భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– ‌కటుకోజ్వల మనోహరాచారి

‘‘అమ్మకు చెప్పనే లేదు..’’ అన్నాడు సత్యమూర్తి బయలుదేరాక అరగంటకు.

‘‘చెప్పకున్నా మునిగిపోయేదేం లేదు..’’ అంది పక్కనే కూర్చున్న భార్య సూర్యకళ.

లోపల కొంత అసంతృప్తిగా ఉన్నా భార్య మాటకు ఎదురుచెప్పలేదు సత్యవ•ర్తి. వెళ్తున్నది కాళేశ్వరం. సంకల్పించిన కార్యం పితృదోష పూజలు. నాల్రోజుల పాటు ఇల్లిడిచి వెళ్తున్నా పక్కనే ఓ గదిలో తన బతుకేదో తాను బతుకుతున్న తల్లికి ఒకమాటైనా చెప్పకపోతినే..అన్న అపరాధ భావం అతడి మన స్సును చిన్నగా తొలిచినా చేయగలిగిందేమీ లేదు.

 తండ్రి పోయి చాలా ఏళ్లయినా పెద్దగా ఆస్తులు కూడగట్టలేదనే అసంతృప్తి ఉండనే ఉంది. పాతింట్లో తల్లికోసం ఒక గదిని అట్లాగే వదిలి మిగతా భాగం కూల్చి సొంతంగా ఇల్లు కట్టుకున్న సత్యవ•ర్తికి ఎప్పుడూ తల్లి పట్ల తిరస్కార భావనే ఉండిపోయింది. అతని భార్య సూర్యకళకైతే అత్త పొడే గిట్టదు. అందుకే డెబ్బై ఏళ్లు పైబడ్డా.. తనకు తానే ఓపూట వండుకొని ఓ పూట ఎండుతూ కాలం వెళ్లదీస్తుంది రత్నమ్మ.

 వారం రోజులకైనా ఏం తింటుంది, ఎట్లా ఉంటుందని తల్లి గదివైపు తొంగిచూడని కొడుక్కి.. నాల్రోజులపాటు ఇంటికి తాళం పెట్టి కాళేశ్వరం బయలుదేరుతున్న విషయం చెప్పాలనిపించినా మిన్నకుండిపోయాడు. భార్య నసపెడుతుందని తెల్సే ఆ మాట ఇప్పుడు గుర్తుచేశాడు.

అప్పటికే పెద్దపల్లి దాటుతుంది కారు. కాళేశ్వరం చేరాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి.

ఈ మధ్య సత్యవ•ర్తి సంసారం ఒడుదొడుకుల్తో నడుస్తోంది. ఓ బిడ్డకు పెళ్లి చేసిన అతనికి పాతికేళ్ల కొడుకున్నాడు. పేరు అవినాష్‌. ‌డిగ్రీ చదివిన అవినాష్‌ ‌హైద్రాబాదులోనే ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజుల్నుండి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కొడుక్కి పెళ్లి కావడం లేదనీ, కూతురు సంసారం అస్తవ్యస్తంగా ఉందనీ, ఆర్థిక సమస్యల్తోపాటు బిజినెస్‌ ‌పరంగా చిక్కులొస్తున్నాయనీ.. పరిష్కారం కోసం ఓ జ్యోతిష్య పండితున్ని సంప్రదించాడు. ఆయన భార్యాభర్తల జాతకచక్రాల్ని తిరగేసి..‘ సత్యమూర్తి కుటుంబాన్ని పితృదోషం పట్టి పీడిస్తుందనీ, వీలైతే త్రయంబకేశ్వరం లేదా కాళేశ్వరం వెళ్లైనా దోష నివారణ పూజలు చేయించాలి’ అని సూచించాడు. కొడుకూ కూతురు వైపు నుండి సమస్యలు మనశ్శాంతిని కరువు చేస్తుంటే త్రయంబకం దాకా వెళ్లలేక భార్యాభర్తలు తమ సొంత కార్లో కాళేశ్వరం బయలుదేరారు.

*  * *

కారు మంథని దాటి చాలాసేపు పయనించింది. పక్కనే కూచున్న సూర్యకళ బయల్దేరిన్నుండీ తనకు అత్తింటినుండి జరిగిన అన్యాయం, మొగుడిని దుబాయ్‌ ‌పంపి తమకు దూరంగా నివాసం ఉంటున్న తోడికోడలు గురించి.. తెల్సినవే ఏకరువు పెడుతుంది. ఎటూ చెప్పలేని సత్యమూర్తి మధ్యలో ఏదో ఊరొస్తే కారాపాడు. ఇద్దరూ కల్సి రోడ్డుపక్కన టీ తాగారు. మహదేవ్‌పూర్‌ ‌రావడానికే ఇంకా చాలా దూరం ఉందేమో అనుకుంటూ తిరిగి బయలు దేరారు.

 నిర్మానుష్యమైన రోడ్డులో కారు సాఫీగా సాగిపోతుంది. వచ్చేపోయే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఆ రోడ్డెంట. నలభై నిముషాలు గడిచాక గారెపెల్లి బోర్డు కనిపించింది. సాయంత్రం ఐదవుతుంది. గూగుల్‌ ‌మ్యాప్‌లో కొద్దిదూరాన ఎడమవైపు టర్నింగ్‌ ‌చూపిస్తుంది. అక్కడి నుండి మహదేవ్‌పూర్‌ ‌పదిహేను కిలో మీటర్లుంది. ఆ తర్వాత కాళేశ్వరం చేరడం పెద్ద విషయమేమీ కాదు. వ•డు రోడ్ల కూడలి విశాలంగా ఉన్నా అక్కడ జనసంచారమే లేదు. బస్సులుగానీ, ఆటోలు గానీ అస్సలు కనిపించడం లేదు.

 కారు మహదేవ్‌ ‌పూర్‌ ‌వైపు మలుపు తిరగ్గానే రోడ్డుమీద ఓ పెద్దాయన కారుకడ్డంగా వచ్చిచేయూపుతున్నాడు ఆపండన్నట్లు. కారు స్లోగానే ఉండడంతో ఆగి ఏం కావాలన్నట్లు చూశాడు అతనివైపు. అతను ఆదుర్దాగా సత్యవ•ర్తి వైపు వచ్చి పక్కనే బస్‌ ‌షెల్టర్‌ ‌వైపు చూపిస్తూ ‘‘దయుంచండి సార్‌.. ఆడమనిషి..! నొప్పులొస్తున్నాయ్‌. ‌గీ మహదేవపూర్‌ ‌హాస్పిటల్‌ ‌దాకా తీస్కపోండి సార్‌..’’ అన్నాడు రెండుచేతులు జోడిస్తూ.

 సత్యవ•ర్తితో పాటు సూర్యకళ సైతం అటువైపు దృష్టి సారించింది. బస్‌ ‌షెల్టర్‌ ‌సిమెంటు బల్ల మీద వెల్లకిలా పడుకొని ఎత్తైన పొట్టతో మెలికలు తిరుగుతుందో ఆడమనిషి.

 సత్యమూర్తి మొహం అదోలాపెట్టి ‘‘ఏ బస్సుల్లేవా..? నా కారే దొరికిందా?’’ అన్నాడు.

 ఆ పెద్దమనిషి వెంటనే ‘‘బస్సులో తీస్కోవడం లేద్సార్‌. ఆటోలు గూడా లేవు’’

 ‘‘108కి చేయకపోయావా?’’ అన్నాడు అసహనంగా.

 ‘‘అదెక్కడొస్తుంది సార్‌! 108 ‌వచ్చేసరికి నా బిడ్డ ప్రాణం పోతుంది. కొంత దయుంచండి. ఇంతలోనే నొప్పులొస్తయని ఊహించలేదు. మెలితిరుగుతుంది. పొద్దుల మనిషి. కాదనకండి సార్‌..’’ అతడి అభ్యర్థన దీనంగా ఉంది.

సందిగ్ధ స్థితిలో సత్యమూర్తి భార్య వైపు చూశాడు.

 ‘‘గయ్య్..’’ ‌మంది సూర్యకళ. ‘‘ఎందుకీ రంప! శుభమా అంటూ పూజకు వెళ్తూ ఈమెకు డెలివరీ చేయిస్తామా ఏంది?’’ అంది.

 రెండడుగులు వెనక్కి తీసుకున్న కారుని ఆతని పక్కనుండే ముందుకు పరుగెత్తించాడు సత్యవ•ర్తి.

అసహాయంగా చూస్తుండిపోయాడు ఆ వ్యక్తి.

* * *

నాలుగు రోజుల పాటు ఏకబిగిన పితృదోష పరిహార పూజలు నిర్వహించారు సత్యవ•ర్తి దంపతులు. పురోహితుడు శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పలురకాల దానాలు, పరిహారాలు నిర్వహించారు. తండ్రి, తాతల పేరుమీద నాలుగు రోజుల పాటు పిండప్రదానాలు చేశారు. రోజుకు వ•డు పర్యాయాలు గోదావరిలో మునకలు వేశారు. నాన్నగారి ప్రీత్యర్థం గొడుగు, చెప్పులు వంటి చిన్నచిన్న వస్తువులు దానం చేశారు. నాలుగు వేల ప్యాకేజీతో శ్రీనివాసశర్మగారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ఏలోటూ లేకుండా నిర్వహింపజేశాడు.

 బయలుదేరిన రెండోరోజే ఊరి నుండి ఫోనొచ్చింది సత్యవ•ర్తికి. ఇంటికి నాలుగిండ్ల ఆవల ఆరెంపీ డాక్టర్‌ ‌కమలాకర్‌ ‌ఫోన్‌ ‌చేశాడు. ‘అమ్మ సరిగా లేవడం లేదనీ, జ్వరం, దగ్గూ ఉన్నాయి, వంటకూడా సరిగా చేసుకోవడం లేదు’ అని చెప్పాడు.

 ‘‘వచ్చేటపుడు బానే ఉందిగదన్నా..’’ అన్నాడు సత్యవ•ర్తి.

 ‘‘ఏమో మరి! నేనైతే టాబ్లెట్లు ఇచ్చాను. ఇన్ఫర్మేషన్‌ ‌కోసం చెప్పా..’’ అని ఫోన్‌ ‌పెట్టేశాడు.

 ‘‘శుభమా అంటూ పూజకు బయల్దేరినమా.. ఏదోటి ఫోను! ఏంగాదులే మీ అమ్మకు. బండసుటింది. నాల్రోజులు తినకున్నా ఉంటది. చుట్టుపక్కలోల్లతో ఏదోటి తెప్పించుకొని తింటదిలే! డాక్టర్‌ ‌గోలీలిచ్చిండుగదా! ఇప్పుడు జరగాల్సిన పని చూడు..’’ అన్నది సూర్యకళ.

 అప్పటికే ఒకరోజు పూజలు పూర్తవడంతో మిగతా పూజలు పూర్తయ్యాకే వెళ్లాలనే నిర్ణయానికొచ్చాడు సత్యవ•ర్తి.

* * *

 ఐదోరోజు తిరుగుప్రయాణం అయ్యారు సత్యవ•ర్తి దంపతులు. దోషనివారణ పూజలయ్యాక హాయిగా అనిపిస్తుంది.

ఇరవై సంబంధాలు చూసినా ఏ ఒక్క సంబంధం ముడిపడని కొడుకు పెళ్లి సమస్య, కష్టాల కడలిలో ఊగిసలాడుతున్న ఉన్నొక్క కూతురు లావణ్య సంసార జీవితం, నాలుగేళ్ల నుండి చేస్తున్న వ్యాపారం దివాలా తీసి ఉట్టిగానే ఉంటున్న సత్యవ•ర్తి వ్యాపార సమస్యా.. అన్నీ ఒకటొకటిగా గుర్తుకొస్తుంటే ‘‘ఇంట్లో దోషం ఉంది కాబట్టే ఇంతకాలం ఇన్ని సమస్యలు ఎదురవుతూ వచ్చాయి కదా!’’ అని గాఢంగా నిట్టూర్చింది సూర్యకళ.

 ‘‘దోషనివారణ అయింది కదా.. ఇంకెందుకు అవన్నీ గుర్తుచేసుకుంటావ్‌?’’ అన్నాడు సత్యవ•ర్తి డ్రైవింగ్‌ ‌మీదనుంచి దృష్టి మరల్చకుండానే.

 ‘‘అదేనయ్యా.. ఇకనుండైనా ఈ అన్ని సమస్యలూ ఓ కొలిక్కి రావాలంటున్నాను..’’

 ‘‘వస్తుందిలే! అందుకేగదా.. ఇంత ఖర్చుపెట్టి ఐదురోజులపాటు ఈ శ్రమ..!’’ అతనికి వెళ్తున్న దారి విషయంలో ఏదో సందేహం వచ్చి కారు స్లో చేశాడు. ఐదురోజుల క్రితం వచ్చేప్పడు రోడు ఇంత విశా లంగా, నీట్‌గా అనిపించలేదు. రోడు బాగుందని హాయిగా దూసుకుపోతున్నాడు తప్ప సరైన దార్లోనే వెళ్తున్నామా అనే ఆలోచన రాలేదు సత్యమూర్తికి. వచ్చేటప్పుడు చూసిన దారేగదా అని మ్యాప్‌ ‌కూడా పెట్టుకోలేదు. ఇప్పుడేమో కొత్తకొత్త ఊర్లపేర్లు ఎదురవుతున్నాయి.

 అతనికి సందేహం ధ్రువపడుతుంటే ఓ గ్రామం దగ్గర కారు స్లోచేశాడు. పక్కనే నడిచెళ్తున్న ఒకాయన్ని ప్రశ్నించాడు. ‘‘ఇది మంథని, పెద్దపల్లికి పోయే దారేగదా..!’’ అన్నాడు.

 అతను ఓసారి జాలిగా మొహంపెట్టి ‘‘ఓలు చెప్పిండ్రు.. గిది భూపాలపల్లి రోడుగదా..’’ అన్నాడు.

 సత్యమూర్తి కంగుతిని ‘‘అయ్యో.. ఇటెట్లా వస్తిమి’’ అన్నాడు.

 ‘‘మీరు గా గారెపల్లి దగ్గర కుడికి తిరక్కుండా సక్కగొచ్చిండ్రు. గిటు భూపాల్‌ ‌పల్లి, పర్కల్‌ ‌కెయ్‌ ‌పోతది’’ అన్నాడు.

 సూర్యకళ కూడా కంగారుపడింది. సత్యమూర్తి కారును యూటర్న్ ‌చేయాలా అని చూస్తున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి ‘‘మీరు గారెపల్లి నుండి శానా దూర మొచ్చిండ్రు సారూ. మళ్ల ఎనక్కు అవుసరం లేదు. గీడ బస్వాపూరొత్తది. ఆన్నుండి కుడివైపు తిరిగి రుద్రారం మీదికెళ్లి పోండ్రి మంథనికి’’ అన్నాడు.

 సత్యవ•ర్తి ఊపిరి పీల్చుకున్నాడు. సమయం మధ్యాహ్నం ఒంటిగంట అవుతుంది. మంథనికెళ్లాక భోజనం చేద్దామనుకున్నారు. అతను చెప్పిన రూటు కరెక్టేనా అని కన్ఫమ్‌ ‌కోసం మ్యాప్‌ ‌పెట్టి చూశాడు. సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో బస్వాపూర్‌ ‌కనించింది. అక్కన్నుండి రుద్రారం.. మరికొన్ని గ్రామాలు.. ఆ తర్వాత మంథని. తేలిగ్గానే అనిపించింది. ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు కదిలించాడు కారుని.

* * *

 ఉదయం ఏడు గంటలకు మెలకువవచ్చి చూస్తే ముందు తానెక్కడున్నాడో అర్థం కాలేదు సత్యవ•ర్తికి. పైన చెక్కలతో కప్పిన పైకప్పు, తిరుగుతున్న ఫ్యాను కనిపించాయి. ఒంటికింద చెక్కబల్ల తాలూకు ఒత్తిడి తెలుస్తుంది. ఒళ్లంతా నొప్పులతో, ముఖం మీద బ్యాండేజిలతో తల పక్కకు తిప్పి చూడ్డమే కష్టంగా అనిపిస్తుంటే ఏంజరిగిందో గుర్తుకుతెచ్చుకొనే ప్రయత్నం చేశాడు. తలలో నరాలు చిట్లిపోతున్నట్లుగా అనిపిస్తుంటే నెమ్మదిగా గుర్తుకొచ్చింది కారు రోడ్డుమలుపులో పల్టీలు కొట్టిన విషయం. ప్రమాదం వరకే గుర్తుంది. తర్వాత ఏంజరిగిందో తెలియదు.

 అతనికేదో గుర్తుకొచ్చి బలవంతంగా పక్కకు తిరిగి చూశాడు. తను పడుకున్న చెక్కబల్లనానుకొని మరోబల్లపై భార్య పడుకొని ఉంది. స్పృహలో ఉందో లేదో తెలియదు. చేతులపై గాయాలకు ఏదో పసరుపూత తెలుస్తుంది. కుడికాలు చీలమండ దగ్గర బలమైన కట్టుకట్టి ఉంది.

 అతను ఆందోళనగా మరో పక్క తిరిగి చూశాడు. హాల్లో ఎడమవైపు చెక్క సోఫాలో ఎవరో ఆడమనిషి. ఇతనికి మెలకువ వచ్చిన విషయం గమనించి చటుక్కున లేచింది. సత్యవ•ర్తిని సమీపిస్తూ ‘‘ఇప్పుడెట్లా ఉంది బాపూ?’’ అంది.

 సత్యమూర్తి ఇబ్బందిగా కదులుతూ.. ‘‘మీ.. మీరెవరమ్మా..? నా భార్యకేమైంది?అసలు.. మేము.. మేము ఇప్పుడెక్కడున్నాం?’’ అన్నాడు ఆమె ఎవరో పోల్చుకునే ప్రయత్నం చేస్తూ.

 ఆమె అతని భుజంపై చేయుంచి అనునయిస్తూ ‘‘ఇద్దరికీ ఏం పర్వాలేదు బాపూ!’’ అంది.

 అతనేదో రెట్టించేలోపే మరో వ్యక్తి లోనికి అడుగుపెట్టాడు. ‘‘నువ్వెళ్లు తల్లీ’’ అన్నాడు ఆ వ్యక్తి. ఆమె నెమ్మదిగా లేచి లోనికెళ్లిపోయింది. వచ్చిన వ్యక్తి ఓసారి సూర్యకళ వైపు చూసి ‘‘నీ భార్య అనుకుంటా.. ఇంకా నిద్రమత్తులోనే ఉంది. నీకే బాగా గాయాల య్యాయి. తగ్గడానికి టైం తీసుకుంటుంది. నీ వాళ్ల ఫోన్‌ ‌నంబర్‌ ఇవ్వు కాల్‌ ‌చేసి పిలిపిస్తా..’’ అంటూ చిన్న కప్పులో ఓ రసం అందించాడు.

 అతనది తీసుకోకుండానే ఆయనవైపు దీక్షగా చూస్తూ లేచే ప్రయత్నం చేశాడు. ఆయన వారించాడు.  నుదుటున పెద్దబొట్టు, విభూతి, తెల్లటి పంచ, భుజంమీద ఎర్రటి కండువాతో ఏదో ఆలయానికి పూజారిలా కనిపించాడు.

 ‘‘అసలు మేమెక్కడున్నామో చెప్పుండ్రి’’ అన్నాడు. ఈలోపు సూర్యకళకు కూడా మెలకువ వచ్చి కంగారుగా బల్లపైనే లేచి కూర్చోబోయింది. ఆ వ్యక్తి ఆమెతో ‘‘నీకు చీలమండ దగ్గర విరిగినట్లుంది. తొందరపడి లేవకు.. ’’ అన్నాడు.

 సూర్యకళ భర్తవైపు, అతనివైపు గందరగోళంగా చూస్తూ ‘‘మమ్మల్ని ఇక్కడికి ఎవలు తెచ్చిండ్రు పంతులూ!’’ అంది.

 ఆయన చిన్నగా నవ్వి ‘‘మేమే తీసుకొచ్చాం! రుద్రారం శివారులో రోడ్డు పక్కన మా ఇంట్లో ఉన్నారు. ముందున్నది హనుమాన్‌ ‌మందిరం. ఆ ముందటే.. రోడుపక్కన మీ కారు బోల్తా పడింది. దెబ్బలు బాగా తాకాయి కాని లక్కీగా మీకేం కాలేదు. ఈ హనుమాన్‌ ‌మందిర్‌ ‌పూజారి కృష్ణమాచార్యుల్ని నేను. తెలిసిన ఆయుర్వేదిక్‌ ‌వైద్యం చేస్తుంటాను. మీకు సాయం పట్టడానికి చాలా సేపటిదాకా రోడ్డు మీద ఎవరూ దొరకలేదు.108 గానీ, ఏ వాహనం గానీ అందు బాటులోకి రాలేదు. అందుకే ఓ పేషంటు సాయంతో చాలా కష్టంగా ఇక్కడిదాకా తెచ్చాం.నాకు చేతనైనంతలో కట్లు కట్టాను.దెబ్బలకు మందు రాశాను. రేపటి వరకు పూర్తిగా కోలుకుంటారు. మీవాళ్ల నెంబర్‌ ఏదైనా ఉంటే పిలవండి’’ అన్నాడు సావధానంగా.

 దంపతులిద్దరికీ ఆయనకు చేతులెత్తి మొక్కాల నిపించింది కాని శరీరం సహకరించలేదు. గుళ్లో నుండి దేవుడే పంపిన దూతనా ఈ పూజారి? ఇంత శాంతమూర్తి, సహనవ•ర్తి, ముక్కూమొహం తెలియని తమలాంటి దారెంట బోయే అనామకులకు సాయంపట్టే సద్గుణమూర్తిని తామెక్కడా చూళ్లేదు అనిపించింది వాళ్లకు.

 ఇంతలో కృష్ణమాచార్యుల కూతురు రెండు గ్లాసుల్లో పాలు, బ్రెడ్‌ ‌తీసుకొనొచ్చింది. ‘‘కొంచెం పాలు తాగండి. ఎప్పుడు తిన్నారో ఏమో’’ అంది ట్రే పక్కనబెడుతూ.

 ‘‘నా కూతురమ్మా.. వైశాలి’’

 వైశాలి సూర్యకళకు సాయంపడుతూ లేపి కూర్చుండబెట్టింది. గ్లాసు ముందుకు తీసుకొని ఒకచేత బ్రెడ్‌ ‌ముక్కను తుంచి ఆమె నోటికి అందించింది.

 సూర్యకళ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మనుషుల్లో ఇంత సేవాదృక్పథం ఉంటుందా? తోటి మనుషుల పట్ల ఇంత ఆదరణ చూపేవాళ్లుంటారా? ఆమెకు తన తోడికోడలు, వియ్యాలవారు, సమీప బంధువులు అందరూ గుర్తుకొచ్చారు. ఎదుటివారి కష్టాలను చూసి నవ్వుకునేవారు తప్ప సాయంపట్టే గుణమున్న వారెవరూ పెద్దగా గుర్తుకు రాలేదు.

 వైశాలి ఆమెకు బ్రెడ్‌తో పాటు పాలు తాగించి లేచింది. ఈలోపు సత్యవ•ర్తి కూడా పాలు తాగడం పూర్తి చేశాడు. వైశాలి సూర్యకళ తాలూకు హాండుబ్యాగును అందించింది. ఆమె అందులోనుండి మొబైల్‌ ‌తీసి కొడుక్కి ఫోన్‌ ‌కలిపి భర్త కిచ్చింది. కంగారు పడొద్దని చెబుతూనే తామెక్కడున్నామో అడ్రస్‌ ‌చెప్పాడు సత్యవ•ర్తి.

* * *

ఉదయం ఆరుగంటలవుతుంది.

కొడుకు అవినాష్‌ ‌తెల్లవారుజామున నాలుగ్గంట లకే వాహనం తీసుకొని వచ్చాడు.

పూజారి, మరో వ్యక్తితో కలిసి సాయంపట్టి ఇద్దర్నీ వ్యాన్‌లోకి ఎక్కించాడు. అవినాష్‌ ‌సహా ఎంత బతిమిలాడినా ఒక్కపైసా తీసుకోవడానికి నిరాకరిం చాడు కృష్ణమాచార్యులు.

బండి బయలుదేరబోతుంది. ‘‘పితృదోష పరిహారం కోసం మేం చేయిం చుకొన్న పూజలు ఫలితాలివ్వడం మీతోటే మొదలైంది పంతులు గారూ..’’ అన్నాడు చేతులు జోడిస్తూ సత్యవ•ర్తి.

 ఆచార్యులు నవ్వాడు. ‘‘పితృదోషం, మాతృ దోషం అని తల్లిదండ్రులు చనిపోయాక పరిహారం కోసం పూజలు చేయించుకోవడం కన్నా బతికున్న ప్పుడే మాతాపితరులను నొప్పించకుండా, ఉన్నంతలో ఏ లోటూ లేకుండా చూసుకుంటే మాలాంటివాళ్ల సాయం కూడా అవసరం పడదనుకుంటా..!’’ అన్నాడు.

 వాళ్లు వెళ్లడానికి సిద్ధమవుతుంటే, ఇటీవలే పుట్టినట్లున్న పసికందును ఎత్తుకొని వాళ్లకు వీడ్కోలు పలకడానికి బయటకు వచ్చింది వైశాలి. ‘‘నా కూతురమ్మా వైశాలీ. మొన్నే ఐదురోజుల క్రితం.. ఎవరిసాయం అవసరం పడకుండానే పండంటి బిడ్డను కనింది’’ అన్నాడు.

కళ్లల్లో మెరుపు మెరిసినట్లైంది దంపతులిద్దరికీ. ఈ పెద్దాయన్ని ఎక్కడో.. ఎక్కడో చూసినట్లుందే అన్న సంశయం పటాపంచలవుతుంటే సిగ్గుతో తలదించు కోవాలనిపించింది. ‘ఈయన.. ఈ పెద్దాయన తమని గుర్తుపట్టి కూడా.. తమకు సాయం చేయాలనే సంకల్పించాడా?’ అవమాన భారం హృదయాన్ని దగ్ధం చేస్తుంటే తమను తాము సంబాళించుకొంటూ రెండు చేతులెత్తీ ఇద్దరికీ దండం పెట్టారు. వ్యాను కదిలింది. హనుమాన్‌ ‌మందిరంపైన మైకులో నుండి..

‘‘అద్వేష్టా సర్వభూతానాం.. మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ..!’’ అన్న భగవద్గీత శ్లోకం.. (ఏ ప్రాణియందు ద్వేషభావం లేనివాడును, సర్వప్రాణుల పట్ల ప్రేమ, దయ కలవాడును.. సుఖదుఃఖాలను సమంగా స్వీకరించు వాడునూ నాకు ప్రీతిపాత్రుడు…) వినిపిస్తుంటే… కదిలి వెళ్తున్న వాళ్ల హృదయంలో ఇప్పుడు ఇంటి దగ్గర తల్లి రత్నమ్మ కదలాడుతుంది. ఎప్పుడెప్పుడు వెళ్లి అవసాన దశలోనైనా ఆ తల్లికి సపర్యలు చేయాలా అని తపిస్తుంది.

About Author

By editor