భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్న ఏడు కీలక ప్రయోగాలలో ఒకటైన గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాల క్షీణతపై అధ్యయనం, వృద్ధులలో వయసు సంబంధిత కండరాల క్షీణత-సార్కోపీనియా చికిత్సకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో బయోటెక్నాలజీ విభాగం- డీబీటీ సహకారంతో, నాసా సహాయంతో నిర్వహిస్తోంది.
మైయోజెనెసిస్ ప్రయోగం
శుక్లా నిర్వహిస్తున్న మైయోజెనెసిస్-ఇస్రో ప్రయోగం మానవ అస్థిపంజర కండరాల కణాలు గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఎలా ప్రవర్తిస్తాయో, వాటి పునరుత్పాదన సామర్థ్యం, మైటోకాండ్రియల్ జీవక్రియలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుంది. ఈ ప్రయోగంలో కండరాల స్టెమ్ కణాలను వృద్ధి చేసి, వాటిని ఐఎస్‌ఎస్‌లో గురుత్వాకర్షణ లేని పరిస్థితులలో పరీక్షిస్తారు. ఈ అధ్యయనం దీర్ఘకాల అంతరిక్ష యాత్రలలో కండరాల క్షీణతను నివారించే మార్గాలను కనుగొనడంలో సహాయపడుతుంది.
గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాలు భూమిపై సాధారణంగా చేసే పనిని చేయనవసరం లేకపోవడంతో, కండరాల క్షీణత-అట్రోఫీ సంభవిస్తుంది. ఈ పరిస్థితి వృద్ధులలో సార్కోపీనియా అనే వయసు సంబంధిత కండరాల క్షీణతను పోలి ఉంటుంది. ఇది 60 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కనిపిస్తుంది. అంతరిక్షంలో కండరాల క్షీణత చాలా వేగంగా, కొన్ని రోజులలోనే సంభ విస్తుంది. ఇది భూమిపై దశాబ్దాలలో జరిగే క్షీణతకు సమానంగా ఉంటుంది.
వృద్ధులకు ఎలా ఉపయోగపడుతుంది?
ఈ ప్రయోగం భూమిపై వృద్ధులలో సార్కో పీనియా చికిత్సకు కొత్త ఆవిష్కరణలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం సార్కోపీనియాకు వ్యాయామం, జీవనశైలి మార్పులు, పోషకాహారం తప్ప ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ -ఎఫ్‌డీఏ ఆమోదిత ఔషధాలు లేవు. అయితే ఈ ప్రయోగంలో శుక్లా కండరాల కణాలపై కొన్ని ఔషధాలను పరీక్షిస్తు న్నారు. ఇవి కండరాల క్షీణతను నివారించడంలో లేదా పునరుత్పాదనను మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఈ ఔషధాలు కండరాల కణాలు కొవ్వుగా మారకుండా నిరోధించడంతో పాటు, గురుత్వాకర్షణ లేని వాతావరణంలో వచ్చే కొన్ని ప్రతికూల ప్రభావాలను తగ్గించాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ ప్రయోగం ద్వారా కండరాల పునరుత్పా దనలో మైటోకాండ్రియా (కణాల శక్తి కేంద్రాలు) పాత్రను అర్థం చేసుకోవడంలో కీలక సమాచారం లభిస్తుంది. అంతరిక్షంలో కండరాల క్షీణతకు కారణమయ్యే జన్యు మార్పులు, జీవక్రియ మార్పులను అధ్యయనం చేయడం ద్వారా వృద్ధులలో కండరాల బలం, పనితీరును కాపాడే కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చు. ఈ పరిశోధన ఫలితాలు కండరాల వ్యాధులు లేదా దీర్ఘకాలం మంచానికి పరిమితమై పోయి కండరాల క్షీణతను ఎదుర్కొనే రోగులకు కూడా ఉపయోగపడవచ్చు.
శుక్లా మిషన్
గ్రూప్ కెప్టెన్ శుక్లా జూన్ 25, 2025న నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఆయన అక్సియం మిషన్ 4లో మిషన్ పైలట్‌గా పనిచేస్తు న్నారు. ఇందులో అమెరికా, పోలాండ్, హంగరీ నుంచి మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. 14 రోజుల ఈ మిషన్‌లో, ఆయన మొత్తం 60 సైన్స్ ప్రయోగాలు, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొంటారు. వీటికి భారతదేశం సహా 31 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఈ ప్రయోగం దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఆరోగ్య వ్యూహాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో కూడా ఒక కొత్త అధ్యాయానికి పలకవచ్చునని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
సామాజిక ప్రభావం
ఈ పరిశోధన ఫలితాలు వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించ గలవు. సార్కోపీనియా వల్ల కింద పడే వృద్ధులకు అయ్యే గాయాలు ఆసుపత్రి ఖర్చులను పెంచుతాయి. కొత్త చికిత్సల ద్వారా కండరాల బలాన్ని కాపాడ గలిగితే వృద్ధులు స్వతంత్రంగా జీవించగలుగు తారు. ఆరోగ్య సంరక్షణ వ్యయాలు తగ్గుతాయి.
అంతేకాకుండా ఈ ప్రయోగం భారతదేశ యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు అంతరిక్ష జీవ విజ్ఞాన పరిశోధనలో పాల్గొనేందుకు ప్రేరణనిస్తుంది. శుక్లా ఈ మిషన్ ద్వారా భారతదేశ యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. శాస్త్రీయ ఆవిష్కరణలు మానవ జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తాయో చూపిస్తారు. ఐఎస్‌ఎస్ నుంచి భూమికి చేరుకునే మైయోజెనెసిస్ ప్రయోగం ఫలితాల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. కండరాల క్షీణతను నివారించే ఔషధాలు, చికిత్సలను అభివృద్ధి చేయడానికి పనిచేస్తారు. 2025 చివర్లో మరిన్ని కండరాల చిప్‌లను ఐఎస్‌ఎస్‌కి పంపడం ద్వారా ఈ పరిశోధనను విస్తరించే ప్రణాళిక ఉంది. ఈ రెండవ దశ ప్రయోగంలో కండరాల పునరుత్పా దనను మెరుగుపరిచే కొత్త ఔషధ సమ్మేళనాలను పరీక్షించే అవకాశం ఉంది.
ఈ మిషన్ ద్వారా భారతదేశం అంతరిక్ష పరిశోధనలో, శాస్త్రీయ ఆవిష్కరణలలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.
– డాక్టర్ కాకాని పృధ్వీరాజు
సంఘటనా కార్యదర్శి,
ఆరోగ్యభారతి, ఆంధప్రదేశ్