ ఈత కొడుతుంది. కాని సహజ నదులలో, కాలువల్లో సముద్రంలో ఆమె ఎప్పుడూ స్నానం చేయలేదు. ఇక నదుల్లో ఈత కొట్టడం నదీగర్భంలోకి వెళ్లడం అసలెప్పుడూ జరగలేదు. యుద్ధంలో భాగంగా ఆమె నదుల వద్దకు వెళ్లడం మొదటిసారి.
ఓ నదీ నిపుణుడు చూపుతున్న దారి వెంట మొదటిసారి ఆమె నది అట్టడుగు నేలను తాకింది.
అయితే దేనికీ భయపడని మహాయుద్ధ్ద యోధురాలు రుద్రమ గోదావరిలోకి దిగింది. తెలిసిన బాటలో నడుస్తున్న వాడిలా గోకర్ణుడు మును ముందుకు పోతుంటే, అన్ని వైపులా చూస్తూ కొత్త కొత్తగా కనిపించే వాటికి ముచ్చట పడుతూ, ఆశ్చర్య పోతూ, దారి తప్పుతూ..మళ్లీ దారికొస్తూ ఓ అవ•ల్య అనుభవాన్ని రుద్రమ అనుభూతిస్తోంది.
ఆమె తన ఒడిలోకి రావడం గోదారమ్మకు ముద్దొచ్చినట్లు.. అలలు రుద్రమను మృదువుగా తాకు తున్నాయి. స్వచ్ఛమైన గోదారమ్మ లోలోతులలో ఎంత అద్భుత ప్రపంచాన్ని దాచుకుందో చూస్తూ రుద్రమ పరవశించిపోతోంది. ఆ చేపలు,ఆ నాచు, ఆ అనాహత నాదం,ఆ నీటి స్వచ్ఛత ఆమెను విభ్రాంతి పరుస్తున్నాయి. ఆమె ఆగినప్పుడు.. ఆమె చేయి పట్టి ముందుకు తీసుకుపోతున్నాడు గోకర్ణుడు.
అలా పోయి పోయి నీటి అడుగుకు చేరి అక్కడొక గుట్ట మీద నిలదొక్కు కున్నాడు. నిలబడలేక తేలిపోతున్న రుద్రమను చేయిపట్టి నిలబెట్టాడు. అక్కడ ఏదేదో చేతులూపుతూ అర్థ్ధమయ్యేలా చెప్పాడు. ఇలాంటి గుట్టలపై ఒకదాని వెంట ఒకటిగా మహాగజాలను..ఆ అంచు నుండి ఈ అంచువరకు నిలబెట్టుకుంటూ పోతారని చూపాడు. ఆమె మంచి విద్యార్ధినిలా వింటోంది.
అప్పుడు చూపించాడు గోకర్ణుడు. ఆ గుట్ట ప్రక్కనున్న పెద్ద గోతిని.
అందులోకి ఏనుగు జారితే ఇక అంతే. పైన కదలుతున్న సైనికులు, గుర్రాలు, ఎడ్లబళ్లు అన్ని గోదాట్లో పడిపోతాయి. చివ్వున కదిలి అతని చేయి పట్టుకుంది ఆమె.
అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.
ఓ పదిమంది ఆగంతకులు చుట్టుముట్టారు. దగ్గరగా…దూరంగా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల చేతుల్లో చురకత్తులు, వాటిని పుచ్చుకున్నతీరు చూస్తుంటే రుద్రమను, గోకర్ణుని చంపడానికే వచ్చినట్లున్నారు. వారిద్దరు వారిని గుర్తించారు. వాళ్లంతా గంట క్రితం యువరాజు మురారిదేవుని మిత్రబృందంగా కని పించిన వారు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మురారి లాంటి కాకతీయ యువరాజు కూడా వాళ్లను మిత్రులుగా భ్రమించాడంటే శత్రువు ఎంత బలమైనవాడో రుద్రమకు అర్థ్ధమైంది.
ఆమె నిద్రలో కూడా యుద్ధానికి సిద్ధ్దమై ఉంటుంది. నడబంధంలో ఉన్న చురకను వేగంగా బయటకు తీసింది.
కానీ ఈ నీటి యుద్ధ్దంలో చురక సరిపోదు.. ఎలా..ఎలా..!!
గోకర్ణుడు ఆమె చేయి పట్టుకోగా ఆమె చురక ఝుళిపిస్తోంది. వాళ్లూ అలాగే చురకలతో వీళ్లిద్దరి వెంట తిరుగుతూనే ఉన్నారు. గోకర్ణుడు అలా అలా ఆమెను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోయి పోయి ఓ చోట నదీగర్భంలో మరింత అడుక్కి ఆమెను వేగంగా గుంజుకు పోయాడు. ఆమె అతని వెంట పోతూనే ఉంది. పోయి పోయి నదీగర్భం అట్టడుగున ఆగాడు. రుద్రమ చేయి వదిలాడు. ఓ చోట వెదకి చేత్తో నదీ గర్భపు నేలలో గుచ్చి ఉన్న పెద్ద కరవాలాన్ని పైకి తీశాడు.
దిగ్భ్రమతో చూస్తుండిపోయింది రుద్రమ. మళ్లీ మరో చోట వెదకి మరో పెద్ద ఖడ్గాన్ని పైకి తీశాడు.
కరవాలమా?ఖడ్గమా?అన్నట్లు చూశాడు. ఆమె ఖడ్గం కోరుకుంది. అభినం దనగా చూసి ఆమెకు ఖడ్గం అందించి తాను కరవాలం పట్టుకున్నాడు గోకర్ణుడు.
ఇద్దరూ ఆయుధాలతో వెనక్కు తిరిగి వేగంగా కదిలారు. అప్పుడు చూశారు శత్రు యువకులు. క్షణకాలం మ్రాన్పడిపోయారు. ఈ నదీగర్భంలో వీళ్లకు అంత భయంకరమైన ఆయుధాలు ఎక్కడివి అన్నట్లున్నాయి వాళ్ల చూపులు. అప్పుడే యుద్ధానికి సిద్ధ్దమన్నట్లు గోకర్ణుడు రుద్రమ రెక్కపట్టుకుని చివ్వున పైకి ఎగరేశా డు. ఆమె ఎగిరి అతని వీపుపైకి చేరింది. లేచి నిలబడి ఖడ్గం వడుపుగా పట్టి గిర్రుగిర్రున తిప్పుతోంది. నీటిలో గోదావరి అడుగున ఆమె గోకర్ణుడి వీపుపై నిలబడి చేస్తున్న ఖడ్గప్రహారాలు చూస్తే ఎవడికైనా జడుపు పుట్టాల్సిందే. జడుపు పుట్టిన శత్రు యువకులు తోకముడిచినట్లు లిప్తకాలంలో వెనక్కు తిరిగి వేగంగా పారిపోసాగారు. వాళ్లను వెంబ డించి వెంబడించి తరిమారు రుద్రమ, గోకర్ణుడు.
వాళ్లు కనిపించకుండా మాయమయ్యాక నీటిపైకి ఎగిశారు రుద్రమదేవి, గోకర్ణుడు.
నదీ యుద్ధ్దంలో మొదటి దశ విజయవంత మైనట్లు వారి ముఖాలలో ఆత్మవిశ్వాసం తొణికస లాడుతోంది.
* * *
గోదావరి నదిపై కాకతీయ సైన్యం.. అర్ధరాత్రి చిమ్మ చీకటి.
దివిటీలు, కాగడాలు ఏమీ లేవు. కేవలం కళ్లతో ఆ గాడాంధకారంలో కొంత సైన్యం తమ తమ ఆయుధాలను పట్టుకుని నదితీరం వెంట నడుస్తు న్నారు. కాస్త వెనగ్గా గుర్రాలు, ఏనుగులు.. వీలయి నంత తక్కువ శబ్దం చేసేలా వాటిని నడిపిస్తున్నారు అశ్వికులు, మావటీలు.వాటి మధ్యగా ఎడ్లబళ్లు, కాకతీయ సైనికపటాలం. అందరి వద్దా బహు బరువైన యుద్ధ సామాగ్రి. అవన్నీ మోస్తూ మౌనంగా ఏకదీక్షతో నడుస్తున్నారంతా. పోయి పోయి ఓ నిర్దేశిత ప్రదేశంలో గోదావరి నది అంచున ఆగారు.
ఈ బృందం నది పైన కొంత దూరం వెళ్లి గోకర్ణుడు చెప్పిన చోట ఆగింది. అది ఆయన యుద్ధ తంత్రం..
ఆ సాయంత్రం సంధ్యవేళ.. గోకర్ణుడు చెప్పినట్లుగా కొన్ని మహా గజాలను మెల్లగా రేవులోకి తీసుకుపోయారు మావటీలు. గోకర్ణుడు మరి కొందరు అతని బృంద సభ్యులు రేవులోకి దిగి ఆ మత్తగజాలను లోపలికి తీసుకుపోతున్నారు. అవన్నీ మునిగిపోయినట్లు లోతుల్లోకి వెళ్లి పోయి ఈదుతున్నాయి. వాటి దంతాలను, తొండాలను పట్టుకుని గోకర్ణుడు, అతని మనుష్యులు లోలోపలికి తీసుకుపోయి గోదావరి రేవు అట్టడుగున ఓ నిర్దేశిత ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ వాటిని వరసగా నిలబెట్టసాగారు. ఒకడు ఒక్క ఊపున ఆ మహామత్త గజం పైకి ఎక్కాడు. అప్పుడతడు నీటి పైభాగం వరకు కనిపిస్తున్నాడు.
అప్పుడు మరో బృందసభ్యుడు మరికొన్ని మహామత్తగజాలను మళ్లీ నీటిలోకి దింపగా లోపలున్న గోకర్ణుని బృందం వాటిని మరికొంత అవతలగా మరో వరుసగా నిలబెట్టసాగాడు.
ఒడ్డున ఉన్న మరో బృంద సభ్యుడు మరొకరికి ఏదో పురమాయించగా వాడు చీకటిలోనే పరుగుపెట్టాడు.

మత్తి భానుమూరి