‘పందొమ్మిదవ శతాబ్దిన విలసిల్లిన ప్రసిద్ధ పండితులో పరవస్తు చిన్నయసూరి ప్రథమగణ్యుడు. ఈతడు రచించిన గ్రంథములలో బాలవ్యాకరణమును, నీతి చంద్రికయు ఇంచుమించుగ నూరేండ్ల నుండి అన్ని పాఠశాలల్లోను నియతముగా బఠనీయ గ్రంథములై పండిత లోకమున ప్రామాణికములైనవి. ఆంధ్ర దేశమంతటను నధిక వ్యాప్తినందినవి. అక్షరాస్యులైన తెలుగువారిలో నీతిచంద్రిక చదవని నేటి విద్యార్థి కాని, బాల వ్యాకరణమునెరుగని పండితుడు గాని లేడని చెప్పుట సత్యోక్తియే గాని అతిశయోక్తి కాదు. ప్రాచీనకాలమున వచన రచనకు వ్యాకరణ రచనకు నన్నయ్య వలె, నవీన కాలంలోనీ రెండింటికిని చిన్నయ సూరి మార్గదర్శకుడు.’ (‘తత్త్వబోధిని’,1866)
తత్త్వబోధిని పత్రిక ఇచ్చిన ఇంకొన్ని విశేషాలు చిన్నయసూరి ఘనతను వెల్లడిస్తున్నాయి. చెన్నపురి పాఠశాలలో ఉపయుక్త గ్రంథకరణ సభ (The Madras School Book and Vernacular Society) కు సూరి అధ్యక్షుడయ్యాడని కూడా ఆ పత్రిక ప్రకటిం చింది. ఇంకా- పందొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో ఆంగ్లేయుల పరిపాలనతో ఆంధ్రసారస్వతంలో నూతన అధ్యాయం ఒకటి ఏర్పడిందనీ, పాశ్చాత్యులు పరభాషను తెలుగును నేర్చుకొనడానికి సులభమైన పద్ధతులు అవలవంభించడం వల్ల వ్యవహారిక భాషకే గాని, గ్రాంథిక భాషకు ఆస్కారం లేకపోయిందని తత్త్వబోధిని విశ్లేషించింది. ఆంధ్ర వాఙ్మయ ప్రపం చంలో అజరామరం, ఆచంద్రార్కము అయిన యశస్సు సంపాదించిన నన్నయాదికవులతో సరితూగదగిన వాడు ఇతడొక్కడే అని చెప్పింది. చిన్నయసూరి దుందుభినామ సంవత్సరంలో కీర్తిశేషుడైనాడు. వాఙ్మయ ప్రపంచంలో ఆయన యశోదుందుభి నేటికిని, రేపటికిని మారుమోగుతూనే ఉంటుందని కూడా జోస్యం చెప్పింది. అదే నిజమైంది.
‘నీతిచంద్రిక’ కేవలం పంచతంత్రానికి అను వాదం కాదు. ఈ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేస్తే నీతి కౌశలం, భాషాజ్ఞానం కూడా కలుగుతాయి. విద్యార్థులకు భాషాజ్ఞానం, నీతిని అందించారు సూరి. విష్ణుశర్మ లాగే సూరి కూడా కథకే ప్రాధాన్యమిచ్చాడు. మొదట చదువు ఆవశ్యకత చెప్పారు.
‘‘విద్య యొసగును వినయంబు! వినయంబునను
బడయుబాత్రత, బాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
నైహికాముష్మిక సుఖంబులందు నరుడు’’
ఓ ఎనభై ఏళ్లక్రితం జార్జ్ ఆర్వేల్ ‘ఏనిమల్ ఫార్మ్’ నవల రాశాడు. ఆ కథ-మిస్టర్ జోన్స్‌కి ఒక జంతువుల పెంపకం కేంద్రం (ఏనిమల్ ఫార్మ్) ఉంది. గుర్రాలు, ఆవులు, మేకలు, గాడిదలు, పందులు, కోళ్లు అన్నీ ఉన్నాయి. కానీ సరిగ్గా తిండి పెట్టకపోవడంతో తిరుగుబాటు చేద్దాం అనిపించి, జంతువులన్నీ ఉద్యమగీతం పాడతాయి. చదువు వచ్చిన పందులు మిగతా వాటికి చదువు చెప్పి తిరుగుబాటు చేసి విజయం సాధిస్తాయి.
ఈ రచన సోవియెట్ రష్యా రాజకీయాలపై ఎక్కు పెట్టిన ఆ వ్యంగ్యాస్త్రం. పంచతంత్ర కథల్లాగే ఆగకుండా చదివిస్తుంది. భారతదేశంలో 5వ శతాబ్దంలోనే ‘పంచతంత్రం’ పేరుతో విష్ణుశర్మ చక్కటి నీతి కథలను అందించారు. దూబగుంట నారాయణ రాసిన ‘హితోపదేశం’ ఆధారంగా పంచతంత్ర కథలను శబ్దబ్రహ్మ చిన్నయ సూరి చక్కగా తెనిగించారు. ‘పద్యా నికి ఆద్యుడు నన్నయ, గద్యానికి ఆద్యుడు చిన్నయ’ అని ఖ్యాతి. వావిళ్ల వారు చిన్నయ్య సూరి గురించి ఇంగ్లీషులో రాయించడం వల్ల దేశమంతా తెలిశారు.
పుత్ర సంతానం కోసం పరవస్తు వేంకటరంగ రామానుజాచార్యులు, శ్రీనివాసమ్మ పుత్ర కామేష్ఠి చేయగా ప్రభవనామ సంవత్సరం, రేవతి చతుర్ధ పాదంలో ఓ పుత్రుడు జన్మించాడు (డిసెంబర్ 20, 1806). పుత్రునికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు. అది శ్రీనివాసయ్య, శీనయ్య చివరికి చిన్నయగా మారింది. చిన్నయ మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పండితునిగా చేరాడు. నాటి ప్రిన్సిపల్ అర్బతునాట్ స్వల్పకాలంలోనే సూరి పాండిత్యం, బోధనా పటిమకు ముగ్ధుడై, ‘నీవు శాస్త్రి అని ఎందుకు పెట్టుకోలేదు’ అని అడిగాడు. ‘‘నేను పుట్టు శాస్త్రిని కాదు, పెట్టు శాస్త్రిని కాదు’ అని చెప్పాడట. మరి ఏ పేరైతే బాగుం టుందని అర్బతునాట్ అడగ్గా ‘సూరి’ బాగుంటుంద న్నాడట. అలా చిన్నయ సూరి అయ్యాడు.
ఎ.జె.అర్బత్‌నాట్, సి.పి.బ్రౌన్, గాజుల లక్ష్మీనర సింహశెట్టి, కలవలపల్లి రంగనాథశాస్త్రి, కుమారస్వామి శాస్త్రులు, శ్రీనివాస మొదలియార్, శ్రీనివాస రాఘవా చార్యులు, రామచంద్రాచార్యులు, శిరోమణి అప్పలా చార్యులు, తిరుక్కోటియార్ సుందరాచార్యులు, తిరుమహేంద్రపురం వరదాచార్యులు, వైయాకరణి విజయరాఘవాచార్యులు, వింజమూరి రామానుజా చార్యులు, వేదం పట్టాభిరామశాస్త్రి, రావిపాటి గురు మూర్తి శాస్త్రి, పూదూరి సీతారామ శాస్త్రి, పురాణం హయగ్రీవశాస్త్రులు వంటివారు సూరికి ఆప్తులు.
పాటలీపుత్రాన్ని (పట్నా) సుదర్శనుడు పాలించే వాడు. విద్వాంసులతో మాటామంతీ జరుపుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు చదువు ఉపయోగాలను వివరిస్తూ పద్యాలు చెప్పాడు. చదువు లేక మూర్ఖులై సదా క్రీడా పారాయణులై తిరుగుతున్న తన నలుగురు కొడుకుల్ని తలచుకుని, వారికి విద్య నేర్పినవారికి అర్ధరాజ్యం ఇస్తానంటాడు. విష్ణుశర్మ అనే పండితుడు రాజు దగ్గరకు వెళతాడు. రాజపుత్రులన• ఆరునెలల్లో విద్యావంతులుగా చేస్తానని రాజుకు ప్రమాణం చేశాడు. రాకుమారులకు విద్యపై ఆసక్తి కలగడానికి పశుపక్ష్యాదులను పాత్రలుగా తీసుకుని నీతికథలు చెప్పాడు. అవే ‘పంచతంత్ర’ కథలు.
నీతిచంద్రిక చదువు గురించి గొప్ప సత్యాలు ఆవిష్కరిస్తుంది. తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువు కొని లోకుల చేత మంచివాడనిపించు కొన్నవాడు బిడ్డడు గాని తక్కినవాడు బిడ్డడా? మూర్ఖుడు అంటుంది. కులానికి కీర్తి తెచ్చువాడు పుత్రుడుగాని తల్లి కడుపు చెరపబుట్టిన వాడు పుత్రుడు గాడు అని చెబుతుంది. గుణవంతులలో ప్రథమ గణ్యుడు గాని కొడుకును గన్న తల్లి కంటె వేరు గొడ్రాలు గలదా? అని ప్రశ్నిస్తుంది. గుణవంతుడైన పుత్రుడొకడు చాలును. మూర్ఖులు నూరుగురి వలన ఫలమేమి? ఒక రత్నంతో గులకరాళ్లు గంపెడైనా సరికావు. విద్యావంతుడైన, గుణవంతుడైన పుత్రులను చూసి సంతోషించడమనే సంపద మహాపుణ్యం చేసుకున్న వారికే గాని, అందరికీ లభించదు అని వ్యాఖ్యా నించింది. విష్ణుశర్మ కొంగను మాట్లాడించడం కష్టం గాని, చిలుకను పలికించడం కష్టం కాదు అన్నాడట. అయితే, ఎలాంటి రత్నమైనా సాన పెట్టకపోతే ప్రకాశించనట్టే, బాలుడెట్టివాడైనా గురుజన శిక్షలేక ప్రకాశింపడు అని కూడా చెబుతాడు.
చిన్నయ సూరి ఏ కథ చెప్పినా అందులో తప్పని సరిగా సమాజానికి ఒక నీతిని తెలియజేయాలని అనుకున్నాడు. అందుకే ఈ గ్రంథానికి ‘నీతిచంద్రిక’ అని పేరు పెట్టారు. వీటిలో మొదటిది ‘మిత్రలాభం’. ఈ కథలో ప్రధానంగా రెండు పాత్రలు-చితగ్రీవుడు (కపోతాలకు రాజు) హిరణ్యకుడు (మూషికరాజు). నిర్మానుష్యమైన అడవిలో నూకలు ఉండడం చూసి, వాటికి ఆశపడవద్దని తన పావురాలన్నింటిని హెచ్చరిస్తాడు. సర్వవిధాల ఆలోచించకుండా ఎవరూ పని చేయరాదు అన్నాడు. చక్కగా ఆలోచించి చేసిన పనికి హాని ఎప్పటికి రాదని అంటాడు. అప్పుడు ఒక వృద్ధ పావురం, ‘ఈర్ష్యాళవు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య శంకితుడు, పరభా గోప్యజీవి’ అనే ఈ ఆరుగురు దుఃఖబాగులని నీతి కోవిదులు చెప్పుతారు అని ఆక్షేపిస్తుంది. అప్పుడు పావురాలన్నీ నూకల మీద వాలి, వాటి మాటున ఉన్న వలలో చిక్కుకుంటాయి. ముసలి పావురాన్ని నిందిస్తాయి. చితగ్రీవుడు వాటన్నిటిని సంఘటిత పరచి మూకుమ్మడిగా వలతో సహా ఆకాశానికి ఎగిరి హిరణ్యకుడి దగ్గరకు వెళతారు.
హిరణ్యకుడు మొదట చితగ్రీవుని బంధాలను త్రెంచాలని చూస్తాడు. కానీ చితగ్రీవుడు ముందు తన పరివారం బంధాలు తెంచమని కోరతాడు. వెంటనే హిరణ్యకుడు తను మాలి పరుల రక్షింప మనుట నీతి కాదు అంటాడు. చితగ్రీవుడు ‘నా ప్రాణాల కంటే నా వారి ప్రాణాలు ముఖ్యం, వీరు జీతభత్యములు లేకున్నను సర్వకాలము విడువక నన్ను కొలుచుచున్నారు. నేను వీరి రుణము ఎప్పుడు తీర్చుకోగలనో కదా! శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము. శరీరము క్షణ భంగురము. గుణములా కల్పాంత స్థాయిలు. ఇట్టి శరీరమునుపేక్షించి కీర్తి పోగొట్టు కోవచ్చునా’ అంటాడు. హిరణ్యకుడు సంతోషించి అందరి బంధాలను తెంచివేస్తాడు. కథలో చితగ్రీవుడు రాజు ధర్మం నిర్వర్తిస్తాడు. పని చేసేటప్పుడు నిదానంగా ఆలోచించాలి అనే నీతి కన్పిస్తుంది. స్వార్ధం విడిచి ఇతరుల క్షేమం కాంక్షించాలి రాజు. విపత్తు నుండి క్షేమంగా ఎలా బయటపడాలో మార్గం వెదకాలి.
జరద్గవం, మార్జాలం కథలో పిల్లి గ్రద్దను మచ్చిక చేసుకోవడానికి ఎన్నో నీతులు చెపుతుంది. జువ్విచెట్టు తొర్రలో ఒక ముసలి గ్రుడ్డి గ్రద్ద ఉంటుంది. ఆ చెట్టు మీదున్న పక్షులు దానికి రోజు కొంత ఆహారమిచ్చి పోషిస్తూ ఉంటాయి. అందుకు గ్రద్ద పక్షుల పిల్లలకు కాపలాగా ఉంటుంది. ఇది గమనించిన ఒక పిల్లి దానికి మాయమాటలు చెబు తుంది. గ్రద్ద నమ్ముతుంది. అయినా గ్రద్ద ‘పిల్లులకు మాంసమందు రుచి మిక్కుటము’ కాబట్టి మా దగ్గరకు రావద్దు అంటుంది. తాను చాంద్రాయణ వ్రతం చేస్తున్నానని చెప్పి ‘అహింసా పరమో ధర్మః ఏ హింస గాని సర్వభూతములందు దయాళులయి వర్తించు వారికి స్వర్గము కరస్థము’’ అని దొంగ మాటలు చెప్పుతుంది. పిల్లి ధర్మపన్నాలని నమ్మి, గ్రద్ద దగ్గరకు రానిస్తుంది. పిల్లి మెల్లగా గుడ్డి గ్రద్దకు తెలియకుండా పక్షి పిల్లల్ని తింటుంది. రోజు రోజుకి పిల్లలు తగ్గిపోతున్నాయి. పక్షులు అంతా వెదికి తొర్రలో ఎముకల్ని చూసి, గ్రద్ద తిన్నదని భావిస్తాయి. గ్రద్దను చంపేస్తాయి. కొత్త వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మరాదు. పిల్లి మారిపోయానని చెప్పినా దాని జాతి గుణం ఎక్కడికి పోతుంది? ఈ కథ దుష్టబుద్ది కలవాళ్లు నయవంచన ఎలా చేస్తారో వివరించింది.
కాకి, తాబేలు, జింక, ఎలుక కథలో మిత్రలాభం గొప్పతనాన్ని వివరించారు, సూరి. జింక వేటగాని వలలో చిక్కుకొని ఉండగా కాకి వెళ్లి జింకను బంధాల నుండి విడిపిస్తుంది. వీటికోసం వెదుకుతూ వచ్చిన తాబేలును వేటగాడు బంధిస్తాడు. జింక, కాకి ఉపాయం చేత అన్నీ తప్పించుకుంటాయి. ఇలా నాలుగు కలిపి మైత్రితో పరస్పరం లాభం పొందు తాయి. కలిసి ఉంటే కలదు సుఖం.
మిత్రభేదం కథలో కరటక, దమనక అనే రెండు నక్కలు తమ రాజైన సింహానికీ, ఎద్దుకూ మధ్య తగాదా పెట్టగా సింహం ఎద్దును చంపేస్తుంది. అదే విధంగా ఇతరులు చేయాల్సిన పని జోలికి మరొకరు వెళ్లరాదని, ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి అని అన్నాడు. కుక్కకు బదులు గాడిద ఓండ్ర పెట్టి యజమాని చేత దెబ్బలు తిని చావడాన్ని గూర్చి ఈ కథ చెబుతుంది.
ఆషాఢభూతి కథలో ఆషాడభూతి దేవవర్మ అనే పరివ్రాజకుని ధనాన్ని అపహరించాలని తలచి, సమీపించి, సేవించిన విధానాన్ని సూరి చాలా అందంగా వర్ణించాడు. మిత్రభేదంలో సూరి నక్క-బేరి అనే కథలో రమణీయ యుద్ధభూమి వర్ణన ఉంది. ఇందులో చతురంగ బలాలని చక్కగా వర్ణించాడు.
ఈ కథల ద్వారా నీతుల్ని ప్రబోధించాడు సూరి. మానవ జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని కోరుకున్నాడు. నీతులకు నిలయం ‘నీతి చంద్రిక’. మానవ జీవితం ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా చల్లగా హాయిగా, వెన్నెలవలె సాగిపోవాలని చిన్నయ్య సూరి కాంక్షించాడు.
మూల:
1. శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము/ నిడదవోలు వెంకట్రావు.
2. నీతి చంద్రిక పూర్వార్ధము/పరవస్తు చిన్నయ్య సూరి కృతము పేజీ-4 టు 5 (వావిళ్ల వారి ముద్రణ).
3. శబ్దబ్రహ్మ చిన్నయసూరి/ ప్రొ।। వెలమల సిమ్మన్న, డా।। గుమ్మా సాంబశివరావు.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు