సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ వైశాఖ బహుళ తదియ – 04 మే 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రాచీన భారత చరిత్రలో కౌటిల్యుడి విదేశాంగ నీతి అత్యంత పరిణతి చెందిందిగా ప్రసిద్ధి. విదేశాంగ విధాన రూపకల్పనలో కౌటిల్యుడు చెప్పిన ఆరు సూత్రాల్లో మండల సిద్ధాంతం, షాడ్గుణ్య విధానం చాలా ముఖ్యమైనవి. తటస్థ వైఖరి ప్రయోజనకరమని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకరి పక్షం వహించడమో, ఒక వైఖరి తీసుకోవడం వల్ల కలిగే మంచి చెడులను బేరీజు వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గంభీరమైన రాజనీతిని ప్రదర్శిస్తోంది.
భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత విదేశాంగ విధానం లోపభూయిష్టంగా తయారయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రదర్శించకపోవడం చేతగానితనంగా లెక్కగడుతున్నాయి మన విపక్ష పార్టీలు. మూడు మిత్ర దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తినప్పుడు ఏదో ఒక పక్షం తీసుకోవడం వల్ల కలిగే విపరిణామాలు, పర్యవసానాలను పరిణతితో అంచనా వేయకుండా దుందుడుకుగా వైఖరి ప్రకటించడం అపరిపక్వతకు నిదర్శనమనేది కేంద్రం ప్రామాణిక వైఖరి.
భారత విదేశాంగ శాఖ మంత్రి, మాజీ దౌత్యవేత్త ఎస్.జైశంకర్ 2020లో రాసిన ‘The India Way’-Strategies for an uncertain world పుస్తకంలో భారత విదేశాంగ నీతికి ఇరుసు లాంటి పరిశీలన వెల్లడించారు. “This is a time for us to engage America, manage China, cultivate Europe, reassure Russia, bring Japan into play, draw neighbors in, extend the neighborhood and expand traditional constituencies of support” అన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితిలో తటస్థ వ్యూహాలే ఫలితాలిస్తాయంటారు జైశంకర్.
‘అమెరికాతో సంధి చేసుకోవాలి, చైనాను నియంత్రించాలి, యూరప్‌తో దౌత్య సంబంధాలు పెంచుకోవాలి, రష్యాకు నమ్మిక కలిగించాలి, జపాన్‌ను రంగంలోకి దింపాలి.. పొరుగు దేశాలను చేరదీయాలి, పక్క దేశాలతో చెలిమి చేస్తూ.. మద్దతు సంపాదించాలి’ అన్నారు జైశంకర్. ఈ తటస్థ వైఖరిని చేతగానితనంగా, విదేశాంగ విధాన వైఫల్యంగా భావిస్తే.. అది మన దేశంలోని ప్రతిపక్షాల అజ్ఞానమని అర్థం చేసుకోవాలి.
పశ్చిమాసియా సంక్షోభంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించగానే ‘విశ్వగురు’ భారత్ ఏమైందంటూ వ్యంగ్యబాణాలు విసరడం మొదలుపెట్టాయి మన ప్రతిపక్షాలు. మన దేశంలోని కుహనా వామపక్ష మేధావులు అందుకు వంతపాడారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తాజాగా ఇరాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. పాకిస్థాన్ తాహతు అర్థమవుతుంది. ఇరాన్ జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత లేదంటూ తేల్చి చెప్పారు. అటు అమెరికా పాకిస్థాన్‌ను విశ్వసించడం లేదు. అసీం మునీర్‌కు సుదీర్ఘ కాలంగా ఐఆర్జీసీ అంతర్జాతీయ విభాగం ఖుద్స్ ఫోర్స్‌తో ఉన్న సంబంధాల రీత్యా అగ్రరాజ్యానికి పాక్‌పై నమ్మకం లేదు. అమెరికా-పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్‌కు ఇస్లామాబాద్‌పై విశ్వాసం లేదు.
సంక్లిష్ట భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్ స్వతంత్ర వైఖరి అవలంబించేందుకు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటోంది. రష్యాతో చమురు కొనుగోలు విషయంలో అమెరికాను ధిక్కరించింది. ‘ఆపరేషన్ సిందూర’ వల్ల అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తెలిసి కూడా.. తెగువను ప్రదర్శించింది. దశాబ్దాలుగా చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను పట్టువిడుపుల దౌత్యంతో క్రమానుగతంగా పరిష్కరించుకుంటోంది. బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ వైఖరి అమెరికాకు ఏ మాత్రం గిట్టదని తెలిసి కూడా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది.
పశ్చిమాసియా యుద్ధంలో ఉన్న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్.. మూడు దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయి. ఎవరి పక్షం తీసుకున్నా.. దేశ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. నిర్దిష్టంగా ఒకరి తరపున వకాల్తా పుచ్చుకోవడం వల్ల వాణిజ్య సంక్షోభం, ఇంధన వనరుల కొరత, రక్షణ పరికరాల దిగుమతులు అనిశ్చితిలో పడతాయి. అందుకే భారత్ మధ్యే మార్గాన్ని అనుసరించింది.
అంతర్జాతీయంగా భారత్ పరపతి బలపడుతున్న దశలో అమెరికాతో ద్వైపాక్షిక బంధం విషయంలో పరిణత వైఖరి ప్రదర్శించాలి. ప్రపంచ భారీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు బాధ్యతాయుతమైన నాయకత్వం, అమెరికాతో భాగస్వామ్యం ద్వైపాక్షిక బంధానికి అత్యవసరం.
విదేశాంగ విధాన రూపకల్పనలో భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంకేతిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏ దేశమైనా విదేశాంగ విధానాన్ని ఖరారు చేస్తుంది. అంతే తప్ప.. ఉద్వేగాలు, ఉద్రిక్తతల మధ్య వైఖరులు ప్రకటించడం విదేశాంగ నీతి అనిపించుకోదు. దేశీయ విధానం లాగే విదేశాంగ విధానం కూడా వాటిని రూపొందించే నేతల వ్యక్తిత్వం, స్వభావాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ అనుభవజ్ఞుడైన పాలకుడు. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎస్.జైశంకర్‌కు సుదీర్ఘ కాలం దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాని చుట్టూ నిపుణుల బృందం ఉంది. సమష్టి కృషిగా రూపొందిన భారతదేశ ప్రస్తుత విదేశాంగ విధానంలోని స్పష్టత గతంలో ఎన్నడూ లేదనే చెప్పాలి.