నేనింత పిడికెడు మట్టే / కలమెత్తితే నాకు ఓ దేశపు / జెండాకున్నంత పొగరుంది. (శేషేంద్ర)
తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మట్టిని పూజించే సాంప్రదాయం ఉంది. రాయలసీమలోని గండికోట ప్రాంతంలోనూ ఈ ఆచారం ఉంది. కారణాంతరాల వల్ల తమ నేల తల్లిని విడిచి వేరే ప్రాంతాలలో స్థిరపడటానికి వెళ్లినట్లయితే, తమతో పాటు, తమకు తమ కుటుంబాలకు అన్నేళ్లపాటు అన్నం పెట్టిన నేలతల్లితో ఉన్న అనుబంధాన్ని వీడలేక, తమతోపాటు తలో పిడికెడు మట్టిని మూటగట్టుకొని పట్టుకెళ్లి పూజిస్తుంటారు. దీనినే ‘‘పిడి మన్ను పూజ’’ అంటారు.
కొసరాజు రాఘవయ్య ‘‘గండికోట యుద్దం’’ గ్రంథంలో రాయలసీమ గొప్పతనం గురించి రాస్తూ ‘‘నెల మూడువానలు నిండుగా గురిసి / పాడిపంటలు గల్గి పాల్వారూచుండీ / రాజుల కన్గుట్టు రతనాల సీమ/ చేటల వజ్రాలు చెరిగెడి చోట్లు / గోనెల వరహాలు కూరెడి యూళ్లు / పెరికల ముత్యాలు పరగు సంతలును / అంటూ రాయలసీమ ఆనాటి వైభవాన్ని కళ్లకు కట్టారు. పాడిపంటలు, ఖనిజ సంపద, వజ్ర వైడూర్యాలు, ముత్యాలు విరివిగా దొరికేచోటు రాయలసీమ. కవి చెప్పినట్లు ‘‘రాజుల కన్గుట్టు రతనాల సీమ’’ నిజంగానే సుల్తానులకు కన్ను కుట్టింది. గండికోట ఆంధప్రదేశ్‌లోని కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నానది ఒడ్డున ఎర్రమల పర్వతాల మధ్య ఉన్న చారిత్రక దుర్గం. క్రీ।।శ।। 1123లో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోట పెమ్మసాని నాయకుల ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచింది. దీనికి దక్షిణ భారతదేశ చరిత్రలో చారిత్రక ప్రాధాన్యం ఉంది. పెన్నానది పారుతూ ఏర్పడిన గండివలన ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. దీనికే జలదుర్గం, వనదుర్గం, గిరిదుర్గం అనే పేర్లున్నాయి. రాయలకాలం నాటి శిల్ప సంపద ఈ దుర్గంలో ఉండటాన్ని బట్టి దీన్ని రెండవ హంపీ అని కూడా పిలుస్తారు. గండికోటలో గల అనేక దేవాలయాలు విదేశీయుల దండయాత్రల మూలంగా దెబ్బ తిన్నాయి.
కడప మండలంలోని నేటి బద్వేలు, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం తాలూకాలు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి తాలూకా, కర్నూలులోని కోయిలకుంట్ల తాలూకాలను చేరిన ప్రాతం గండికోట సీమ అని ఉజ్జాయింపు లె•క్క, గండి అనే గ్రామానికి చేరువలో నిర్మితమైన కోట కాబట్టి దీనికి గండికోట అనే పేరు వచ్చింది. గండికోట సీమను పాలించిన వారు పెమ్మసాని వారేనని సింగనమల కైపీయత్తులు, గరికపర్రు, తలమంచిపట్నం, తాడిపత్రి యెనమదలలో దొరికిన పెమ్మసాని వారి శాసనాలవలన తెలుస్తున్నది. వీరు కమ్మవారు.
హరిహర బుక్కరాయల కాలంనాటి బెల్లంకొండ దుర్గాధిపతి పెమ్మసాని తిమ్మానాయుడు పెమ్మసాని వారికి మూల పురుషుడుగా కొసరాజు నిర్ణయించారు. ఆనాటి గండికోట పాలకుడైన మిక్కిలినేని రామనాయని భార్య రంగమాంబ ఈ పెమ్మసాని తిమ్మానాయని సోదరి. తిమ్మానాయుని కొడుకు కుమార తిమ్మానాయుడు గండికోటకు ఇల్లరికపు టల్లుడుగా వచ్చాడు. పెమ్మసాని వారు గండికోట రాజ్యానికి మూల పురుషుడయ్యాడు. పెమ్మసాని అనే ఇంటిపేరు పెమ్మ సాహిణి అన్న ప్రసిద్ధ వ్యక్తి నుంచి ఏర్పడిందని కొసరాజు ధృవీకరించారు.
పెమ్మసాని పాలకులలో చిట్టచివరివాడైన చిన తిమ్మానాయుడే గండికోట యుద్దం కావ్యంలో కథానాయకుడు. చిన తిమ్మానాయుడుకు మంత్రిగా చెన్నంరాజు చెన్నప్పరాజు వ్యవహరించాడు. చిన్న తిమ్మానాయుడు శాస్త్రాలతో పాటు శస్త్రాలలోనూ ప్రావీణ్యాన్ని సంతరించుకున్నవాడు. ఈయన బావ నరసింహనాయుడు, గోవిందాంబ చెల్లెలు, చిన్నయ్య కుమారుడు. గోలకొండ నవాబుల వజీరు మీర్‌జుమ్లా హయాంలో ఆడిన కపట నాటకం వల్ల గండికోట పతనం జరిగింది. ఆ తరువాత ఆర్కాటు నవాబు, 18వ శతాబ్దిలో కడప నవాబుల ముట్టడి, హైదరాలీ, తూర్పు ఇండియా కుంఫీణీ వారి ఏలుబడి గండికోట చరిత్రలోని ముఖ్య ఘట్టాలు. గండికోట పతనం తరువాత ఆయన కుమారులు పిన్నయ్య గండికోటను వదిలి బంధుబలగంతో సురక్షిత ప్రాంతాలైన దక్షిణాన ద్రావిడ క్షోణికి గంప సంసారాలతో కదలిపోయారు. కాబట్టి వీరిని గంపకమ్మ వారని పిలుస్తారు. చెంగల్పట్టు మండలంలోని కావేటి రాజపురంలో స్థిరపడగా, వీరి సంబంధీకులు చెట్టుకొకరు, పుట్ట కొకరుగా చెదిరిపోయారు. వారు కూడా తమిళ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. కమ్మవారి వివాహాది శుభకార్యాల్లో పెమ్మసాని తిమ్మనాయని తాంబూలం అని ప్రథమ తాంబూలం తీసి దేవరింట పూజా వేదికపై ఉంచడం నేటికి ప్రసిద్ధం. మీర్‌జుమ్లాకు పొదిలి లింగన్న ఆంధ్రదేశముపై ఆశను పురి కొల్పాడు. ‘‘మహమ్మదీయ ప్రభూ! మాటలేమిటికి, మూడు పూటల తిండి ముట్టు నందరకు / కరువన్న మాట నిఘంటువులో లేదు / రాయలేలిన తెన్గు రాజ్యమందెల్ల / గండికోటయే దండి గుండెగా నుండు బనగాన పల్లెలో వజ్రాలు పండు / మునిమడ్గులో రత్న పుంగనులే మెండు పెమ్మసాని బోదుల పెట్టనికోట / పట్టిన మీ ఖ్యాతి బలితమై యుండు’’ అని బోధించాడు.
మీర్‌జుమ్లాకు ఆంధ్రుల ప్రతాపము తెలుసు కనుక ‘‘తెలుగు యోధులశక్తిని చులకనగా చూడకు తమలో తమకు ఎన్ని తగవులున్నా పర పెత్తనం భరింపలేరు. ఐకమత్యాన రొమ్ము ఆన్చి పోరాడుతారు, స్వేచ్ఛకై పడి చచ్చి జీవమొడ్డెదరు, పులి జున్ను తేగలరు. పోరాట యోధులు కాబట్టి మాయలు చేసి మచ్చిక చేసుకొని వారిని ఓడించాలేకాని ఎకాఎకి యుద్ధంలో గెలుపు సాధ్యం కాదు’’ అని చెప్పాడు.
లింగన్న వారిని బాగా రెచ్చగొట్టాడు. తళ్లి కోటలో రామరాయల శిరస్సును ఈటెతో గుచ్చి పైకెత్తిన నాడు ప్రబల హిందూసేన పరుగులు తీసింది, ధర్మంగా యుద్ధం చేస్తే ధాత్రి దక్కుతుందా? తంత్రంతో గెలవాలని ఉద్బోధించాడు.
మీర్‌జుమ్లా సైన్య సమేతుడై బయలుదేరి వెళ్లి నగార మోగించగా పక్క సంస్థానాలు పాలించు దొరలు తత్తరపడ్డారు. ప్రాణాలు గుప్పిటబట్టి చింతించారు. కంపించారు. వారిలో కొందరు గగ్గోలు పెట్టారు. తిమ్మానాయనికి మీర్‌జుమ్లా రాయబారము పంపాడు. బనగాన పల్లెలో మునిమడ్గులోని వజ్రాల గనులు మా వశము గావించమని లేకుంటే నీ మీద దండు పంపించుతాను సిద్ధం కమ్మని చీటీ పంపిం చాడు మీర్‌జుమ్లా.
చిన తిమ్మానాయుడు దర్బారు నిర్వహించాడు. మంత్రి చెన్నమరాజు మాట్లాడాడు. యుద్ధము వద్దని రాజుని వారించాడు. లింగన్న మేక వన్నెపులి, గోల్కొండకు రహస్యవార్తలు చేరవేస్తున్నాడన్న సంగతి వినబడుతున్నది అని అన్నాడు. కానీ నరసింహసేనాని నడుము బిగించాడు. ముష్కరులను పట్టి ముక్కలు చేసి పెన్నానదికి బలిపెడతానని, లింగన్నలు వేయిమంది వచ్చినా గండికోటను ఏమీ చేయలేరని ప్రకటించాడు.
తిమ్మానాయుడు వెలమవీరులకు, రెడ్డి యోధులకు, బలిజ నాయకులకు యుద్ధంలో సహక రించాలని దూతల ద్వారా వర్తమానం పంపాడు. వారి రాకకై ఎదురు చూడక తిమ్మానాయుడు తల్లి ఆశీర్వాదము తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. ప్రత్యక్షముగా రాజే ప్రథమంగా నిలిచి మూకలో ధైర్యం కలిగించేలా యుద్ధం చేశాడు. చెన్నమరాజుకు వయస్సు మగ్గిన ధవళ పేటంచు తలగుడ్డ చుట్టి, జందెమ్ము నడుమునకు సంధించి చుట్టి ముసలి చెన్నరాజు ద్వారా రక్షణ కార్యభారము వహించాడు. అల్లంత దూరాన పొదిలి లింగన కంట పడగా, ఓరి రాజద్రోహి, మతద్రోహి, నీచుల మోచేతి నీళ్లు తాగి తగుదునమ్మా అని యుద్ధానికొచ్చావా? అంటూ వెంటపడి, కత్తివాటుపిడితో కొట్టగా మన్నించమని కాళ్లమీదపడ్డాడు. క్షమించి వదిలేశాడు. మూడు మాసాలు పోరు సాగినప్పటికీ మీర్‌జుమ్లాకు గెలుపు రాలేదు. మీర్‌జుమ్లా ‘‘ఇంత కష్టమ్ము మాకింత నష్టమ్ము ఏ లడాయి నీ సంభవింపలేదు (పేజీ-176) అన్నాడు.
లింగన్న నరసింహ నాయుని శిబిరమునకు రహస్యముగా వచ్చాడు. మంతనాలు చేసి మీర్‌జుమ్లా దగ్గరకు తీసుకొనివెళ్లాడు. మీర్‌జుమ్లా నరసింహ నాయునికి స్వాగతమిచ్చి శ్లాఘించాడు, ‘‘మునిమడ్గు వజ్రాలగని నాకిస్తే నిన్ను రాజును చేస్తాను’’ అన్నాడు. అంగీకరించాడు నరసింహనాయుడు, ‘‘గుట్టు మట్టులు దారి గుర్తులు దెల్పె’’ నాడు (పేజి.188). ‘‘నారసింహా ఎంత నటన జేసితివి’’ అన్నాడు తిమ్మా నాయుడు. గోవిందమాంబ వెంటనే రావయ్యా చిన్నన్న! గండికోటకునంత్యఘడియ లేతెంచెను. తిమ్మానాయుడు గోవిందమ్మను (చెల్లెలు) యుద్ధమునకు పోవలదని వారించాడు అయినా ‘‘మంత్రి చెన్నమరాజు’’ మా గురుస్వామి నేర్పిన రణవిద్య నిల్వ బెట్టెదను (పేజి.201) అని సమాధాన మిచ్చి గోవిందమాంబ యుద్ధ్దమునకు వెళ్లింది. తన బావ నరసింహులుతో వాదులాడింది ‘‘ప్రాణాధికమ్ముగా పరిగణించుచున్న ముద్దుల బావ నా మోసగించెదవు గండికోట రణమ్ము కథ వ్రాయునపుడు నీ పాత్రకెంతెంత నీచత్వ మంది చిత్రించెదరో’’ (పేజీ. 207, 208) అని నరసింహుని తిట్టింది. ఇంతలో ‘‘సాహెబ్ నబీ బాకుచే నాయని ప్రక్కలో క్రుమ్మెను’’ (పేజీ-214). అతడు మరణించగా గోవిందాంబ మూర్చిల్లెను. గోవిందమాంబ అబ్దుల్ నబీని వధించింది. కాని ఆమె కూడా మరణించింది. అంతఃపుర స్త్రీలు అగ్నిప్రవేశము చేశారు. తిమ్మానాయుని సైన్యం చాలా వరకు నశించింది. మీర్‌జుమ్లా గుత్తిదుర్గాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు. గండికోటను ఖాళీ చేసి మీర్‌జుమ్లా కిస్తే, తిమ్మానాయుడు చెన్నమరాజుతో ఆలోచించాడు. ‘‘బంగారమును చేతబట్టిన నేమి మట్టి ముద్దగ మారుచున్నది’’ అన్నాడు చెన్నమరాజు, తిమ్మానాయుడు ఈ సంధికి అంగీకరించాడు. ‘‘గోతిలో దించాడు ఘాతకుడతడు’’ అయినా తిమ్మానాయుడు మీర్‌జుమ్లా మాట విని కోట నుండి బయటకు వచ్చాడు. కోట బయటకు వచ్చాక తెలిసింది తాను మోసపోయినాని. మీర్‌జుమ్లా తిమ్మా నాయుడికి విష ప్రయోగం చేశాడు. తిమ్మానాయుడు తన కుమారుడు పిన్నయ్యను పిలిచి చెన్నమరాజుకు అప్పగించి మరణించాడు. కుతుబ్‌షాహి విజయమును పొందాడు. శేషించిన రాజ సంబంధులు గండికోట వదలి ‘‘పెరిగిన చోటును మరచిపోలేక / బయలు దేరిరి ఆంధ్రభక్తులు వెలికి / తమిళదేశానకు తరలిన వారు / మహిసూర్ ప్రాంతాలకు మసలినవారు / పడమటి పాలెముల్ పట్టినవారు / కావేటి రాట్పురి కాణాచి కాగ / వివిధ ప్రాంతాలలో తలదాచుకున్నారు.
ఈ విధంగా గండికోట పరాయి పాలకుల వశమైంది. వీరిలో కొందరు విశ్వనాథ నాయకుని ఆశ్రయం పొందారు. విశ్వనాథ నాయకుడు పెమ్మసాని వారిని ‘‘కురివికుళం’’ సంస్థానానికి, రావెళ్ల వారిని ‘‘ఇళయరస నేందళ్’’ సంస్థానానికి అధిపతులుగా నియమించాడు. నేటి తమిళనాడు లోని విరుద్‌నగర్, తిరునళ్వేలి, తూత్తుకుడి, జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను వారికి అప్పగించాడు. అలా వచ్చిన వారి వారసులను నేటికీ ‘‘గండి కోటవారు’’ అనే పేరుతోనే స్థానికులు వ్యవహ రిస్తున్నారు, వీరంతా పిడిమన్నుకు గుడికట్టి పూజిస్తున్నారు.
మీర్‌జుమ్లా కొడుకు అమీన్ జుమ్లా అతివాగుడు గాడు. ‘‘తానె గొల్కొండ సుల్తాను న•ంచు కారుకూతలు గూసి గల్లంతు నడిపాడుగ’’ ఆ విషయం డిల్లీ పాదుషా షాజహాన్ వరకు వెళ్లిపోయింది. దాంతో మీర్‌జుమ్లాకు ఢిల్లీ నుండి కబురు రాగా మీర్‌జుమ్లా షాజహాన్‌కు కోహినూర్ వజ్రం సమర్పించాడు. ఈ ఘట్టం గురించి కొసరాజు ఇలా రాశారు..
తళతళ దీప్తుల తిలకించు దాని
కోహినూరు పేరున గుణనిధులెల్ల
‘‘మిహిర బింబము వంటి కోహినూరు నరసి
ఆహాహా! యనియె షాజహానంతవాడు
మెచ్చుల గురిపించి మేలు మేలనుచు
అభయమ్ము నీయడే’’ (పేజీ-378) ఆ విధంగా షాజహాన్ మీర్ జుమ్లాను, అతడి కుమారుని క్షమించి వదిలివేసాడు.
మూలం:
- గండికోట యుద్ధం – కొసరాజు రాఘవయ్య
- బండి కట్టురా! బండి కట్టురా! గండికోటకీ – డా।। సగిలి సుధారాణి
- ఆధునిక ఆంధప్రదేశ్ చరిత్ర – ఎ.వి.కోటిరెడ్డి పేజీ-17, 21-23

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు