అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ అన్నంతపని చేశారు. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలకు, ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట చేస్తున్న వైమానిక దాడులకు ముడిపెడుతూ తాత్సారం చేస్తున్న ఇరాన్‌పైన ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌ పేరిట భీకరమైన దాడికి ఉపక్రమించారు. మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశారు. జూన్‌ 13 నుంచి ఇజ్రాయెల్‌, ఇరాన్‌ పరస్పరం చేసుకుంటున్న దాడులను కొత్త మలుపు తిప్పారు. శక్తి ప్రదర్శనతోనే శాంతి నెలకొల్పడం సాధ్యమవుతుందనే సరికొత్త నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. యావత్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నట్టుగా, ఇరాన్‌ అణు కార్యక్రమానికి ముగింపు పలుకుతున్న ట్టుగా అమెరికా ఇరాన్‌ అణుకేంద్రాలపై జూన్‌ 22, తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌లో భాగంగా అమెరికా లోని మిస్సోరి నుంచి 125 యుద్ధ విమానాలు, బంకర్‌`బస్టర్‌ బాంబులతో ఆరంభించిన ఈ భీకరదాడులు ఇరాన్‌ గడ్డపై కేవలం 25 నిమిషాల్లోనే పూర్తికావడం విశేషం. అయితే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నప్పటికీ ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు దాడిలో పాలుపంచుకున్న అమెరికా యుద్ధ విమానాలను, క్షిపణులను అడ్డుకోలేక పోవడం గమనార్హం. ఈ మొత్తం ఆపరేషన్‌లో 14 బంకర్‌-బస్టర్‌  బాంబులు, రెండు డజన్లకు పైగా టోమాహాక్‌ క్షిపణులు, 125కు పైగా సైనిక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో ఏడు స్టెల్త్‌ బీ-2 బాంబర్లు కూడా ఉన్నాయి. అమెరికా ఇరాన్‌పైకి ఇంత భారీ ఎత్తున దాడి చేయడం ఇదే మొదటిసారి. అమెరికాలోని మిస్సోరిలో వైమానిక స్థావరం నుంచి చెరి ఇద్దరు సిబ్బందితో కూడిన ఏడు బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో కూడిన ప్రధానంగా దాడి చేసే బృందం మార్గమధ్యంలో ఇంధనాన్ని నింపుకుంటూ తూర్పు దిశగా 18 గంటలపాటు ప్రయాణించింది. బృందంలో ఒక భాగం శత్రువును ఏమారుస్తున్నట్టుగా పశ్చిమదిశగా ప్రయాణించి పసిఫిక్‌ ద్వీపం గోమ్‌కు చేరుకుంది. ఈ ఏమార్చే కార్యక్రమం భారత కాలమానం ప్రకారం జూన్‌ 21,  సాయంత్రం  నుంచి జూన్‌ 21, 22 అర్ధరాత్రి సంధి కాలంలో జరిగింది. అర్ధరాత్రి దాదాపు 12.30 గంటలకు ఇరాన్‌లోని ఇస్‌ఫహన్‌ అణు కేంద్రం వద్ద కీలకమైన లక్ష్యాలపైకి రెండు డజన్లకుపైగా టోమాహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను అమెరికా జలాంతర్గామి ప్రయోగించింది. ఇరాన్‌ కాలమానం ప్రకారం జూన్‌ 22 తెల్లవారుజామున 2.10 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.10 గంటలకు కీలకమైన బీ-2 బాంబర్‌ రెండు పెద్ద బంకర్‌-బస్టర్‌ బాంబులను ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపైకి జారవిడిచింది. 25 నిమిషాల్లో మిగిలిన నతాంజ్‌, ఇస్‌ఫహన్‌ అణు కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ మొత్తం ఆపరేషన్‌కు ముక్తాయింపు అన్నట్టుగా టోమాహాక్‌ క్షిపణి ఇస్‌ఫహన్‌పైకి బాంబులతో దాడి చేసింది. బాంబర్లు ఒక్కొక్కటి దాదాపు 13,608 కేజీల బరువున్న డజనుకుపైగా అతిపెద్ద ఆర్డ్‌నెన్స్‌ పెనెట్రేటర్‌ బాంబులను ఫోర్డో, నతాంజ్‌ కేంద్రాలపైకి జారవిడిచాయి. మొత్తం బృందం తెల్లవారు జామున 4.35 గంటలకు ఇరాన్‌ నుంచి నిష్క్రమించింది.


దారికి రాకుంటే మళ్లీ దాడులు చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌లో ఫోర్డో, నటాంజ్‌, ఎస్‌ఫహన్‌ అణు కేంద్రాలపై దాడులను విజయవంతంగా పూర్తి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో చేసిన పోస్టులో ‘‘ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై మా దాడులను విజయవంతంగా పూర్తి చేశాం. కీలకమైన ఫోర్డో కేంద్రంపై పెద్ద ఎత్తున బాంబులతో దాడులు చేశాం. అన్ని విమానాలూ సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి.

మన ఘనత వహించిన అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే ఇతర మిలటరీ కూడా ఇంతటి ఘన కార్యాన్ని సాధించలేదు. శాంతికి సమయం ఆసన్నమైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, ఇజ్రాయెల్‌కు, యావత్‌ ప్రపంచానికి ఇది ఒక చరిత్రాత్మకమైన విజయం. ఇరాన్‌ ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి ఇప్పుడు అంగీకరించి తీరాలి’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. గతంలో మరే ఇతర బృందం చేయని విధంగా మేం కలసికట్టుగా పనిచేశాం. మేం ఇజ్రాయెల్‌కు ఈ భయానకమైన ముప్పును తొలగించడానికి చాలా దూరం వెళ్లాం. ఈ సందర్భంగా అద్భుతంగా పనిచేసిన ఇజ్రాయెల్‌ మిలటరీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అని అన్నారు. ఇరాన్‌ గురించి మాట్లాడుతూ ‘‘ఇరాన్‌ శాంతి లేదా విషాదం ఈ రెండిరట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. గడచిన ఎనిమిది రోజుల్లో అనుకున్నదానికన్నా మించినదానికి సాక్షిగా నిలిచాం. (దాడి చేయడానికి) మరిన్ని లక్ష్యాలు మిగిలి పోయాయని గుర్తుంచుకోండి. నేటిరాత్రి వారికి అత్యంత దుర్భరమైన, ప్రాణాంతకమైన రాత్రిగా మారింది. కానీ ఈ ప్రాంతంలో వెంటనే శాంతి నెలకొనని పక్షంలో మేం మిగిలిన లక్ష్యాలపై అత్యంత వేగంగా, కచ్చితంగా, నైపుణ్యంతో దాడి చేస్తాం’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ అణుశుద్ధి సామర్థ్యాన్ని దెబ్బ తీయడం లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపారు. అదే సమయంలో ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంలో ముందుండే దేశం (ఇరాన్‌) నుంచి అణ్వస్త్రాల ముప్పును తప్పించడానికి కూడా దాడులు చేసినట్టు చెప్పారు.


మద్య ప్రాచ్యానికి మంచిరోజులు: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

ఇరాన్‌లో కీలకమైన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేయించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కొనియాడారు. అమెరికా సైనిక చర్యను మధ్యప్రాచ్యం భవిష్యత్తుకు కొత్త రూపాన్ని ఇచ్చే ఒక సాహసోపేతమైన చర్యగా వర్ణించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశంలో ‘‘శక్తి ప్రదర్శనతోనే శాంతి నెలకొంటుంది. మొదట శక్తి ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత శాంతి నెలకొంటుంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అపరిమితమైన శక్తిని ప్రదర్శించారు. ఇది ఒక నిర్ణయాత్మకమైన, సాహసోపేతమైన చర్య. చరిత్రలో చిరస్మరణీయ మవుతుంది. ’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఆయన అభినందనలు తెలిపారు.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఆర్జించుకోవాలనుకునే అత్యంత ప్రమాదకరమైన ఏలుబడిని ఈ చర్య తిరస్కరించిందని అన్నారు. ప్రాంతంలో ముప్పులను దీటుగా ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్‌ పాత్రను నెతన్యాహు ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మరే ఇతర దేశమూ చేయలేనివిధంగా అమెరికా ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌ చేపట్టిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కేవలం అమెరికా భద్రత కోసమే కాకుండా యావత్‌ ప్రపంచం భద్రత కోసం  సైనిక చర్యకు పూనుకున్నారని చెప్పారు. ట్రంప్‌ లాంటి స్నేహితుడు మరొకరు ఉండరని, అణు ముప్పును తొలగించడంలో ఇజ్రాయెల్‌ పౌరులకు ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నామని ఆయన అన్నారు.


లైవ్‌లో టీవీ యాంకర్‌ పరార్‌

జూన్‌ 16, సాయంత్రం.. ముఖానికి ముసుగు లేకుండా బురఖా వేసుకున్న ఓ టీవీ న్యూస్‌ చానెల్‌ యాంకర్‌ ఎదురుగా ఉన్న మానిటర్‌ను, కెమెరాను సీరియస్‌గా చూస్తూ లైవ్‌లో వార్తలు చెబుతోంది. ఇరాన్‌ చేతిలో ఇజ్రాయెల్‌ చావు దెబ్బలు తింటోందని చేతులు తిప్పుతూ మరీ వివరిస్తోంది. ఈలోపల పెద్ద చప్పుడు వినిపించింది. ఒక్క క్షణం వార్తలు చెప్పడం ఆపింది. మళ్లీ తన పని మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిందో లేదో పై నుంచి స్టూడియో పైకప్పు పెచ్చులు వచ్చి మీద పడ్డాయి. వెనక్కి తల తిప్పి చూసింది. పెచ్చులు పడుతూనే ఉన్నాయి.

వెంటనే వార్తలు చెప్పడం ఆపేసి అక్కడ్నుంచి పరుగులు తీసింది. వార్తలు చూస్తున్న వీక్షకులకు టీవీ తెర అంతా దట్టమైన దుమ్మూ ధూళితో అలముకున్నట్టుగా కనిపించింది. కాసేపటికి ఇరాన్‌ ప్రభుత్వ టీవీ, రేడియో చానెల్‌` ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రధాన కార్యాలయం ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ధ్వంసమైపోయింది.


అమెరికాలో భద్రత కట్టుదిట్టం

అణు కేంద్రాలపై వైమానిక దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు అని ఇరాన్‌ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, లాస్‌ ఏంజెలెస్‌ సహా పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మత, సాంస్కృతిక, దౌత్యపరమైన ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు న్యూయార్క్‌ భద్రత అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు  నిర్దిష్టమైన లేదా నమ్మదగిన ఎలాంటి బెదిరింపులు రాలేదని, పరిస్థితులను ఎప్పటికప్పుడు మదింపు వేస్తూ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తెలిపారు.


హోర్ముజ్‌ జలసంధి మూసివేతకు రంగం సిద్ధం

మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్‌ కఠిన చర్యలకు సిద్ధమైంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి  తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని  మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపిందని పార్లమెంట్‌ సభ్యుడు ఇస్మాయిల్‌ కౌసరి టెహ్రాన్‌ తెలిపారు. అయితే దీనిపై సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ప్రపంచంలో చమురు రవాణాకు హోర్ముజ్‌ జలసంధి కీలకమైంది. దీని ద్వారా ప్రపంచం చమురు సరఫరాలో దాదాపు 30 శాతం రవాణా అవుతుంది. భారత్‌ చమురు దిగుమతులకు సైతం ఈ జలసంధి కీలకమైనది. ఇది పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రంతో కలుపుతుంది. దాదాపు 33కి.మీ.ల వెడల్పు ఉన్న దీని గుండా ప్రతి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు వేర్వేరు దేశాలకు రవాణా అవుతుంది. ప్రపంచదేశాలకు ముడి చమురు ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతుంది. ఈ జలసంధి లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌`ఎల్‌ఎన్‌జీ రవాణాకు కూడా కీలకమైనది. దీని ద్వారానే ప్రపంచానికి మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ రవాణా అవుతుంది. ఈ జలసంధిని మూసివేసిన పక్షంలో అది అంతర్జాతీయ మార్కెట్‌పైన పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. భారత్‌పైనా ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే భారత్‌ తన అవసరాల కోసమని 90 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో 40 శాతం హొర్ముజ్‌ జలసంధి ద్వారానే భారత్‌కు చేరుతుంది. చమురుతో వచ్చే నౌకలు ఒమన్‌, ఇరాన్‌ సముద్ర మార్గంలో ఉన్న ఈ జలసంధి మీదుగా ప్రయాణిస్తూ మనదేశానికి చేరుకుంటాయి. ఇరాన్‌ నిర్ణయం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనేది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం.

భారత్‌ ముందుచూపు

మనదేశం ప్రపంచ చమురు మార్కెట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఆ దిశగా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. చమురు దిగుమతుల్లో పెను మార్పులు చేసింది. గల్ఫ్‌ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది. రష్యా, అమెరికా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. ప్రపంచ వాణిజ్య విశ్లేషణ సంస్థ క్యాప్లర్‌ ప్రకారం భారత్‌ జూన్‌ నెలలో రష్యా నుంచి రోజుకు 20 నుంచి 22 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇది గత రెండేళ్లలోనే అత్యధికం. మే నెలలో చమురు దిగుమతి 11 లక్షల బ్యారెళ్లుగా ఉంది. గతంలో భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు మొత్తం దిగుమతుల్లో ఒక శాతం ఉండగా ప్రస్తుతం 40 శాతం నుంచి 44శాతం మధ్యలో ఉంది.

మనదేశం అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ జూన్‌  నెలలో అమెరికా నుంచి రోజుకు 4.39 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. గతంలో కన్నా ఇది రెండిరతలు పెరిగింది. మన దేశం ప్రతిరోజూ 51 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటోంది.


ఆదిలో మిత్రులు.. ఆనక శత్రువులు

మే 14, 1948న ఇజ్రాయెల్‌ను స్వతంత్ర సార్వభౌమ దేశంగా జియోనిస్టు నేత డేవిడ్‌ బెన్‌ గురియన్‌ టెల్‌ అవివ్‌లో ప్రకటించారు. అయితే ముస్లిం దేశాలలో అత్యధికం ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడానికి మొగ్గు చూపలేదు. కానీ షియా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇరాన్‌, టర్కీ దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తించాయి. అమెరికా తోడ్పాడుతో ఈ మూడూ మిత్రదేశాలుగా జట్టు కట్టాయి. రష్యా, అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నప్పుడు అప్పటి ఇరాన్‌ అధినేత మహమ్మద్‌ రెజా పహల్వీ అమెరికా వైపు మొగ్గు చూపారు. ప్రాంతీయంగా పట్టు సాధించడానికి పశ్చిమ దేశాలతో చేతులు కలిపారు. రెండు దశాబ్దాల తర్వాత అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాని డేవిడ్‌ బెన్‌ గురియన్‌ ఏలుబడిలో అరబ్‌యేతర దేశాలతో మైత్రికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇరాన్‌, టర్కీ, ఇథియో పియా, ఇజ్రాయెల్‌ దేశాలు కలసిమెలసి పనిచేశాయి. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌, ఇరాన్‌ నిఘా సంస్థ సావక్‌ మధ్య సమాచారం, ఆయుధాలు ఇచ్చి పుచ్చుకునేంతగా సంబంధాలు నెలకొన్నాయి. ఇరుదేశాలూ బలపడిన వాణిజ్య సంబంధాలతో అభివృద్ధిని సాధించాయి.

1979లో ఇరాన్‌లో చోటు చేసుకున్న తిరుగు బాటుతో మొహమ్మద్‌ రెజా షా పహ్లవీ నేతృత్వంలోని సామ్యవాదం ముసుగు తొడుకున్న రాచరిక ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అయతొల్లా రహొల్లా ఖొమేని ఆధ్వర్యంలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ ఆవిర్భ వించింది. తిరుగుబాటుకు తోడ్పడిన ఇతర భావజా లాలను, వాటిని భుజానికి ఎత్తుకున్న వారిని ఖొమేని ఏలుబడి మట్టుపెట్టడం మొదలుపెట్టింది. దీనికి హ్యాగింగ్‌ జడ్జి-ఉరిశిక్షలు విధించే న్యాయమూర్తిగా పేరొందిన కరుడుగట్టిన ఇస్లాం మతోన్మాది అయతొల్లా సాదెఖ్‌ ఖల్‌ఖలీ వత్తాసు పలికాడు.

1979 చివరకు వచ్చేసరికి దాదాపు 4,500 మంది ఇస్లామేతరులను ఉరి తీశారు. 1980కి వచ్చేసరికి 10 వేల మందిని చంపేశారు. 1988లో ఖొమేని స్వయంగా ఇచ్చిన ఆదేశాలకు లోబడి మరో 4,000 మందిని జైళ్లలో నిర్బంధించారు. ఆ తర్వాత వారందర్నీ ఉరి తీశారు. ఖొమేని జులై 20, 1988న చేసిన ఒక ప్రకటనలో ఇస్లామ్‌ ఏలుబడిని విస్తరింప జేయడానికి ప్రపంచంలో జియోనిజమ్‌, కేపిట లిజమ్‌, కమ్యూనిజమ్‌ మూలాలను కూకటివేళ్లతో సహా పెకలించివేస్తాం అని అన్నారు. మతోన్మాదం తలకెక్కించుకొని ఆయన ఈ మాట మూడు రోజుల తర్వాత ది న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైంది. ఇరాన్‌లో షరియాను అనుసరించి మహిళా హక్కులను కాలరాచారు. నైతిక పోలీసుల ద్వారా తొమ్మిదేళ్ల వయస్సు నుంచే బాలికలకు హిజాబ్‌ చట్టాలను వర్తింపజేశారు. మీడియాపై ఆంక్షలు విధించారు. స్వతంత్ర పాత్రికేయమనేది నేరంగా మారిపోయింది. 1979 నుంచి 2009 మధ్య కాలంలో కనీసం 860 మంది జర్నలిస్టులను జైల్లో పెట్టడం లేదా ఉరితీయడం చేశారు. ప్రతీ జైలూ పాలకుల క్రూరత్వా నికి ఓ సంకేతంగా మిగిలిపోయింది. మూడు దశాబ్దాల కాలంలో ఇంచుమించు 17 లక్షల మంది జైళ్లలో ఊచలు లెక్కపెట్టారు. అదే సమయంలో ఇరాన్‌ తన భావజాలాన్ని టెర్రరిజమ్‌, పరోక్ష యుద్ధం రూపేణా బాహ్య ప్రపంచానికి బట్వాడా చేసింది. దీనికి నాంది పలుకుతున్నట్టుగా 1979లో అమెరికా ఎంబసీని తన గుప్పిట పెట్టుకుంది. 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది. ఇరాన్‌ అండ చూసుకొని హెజ్‌బొల్లా ఉగ్రమూక 1983లో బీరూట్‌లో అమెరికా మెరైన్‌ బారాక్‌లపై బాంబులతో దాడి చేసింది. 241 మంది అమెరికన్లను పొట్టనపెట్టుకుంది. అదే ఉగ్రమూక 1982 నుంచి 1992 మధ్యకాలంలో లెబనాన్‌లో 25 మంది అమెరికన్లను కిడ్నాప్‌ చేసింది. వారిలో ఐదుగురిని హత్య చేసింది.

1979లో ఇరాన్‌లో తిరుగుబాటు ఇజ్రాయెల్‌పై దుష్ప్రభావాన్ని చూపింది. ఇరుదేశాల మధ్య దూరం పెరిగింది. ఇజ్రాయెల్‌ పాస్‌పోర్టులు ఉన్నవారిని పాలస్తీనాలోకి అనుమతించని పరిస్థితి ఏర్పడిరది. 1980, 90 దశకాల్లో ఇరాన్‌ పాలస్తీనాతో పాటుగా హెజ్‌బొల్లా, హౌతీ, హమాస్‌ వంటి ఉగ్రమూకలకు నిధులు , ఆయుధాలు సమకూర్చడం, వాటితో కలిసి దురాక్రమణలు పాల్పడటంతో ఇజ్రాయెల్‌ రగిలి పోయింది. కొద్దికాలానికే ఇరుదేశాలూ ఆగర్భశత్రువు లుగా మారిపోయాయి. డిసెంబర్‌, 2000లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్‌ను కేన్సర్‌ కణతితో పోల్చారు. ఆ తర్వాత యురేనియం శుద్ది, అణ్వాయుధాల తయారీపై ఇరాన్‌ పూర్తిగా దృష్టి పెట్టింది. అది తన అస్తిత్వానికి ముప్పుగా ఇజ్రాయెల్‌ భావించింది. దాంతో జూన్‌ 13,  తెల్లవారుజామున ఆపరేషన్‌ రైజింగ్‌ లయన పేరిట ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగింది. ఇరాన్‌ అదేరోజు సాయంత్రం ఆపరేషన్‌ ఆనెస్ట్‌ ప్రామిస్‌`3 పేరిట ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది.


అమెరికా నిర్ణయాల వెనుక కీలకమైన గది

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి జూన్‌ 17న అర్థంతరంగా స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఆయన వెళుతూ తన కోసం శ్వేత సౌధంలోని సిచువేషన్‌ రూమ్‌ వద్ద వేచి ఉండాలని జాతీయ భద్రతా మండలిని ఆదేశించారు. ట్రంప్‌ సిచువేషన్‌ రూమ్‌లో మండలి అధికారులతో సమావేశమైన తర్వాతనే అణు కార్యక్రమాలు పక్కన పెట్టి ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోవాలంటూ ఇరాన్‌ అధినేత ఖమేనీని హెచ్చరించారు. ఈ గది నుంచే ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌కు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌ను ఉపాధ్యక్షుడు వాన్స్‌తో కలిసి ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. ఇంతటి కీలకమైన సిచువేషన్‌ రూమ్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ 1961లో ప్రారంభించారు. తొలిసారిగా ఈ గదిని క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వాడారు.

సెప్టెంబర్‌ 11, 2001న అమెరికాలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వాటిపై ఎలా స్పందించాలనే ప్రణాళిక తయారైంది కూడా ఈ గదిలోనే. 2011లో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ను అమెరికా నావికాదళానికి చెందిన ప్రత్యేక బలగాలు పాకిస్తాన్‌లో మట్టు పెట్టాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ గదిలో నుంచే లాడెన్‌ను మట్టుపెడుతున్న వైనాన్ని స్వయంగా పర్యవేక్షించారు. 1991లో అప్పటి దేశాధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ బోస్నియా విషయమై భద్రతా మండలితో ఇదే గదిలో చర్చించారు. ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ గదితో ఇంతకుమునుపే పరిచయం ఉంది. తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఆయన 2020లో ఐసిస్‌ ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బగ్దాదీని అమెరికా దళాలు సిరియాలో అంతం చేసిన ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. పేరుకు సిచువేషన్‌ రూమ్‌ అన్న మాటే గానీ 5,525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ గదిలో ఒక సమావేశ మందిరం, నిఘా నిర్వహణా కేంద్రమూ ఉన్నాయి.


భూగర్భంలో ఇరాన్‌ అగ్రనేత

ఇరాన్‌ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేని సురక్షితమైన భూగర్భ బంకర్‌లో తలదాచుకున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లకు దూరంగా ఉంటున్నారు. ఖమేని హత్యకు కుట్రలు జరుగుతున్నాయనే సమాచారంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కీలకమైన వారితో వ్యక్తిగతమైన సంభాషణలకే పరిమితమైపోయారు. ఇరాన్‌ కార్యాచరణపై బంకర్‌ నుంచే సూచనలు చేస్తున్నారు. తన తదనంతరం అగ్రనేతను ఎంపిక చేసే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌ సైన్యంలో కీలకమైన పదవుల్లో నియమించాల్సిన కమాండర్ల పేర్లను ఆయన ప్రకటించారు. సాధారణంగా ఇరాన్‌కు అగ్రనేతను నియమించే ప్రక్రియ నెలల పర్యంతం కొనసాగుతుంది.

అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో తన వారసుడి ఎంపిక కోసమని ముగ్గురిని ఆయన ఎంచుకున్నారు. ఇరాన్‌లోని మతాధికారులు ఆయన ప్రతిపాదించిన పేర్లను పరిశీలించి వారిలో ఒకరిని ఎంపిక చేస్తారు. కానీ ఖమేని ప్రతిపాదించిన జాబితాలో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేని పేరు కూడా ఉన్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.అయితే అలాంటిదేమీ లేదని ఇరాన్‌ అధికారులు స్పష్టం చేశారు.


అమెరికా నావికాదళంపై దాడి చేస్తాం

అణు కేంద్రాలపై దాడికి ప్రతిగా బహ్రెయిన్‌లో అమెరికా నావికాదళంపై క్షిపణులతో దాడి చేస్తామని ఇరాన్‌ కీలక నేత అలీ ఖమేని హెచ్చరించారు. హోర్ముజ్‌ జలసంధిలోకి అమెరికా, బ్రిటీష్‌, జర్మనీ,ఫ్రాన్సు దేశాలకు చెందిన నౌకలను అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. ఇప్పుడిక మావంతు వచ్చింది. అమెరికా దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. అమెరికా ఆరంభించిన యుద్ధానికి తాము ముగింపు పలుకుతామని అన్నారు. ఇదే విషయమై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇరాన్‌ శాంతి అవసరాల కోసం ఏర్పాటు చేసిన అణు కేంద్రాలపై అమెరికా మిలటరీ దారుణంగా వైమానిక దాడులు చేయడాన్ని ఇరాన్‌ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా దాడులతో ఐక్యరాజ్యసమితి`ఐరాస చార్టెర్‌లో మౌలిక సూత్రాలను, అంతర్జాతీయ చట్టంలో నియమాలను ఉల్లంఘించింది. ఈ ఘోరమైన నేరం యుద్ధపిపాసి, చట్టాలను ఉల్లంఘించే అమెరికా ప్రభుత్వం బాధ్యత వహించాలి అని పేర్కొంది. దీనిపై ఐరాస భద్రతామండలిని అత్యవసరంగా సమావేశపరచాలని కోరింది. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ`ఐఏఈఏ అణుకేంద్రాలపై అమెరికా దాడులను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది.


ఇరాన్‌ ఒంటరి పోరాటం

ఇరాన్‌ మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల పలుకుబడికి నిలువునా పాతరేసి యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌ పేరిట లెబనాన్‌, పాలస్తీనా, యెమెన్‌, ఇరాక్‌ దేశాల్లో తనకు తొత్తులైన ఉగ్రమూకలతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించుకున్న కూటమి ప్రస్తుత కష్టకాలంలో ఆ దేశానికి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలతో ఇరాన్‌ ఒంటరి పోరాటం చేస్తోంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా, పాలస్తీనాలో హమాస్‌, యెమెన్‌లో హౌతీలు, ఇరాక్‌లో షియా మిలీషియాలు కనీసం మాట సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. లెబనాన్‌లో షియా పారామిలటరీ గ్రూప్‌ అయిన హెజ్‌బొల్లా ఇరాన్‌కు ఎంతో నమ్మకంగా ఉండేది. కానీ ఇరాన్‌ భూభాగం పైకి ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా ఎలాంటి చర్యకు దిగలేదు. అదే ఏడాది క్రితం చూస్తే హెజ్‌బొల్లా పరిస్థితి ఎంతో గొప్పగా ఉండేది. 2023 నుంచి ఇజ్రాయెల్‌ అదేపనిగా చేస్తున్న దాడులతో ఈ ఉగ్రమూక కుదేలైపోయింది. దాని సుదీర్ఘకాలపు నేత హస్సన్‌ నస్రుల్లా ఇజ్రాయెల్‌ గురిపెట్టి చేసిన దాడిలో హతమైపోయాడు. దాంతో హెజ్‌బొల్లా చప్పబడిపోయింది.

హమాస్‌ గాజాలో పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌గా ఉంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న పోరాటంతో గాజా శిథిలావస్థకు చేరుకుంది. హమాస్‌ అగ్ర నేతలు ఇస్మాయిల్‌ హనియే, యహ్వా సిన్వార్‌ సహాశ చాలా పెద్ద తలకాయలు రాలిపోయాయి. మిగిలిన ఏకైక నేత ఖలేద్‌ మషాల్‌ ఏం చేయాలా అని ఖతార్‌లో తలపట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇజ్రాయెల్‌ వరుసదాడుల్లో గాజాలో హమాస్‌ కష్టపడి కట్టుకున్న సొరంగాలు, కమాండ్‌ సెంటర్లు, రాకెట్‌ ఫ్యాక్టరీలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇక ఇరాక్‌ విషయానికి వస్తే ఒకప్పుడు అక్కడ షియా మిలీషియాలంటే హడల్‌. అమెరికా బలగాలను ఓ ఆట ఆడుకునేవారు. ఇరాన్‌ పలుకుబడిని బాగ్దాద్‌లో బాగా పెంచేవారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇరాన్‌ గడ్డపైకి ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులతో మిలీషియాలు బాగా దెబ్బతిన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయినప్పటికీ ఇరాన్‌`ఇజ్రాయెల్‌ `అమెరికా గొడవల్లో తలదూర్చవద్దని మిలీషియా కమాండర్లను ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ అల్‌ సదానీ హెచ్చరించారు.

యెమెన్‌లో హౌతీలు ఈ ఏడాది మార్చి వరకు మంచి జోరు మీద ఉన్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులు జరిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అమెరికా వైమానిక దాడులతో హౌతీల క్షిపణి స్థావరాలపై విరుచుకుపడిరది. దీంతో హౌతీలు చేతుల్లో క్షిపణులు లేక చేష్టలుడిగిపోయారు. ఎటు నుంచి ఏదొచ్చి మీద పడుతుందోనని అప్రమత్తంగా ఉంటున్నారు.


ఇజ్రాయెల్‌కు అణు ప్రాణం

అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందనే కారణంతో ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు దిమోనా పట్టణానికి దగ్గర్లో అణు కార్యక్రమాలకు సంబంధించిన కేంద్రం ఉందని ది న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడిరచింది. ఈ కేంద్రం దిమోనా పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో, మృత సముద్రానికి దాదాపు 30 కి.మీ.ల దూరంలోని నెగెవ్‌ ఎడారిలో ఉంది. అధికారికంగా దాన్ని నెగెవ్‌ అణు పరిశోధన కేంద్రం అని పిలుస్తారు. ఇజ్రాయెల్‌ దాన్ని ఒక పరిశోధనా కేంద్రంగా చెప్పుకుంటున్నప్పటికీ అది దేశ అణ్వాయుధ కార్యక్రమాలకు గుండెకాయ లాంటిదనే అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది. ఇజ్రాయెల్‌ అణు కార్యక్రమానికి సుదీర్ఘమైన, రహస్య చరిత్ర ఉంది. ఇజ్రాయెల్‌ ఈ కేంద్రానికి 1958లో పునాదిరాయి వేసింది.

డిమోనా కాంప్లెక్స్‌లో అణ్వాయుధాల తయారీలో కీలకమైన ప్లుటోనియంను ఉత్పత్తి చేసే రీప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఉందని డిసెంబర్‌, 1960లో అమెరికా నిఘా వ్యవస్థ ఒక నివేదికలో వెల్లడిరచింది. 1973నాటికి ఇజ్రాయెల్‌ అణ్వాయుధాలు తయారు చేస్తున్నదని అమెరికా నిర్ధారించుకున్నది.

అందుకనే ఇజ్రాయెల్‌ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం పెట్టలేదనే మాట ఇరాన్‌లో వినిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ`ఐఏయీఏ డిమోనా కాంప్లెక్స్‌ను ఇప్పటివరకు తనిఖీ చేయలేదు అనేది ఇజ్రాయెల్‌ ప్రత్యర్థుల వాదన. అదే సమయంలో ఇజ్రాయెల్‌ దగ్గర కనీసం 90 అణ్వాయుధాలు ఉంటాయని ది స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడిరచింది.


ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌

200 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్‌ భీకరదాడి

జూన్‌ 13, తెల్లవారకముందే ఇరాన్‌లోని అణు కేంద్రాలు, మిలటరీ స్థావరాలపై 200 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్‌ భీకరమైన దాడి చేసింది. నతాంజ్‌లోని అణు కేంద్రం ధ్వంసమై పోయింది. అక్కడి నుంచి దట్టమైన పొగ గంటలసేపు ఆకాశాన్ని అలముకుంది. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ అధినేత మేజర్‌ జనరల్‌ హోస్సెయిన్‌ సలామీ అమరులైనారని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆయన్ను జియోనిస్టు బలగాలు నేరుగా హత్య చేశాయని ఆరోపించింది. సలామీ ఇరాన్‌ సైనిక వ్యూహానికి కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. లెబనాన్‌, సిరియా, ఇరాక్‌, యెమెన్‌ దేశాల్లో ఇరాన్‌ పరోక్ష యుద్ధానికి సూత్రధారిగా వ్యవహరించారని తెలిపింది. దాడుల్లో మరికొందరు సీనియర్‌ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు అమరులైనారని వెల్లడిరచింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ధ్వంసమైపోయిన నతాంజ్‌లోని అణు కేంద్రం మధ్య ఇరాన్‌లోని ఇస్‌ఫాహన్‌ ప్రావిన్సులో ఉన్న ఎడారి ప్రాంతంలోని భూగర్భంలో ఒక లక్ష చదరపు మీటర్ల మేర వ్యాపించి ఉంది. వేలాది అణు శుద్ధి కేంద్రాలకు నతాంజ్‌ ఆవాసంగా ఉంది. అణ్వాయుధాలపై ఇరాన్‌ పెట్టుకున్న ఆశలకు, పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్‌ భయాందోళనలకు కేంద్రంగా మారింది. ఇరాన్‌ అధికారిక మీడియా ప్రసారం చేసిన చిత్రాల ప్రకారం నతాంజ్‌ కేంద్రంలో భూమిపైన పైలెట్‌ ఇంధన శుద్ధి కేంద్రం వద్ద మంటలు కనిపించాయి. భూగర్భంలో ఉన్న ఇంధన శుద్ధి కేంద్రం ఏమేరకు దెబ్బతిన్నదీ తెలియరాలేదు. అయితే భూమిపై చోటు చేసుకున్న విధ్వంసంతో ఇరాన్‌కు అత్యంత కీలకమైన అణు కేంద్రం వద్ద కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. నతాంజ్‌ అణు కేంద్రం ధ్వంసమైన వైనాన్ని అంతర్జా తీయ అణుశక్తి ఏజెన్సీ`ఐఏఈఏ నిర్దారించింది.

పేలుళ్ల శబ్దాలు, వైమానిక దాడిని హెచ్చరించే సైరన్ల మోతల మధ్య ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌వాసులు జూన్‌ 13, ఉదయం నిద్ర లేచారు. 78 మంది మరణించారు. టెహ్రాన్‌కు పశ్చిమంగా చిట్‌గర్‌ జిల్లాలో ఎలాంటి అణుకేంద్రం లేకపోయినప్పటికీ వైమానిక దాడుల కారణంగా దట్టమైన పొగ ఆకాశాన్ని అలముకుంది. దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే దేశ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ఇరాన్‌ పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ సైతం అంతే స్థాయిలో గగనతల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ఆరంభించినట్టు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జూన్‌ 13న ప్రకటించారు. ఇజ్రాయెల్‌ మనుగడకే ముప్పుగా పరిణమించిన అణు కార్యక్రమాన్ని ఇరాన్‌ విరమించుకునేంతవరకు ఆ దేశంలోని లక్ష్యాలపై దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇరాన్‌ గతేడాది ఇజ్రాయెల్‌పై 300 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఒక్కొక్క క్షిపణి వందలాది ప్రజలకు ముప్పు తెచ్చేలా ఒక టన్ను పేలుడు పదార్థాలను మోసుకొచ్చి, జనావాసాలమీదకు జారవిడుస్తుందని తెలిపారు. ఇరాన్‌ వచ్చే మూడేళ్లలో ఇలాంటి 10వేల క్షిపణులను తయారు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘పరిమాణంలో న్యూజెర్సీ అంత ఉన్న మా దేశంపైకి 10 వేల టన్నుల పదార్థం పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఏమాత్రం సహించలేని ముప్పు. దీన్ని ఆపి తీరాలి’’ అని అన్నారు.


అంతర్జాతీయ స్పందన

అమెరికా ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌ పేరిట ఇరాన్‌పై వైమానిక దాడుల చేయడం పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించింది.

ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడం ఆందోళనకు గురి చేసింది. ఈ దాడి అంతర్జాతీయ శాంతి, భద్రతకు పెనుముప్పుగా భావిస్తున్నాం. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు కృషి చేయాలి. యూఎన్‌ చార్టెర్‌, అంతర్జాతీయ చట్ట నియమాల ప్రకారం సభ్యదేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి. వారి బాధ్యతలను నిలబెట్టుకోవాలని పిలుపునిస్తున్నాను. సైనిక చర్యతో ఉద్రిక్తతలకు పరిష్కారం దొరకదు. దౌత్య మార్గం ఒక్కటే పరిష్కారం చూపిస్తుంది. ఈ వివాదం అదుపు తప్పే ప్రమాదం ఉంది. ప్రపంచం విపత్కర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది ` ఐక్యరాజ్యసమితి


ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సార్వభౌమ రాజ్యం భూభాగాన్ని క్షిపణి, బాంబు దాడులకు గురిచేయడం ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం. అది అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి చార్టెర్‌ను ఉల్లంఘిస్తుంది. దురాక్రమణకు ముగింపు పలకాలి. పరిస్థితిని రాజకీయ,దౌత్యపరమైన పట్టాల మీదకు తీసుకొనిరావాలి  – రష్యా


ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమెరికా అంతర్జాతీయ చట్టాలన్నింటినీ ఉల్లంఘించింది. ఐక్యరాజ్యసమితి చార్టెర్‌ ప్రకారం ఇరాన్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితిపై తీవ్రమైన ఆందోళనతో ఉన్నాం. సైనిక చర్యలు వద్దు. శాంతికి దౌత్యమే ఏకైక మార్గం  – పాకిస్తాన్‌


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్న అమెరికా ఇరాన్‌ అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి చార్టెర్‌, అంతర్జాతీయ చట్టం, అణువ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించింది  – ఇరాన్‌


ఇరాన్‌పై అమెరికా దురాక్రమణ దాడి అత్యంత ప్రమాదకరమైనది. అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు మా సంఫీుభావాన్ని ప్రకటిస్తున్నాము. ఇరాన్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యంపైన మాకు పూర్తి నమ్మకం ఉంది  – హమాస్‌


ఇరాన్‌ అణు కేంద్రాలపై జరుగుతున్న దాడులను, ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలను చాలా ఆందోళనతో గమనిస్తున్నాము. సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని కనుక్కోవాలి – సౌదీ అరేబియా


ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడి చేయడంతో అమెరికా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రమాదకరమైన ఉద్రిక్తతలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో విపత్కర పరిణామాలకు దారి తీయవచ్చు. వివేకంతో సంయమనాన్ని పాటించడం ద్వారా అన్ని పక్షాలు ఉద్రిక్తతలను నివారించాలి  – ఖతార్‌


ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతరం నెలకొన్న ఉద్రిక్తతలపైన ఆందోళన చెందుతున్నాం  – ఒమన్‌


ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులతో మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు, భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.  – ఇరాక్‌


ఇరాన్‌ అణు కార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు పెను ముప్పు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి మేం ఎప్పటికీ అనుమతించము. ఈ ముప్పును నివారించడానికే అమెరికా వైమానిక దాడులకు పాల్పడిరది  – ఇంగ్లండ్‌


మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నివారించడానికి ఇరుపక్షాలు చర్చలకు రావాలి  – ఐరోపా యూనియన్‌


ఇరాన్‌ దౌత్యపరమైన పరిష్కారం కోసం అమెరికాతో వెంటనే అణు ఒప్పందంపై చర్చలు జరపాలి  ` జర్మనీ


అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. వెంటనే దౌత్య చర్చలు చేపట్టాలి – స్విట్జర్లాండ్‌


ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. సైనిక చర్యపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాను. ఉద్రిక్తతలను తగ్గించుకొని శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చాను. ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరతను త్వరగా పునరుద్ధరించాలి  – మోదీ


అమెరికా ఎందుకు ప్రవేశించింది?

ఇరాన్‌తో అణు కార్యక్రమాన్ని విరమింప జేయడానికి ఇజ్రాయెల్‌ జూన్‌ 13న ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట వైమానిక దాడులను ఆరంభించింది. అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌లో జనావాసాలపైకి దాడులకు దిగింది. ఇరుపక్షాలు హోరాహోరీగా పరస్పర దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్యం రణరంగాన్ని తలపించింది. అయితే నంటాజ్‌, ఫోర్డో అణు కేంద్రాలు ఇరాన్‌కు పెట్టని కోటలాంటివి. ఇవి ఎత్తయిన పర్వతాల దిగువన, లోతైన సొరంగాల్లో ఉన్నాయి. ఫోర్డో అణు కేంద్రంలో యురేనియం శుద్ధి 60 శాతానికి చేరుకుంది. అది 90 శాతం దాటితే అణ్వస్త్రాలను తయారుచేసుకునే సామర్థ్యం ఇరాన్‌ సొంతమవుతుంది. కాగా 2023లో అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ పరిశీలనల్లో నంటాజ్‌ కేంద్రంలో యురేనియం శుద్ధి 83.7 శాతానికి చేరిందని తేలింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ఆ దాడుల్లో ఫోర్డో కేంద్రంలో కేవలం 1,500 సెంట్రిక్‌ ఫ్యూజ్‌లు మాత్రమే దెబ్బతిన్నాయి. అక్కడ మొత్తం 3,000 సెంట్రిక్‌ ఫ్యూజ్‌లు ఉన్నట్టు సమాచారం.

దాడుల్లో పెద్ద నష్టమేమీ జరగలేదు. చివరకు విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోలేదు. ఈ శత్రు దుర్బేధ్యమైన అణు కేంద్రాలను ధ్వంసం చేయగల శక్తియుక్తులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. అమెరికా అమ్ములపొదిలోని జీబీయూ`57 బంకర్‌`బస్టర్‌ బాంబులు భూగర్భంలోని అణుకేంద్రా లను నామరూపాల్లేకుండా చేయగలవు. ఈ బాంబులు 20 అడుగుల పొడవు, 13 వేల కిలోల బరువు ఉంటాయి. వాటిని ప్రయోగించడానికి అవసరమైన బీ`2 స్పిరిట్‌ బాంబర్లు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. అయితే ఇరాన్‌ అణ్వాయుధాలు తయారుచేసుకోవడానికి కనీసం మూడేళ్లయినా పడుతుందని అమెరికా భావించింది. అందుకనే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పోరాటం కొనసాగు తుండగానే, ఇప్పటికైనా మించిపోయింది లేదు మాతో వచ్చి అణు ఒప్పందం కోసమని చర్చలు జరుపు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు సూచించారు. అణు ఒప్పందం కుదుర్చుకో వాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే చర్చలకు వస్తానని ఇరాన్‌ బదులిచ్చింది.

ఈలోగా ఇజ్రాయెల్‌ దగ్గర ఆయుధాలు నిండు కుంటున్నాయనే వార్త దావాలనం వ్యాపించింది. ఇజ్రాయెల్‌ గగన రక్షణ వ్యవస్థకు అవసరమైన క్షిపణులు, మందుగుండు సామాగ్రి 10 రోజులకు సరిపడ మాత్రమే ఉన్నాయనే సమాచారం గుప్పుమంది. ఇరాన్‌ క్షిపణి దాడుల్లో టెల్‌ అవివ్‌, జెరూసలెమ్‌లో ఉన్న అమెరికా దౌత్యకార్యాలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా ఇరాన్‌పైకి దాడి చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి ఊతమిస్తున్నట్టుగా కెనడాలో జీ`7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ట్రంప్‌ అర్ధంతరంగా సదస్సును ముగించుకొని అమెరికా దారిపట్టారు. ఇరాన్‌`ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కోసం తాను వెనుదిరగ లేదని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

అయితే ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చడానికే ట్రంప్‌ అర్థంతరంగా బయలుదేరారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శాంతి ఒప్పందం కోసం తాను చూడటంలేదని, శాశ్వతమైన ముగింపు కోసం చూస్తున్నానని అన్నారు. అసలు ఇరాన్‌ దగ్గర ఎప్పటికీ అణ్వస్త్రాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని స్వయంగా విజ్ఞప్తి చేశారు. స్వదేశానికి చేరుకోగానే జాతీయ భద్రతా మండలి అధికారులతో సమావేశమయ్యారు. ఇరాన్‌ సైనిక, అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో చేరాలా? వద్దా? అని అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో నిర్ణయిస్తారని వైట్‌ హౌస్‌ ప్రకటించింది.

అయితే అమెరికా అధ్యక్షుడు అవునన్నా, కాదన్నా ఇరాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా రెండు వారాల గడువు ఇరాన్‌ను గందరగోళంలో పడేసింది. అయితే ట్రంప్‌ మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉన్నది. ఈ రెండు వారాల గడువు అనే పదాన్ని ఆయన అధ్యక్షుడిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అలాగే గత రెండు నెలల్లో డజనుసార్లు రెండు వారాల్లో చర్యలు తీసుకుంటాననే మాట చెప్తూ వచ్చారు. 2017లో పన్ను సవరణ ప్రణాళికల సమయంలో రెండు వారాల గడువు అని చెప్పారు. టారిఫ్‌ రేట్లను నిర్ణయించడానికి రెండు వారాల సమయం, ఆరోగ్య సంరక్షణ, మౌలికసదుపాయాలపై రాబోయే చర్యల కాలపరిమితి విషయంలో రెండు వారాలు, ఔషధ కంపెనీలపై సుంకాలు విధించడానికి రెండువారాలు, ఉక్రెయిన్‌కు నిరంతర సహాయంపై నిర్ణయం తీసుకోవడానికి రెండువారాలు, పుతిన్‌ను కలిసి యుద్ధాన్ని ముగించడానికి రెండు వారాలు, చైనాతో వాణిజ్య ఒప్పందానికి రెండు వారాల సమయం, కెనడాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి రెండు వారాలు, ఇరాన్‌పై దాడి చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి రెండు వారాలు, ఇలా అనేక సందర్భాల్లో ఆయన రెండువారాల గడువును ప్రస్తావించారు. అయితే ఇజ్రాయెల్‌ దగ్గర ఆయుధాలు తరిగిపోతున్నాయన్న వార్తలు, ఇరాన్‌ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ చేసిన దాడులు పెద్ద ప్రభావం చూపక పోవడంతో రెండు వారాలు అన్న మాటను అటకెక్కించారు. రెండు రోజుల్లోనే రంగంలోకి దిగారు. మధ్యప్రాచ్యంలో అతి పెద్ద యుద్ధ వాతావరణానికి ట్రంప్‌ తెరదీశారు.

–  జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE