‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
మరి కాసేపటికి బలిష్టమైన కర్రలతో కట్టిన కొన్ని పెద్ద పెద్ద తెప్పలను కొందరు మోసుకుంటూ తెచ్చారు. ఒకడు ఓ తెప్పను నీటిలో ముంచి లాక్కు పోయి ఏనుగుపై కనపడుతున్న వాడికి అందించాడు. వాడు మళ్లీ నీటిలోకి దిగి ఆ తెప్పను పుచ్చుకుని నీటి అడుగునున్న గోకర్ణుడికి అందజేశాడు. ఆయన నిలబడిన ఏనుగు నుండి ఆ తెప్పను కొలత వేసి శిష్యుడికి ఏదో సైగలతో చెప్పాడు. వాడు వేగాతి వేగంగా పైకి వచ్చి పైనున్న బృంద సభ్యులకు చెప్పగా వాళ్లంతా వెనువెంటనే ఆ తెప్పలను ఒక్కటొక్కటిగా నీటిపై పేర్చుకుంటూ పోతున్నారు. అంటే కింద నీటిలో ఏనుగులు రెండు వరుసలలో నిలబడగా ఆ ఏనుగులే వరుస స్తంభాలుగా వాటిపై కొన్ని గంటల లోనే వేగంగా నీటిపై తెప్పల వంతెన ఏర్పడింది.
గోకర్ణుడు అతని అనుచరులు కొందరు ఆ తెప్పలను కదలకుండా బలమైన పెరిక తాళ్లతో ఏనుగులకు చుట్టి తెప్పలు కదలకుండా కట్టేస్తున్నారు. ఇదంతా రెండు గంటలలో పూర్తయ్యింది.
వెంటనే గోకర్ణుని ప్రధాన శిష్యుడు వరదయ్య ముందే నిర్ణయించుకున్న బల్లెపు యోధుల బృందాన్ని ముందు పంపాడు. వెనుకగా తెప్పలపై గుర్రాలు, ఆ అశ్వాల బృందానికి నాయకురాలు రుద్రమదేవి, వారి వెనుక కాల్బలమూ కదిలాయి.
నీటిపై నిర్ణయించిన ప్రదేశంలో అడుగున ఏనుగుల బారులు రెండు చేసి వాటిపై తెప్పల వంతెనను అప్పటికప్పుడు నిర్మించి వాటిపై గుర్రాలను, సైనికులను నడిపిస్తున్న తీరును చూసి రుద్రమ, ఇతర కాకతీయ వీరులు అవాక్కయ్యారు. నీటిపై చీకటిలో అశ్వంపై వెళుతూ నదిదాటుతున్న ఆమెకు ఈ అనుభవం ఎంతో విచిత్రంగా, గమ్మత్తుగా ఉంది.
అప్పుడు జరిగిందిది.
ముందు వెళుతున్న బల్లెపు వీరులు వేగంగా వెనక్కు తిరిగారు. ఆవల ఒడ్డున శత్రువులు తమ కోసం సిద్ధంగా ఉన్నారని, ఆ చీకటిలోనే బల్లేలు విసురుతున్నారని వెనక్కు వచ్చిన వాళ్లు చెప్పారు. ఆవల ఒడ్డు నుండి శత్రు సైనికులు విసిరిన బల్లేలు రుద్రమ దగ్గర వరకు వచ్చిపడ్డాయి. అంటే శత్రువులు కాకతీయ సైన్యం వచ్చే ప్రయత్నాలను కనిపెడుతున్నా రన్నమాట.
రుద్రమ సహా అందరూ.. తెప్పలపైకి వెళ్లిన వాళ్లంతా వెనక్కు వచ్చారు.
కింద నిలబెట్టిన ఏనుగుల వరుసలను తన వాళ్లకు వదిలి గోకర్ణుడు పైకి వచ్చి రుద్రమను కలిశాడు.
“శత్రుసేనలు మనకోసం సిద్ధంగా ఉన్నాయి యువరాణీ. వాళ్లు విసిరిన బల్లేలు ఎక్కడివరకు వచ్చి పడ్డాయో గుర్తించండి. మళ్లీ అక్కడి వరకు మాత్రమే వెళ్లండి. జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ మనం మరికొన్ని ప్రయత్నాలు చేయాలి. వాళ్లు బల్లేలు విసరగానే వెనక్కు రావడం,మళ్లీ కాస్త సమయం తీసుకుని ముందుకు వెళ్లడం చేస్తుండండి. బల్లెపు యోధులు ఎవరూ శత్రువుల బల్లేలకు బలి కాకూడదు.. జాగ్రత్త!” అని చెప్పి కొందరు సైనికులను తీసుకుని నదీగర్భంలోకి వెళ్లిపోయాడు.
అక్కడి నుండి గోకర్ణుడి అసలు తంత్రం మొదలయ్యింది.
పైన రుద్రమ బృందపు ప్రయత్నాలు శత్రు సైనికులకు కనిపిస్తుండగా వీళ్లు ముందుకు రాకుండా వాళ్లు నిరోధిస్తున్నారు. అలా తెల్లవార్లూ జరిగింది.
‘ప్రయత్నించు..విఫలమవ్వు’ అనే వాస్తవ యుద్ధతంత్రం పరిశుద్ధంగా నిర్వహించింది రుద్రమ. తెల్లవారేసరికి రుద్రమ సైనిక పటాలం మొత్తం నీటిపైనున్న తెప్పలపై అక్కడే.. బల్లేలకు అందనంత దూరంలోనే ఉండటం.. మళ్లీ వెనక్కు వెళ్లడం,మళ్లీ ముందుకు..రాత్రంతా అదే పని. కానీ అదే సమయంలో వందల మంది కాకతీయ సైనికులు గోకర్ణుడు నిర్దేశించిన మరోచోట ఆవల ఒడ్డుకు చేరి కాస్త ఎడంగా ఉన్న చెట్ల గుబురుల్లోకి దాగిపోయారు. నీటిపైన కనిపిస్తున్న కాకతీయ సైనికబృందాన్ని అవతలిఒడ్డుకు రాకుండా నిరోధిస్తున్నామనుకుని ఆనందంగా ఉన్నారు కళింగ సైనికులు. కానీ తెలతెలవారుతుండగా మరో వైపుగా తమపైకి దూసుకువస్తోన్న కాకతీయ సైన్యం కనపడేసరికి గందరగోళమై పోయారు.
రెండు వర్గాలు అక్కడే యుద్ధం మొదలెట్టాయి.
ఈ సందడిలో రుద్రమబృందం విజయవంతంగా నది దాటేసి.. పోరాడుతున్న తమ సైన్యంతో కలిసి కళింగ సేన లపై తలపడింది.
చనిపోయినవారు చనిపోగా మిగిలినవారు పలాయనం చిత్తగించారు.
ఇది కేవలం రుద్రమదేవి బృందంతో శత్రువు లను మోసగించడానికి గోకర్ణుడు చేసిన నదీ యుద్ధ తంత్రం.
అసలు జరిగింది ఏవిటంటే…మరో ఐదుచోట్ల నదిని దాటడానికి మొత్తం కాకతీయ సైన్యాన్ని ఐదు చిన్నచిన్న పటాలాలుగా ముందే విభజించాడు గోకర్ణుడు.
రుద్రమదేవి నేతృత్వంలో ఒక్క పటాలాన్ని మాత్రమే శత్రు సేనానులకు కనిపించేలా ప్రయోగిం చాడు. ఈ సందట్లో ఐదు చోట్ల తన ఐదు శిష్య బృందాలు అవలీలగా మొత్తం సైన్యాన్ని శత్రువులకు తెలియకుండా సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేర్చాయి.
మొత్తంగా ఒక్క సైనికుడు మరణించకుండా మొత్తం కాకతీయ సైన్యం గోదావరి దాటడం విజయవంతంగా పూర్తయ్యింది. దాంతో గోకర్ణుడి పాత్ర సంపూర్ణమై ఆయన బృందం రుద్రమదేవి నుండి అభినందనలతో శలవు తీసుకుంది.
****
కటకం వద్ద యుద్ధ క్షేత్రం.
యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కళింగ సైన్యం అద్భుతమైన యుద్ధ ్ద విశారదను చూపిస్తోంది.
రెండు చండప్రచండ సామ్రాజ్యస్థాయి రాజ్యాలు పూర్తి సంసిద్ధతáతో యుద్ధానికి తలపడితే ఎలా ఉంటుందో ఈ యుద్ధం నిరూపిస్తోంది. సమస్త యుద్ధ తంత్రాలలో, అరివీరభయంకర యోధులతో.. అత్యుత్తమ ఆయుధాలతో, అమోఘ శక్తియుక్తులు కలిగి.. విజయమో వీరస్వర్గమో అనే తెగింపుతో అత్యున్నత యోధులు రెండువైపులా తలపడు తున్నారు.
చాలా కాలంగా కళింగంపై యుద్ధ మేఘాలు కమ్ముకోవడం.. మళ్లా తేలిపోవడం జరిగింది.
చివరికి ఇప్పుడు భాష ప్రధాన అంశంగా యుద్ధం జరుగుతోంది.
ఈ యుద్ధం గురించి అనేక రాజ్యాల్లో చెప్పుకుంటున్నారు. యుద్ధంలో ప్రధాన ఆకర్షణ మహిళా యోధురాలు రుద్రమదేవి. ఆమె యుద్ధ తంత్రజ్ఞత.. పోరాట స్ఫూర్తి, చురుకు, ఆలోచన, సమయ స్ఫూర్తి, స్వయంగా కత్తి యుద్ధంలో అబ్బురపరచే ప్రతిభ.. శత్రువులను కూడా ఆకర్షిస్తున్నాయి.
కానీ రానురానూ యుద్ధంలో కళింగులదే పైచేయి అవుతున్నట్లు రుద్రమ గుర్తించే సరికే వాళ్లు మురారిదేవుని పట్టి బంధించి యుద్ధ క్షేత్రం నుండి మాయం చేశారు.
హతాశురాలయ్యింది రుద్రమ.
సైన్యం వెనుకడుగు వేస్తోంది. శత్రువు దూకుడుగా మీది మీదికి వస్తున్నాడు. ముఖ్యంగా కళింగుల గజయుద్ధ ప్రతిభ ముందు కాకతీయుల గజతంత్రాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు.
గజయుద్ధ్డ తంత్రవేత్త, అద్భుత గజసాహిణిగా ప్రసిద్ధుడైన ప్రతిభామూర్తి జాయసేనాపతి కళింగ యుద్ధంలో పాల్గొనలేదు. వయసు మీరుతున్నందున యుద్ధం కంటే నాట్యానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. కానీ అవసరం పడితే వెళ్లతానని గణపతిదేవునికి మాట ఇచ్చాడు కాబట్టి రుద్రమ ఆయనకు పరిస్థితి వివరిస్తూ అప్పటికప్పుడు లేఖ పంపింది.
మురారిని బంధించడం ఆయన చాలా తీవ్రమైన అంశంగా తీసుకున్నాడు. కాకతీయ గజసమూహాలు ఆయన ఇచ్చే సంకేతాలకు బాగా స్పందిస్తాయి. ఆయన ఏది చెయ్యమంటే అదే చేస్తాయి. గోదావరి నది మధ్యలో ఉన్న రేఖపల్లి కొండలపై గిరిజన వాదŠ్యకారులతో సంగీతగోష్ఠిలో ఉన్న అయన, రుద్రమ లేఖ చూసి స్పందించాడు. తన గిరిజన వాద్య బృందంతో అర్ధరాత్రి కాహళవాద్యం ద్వారా ఇచ్చిన కూజిత సంకేతాలతో కాకతీయ గజసమూహాలు కళింగ సైన్య స్కందావారంపై విరుచుకుపడి శత్రుసైనికులను తొక్కితొక్కి చంపేశాయి. గజదళం వెంట తన ఎక్కటీల సమూహంతో విరిచుకుపడిన రుద్రమ వీరవిహారం చేసింది. మురారిదేవుడిని విడిచి పుచ్చి రుద్రమదేవి కోరినట్లు తెలుగుభాషా ప్రాంతాలను కాకతీయులకు అప్పగించి యుద్ధ విరమణ చేశాడు కళింగ నారసింహదేవుడు.
ఇదొక చరిత్రాత్మకమైన విజయం. ఈశాన్య, ఉత్తరహద్దులోని తెలుగు ప్రాంతాలన్నీ కాకతీయ తెలుగు పరివారంలో కలిసిపోయాయి.
తిక్కనామాత్యుని కల దాదాపుగా సంపూర్ణ మయ్యింది. ఇక మిగిలింది దక్షిణ, నైరుతి ప్రాంతాలు మాత్రమే!!
****
పదవ మెట్టు: తెలుగు భాషారాజ్య రూపం సంపూర్ణం
“ఆపద్భాంధువులకు ప్రణామములు!
కళింగయుద్ధంలో విజయం సాధించినందుకు అభినందనలు. యువరాణి చిన్నారి రుద్రమదేవి వారికి నా ఆశీస్సులు. ఇప్పుడు మహానది గోదావరికి ఆవల ఈశాన్యాన ఎన్నోప్రాంతాలు కాకతీయ రాజ్యంలో మిళితమయ్యాక తెలుగుభాష వ్యవహారిక సంభాషణా పరిమళంతో గుబాళిస్తోంది. అక్కడి వినసొంపైన తెలుగు అంటే నాకెంతో అనురాగం. ఆ గ్రామీణుల యాస, భాష వింటుంటే పులకించి పోతాను. ఇటీవల జాయచోడుల వారి నుండి వారు రచిస్తున్న కొత్త యక్షగానాన్ని విని ముగ్ధుడనయ్యాను. నాలాగా తమరు తమ బావమరిది, శిష్యపరమాణువు అయిన జాయచోడుల నాట్యవిన్యాసాల మోజులో పడి మా దక్షిణావర్తపు తెలుగుభాషానురక్తులైన ఆంధ్ర ప్రజలను మరచిపోకండి. అన్నివైపులా తెలుగు గ్రామాలను, రాజ్యాలను తమ ఏలుబడిలోకి తెచ్చుకున్న తమరు..మా దక్షిణం వైపు దృష్టి పెట్టాలని మనవి. ఒకప్పుడు పూర్తిగా తమిళ చోళ రాజులకు వంగివంగి దండాలు పెడుతూ తెలుగునేల నుంచి, తెలుగు రైతుల చెమట నుండి పిండిన పన్నుల సొమ్ముతో ఏటా 340 కళాంజుల బంగారాన్ని, లక్షా 10 వేల కలాముల వరిధాన్యాన్ని తంజావూరు ఆలయ భాంఢాగారానికి తరలించుకుపోవడం ఎంత బాధాకరమో మీకు తెలుసు. మన తెలుగు సామ్రాజ్యస్థాపన కోసం కలలు కంటూ మొదట మన చోడరాజులు తమిళ చోళరాజుకు పన్నులు, కప్పాలు కట్టడం మాన్పించాను. ఇప్పుడు వారంతా చోళరాజులుగా కాక తెలుగుచోడ రాజులుగా చెప్పుకునేలా మార్పు తేగలిగాను. తమరు కూడా తెలుగు మాట్లాడే ప్రజలను ఏకం చేస్తూ ఆయా భాషారాజ్యలను, ప్రాంతాలను మన కాకతీయ రాజ్యంలో కలుపుకోవడంలో అలుపెరుగని పోరాటం చేస్తూ విజయవంతులౌతున్నారు. దక్షిణావర్తంలో, మూడు భాషల ప్రాంతమైన తొండమండలంలోని మిగిలిన తెలుగు ప్రాంతాలను జయించినప్పుడే తెలుగు సామ్రాజ్య రూపం పరిపూర్ణం అవుతుందని తమరికి తెలియనిది కాదు. అప్పుడే అది అఖండ తెలుగురాజ్యం,సస్యశ్యామల ఆంధ్రŠసామ్రాజ్య రూపం సంపూర్ణం కాగలదు. ఈ మా లేఖను అది తమరికి గుర్తు చేయడంగా భావించవద్దని మనవి. వీలయి నంత త్వరితంగా ఇటు దృష్టి సారిస్తారనే ఆశతో చేసుకుంటున్న విన్నపం.
చిత్తగించవలెను.
ఆంధ్రసామ్రాజ్య పౌరుడు..తిక్కన,తండ్రి కొమ్మనామాత్యుడు. విక్రమ సింహపురం.
……………..
అనుమకొండ రాజప్రాసాదం..
తిక్కనార్యుని వార్తాహరుడు వచ్చి మహారాజు నియోగంలో లేఖ అందించగా అది గణపతిదేవునికి చేరింది.
“ఆపద్భాధవులకు ప్రణామములు..”
“విక్రమసింహపురి కష్టాలు తొలగాలి అంటే సంపూర్ణ తెలుగు సామ్రాజ్య స్థాపన అనే యజ్ఞం పూర్తి చెయ్యాలి. దానికి యజ్ఞకర్త తమరు. నేను కేవలం మంత్రోచ్చారణ చేయగల విప్రుడిని మాత్రమే. నావంక యమధర్మరాజు క్రీగంట చూస్తున్నాడు. ఓపిక తగ్గుతోంది. చూపు మందగిస్తోంది. చేయి వణకు తోంది. చిరంజీవి మనుమసిద్దికి తమరు బాసటగా నిలవాలి. చుట్టూ ఎన్నో గుంటనక్కలు పొంచి ఉన్నాయి. వాటిని పెంచి పోషిస్తున్నవారు పాండ్యరాజు జటావర్మ సుందర పాండ్యుడు, హోయసాల యువ బల్లాలుడు.. మరికొంతమంది కూడా. తమరు మళ్లా కత్తి, డాలు చేపట్టి యుద్ధ్దాశ్వాన్ని అధిరోహించి దక్షిణాదికి ససైన్యంగా తరలి రావాలని వినమ్ర మనవి.
భవదీయుడు
తిక్కన..”
లేఖ ముగించి నిట్టూర్చాడు గణపతిదేవుడు. దక్షిణావర్తంలోని తెలుగు ప్రాంతాలను జయించడం గురించి తిక్కనామాత్యుడు లేఖ పై లేఖ రాస్తున్నారు. లేఖ సంబోధనలో తనను ‘అపద్భాంధువులు’ అనడం గణపతి దేవుని కదిలించింది. ఆయన ఎప్పుడు లేఖ రాసినా ‘ఆపద్భాంధవులు’ అనే సంబోధిస్తున్నారీ మధ్య. తన పేరు మాత్రమే రాస్తారు కానీ సోమయాజి అని కూడా రాయడు. అంతటి వినయశీలి.
చాలు.. తిక్కన అనే ఆ మూడక్షరాల నామం. తెలుగు అనే భాష ఈ భూమిపై ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
గణపతిదేవుని సామంత రాజ్యాలలో అత్యంత ఇష్టమైనది విక్రమ సింహపుర రాజ్యం. నిజానికి దక్షిణ సరిహద్దులో అతి ముఖ్యస్థానంలో ఉన్నది కూడా అదే.
అసలు విక్రమ సింహపుర రాజ్యం అత్యంత దురదృష్టకర రాజ్యమా లేక అత్యంత అదృష్ట రాజ్యమా.. నిర్ణయించడం గణపతిదేవునికి కష్టమౌతోంది. గత నాలుగు తరాలుగా ఈ రాజ్యానికి ఎన్నెన్నో సమస్యలు. ఎన్నో చిక్కుముడులను చాకచక్యంగా విప్పి ఆ రాజ్యాన్ని సంరక్షిస్తున్న మహా చాణక్యుడు తిక్కనార్యుడు. మహాపండితుడైన ఆయనను ప్రశాంతంగా ఆంధ్రభారత రచనను చేసుకోనివ్వకుండా ఆ రాజ్య వారసత్వానికి అర్హులుగా చెప్పుకునే కొందరు అంగుష్ఠమాత్రులు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తున్నారు.
మళ్లీ ఇప్పుడు అవే సమస్యలు.. ఆరు నెలల నాడు తిక్కనామాత్యుని వార్తాహరుడు ఓ అత్యంత విషాదవార్తను మోసుకొచ్చాడు.
నెల్లూరు పాలకుడు తిక్కభూపాలుడు మరణించాడు.
ఆయన కుమారుడు మూడవ మనుమసిద్ది యువ కుడుగా ఎదిగి తండ్రికి రాజ్యపాలనలో సహకరిస్తూ, మహామాత్యులు తిక్కనగారి అనురాగంతో అనుభవం గడించాడు కాని అతనిని తండ్రి వారసత్వం రాకుండా కొందరు జ్ఞాతి సోదరులు అడ్డుపుల్లలు వేస్తున్నారని గణపతిదేవునికి తెలిసినప్పుడు చాలా నొచ్చుకున్నాడు.
ఇన్ని సమస్యల నడుమ తెలుగు సామ్రాజ్య స్థాపన కోసం తిక్కనార్యుని తపన పక్కదారి పట్టడంలేదు. తరచూ గణపతిదేవుని ఉత్తరాల ద్వారా హెచ్చరిస్తున్నాడు,కోరుతున్నాడు,బతిమలాడుతున్నాడు.
కళింగ యుద్ధంతో మూడు వైపులా ఉత్తర, ఈశాన్య, వాయవ్య సరిహద్దుల వద్దనున్న తెలుగు మాట్లాడే రాజ్య ప్రాంతాలన్నీ కాకతీయ సామంత రాజ్యాల్లో విలీనం అయిపోయాయి. ఇక మిగిలింది దక్షిణాదిలోనూ, నైరుతిలోనూ ఉన్న తెలుగు ప్రాంతాల స్వాధీనం.
దక్షిణాదిలో పల్లవుల, చోళుల ప్రాబల్యం పూర్తిగా అణగారిపోయి పాండ్యులు వీరవిహారం చేస్తున్నారు. ‘మా తెలుగు గ్రామాలను మాకు ఇవ్వండి’ అని ప్రార్ధిస్తూ లేఖ వాస్తే, ‘వేంగి వరకు మా తమిళ ప్రాంతమే. మాకే వదిలేయండి’ అని తిరుగులేఖ రాశాడు పాండ్యభూపతి. అతని అండ చూసుకుని సింహపురి సింహాసనం తనదే అని విర్రవీగు తున్నాడు మనుమసిద్ది జ్ఞాతి సోదరుడిగా చెప్పుకునే సుందరచోడుడు.
ఇవన్నీ మనసులో గింగరాలు తిరుగుతుండగా మంత్రాంగ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశాడు గణపతిదేవుడు. బిలబిలమంటూ సైన్యాధ్య క్షులు, యుద్ధవీరులు, సాహిణిలు, మందడిలు.. అనుమకొండలో నున్న మండలేశ్వరులు పరుగుపరుగున వచ్చారు. ఇక రాజప్రాసాదంలో ఉండే రుద్రమదేవి, మురారిదేవుడు, జాయచోడుడు కూడా ఆదరాబాదరా సమావేశానికి హాజరయ్యారు.
తిక్కనామాత్యులు రాసిన లేఖను అందరికి చూపాడు. దక్షిణాది, నైరుతి రాజ్యాలలోని తెలుగు ప్రాంతాలు మాత్రమే మిగిలి ఉన్నాయని వాటిని కూడా జయించి తెలుగు రాజ్యంలో కలుపుకోవాలని తిక్కనామాత్యులు లేఖలో కోరారని వివరించాడు.
కానీ ఎవ్వరూ పెద్దగా ఉద్రేకపడలేదు. చాలా మామూలుగా స్పందించారు.
అందరి తరఫున ఆడకూతురు రుద్రమదేవి తండ్రికి జవాబిచ్చింది. “అబ్బా.. మళ్లీ యుద్ధ్దమా! నిన్నగాక మొన్నే కళింగం గెలిచాం కదా. తిక్కన తాతగారు భారతం రాయడం తిరిగి ప్రారంభిస్తు న్నానని చెప్పారు కదా? అది పక్కనపెట్టి మిగిలిన తెలుగు ప్రాంతాల స్వాధీనం కోసం మళ్లీ యుద్ధం చేద్దాం అంటే ఎలా? నాకు ఓపిక లేదు బాబో..” అంది వొళ్లు విరుచుకుంటూ.
అందరి ముఖాల్లో ఆమె మాటలే కనిపిస్తున్నాయి.
కాని విధి మరోలా తలచింది కాబోలు అప్పుడే మరో వార్తాహరుడు వచ్చాడు.
లేఖ పంపినవాడు గంగయసాహిణి.
ఆ లేఖ మురారిదేవుడు అందుకుని చదవగానే అందరూ చురుకయ్యారు. కోపంతో లేచి నిలబడ్డారు.
నడబంధంలోని కత్తులపైకి అప్రయత్నంగా చేతులు వెళ్లాయి.
కొడవ రాజ్యపాలకుడు రక్కస గండదేవుడు మళ్లీ గంగయసాహిణి పాలిస్తున్న వెల్లూరు రాజ్యప్రాంతాల లోకి దూసుకువచ్చాడు. అది లేఖలోని విషయం.
ప్రశాంతంగా పడమటి సరిహద్దు వెంబడి కన్నడ రాజ్యాల నుండి అన్ని తెలుగు గ్రామాలు పూర్తిగా విలీనం అయ్యాయి. ఇక పడమటి సరిహద్దు ప్రాంతాలు స్పష్టంగా తెలుగు రాజ్యాలుగా,కన్నడ రాజ్యాలుగా విభజన సామరస్యంగా పూర్తయ్యిందని సంతోషిస్తున్న తరుణంలో మళ్లీ ఉపద్రవం ముంచుకొచ్చింది.
మార్జువాడి రాజ్యంలో దక్షిణ హద్దుగా కైవారం అనే మరొ కోట ఉంది. ఉత్తరాన పానగల్లు, తూర్పున రేనాడు రాజ్యంలోని మోపూరు ఉండేది. వల్లూరువద్ద, కోలారు రాజ్యం దగ్గరలో మిండిగల్లు, కైవారం వద్ద కూడా కోటలు ఉన్నాయి. వల్లూరు నుండి పాలిస్తున్న గంగయసాహిణి ఆయా ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అది చూసి కన్నుకుట్టి రక్కస గండ తెలుగు రాజ్యంలోకి చొచ్చుకు వచ్చాడని అందరూ భావించారు.
‘ఎవడ్రా మా రాజ్యంలోకి వచ్చేది..?!’
ఈ భావన కాకతీయ వీరుల నరనరానా వ్యాపించి ఉంటుంది. ఎవడైనా చెప్పా చెయ్యకుండా కాకతీయ భూభాగంలోకి అడుగుపెడితే వాడి కాలు కాదు.. తల తీసేయ్యల్సిందే అనుకుంటారు వాళ్లు. అంతవరకున్న బద్ధకం, చిరాకు ఎగిరిపోతాయి.
‘కాకతీయ ప్రధాన యోధవర్గం చాలామంది కీర్తిశేషులయ్యారు. మిగిలిన వారు వృద్ధ్దులై ఉన్నారు’ అని శత్రువులు చెప్పుకుని ఆనందించేలోపే కాకతీయ యువతరం యుద్ధ ్దప్రవేశం చేసింది. గణపతిదేవుని అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన వారసులు.. రుద్రమాంబ, మురారిదేవుడు ఆయన ఆశయ ప్రణాళికలలో ఏ మాత్రం సవరణలు చేయడంలేదు. శిరసావహించి నిర్వహించడమే.
అదే ఆశయం.. అదే పోరాట పంథా.
మురారిదేవుడు గట్టి యోధుడుకాడని శత్రువులు భావిస్తున్నట్లు తెలుస్తోంది కాని కుమార్తె రుద్రమదేవి విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహంలేదు. ఆమే గణపతిదేవుని నిఖార్సైన వారసురాలు. వారసత్వం సంగతి అటుంచితే ఇప్పుడు ఆమెకు మహా మండలేశ్వరుడు గణపతిదేవుడు ఏ ఆజ్ఞ ప్రకటించినా అది నూటికి నూరు శాతం సాధించి తీరుతుంది. కత్తితోనే సమాధానం చెబుతుంది.
ఇప్పుడే అందిన సమాచారంతో ఈ సమావేశం తిరిగి కాకతీయ వీరులను యుద్ధ్దోన్ముఖం చేసింది.
చివ్వున లేచాడు గణపతిదేవుడు.
“ఆ మార్జువాడి మహారాజు కొడవ రక్కస గండదేవుని అడ్డంగా నరికి దక్షిణాది, నైరుతిలోని శత్రురాజులకు పాఠం చెప్పక తప్పని కాలం వచ్చింది వీరులారా! తప్పదు. ఆ మహాకాలుని నిర్ణయం ఇదే కావచ్చు. మీమీ యుద్ధశ్రేణులకు అనుజ్ఞ ఇవ్వండి. కత్తిడాలు సిద్ధం చేసుకోండి. రుద్రదేవా! ఈ యుద్ధానికి అగ్రభాగాన తమరు నిలబడాలి. అంగీకారమేనా??”
ఆనందంగా అంగీకరించింది రుద్రమ. కానీ ఒక షరతు పెట్టింది. అది తండ్రి యుద్ధభూమికి రాకూడదు.
అందుకు గణపతిదేవుడు అంగీకరించలేదు.
“భవిష్యత్తులో యుద్ధభూమికి రాలేను. శరీరం సహకరించడం లేదు. ఇదే ఆఖరి యుద్ధం. ఈ ఒక్కసారికి అంగీకరించు రుద్రమా..!” అన్నాడాయన దీనంగా.
యోధులంతా ముక్తకంఠంతో ఆయనను బలపరచారు. అంగీకరించక తప్పలేదు రుద్రమకు.
“అయితే ఎప్పుడూ నేను మీ పక్కనే ఉంటాను. నాకు చెప్పకుండా తెలియకుండా మీరు యుద్ధ రంగంలో మీ ఇష్టారీతిగా ఎవడి మీదికీ పోకూడదు..” అందుకు అందరూ మళ్లీ ఏకగ్రీవంగా అంగీకరించగా ఆయన తప్పనిసరై ఒప్పుకున్నాడు.
మురారిదేవుడు కాకతీయ రాజ్య పరిపాలనను చూస్తుండగా మహాయోధుడు జాయసేనాపతి అనుమకొండలోనే ఉండి యుద్ధ సమీకరణాలను పర్యవేక్షించాలని, సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రోలె భీమనాయకను ఎంపిక చేశారు. శూన్య పాలకుడిగా బసవరస నాయడ్ని నియమించాడు గణపతిదేవుడు.
ముందు వెల్లూరును ఆక్రమించిన కొడవ రక్కసగండ సైన్యాన్ని నిలువరించవలసినదిగా పక్కనున్న తెలుగు చోడరాజులకు వర్తమానం పంపాడు. మూడు బృందాలను స్కంధావారం నుండి గణపతిదేవుడు, తిక్కనామాత్యుడు సమన్వయం చేయాలని నిర్ణయించారు.
అయితే యుద్ధ ప్రయత్నాల్లో ఉండగానే మళ్లీ సింహపురికి కొత్త కష్టాలు వచ్చాయి.
తిక్క భూపాలుడు మరణించాక అతని కొడుకు మూడవ మనుమసిద్ది పాలన లోకి వచ్చినప్పుడే అతని జ్ఞాతి సోదరుడు విజయగండ గోపాలుడు పేచీలు మొదలెట్టాడు. గోపాలుడు చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాటు జిల్లాలు చేజిక్కించుకున్నాడు. అతనికి పాండ్యరాజు జటావర్మన్ సహకరిస్తున్నాడు.
మనుమసిద్దికి సింహపురి, దాని పరిసరాలు, పాత రేనాడు రాజ్యభాగాలు మిగిలాయి.
అవతల యువకుడైన మూడవ బల్లాలుడు తెలుగు గ్రామాలను కూడా కబళించి తెలుగుచోడ రాజ్యలలోకి చొచ్చుకువస్తున్నాడని గూఢచార వార్తలు వస్తున్నాయి. అతడు ఈ కొడవ రక్కస గండడికి పూర్తి మద్దతుఅని తెలియవచ్చింది.
దానాదీనా తేలింది ఏవిటంటే దక్షిణ, నైరుతి రాజ్యలలోని తెలుగు ప్రాంతాలను, గ్రామాలను కాకతీయ రాజ్యంలో కలుపుకోవాలంటే యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
“ఇది పూర్తి తెలుగుసామ్రాజ్యం ఏర్పడటానికి అంతిమ యుద్ధం” ప్రకటించాడు తిక్కనామాత్యుడు.
అద్దంకి దగ్గరగా స్కంధావారం ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్య యుద్ధ తంత్రజ్ఞుడుగా తిక్కనామాత్యుని ఎంపిక చేశారు. ఇది త్రిముఖ యుద్ధం. యుద్ధ తంత్రంలో భాగంగా కాకతీయ మహాయోధులతో మూడు ప్రత్యేక బృందాలను నిర్ణయించింది రుద్రమాంబ.
ఒక బృందం దేవగిరి సైన్యంపై.. వాళ్లు ఆక్రమించుకున్న కంపిలిరాజ్య భాగాల కోసం.
మరో బృందం కంచిపై.. తెలుగు, తమిళ ద్విభాషీయుల హద్దుల కోసం.
మరో బృందం మార్జువాడిపై. కన్నడ, తెలుగు ద్విభాషీయుల హద్దుల కోసం.
మూడో బృందం వెల్లూరును ఆక్రమించుకున్న రక్కస గండడిపై..
గోన గన్నారెడ్డి, ముమ్మడిరెడ్డి ప్రభృతులు యాదవుల మీద దండెత్తారు. సామంత భోజుడు, మూడవ మనుమసిద్ది తదితర వీరుల బృందం కంచి పాలకుడైన విజయగండ గోపాలునిపై యుద్ధం ప్రకటించారు. మూడవ బృందానికి గంగయ సాహిణితో కలసి స్వయంగా రుద్రమ రక్కసగంగడిపై యుద్ధ్దానికి సిద్ధమమైంది.
రుద్రమ కేవలం రక్కసగండదేవునిపై యుద్ధ బృందంలో మాత్రమే ఉండటం అందరిని ఆశ్చర్య పరచింది. కారణం రుద్రమలాంటి మహాయోధురాలు ఓ చిన్నరాజ్యంపై పోరాటానికి పరిమితం కావడమే.
‘వీరనారీ.. తమరు ఓ చిన్నసైన్యంపై యుద్ధానికి పరిమితం కావడం.. ఏమిటి??’ అని అడిగాడు తిక్కనామాత్యుడు.
ఆమె తన యుద్ధ తంత్రానికి కారణాలను వివరించసాగింది.
(సశేషం)

మత్తి భానుమూర్తి