‘సరైన సమయంలో చేసే చిన్న ప్రయత్నం, ఆలస్యంగా చేసే పెద్ద ప్రయత్నం కంటే ఎంతో మేలైనది’. సమయం భగవంతుడు మనకు ఇచ్చిన అమూల్యమైన వరం. ప్రతి క్షణం ఆయన కృపతోనే అది మనకు లభిస్తోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే భగవంతుని ఆశీస్సులను గౌరవించినట్లే. సమయాన్ని వృథా చేయడం అనేది ఆయన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా భావించాలి. అందుకే సమయ పాలనకు భక్తి భావనతో కూడిన జీవితం అవసరం.
మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర సమయ ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. శ్రీరాముడు తన సమయాన్ని ప్రజాసేవకు, ధర్మ పరిరక్షణకు అంకితం చేసి ఆదర్శంగా నిలిచాడు. శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధిస్తూ, ప్రతి క్షణాన్ని ధర్మ మార్గంలో వినియోగించాలని ఉపదేశించాడు. వీరి జీవితాలు సమయ పాలనకు ఉత్తమ ఉదాహరణలు.
రామచంద్రుడితడూ..
శ్రీరాముని దృష్టిలో సమయపాలన అంటే కేవలం గడియారం చూసి పని చేయడం కాదు, అది ఒక ధర్మబద్ధమైన బాధ్యత. ఇచ్చిన మాటను సరైన సమయానికి నిలబెట్టుకోవడం. తండ్రి కైకేయికి ఇచ్చిన వరాన్ని నెరవేర్చడం కోసం, పట్టాభిషేకానికి సిద్ధమైన రాముడు క్షణం కూడా ఆలస్యం చేయ కుండా, ఏమాత్రం తటపటాయించకుండా అడవికి బయలుదేరాడు. ‘తర్వాత వెళ్తాను’ అని వాయిదా వేయకుండా, నిర్దేశించిన సమయానికే అరణ్య వాసానికి వెళ్లడం ఆయన సమయ నిబద్ధతకు నిదర్శనం. విభీషణుడు రావణుడిని విడిచి రాముడి శరణు కోరినప్పుడు, సుగ్రీవుడు మొదలైనవారు అనుమానించినా రాముడు ఆలస్యం చేయలేదు. ‘శరణు కోరిన వారిని రక్షించడంలో కాలయాపన చేయకూడదు’అని తక్షణమే విభీషణుడికి అభయ మిచ్చాడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో సమయం ఎంత కీలకమో ఆయన ఆచరణలో చూపాడు. వాలి వధ తర్వాత సుగ్రీవుడు తన రాజభోగాలలో మునిగిపోయి, సీతమ్మ వెతుకులాట కోసం ఇచ్చిన మాట మర్చిపోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి ద్వారా సుగ్రీవుడికి సమయం విలువను, గతంలో చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేస్తాడు. వర్షాకాలం ముగియగానే కార్యాచరణ మొదలుపెట్టాలనే రాముడి ఆలోచన ఆయన వ్యూహాత్మక సమయపాలనను తెలియజేస్తుంది. రావణుడితో యుద్ధం చేసేటప్పుడు, రావణుడు అలిసిపోయి ఆయుధాన్ని కోల్పోయినప్పుడు ‘ఇవాళ వెళ్ళి రేపు రా’ (నాల్గవ రోజు యుద్ధంలో) అని పంపిస్తాడు. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు చంపడం వీరధర్మం కాదని, అతనికి తగిన సమయం ఇచ్చి మళ్లీ యుద్ధం చేయడం ఆయన సంస్కారం. శ్రీరాముడు తన జీవితంలో ఎప్పుడూ అతిగా, వేగంగా వెళ్లలేదు, అలాగని వాయిదా వేయలేదు. ఏ సమయానికి ఏది ధర్మమో, ఆ సమయానికి ఆ పనిని పూర్తి చేసేవాడు. రాముని సమయపాలన మనకు నేర్పే పాఠం ఒక్కటే ‘కాలం విలువ తెలిసినవాడే ధర్మాన్ని కాపాడగలడు. శ్రీరాముని జీవితం ధర్మానికి ప్రతిరూపం అయితే, ఆ ధర్మాన్ని ఆచరించడంలో ఆయన పాటించిన సమయపాలన మనందరికీ ఆదర్శనీయం’. రాముడు తన జీవితంలో ప్రతి ఘట్టంలోనూ సమయానికి ఇచ్చే విలువ ఆయనను ‘మర్యాద పురుషోత్తముడిగా’ నిలబెట్టింది.
కాలాతీతుడు గీతాకారుడు
శ్రీకృష్ణుని దృష్టిలో సమయం అంటే ‘కాలస్వరూపుడైన దైవం’. సమయాన్ని గౌరవించే వ్యక్తిని విజయం వరిస్తుందని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. మనం కూడా మన జీవితాల్లో అనవసరమైన పనులకు స్వస్తి చెప్పి, కృష్ణుడి వలె సమయస్ఫూర్తిని, సమయపాలనను అలవర్చుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. మహాభారత యుద్ధానికి ముందు రాయబారిగా వెళ్లినప్పుడు, సంధి కోసం ఆయన ఎంత సమయం కేటాయించాలో అంతే కేటాయించాడు. పాండవుల తరఫున రాయబారం విఫలమవుతుందని తెలిసినా, శాంతి కోసం చివరి నిమిషం వరకు వేచి చూశాడు. ఒకసారి యుద్ధం అని నిర్ణయమైన తర్వాత, క్షణం కూడా ఆలస్యం చేయకుండా వ్యూహరచనలో నిమగ్న మయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సమయ పాలన అత్యంత అద్భుతంగా ఉంటుంది. యుద్ధరంగంలో అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు, సరిగ్గా యుద్ధం ప్రారంభం కావడానికి ముందే గీతను బోధించి అతనిని సిద్ధం చేశాడు. జయద్రథుని వధ సమయంలో మాయా సూర్యాస్తమయాన్ని సృష్టించి, సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని అర్జునుడి ప్రతిజ్ఞను నెరవేర్చాడు. శిశుపాలుడు చేసే వంద తప్పుల వరకు వేచి చూడటం కృష్ణుడు విధించుకున్న ఒక గడువు. వంద తప్పులు పూర్తి కాగానే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఇది మనకు ఏం నేర్పుతుందంటే ఓర్పుకు కూడా ఒక సమయం ఉంటుంది, అది దాటినప్పుడు తక్షణమే చర్య తీసుకోవాలి. జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి, రాత్రికి రాత్రే సముద్రం మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించడం కృష్ణుడి కార్యదక్షతకు నిదర్శనం. ఆపద రాకముందే సమయాన్ని వృథా చేయకుండా సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆయనలోని దార్శనికుని చూపిస్తుంది. గతాన్ని గురించి చింతించకుండా, భవిష్యత్తు గురించి భయం లేకుండా ప్రస్తుత క్షణంలో తన బాధ్యతను (ధర్మాన్ని) నిర్వహించడం. కొన్నిసార్లు ఏమీ చేయకుండా కాలం కోసం వేచి చూడటం కూడా సమయ పాలనే (ఉదాహరణకు, సరైన సమయం వచ్చే వరకు బలరాముడిని యుద్ధానికి దూరంగా ఉంచడం). ఏ పని ఎప్పుడు చేయాలో, ఏది ముఖ్యమో నిర్ణయించుకోవడంలో కృష్ణుడు అత్యంత నిపుణుడు. కృష్ణుడి భాషలో సమయం అంటే ‘కర్మ’. సమయం ఎవరికోసం ఆగదు, కానీ సమయాన్ని సరిగ్గా వాడుకున్నవాడు చరిత్రను మారుస్తాడని ఆయన జీవితం నిరూపిస్తుంది. ఆయన చేతిలోని సుదర్శన చక్రం నిరంతరం తిరుగుతూ, కాలచక్ర గమనాన్ని, దాని వేగాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక యుగం ముగిసి మరో యుగం ప్రారంభమయ్యే సంధి కాలంలో ధర్మాన్ని నిలబెట్టేవాడు కాబట్టి శ్రీకృష్ణుని యుగపురుషుడు అంటారు. ద్వాపర యుగం ముగింపులో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తదుపరి కలియుగ గమనాన్ని నిర్దేశించింది.
కార్యసాధకుడు అంజనీపుత్రుడు
రామాయణంలో హనుమంతుడు తమ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం ద్వారా విజయాన్ని అందుకున్నాడు. సముద్రాన్ని లంఘించేటప్పుడు సురస, మైనాకుడు, సింహిక వంటి అడ్డంకులు ఎదురైనా, ఎక్కడా అనవసరంగా సమయాన్ని వృథా చేయలేదు. మైనాకుడు విశ్రాంతి తీసుకోమని కోరినప్పుడు, “రామకార్యం పూర్తి కాకుండా విశ్రాంతి లేదు” అని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇది మనకు ‘పని పూర్తయ్యే వరకు విరామం తీసుకో కూడదు’ అనే సమయపాలన సూత్రాన్ని నేర్పుతుంది. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు, సూర్యోదయానికి ముందే సంజీవని మూలికను తీసుకురావాలని వైద్యుడు సుషేణుడు చెబుతాడు. మూలికను గుర్తించడంలో సమయం వృథా అవుతుందని గ్రహించి, ఏకంగా పర్వతాన్నే ఎత్తుకొచ్చాడు. రావణ వధ తర్వాత, రాముడు వనవాసం ముగించుకుని తిరిగి రావడానికి ఒక్క రోజు ఆలస్యమైనా తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేస్తాడు. రాముడి కంటే ముందే హనుమంతుడు అయోధ్యకు వెళ్లి, భరతుడికి సమాచారం అందిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఒక ‘సమాచార వారధి’గా మారి, క్షణాల వ్యవధిలో ఒక ప్రాణాన్ని, ఒక వంశగౌరవాన్ని కాపాడాడు. సమయ పాలనలో మాటతీరు కూడా ముఖ్యమే. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు “సీతమ్మను చూశాను” అని చెప్పకుండా, ‘చూశాను సీతను’(దృష్టా సీతా) అని అంటాడు. మొదటి ముక్కలోనే ఫలితాన్ని చెప్పడం వల్ల రాముడి ఆందోళన తక్షణమే తగ్గుతుంది. అనవసరమైన వివరణలతో సమయాన్ని వృథా చేయకుండా, అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ముందుగా చెప్పడం ఆయన ప్రత్యేకత. సుగ్రీవుడి మంత్రిగా ఉన్నప్పుడు గానీ, రాముడి సేవలో ఉన్నప్పుడు గానీ హనుమంతుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు కచ్చితంగా తెలుసు. సమస్యలు వచ్చినప్పుడు సమయం వృథా చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను (పర్వతాన్ని ఎత్తడం వంటివి) వెతకాలి. హనుమంతుడు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే -సమయం పట్ల గౌరవం ఉన్నవాడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆయన్ని ‘కార్యసాధకుడు’ అని పిలుస్తాం.
చరిత్రకారులు
శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా శత్రువులు కోటపై దాడి చేసే లోపే, ఆ సమాచారాన్ని వేగుల ద్వారా సకాలంలో అందుకోవడం వల్లనే రాయలు అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. సమాచారం చేరడంలో ఒక్క గంట ఆలస్యమైనా చరిత్ర మరోలా ఉండేది. సమయం మించిపోయాక చేసే పోరాటం ఎంత గొప్పదైనా అది ఫలితాన్ని ఇవ్వదు. అందుకే ప్రతి క్షణాన్ని ఒక యుద్ధ తంత్రంలాగే గౌరవించాలి. నెపోలియన్ ఓటమికి ఒక చిన్న ఆలస్యమే కారణమని చెబుతారు. యుద్ధ భూమిలో నెపోలియన్ సేనలు వర్షం కారణంగా బురద వల్ల కొన్ని గంటలు ఆలస్యంగా దాడిని ప్రారంభించాయి. ఆ కొద్దిపాటి విరామమే ప్రత్యర్థి సేనలు వచ్చి బ్రిటిష్ సైన్యంతో కలవడానికి సమయాన్ని ఇచ్చింది. ఫలితంగా నెపోలియన్ సామ్రాజ్యం కూలిపోయింది.
అదిగదిగో ఛత్రపతి
శివాజీ మహారాజ్ జీవితం సమయపాలన – క్రమశిక్షణకు ఒక నిఘంటువు వంటిది. ఆయన సాధించిన విజయాల వెనుక కేవలం ధైర్యసాహసాలే కాదు, క్షణాల వ్యవధిలో ఆయన తీసుకునే నిర్ణయాలు, కచ్చితమైన సమయపాలన ప్రధాన పాత్ర పోషించాయి. శివాజీ వ్యూహాల్లో ‘సమయం’ అత్యంత కీలకమైన ఆయుధం. శత్రువు ఊహించని సమయంలో దాడి చేయడం(గెరిల్లా యుద్ధ తంత్రం), వారు తేరుకునే లోపే మెరుపు వేగంతో మాయ మవ్వడం ఆయన శైలి. కొండపైకి ఎప్పుడు ఎక్కాలి, శత్రువు ఏ సమయంలో నిద్రపోతాడు అనే అంశాలను నిశితంగా గమనించి, కచ్చితమైన సమయానికి దాడులు చేసేవాడు. ప్రతాప్‌గఢ్ దిగువన అఫ్జల్ ఖాన్‌ను కలిసేటప్పుడు శివాజీ ప్రతి నిమిషాన్ని లెక్క వేసుకున్నాడు. ఖాన్‌ను కలవడానికి ఎంచుకున్న సమయం, ఆ సమయంలో తన సైన్యం అడవుల్లో ఎక్కడెక్కడ సిద్ధంగా ఉండాలి అనే విషయంలో శివాజీ పక్కా ప్రణాళికతో ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ అంతం కాగానే, అప్పటికే సిద్ధంగా ఉన్న తన సైన్యానికి సంకేతాలు పంపి, క్షణాల వ్యవధిలో శత్రు సైన్యంపై దాడి చేయించాడు. ఇక్కడ సమయపాలన తప్పి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఔరంగజేబు చెర నుండి తప్పించుకునే సమయంలో పండ్ల బుట్టలలో దాక్కుని బయటకు వెళ్లడం, ఆ తర్వాత మారు వేషంలో వేగంగా ప్రయాణించడం, కాపలాదారులు అను మానించే లోపే నిర్ణీత ప్రాంతాలను దాటిపోవడం ఇవన్నీ క్షణాల మీద ఆధారపడి జరిగినవి. కోటల నిర్మాణంలో శివాజీ ఒక కాలపట్టికను పాటించే వాడు. వర్షాకాలం రాకముందే మరమ్మతులు పూర్తి చేయడం, ధాన్యం, మందుగుండు సామాగ్రిని నిల్వ చేయడం వంటి పనులలో ఆయన కచ్చితమైన గడువులను విధించేవాడు. శివాజీ సైన్యంలో ఒక కఠినమైన నియమం ఉండేది. యుద్ధం ముగిసిన తర్వాత నిర్ణీత సమయానికి మించి ఎవరూ బయట ఉండకూడదు. అలాగే, యుద్ధంలో గెలిచిన సంపదను సకాలంలో ఖజానాకు చేర్చాలి. ఈ క్రమశిక్షణే ఆయనను ఒక గొప్ప పాలకుడిగా నిలబెట్టింది. శివాజీ మహారాజ్ దృష్టిలో సమయం అంటే ‘అవకాశం’. శత్రువు బలహీనంగా ఉన్న సమయాన్ని గుర్తించడం, తన బలాన్ని సరైన సమయంలో ప్రయోగించడం ఆయనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. ‘ఆయుధం కంటే సమయస్ఫూర్తి, సమయపాలన గొప్పవి’ అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించాడు. అందుకే నేటికీ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు శివాజీ వ్యూహాలు ఒక పాఠంగా నిలుస్తున్నాయి.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి
ఝాన్సీ లక్ష్మీబాయి జీవితంలో సమయపాలన అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఆమె పోరాట పటిమలో ఒక అంతర్భాగం. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఆమె ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారడానికి ఆమె అనుసరించిన కచ్చితమైన సమయపాలన, క్రమశిక్షణే ప్రధాన కారణాలు. రాణి లక్ష్మీబాయి తెల్లవారుజామునే (బ్రాహ్మీ ముహూర్తంలో) నిద్రలేచేది. సూర్యోదయానికి ముందే వ్యాయామం, గుర్రపు స్వారీ,కత్తి సాము వంటి యుద్ధ విద్యలను అభ్యసించేది. ఒక రాజ్యానికి రాణి అయి ఉండి కూడా, ఆమె తన వ్యక్తిగత క్రమశిక్షణలో ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. ఈ తెల్లవారుజామున అలవాటే ఆమెను శారీరకంగా, మానసికంగా అత్యంత ధృడంగా ఉంచింది. ఆంగ్లేయ సేనాని ‘హ్యూ రోజ’ ఝాన్సీ కోటను ముట్టడించి నప్పుడు, లక్ష్మీబాయి ప్రతి క్షణాన్ని వ్యూహాత్మకంగా వాడుకుంది. కోట గోడలు బద్దలైనప్పుడు లేదా శత్రువు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు, ఆమె కుంగి పోకుండా సెకన్ల వ్యవధిలో తదుపరి కార్యాచరణను నిర్ణయించుకునేది. కోట నుండి తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ అర్ధరాత్రి వేళ తన దత్తపుత్రుడిని వీపున కట్టుకుని, గుర్రంపై కోట గోడ నుండి దూకడం అనేది ఆమె సమయస్ఫూర్తికి, వేగానికి నిదర్శనం.
ఆమె తన ప్రజల సమస్యలను వినడానికి ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించేది. పరిపాలనలో ఆలస్యం జరిగితే న్యాయం జరగదని ఆమె నమ్మేది. ఝాన్సీని వదిలిన తర్వాత ఆమె గ్వాలియర్‌ను ఆక్రమించుకోవడం భారత స్వతంత్ర చరిత్రలో ఒక కీలక మలుపు. శత్రువు కోలుకోక ముందే, అతి తక్కువ సమయంలో తన సైన్యాన్ని పునర్వ్యవస్థీక రించి, వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకో వడంలో ఆమె చూపిన వేగం అద్వితీయం. ఆమె తన సైన్యానికి, ముఖ్యంగా ‘దుర్గాదళ’ అనే మహిళా సైన్యానికి శిక్షణ ఇచ్చేటప్పుడు సమయపాలనను కఠినంగా అమలు చేసేవారు. యుద్ధసమయంలో ఏమరుపాటుగా ఉండటం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అని ఆమె హెచ్చరించేది. రాణి లక్ష్మీబాయి కేవలం వీరనారి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప వ్యూహకర్త. సమయం అనుకూలంగా లేనప్పుడు కూడా, మన సమయపాలన ధైర్యంతో ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చు కోవచ్చని ఆమె నిరూపించింది. ఆమె గుర్రపు స్వారీ చేసేటప్పుడు గానీ, యుద్ధం చేసేటప్పుడు గానీ చూపిన ఆ వేగం వెనుక సంవత్సరాల తరబడి ఆమె పాటించిన ‘సమయపాలన’ దాగి ఉంది. అందుకే చరిత్రలో ఆమె ఒక వెలుగులీనే నక్షత్రంలా నిలిచిపోయింది.
కాలం ఒక నియంత
కాలాన్ని దాచుకోవడం సాధ్యంకాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు. నిజమే. కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో, విషాదం కలిగిస్తాడో ఊహించలేం. కాలమే జీవితం గనక. మనిషి జీవితంలో ప్రతి క్షణానికి ఒక విలువ ఉంది. విద్యార్థి దశలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే విజ్ఞానం పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ సమయాన్ని సమతుల్యంగా వినియోగించాలి. ఏ యాగం చేసినా, ఏ పూజ చేసినా దానికి ఒక ‘ముహూర్తం’ ఉంటుంది. ఆ నిర్దేశిత సమయంలో చేసే పనికి మాత్రమే సరైన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ‘పని ముఖ్యం, కానీ దాన్ని సరైన సమయంలో చేయడం అంతకంటే ముఖ్యం’. సమయపాలన అంటే కేవలం వేగంగా వెళ్లడం కాదు, ప్రకృతితో కలిసి, క్రమశిక్షణతో, ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసుకుని జీవించడం. కాలమే దేవుడై నప్పుడు, సమయాన్ని వృథా చేయడం దైవత్వాన్ని అగౌరవపరచడమే అవుతుంది. ప్రపంచంలో గొప్పవారైన శాస్త్రవేత్తలు, నాయకుల విజయాల వెనుక ఉన్న రహస్యం వారి సమయ పాలనే. వారు ప్రతి నిమిషాన్ని లెక్క వేసుకుని, ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వాయిదా వేసే అలవాటు లేకపోవడమే వారిని శిఖరాగ్రాన నిలబెడుతుంది.
‘పేద కుటుంబంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులెలా అయ్యార’ని ఒక కోటీశ్వరుణ్ని ప్రశ్నిస్తే ‘కాలం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకునే కళ తెలిసినవాణ్ని’ అని బదులిచ్చాడట. కాలం ఒక ప్రవాహం వంటిది. దాన్ని నిలువరించలేం.చాలా మంది గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. ఆలస్యం, నిర్లక్ష్యం వంటి అలవాట్లు కాలాన్ని వృథా చేస్తాయి. ఇవి భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారి తీస్తాయి. కాలం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి వ్యక్తి ప్రధాన బాధ్యత. కాలాన్ని సక్రమంగా వినియోగించుకున్న వారే జీవితంలో విజయశిఖరాలను అధిరోహిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక చాలా అవసరం. రోజువారీ పనులకు ఒక పట్టిక తయారు చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి, అనవసర మైన పనులను దూరంగా పెట్టాలి. ఈ విధంగా క్రమశిక్షణతో జీవిస్తే సమయం మనకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాలం వేగంగా గడుస్తోంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు ఉపయోగపడినా, అవి అధికంగా వాడితే కాలాన్ని వృథా చేస్తాయి. కాబట్టి సాంకేతిక సాధనాలను మన అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలి.
సమయాన్ని సరిగ్గా పాటించడం వల్ల మన జీవితంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఏ పనిని ఏ సమయంలో చేయాలో ముందుగానే నిర్ణయించు కోవడం వల్ల మనసు ఇతర వ్యాపకాల వైపు మళ్లకుండా, చేసే పనిపైనే పూర్తి ఏకాగ్రత ఉంటుంది. చివరి నిమిషం వరకు వాయిదా వేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయపాలన పాటిస్తూ, పనులను విభజించుకుని పూర్తి చేస్తే ప్రశాంతంగా ఉండవచ్చు. దీనివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834