సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ వైశాఖ శుద్ధ తదియ – 20 ఏప్రిల్ 2026, సోమవారం 

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


సనాతన స్ఫూర్తి ఒక సాంస్కృతిక సైన్యమై ఆవిర్భవిస్తే, భారతీయ ప్రాచీనత ఆధునిక యుగంలో పల్లె పల్లెలో పరిమళిస్తుంది. డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గెవార్ నవ నాగరికత పేరిట పశ్చిమ దేశాలు మన దేశంపై రుద్దిన విధ్వంసక నాగరికతను సవాలు చేశారు. రాక్షస మూకలైన అనేక జాతులతోపాటు ధర్మగంటలు మోగని దుర్గం వంటి బ్రిటీష్ వలసవాదాన్ని నిరసించారు. అది ఏర్పరచిన విషబీజాల ద్వారా మొలకెత్తిన విఘటన భావాలను తుదముట్టించే పరుసవేదిని కనిపెట్టారు  అగ్నిసరస్సులో వికసించిన విద్యుత్‌తేజం హెడ్గెవార్. ప్రళయ సమానమైన వలసవాదాన్ని పద్ధతిగా నిర్మూలించాలని తన అనుభవం ఆధారంగా ఒక దీర్ఘకాలిక పథక రచన చేసిన ధన్యజీవి హెడ్గెవార్.

ఉద్యమాలు, హింసామార్గాన్ని ఆశ్రయించి వలసవాద ప్రభుత్వాన్ని తరిమేయవచ్చు లేదా అదే పలాయనం చిత్తగించేలా చేయవచ్చు. కానీ, అది వదిలిపోయే విషతుల్యమైన సాంస్కృతిక వలయాన్ని ఛేదించడం అసాధ్యమని ఆనాడే గ్రహించగలిగిన ద్రష్ట హెడ్గెవార్. దూరదృష్టి, ఖచ్చితమైన అంచనా, సామాజిక జీవితంపై అవగాహన పుష్టిగా ఉన్న తపస్వి డా. కేశవ బలిరామ్ హెడ్గెవార్.

యవ్వన ప్రాయంలో బాల గంగాధర్ తిలక్ ప్రభావంతో జాతీయోద్యమంలో దూకినా… కలకత్తాలో విప్లవోత్తేజంతో యువ విప్లవకారులతో చురుగ్గా పనిచేసినా… తర్వాత కాలంలో… రాజకీయ, విప్లవ ఉద్యమాలకు ఉన్న పరిమితిని గుర్తించి సరికొత్త మార్గాన్వేషణకు బయలుదేరిన రుషితుల్యులు డాక్టర్ హెడ్గెవార్. ఎన్నడూ ఎవరి పొగడ్తను, ప్రచారాన్ని హెడ్గెవార్ కోరుకోలేదంటారు… హెడ్గెవార్ జీవిత కృషిపై పుస్తకం రాసిన రాకేష్ సిన్హా. పదహారేళ్ల ప్రాయంలోనే స్వదేశీ ‘దేశబంధు సమాజ’ పేరిట ఒక సంవాద బృందాన్ని ఏర్పాటు చేసి వర్తమాన రాజకీయ స్థితిగతులను చర్చించారాయన.

ఏ వ్యక్తికైనా జీవితం సార్ధకత అతను ఎంత కాలం జీవించారన్నదానిపై ఉండదు. ఏమి సాధించారన్న దానిపైనే ఉంటుంది. డాక్టర్జీ తన ఆలోచనల ద్వారా తన పనుల ద్వారా, ఎంచుకొన్న జీవన విలువల ద్వారా మన దేశాన్ని, మన సంస్కృతి నాగరికతలను దానికి గుర్తింపునిచ్చే విలక్షణమైన అంశాలను సంఘటన అనే సూత్రంలో అభివ్యక్తం చేశారు. దానికి ఆయన ఆరఎసఎస్ అని పేరు పెట్టారు. సంఘాన్ని ప్రారంభించాక కేవలం 15 సంవత్సరాలే జీవించినా దేశహితానికి, సంఘకార్యానికి మధ్య సజీవ సంబంధాన్ని ఆయన నెలకొల్పారు. అందువలననే సంఘం ప్రారంభించాక కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని ఈ శ్రేష్ఠత్వాన్ని, ఆలోచనలలోని పవిత్రతను, సమర్పణ భావాన్ని ఈ సమాజానికి అందించారు. మృత్యువు ఆయన నశ్వరమైన ఈ శారీరాన్ని మాత్రమే విడదీయగలిగింది. కాని ఆయన ఆలోచనలు మూర్తిత్వాన్ని సంతరించుకొన్నదై సంఘ శక్తి రూపంలో సమాజ జీవితంలోనూ విడదీయరాని అంశాలుగా రూపుదిద్దుకొన్నాయి. అవి నానాటికీ వృద్ధి చెందుతూ ప్రభావవంతంగా వెలుగొందడం ఈ శతాబ్ది వేళ సమాజమంతా గమనిస్తున్నది.

హెడ్గెవార్ పుట్టింది నాగ్‌పూర్‌లో అయినా…వారి పూర్వీకులది నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదీ (త్రివేణి సంగమ) తీరంలో గల చారిత్రక గ్రామం కందకుర్తి. ముస్లిం దండయాత్రలను, వారిని ప్రతిఘటించిన దేశభక్త పాలకులను చూసిన గ్రామమది. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు కూడా కందకుర్తి గ్రామాన్ని సందర్శించారని చరిత్ర చెపుతుంది. రాణీ అహల్యాబాయి హోల్కర్ కొంతకాలం కందకుర్తిలో విడిది చేశారని ప్రతీతి.

కందకుర్తి గ్రామ చారిత్రక ప్రాధాన్యతను మన పాలకులు గుర్తించలేదు. అక్కడి చరిత్ర ఆధారాలను నిర్లక్ష్యం చేశారు. స్థానిక ప్రజలు, స్వయంసేవకుల పూనికతో 32 సంవత్సరాల క్రితం డా. కేశవ బలిరాం హెడ్గెవార్ పూర్వీకులకు చెందిన చిన్నపాటి స్థలంలో వారి పేరుతో స్మృతిమందిరం నిర్మించారు. ఐచ్ఛికంగా నిర్మించిన స్ఫూర్తి కేంద్రాన్ని మరింత విస్తారించాలని ఆరఎసఎస్ సంకల్పించింది.

కేవలం స్వయంసేవకులే కాదు దేశ ప్రజలు స్ఫూర్తి పొందేలా, హెడ్గెవార్ చేసిన సేవలు తెలుసుకునేలా, మన సాంస్కృతిక గతాన్ని అవగతం చేసుకునేలా ఓ మహత్తర స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్ణయించడంతో సేవాభారతి ఆధ్వర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమం కొన్నేళ్ల క్రితం మొదలై ఈ ఏప్రిల్ 11న పూర్తయింది.

కందకుర్తి గ్రామంలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ప్రారంభించారు. భవిష్యత్ తరాలకు డా.హెడ్గెవార్ చరిత్ర-కృషి తెలియాలని మోహన్ భాగవత్ ఈ సందర్శంగా అన్నారు. భాష, కులం, ప్రాంతం అనే భేదభావాలను తొలగించాలని పిలుపునిచ్చారు.

ఈ స్ఫూర్తిమందిరం భారతీయ యువతకు ఏకైక ఆలంబన.

ఉగ్రవాదం, తీవ్రవాదం, విశృంఖలత పేట్రేగిపోతున్న వేళ డా.హెడ్గెవార్ భారత విద్యార్థి, యువతకు ఏకైక ఆలంబన. ఒక సాంస్కృతిక ఆశ్వాసన, సనాతన స్ఫూర్తి, జాతీయ భావనల మేళవింపుగా హెడ్గెవార్ కృషి కొత్త తరానికి అర్థం కావడంలో కందకుర్తిలోని కేశవ స్ఫూర్తి మందిరం విశేషమైన పాత్ర పోషిస్తుంది. గాఢమైన జాతీయవాదాన్ని, ప్రబలమైన దేశభక్తిని, సమున్నతమైన సమరసత సందేశాన్ని అందించి, దేశ యువతను.. సేవాభావం వైపు నడిపించగ లిగేదిగా ఈ మందిరం నిలుస్తుంది. సంఘ శతాబ్ది వేళ రూపుదిద్దుకొన్న ఈ మందిరం కేవలం ఒక పర్యాటక ప్రదేశంలా కాకుండా… మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో దేశభక్తి తాదాత్మ్యాన్ని పెంపొందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE