పటిష్టమైన గుండె దిటవు, దీక్షా దక్షతలు గలవారు నిరాటంకంగా ముందుకు సాగుతా రనేందుకు హనుమ సాధించిన విజయాలే నిదర్శనం. ఆయనలోని కార్యదీక్షా దక్షతలు, యుక్తాయుక్త విచక్షణాది గుణాలను వాల్మీకి మౌని అనేక విధాలుగా ఆవిష్కరించారు. హనుమను సద్గురువుగా, జానకీదేవి వరం వల్ల ఆయన అష్టసిద్ధులను, నవ నిధులను ప్రసాదించడగలడని తులసీదాస్‌ ‌శ్లాఘించారు. దీక్ష, మనోనిగ్రహం, ధైర్యం, వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, మనోబలం, బుద్ధికుశలత, కార్యసాఫల్యానికి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు సంపూర్ణంగా గల హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద.

ఆరు కాండలతో విరాజిల్లే శ్రీమద్రామాయ ణంలో అయిదవది ‘సుందరకాండ’. ఆంజనేయుని విజయ పరాక్రమాలు ఆహ్లాదకరంగా వర్ణితం కావడంతో ఈ ‘కాండ’ సౌందర్యానికి మారుపేరుగా నిలిచిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇందులో హనుమ సముద్ర తరణం, సీతాన్వేషణ, లంకాపురిలో హనుమ వీరవిహారం, ‘కనుగొంటిన్‌..‌కనుగొంటిన్‌…’ అం‌టూ జానకీ మాత ఆనుపానులు రాయయ్య చెవిన వేయడం వంటి వాటిని వాల్మీకి మౌని సుందరంగా వర్ణించారు.

ఉదయ భాస్కరుడిని కబళించబోయి ఇంద్రుడి పజ్రాయుధంతో దవడకు గాయం కావడం వల్ల హనుమ అని పేరు వచ్చిందంటారు. ఆ సంఘటనను అటుంచితే,సూర్యబింబాన్నే కబళించబోయాడంటే, బాల్యంలోనే ఆయన ప్రతాపం ఎలాంటిదో స్పష్టమవుతోంది.‘ఒక్కడే ఏకాంగ వీరు డుర్వికి దైవమౌనా/యెక్కడా హనుమంతుని కెదురా లోకము’ అనీ, ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు/పిన్ననాడె రవినంటె పెద్ద హనుమంతుడు…’ అని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య కొనియాడారు.

కేవలం మాట్లాడే శ•క్తే వాక్కు కాదు. బుద్ధి,సునిశిత పరిశీలన, విశేష విజ్ఞానం, దాని గరిమను వెల్లడించ గలిగే నైపుణ్యం, సందర్భోచిత సంభాషణ వైఖరి వంటి సమాహారం వాక్కు. అవి సమృద్ధిగా కలిగి ఉన్న, హనుమ ప్రథమ దర్శనంలోనే రాముని మన్ననలు అందుకొని పరమభక్తుడయ్యాడు. కిష్కింధలో మారు వేషంలో కనిపించి సంభాషించిన అంజనీ సుతుని గురించి తమ్ముడు లక్ష్మణుడితో, ‘ఇతడు నవ వ్యాకరణాలనూ చదివిన జ్ఞానసంపన్నుడు చ•తుర్వే దాలను అధ్యయనం చేసిన వారికి తప్ప ఇతరులకు ఇంతటి శ్రేష్ఠమైన వాక్చాతుర్యం అలవడదు (నాన్‌ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణిః/నా సామవే విదుషః శక్యమేవం ప్రభాషితుమ్‌)’ అని వివరించాడు.

జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణనిధానుడు. అయినా పెద్దల ముందు అతి వినయశీలి. అదీ పవనసుతిని ఔన్నత్యం. ఆయన శ్రీరామ పాదసేవా దురంధరుడు…ప్రభుభక్తి పరాయణుడు. నవమ బ్రహ్మ పదవి కంటే రామ‘బంటు’గా, సుగ్రీవ సచివుడిగా ఉండేందుకు ఇష్టపడిన పరమ భాగవ తోత్తముడు, రాజభక్తి పరాయణుడు. మంత్రిగా, స్వామిసేవకుడిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించాడు. ‘ఆంజనేయుడు లాంటి బంటు లభించడం తన అదృష్టంగా రామచంద్రుడే కొని యాడాడ’ని తులసీ దాస్‌ ‌కీర్తించారు. ‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌/‌తత్రతత్ర కృతమస్త కాంజలిమ్‌’-‌రామనామం వినిపించినచోటల్లా విన యాంజలితో నిలుచుండి పోతారట. ‘జై శ్రీరామ్‌’ అనే పిలుపుతో రాముడి కంటే ముందే చేరి తన తేజశ్శక్తిని ప్రసరిస్తూ కార్యోన్ముఖుడవుతాడట. అందుకే ‘శ్రీరాముడి వంటి ప్రభువు, ఆంజనేయుడు వంటి సేవకుడు’అని పెద్దల మాట.

మంత్రి అంటే రాజు/ఏలిక మాటనే గుడ్డిగా శాసనంగా భావించేవాడు కాదని, అవసరాన్ని బట్టి మృదు మందలింపు ధోరణిలో హితవు పలకాలన్నది హనుమ మాట తీరును బట్టి వెల్లడవుతుంది. వాలి వధానంతరం గద్దెనెక్కిన సుగ్రీవుడు పదవీ భోగంలో సీతాన్వేషణ మాటనే మరచాడు. ‘ప్రభూ! రాముని దయతో మీకు రాజ్యం దక్కింది. సీతాన్వేషణకు సంబంధించి మీరూ మాట దక్కించుకోవాలి. రాముని వైపు నుంచి సందేశం రాకముందే ఆ పక్రియకు శ్రీకారం చుట్టాలి’ అన్నాడు హనుమ.

అనుకున్నది దక్కలేదనే క్షణికావేశానికి హనుమా అతీతుడు కాడు. అయినా అంతలోనే తొందరపాటు ఆలోచనను విరమించి పునరాలోచనతో కార్య సాధనకు ఉద్యుక్తుడయ్యాడు. క్షణికావేశంలో అనుచిత నిర్ణయాలు తీసుకొనే వారికి, ముఖ్యంగా-యువతకు ఆయన విచక్షణ ఆదర్శం కావాలి. లకలో సీతాన్వే షణ త్వరగా ఫలించకపోవడంతో, ‘రాముడి మాటను నిలపలేని నేను బతికి ఉండి ప్రయోజనం ఏమిటి?’ అనుకొని, ఆ వెంటనే ‘నా మరణం ఎందరికో మనస్తాపం కలిగించవచ్చు, ముఖ్యంగా… రామ సుగ్రీవాజ్ఞలను వమ్ము చేసిన వాడిని అవుతాను’ అనుకొన్నాడు. రామ కార్యాన్ని సాధించాడు. అప్పగిం చిన పనిని చిత్తశుద్ధితో చేయాలని, ఇంకా వీలైతే అదనపు కార్యాన్ని నిర్వహించి, సమస్య ఆనుపానులు తెలుసుకోవాలన్నది లంకాపురిలో ఆయన చేసిన వీర విన్యాసాలను బట్టి తెలుస్తుంది.

హనుమజ్జయంతికి సంబంధించి రెండు తిథులు (చైత్ర శుద్ధ పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి) వ్యవహారంలో ఉన్నాయి. ఆయా ప్రాంతీయ ఆచార సంప్రదాయాలను బట్టి హనుమజ్జయంతిని జరుపు కుంటారు. తెలుగువారు పరాశర సంహిత ప్రకారం, వైశాఖ బహుళ దశమినాడు ఈ పండుకను నిర్వహించుకుంటారు. ద్వైత సంప్రదాయపరులకు హనుమజ్జయంతి ప్రధాన పండుగ.వారు ఆయనను ‘ముఖ్య ప్రాణదేవుడు’ సంభావిస్తారు. హనుమదుపాస కులు ఘనంగా ఈ పర్వదినాన్ని నిర్వహిస్తారు. తమలపాకులు, జిల్లేడు పూలు, పారిజాతాలతో స్వామిని అర్చిస్తారు. హనుమత్‌ ‌పూజతో సర్వదేవతా పూజఫలం కలుగుతుందని మైత్రేయునితో పరాశర మహర్షి చెప్పినట్లు (‘సప్తకోటి మహామంత్రాః సిధ్యం త్యేవ, నసంశయం/ఆరాధితే కపిశ్రేష్ఠే సమస్తా ఆదిదేవతాః) అని పరాశర సంహిత తెలుపుతోంది.

‘వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే / పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళమ్‌ శ్రీ‌హనూమతే!!

-‌డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE