అతి సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి అద్వితీయమైన ఎత్తుకు ఎదిగిన వ్యక్తి 39 ఏళ్ల శుభాంశు శుక్లా. ‘శుక్స్’ అని బంధుమిత్రులు ముద్దుగా పిలుచుకునే శుక్లా ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో టెస్ట్ పైలట్‌గా, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ`ఇస్రోలో రోదసీ శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. భారతీయ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమంలో భాగంగా గగన్‌యాన్ పేరుతో ఇస్రో, భారతీయ వైమానిక దళం సంయుక్తంగా చేపడుతున్న ఒక ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నలుగురిలో శుక్లా ఒకరు. ఆయన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జన్మించారు. చదువుల్లో దిట్ట, ఏకసంథాగ్రాహి. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణను పూర్తి చేసి వైమానిక దళంలో ఫైటర్ విమానాలకు పైలట్‌గా చేరారు.
డోర్నియర్, హాక్, మిగ్-21, మిగ్-29, తదితర యుద్ధ విమానాలను నడిపారు. భారతీయ వైమానిక దళం ఆధ్వర్యంలో పని చేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో చేరారు. ఆ సంస్థ అంతరిక్ష యాత్రికుల బృందానికి శుక్లాను ఎంపిక చేసింది. ఆయన 2020 నుంచి 2021 మధ్యకాలంలో రష్యాలోని యూరీ గగారిన్ అంతరిక్ష పరిశోధన సంస్థలో శిక్షణ పొందారు. ఆ తర్వాత బెంగళూరు వచ్చి అక్కడి అంతరిక్ష యాత్రికుల శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ కాలంలోనే ఆయన బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27, 2024న తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా గగన్‌యాన్ కార్యక్రమానికి వెళ్లేవారి పేర్లను ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లా పేరు మొదటి స్థానంలో ఉండడం విశేషం.
అంతర్జాతీయ స్థాయి ఎంపిక
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కార్యక్రమం కింద నాసా చేపట్టిన నలుగురు సభ్యుల ఆక్సియమ్ మిషన్‌కు కూడా శుక్లా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం కోసం అమెరికా దేశంలోని హూస్టన్ నగరంలో ఉన్న నాసా జాన్సన్స్ స్పేస్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని పటిష్టం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలన్న ఉద్దేశంతో నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి చేపట్టిన ఆక్సియమ్ మిషన్ విజయవంతమైన పక్షంలో శుక్లా అంతరిక్ష యాత్రికుడుగా, పరిశోధకుడిగా గుర్తింపు పొందు తారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలుస్తారు. ఈ అంతరిక్ష యాత్రలో శుక్లాకు మాత్రమే అయ్యే ఖర్చు సుమారు 500 కోట్ల రూపాయలు.
పాఠశాల సహవిద్యార్థినితో ప్రేమ వివాహం
స్కూల్లో తనకు సహ విద్యార్థి అయిన కామ్నా మిశ్రాను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె దంత వైద్యురాలు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన తండ్రి శంభు దయాళ్ శుక్లా ప్రభుత్వోద్యోగి. తల్లి ఆశా శుక్లా సాధారణ గృహిణి. ఆయనకు ఇద్దరు అక్కలున్నారు. శుభాంశు శుక్లా తనకు సమయం దొరికినప్పుడల్లా కొద్దిగా వ్యాయామం చేయడమో, సైన్స్ సంబంధమైన పుస్తకాలను చదవడమో చేస్తుంటారు. అంతరిక్ష పరిశోధనలో, ఖగోళ శాస్త్ర విజ్ఞానంలో నిష్ణాతుడైన ఆయన ఓ హేతువాది. అంతరిక్ష ఫోటోగ్రఫీలో సిద్ధహస్తుడు. విచిత్రంగా, జ్యోతిష శాస్త్ర గ్రంథాలను కూడా చదువుతుంటారు.
అంతరిక్షంలో వ్యవసాయం
ఈ ఆక్సియమ్ మిషన్ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహక సంస్థలు శుభాంశు శుక్లాకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించాయి. ఈ అంతరిక్ష యాత్ర సందర్భంగా ఆయన రోదసిలో, అతి తక్కువ భూమ్యాకర్షణ శక్తిలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం`ఐఎస్‌ఎస్‌లో మెంతులు, పెసలు, మరి కొన్ని మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అంటే, ఆయన రోదసిలో వ్యవసాయం చేస్తారన్న మాట. దీర్ఘకాలం పాటు రోదసిలో గడపాల్సిన శాస్త్రవేత్తలు, పరిశోధ కులు అంతరిక్షంలో తమకు కావలసిన నిత్యావసరా లను పండిరచుకోవడానికి ఉన్న అవకాశాలను ఆయన ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో భారతీయులు చేపట్టే అంతరిక్ష యాత్రలకు, పరిశోధనలకు ఈ రోదసి వ్యవసాయం ఎంతగానో ఉపకరించే అవకాశం ఉంది. అక్కడ ఆయన పండిరచే వాటిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. రోదసిలో పెంచిన మొక్కలను భూమి మీదకు తీసుకువచ్చి, వాటిలో జన్యుపరంగా చోటు చేసుకున్న మార్పులను, చేర్పులను కూడా అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
శుభాంశు శుక్లాతో పాటు ఈ ఆక్సియమ్ మిషన్‌లో వెళ్లే యాత్రికుల బృందంలో అమెరికా, పోలెండ్, హంగరీ అంతరిక్ష పరిశోధకులున్నారు. ఇది అనేక విధాలుగా రోదసీ పరిశోధనలను మలుపు తిప్పనుంది. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా యాత్ర విజయవంతం కావాలని, భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
- జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్