డిజిటల్ అరెస్టులతో ప్రమేయం ఉన్న 9,400 ఖాతాలను రద్దు చేసినట్టు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. వినియోగదారుల రక్షణ కోసం పలు ఫీచర్లను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్చర్ýలో అధికారిక పోలీసు లేదా ప్రభుత్వ చిహ్నాలను ఉపయోగిస్తున్న ఖాతాలను తొలగించే లోగో డిటెక్షన్ వ్యవస్థలు తీసుకొచ్చినట్టు తెలిపింది. కొత్తగా క్రియేట్ చేసిన వాట్సప్ అకౌంట్ల నుంచి కాల్ వస్తే యÖజర్లను హెచ్చరించే ఫీచర్ తీసుకురానున్నట్టు వెల్లడించింది. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వారి ప్రొఫైల్ ఫొటోలు కనిపించకుండా అయాచితంగా దాచి ఉంచే ప్రక్రియను త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఫోన్‌లో కేవైసీ పూర్తయిన సిమ్ కార్డు ఉంటేనే వాట్సప్ పనిచేసేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది.

ఆధునిక సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ అదే స్థాయిలో మోసాలు కూడా అధికమవుతున్నాయి. సాంకేతికతను ప్రజా ప్రయ్పుోనాలకోసం వినియో గిస్తే మన సమాజానికి అద్భుతమైన సేవలందు తాయి. అయితే అదే సాంకేతికతను దుర్వినియోగ పరిస్తే ప్రజలు వంచనకు గురవుతారు. ఇటీవల దేశంలో అధికమైన డిజిటల్ మోసాలకు సాధారణ ప్రజలు మొదలుకొని ప్రముఖులు కూడా బాధితులుగా మారుతున్నారు. మనం ఉన్నచోటనే మనల్ని అరెస్టు చేస్తున్నట్టు దొంగ కేసుల్ని, తప్పుడు పత్రాలతో నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నారు. ఆలోచించుకునే లోపలే మన ఖాతాల్లో డబ్బులను తస్కరిస్తున్నారు. లేకపోతే మన కుటుంబ సభ్యులకు, ఆప్తమిత్రులకు ఏదో ఆపద వచ్చిందని, వారు ఏదో తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారని బెదిరిస్తూ ఫోన్లు చేసి మనల్ని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు కాజేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి మోసాలను అరికట్టేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్న దశలో అదే స్థాయిలో మోసగాళ్లు కూడా కొత్తకొత్త విధానాలతో రెచ్చిపోవడంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. సాంకేతిక మోసాలకు అదే సాంకేతికతతో చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తుల ప్రయత్నిస్తున్న సయమంలో ప్రజలు కూడా అప్రమత్తతతో మోసపోకుండా ఉంటేనే ఇలాంటి దారుణాలకు ముగింపు పలకవచ్చు.

‘డిజిటల్ అరెస్ట’ మోసాలు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ‘అరెస్ట’ చేశామని నమ్మించి లక్షల నుంచి కోట్ల రూపాయలు దోచుకునే ఈ సైబర్ నేరాలు ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపిస్తు న్నాయి. ఇది కేవలం టెక్నాలజీ ఆధారిత మోసం మాత్రమే కాదు. ఇది మానసికంగా బాధితులను కట్టడి చేసే ఒక సిస్టమాటిక్ నేర విధానం. “మీపై కేసు ఉంది. మీపై అరెస్టు వారెంట్ ఉంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం..” అంటూ ఈ మోసగాళ్లు బాధితుల మనసులో భయాన్ని నాటేస్తారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎనఐఏ, పోలీస్ వంటి అధికారిక సంస్థల పేర్లు చెబుతూ భయపెడుతూ మోసం చేస్తున్నారు. మొదట ఒక సాధారణ కాల్‌తో ప్రారంభమయ్యే ఈ మోసం, తరువాత వీడియో కాల్ ద్వారా ‘కస్టడీ’లో ఉన్నట్టుగా చూపిస్తూ గంటల నుంచి రోజులవరకూ బాధితులను ఒంటరిగా ఉంచుతుంది. ఈ సమయంలో మోసగాళ్లు బాధితులను ఇతరులతో మాట్లాడనివ్వరు, ఫోన్ కట్ చేయనివ్వరు, చివరికి ‘ఎంక్వైరీ కోసం’ అని చెబుతూ ‘సేఫ్ అకౌంట్‌కు’ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయిస్తూ పూర్తిగా మోసం చేస్తారు. ఈ మోసాల నిర్మాణం చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగే మోసం కాదని స్పష్టమవుతుంది. క్రమబద్ధమైన నెట్‌వర్క్. అక్రమంగా బాధితుల వ్యక్తిగత డేటా, వివరాలు సేకరించి కాల్ సెంటర్‌ల మాదిరిగా పనిచేసే గ్యాంగ్‌లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వ్యక్తులు, బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు మళ్లించే మధ్యవర్తులు ఇలా ఒక వ్యవస్థ ఈ నేరాల వెనుక పనిచేస్తోంది.

భారతదేశంలో రాష్ట్రాల వారీగా ఈ మోసాల విస్తృతి పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థమవు తుంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబై నగరం ఈ మోసాలకు కీలకమైన కేంద్రంగా మారింది. 2025లో ముంబైలో ‘డిజిటల్ అరెస్ట’ తరహా మోసాల ద్వారా బాధితులు రూ.150 కోట్లకు పైగా మోసపోయారనే గణాంకాలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని ఐటీ నగరం హైదరాబాద్‌లో 2024లో 3,000కు పైగా కేసులు నమోదు కాగా బాధితులు 170 కోట్ల రూపాయలకు పైగా నష్టం నష్టపోయారు. భాగ్యనగరంలో 2025లో కూడా 1,000కు పైగా కేసులు నమోదై రూ70 కోట్లకుపైగా నష్టపోయారు. కర్ణాటకలో బెంగళూరు నగరం ఐటీ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు బాధితులవుతున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ మోసాలు విస్తరిస్తున్నాయి. ఈ మోసాలు ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో కూడా పెరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యÖనైటెడ్ కింగడమ్, సింగపూర్, చైనా, గల్ప్ వంటి దేశాల్లో కూడా ప్రభుత్వ అధికారుల పేర్లతో భారీగా మోసాలు నమోదవుతున్నాయి. డిజిటెల్ మోసాలపై అపమ్రత్తంగా ఉండాలని ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి సంస్థలు అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం దేశంలో సాంకేతిక మోసాలను అరికట్టేందుకు వేగవంతంగా చర్యలు తీసు కుంటోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, 1930 హెల్ప్‌లైన్, సిమ్ కార్డుల నియంత్రణ, బ్యాంక్ లావాదేవీల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం పెంచి అనుమానాస్పద లావాదేవీలను త్వరగా గుర్తించే విధానాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకొని ఈ మోసాలను అరికట్టడానికి శాయశక్తులు కృషి చేస్తున్నాయి. కోర్టులకు ప్రభుత్వం సమర్పించిన డేటాను పరిశీలిస్తే ఈ సమస్య తీవ్రత స్పష్టమవు తోంది. డిజిటల్ మోసాలకు సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా ఆందోళన కలిగిస్తున్నాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే గత మూడు సంవత్సరాల్లో 30 లక్షలకు పైగా సైబర్ ఫిర్యాదులు నమోదు అయ్యాయని ప్రభుత్వం న్యాయస్థానాలకు తెలిపింది. ఇందులో అధిక శాతం నమోదైన ‘ఇంపర్సనేషన్ స్కాంలు’ అంటే పోలీస్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేర్లతో చేసే మోసాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆర్థికపరంగా చూస్తే ఈ సైబర్ నేరాలతో దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు కోర్టులకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో ‘డిజిటల్ అరెస్ట’ వంటి మోసాలు వేగంగా పెరుగుతున్న విభాగంగా గుర్తించబడ్డాయి. అదే సమయంలో 1930 హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు మోసపోయే డబ్బును ఫ్రీజ్ చేయడం లేదా బ్లాక్ చేయడం జరిగిందని కోర్టులకు తెలిపిన ప్రభుత్వం ఈ మొత్తాలను పూర్తిగా రికవరీ చేయడం చాలా కష్టమని చెప్పిడం ఈ మోసాల పరాకాష్టకు నిదర్శనం. ప్రభుత్వం కోర్టులకు సమర్పించిన అఫిడవిట్‌లలో మరో కీలక అంశం ఏమిటంటే ఈ మోసాýలో చాలా వరకు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉంది. ఒక రాష్ట్రంలో కాల్ చేసి, మరో రాష్ట్రంలో బ్యాంక్ ఖాతా ఉపయోగించి, మూడో దేశానికి డబ్బు మళ్లించే నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని దర్యాప్తులో బయటపడుతోంది. ఈ కేసుల తీవ్రతను గుర్తించిన న్యాయవ్యవస్థ కూడా ఈ అంశంలో బాధితులు మోసానికి గురికాకుండా కీలక పాత్ర పోషిస్తూ డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి చట్టంలో లేదు.’ అరెస్ట్ అనేది చట్టబద్ధ ప్రక్రియతో మాత్రమే జరగాలి; ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయలేరు. సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, ఫిర్యాదులను వెంటనే నమోదు చేయాలని కోర్టులు ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.

ఈ మోసాలకు బలయ్యే వారు కేవలం సాధారణ ప్రజలే కాదు. అధికారులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వంటి ప్రతిష్టాత్మక వర్గాలవారు కూడా ఈ మోసానికి గురవుతున్నారు. పదవీ విరమణ పొందిన ఉన్నత ఉద్యోగులు కూడా మోసపోతున్నారు. ముంబై మహానగరంలో ఒక రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్‌ను సీబీఐ అధికారులమంటూ కొందరు వారం రోజుల పాటు వీడియో కాల్‌లో ఉంచి కోటి రూపాయలకు పైగా దోచుకున్న ఘటన ఈ మోసాల మానసిక ఒత్తిడి స్థాయిని తెలియజేస్తోంది. ఇలాంటి కేసులు దేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. బయట పడుతున్న కేసులు కొన్ని మాత్రమే ఉంటున్నాయి. కొంత మంది బయటకు చెప్పుకోలేక అంతర్గతంగా మానసికంగా కుమిలిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి.

ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా ఎవరూ అరెస్ట్ చేయరని గుర్తుంచుకోవాలి. ఎవరైనా అధికారుల పేరుతో డబ్బు అడిగితే వెంటనే కాల్ నిలిపివేయాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, 1930 హెల్ప్ లైన్‌ను సంప్రదించాలి. పోలీసులను సంపద్రించాలి. ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకం. ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేసే విధానం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్స్‌ను వెంటనే నిలిపివేసి, అధికారిక మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలి. కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఇలాంటి మోసాలను అరికట్టడంతో పోలీసులు, దర్యాప్తు సంస్థలు కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో, బాధితుల్లో చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. పోలీసులు కేవలం దర్యాప్తుతో పరిమితం కాకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వార్తాపత్రికలు, టీవీ, సోషల్ మీడియా, పాఠశాలలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, పార్కులు, సినిమా హాళ్లు, ఇతర ప్రాంతాల్లో పలు వేదికలపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఫోన్‌లో అరెస్ట్ అనే పద్ధతి లేదనే సందేశాన్ని ప్రజల వద్దకు బలంగా తీసుకెళ్లాలి. 1930 హెల్ప్‌లైన్, సైబర్ క్రైమ్ పోర్టల్ వంటి వనరులను ప్రజలకు చేరువ చేయడం, బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం పెంచడం ద్వారా మాత్రమే ఈ మోసాలను సమర్థంగా అరికట్టవచ్చు. సైబర్ నేరాలపై ఎక్కడికక్కడ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలి. దీనిపై జాతీయ స్థాయిలో ఒక విధానం ఉండాలి. నేరాలకు పాల్పడుతున్న జాతీయ, అంతర్రాష్ట్ర ముఠాలపై దర్యాప్తు వేగవంతం చేయాలి. బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం పెంచాలి. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత కీలకం.

సైబర్ మోసాల అసలు బలం టెక్నాలజీ కాదు మానసికమైన వ్యూహం. భయం, అధికారంపై నమ్మకం, ఒంటరితనం ఈ మూడు అంశాలను మోసగాళ్లు సమర్థంగా ఉపయోగించుకుంటూ అమాయకులను వంచిస్తున్నారు. ఈ మూడు అంశాలను ఉపయోగించుకుని మోసగాళ్లు అమాయకులను వలలో వేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజల్లో అవగాహన లేకపోతే ఈ మోసాలను పూర్తిగా అరికట్టడం కష్టమే. ‘డిజిటల్ అరెస్ట’ మోసం మనకు ఒక స్పష్టమైన హెచ్చరికలాంటిది. అవగాహన, జాగ్రత్త, ధైర్యం ఉంటేనే ఈ మోసాలను సమర్థంగా ఎదుర్కోగలం. ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా అపరిమితంగా విజృంభిస్తూ మహమ్మారిగా మారుతున్న డిజిటల్ అరెస్టు మాయాజాలాన్ని అరికట్టాలంటే దానికి అప్రమత్తతే శ్రీరామరక్ష.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE