20 ఏప్రిల్ చందనోత్సవం
తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీలక్ష్మీవరహా నృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కల్యాణం జరిపించుకునే స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తజనకోటికి నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు. ఆనాడు సింహగిరి శోభాయమానంగా వెలుగొందుతుంది. ఈ క్షేత్రంలోనూ ఏడాది పొడవునా వివిధ ఉత్సవాలు జరుగుతున్నా, తిరుమలేశుడికి బ్రహ్మోత్సవాల తరహాలో చందనయాత్రను విశేషంగా పరిగణిస్తారు. స్వామి నిజరూప దర్శనానికి భక్తి కోటి ఉవ్విళ్లూరుతుంది.
‘సింహాచలం మహా పుణ్యక్షేత్రము… శ్రీవరాహ నరసింహుని దివ్య ధామమూ…’ అని భక్త కోటి ప్రణతులు అందుకుంటున్న దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. క్షేాత్రపురాణం ప్రకారం, కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిప సోదరుల సంహరణ అనంతరం ఈ రెండు అవతరాలు (వరహా, నృసింహ) ఒకటిగా శాంతమూర్తిగా దర్శనభాగ్యం కలిగించాలన్న ప్రహ్లాదుడి కోరికను మన్నించిన స్వామి ‘ద్వైయరూపాలు’ ఒకటిగా అవతరించారు. ఆయన కొలువుదీరిన కొండ కూర్చున్న సింహాకృతిలో ఉండడం వల్ల ‘సింహగిరి, సింహాద్రి’ అని, నృసింహ స్వామి వేంచేసిన పర్వతం కనుక ‘సింహాచలం’ అని ప్రఖ్యాతి పొందిందని చెబుతారు. సముద్ర మట్టానికి ఎనిమిది వందల అడుగుల ఎత్తులో విరాజిల్లుతున్న వరాహ నృసింహుడిని కాలినడక దర్శించుకోవాలంటే సహస్ర సోపానాలను అధిరోహించాలి. ఈ మెట్లను శ్రీమహావిష్ణువు సహస్ర నయనాలకు ప్రతీకగా చెబుతారు.
తొలుత ప్రహ్లాదుడే స్వామి వారికి చందన సేవ చేశాడని, అనంతరం సకల దేవతలు దానిని అనుసరించారని గాథ. ప్రహ్లాదుడి అనంతరం అర్చనాదులు లేక స్వామిపై పుట్ట వెలిసింది. కొన్ని సహస్రాబ్దాలకు పురూరవ చక్రవర్తి ద్వారా స్వామికి పునర్వైభవం సిద్ధించినట్లయింది. ఆయనకు స్వప్న సాక్షాత్కారం చేసిన నృసింహుడు తన ఉనికిని చాటినట్లు పురాణ కథనం. అలా అక్షయ తృతీయ నాడు పుట్టలోని స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని కనుగొన్న ఆ చక్రవర్తి చందన సేవను పునరుద్ధ రించాడు. నాటి నుంచి అక్షయ తృతీయనాడు చందనోత్సవం నిరాటంకంగా సాగుతోంది. తాను దర్శనమిచ్చిన నాడే (వైశాఖ శుద్ధ తదియ)నిజరూప దర్శనం ఉంటుందని, ఆ రోజు మినహా ఏడాది పొడవునా తొలగించిన పుట్టమట్టికి సమాన పరిమాణంలో చందనం సమర్పించాలన్న స్వామి ఆజ్ఞ, సంప్రదాయం కొనసాగుతోంది. పురూరవ చక్రవర్తి స్వామి వారికి వజ్రహారాలు సమర్పించి ఉత్సవాలను నిర్దేశించి, నిర్వహించాడు. ఆలయ గోపురాలు నిర్మించారు. వేదమూర్తులను రప్పించి వారికి అగ్రహారాలు ఇచ్చి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పగించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి..
వైశాఖ శుద్ధ విదియనాటి రాత్రి మూలవిరాట్‌పై గల చందనాన్ని ఒలిచి, మరునాడు (తదియ) బ్రాహ్మీ ముహూర్తంలో గంగధార జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. నిజరూపం దర్శనం వైకుంఠంలో లక్ష్మీనారాయణులను దర్శించినంత ఫలితమని క్షేత్ర మహాత్మ్యం పేర్కొంటోంది.అదేరోజు సాయం సంధ్యా సమయంలో స్వామి వారికి సంపూ ర్ణంగా చందనం అద్దుతారు. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి నాడు (దివ్య చందనోత్సవం), ఆషాఢ పౌర్ణమికి (శ్రీ చందనోత్సవం) మూడు విడతలుగా మొత్తం పన్నెండు మణుగుల చందనం సమర్పిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు మేలిముసుగు కరాళ చందన సమర్పణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
వల్మీకం నుంచి వెలికి వచ్చిన తáనకు చందనం సమర్పించాలన్నది నృసింహుడి ఆదేశమని స్థలపురాణం చెబుతుండగా, హిరణ్య కశిపుడి వధానంతరం ఉగ్రమూర్తియైన స్వామిని చల్లబరిచేందుకు చందనం సమర్పించారని, అదే ఆనవాయితీగా వస్తోందని భక్తజనుల విశ్వాసం. నృసింహుడు అనగానే ఉగ్రమూర్తి కళ్ల ముందు కదలాడడం సహజం. కానీ సింహాద్రినాథుడు నిజరూపంలో పరమ శాంతమూర్తిగా, లింగాకృతిలో శివకేశవులకు అభేదంగా దర్శనమిస్తాడు.
శ్రీమద్రామానుజులు, శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు తదితర ఎందరో ప్రముఖులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. రాయలు తమ మాతృమూర్తి నాగదేవమ్మ, సర్వారాయలు పేరిట స్వామి వారికి కంఠమాల, వజ్రమాణిక్యాలు, కడియాలు, శంఖు చక్రాలు, పతకం మొదలైన ఆభరణాలు సమర్పించినట్లు ఆలయ ప్రాంగణంలో శాసనం చెబుతోంది. కంచి నుంచి కటకం వరకు పాలించిన అనేకమంది రాజులు, రాణులు స్వామి వారికి భూరి విరాళాలు సమర్పించుకున్నట్లు ఆలయ స్తంభాలపై, ప్రాకార గోడలపై రాతలు తెలియచెబుతాయి. చాళుక్య, చోళ రాజులు,వీరకూట పల్లవుల, వేంగీ చాళుక్యులు, కోరుకొండ నాయకులు, కొప్పుల నాయకులు, నందాపుర రాజులు, గాంగులు, వడ్డాదిమాత్యులు, జంతరనాటి సురభివంశజులు, ఒడిసా గజపతులు తదితరులు సింహాద్రినాథుడిని అర్చించిన వారిలో ఉన్నారు.
‘సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే
సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ’

డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి