ఏడు చేపల కథ అనేది తెలుగులో తరతరాలుగా చెప్పుకునే ఒక ప్రసిద్ద పిల్లల జానపద కథ. ఏడుగురు కొడుకులు తెచ్చిన ఏడు చేపల్లో ఒక చేప ఎండక పోవడానికి పిల్లవాడికి చీమ కుట్టిందనే కారణంతో ముగిసే కథ. ఈవేళ జరుగుతున్న యుద్ధాలకు ఈ కథ అతికినట్లు సరిపోతుంది. చీమ చిన్న ప్రాణే కావచ్చు, దాని పుట్టలో వేలు పెడితే అది ఎందుకు ఊరుకుంటుంది? అలాగే ఇరాన్ చిన్న దేశమే కావచ్చు కాని దాని పుట్టలో వేలు పెడితే అది తప్పక కుడుతుంది. దాని పరిధిలో అది హోర్మోజ్‌ను మూసివేసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఇరాన్‌తో భారతదేశానికి వేల సంవత్సరాల అనుబంధం వుంది. అలెగ్జాండర్ (క్రీ।।పూ।। 326) దండయాత్రకు రావడానికి పూర్వం పెర్షియా రాజులు డరయస్, సైరస్‌లు భారత్‌పై దాడి చేసారు. తద్వారా భారత్-ఇరాన్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి. ఇది వేల ఏళ్ల అనుబంధం.
మధ్యయుగ కాలంలో ప్రధాన యుద్ధ వాహనం అశ్వాలు (గుర్రాలు). గుర్రపు దళానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉండేది. మేలు జాతి గుర్రాలు హోర్మోజ్ జలసంధి ద్వారా భారత్‌లోనికి దిగుమతి అయ్యేవి. అందుకే ఈ హోర్మోజ్ జలసంధి తెలుగు సాహిత్యంలో తెలుగు కవుల రచనలలో పదిలంగా ఉంది. అయితే దీనిని ‘‘హురుమంజి’’గా పిలిచేవారు. చరిత్రలో రాజవంశాలకు సేవలు చేసిన గుర్రాలు, అపాయాలనుండి యజమానులను రక్షించిన గుర్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రాణాప్రతాప్ గుర్రం చేతక్, అక్బరు గుర్రం రాహ్‌బర్ (రాహ్‌బర్ అంటే నమ్మకం), అలెగ్జాండర్ గుర్రం బుచేపోలస్, శివాజీ గుర్రం పేరు విశ్వాస్. ఝాన్సీ లక్ష్మీభాయి పవన్, బాధల్, సారంగి అనే గుర్రాలపై స్వారీ చేసింది. ఉయ్యలవాడ నరసింహరెడ్డి దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉండేదట.
‘‘గొప్ప హురుమంజి సుప్పాణి కూర్చడంపు పగడంబు జగడంబు సంబరంబు’’ అంటూ కృష్ణరాయ విజయంలో దూర్జటి హురుమంజీని ప్రస్తావించాడు. హురుమంజి బలు తేజిహరులు దెచ్చి (హర విలాసము 24వ పద్యము) అనగా హురుమంజి నుండి తేజి (గుర్రాలు) తెచ్చి ఇక్కడ అమ్ముచున్నాడు. అవచి దేవయ్య, ఈయన కుమారుడు అవచి తిప్పయ్యశెట్టి శ్రీనాథునికి ‘‘బాలసఖ’’. ఈ తిప్పయ్యశెట్టి (చిన్ననాటి స్నేహితుడు), కుమార గిరిరెడ్డి ఆ స్థానంలో సుగంధ బాంఢాగారాధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. శైవ ప్రబంధమగు హర విలాసమును తన బాల్యమిత్రుడు అవచి తిప్పయ్యసెట్టికి అంకితమిచ్చాడు శ్రీనాథుడు.
అవచి తిప్పయ్యసెట్టి తాతలు నెల్లూరు మండలమున జీవించి ఉన్నట్లు, వారు కాంచీపురం మందలి వరదరాజస్వామి వారికి బాలార్కమను పద్మరాగమును దానమిచ్చి, తిరువళ్లూరులో చెరువు తవ్వించి, కావేరికి గట్టు కట్టించారు. ఏకామ్ర నాథునకు వేయి కర్పూర దీపములు వెలిగించుట కేర్పాటు చేశారు. తిప్పయ్యశెట్టి తన తమ్ములైన తిరుమలశెట్టి, చామిశెట్టీలను కలుపుకొని ద్వీపాంతరవాస వ్యాపారము నడిపించాడు. సుగంధ భాండాగారము నింపి కుమారగిరి నెరపు వసంతోత్సవములను జయప్రదంగా నడిపించారు. తిప్పయసెట్టి భార్య మాచన. విశ్వనాథ, చెనమల్లులు వీరి కుమారులు.
పెద్దన గారు మనుచరిత్రలో స్వారోచిషుణ్ణి హురుమంజి గుర్రం ఎక్కించారు. ‘‘పచ్చని హురుమంజి పని వాగె పక్కెర’’ అలాగే ఆ గుర్రానికి మంచి అలంకరణ అమర్చిన రక్షణా కవచాలను గురించి వర్ణించారు. రాయలవారు కూడా హురుమంజి గుర్రాలు శత్రువుల చేతికి చిక్కకుండా చూడాలని తనవారికి హెచ్చరించాడు. హురుమంజి రేవు నుండి కోటిపల్లి రేవుకు నేరుగా సరుకు రవాణా జరిగేదట.
పర్షియన్లు హోర్మోజ్ అనీ, పోర్చుగీసువారు ఓర్మోజ్ అనీ, భారతీయులు హురుమంజీ అనీ పిలిచారు. ఈనాటి ఇరాన్ ఒకనాడు పర్షియాగా పిలిచేవారు. ఇరాన్‌లో వారు జొరాష్ట్రియన్ మతానికి చెందినవారు. వారి ప్రధాన దేవత ‘‘అహుర్మజ్దా’’ పేరున వెలసిన నగరం ఈ హోర్మోజ్.
సుమారు ఒక శతాబ్దం పాటు (1324-1434) హోర్మోజ్ రేవు ద్వారా ప్రధానంగా రెడ్డిరాజులు, మరీ ముఖ్యంగా కుమారగిరి తన రాజ్యాన్ని మంత్రి అయిన కాటయ్య వేమునకు అప్పగించి, తాను వర్తక వాణిజ్యంపై శ్రద్ద పెట్టి విదేశీ వ్యాపారం చేశాడు. ప్రతీ ఏటా వసంతోత్సవాల పేరుతో ట్రేడ్‌ఫేర్‌లు నిర్వహించేవాడు. ఈ రాజ్యానికి అధిక మొత్తంలో ఆదాయం ఎగుమతి, దిగుమతుల ద్వారా వచ్చేది. ఆదాయంతోపాటు ఆంధ్రా-పర్షియా మధ్య సంస్కృతిక సంబంధాలు కూడా బాగా బలపడ్డాయి. ఎన్నో పార్సీ పదాలు తెలుగులోకి వచ్చాయి. ఓమర్ ఖయ్యాం మీర్జా ఘాలీబ్, సాదీ షిరాజీ లాంటి పర్షియన్ కవుల ప్రభావం కూడా తెలుగు నేలపై ప్రభావాన్ని చూపాయి. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు పర్షియన్ భాష నేర్చుకుని ఉమర్ ఖయ్యం రుబాయితుల్ని తెలుగులోనికి తర్జుమా చేశారు.
తెలుగులోకి వచ్చిన అనేక పార్సీ పదాలు కళాసీ, ఖాకీ, కిరాయి, కూజా, కుస్తీ, ఖర్చు, ఖరీదు, గల్లా పెట్టె, గులాబీ, జమా ఖర్చు, తాకట్టు, దస్తావేజు, పహరా, ఫలానా, బేజారు, బొంగు (వెదురు), బొత్తాం (బటన్), భరోసా, మావటీ, మాలీసు, రహదారి, రాజీనామా, రోజు (దినము), లాహిరి (మైకం) శాలువా, వాపసు, సన్నాయి, సాంబ్రాణి, శిస్తు, ఇలా ఎన్నో పదాలు తెలుగులో స్థిరపడ్డాయి. వేల సంవత్సరాల అనుబంధం మరి.
రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు విరివిగా జరిగాయి. కుమారగిరి రెడ్డి (1386-1402) గొప్ప సంగీత నృత్య కళాపోషకుడు. ఆయన ప్రతి సంవత్సరం 9 రోజులపాటు అద్భుతమైన వసంతోత్సవ చేయించేవాడు. కొండవీడులో ఈ 9 రోజులు అలా పరిమళ ద్రవ్యాలు చల్లుతూ ఉండేవారు. పంజాబ్ నుండి కర్పూరం, గోవా నుండి కుంకుమపువ్వు, పై దేశాల నుండి రోజ్ వాటర్ దీనిలో పసుపు కలిపేవారు. దేశదేశాల నుండి వర్తకులు సరుకులతో ముందుగా వచ్చేవారట. ఆస్థాన నర్తకి లకుమాదేవి ఈ వసంతోత్సవాలలో ప్రధాన ఆకర్షణ. రంగులు చల్లుకోవడం, నృత్యాలు చేయడం ద్వారా విదేశీయులు స్థానిక ప్రజలతో కలిసిపోయి భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించేవారు.
‘‘హరివంశ’’ గ్రంథకర్త శ్రీనాథుడు రెడ్డిరాజుల కాలంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన లను (వసంతోత్సవములను) నిశితంగా పరిశీలించి తన గ్రంథంలో రాసిన వచనం చదవండి…
‘‘విలాతి బజారు దుకాణదారుల నుండి జలతారు కుల్లాయిలూ, జరీ శాలువాలు, ముఖమల్లు మోజాలు, లాలుజీబులు, పింగాణీ సామానులు, సుప్పారి ముత్యములు, గంజాయి, గసగసాలు మొదలగు లాహిరి దినుసులు, హురుమంజి తేజీలు, కప్పలి, జోగు, వల్లి, వల్లికా, సమ్మాన్లలో తెప్పించి సలీసు వెలలకు విక్రయించి, అసలు ఖర్చు వహితేల్చి, కోటికి పడగలెత్తినవాడు, జీల్మి పోసినపుడు జమ్ము భావనలు పరిచిన హజారపు సావిడిలో జాళువా పైడితఖ్తుపై తబల, సన్నాయి, డమాములు మోయ ఖుసిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చుండెడివాడు. కోజాలు గులాములు సేవింప నకీబులు పరారు వెచ్చరింప, విలాతి ఖానులు, సరిహద్దు సహాలు పంపిన రాయబారులు వచ్చి కుందనపు కమ్మరి బందులు, చిలికి చేసిన అపరంజి మోళపు బాకులు, బిబ్బీల గాగరాలు, ఉలుపా చదివించెడివారు. జూటరులు గలబ జలుము, లూటీ సేయకుండా గస్తుకావలి వారు కాపుండెడివారు, కంఖాణి, కత్తలాని, సామ్రాణి, జిరాతేజీలపై చబుకు సేయు లక్ష పౌజు పౌజు బరాబరులు సేసెడిది’’ దీనిలో ప్రతీపదమూ చారిత్రక అంశాలే.
విలాతి బాజార్ = విదేశీ విఫణి వీధి, జలతారు కుల్లాయు / కుల్లా, జర్=బంగారము, తార్= దారము (ఇరానియన్లు సాంప్రదాయంగా ధరించే చిన్న టోపీ) జరీ = వెండి, బంగారం సన్నపోగులతో నేసినది, ముఖమలు= మెత్తగా ఉండే పట్టుబట్ట, మోజాలు = ముందువైపు ఒంకీ తిరిగిన చెప్పులు, లాలూజీబులు = ఎర్రని వస్త్రం, సుప్పాణి ముత్యములు = మంచి ముత్యాలు లాహిరి దినుసులు = మైకం కలిగించే మాదకద్రవ్యాలు. కప్పలి = సరుకు రవాణా ఓడ, జోగు= పెద్ద తెరచాపలు కలిగిన ఓడ; వల్లి, వల్లికా = ఓడల పేర్లు, సమ్మాన్లు (పోర్చుగీసు పదం) = పడవ, సలీసు = చవకగా కొనగలిగిన ధర, జలపోసనం = బంగారు పూత; జిముమఖానములు = కార్పెట్లు, జాలువాడి = మేలిమి బంగారం దొరికే ప్రాంతం, గులాములు = ఉంపుడు గత్తెలు; నకీబులు = కోటలో హెచ్చరికలు చేసేవారు; కుందనపు కమ్మరు బందులు = బంగారు వడ్డాణాలు, చికిలి చేసిన=శుభ్రపరచిన, అపరంజి = మేలిమి బంగారం, బబ్బీలు = అంత:పుర స్త్రీలు, గాగరాలు = స్త్రీలు ధరించే వస్త్రం (గాగ్ర చోళీ), ఉలుపాలు = కానుకలు, జూటర్లు = మోసగాళ్లు; గలబ = అలజడి, జలుము = దౌర్జన్యం, లూటీ = దోపిడి, గస్తుకావలి = గస్తీ తిరుగుట, కంబాణీ = ఆఫ్గనిస్తాన్ మేలు జాతి గుర్రం, కత్తిలాని = కవచం, సామ్రాణీ = పర్షియన్ మేలు జాతి గుర్రం, జిరాతేజీలు = అంబారీ కట్టిన గుర్రం, చబుకుసేయు = చల్ చల్ అని అదిలించు, సవా లక్ష (మరాఠీ పదం) లక్షా పాతికవేలు, పౌజు=పటాలం (జి.వి.పూర్ణచందు గారి వ్యాసము నుండి).
శ్రీనాథ కవిసార్వభౌముడు పురాణేతిహాసములే గాక సాంఘిక ఇతివృత్తాలను కూడా రాశాడు. సామాన్య జనజీవనంలో మమేకమైనవాడు. అయినా పెక్కు రాజాస్థానాలను దర్శించి తన ప్రతిభతో ఎన్నో సత్కారాలను పొందాడు. వీరభద్రారెడ్డి రాజమహేంద్రవరానికి పిలిపించి ‘‘నిను బోలు సత్కవులు లేరీ నాటి కాలంబునన్’’ అని తనకు కాశీఖండ కావ్యమును అంకితం చేయమని కోరాడు.
శ్రీనాథుడు క్రీ।।శ।। 1360-1380 మధ్య కాలంలో జన్మించి ఉండవచ్చు. కాశీఖండము శ్రీనాథుని ఈశ్వర భక్తిని తెలిపే గ్రంథం. హరవిలాస మును తన చిన్ననాటి మిత్రుడు అవచి తిప్పయ్యశెట్టికి అంకితమిస్తూ, అతని తమ్ముడైన తిరుమలశెట్టిని కూడా కృత్యవతిరకలో వర్ణించుచు ‘‘తిరుమల నాధసెట్టికిని ధీ గుణభట్టికి నెవ్వరీదగున్’’ అని రాశాడు. ఖండాంతర వ్యాపారస్తునకు తన గ్రంథాన్ని అంకితమిచ్చాడు గనుక అతని వ్యాపారము ఎగుమతులు, దిగుమతులు మొదలైన ఎన్నో విషయాలను హరవిలాసంలో వివరించాడు.
జి.వి.పూర్ణచందు చెప్పినట్లు భారతదేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంస్కృతిని విధ్వంసం చేసిన మహమ్మదీయ ప్రభువులలో పర్షియన్లే ఎక్కువ. ఆనాటి పాపం ఇరాన్నింకా వెంటాడుతోంది. సముద్ర గర్భంలోనికి వెళ్లి గంటల తరబడి ఊపిరి బిగబెట్టి పగడాలు ఏరితెచ్చే నిపుణులు తగ్గిపోయారు. చివరకు వ్యాపారం అంటే ఆయుధాల వ్యాపారమే అన్నట్టుగా మారిపోయింది. ఇద్దరు ఆయుధ వ్యాపారుల మద్య జరుగుతున్న ఈ యుద్ధానికి యావత్ మానవాళి మూల్యం చెల్లిస్తున్నది. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన అమెరికా చెప్పే చారిత్రక పాఠాలను వేల ఏళ్ల చరిత్ర నాగరికత కలిగిన దేశాలు వినాల్సి వస్తున్నది. నిజం గ్రహించు, వేఏళ్ల నాగరికత సంస్కృతిని రాతియుగానికి తీసుకువెళ్లవద్దు మానవా, విజ్ఞతతో ఆలోచించు.
మూలం:
- జి.వి.పూర్ణచందు : ‘‘700 యేళ్లనాటి తెలుగు సాహిత్యంలో ‘‘హోర్మోజ్’’ సంచిక మార్చి 2023
- ఔచిత్యం : కర్పూర వసంతరాయల కావ్యంపై ఇతర కావ్యాల ప్రభావం డా।। తాడ సీతాపతిరావు
- హర విలాసము బై శ్రీనాథుడు
- హర విలాస కావ్య విమర్శనము బై ఎమ్.కె.జయ భారతి (పి.హెచ్‌డి వర్కు)

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు