ఒక మహా నాయకుడంటే ఆయన చింతన భవిష్యత్తుకు దారి చూపాలి. దేశభక్తుడు అంటే ఆయన జాడ చరిత్రలో దర్శనం ఇవ్వాలి. ఆయన భవిష్యద్దర్శనం, చరిత్ర మీద జాడ మనం చూడగలిగేది ఆయన చేసిన త్యాగంలోనే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితంలో ఇవి దర్శనమిస్తాయి. ఆయన హిందూ మహాసభలో పనిచేశారు. తరువాత భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. స్వాతంత్య్రోద్యమ ప్రస్థానం, అందులోని మంచి చెడు రెండూ ఎరిగిన నేతగా ఆయన చేసిన భవిష్యద్దర్శనం ఐక్య కశ్మీరం. భారత జాతీయ కాంగ్రెస్ నేతల తప్పటడుగుల కారణంగా భారతావనికి కిరీటం వంటి కశ్మీరం చిక్కులలో పడింది. ఆయన దృష్టి కారణంగానే తరువాత ఆయన చింతనకి వారసులు కశ్మీర్‌పై వాస్తవిక విధానం అనుసరించారు. దేశ ఐక్యతకు కట్టుబడ్డారు. అందుకే కశ్మీర్ కోసం ఆయన పోరాడుతూ నేలకొరిగిన జూన్ 23 ఏనాటికీ విస్మరించ వీలులేని రోజుగా మారింది. ఆయన బలిదానం రోజు దేశ సమైక్యతకు ఎదురవుతున్న సవాళ్లను చర్చించే సందర్భంగా మార్చుకోవాలి. జూన్ 23న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం ఇదే చెబుతున్నది. దేశ ఐక్యతకు మీరు చేసిన నిరుపమాన త్యాగం సదా స్మరణీయమైనది అని ప్రధాని చెప్పడంలోని ఆంతర్యం ఇదే. దేశమంతా ఆయనకు ఆరోజు ఘనంగా నివాళి ఘటించి, దేశ ఐక్యతామంత్రానికి అంతా కటిబద్ధులమని దేశభక్తులంతా ముక్తకంఠంతో పలికారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యాసం.
జూన్ 23ను డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌గా జరుపుకుంటూ ఉంటాం. సంకల్పంతో ఆశయ సిద్ధిని ఎలా సాధించగలమో వారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఈ సందర్భం ఆ విషయాన్ని తెలియచేస్తున్నది. వారు జీవిత కాలంలో నమ్మిన, పోరాడిన సిద్ధాంతం ‘ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు’ వ్యవస్థ నడవదు, నడవదు అనే. దాని కోసమే కడవరకు పోరాడి తాను నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అర్పించారు. శ్యామాప్రసాద్. ఆయన చింతన ఒక జ్వాల. ఆయన మార్గం దేశ సమైక్యతకు సూత్రం.
శ్యామాప్రసాద్ జూలై 6, 1901న కలకత్తాలో జన్మిం చారు. భారత మేధో సంపదకు మహోన్నత తార్కాణంగా నిలిచిన సర్ అశుతోష్ ముఖర్జీ కుమారుడాయన. చిన్ననాటి నుంచే అసాధారణ మేధస్సు కలిగిన శ్యామాప్రసాద్, కలకత్తా లోని ప్రెసిడెన్సీ కళాశాల ఆంగ్ల సాహిత్యంలో బీఏ, ఆ తర్వాత ఎంఏ, బీఎల్ పూర్తి చేశారు. కేవలం 23 ఏళ్ల వయసులో, లండన్‌లోని లింకన్ ఇన్ విద్యాలయం నుంచి బారిస్టర్ పట్టా పొందారు. బ్రిటిష్ పాలనలో భారతీయుడిగా ఇది ఒక అరుదైన ఘనత.
విద్యాలోకంలో అసాధారణ స్థానం
కేవలం 33 ఏళ్ల వయసులో శ్యామాప్రసాద్ కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు (1934-1938). ఆయన పదవీ కాలం విద్యారంగానికి ఒక కొత్త బాట చూపింది. భారతీయ భాషలకు ప్రోత్సాహం, శాస్త్రీయ విద్యాభివృద్ధి, మహిళా విద్యకు ఆసక్తి, విద్య ద్వారా జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించడం వంటి అంశాలను ఆయన పరిచయం చేశారు. ‘విద్య అంటే కేవలం పాఠాలు కాదు. అది దేశానికి ఆత్మను నూరిపోసే సాధనం’ అని వారి నమ్మకం.
విభజన రాజకీయాలను ఎదిరించిన జాతీయవాది
కాంగ్రెస్, హిందూ మహాసభ, జాతీయ చైతన్యం వారిలో ముప్పెరగొని కనిపిస్తాయి. అయితే కాంగ్రెస్‌పై అభిప్రాయం తర్వాత పలచబడింది. స్వాతంత్య్రోద్యమం ఒక దశలో భారత జాతీయ కాంగ్రెస్ వెంట నడవని వారు దేశంలో తక్కువ. శ్యామాప్రసాద్ కూడా కాంగ్రెస్ పట్ల మానసిక అనురక్తితో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1929లో బెంగాల్ శాసన మండలికి ఎన్నికయ్యారు. అయితే, ముస్లింలీగ్‌కు అండగా కాంగ్రెస్ వ్యవహరించడాన్ని చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు. తరువాత ఆయన దృష్టి అఖిల భారత హిందూ సభ వైపు మళ్లింది. 1943 నుండి 1946 వరకు హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రయత్నం హిందూ స్వాభిమానం పేరుతో విభజనకు వ్యతిరేకంగా జాతీయ ఐక్యతకు తన శక్తినంతా వినియోగించారు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, సేవాతత్పరతతో బెంగాల్ కరవు (1943) సమయంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. బెంగాల్ కరవు బ్రిటిష్ జాతి సృష్టి. రెండో ప్రపంచ యుద్ధం కోసం బెంగాల్‌ను బలిపెట్టారు. అందుకే బ్రిటిష్ పాలనలోని క్షమార్హం కాని ఆ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
ఒక దేశం, రెండు భిన్న అభిప్రాయాలు
ఆగస్టు 15, 1947న, దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం నెహ్రూ తొలి కేబినెట్‌లో పరిశ్రమలు, సరఫరా శాఖ మంత్రిగా నియమితులైన ముఖర్జీ, త్వరలోనే ఆలోచనాత్మక విభేదాలకు గురయ్యారు. నెహ్రు విధానాలు దేశాన్ని బలహీన పరచడమే కాకుండా, మున్ముందు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ముందే ఊహించారు. అనునిత్యం నెహ్రూతో ధార్మిక, జాతీయ, భారత భవిషత్తుపై శ్యామాప్రసాద్ వివాదం కొనసాగింది.
అసలు ఆ తరహా భారత విభజననే శ్యామా ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనాడు శ్యామా ప్రసాద్ వంటివారు మత పునాది మీద దేశాన్ని చీల్చడాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా చివరికి అదే జరిగింది.
రాజ్యాంగ రచన సమయంలో ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ, ఇది దేశాన్ని చీల్చుతుందని ముఖర్జీ హెచ్చరించారు. అల్పసంఖ్యాక వర్గాల గొంతెమ్మ కోరికలను, దేశ శ్రేయస్సు విషయంలో వారి తీరుపై విమర్శలు కురిపించారు. పాకిస్తాన్‌పై నెహ్రూ అనుకూల వైఖరిపై ధ్వజమెత్తారు. నెహ్రూ-లియాకత్ ఒప్పందం (1950) విషయంలోను ఆయన విభేదిం చారు. ఈ ఒప్పందం ఫలితం తూర్పు పాకిస్తాన్‌లో హిందువుల హక్కులను (నేటి బాంగ్లాదేశ్) నిర్లక్ష్యం చేయడానికే ఉపయోగపడుతుందని విమర్శించారు. ఈ తీవ్ర విభేదాల మధ్య 1950 ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఇలా ప్రకటించారు: ‘దేశాన్ని బలహీనపరిచే విధానాల్లో భాగస్వామిగా ఉండలేను’ అని ప్రకటించారు.
జనసంఘ్ – ఓ ఆశా దీపం
1947 నాటి కాంగ్రెస్‌తో పాటు దేశంలో చాలా రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయి. కానీ వేటిలోను నిర్మాణాత్మక ఉద్దేశాలు లేవు. ఆశయాలు లేవు. ఆ నేపథ్యంలో దేశభక్తి, జాతీయవాదం, భారత మూలధర్మం ఆధారంగా భారత్‌ను నిర్మించే దిశగా భారతీయ జనసంఘ్ స్థాపించారు. ఆ పార్టీ తరువాతి అవతారమే ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ ‘భారతీయ జనతా పార్టీ’. జనసంఘ్‌ను 1951లో ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ప్రారంభించారు.
ఆయన ఆశయం
దేశం మతం ప్రాతిపదికగా చీలిపోవడం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో ఆనాడే ఊహించిన మేధావి శ్యామాప్రసాద్. బ్రిటిష్ పాలన కారణంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి తీవ్రమైన ఆలోచనే దేశంలో, రాజకీయ నాయ కత్వంలో లేదు. అలాంటి సమయంలో దేశమనే చింతనను బలపరిచే తీరులో ఒక దేశం-ఒక రాజ్యాంగం – ఒక జెండా అనే మౌలిక స్వరూపం కోసం ఆయన కలగన్నారు. దీనిని నిలబెట్టడానికి, కొనసాగించడానికి అవసరమైన సాంస్కృతిక జాతీయతను ఆయన ప్రతిపాదించారు. ఆర్థిక స్వేచ్ఛకు తోడు దేశ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేక హోదా అనే భావనను తిరస్కరించారు.‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు కుదరదు! అన్నదే ఆయన నినాదం. అది కశ్మీర్‌కు సంబంధించినది.
రాజ్యాంగంపై అవగాహన
ఆయన రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు కాకపోయినా, ఆ అంశం మీద శ్యామాప్రసాద్ చేసిన ప్రసంగాలు ఆలోచనాత్మకంగా, దూరదృష్టితో ఉండేవి. ఆయన హెచ్చరించిన విషయాలేమిటో ఒకసారి గమనించాలి. ఆర్టికల్ 370 వల్ల దేశ విభజన ప్రమాదం అన్నారాయన. నూటికి నూరుపాళ్లు అదే నిజమైంది. సెక్యులరిజం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా దేశ మౌలిక స్వరూపాన్ని మార్చే స్తాయని ఆయన హెచ్చరించారు. అదీ నిజమైంది. ఆయన సూచించినది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణతో కూడిన ఐక్యత.
కశ్మీర్‌లో బలిదానం – మిగిలిన ప్రశ్నలు
కశ్మీర్ కారణంగా భారతావని మీద రెండు జెండాలు ఎగిరాయి. రెండు రాజ్యాంగాలు అమల య్యాయి. ఇది చాలు, సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ ఎంత అవహేళన చేసిందో తెలియడానికి. అప్పట్లో నెహ్రూ రాజ్యాంగంలోకి చొప్పించిన ఆర్టికల్ 370 కారణంగా భారతీయులందరికీ స్వేచ్ఛగా కశ్మీర్‌కు వెళ్లే అవకాశం ఉండేదే కాదు. అక్కడకి వెళ్లాలంటే పర్మిట్ (వీసా లాగ) తీసుకోవాలి. కానీ దేశభక్తి, దేశ ఐక్యతకు కట్టుబడిన శ్యామాప్రసాద్ పర్మిట్ అనే ఆ పదాన్ని వ్యతిరేకిస్తూ ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ?( జన్మనిచ్చిన తల్లి, మాతృ దేశం స్వర్గానికంటే గొప్పవి) అనే స్పూర్తితో 1953లో, ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ, కశ్మీర్‌లో అనుమతి లేకుండా ప్రవేశించేందుకు సత్యాగ్రహం చేపట్టారు. దేశానికి ఐక్యతా దీపంగా ఎదుగుతున్న శ్యామాప్రసాద్‌ను నాటి కశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11న అరెస్ట్ చేసి, నిశాత్ గార్డెన్లో (శ్రీనగర్) నిర్బంధంలో ఉంచింది. జూన్ 23, 1953న సందేహాస్పద పరిస్థితుల్లో , నిర్బంధంలోనే వారు మృతి చెందారు. కేవలం 51 సంవత్సరాలకే వారు తన ప్రాణాన్ని భారత ఐక్యత కొరకు అర్పించారు. వారి మరణానికి కారణం విచారణ జరపాలని ఆయన తల్లి నెహ్రూని వేడుకున్న ‘‘మౌనమే’’ సమాధానం అయింది.
ఆర్టికల్ 370 రద్దు అనే శ్యామాప్రసాద్ సంకల్పాన్ని, సరిగ్గా 66 సంవత్సరాల తర్వాత, భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి మోదీ నెరవేర్చారు. 2019 ఆర్టికల్ 370ని రద్దు చేసి వారి ఆత్మకు నివాళులు అర్పించారు. వారి జీవితం ఆశయ సాధనకు ఒక స్ఫూర్తి. ఆర్టికల్ 370 రద్దు అంటే ఆయన స్వప్నాన్ని సాకారం చేయడమే. సాంస్కృతిక జాతీయత అనే భావనకు ఆయన ఒక కొత్త సూర్యోదయం. ఇంతై, వటుడు ఇంతింతై అన్నట్టు బీజేపీ ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించటానికి శ్యామాప్రసాద్ బలిదానం బలమైన స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కేవలం రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక దేశభక్తుడు, శాస్త్రవేత్త, విద్యావేత్త, సంస్థాపకుడు. జాతీయ ఐక్యత కోసం ప్రాణం అర్పించిన వీరుడు.
జీవితం న తు కాలతః, కర్మణా ఏవ శోభతే।
అంటే మనం ఎన్ని రోజులు జీవించాం అన్నది కాదు, ఎలా జీవించాం అనేదే ముఖ్యం. శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి నాయకులు ఆ రోజులలో కొందరైనా ఉన్నారు కాబట్టే దేశంలో కొన్ని మంచి ఆలోచనలతో ఉద్యమాలు నడిచాయి. లేకుంటే కేవలం పదవీ రాజకీయాలు మిగిలేవి. జాతీయతతో సంబంధం లేని తరాలు పుట్టుకొచ్చేవి. దీనిని నివారించిన ఘనత శ్యామాప్రసాద్‌దే.
డా. బూర నరసయ్య గౌడ్
మాజీ ఎంపీ – భువనగిరి