రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో విశాలంగా విస్తరించి ఉన్న శేషాచలం అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఈ అడవులకు మాత్రమే పరిమితమైన అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం. ‘ఎర్రబంగారం’గా పిలుచు కునే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా చైనా, జపాన్ వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఈ కారణంగానే శేషాచలం అడవులు స్మగ్లర్ల పాలిట కామధేనువుగా మారాయి.
వందల, వేల కోట్ల రూపాయల విలువైన ‘ఎర్రబంగారం’ అటవీ సంపదను కొల్లగొట్టేందుకు వ్యవస్థీకృత నేర ముఠాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లో అనూహ్యమైన ప్రశాంతత నెలకొంది. ఎర్రచందనం చెట్ల నరికివేత వార్తలు గానీ, స్మగ్లర్ల అలికిడి గానీ వినిపించడం లేదు. ఈ తాత్కాలిక విరామం చూసి మురిసిపోవాలా? లేక భవిష్యత్తులో పొంచి ఉన్న భారీ ముప్పునకు ఇది సంకేతమా? ‘ఎర్రచందనం అక్రమ రవాణా మరల కొనసాగు తుందా?’ అన్న ప్రధాన ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
తమిళ కూలీలే ప్రధానం
అటవీశాఖ అధికారుల మాటలను బట్టి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరకడం సామాన్యులకు సాధ్యం కాని పని. ఈ చెîట్లను నరికి, బరువైన దుంగలను దాదాపు 30 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకుంటూ దట్టమైన అడవుల్లో, ఎత్తైన రాతి కొండలపై ప్రయాణించి లారీలు ఉండే లోడింగ్ పాయింట్లకు చేర్చాలి. ఇంతటి కఠినమైన శారీరక శ్రమను తట్టుకునే సామర్థ్యం, సాహసం స్థానిక వ్యక్తులకు ఉండదు. అందుకే స్మగ్లర్లు పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యంగా జవ్వాది (జావాది) హిల్స్ ప్రాంతానికి చెందిన కూలీలను ఈ పనికి వినియోగి స్తుంటారు. వీరికి గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ముఠాతో పనిచేసిన అనుభవం,అటవీ మార్గాలపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ పనికి సులభంగా అలవాటు పడ్డారు. అయితే, ఇటీవలి వరకు తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొని ఉండటంతో ఈ కూలీల కదలికలు శేషాచలంలో పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ఈ కూలీల సేవలను స్థానిక రాజకీయ పార్టీలు వినియోగించుకోవడం, వారికి తాయిలాలు అందడం ప్రధాన కారణం. అలాగే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపి ముమ్మరంగా తనిఖీలు చేస్తుండటంతో కూలీలను గుట్టుచప్పుడు కాకుండా అడవుల్లోకి తరలించడం స్మగ్లర్లకు కష్టంగా మారింది. అంటే, ఈ నిర్దిష్ట తమిళ కూలీ వర్గం లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద స్థాయిలో జరగలేదు. ఇది ఒక విధంగా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు బలహీనమైన కోణం కూడా, అదే సమయంలో ఈ కూలీల లభ్యత తగ్గితే స్మగ్లింగ్ తగ్గుతుందనే ఆశకు కారణమూ అవుతుంది.
మారిన వాతావరణ పరిస్థితులు
ఎన్నికల హడావిడితో పాటు అడవిలోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కూడా అటవీ శాఖకు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం శేషాచలం కొండల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో పగటి పూట వేడి ఉన్నా, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, తీవ్రమైన ఎండల వల్ల రాతికొండలు విపరీతంగా వేడెక్కి, రాత్రిళ్లు కూడా ఉక్కబోత వాతావరణం ఉంటోంది. ఈ వేడికి అడవిలో నీటి వనరులు ఎండిపోయాయి. వన్యప్రాణు లకు సైతం తాగడానికి నీరు దొరకక సమీప గ్రామాలకు పరుగులు తీస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అడవిలోకి వస్తే తాగునీరు దొరకక, తీవ్రమైన వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతామన్న భయం ఆ కూలీలలో ఏర్పడిందని, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇష్టం లేకే కూలీల రాక తగ్గిందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు, అటవీశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రొటెక్షన్ సెల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు అడవిలో నీరు లభ్యమయ్యే కొద్దిపాటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి. రామ కొండారెడ్డి లాంటి వారి ఉన్నతాధికారుల నేతృత్వంలో ఈ బృందాలు నీటికుంటల వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండటంతో, స్మగ్లర్లు అటు వైపు రావడానికి జంకుతున్నారు.
కానీ, ‘పరిస్థితి ఇలా ఉన్నా మరలా చెట్లు నరికేందుకు ప్రయత్నాలు జరగవచ్చా? ఎర్రచందనం అక్రమ రవాణా మరల కొనసాగుతుందా?” అన్న ప్రశ్నను నిశితంగా పరిశీలిస్తే… కచ్చితంగా ఇది మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులే అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ప్రకృతి, ఎన్నికల వల్ల వచ్చిన తాత్కాలిక విరామం మాత్రమే. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విజయోత్సవ ర్యాలీలు ముగిసిన తర్వాత ఆ కూలీలు మళ్లీ తమ పాత వృత్తికి మళ్లడం ఖాయం.
ఎందుకంటే, ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో గల భారీ డిమాండ్ అలాంటిది. ఒక్కో చెట్టు విలువ రూ. లక్షలలో ఉంటుంది. పేద కూలీలకు ఒక ట్రిప్‌కు మంచి సంపాదన వస్తుంది. ఈ కూలీలకు రోజుకు వేలాది రూపాయల ఆశ చూపి, స్మగ్లర్లు మళ్లీ వారిని బృందాలుగా కొండ ఎక్కిస్తారు. ఈ ఆర్థిక ప్రలోభం ఉన్నంత కాలం స్మగ్లింగ్ ఆగదు.
రాజకీయ నేతలు – అవినీతి సమస్య
ఇంతకాలం వందల మంది అటవీశాఖ సిబ్బంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ స్మగ్లర్ల దందాను శాశ్వతంగా ఆపలేకపోయాయన్నది పచ్చి నిజం. దీనికి ప్రధాన కారణం ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న బలమైన మాఫియా వ్యవస్థకు స్థానిక రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అవినీతికి అలవాటు పడ్డ కొందరు ప్రభుత్వ, అటవీ, పోలీసు శాఖల సిబ్బంది కూడా వీరికి రహస్యంగా సహకరిస్తున్నారు. ఈ “రాజకీయ-అధికార-స్మగ్లర్ల” అనుబంధం వ్యవస్థాగతంగా బలంగా పాతుకుపోయింది. ఎర్రచందనం లారీలు అధికారుల కళ్లుగప్పి, చెక్‌పోస్టులు, రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయంటే లోపం వ్యవస్థలోనే ఉందని అర్థం చేసుకోవాలి. లోపల నుంచే సమాచారం చేరుతుందా? ఎవరైనా కొమ్ము కాస్తున్నారా? అనే అనుమానాలు తొలగే వరకు స్మగ్లింగ్‌ను సమూలంగా నిర్మూలించడం కష్టమే. అక్రమ రవాణాలో రూ. వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అందువల్ల, కేవలం అటవీశాఖ, పోలీసుల నిఘా సరిపోదు. అవినీతిని అరికట్టే చర్యలు కూడా అంతే అవసరం.
ఎర్రచందనం ప్రొటెక్షన్ సెల్, టాస్క్‌ఫోర్సు ఏర్పాటు మంచి చర్యలే. నీరు దొరికే ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడం స్మగ్లర్లను తాత్కాలికంగా నిరుత్సాహపరుస్తుంది. కానీ ఈ చర్యలు మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు. 30 కిలోమీటర్ల అడవి మార్గాలను పూర్తిగా పర్యవేక్షించడం ఏ వ్యవస్థకైనా సవాలే. పోలీసులు ఇలా అలోచిస్తే స్మగ్లర్లు వైపు నుంచి ఇదే ఆలోచన ఉంటుంది. వారికొచ్చే లాభాల కోసం చిన్న అవకాశం దొరికినా తిరిగి మళ్లీ ప్రయత్ని స్తారు. ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతుకుతారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఈ ప్రశాంతతను అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఒక సువర్ణ అవకాశంగా తీసుకోవాలి. కూలీల కదలికలు తగ్గాయి కదా అని విశ్రమించకుండా, భవిష్యత్తు సవాళ్లకు సన్నద్ధం కావాలి. ఎన్నికల కోడ్ ముగిసి, వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడగానే స్మగ్లర్లు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తారని ఊహించి, అందుకు తగ్గట్లుగా ముందస్తు వ్యూహాలు రచించడం ఎంతైనా అవసరం. అడవిలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేయాలి. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియో గించాలి. నీటి వనరుల వద్ద నిఘా పెట్టినట్లే, అనుమానాస్పద ప్రాంతాలన్నింటిలోనూ కూంబింగ్ ముమ్మరం చేయాలి.
శాశ్వత పరిష్కారం లభించేనా?
ఎర్రచందనం అక్రమ రవాణా మరలా కొనసాగ కుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అటవీ, పోలీసు వ్యవస్థలు సమన్వయంతో పని చేస్తే మాత్రమే ఈ సమస్యను అరికట్టవచ్చు.కేవలం కూలీలను అడ్డుకుంటే సరిపోదు. దానికి ఆర్థిక, రాజకీయ ఊతం ఇస్తున్న మూలాలను దెబ్బతీయాలి. తమిళ కూలీల” పేదరికం కారణంగా స్మగ్లింగ్‌కు మళ్లుతున్నారు. స్థానికంగా చట్టబద్ధమైన పని కల్పిస్తే స్మగ్లింగ్‌లో పాల్గొనే కూలీల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడున్న ఇదే రకమైన కఠినమైన నిఘా వాతా వరణాన్ని, తనిఖీలను ఏడాది పొడవునా నిర్విరా మంగా కొనసాగిస్తేనే ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలం. అవినీతి అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రశాంతంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మే 3న ప్రశాంతంగా జరిగింది. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని దళిత సంఘాలు పిలుపు నివ్వడంతో… ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 580 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భూమిపూజ ప్రాంగణం లోపలికి వచ్చేవారిని మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి పంపిం చారు. పూజల అనంతరం రఘురామ మాట్లాడుతూ 800 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు కృష్ణ శిల్ప రాళ్లతో రామాలయం నిర్మాణం చేపడుతున్నా మని తెలిపారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యకమ్రం నేపథ్యంలో బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) నేతలు రాష్ట్రం నలుమూలలు నుంచి ఆకివీడుకు బయలుదేరారు. అనంతపురం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా తదితర జిల్లాల నుంచి రైళ్ల ద్వారా సుమారు మూడు వందల మంది ఆకివీడు చేరుకున్నారు. పెదపేటలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఉండడంతో జాతీయ రహదారిపై జైభీమ్ అంటూ నిరసనలు చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్ కార్యాలయా నికి తరలించారు. అలాగే వివిధ వాహనాల్లో వస్తున్న వారిని జిల్లాలోని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు.
రామాలయం పునర్న్మిణానికి శంకు స్థాపనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న తలపెట్టిన భూమిపూజ కార్యక్రమాన్ని కొనసాగించ వచ్చని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో రామాలయాన్ని నిర్మిస్తున్నారంటూ పెదపేటకు చెందిన వ్యక్తులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.
1932 నుంచి అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉంది. పెదపేటలోని సర్వే నం. 470-12లోని భూమిని రెవెన్యూ రికార్డుల్లో రామాల యానికి చెందినది ఉంది. రామాలయం పేరు మీద విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కూలిపోయే దశలో ఉన్న నిర్మాణాన్ని తీసివేసి కొత్తగా ఆలయం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చారు. ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్ ప్లాన్ అప్రూవల్ చేసి ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇలా వీటన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను రామాలయ కమిటి నియమించిన అడ్వకేట్ కోర్టు ముందు ఉంచగా, వాటిని పరిశీలించిన హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఆలయం నిర్మాణానికి అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న భూమి పూజ చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చారు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్