ఎండలు ప్రకృతిలోని పర్యావరణంలో సహజంగా జరిగే రుతు ప్రభావమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదవడం మనలనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. వేసవి వస్తుందంటేనే మనమందరం భయపడే స్థితికి చేరుకున్నాం. ఈ పరిస్థితులు నెలకొనడానికి ఎన్నో కారణాలున్నా, ముఖ్యమైన కారణాలను మనం విశ్లేషిస్తే ప్రకృతి ప్రకోపం తో పాటు జరుగుతున్న మానవ తప్పిదాలు ముఖ్య కారణాలుగా అనిపించక మానవు. ఎందుకంటే ప్రకృతిపరంగా ఎండలు రావడం సహజమైనప్పటికీ అనేక విధాలుగా పెరుగుతున్న ఆధునికీకరణ కార్యకలాపాలను మానవాళి చేపట్టినందున, మండుతున్న పొయ్యిలో ఆజ్యం పోసినట్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన మనుగడకు గొడ్డలి పెట్టులా మారుతున్నాయనడంలో సందేహం లేదు. మనలో ప్రతి ఒక్కరినీ బాధించే విపరీత వాతావరణ మార్పులెందుకొస్తున్నాయో తెలుసు. అందులో మన ప్రతి ఒక్కరి భాగస్వామ్యముందని తెలుసు. అయినా నిమ్మకు నీరెత్తినట్లుండి పర్యావరణ పరిరక్షణపై కొంత కినుక వహిస్తున్నాం. దానికి ఫలితాన్ని నానాటికి మరింతగా అనుభవిస్తున్నాం.
పెరుగుతున్న ఎండలతో పట్టణాలపై పడుతున్న ప్రభావాలను గమనిస్తే పట్టణ ప్రాంతాలు విపరీతమైన జనాభాతో, కిక్కిరిసిన భవనాలతో, కాంక్రీటు రోడ్లతో, భూమిమీద, ఆకాశంలో ఇంధనాన్ని ఉపయోగించి చేస్తున్న అనేక కార్యకలాపా లతో, చెట్లు నరికి కడుతున్న భవన సముదాయాలతో పట్టణ ప్రదేశాలు ఉష్ణ ద్వీపాలుగా మారుతున్నాయి. ఫలితంగా పర్యావరణం ప్రభావితమౌతోంది. దీంతో అటు పైనుంచి సూర్యుని ద్వారా ప్రసరిస్తున్న ఉష్ణోగ్రతలు, ఇటు కిందినుంచి మనమందరం ఇంధనాలను మండించడం ద్వారా వెలువడుతున్న ఉష్ణోగ్రతలు ఒక నిర్దుష్ట పరిమాణాలలో పెరగక అనూహ్యంగా పెరగడం వలన ఎండలు కాకుండా మండుతున్నాయి. నిజానికి ఈ మంట పెట్టిందేవరు? మనమే. ఫలితమనుభవిస్తున్న దెవరు? అదీ మనమే!. ఇది వరకు ఎండాకాలమొస్తే చెట్లకింద గడిపేవారు. ఇప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలు అన్నీ కాంక్రీట్ బిల్డింగులుగా మారాయి. అందుకే మనం పచ్చదనం, చల్లదనం రెండూ కోల్పోయాము. అభివృద్ధి మంచిదే కానీ అతివృద్ధి మంచిది కాదన్నది నిరూపితమైంది. ఇదే ప్రథమంగా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమస్య. తక్షణంగా, తీక్షణంగా ఆలోచించాల్సిన సమయం ఇదే.
భూమట్టం స్థాయి ఓజోన్ (స్మోగ్)
మనలో చాలామందికి తెలియని విషయమేమి టంటే మనమెంతసేపూ ఓజోన్ ఆకాశంలో మాత్రమే ఉంటుందని అనుకుంటున్నాము. కానీ మనం చేస్తున్న విపరీత పట్టణ కార్యకలాపాలవల్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ (స్మోగ్) భూమిమీద ఏర్పడి, వెరసి మనం ఓజోన్ దుష్ప్రభావంలో కూరుకుపోతున్నాం. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు.
అడుగంటిన భూగర్భ జలాలు
ఎండాకాలమొస్తే బోర్ చప్పుడేకాని నీటి చుక్కలు రావు, కారణం విపరీత నీటి వినియోగం, భూగర్భాలు ఎడారులవటం. ఇదివరకు నగరంలోని చెరువులు, కుంటలు వేసవిలో కూడా కళకళలాడుతుండేవి, ఇప్పుడు ఏవో బీడుపడ్డ పొలాలుగా మారాయి. ఎందుకంటే వాటిలో పడ్డ వర్షపు నీరు, గొంతెండి పోయిన భూగర్భంలో చేరి సెటిలయ్యే లోపల మనం బోర్లతో లాగేస్తున్నాం(ఎక్కువ నీరు తాగడం కంటే కడగడానికి, పరిశ్రమలకే ఖర్చవుతోంది). జీతం పడ్డ మొదటి వారంలోనే డబ్బంతా ఖర్చు చేసినట్లు నీటిని విచక్షణారహితంగా వాడుకుంటున్నాం. అందుకే ఇది ఎండాకాలం కాదు, మనం ఎండగట్టిన కాలం, ఎండిపోయిన జీవనం. పొయ్యి మనమే వెలిగించు కుని దానిమీద పెనం పెట్టి ఆ పెనం మీద మనమే కూర్చున్న వైనం. ఇదివరకు భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నప్పుడు భూమి, పచ్చని చెట్లు వేసవి తాపాన్ని తగ్గించేవి. ఇప్పుడవెక్కడ?చెట్టును గొడ్డలి నరికేసింది, భూమిని సిమెంటు, కంకర మింగేసింది. ఫలితం వేసవితాపం వేడి ప్రతాపం.
ఆరోగ్యం, ఉత్పాదకత కుదేలు
ఎండాకాలంలో వేడిగాలులుండడం సహజ మైనప్పటికీ పెరుగుతున్న భాష్పసాంద్రతలు ఈ వేడిగాలులతో కలిసి శరీరానికి వేడివల్ల కలిగే పీడనాన్ని (ష్ట్రవ•• •తీవ)పెంచి మనిషిని త్వరగా నీరసింపచేస్తాయి. అలాగే గాలిలో తేమ ఉండవలసిన మోతాదు కంటే తక్కువగా ఉన్నా కూడ పొడి వాతా వరణంలో వేడి ఎక్కువగా ఉంటే దానిని ‘‘తట్టుకోలేని వేడిమి’’ (అశీఅ బతీఙఱఙ•శ్రీ ష్ట్రవ•• మీశీఅ•ఱ•ఱశీఅ) అంటారు. ఇది కూడా చాలా అపాయకరమైన స్థితి. మన పట్టణాలలో ఈ పరిస్థితులు కూడా ఎక్కువే. ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, శిశువులు దీనివల్ల చాలా బాధ పడుతు న్నారు. అలాగే పట్టణాలలో ఇదివరకు ఒక చదరపు కి.మీ.కు 10 మంది వృద్ధులుండేవారైతే ఇప్పుడు 50 నుండి 100 వరకు ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి. ఎండలో, ఆరుబయట తిరిగే వారికీ, పనిచేసే వారికీ అనారోగ్యం, నీరసం వల్ల ఉత్పాదకత తగ్గిపోతుంది. కాబట్టి ఎండాకాలంలో పనిచేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా వాణిజ్యసంస్థలు, పరి శ్రమల యాజమాన్యాలు వీరికి తగు వసతులు కల్పించి వీరిని ఆదుకోవాలి.
వేడి రాత్రులు-కాళ రాత్రులు
ఎండాకాలంలో ప్రజలు అత్యంత వేడి రాత్రులు చవి చూస్తుంటారు. ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణాలు, వాటి చుట్టుప్రక్కల ఉన్న గ్రామప్రాంతాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటాయి. దీనికి కారణం కాలుష్యం. అలాగే ఎండవేడిమి వల్ల కాంక్రీట్ వేడెక్కడం, వేడి-సిమెంట్ పొరలలోకి పగలు చేరి, రాత్రుళ్లు అది పరిసరాలలోకి విడుదల అయ్యి రాత్రుళ్లు వేడెక్కుతున్నాయి. కాంక్రీట్ జంగల్ మనమే సృష్టించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి మనమే దుఃఖించడంలో అర్థమే లేదు.
పట్టణాలు విస్తీర్ణం సద్వినియోగం
ఒక 100 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉండాల్సిన ఇళ్లు 10 చదరపు కి. మీ.లలో కడితే ఇలాగే ఉంటుంది. పట్టణ ప్రణాళిక విభాగాలు ఈ విషయం గమనించాలి. తగిన జాగ్రత్తలు తీసు కోవాలి. ఒకే కంచంలో నలుగురు అన్నం తినడానికి కొట్టుకున్నట్లు ఒక చిన్న ప్రాంతంలో అనేక భవనాలు కట్టి వనరులకోసం కొట్టుకుంటున్నాం. పట్టణ ప్రణాళికా విభాగం వారు మితంగా, జనాభాకు అత్యవసరమైన కార్యకలాపాలకు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు ఇస్తే పట్టణంలో లంగ్ స్పేస్ – పర్యావరణ పచ్చదనం పెరుగుతుంది. ‘‘రోడ్డుకిరు వైపులా వాణిజ్య భవంతులు తక్కువ ఉంటే ట్రాఫిక్ సమస్యలు, భూ ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు నిప్పులకుంపటిలో జీవించే బాధ తప్పుతుంది. పట్టణాలను ఇలా ప్రణాళికాబద్ధంగా విస్తృతం చేస్తే కాలుష్యం తగ్గుతుంది. పట్టణంలో ఇప్పుడున్న భవంతులను అదే సంఖ్యలో దూరదూర ప్రాంతాల్లో కడితే ప్రక్కనున్న గ్రామాలూ బాగుపడతాయి. అలాగే ఒకే ప్రాంతంలో కాలుష్యం పెరుగదు. దీనికి తోడు కొందరు చెరువులు, కుంటలు కబ్జాచేసి భవనాలు కడుతున్నారు. కాలనీలలో తారు రోడ్లను తొలగించి కాంక్రీట్ రోడ్లు వేస్తున్నారు. తద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకడానికి స్థలం లేకుండా చేస్తున్నారు. దీనివల్ల ఎండాకాలంలో భూమి వేడెక్కక ఏంచేస్తుంది? ఇది ఎవరినీ విమర్శించడం కానే కాదు, కేవలం సకారాత్మక ఆవేదనతో సూచనలు చేయడమే. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు మనం జాలిపడిన వన్యప్రాణుల జంతుప్రదర్శనశాలే బాగుందనిపిస్తోంది. కనీసం అక్కడైనా జంతువులకు సౌకర్యవంతమైన ఆవాసం, పచ్చదనం, సంరక్షణ ఇంకా కొనసాగుతోంది.
విద్యుత్ సరఫరాతో ఊరట
ఇంతటి విపరీతమైన పరిస్థితులలో కొంత సాంత్వన ఏమిటంటే ఒకవైపు విపరీతమైన పట్టణీకరణను ప్రోత్సహిస్తూనే, మరోవైపు గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు చేసిన ఒక మంచి పనేమిటంటే విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా చేస్తున్నారు. దీనివల్ల ఫ్యాన్లు, ఏసీల ద్వారా కొంత ఉపశమనం లభిస్తోంది. దీనికి ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిం చాలి. లేకపోతే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు అయ్యేది, ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యేది.
పట్టణాల్లో జనసాంద్రత తగ్గాలి
పట్టణాలు ఉన్నది మనం పట్టుకొని వేళ్లాడడానికి కాదు అన్నది ప్రతి ఒక్కరు ఆలోచంచాలి: పట్టణాలు దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక్కడ పనిచేసేవారందరూ దేశ ఆర్ధిక ప్రగతిలో భాగ స్వాములే. అంటే పనిచేసే సమర్థత ఉన్న ఉద్యోగ, వ్యాపారస్థులకు ఇక్కడ ఉండడంలో అర్థముంది. అంతేకానీ రిటైర్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే స్థిరపడి పట్టణ ప్రాంతంలో ఉండే ప్రాకృతిక వనరులమీద ఒత్తిడి పెంచుతున్నారు. తద్వారా జనసాంద్రత పెరిగి పట్టణాలు రద్దీగా ఉంటున్నాయి. నిజానికి రిటైర్ అయి ఏ పనిలేనివాళ్లు గ్రామాలకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపొచ్చు. దీనివల్ల వారికే మంచిది. ప్రభుత్వాలు ఈ దిశలో వయోవృద్ధులకు గ్రామాలలో ముఖ్యంగా వైద్య సౌకర్యాలు కల్పిస్తే పట్టణ పరిస్థితి కొంతవరకు చక్కబడవచ్చు.
వృక్షో రక్షతి రక్షితః
ఈ నానుడిని ఎప్పుడో మరిచిపోయాం. వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే మనమేంచేస్తున్నాం! పట్టణీకరణలో భాగంగా వాటిని తొలగించి వాతా వరణాన్ని వేడెక్కిస్తున్నాం. ఇది వరకు రోడ్ల కిరువైపులా ఉన్న చెట్లు ఇప్పుడు ఒక్కొక్కటీ పలుకారణాల వల్ల కనుమరుగవుతున్నాయి. పాతవి పోతున్నాయి, కొత్తవి రావట్లేదు. ఏవో కొన్ని డిఫెన్స్ ఏరియాలు, ఐడీ•పిల్, బీహెచ్‌ఈఎల్ లాంటి పెద్ద సంస్థల పరిసరాల్లో తప్ప వనాలు, ఉపవనాలు కనుమరుగై ఎండలు మండడానికి ప్రస్తుత ఆధునిక పోకడలు కారణమయ్యాయి. పూర్వం అరణ్యంలో నగరాలుంటే ఇప్పుడు నగరాలలో చిన్న వనాలు మాత్రమే ఉన్నాయి. అవికూడా లుప్తమయితే ప్రజల ఆరోగ్యం పూర్తిగా అధోగతి పాలే.
ఔ•• అనే చట్టం ఇప్పుడుందో లేదో తెలియట్లేదు. అందుకే ఎండలు సమస్త జీవ జంతు జాలాన్నీ అతలాకుతలం చేస్తున్నాయి. ఇలా విశ్లేషించుకుంటూ పోతే ఎండల ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలెన్నిటినో గుర్తించ వచ్చు. ఎండలను నివారించలేం కానీ వాటికి మన విచ్చలవిడి ఆధునికీకరణ కార్యకలాపాలను జోడించి మన జీవితాలను దుర్బరం చేసుకోకపోతే చాలు. మానవాళికి కావలసింది అభివృద్ధి మాత్రమే కాదు, పర్యావరణహితమైన అభివృద్ధి కావాలి. అప్పుడే మనం సౌకర్యవంతంగా జీవించగలుగుతాము అన్నది అక్షర సత్యం. దీన్నే పర్యావరణం పట్ల మన బాధ్యత (ఎకలోజికల్ రెస్పాన్సిబిలిటీ) అంటారు. ఈ దిశలో మనం 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవపు ముఖ్య ఉద్దేశాన్ని, సందేశాన్ని మననం చేసుకోవాలి, ఆచరించాలి. అదేమిటంటే వాతా వరణంలో వస్తున్న విపరీతమైన మార్పులను గమనించి, మనం భవిష్యత్తులో సుఖంగా జీవించడానికి కావలసిన జీవన విధాన మార్పులను త్వరిత గతిన ఆచరణలో పెట్టాలి. లేకపోతే వినాశకాలం (దూమ్స్ డే) త్వరలోనే మనమందరం చూసే అవకాశముంది. ఇదే విషయాన్ని వియన్నాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త హేంజ్ వాన్ ఫోర్‌స్టర్ కూడా హెచ్చరిస్తున్నారు.
‘‘సర్వేజనాః సుఖినోభవంతు’’