‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


కరువు సమస్య తీరాక మళ్లీ వీరశైవులు, వీరవైష్ణవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారం భించడంపై తిక్కన, కేతన చర్చించుకుంటున్నారు.

 కరువులో కూడా మతఘర్షణలు ఆగలేదు తెలుగు రాజ్యాలలో ఏడేళ్ల కరువు కొందరిని మొదటి ఏడాదే పొట్టన పెట్టుకుంటే.. కొందరిని రెండో ఏడాది, మూడో ఏడు నుంచి ఎక్కువమంది మూకు మ్మడిగా చావడం మొదలయ్యాక మతఘర్షణలు కొంచెం తగ్గాయి. ఏడేళ్లూ ప్రాణాలు కాపాడుకోవడమే గగనం కాబట్టి మతప్రసక్తి ప్రభావం బాగా తగ్గింది. కాస్త గంజి కడుపులో పడ్డాక గంజి పోసేవాడు మన శైవుడా? గంజి వండేవాడు మన వైష్ణవుడా? అనేవి మెల్లగా మొదలయ్యాయి. గంజి కేంద్రాలు ఆగిపోయి మళ్లా అందరూ తమ తమ వృత్తులలోకి, పనిపాటల లోకి వెళ్లడం మొదలవ్వగానే మత తీవ్రవాదులు  ముఖాన విబూధి, తిరునామాలు దిద్దడం ప్రారంభిం చారు.

“గత మాసం అమావాస్యనాడు మన వెనుకవీధిలో నలుగురు వైష్ణవులను చంపేశారు. తెలిసిందిగా..”

“నువ్వే చెప్పావు కేతనా..!’ అన్నాడు తిక్కన నిర్వేదంగా.

ఆయన ముఖమంతా చిరాకు, అసహనం, కోపం, అసహ్యం.. తదితర స్పందనల తేనెతుట్టె కదిలినట్లుంది.

ఆ అసహనం వల్ల కూర్చుంటున్నాడు.. మళ్లీ లిప్తలలోనే లేచి తిరుగాడుతున్నాడు.

“అదే.. అది చేసినవాళ్లు ఎవ్వరో విచారించమని మన పుర దండనాథుడు సామలప్పను  అభ్యర్థిం చాను. ప్రభువు తిక్కమహారాజుగారికి కూడా విన్నవించాను. ఆయన గూఢచార నియోగాధిపతికి పురమాయించాడు. కాని ఇవి రాజ్యమంతా కాకపోయినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇతర రాజ్యాల్లో కూడా చెదురుమదురు సంఘటనలు వినవస్తున్నాయి. ఒకప్పుడు వైష్ణవులు సౌమ్యంగా ఉండేవారు. శైవులు రెచ్చగొట్టినా తలవంచుకుని విష్ణునామం స్మరిస్తూ సాగిపోయేవారు. ఇప్పుడు వాళ్లల్లో కూడా వీరవైష్ణవ వర్గం తయారయ్యింది. దాంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.”

తిక్కన, కేతన చాలా చింతాక్రాంతులై ఆలోచనల్లో ఉండిపోయారు.

 శైవం, వైష్ణవం అనే మత భావనలు అనాదిగా ఉన్నాయి. శైవం ఎప్పుడూ ఉద్రేక భావనమే. ఆదిమ కాలంలో రౌద్రం రాజ్యమేలినప్పుడు ఆ రౌద్రానికి దైవరూపమే రుద్రుడు. వైష్ణవానికి ఇంద్రుడు ప్రధాన దైవంగా ఉన్నప్పుడు వైష్ణవం కూడా ఉద్రిక్తంగానే ఉంది. యజ్ఞయాగాదులు తగ్గి భక్తి అనే కొత్త భావన వచ్చాక సమాజంలో రౌద్రం కాస్త తగ్గినప్పుడు రుద్రుడు కంటే శివుడు ముందుకొచ్చాడు. అలాగే ఇంద్రుడు తగ్గి విష్ణువు ముందుకొచ్చాడు.

ఇదిఇలా ఉండగా జైనం.. ఆ తర్వాత బౌద్ధం.. ముఖ్యంగా బౌద్ధం తెలుగు రాజ్యాల ప్రజలంతా.. వారూ వీరూ అని లేదు అందరూ బౌద్ధ్దులే అన్నట్లుగా బౌద్ధం తెలుగునాట పూర్తిగా విస్తరించింది.

అప్పుడు కూడా వైదికదైవాలను పూజించే వర్గాలు కూడా ఉన్నాయి. కాని ఉద్రిక్తతలు చెప్పుకో తగ్గంతగా లేవు.

మళ్లీ శంకరభగవత్పాదులు వచ్చాక బౌద్ధం వెనుకపట్టు పట్టగా వైదికం మళ్లీ విజృంభించ సాగింది. ఇటీవల బసవణ వచ్చాక ఆయన ప్రభావంతో.. కొందరు వీరశైవ కవి, పండితులు.. వీరశైవులనే గుంపులను రెచ్చగొడుతున్నారు. శైవాన్ని ఎవరైనా ఏమైనా అంటే చాలు వాళ్లను తిట్టడం కొట్టడం. ఇటీవల అది మరింత పెరిగి చంపడం కూడా ఎక్కువయ్యింది.

ఆ తర్వాత రామానుజులు రావడంతో వైష్ణవం అధికమయ్యింది. శైవానికి విరుద్ధ్దంగా దానిని పెంచి పోషించారు కొందరు వైష్ణవవాదులు. ఇక అక్కడి నుంచి రెండు వర్గాలు బాహాబాహీ.. ముష్టాముష్టి. కొట్టుకోవడంతో మొదలై చంపుకోవడం వరకు వెళ్లింది.

ఈ ధోరణి అన్నిరాజ్యాలలో అన్నిమండలాలలో, అన్ని స్థలాల్లో, గ్రామాలలో లేదు. కొందరు సమయ పెద్దలు గట్టిగా ఈ పెడ ధోరణులను అణచివేస్తు న్నారు. అలాంటి వారిని కూడగట్టి తిక్కన హరహర దళాలను ఏర్పాటు చేశాడు.

ఈ అంశానికి సంబంధించి ఆయనకు చిన్నరాజ్యాల పాలకులు కూడా సహకరిస్తున్నారు. ఈ ఏడేళ్ల కరువు కాలంలో చిన్న రాజ్యాలలో కూడా గణపతి దేవుడు గంజి కేంద్రాలు తెరిపించి ఆకలిచావులను నివారించాడు.

ఆయా రాజ్యాల తెలుగుప్రజలే కాదు పాలకులు కూడా గణపతిదేవుని నామస్మరణ చేయడం ఉధŠృతమైంది.

 తిక్కనార్యుడు రెండు పడవలపై కాదు.. నాలుగు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. తెలుగు సాహిత్య రచన మొదటిది అయితే మంత్రి నియోగ నిర్వహణ రెండవది. మూడవది తెలుగుజాతి ఏకత్వం. నాలుగవది సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత మౌఢ్యాన్ని రూపుమాపడం.

 ఇప్పుడు తెలుగుభాషా జాతి ఏకత్వం కనుచూపు మేరలోకి వచ్చేసింది. అన్ని దక్షిణావర్తపు రాజ్యాలు భాషా రాజ్యాలుగా రూపాంతరీకరణ చెందుతున్న ప్పుడు సహజంగా ఏ భాషవారు ఆ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

కాని ఈ మధ్యలో ఈ మత దుర్మార్గాలు రోజు రోజుకూ తీవ్రమౌవడం ఆయనను చింతాక్రాంతుడ్ని చేస్తోంది. పనిపాటాలేని నీచులే శైవ, వైష్ణవ వర్గాలుగా తయారై సమాజాన్ని చీల్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ సమస్య నివారణకు అహో రాత్రులు ఆలోచించి ఆయన సమాజం ముందుకు తెచ్చినదే హరహరతత్వం.

 అంటే హరి,హరుడు.. లేదా శివుడు, కేశవుడు ఒక్కటే అనే భావన. ఇది కూడా ప్రాచీన భావనే అయినా దానిని ఇప్పుడు తిక్కనార్యుడు చేపట్టడంతో అది బాగా సమాజంలో చొచ్చుకుపోతోంది. శాంతికాముకులై తమ పనేదో తాము తలవంచుకుని చేసుకుంటూ బతికే రైతులకు, వృత్తిదారులన” ఈ హరిహర తత్వం బాగా ఆకర్షిస్తోంది.

ఆయా బృందాలు ఎప్పటికప్పుడు అన్ని రాజ్యాల్లో జరుగుతున్న మత ఘర్షణలు ఆయనకు చేరవేస్తున్నారు.

అప్పుడే ప్రాంగణం వద్ద ఓ ఆశ్వికుడు వచ్చి ఆగాడు. అతడు కపర్దిభట్టు. తిక్కన ఏర్పరచిన హరిహరదళాలకు అత్యున్నత నాయకుడు. అశ్వాన్ని జంతు చావిడి నిర్వాహకుడికి అప్పగించి భవంతి పైకి వచ్చి, తిక్కనకు సాగిలపడి నమస్కరించాడు. “విష్ణురూపాయ.. నమశ్శివాయ..” అన్నాడు పలకరింపుగా.

అది తిక్కనార్యుడు నిర్దేశించిన ఊతపదం. అదే ఆ దళ సభ్యుల పలకరింపు విశేషం.

తిక్కన, కేతన కూడా తిరిగి అదే మాటతో స్పందించారు.

“చెప్పు కపర్ది.. ఏవిటి విశేషాలు. ఏయే రాజ్యాలలో ఎలా ఉన్నాయి పరిస్థితులు? మన కార్యకలాపాలు ఏవిటి?”

“కరువు తగ్గాక వీళ్లకు మత కరువు పెరిగింది గురుదేవా. వీరశైవులు, వీర వైష్ణవులు కూడా విజృంభిస్తున్నారు. ఏది ఏమైనా వైష్ణవులను నిర్జించాలని శైవులు.. శైవులను అంతమొందించాలని వైష్ణవులు తీవ్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

“సరే! సరే.. మరి మన కార్యకలాపాల విశేషా లేమిటి?హరిహరతత్వం పట్ల ప్రజలలో స్పందన ఎలా ఉంది?”

“అద్భుతం. ఎన్నో  గ్రామాల్లో మన తత్వం పట్ల అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే…మీకు చెప్పకుండా ఓ అడుగు ముందుకు వేసి.. ఓ అంశం నిర్వహించాం.. అందుకు నన్ను క్షమించాలి..” అన్నాడు కపర్ది.

తిక్కనామాత్యుడు, కేతన కూడా ఆశ్చర్యంగా చూశారు కపర్దిని.

కపర్ది నసుగుతూనే శైవకవి నీలకంఠమయ నివాసంలో జరిగిన వృత్తాంతాన్ని   తిక్కనామాత్యునికి జరిగింది జరిగినట్లు వివరించి తలవాల్చి నిలుచు న్నాడు.

తిక్కనామాత్యుని  కంటే ముందుగా స్పందించిన వాడు కేతనామాత్యుడు.

“అంటే జరుగుతున్న వీరశైవుల దుష్కృత్యాలకు శివకవులే కారణమని నీ అభిప్రాయమా? అభిప్రాయం సరే.. అంటే కవులనే చంపేస్తావా? హమ్మో హమ్మో.. ఎంత దారుణానికి సిద్ధŠ్దమయ్యా వయ్యా కపర్ది?” అన్నాడు.

కపర్ది చెప్పినదంతా సాలోచనగా వింటున్న తిక్కనామాత్యుడు కదిలి కేతన భుజం సున్నితంగా పట్టి ఇవతలకు లాగి.. అనంతరం కపర్ది భుజం తట్టాడు.

“కవి పండితుల వల్లనే సమాజంలో ఈ మత వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని మనం చర్చించు కున్న అంశాన్ని కపర్ది నిజంగానే సమాజంలో చూశాడు కాబట్టి స్పందించాడు. ఇందులో తప్పు పట్టడానికేముంది కేతనా?” అన్నాడు నింపాదిగా సాలోచనగా.

కవులపై దండెత్తడం అనేది కేతనకు నచ్చలేదు కాని కవులు ఈ మత జాడ్యానికి ఆజ్యం పోస్తున్నారన్న భావనను కేతన కూడా అంతరంగంలో అంగీకరిం చిన అంశమే.

“మధ్య ప్రాచ్యంలో పుట్టిన కొత్త మతం.. అదే.. మహమ్మదీయ మతం.. అది కూడా ఆ మతాన్ని విశ్వసించనివాళ్లు..అంటే ఇతర మతస్తులు.. అసలు మనుష్యులే కాదన్నట్లు.. వాళ్లను నిర్జించాలని ఆ మతం చెబుతుందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను కాని మన వీరశైవులు చెబుతోంది కూడా అదే కదా.. ప్చ్..” అన్నాడు తిక్కనార్యుడు.

కేతన, కపర్ది కూడా సాలోచనగా ఉండి పోయారు.

మరి కాసేపటి తర్వాత కపర్దిభట్టు, “మరొక్క సంగతి మీ చెవిన వేయాల్సి ఉంది మహామాత్యా! ఈ కరువు తర్వాత.. ఇప్పుడు వీళ్లకు తోడుగా మన గ్రామాలకు ఓ కొత్త దేవుడొచ్చాడండి..” అన్నాడు

తిక్కన, కేతన కూడా ఒక్కసారే “కొత్త దేవుడా??”అన్నారు ఆశ్చర్యంగా.

“ఆ.. కొత్త దేవుడే వచ్చాడు. ఈ కొత్త దేవుడు అటు వీరశైవులకు, ఇటు వీరవైష్ణవులకు.. నాకైతే.. ఈ రెండు వర్గాలకు ఈ కొత్త దేవుడు సహాయ పడుతున్నట్లే ఉంది. ఎవరో ఆర్థ్ధిక సాయం, రాజ్య ప్రోత్సాహం కూడా అందిస్తున్నారని నా అనుమానం..”

దిగ్గున లేచాడు తిక్కన. రాజపోషణ?? కొత్త కోణం!!

“ఏమిటి నువ్వు చెబుతున్నది?!.. నిజమా??”

“సందేహం గురుదేవా! కాస్త పొగ కనిపించింది. నిప్పు ఎక్కడో వెదకాలి. వెదికి ఎక్కడ ఎవరు ఆ నిప్పు పెట్టారో తమరికి నివేదిస్తాను..”

  * * * * *

కోరాడ గ్రామం, కోన రాజ్యం..

ఉదయం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. సమయ శెట్టి కలభానాయడు చాలా హడావిడిగా ఉన్నాడు. ఒకవైపు దూరంగా వీధి చివరి వరకు చూస్తూ.. మరోవైపు గ్రామస్తులంతా అక్కడకు వచ్చారో లేదో విహంగవీక్షణం చేస్తున్నాడు.

పొలాలకు పోవాల్సిన కాపులు తప్పనిసరై వచ్చారు. అవతల పొలంలో వాళ్లకు చాలా పని ఉంది. అది వదలుకుని ఇక్కడ ఉండటం వాళ్లకు చాలా చిరాగ్గా ఉంది. అలాగే చాకలి మానప్ప, కమ్మర జాలయ, పంచాణం గిరయ్య.. తమ పని ఆగిపోయిం దని కోపంగా ఉన్నారు. ‘తప్పకుండ రావాలి.. రాకుంటే బాగోదు’ అని సమయసెట్టి బెదిరిస్తూ చాటింపు వేయించడం వల్ల అందరూ పనులు మానుకుని ఉన్నారు కానీ చాలామందికి ఆసక్తి లేదు.

వీళ్లంతా సాధారణ రైతులు, వృత్తిదారులు. ఈ వ్యవస్థను మోసే అసలు సిసలు పల్లకి బోయీలు. వీళ్లందరకూ పనే పరమాత్మ. వృత్తే దైవం.

కాని ఈ అధికారులు, పూజారులు వాళ్ల మానాన వాళ్లను బతకనివ్వరు. శైవ గురువులు, శైవ గాయకులూ, శైవ నటకులు, శైవ ప్రవచనకారులు.. గ్రామానికి వచ్చిపడుతుంటారు. కారణం గ్రామ సమయశెట్టి శైవుడు. వీర శైవుడుగా చెప్పుకుంటాడు కూడా. వైష్ణవ గురువులను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వడు.

ప్రక్క గ్రామం మోదుమూడిలో సమయశెట్టి వైష్ణవుడు. అక్కడ అంతా వైష్ణవ భజన.. పూజలు, వ్రతాలు అన్ని వైష్ణవమే. శైవులకు ఆ గ్రామ ప్రవేశం లేదు.

“వస్తోంది సాక్షాత్తూ దేవత. గిరిరాజమ్మవారు. ఆమె శైవదేవత కాదు వైష్ణవ దేవత కాదు. కేవలం దేవత..”

ఊరంతా ఆశ్చర్యపోయి కాస్త ఊపిరి పీల్చు కుంది. ముఖ్యంగా శైవం, వైష్ణవం కాదు అంటే గొడవలు ఉండవని ఆ రాబోయే దేవతపై కొంత ఆసక్తి ఏర్పడింది.

గ్రామదేవత పోకలమ్మ అంటే గ్రామజను లందరికి ఇష్టం. ఆ యమ్మ జాతరలకు ఊరు ఊరంతా పనులు మానుకుని పూనుకుంటుంది. మరే దేవుడి పేరు చెప్పినా వింటారు. దండలు పెడతారు. అంతేకానీ తమ నిత్య వ్యవసాయ కార్యకలాపాలు మానుకోరు. వృత్తిదారులు కూడా మౌనంగా తమ పనిలోకి పోతారు. పూర్తి స్థాయిలో అన్నిపనులు వదులుకుని తిరేగేవారే ఈ వీరశైవులు.. లేదా వీర వైష్ణవులు.

కోన రాజ్యంలోని కోరాడ గ్రామానికి గిరిరాజమ్మ అనే దేవత వస్తోందని.. అందరూ ఆమె దర్శనార్థ తప్పక సమయభవనం వద్దకు రావాలని సమయ శెట్టి చాటింపు వేయించాడు.

సమయ భవన చావిడి వద్ద చేరిన జనులంతా ఎవరి ఆలోచనలో వాళ్లున్నారు.

ఉదయం మెల్లగా ఎండ పెరుగుతోంది. మరి కొంతసేపటికి మేళతాళాలు వినవచ్చాయి.. అంతా చురుకయ్యారు.

సమయశెట్టి బాట వెంట ముందుకు పరిగెత్తాడు. మేళతాళాలవారి వెనగ్గా ఓ పల్లకి.. ఆ వెనకగా కొందరు చేతులు జోడించి అమ్మవారి భజనలు చేస్తూ రావడం కనిపిస్తోంది.

పల్లకి ఆగింది. క్రిందికి దించారు బోయీలు.

లోపలి నుండి ఓ అమ్మవారి విగ్రహ రూపంలో ఉన్న బలిష్టమైన మహిళా కారం అందరికి కనిపించింది. నుదుటిపై విభూతి లేదు, నామాలు లేవు. నిండుగా గంధపు పూత.. దానిపై గుండ్రని ఎర్రెర్రని బొట్టు.. కళ్ల చుట్టూ కాటుక. ముక్కుకు ముక్కెర.. పెదాలకు లత్తుక.. మెడనిండా నిండుగా నాలుగైదు వరసలలో నిమ్మకాయల దండలు.. కంచుకం లేదు. కానీ నిమ్మకాయల దండలు శరీరాన్ని కప్పెట్టాయి. కాషాయ చీరే నిండుగా ధరించి ఉంది. పసుపురంగు నడబంధం.. కాళ్లకు వెండి, బంగారు పట్టీలు, అశీంలు. పాదాలకు పావుకోళ్లు.. మొత్తంగా చూపులను లాగేసే నిండైన ఆకారం.. అలంకరణ.

 ముందుగా సమయశెట్టి ఆమె కాళ్లపై సాష్టాంగ పడిపోయాడు. వెంటనే భార్యాపిల్లలు. ఆ వెనగా ఆయన అనుయాయులు.. మేళతాళాలు ఉద్రేకంగా ఉద్వేగంగా మోగుతుండగా అమ్మవారు కదిలి అందరిని చిరునవ్వుతో చూస్తూ చావిడివద్ద కాసేపు నిలబడింది.

ఆ రూపాన్ని సంభ్రమంగా చూస్తూ గ్రామజనులు యావత్తూ చేతులెత్తి ఆమెకు నమస్కరించారు. కొందరు ఆమె చుట్టూ కొబ్బరికాయలు గిరగిరా తిప్పి ఆమెకు తాకించారు. ఆమె చేతితో తాకాక వాటిని ఆమె ముందు కొట్టారు. ఒకరు రెండు మేకలను ఆమె చుట్టూ తిప్పి ఆమె తాకాక పక్కకు తీసుకు పోయారు. తర్వాత గ్రామ శివాలయంలో ఉండే పెద్ద హారతిపళ్లెం తెచ్చి అందులో మూడు నాలుగు వీసెల కర్పూరం వేసి వెలిగించి ఆమెకు అఖండహారతి పట్టారు.

అలా కాసేపు ఆమె వద్ద పూజ, ప్రసాద వితరణ.. తతంగాలు జరిగాయి.

అప్పటివరకూ అక్కడకు రావడానికి ఆసక్తి లేని.. ఆమె కోసం ఎదురు చూడటం ఇష్టంలేని.. గ్రామస్తులు కూడా ఇప్పుడు ఆమె గొప్ప మహిమలున్న దేవత అని గాఢంగా నమ్మేశారు. అనంతరం ఆ దేవతను సమయశెట్టి వినయంగా లోపలికి తీసుకువెళ్లాడు.

తిరిగి బయటకు వచ్చి చెప్పాడు సమయశెట్టి.

“అమ్మవారు గిరిరాజమ్మ.. మహాదేవత. గొప్ప మహిమలున్న దేవత. ఒక్కొక్కరు లోపలికి వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకుంటున్న కోర్కెలు నెరవేరుతాయి..” అంటూ ఆమె మహిమలు వర్ణించి వర్ణించి చెప్పాడు.

దేవతలను గుడులలో విగ్రహాలుగా మాత్రమే చూసిన గ్రామీణులు దేవత అనే ఆమెను ప్రత్యక్షంగా చూడటం..

వారి కంటికి ఆమె ఊహించిన దాని కంటే మరింత దర్పంగా, నిజంగానే మహిమగల దేవతగా కనిపించడంతో అంతా వరుసకట్టి లోపలికి వెళ్లసాగారు. దర్శనానంతరం బయటకు వచ్చి ఆమె పాదధూళితో తరించామంటూ ఆనందంతో తిరిగి ఇళ్లకు వెళ్లసాగారు అంతా.

వెళుతున్నప్పుడు ఓ ఇంటామే పొరుగింటామెతో “అనకూడదు కాని ఆ దేవత.. ఏంటో.. ఆడ మగా కాని నపుంసకుడల్లే ఉంది కదూ?! అయినా దేవత కదా.. అనకూడదులెమ్మా..” అని గుసగుసగా అంటూ, లెంపలేసుకుంటూ ముTందుకు సాగింది.

విన్నామె బుగ్గలు నొక్కుకుంది. బుగ్గన చేయి పెట్టుకుని ఆ దేవత రూపాన్ని ఊహిస్తూ కాసేపు నిలబడిపోయింది. ఆనక అంది, “అవును వదినా.. నాకూ అలాగే అనిపించింది. అయినా నువ్వన్నట్లు నాకెందుకులే. దేవత కదూ అనకూడదులే..”

ఈ సంగతి ఆ నోటా ఈ నోటా ఊరంతా చెప్పుకున్నారు.

గిరిరాజమ్మ దేవత ఆ రోజంతా ఆ గ్రామంలోనే ఉంది. రాత్రి కూడా సమయశెట్టి ఇంట బస చేసిందట.

ఆ తర్వాత దగ్గర గ్రామాలలోని వీరవైష్ణవులను ఎవరో తెలియని దుండగులు చంపేస్తున్నారని, దాదాపు యాభై మంది వరకు వీరవైష్ణవులు హత్యకు గురి అయ్యారని గ్రామస్తులకు తెలిసింది. ఒకరికొకరు చెప్పుకున్నారు.

అందులో కోటికుప్పల ఒక గ్రామం. ఆ గ్రామంలో హత్యకు గురి అయినవాడు శ్యామలయ.

ఆయన ఇంటికి మా బృందం వెళ్లింది. ఆయన భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, చుట్టుపక్కల వాళ్లను అందరిని కలిసి ఎన్నో ప్రశ్నలు అడిగాము. మాకు అర్థ్ధమైంది ఏవిటంf..ఈ గిరిరాజమ్మ పేరుతో వచ్చిన గ్రామదేవత ఎవరో సృష్టించి పంపిన ఓ దుర్మార్గం అని.

మరికొన్ని రోజుల తర్వాత..

చింతలమడక గ్రామం..

గ్రామ సమయశెట్టి కొంగరనాయడు చాటింపు వేయించాడు. ఆయన వీర వైష్ణవుడు.

“రేపు ఉదయం మన గ్రామానికి గిరిరాజమ్మ అమ్మవారు వస్తున్నారు. ఆమె శైవ దేవత కాదు. వైష్ణవ దేవత కాదు. పూర్తిగా గ్రామదేవత మాత్రమే. అందరూ ఆమె దర్శనానికి రావాలి.”

ఆ గిరిరాజమ్మ దేవత చింతలమడక గ్రామం వచ్చింది. కోరాడ గ్రామంలో జరిగిన దృశ్యమంతా చింతలమడక గ్రామస్తులు కూడా అనుభూతించారు. ఆ రాత్రి ఆమె కూడా ఆ సమయశెట్టి ఇంటనే బస చేసింది. ఆ తర్వాత చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలలో వీరశైవులను ఎవరో హత్య చేయడం జరిగింది.

అలాంటి గ్రామాలలో పెసరపాడు ఒకటి. ఆ గ్రామంలో వీరభద్రప్ప హత్యకు గురి అయ్యాడు. ఎందుకు ఎవరు హత్య చేశారో అర్థంకాక కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల సమయ పెద్దలు అయోమయంలో ఉన్నారు. తమ వారు హత్య కావడంతో వీర శైవులు మరింత తీవ్రంగా వీర వైష్ణవులపై దాడులకు దిగుతున్నారు. అలాగే వీర వైష్ణవులు కూడా తమవారు VŸతులు కావడంపై పగతో రగిలిపోతున్నారు.

రానురానూ ఈ మత ఘర్షణలు మరింత తీవ్ర రూపం దార్చుతున్నాయి.

  * * * * *

కపరిభట్టు నివాసం, మరకతంపాడు గ్రామం

హరిహర బృందం సభ్యులు ఒక్కరొక్కరుగా ఆ నివాసానికి చేరుతున్నారు. అందరి ముఖాలలో ఒకటే ప్రశ్నార్థకం.. ఈ గిరిరాజమ్మ దేవత ఓ శైవ గ్రామం వెళితే ఆ చుట్టుప్రక్కల వైష్ణవులు చనిపోతున్నారు. వైష్ణవ గ్రామం వెళితే దగ్గరి గ్రామాలలో శైవులు చనిపోతున్నారు. ఇదేమిటి?

ఆమె నపుంసకుడు అని గ్రామస్తులు స్పష్టంగా గుర్తుపడుతున్నారు. అదేవిటి?

కొన్ని గంటలలోనే కపర్ది నివాసం హరిహర బృంద సభ్యులతో నిండిపోయింది.

ఎవరు ఆ గిరిరాజమ్మ దేవత? ఆమె కాలు పెట్టిన గ్రామం చుట్టుపక్కల తప్పకుండా హత్యలు జరుగుతున్నాయి. కేవలం వీర శైవులే కాదు.. వీర వైష్ణవులే కాదు.. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ఇద్దరూ చనిపోతుండగా ఇరు వర్గాలు కత్తులు నూరుతున్నాయి. ఎప్పుడో పెద్ద యుద్ధం లాంటిది ఈ తెలుగు రాజ్యాలలో జరగవచ్చు.. కాబట్టి కిం కర్తవ్యమ్?

అంతా కూర్చుని తీవ్రంగా చర్చించారు. ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ముందు ఆ దేవత కదలికలు గుర్తించాలి.. ఆమె ఎక్కడ బస చేస్తోంది.. తర్వాతి బస ఏ గ్రామం.. ఇత్యాది వివరాలన్నీ సేకరించి ఆమె ఎవరో ఆమె వెనుక ఎవరు ఉన్నారో.. మొత్తం గుర్తించాలి. ఇకపై ఆమె బస చేసిన గ్రామం పరిసరాల్లో ఎవరూ హత్యకు గురికాకూడదు!!

ఒక బృందం ఆమెను నిశ్శబ్దంగా అనుసరిం చాలి..

రామప్ప నాయకత్వంలో ఆ బృందం ఆమెను అనుసరించింది. ఆమె ఆ రోజు బస చేసిన పడుగు పాడు గ్రామంలో కొందరు హరిహర అభిమానుల ఇంటికి ఈ రామప్ప బృందం చేరుకుంది.

ఆ గ్రామ సమయశెట్టి వీర వైష్ణవుడు. అంటే ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోని వీర శైవుడిని వెళ్లు హత్య చేస్తారన్నమాట.

పగలల్లా ఆమెను ఊరు ఊరంతా కలిసేలా సమయశెట్టి నిర్వహించాడు. ఆ రాత్రి.. అర్ధరాత్రి దాటాక కొందరు వీరు వైష్ణవులు.. పరాయి గ్రామాల వాళ్లు ఆ సమయశెట్టి ఇంటికి రావడం రామప్ప బృందం గుర్తించింది. రహస్యంగా ఆ ఇంటిని చుట్టుముట్టి వారి సంభాషణలను విన్నారు. వారి మాటలు విన్నాక వారికి మూర్ఛ వచ్చినంత పనయ్యింది.

వెంటనే రామప్ప ఒకరిని కపర్ది వద్దకు పంపాడు.

“ఒక పెద్ద శైవ వైష్ణవ మతయుద్ధానికి ఈ సమయశెట్టి నాయకత్వంలో వీర వైష్ణవ వర్గం సిద్ధపడుతున్నది. తెలుగురాజ్యాల్లో ముసలం పుట్టించాలని వాళ్ల పన్నాగం.”

“అంటే.. వాళ్లు.. అదే ఆ దేవత వెనుక ఉన్నవాళ్లు ఎవరు?!” కపర్ది ప్రశ్న.

“వాళ్లు మsరాఠం, కన్నడ కలిపి మాట్లాడుతూ మధ్య మధ్య తెలుగు మాట్లాడు తున్నారు.వాళ్లకు ఎవరో రాచమహిళ ప్రణాళిక, సహాయం, సహకారం అంది స్తోంది. ఈ దేవతకు కొందరు వణిజులు కూడా సహాయంగా ఉన్నారు. వీళ్ల గమ్యం తెలుగు రాజ్యాలలో మత ఘర్షణలు సృష్టించడం.”

అది విన్న కపర్ది నోట మాట రాక నిలబడి పోయాడు.

ఆ మర్నాడు గిరిరాజమ్మ దేవత.. ఆమె బృందం అక్కడి నుండి దూరంగా మరో రెండు మూడు రాజ్యాలు దాటి దక్కను రాజ్యం ఒకటి ఎంచుకుని.. ఆ రాజ్యంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది.

రామప్ప బృందం కూడా వెనకనే వెళుతూ ఆ గ్రామం పక్క గ్రామంలో ఎవరైనా హరిహరతత్వ అనుయాయులు ఉన్నారేమో వాకబు చేసి అక్కడ సంఘమిశ్రుడు అనే పేరున్న తిక్కనార్యుని పండిత శిష్యుని గుర్తించి ఆయన ఇంట బస చేశారు.

మరునాడు అన్నిగ్రామాలలో జరుగుతున్నట్లే గిరిరాజమ్మదేవతకు అట్టహాసంగా పూజా పునస్కా రాలు జరిగాయి.

ఆ గ్రామ సమయశెట్టి శైవుడు.

ఆ రాత్రి చాలామంది వీరశైవులు దేవతను కలవడానికి రావడం రామప్ప బృందం గుర్తించింది. ఎవ్వరికి అనుమానంరాని రీతిలో దేవత బస చేసిన ఇంటివైపు వెళ్లి లోపల జరుగుతున్న చర్చలను వినడానికి సమయత్తమయ్యారు.

అయితే అక్కడే తప్పటడుగు పడింది.

(సశేషం)

మత్తి భానుమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE