హనుమత్ సమేత సీతారాములవారు మానవాళికే ఒక పరిపూర్ణ సందేశం. అది మన జీవన మార్గాన్ని పరిశీలించుకునే ఒక పవిత్ర అవకాశం. శ్రీరాములవారు ధర్మానికి ప్రతిరూపం. ఆ ధర్మాన్ని జీవితంలో ఎలా ఆచరించాలో మనకు చూపించిన మహానుభావులు ఆంజనేయులవారు. రాములవారి సన్నిధిలో నిష్ఠగా, భక్తి శ్రద్ధలతో హనుమంతుని వినయం మనకు సంపూర్ణ జీవన తత్వాన్ని బోధిస్తుంది. మరి హనుమంతుని ఒక చేతిలో గద, హృదయంలో శ్రీరాముడు, మరొక చేతిలో సంజీవని పర్వతం, ఈ రూపం మనకు ఏమి చెబుతోంది? ఇది కేవలం దేవతా చిత్రణ కాదు, ఇది మనిషి ఎలా జీవించాలో చెప్పే జీవన గ్రంథం.
హనుమంతుని చేతిలో గద ఉంది. అది ఆయుధం మాత్రమే కాదు, అది శక్తి, ధైర్యం, కర్తవ్యబోధకు సంకేతం. ఆయుధం అంటే హింస కాదు. అది అవసరమైనప్పుడు ధర్మాన్ని కాపాడే సామర్థ్యం. ఈరోజు మన జీవితాల్లో గద అంటే ఏమిటి? అది మన సిద్ధత. తప్పును తప్పు అని చెప్పగలిగే ధైర్యం. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకపోవడం. కుటుంబంలోనైనా, సమాజంలో నైనా, దేశంలోనైనా ధర్మానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతుంటే ‘‘ఇది సరైనది కాదు’’ అని నిలబడే ధైర్యమే మన గద. ఉదాహరణకి ఒక ఉద్యోగి తన ఆఫీసులో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా, భయం వల్ల మౌనంగా ఉంటే, అతని చేతిలో గద లేనట్టే. కానీ అదే వ్యక్తి తన పదవిని, సౌకర్యాన్ని పక్కనపెట్టి నిజం కోసం నిలబడితే, అదే హను మంతుని గద.
మన దేశాన్ని ప్రేమించడం అంటే మాటలతో కాదు, మన ధర్మాన్ని పాటించడం, అవసరమైనప్పుడు దేశ హితానికి పనిచేయడం. సైనికుడిగా సరిహద్దుల్లో నిలబడటం, వైద్యులు మహమ్మారి సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా సేవ చేయడం, గురువులు వారి కర్తవ్యం నిష్పక్షపాతంగా చేయడం, పిల్లలని ఎల్లవేళలా కాపాడుకోవటం, దౌర్జన్యాలను అడ్డుకోవటం, ఆకలన్న వారికి అన్నం పెట్టడం, పేదలను ఆదుకోవడం, నిజాన్ని భయం లేకుండా ఒప్పుకోవటం.. ఇలా చేసే వారందరూ గదను పట్టుకున్న ఆధునిక హనుమంతులే.
హృదయంలో శ్రీరాముడు
హనుమంతుని గుండెల్లో శ్రీరాములవారు ఉంటారు. ఇది అత్యంత ముఖ్యమైన సందేశం. బయట ఎంత శక్తి ఉన్నా, లోపల భక్తి లేకపోతే అది అహంకారంగా మారుతుంది. అందుకే హనుమం తులవారు తమ శక్తికి వ•లం తనది కాదని, అది రాముని కృప అని ఎప్పుడూ గుర్తుంచుకున్నారు. మన జీవితంలో రాములవారంటే ఎవరు? అది కేవలం ఒక నామం కాదు. అది ధర్మం, సత్యం, కరుణ, బాధ్యత. ప్రతి పరిస్థితిలో ‘‘నేను ఇది చేస్తే ధర్మమా?’’ అని మనసులో ప్రశ్నించుకోవడమే, రాముడిని హృదయంలో ఉంచుకోవడం. ఒక వ్యాపారి లాభం కోసం మోసం చేయకుండా న్యాయంగా వ్యాపారం చేయడం, అది రామస్మరణ. ఒక విద్యార్థి పరీక్షలో కాపీ చేయకుండా కష్టపడి చదవడం, రామభక్తి. ఒక తల్లి తన పిల్లలను విలువలతో పెంచడం అది కూడా రామసేవే. నిద్రలో ఉన్నా, పనిలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా మన మనసు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, అదే హనుమంతుని హృదయం.
సంజీవని- సేవా భావం
హనుమంతుని మరో చేతిలో సంజీవని పర్వతం ఉంది. అది ఒక ఔషధం మాత్రమే కాదు, అది సేవా భావానికి ప్రతీక. యుద్ధ సమయంలో లక్ష్మణుడు వ•ర్ఛపోయినప్పుడు, హనుమంతులవారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ‘‘ఇది నా పని కాదు’’ అని అనలేదు. ‘‘ఇతను నా రామునికి ప్రియుడు’’ అన్న భావంతో ప్రాణాలను కాపాడాడు. సంజీవని అంటే మనలో ఉండాల్సిన పరోపకార దృష్టి. ఈరోజు మనం ఎంతమందికి ఉపయోగ పడుతున్నాం? మనకు వీలైనంత సహాయం చేస్తున్నామా? ఒక డాక్టర్ రాత్రి అయినా రోగిని చూసి చికిత్స చేయడం, సంజీవని. ఒక ఉపాధ్యా యుడు అదనంగా సమయం పెట్టి విద్యార్థిని ప్రోత్సహించడం, సంజీవని. రోడ్డుపై ప్రమాదం జరిగితే వీడియో తీయకుండా సహాయం చేయడం, అదే నిజమైన సంజీవని. సేవ చేయడానికి పెద్ద పదవులు అవసరం లేదు. చిన్న చిరునవ్వు, ఓదార్పు మాట, అవసరంలో ఉన్నవారికి చే•••త, ఇవన్నీ సంజీవని రూపాలే. హనుమంతుని సందేశం మనకు ఒక సంపూర్ణ జీవిత సందేశం. హనుమంతుని రూపం మనకు వ•డు ప్రశ్నలు వేస్తుంది: నా చేతిలో గద ఉందా? నేను ధర్మానికి నిలబడగలనా? నా హృదయంలో రాములవారు ఉన్నారా? నా ఆలోచనలు శుద్ధంగా ఉన్నాయా? నా మరో చేతిలో సంజీవని ఉందా? నేను ఇతరులకు ఉపయోగపడు తున్నానా? ఈ ప్రశ్నలకు మనం సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితం సంపూర్ణమవుతుంది. భక్తి అంటే జీవితం మొత్తం ఒక పూజలా మారడం. మనం హనుమంతునిలా మారాలంటే అద్భుత శక్తులు అవసరం లేదు. ధైర్యం కావాలి, భక్తి కావాలి, సేవా భావం కావాలి. ఒక చేతిలో ధర్మానికి సిద్ధత, మరొక చేతిలో పరోపకారం, హృదయంలో రామనామం, ఇదే ఆదర్శ జీవితం. ఈ స్ఫూర్తితో మనలోని హనుమంతుని మేల్కొలిపే రోజు కావాలి. హనుమజ్జయంతి సందర్భంగా మనందరం హను మంతునిపై భక్తిని మన జీవితానికి అవసరమయ్యే విధంగా అనువర్తింపజేసుకొందాం.
జయ శ్రీరామ్. జయ ఆంజనేయ.

డా।। జె.పి. భారతి కాజా