రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి ముగిసింది. మున్సిపల్‌ ఎన్నికల సందడి తగ్గిపోయింది. ఎన్నికల వేడి చల్లారింది. అసలు వేసవి మొదలయ్యింది. కానీ, అందరూ మర్చిపోయిన మరో ఎన్నికల తంతు తలుపు తట్టబోతోంది. మరి.. ఈసారి వేదిక తెలంగాణలోని గ్రామాలు. ఇప్పటికే ఓసారి పంచాయతీ ఎన్నికల సందడి ముగిసింది. మధ్యలో పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పోరు మోగింది. ఇప్పుడు మరోసారి గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు ఓటు వేసే సందర్భం రాబోతోంది. రాష్ట్రంలోని 566 మంది జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నగారా మోగబోతోంది. అయితే, ఈ ఎన్నికల తంతు ఎప్పుడు మొదలవుతుందో  అన్న అంశం సందిగ్ధంగా మారింది. ఓవైపు.. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అవసరమైన  ఏర్పాట్ల కోసం అధికారులకు మార్గదర్శకాలు జారీచేసింది. దీంతో, పరిషత్‌ ఎన్నికల పోరు సమీపించిందని అంతటా చర్చ మొదలయ్యింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ వేసవి గడవనీ..అన్నట్లుగా లీకులిచ్చింది. దీంతో, పరిషత్‌ ఎన్నికలపై క్లారిటీ రావడం లేదు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతల్లో ఎన్నికల సందడి అప్పుడే చిన్నగా మొదలయ్యింది.

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ‌ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా పదవులకు పోటీ చేయడానికి ఆసక్తిగలవారు, ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. కానీ… రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక కీలక మంత్రి మాత్రం ‘ఇప్పట్లో ఈ ఎన్నికలు జరగవు’ సంకేతాలిచ్చారు. దీంత ఓ జిల్లా పరిషత్‌, ‌మండల పరిషత్‌ల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా? లేవా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రత్యేకాధికారులే దిక్కు!

2019 మే నెలలో మూడు దశల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజేతలైన ప్రజా ప్రతినిధుల పదవీకాలం గత ఏడాది జూన్‌తో ముగిసింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధి కారులను నియమించింది. వారి అజమాయిషీలోనే పాలన సాగుతోంది. సాధారణంగా పదవీకాలం ముగిసిన వెంటనే లేదా దానికి కొద్దిరోజుల ముందు నుంచే ఎన్నికల పక్రియ మొదలు కావాలి. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పూర్తయి కొత్త పాలక వర్గాలు కొలువుదీరాలి. కానీ, పరిషత్‌ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అంతగా దృష్టి సారించడం లేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. నామినేషన్ల పక్రియ మొదలైంది. కానీ, అప్పుడే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల పక్రియ కోర్టు ఆదేశాల మేరకు మధ్యలోనే నిలిచి పోయింది. నాటి ఈ ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది.

హైకోర్టు అనుమతి లభించడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమ మైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తమ కార్యాచరణ మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ఓటర్ల జాబితా తయారీకి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, ‌మేడ్చల్‌-‌మల్కాజిగిరి మినహా మిగిలిన 31 జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశ వెళ్లింది. జూలై 10,2025 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు నవీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా అదనపు ఓటర్లను గుర్తించాలని, వారిని గ్రామ పంచాయతీలు, పోలింగ్‌ ‌కేంద్రాల వారీగా వర్గీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు ఆదేశించింది. ఏప్రిల్‌ 23‌వ తేదీలోగా డేటాలోని వ్యత్యాసాలను నివేదించాలని, ఆ తర్వాత ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. బ్యాలెట్‌ ‌బాక్సుల తయారీకి కూడా పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ పరిణామాలు ఎన్నికల నిర్వహణ పక్రియ మొదలైనట్లే అన్న సంకేతాలు ఇచ్చాయి. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు వెలువడగానే పల్లెల్లోని నాయకుల్లో సందడి మొదలైంది. కొందరు ప్రచారం రంగంలోకి కూడా దిగారు.

ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి

కానీ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఈ హడావిడికి బ్రేక్‌ ‌పడింది. ఎండల తీవ్రత సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, వానాకాలం మొదలైన తరువాత ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎన్నికల కోడ్‌ ‌వస్తే అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుందని, ఇప్పట్లో అలాంటి స్థితి వద్దని కూడా ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. మరో అధికారి మరింత స్పష్టతనిస్తూ, ‘మేలో ఎన్నికలు నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేయలేదని, ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినప్పుడు వెంటనే సిద్ధంగా ఉండేందుకు మాత్రమే పనులు మొదలుపెట్టాం’అని చెప్పారు.

మే నుంచి జూలై… అక్టోబర్‌?

‌పరిషత్‌ ఎన్నికలు మేలో నిర్వహించాలని ప్రభుత్వం తొలుత అనుకుంది. పరీక్షలకు అంతరాయం కలగకుండా పోలింగ్‌ ‌నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. జనాభా గణన అనే కొత్త అడ్డంకి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ (‌సర్‌) ‌పక్రియ వాయిదా పడింది. ఏప్రిల్‌ 26 ‌నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌, ‌మే 11 నుంచి జూన్‌ 9 ‌వరకు జనాభా గణన నిర్వహించనున్నారు. బూత్‌ ‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఈ కాలంలో పూర్తిగా జనాభా గణనలో నిమగ్నమవుతారు. దాంతో ఎన్నికల యంత్రాంగం మే నెలలో ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉండదు. ఈ నేపథ్యంలో జూన్‌ ‌చివరి వారం లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించా లని ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. కానీ, ఇక్కడా అడ్డంకులు ఉన్నాయం టున్నారు. జూన్‌ ‌నెల చివరి వరకు ఎండల భగభగ తగ్గదు. అంత వేడిలో ఎన్నికలు నిర్వహించడం ప్రజలకు కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. మరి జూలైలో చూసినా అప్పటి పరిస్థితి అప్పటిది. అప్పటికి వర్షాకాలం మొదలవుతుంది. రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేయాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే షెడ్యూల్‌ ‌ప్రకటించవచ్చని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరైతే జూలైలోనూ కుదరకపోతే అక్టోబర్‌లో నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.

తగ్గిన స్థానాలు

2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల సంఖ్యలో మార్పులు జరిగాయి. పట్టణీకరణ పెరగడంతో పలు గ్రామ పంచాయతీలు పురపాలికలు, నగరపాలికల్లో విలీన మయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 44 ఎంపీటీసీ స్థానాలు, 4 జడ్పీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాను పూర్తి అర్బన్‌ ‌జిల్లాగా ప్రకటించారు. ఫలితంగా ఆ జిల్లా పరిషత్‌ అనివార్యంగా తొలగింపునకు గురైంది. హైదరాబాద్‌ ‌జిల్లాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎన్నికలు ఇప్పుడు 31 జిల్లా పరిషత్‌లకే జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ గత ఏడాది జూన్‌ ‌నుండి ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నాయి.

మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష!

ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రతినిధులను ఎన్నుకునే పక్రియగా మాత్రమే చూడకూడదు. తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకూ ఇవి అగ్నిపరీక్ష వంటివి. కాంగ్రెస్‌ ‌పార్టీకి తమ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఇవి చివరి అవకాశం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కూడా గెల్చుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. తమ సంక్షేమ పథకాలు, పాలనపై ప్రజల తీర్పు ఈ ఎన్నికల ద్వారా నిరూపించు కోవాలని చూస్తోంది. స్థానిక సంస్థలపై పట్టు సాధిస్తేనే క్షేత్రస్థాయిలో పార్టీ నెట్‌వర్క్ ‌బలపడుతుందని నమ్ముతోంది.

అటు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చూస్తే ఈ ఎన్నికలు వారికి ‘జీవన్మరణ’ సమరంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ ‌కొంత చతికిలపడింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత దిగజారిపోయింది. తమ సంప్రదాయ ఓట్ల కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించేందుకు ఈ ఎన్నికలు ఒక అవకాశంగా మలుచుకోవాలని బీఆర్‌ఎస్‌ ‌చూస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు తర్వాత ఏర్పడిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తోంది. పార్టీ అంతర్గత క్యాడర్‌ను తిరిగి ఏకం చేయడానికి ఈ ఎన్నికలు అవసరమని గులాబీ నాయకత్వం భావిస్తోంది.

ఇక, కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ.. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీకి గ్రామీణ వ్యాప్తి లక్ష్యంగా ఈ ఎన్నికలను వినియోగించుకోవాలనుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించే బీజేపీ, గ్రామీణ తెలంగాణలో కూడా పాగా వేయాలని చూస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో ఈ ఎన్నికలు తమకు బ్రాండ్‌ ‌బిల్డింగ్‌ అవకాశంగా కమలం పార్టీ భావిస్తోంది. ప్రతి మండలంలో పార్టీ జెండా పాతుకు పోతేనే భవిష్యత్‌ అసెంబ్లీ ఎన్నికలకు పునాది పడుతుందని వ్యూహకర్తలు అంటున్నారు.

జాబితా వేరు-నిర్ణయం వేరు!

ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం ఏమిటంటే.. ఎన్నికల కమిషన్‌ ‌సన్నద్ధత వేరు, ప్రభుత్వం ఆలోచన వేరు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌స్వతంత్ర సంస్థ. ఓటర్ల జాబితా తయారీ దాని బాధ్యత. కమిషన్‌ ఆదేశాలు, కార్యాచరణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకే అన్నది క్లియర్‌. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కమిషన్‌కు అనుకూల సంకేతాలు రావాలి. ప్రభుత్వ ఆలోచన వేరే విధంగా ఉందని మంత్రి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో కమిషన్‌ ఉత్తర్వులు ఉన్నా.. ఎన్నికల తేదీలు ఖరారు కావడానికి ఇంకా సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.

ఈ మొత్తం సందిగ్ధంలో అత్యంత ఇబ్బంది కరమైన స్థితిలో ఉన్నది స్థానిక నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియక, ఎప్పుడు నోటిఫికేషన్‌ ‌వస్తుందో తెలియక నిరీక్షణతో రోజులు గడుపుతున్నారు. ఒకవైపు ఎన్నికల కోసం ముందస్తు ఖర్చులు చేయాలని ఒత్తిడి వస్తోంది. మరోవైపు ఎన్నికలే రాకపోతే ఆ పెట్టుబడి వృథా అవుతుందనే భయం ఉంది. పోటీ చేయడానికి మాత్రం అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఈ అయోమయం మధ్య మండల, జిల్లా స్థాయి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE