సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో హిందూ దేవాలయాలు, కట్టడాలు మావే అని కోర్టులలో వాదించుకోవాల్సి రావడం దురదృష్టకరం. మధ్యప్రదేశ్ ధార్ పట్టణంలోని భోజ్‌శాలలో లభ్యమైన శాసనంలో ప్రాకృత భాషలో ‘కోదండకావ్య’, ‘ఖడ్గశత’ అనే రెండు పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం ధనుస్సుకు, మరొకటి ఖడ్గానికి చెందినది. ఇది బహుశా రాముడు లేదా అర్జునుడికి చెందిన ధనుస్సుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవి ‘ఓం నమః శివాయా’ ప్రార్థనతో ప్రారంభం అయ్యాయి. ఇంత స్పష్టంగా సనాతన ధర్మానికి చెందిన రుజువులున్నా..‘అది మసీదు కాదు…హిందూ దేవాలయం’ అని న్యాయస్థానాల మెట్టు ఎక్కాల్సి రావడం మన దౌర్భాగ్యం.
మొఘల్‌లు, బ్రిటిస్ సామ్రాజ్యవాదులు హిందువు లపై చేసిన దౌర్జన్యాలు, దాడులు దేశానికి, సనాతన ధర్మానికి మచ్చగా మిగిలిపోయాయి. వాటిలో మధ్యప్రదేశ్ ధార్ పట్టణంలోని భోజ్‌శాల కూడా ఒకటి. భోజరాజు కాలంలో సరస్వతీ దేవీ ఆలయం, సంస్కృత విద్యాపీఠంగా వెలుగువెలిగిన భోజ్‌శాలను కమాల్ మౌలా మసీదుగా మార్చి దీన్ని వివాదా స్పద కట్టడం చేశారు. అయితే న్యాయ స్థానాల్లో సుదీర్ఘ పోరాటంతో ఈ కట్టడం హిందువులకు చెందినదే అని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం హిందువులకు గొప్ప విజయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి చాలా కాలమైనా దుష్టశక్తుల ఆనవాళ్లు ప్రజల మనస్సులో మచ్చగా మిలిగిపోయాయి. ఆలస్యమైనా దేశప్రజల చిరకాల వాంఛ అయిన అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మించు కున్నాం. ఇప్పుడు అదే తరహాలో మధ్యప్రదేశ్‌లో భోజ్‌శాల కట్టుకొనే అవకాశం రావడం చారిత్రాత్మకమైన విజయం.
భోజ్‌శాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. దీనికి సంబంధించి న్యాయపరమైన పరిణా మాలు, పురావస్తు సర్వేలు, చారిత్రక ఆధారాలపై దీర్ఘకాలంగా సాగుతున్న వాదోపవాదాలు దీన్ని ఒక ప్రాంతీయ అంశంగా కాకుండా, భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వం అంశాలుగా నిలిచింది. సనాతన ధర్మం అనుసరించే వారి దృష్టిలో భోజ్‌శాల ఒక సాధారణ కట్టడం కాదు. అది విద్యాదేవి సరస్వతికి అంకితమైన ఒక మహత్తర విద్యాపీఠం. భారతీయ జ్ఞాన సంప్రదాయానికి ప్రతీక. విదేశీ దండయాత్రల వల్ల అసలు రూపాన్ని కోల్పోయిన చారిత్రాత్మకమైన ఆలయం.
భోజ్‌శాల 11వ శతాబ్దానికి చెందినదిగా అనేక చారిత్రక వర్గాలు పేర్కొంటున్నాయి. పరమార వంశానికి చెందిన మహారాజా భోజుడు ధార్ ప్రాంతాన్ని విద్యా, సాహిత్య, సంస్కృత అధ్యయనాలకు కేంద్రంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పాలనలో ఆ పట్టణాన్ని ‘విద్యాకాశీ’గా అభివర్ణించే వారని చరిత్ర పేర్కొంటుంది. ఇక్కడ సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు జరిగేవి.
భోజ్‌శాలలో కనిపించే నిర్మాణ శైలి, శిల్పకళ, అక్కడి స్తంభాలపై చెక్కిన సంస్కృత శాసనాలు, దేవతా రూపాలు అన్నీ ఇది హిందూ ఆలయమని, కట్టడమని నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా వాగ్దేవికి సంబంధిం చిన చిహ్నాలు, శిల్పాలలో కనిపించే హిందూ కళా లక్షణాలు, ఆలయ శైలిలోని మండప నిర్మాణం, శాసనాలలోని సంస్కృత పదాలు ఆలయ చరిత్రను సూచిస్తున్నాయి. 1305 ప్రాంతంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైంది. అనంతరం అక్కడి నిర్మాణాన్ని కమాల్ మౌలా మసీదు రూపంలో మార్చారు. ఆలయ స్తంభాలు, గర్భగుడి నిర్మాణ శైలిని పూర్తిగా తొలగించకుండా, వాటిపైనే మసీదు నిర్మించారు. భోజ్‌శాల ప్రాంగణంలో కనిపిస్తున్న అనేక శిల్పాలు, విరిగిన దేవతా విగ్రహ భాగాలు, కళా అవశేషాలు హిందూ కట్టడంగా నిరూపిస్తున్నాయి. ఈ నిర్మాణంలో సరస్వతీదేవీ విగ్రహం ఉండడం హిందువుల్లో భావోద్వేగాన్ని నింపుతోంది. బ్రిటిష్ పాలనలో అక్కడి అసలు సరస్వతి విగ్రహాన్ని విదేశాలకు తరలించారు. ప్రస్తుతం అది లండన్‌లోని వ్యజియంలో ఉంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన పూజనీయ కట్టడాలను స్వాధీనం చేసుకోవడా నికి పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడడం దురదృష్ట కరం. భోజ్‌శాల వివాదం కూడా స్వాతంత్య్రం అనంతరమూ దీర్ఘకాలంగా కొనసాగింది. దీన్ని సరస్వతి ఆలయంగా గుర్తించాలని హిందువులు డిమాండ్ చేస్తుండగా, ముస్లిం వర్గాలు దీన్ని కమాల్ మౌలా మసీదుగా పేర్కొంటూ ప్రార్థనా హక్కులు కోరాయి. ఈ నేపథ్యంలో 2003లో భారత పురావస్తు శాఖ ప్రత్యేక విధానాన్ని అమలు చేసింది. దాని ప్రకారం మంగళవారాల్లో హిందువులు పూజలు చేసుకోవడానికి, శుక్రవారాల్లో ముస్లింలు నమాజ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని నాడే హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతి రేకించాయి. కట్టడం మొత్తం హిందూ సంస్కృతితో ఉంది. దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయి. ఇది సరస్వతి ఆలయమైతే నమాజుకు అనుమతి ఎలా ఇస్తారు? అని హిందువులు ప్రశ్నించారు. హిందూ ఆలయమైన కట్టడాన్ని చారిత్రక సత్యాన్ని దాచిపెడుతున్నారని కోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదం దీర్ఘకాలిక న్యాయపోరాటం అనంతరం హిందువుల పక్షం తీర్పు రావడం చారిత్రాత్మక ఘట్టం. అనేక హిందూ సంస్థలు, విశ్వహిందూపరిషత్, హిందూ మహాసభ వంటి సంస్థలు భోజ్‌శాల అంశాన్ని బహిర్గతం చేసేందుకు, అసలు నిజాలను బయట పెట్టేందుకు కోర్టులను ఆశ్రయించాయి. కట్టడంపై శాస్త్రీయ సర్వే నిర్వహించి చారిత్రక వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేయడంతో, సర్వే చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది. ఆ ఆదేశంపై ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇక్కడే వారి నైజం బయటపడింది. అక్కడ హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అది మసీదు కాదని తెలిసే వారు సర్వేను వ్యతిరేకించారు. దేశంలో బుజ్జగింపు రాజకీయాలతో వాస్తవాలను మరుగుపర్చేందుకు యత్నించారు. అయితే సర్వేను నిలిపి వేయడానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. కట్టడ నిర్మాణ స్వరూపానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే సూచించింది.
కోర్టు ఆదేశాలతో దాదాపు వ•డు నెలల పాటు సాగిన పురావస్తు సర్వేలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. హిందూ శైలికి చెందిన స్తంభాలు, సంస్కృత శాసనాలు, దేవతాశిల్పాల భాగాలు, ఆలయ నిర్మాణ అవశేషాలు బయట పడ్డాయి. కొన్ని శిల్పాలలో కమలాలు, హంసలు, విద్యకు సంబంధించిన చిహ్నాలు కనిపించాయి. ఇవి యాదృచ్ఛికంగా ఏర్పడిన గుర్తులు కావని, భోజ్‌శాల సరస్వతి ఆలయమేనని స్పష్టమైంది. సర్వేలో తేలిన వాస్తవ విషయాల ఆధారంగా మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాల హిందువులదే అని ఇచ్చిన తీర్పు దేశంలోని హిందువుల్లో ఉత్సాహం కలిగించింది. ఇప్పుడు కేవలం మంగళవారాల్లోనే కాకుండా ప్రతిరోజూ అక్కడ పూజలు చేసుకోవచ్చు. కోర్టు తీర్పుతో, 700 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భక్తులు ఇక్కడ అఖండ జ్యోతిని వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.
విద్యాదేవి సరస్వతి ఆలయాన్ని తిరిగి చారిత్రాత్మ కంగా నిలబెట్టడం భారతీయ నాగరికతకు గౌరవం ఇవ్వడమే. భోజుడు నిర్మించిన విద్యాపీఠాన్ని కాపాడటం అంటే భారతీయ జ్ఞాన సంపదను సగర్వంగా నిలబెట్టడమే. బ్రిటిష్ పాలనలో లండన్‌కు తరలించిన సరస్వతీ విగ్రహాన్ని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చి ప్రతిష్టించాలని భక్తులు కోరుతున్నారు.
అయోధ్య, భోజ్‌శాలపై కోర్టు తీర్పులు హిందువు లకు అనుకూలంగా రావడంతో ‘ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991’ చట్టంపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభ మైంది. కొన్ని వర్గాల వారు ఈ చట్టం ప్రాధాన్యత గురించి వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా సనాతన ధర్మం వ్యతిరేకులు, ముస్లిం సంస్థలు ఈ చట్టాన్ని ప్రస్తావిస్తూ, 1947 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల స్వరూపం మార్చకూడదని చెబుతున్నాయి. అంటే గతంలో ముఖ్యంగా మొఘల్ పాలనలో హిందూ ఆలయాలను ధ్వంసంచేసి ముస్లిం కట్టడాలుగా మార్చారనేది వారంతా పరోక్షంగా ఆమోదిస్తున్నట్టే. లౌకికవాదం పేరు చెబుతూ బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యతిచ్చే కుహనా సెక్యులరిస్టుకు హిందువుల మనోభవాలు పట్టవా..? అందుకే ‘1991 చ్టం ఇక్కడ అప్రస్తుతం’ అంటూ ‘‘చారిత్రక సత్యాన్ని వెలికితీయడం చట్ట విరుద్ధం కాదు…చరిత్రలో జరిగిన అన్యాయాలను శాశ్వతంగా కొనసాగించలేం’’ అని హిందూసంస్థలు వ్యాఖ్యాని స్తున్నాయి. పురావస్తు ఆధారాలు, నిర్మాణ శైలి, సంస్కృత శాసనాలు ఇలా అన్నీ కలిపి భోజ్‌శాల అసలు స్వరూపాన్ని చూపుతున్నాయని, ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని సనాతనవాదులు వాదించడంలో ఎలాంటి అతిశయోక్తులు లేవు. ఒకవైపు హిందూ సంస్థలు దీనిని ‘‘భారత సంస్కృతి పునరుద్ధరణ’’గా చూస్తుంటే, అటు ముస్లింవర్గాలు, సెక్కులర్‌వాదులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని చెబుతున్నారు. అయితే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లినా భోజ్‌శాలలో లభించిన ఆధారాల ప్రాతిపదికగా అది హిందూ కట్టడమే అని మరోసారి తీర్పు వస్తుందని సనాతన వాదులు ఆశిస్తున్నారు. భోజ్‌శాల ఇప్పుడు భారతదేశ రాజకీయ, సాంస్కృతిక, ధార్మిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఇది కేవలం న్యాయపోరాటంలో విజయమే కాదు. భారతీయ సంస్కృతి, చరిత్ర, స్వాభి మానానికి ప్రతీక. ‘‘సరస్వతి ఆలయం మళ్లీ తన అసలు గుర్తింపును పొందాలి’’ అనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత బలంగా వినిపిస్తోంది.
భోజ్‌శాల తీర్పుతో చారిత్రక సత్యం వెలుగులోకి వచ్చింది. ఇది శతాబ్దాల పోరాటానికి లభించిన న్యాయం. ఈ తీర్పు ‘‘అయోధ్య తర్వాత మరో చారిత్రక ఘట్టం’’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. భోజ్‌శాల అయోధ్య రామాలయం ఉద్యమాలకు సారూప్యతలున్నాయి. అయోధ్యలో రామమందిరం కోసం దశాబ్దాలగా సాగిన పోరాటం చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసినట్లే, భోజ్‌శాలలో కూడా చారిత్రక సత్యం బయటపడింది. ఈ రెండు తీర్పుల్లో ఏఎస్‌ఐ నివేదికలు కీలక పాత్ర పోషించాయి. అయోధ్య రామాలయం నిర్మాణం అనంతరం భోజ్‌శాల, వారణాసి జ్ఞానవాపి, మధుర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ ప్రాంతాలన్నింటిలో విదేశీయులు..ప్రధానంగా ముస్లిం రాజులు దాడులు చేసి చారిత్రాత్మకమైన హిందూ దేవాలయాలను, కట్టడాలను ధ్వసం చేశారు. నాటి నుండి నేటి వరకు హిందువులు వాటి పునర్నిర్మాణం కోసం పోరాడు తూనే ఉన్నారు. అందుకే ఈ ప్రధాన స్థలాలు నిత్యం చర్చల్లో ఉంటాయి. భారత్‌లో ధ్వంసమైన అనేక ఆలయాల చరిత్ర ఇప్పుడు తిరిగి వెలుగులోకి వస్తున్నాయి.
భోజ్‌శాల తీర్పు భారతీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోయింది. ఇది కేవలం న్యాయ పరమైన విజయం మాత్రమే కాదు, శతాబ్దాలుగా కొనసాగిన సాంస్కృతిక పోరాటానికి లభించిన గుర్తింపు. అయోధ్య తర్వాత భోజ్‌శాల అంశం కూడా దేశవ్యాప్తంగా చారిత్రక చైతన్యాన్ని రగిలిస్తోంది. భారతదేశం సనాతన సంప్రదాయాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేసేందుకు ఈ తీర్పు గొప్ప నైతిక బలం ఇచ్చింది. ‘చరిత్రను తెలుసుకోవడం విభజన కాదు… నాగరికతను కాపాడుకోవడం’ అనే సందేశాన్ని భోజ్‌శాల న్యాయ పోరాటం దేశానికి అందించింది.
– శ్రీపాద