బస్సు ప్రమాదాలు అమాయకుల ప్రాణాలను బలిగొనడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించి, తెలుగు రాష్ట్రాల్లో దందా సాగిస్తున్న ట్రావెల్స్ ఆగడాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆయా వాహనాలు తిరిగే రాష్ట్ర ప్రభుత్వాలే వాటికి రిజిస్ట్రేషన్లు చేసేలా,పర్మిట్లను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ప్రభుత్వానికి సూచించింది.
‘ఒక దేశం-ఒకే విధానం’ (వన్ నేషన్-వన్ పర్మిట్) మోటారు వాహనాల చట్టం ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు వరంగా, ప్రయాణికులకు ప్రాణ సంకటంగా పరిణమించింది. ఈ జాతీయ విధానం కింద వాహనాల యజమానులు ఆలిండియా పర్మిట్ కోసం కేవలం రూ. రెండు లక్షలు చెల్లిస్తే, అందులో సగం రాష్ట్రాలకు పంచుతామనడంతో రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ విధానం వల్ల దేశంలో ఎక్కడైనా బస్సు(ల)ను రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా నడుపుకునే అత్యంత అనుకూలమైన వెసులుబాటు ప్రైవేట్ ఆపరేటర్లకు లభించింది. లాభాలను విపరీతంగా పెంచు కునేందుకు బస్సు ఆపరేటర్లు అత్యంత స్వార్థపూరిత ఆలోచన చేశారు. కఠిన నిబంధనలతో పాటు, త్రైమాసిక పన్ను సుమారు రూ. తొంభై వేల వరకు గల రెండు తెలుగు రాష్ట్రాల వంటి వాటిని ఉద్దేశ పూర్వకంగా పక్కనపెట్టి, పన్నుల భారం అత్యంత తక్కువగా (ఏడాదికి రూ. 50 వేలు మాత్రమే), నామమాత్రపు నిబంధనలు గల ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైపు వారు మొగ్గుచూపారు. అలా పైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రూ. కోట్లలో లాభాలు గడించగా, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడింది.
మరోవంక, బస్సుల భద్రతపై స్థానిక రవాణా శాఖ అధికారుల నియంత్రణ పూర్తిగా లోపించింది. రిజిస్ట్రేషన్ ఒక సుదూర రాష్ట్రంలో, బస్సుల నిర్వహణ మరో రాష్ట్రంలో ఉండడంతో ఆయా బస్సుల ‘కండిషన్’ ఎలా ఉంది? వాటికి సకాలంలో ‘ఫిట్‌నెస్’ పరీక్షలు జరుగుతున్నాయా? తదితర అంశాలను పర్యవేక్షించే నాథుడే కరవయ్యాడు. పాతబడిన, సరైన కండిషన్‌లో లేని బస్సులను యథేచ్ఛగా తిప్పడంతో ప్రమాదాలు విపరీతంగా పెరిగాయి. బాధిత రాష్ట్రాలు ఈ తీవ్రమైన సమస్యలన్నింటినీ ఆధారాలతో పదేపదే చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లో పర్మిట్లు జారీ విధానాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు
ప్రస్తుతం కనువిందు చేస్తున్న స్లీపర్ బస్సులు ప్రయాణికులకు కేవలం విలాసానికి, రాత్రి వేళల్లో సౌకర్యవంతమైన ప్రయాణానికి చిహ్నాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు గంటల తరబడి ప్రయాణించే సామాన్యులు కూడా ఎంతో సుఖంగా, హాయిగా నిద్రపోతూ గమ్యస్థానం చేరుకోవచ్చన్న భావనతో ఈ బస్సులను విపరీతంగా ఆశ్రయిస్తున్నారు. అయితే, పైకి ఎంతో ఆకర్షణీ యంగా కనిపించే ఈ విలాసం వెనుక అత్యంత భయానకమైన, ప్రాణాంతకమైన ముప్పు నిరంతరం పొంచి ఉందని తరచుగా జరుగుతున్న ఘోర రహదారి ప్రమాదాలు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాధాన్యతను కేవలం ఒక వ్యాపార అవకాశంగా మలచుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, పరోక్షంగా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
శాస్త్రీయ కోణంలో, వాహన నిర్మాణ ప్రమాణాల పరంగా చూస్తే, స్లీపర్ బస్సుల నిర్మాణం రహదారి భద్రతా నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. బెర్తుల ఏర్పాటుకు వీలుగా బస్సు ఎత్తును అసాధారణంగా పెంచడం వల్ల బస్సు గురుత్వాకర్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) తీవ్రంగా దెబ్బ తింటుంది. పర్యవసానంగా, ప్రమాదకరమైన మలుపుల వద్ద లేదా డ్రైవర్ అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు బస్సు అదుపు తప్పి బోల్తా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ‘సాధారణ సీటింగ్ బస్సులతో పోలిస్తే స్లీపర్ బస్సులు బోల్తా పడే ప్రమాదం 40 శాతం వరకు అదనంగా ఉంటుంది. సాధారణ సీటర్ బస్సుల్లో కూర్చుని ప్రయాణించేటప్పుడు సీటు బెల్టులు ధరించే అవకాశం ఉంటుంది. కానీ స్లీపర్ బస్సుల్లో పడుకున్నప్పుడు ఎలాంటి కనీస రక్షణ కవచం ఉండదు. బస్సు అకస్మాత్తుగా ఆగినా, లేదా బోల్తా పడినా, ప్రయాణికులు తమను తాము ఏమాత్రం నియంత్రించుకోలేక లోపల ఉన్న కఠినమైన ఇనుప రాడ్లకు లేదా బస్సు గోడలకు బలంగా తగిలి ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్రంగా గాయ పడటమో జరుగుతోంది’ అని రవాణా రంగ నిపుణుల కచ్చితమైన అంచనాలతో చెబుతున్నారు. దేశంలో నడుస్తున్న ప్రైవేట్ బస్సుల్లో సుమారు 80 శాతానికి పైగా ప్రభుత్వ కనీస నిబంధనలను తుంగలో తొక్కు తున్నాయన తెలుస్తోంది. బస్సు బాడీ నిర్మాణంలో వినియోగించే అత్యంత ఆందోళన కరమైన విషయం ఏమిటంటే, నాణ్యత లేని, సులభంగా మండే సామగ్రిని వాడడం అత్యంత ఆందోళనకరమైన అంశం.నాసి రకం• మెటీరియల్ అగ్నిప్రమాదాల సమయంలో వేగంగా కరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రయాణికులకు బయటపడే కనీస అవకాశం కూడా దక్కడం లేదు. ఇరుకైన సందులు, నిబంధనలకు విరుద్ధంగా నిండా నింపిన లగేజీ కారణంగా అత్యవసర ద్వారాలు పూర్తిగా మూసుకుపోతున్నాయి. బస్సుల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉన్నా, వాటిని ధ్వంసం చేసి మృత్యువేగంతో దూసుకుపోతున్నారు. దీనికి తోడు, ప్రైవేట్ ఆపరేటర్లు ఖర్చులు తగ్గించుకునేందుకు, తక్కువ జీతాలకు ఏమాత్రం అనుభవం లేనివారిని డ్రైవర్లుగా నియమించు కుంటున్నారు. వారికి కనీస విశ్రాంతి లేకుండా వరుస ట్రిప్పులు వేయడంతో నిద్రలేమితో స్టీరింగ్ పడుతున్నారు.
ప్రమాదాల పరంపర
మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు గణాంకాలను పరిశీలిస్తే, ఆంధప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యంత ఆందోళ నకరంగా పెరిగాయి. ఆధునిక రవాణా సౌకర్యాలు మెరుగు పడుతున్నాయని సామాన్యులు భావిస్తున్న తరుణంలో,జాతీయ రహదారులసౌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారుతుండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, కేవలం రెండు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క ఆంధప్రదేశ్‌లోనే సుమారు వందకుపైగా అత్యంత తీవ్రమైన బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
వందలాది ప్రయాణికులు ప్రాణాలను కోల్పోగా, దాదాపు 2,500 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో శాశ్వత దివ్యాంగులుగా మారడం అత్యంత విషాదకరం. మృతుల్లో ఎక్కువ శాతం యువకులు, కుటుంబాలకు ఏకైక ఆధార•మైన కుటుంబ యజమానులు ఉండటం వల్ల ఆయా కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో వీధిన పడ్డారు. జాతీయ రహదారులు, ముఖ్యంగా ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్•-44లతో పాటు మారుమూల ప్రాంతాల్లోని ఘాట్ రోడ్లు ఈ మారణ హోమానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి.
రాష్ట్రంలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనలను పరిశీలిస్తే… మార్చి 26 వేకుమజామున ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను అతివేగంగా ఢీకొనడంతో 4 మంది ప్రయాణికులు సజీవ దహనంకాగా, 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావలి ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, డివైడర్‌ను దాటి దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తేలింది. బాపట్ల జిల్లా అద్దంకి జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి వస్తున్న బస్సు టైరు పేలి, అదుపుతప్పిన ఘటనలో అయిదుగురు, అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడి తొమ్మిది మంది, అనంతగిరి ఘాట్ వద్ద ఆరుగురు పర్యాటకులు ప్రాణాలు విడిచారు. జాతీయ స్థాయిలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సెప్టెంబర్ 14న రాజస్థాన్‌లో బస్సు దగ్ధమై అందులోని 57 మందిలో 20 మంది సజీవ దహనమయ్యారు.ఈ వివరాలు మచ్చుకు కొన్ని మాత్రమే.
ఆస్కీ సూచన
ఈ వరుస బస్సు ప్రమాదాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టకేలకు తీవ్రంగా స్పందించాయి. కేవలం విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకునే సంస్కృతికి స్వస్తి పలుకుతూ, ఈ ప్రమాదాలకు గల మూల కారణాలను అన్వేషించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ ప్రతిష్టాత్మకమైన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) తో బస్సు బాడీల తయారీ, సాంకేతిక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర అధ్యయనం చేయించింది. ఆస్కీ తన నివేదికలో ప్రభుత్వానికి అత్యంత కఠినమైన, కచ్చితమైన సూచనలు చేసింది. ప్రధానంగా…స్లీపర్ బస్సులను తక్షణమే నిషేధించాలని, రాబోయే 22 నెలల వ్యవధిలో ఒక్క స్లీపర్ బస్సు కూడా రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు అమలు చేయాలని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ రవాణా రంగం, అభివృద్ధి చెందిన దేశాల విధానాలను పరిశీలిస్తే… అమెరికా, బ్రిటన్లతో పాటు చైనా, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాలు ప్రయాణికుల భద్రతే ఏకైక ప్రాధాన్యంగా స్లీపర్ బస్సులను ఎన్న్పడో నిషేధించాయి. చైనాలోని యన్‌యాన్‌లో 2012 మార్చిలో ఓ డబుల్ డెకర్ స్లీపర్ బస్సు మిథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టి 36 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఒకే ఒక్క ప్రమాదంతో మేల్కొన్న ఆ దేశ ప్రభుత్వం, డబుల్ డెకర్ స్లీపర్ బస్సుల తయారీపైనే శాశ్వత నిషేధం విధించింది. అంతేకాకుండా డ్రైవర్లు నిద్రమత్తుకు లోనుకాకుండా అర్ధరాత్రి నుంచి వేకువజాము5 గంటల వరకు బస్సులు నడపకూడదనే నిబంధనను అమలు చేస్తోంది. మన దేశంలో సైతం స్లీపర్ , సీటర్ బస్సుల కోసం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డస్ (ఏఐఎస్), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌టీ) అనేక నిబంధనలు పేర్కొన్నాయి.
ప్రతి స్లీపర్ బస్సులో కనీసం 4 అత్యవసర ద్వారాలు ఉండాలని, ప్రయాణికులు నడిచే మార్గం 40-60 సెంటీమీటర్లు, బెర్తులు కనీసం 1,800 మిల్లీమీటర్ల పొడవు, 600 మి.మీ. వెడల్పుతో ఉండాలని స్పష్టం చేశాయి. ముఖ్యంగా, ప్రమాదం సమయంలో ప్రయాణికులు వేగంగా బయట పడలేకపోవడానికి ప్రధాన కారణమవుతున్న డ్రైవర్ క్యాబిన్‌ను ప్రయాణికుల బెర్తులను విభజించే డోర్ (తలుపు)ను తక్షణమే తొలగించాలని ఆదేశించాయి. ప్రతి బస్సులో కనీసం పది కిలోల సామర్థ్యం గల అగ్నిమాపక పదార్థాలు కచ్చితంగా ఉండాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే బస్సు లేఅవుట్ డ్రాయింగ్ తప్పనిసరిగా జత చేయాలని, జీపీఎస్, సీసీటీవీ పర్య వేక్షణ ఉండాలని సూచించాయి. ఆస్కీ అందజేసిన ఈ సమగ్ర నివేదికను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల ఈ రక్త వ్యాపారాన్ని అరికట్టడానికి, ఈ సూచనలన్నీ తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. రవాణా వ్యవస్థలో ఈ సమూల మార్పులు వస్తేనే అమాయ కుల ప్రాణాలకు నిజమైన రక్షణ లభిస్తుంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్