లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్
ఏమిటిది? ఓ సంస్థ. ఎప్పటిది? ఎనిమిదిన్నర దశాబ్దాల నాటిది. వ్యవస్థాపకులు ఎవరు? సుగుణమణి. ఎవరు ఆమె? సమాజసేవిక. సంఘానికి సేవ చేయాలన్న గట్టి సంకల్పంతో ఆ సంస్థను ప్రారంభించారు. ఇదే సంస్థ వ్యవస్థీకృత రూపు ‘ఆంధ్ర మహిళాసభ’. అలా అనగానే దుర్గాబాయి దేశ్‌ముఖ్ తలపులోకి వస్తారు. దుర్గాబాయి, సుగుణమణి.. ఇద్దరిదీ నాయిక, అనుచర అనుబంధం. గురుశిష్యానుబంధమూ. ఈ ఉభయులనీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు ఇదే జులైలో! స్వాతంత్య్ర సాధనకు ఉద్యమించిన మహనీయ ఒకరు, వనితా జాగృతి మీద చూపు కేంద్రీకరించిన వారు మరొకరు.
దుర్గాబాయికి ‘సోషల్ సర్వీస్’ మదర్ పేరు. ఆమె జననం రాజమహేంద్రవరం ప్రాంతంలో. చిన్నప్పటి నుంచీ అద్భుత ప్రతిభ, వయసు పెరిగినకొద్దీ విస్తరించిన దక్షత. చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంత అంటే- తనకు తానుగా బాలలను చేరదీసి బోధన చేసేంతగా! రాజనీతిశాస్త్రంలో పోస్టుగ్రాడ్యు యేట్. న్యాయవిద్యలో సైతం ఉన్నతస్థాయి పట్టా స్వీకారం. సుగుణమణిలోనూ ఆమె మాదిరే ప్రతిభా సామర్థ్యాలు విస్తారమయ్యాయి. ఆమె స్వస్థలం కాకినాడ. సోదరీ సోదరుల ప్రేమానుబంధం మధ్య అపురూపంగా కొనసాగింది ఆమె బాల్యమంతా.
మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. తనకు కూడా న్యాయశాస్త్ర సంబంధ అంశాలంటే మక్కువ ఎక్కువ. తోటివారికి ఏదో విధంగా అండగా నిలవాలన్న సేవాభావనా అధికమే.
దుర్గాబాయి పన్నెండేళ్ల ప్రాయంలోనే భారత స్వాతంత్య్ర సమరయాత్రలో భాగస్వామిని అయ్యారు. విరాళాల సమీకరణలో పాల్గొన్నారు. అలా సేకరించిన వాటిని మహాత్మునికి అందజేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను ఉద్యమ విరాళంగా అందించారామె. కాకినాడలో ఉద్యమ సభలు జరిగితే, క్రియాశీల కార్యకర్తగా అపార సేవలందించారు. గాంధీజీ హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువ దించినవారు దుర్గాబాయే! ధాటి స్వరం ఆమెది.
నియమ, నిబంధనలను తు.చ.తప్పక పాటించారు. వాటి అతిక్రమణను ఏ దశలోనూ భరించేవారు కారు. ఆ నిర్భయత, ప్రస్ఫుట మూర్తి మత్వమే జాతీయ నాయకుల దృష్టికి వెళ్లింది. వారు మరీ మరీ ప్రశంసించారు.ఉప్పు సత్యాగ్రహంలో ముందు వరసన నిలిచారు. చెరసాల జీవితం గడిపారు. ‘ఉంటే ఉద్యమంలో లేదంటే విద్యా బోధనలో’- ఇదీ ఆమె ఏకైక లక్ష్యం, లక్షణం. న్యాయ వాదంలో అందెవేసిన చెయ్యి.
ఇదే విధంగా దుర్గాబాయి శిష్యురాలు సుగుణమణికీ ఉద్యమ నేపథ్యముంది. అది సమాజ సేవోద్యమం. అందులోనే ఆమె మమేకమయ్యారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితుల సేవకు ముందడుగు వేశారు. తనూ విరాళాలనేకం సమీకరించారు, సమీకరింపచేశారు. ఇంటింటికీ వెళ్లి, విపత్తులవల్ల బాధితులైన వారి గురించి వివరించి, ‘సాటివారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మనకు లేదా’ అని సూటిగా ప్రశ్నించేవారు. వస్తు, ధన రూపేణ సేకరించిన అన్నింటినీ తన కళాశాల యాజమాన్యానికి అప్పగించారు సుగుణమణి. అంటే, విద్యార్థి దశ నుంచే ఆమెలోని సమాజసేవానురక్తి అంతటిది.
మాటలు, రాతలు, చేతల్లోనూ మిన్న ఆమె. ఎన్నెన్నో రచనలు చేశారనడానికి అప్పటి ‘గృహలక్ష్మి’ పత్రికే సాక్ష్యం. అదే విధంగా ‘భారతి’లోనూ వ్యాసాల పరంపర. ఆమె కేవలం ప్రసంగాలు, రచనలకే పరిమితం కాలేదు. ఆచరణ లో పెట్టారు. అందులో భాగంగానే ‘లిటిల్ లేడీస్’ సంస్థాపన! బాలల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశం. అందుకోసం ఎన్నెన్నో ప్రణాళికలు. మరికొంతకాలం అయ్యాక, భర్త ఉద్యోగ కారణంగా ఆమె మకాం ఢిల్లీకి మారింది. అక్కడ ఉన్నన్నాళ్లూ సేవ, సహాయ, సహకారం అనే మూడు బాధ్యతలనీ చక్కగా నిర్వహిం చారు. అందుకు ప్రచార సాధనాలను ఎంచుకున్నారు. ఆ ప్రధాన సాధనమే – ఆకాశవాణి. అంటే ఆమె మొదటి తెలుగు ప్రసంగం దేశ రాజధాని నుంచి అన్న మాట. ఇంకొంత కాలానికి భర్త బదిలీతో మకాం మద్రాసుకు మారింది. సరిగ్గా అప్పుడే అక్కడ దుర్గాబాయమ్మ సందర్శన భాగ్యం! అప్పటికే దుర్గాబాయి పలు సేవా కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. అప్పటివరకూ తన నిర్వహణలో ఉంటూ వచ్చిన మాస పత్రిక ‘ఆంధ్రమహిళ’ను నడిపే కర్తవ్యాన్ని సుగుణమణికి అప్పగించారు. ఆ సంవత్సరం 1943. అంటే – ఇప్పటికే ఎనిమిది దశాబ్దాల కిందటి జ్ఞాపకం. స్త్రీల కోసం స్త్రీలే స్థాపించి, నిర్వహించి, పర్యవేక్షించిన సంస్థగా అది సుప్రసిద్ధం. అలా ‘ఆంధ్రమహిళ- సుగుణమణి’ అనే అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ సయయంలో ప్రముఖ సమరయోధులతో పరిచయం ఏర్పడింది.
వేగంగా విస్తరించింది.‘రచనలు చేయడం, సేవల పనులు సాగించడం’అనేది అలవాటుగా మారింది.
భారతీయ నరనారీ భావాంకిత జయస్ఫూర్తి
భవ్యదీక్ష నా జాతికి… భాగ్యరక్ష నా జాతికి!
ఔన్నత్యం నా భావం – ఔజ్జ్వల్యం నా జీవం
చైతన్యం నా రూపం – స్వాతంత్య్రం నా ప్రాణం!
ఇదే ధ్యేయంగా ఆనాడు సాగింది దుర్గాబాయి, సుగుణమణిల ఉద్యమ సరళి.
ఇరువురూ కలసి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజుల్లో ‘కస్తూరిబా నిధి’ని ఉండేది. ఆ మహోన్నత వనితకు గుర్తుగా రూపొందిన ట్రస్టు. ఆ నిధులతోనే గ్రామ ప్రాంతాల్లోని స్త్రీలు, పిల్లల యోగక్షేమాల కోసం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల స్థాపన జరిగేది. సూక్ష్మంగా చెప్పాలంటే – కేజీబీవీ. అందరికీ విద్య అందించడం పరమోద్దేశం. చదువుతోనే చైతన్యం, ప్రశ్నించే తత్వం, పెంపొందుతాయి కదా మరి.
ఆ ఇద్దరి నాయకత్వంలో సమీకరించి తెచ్చిన మొత్తం ఎంతో తెలుసా? అప్పట్లోనే అక్షరాలా ఆరు లక్షల రూపాయలు! ఇప్పటి లెక్కల్లో కోట్ల రూపాయలకు పై మాటే. అలా సేకరించిన నిధులతో ఊరువాడా పర్యటించారు ఇరువురూ. కస్తూరిబా సేవా సంఘాలను విరివిగా స్థాపించారు. వాటిల్లో సేవికలను నియమించారు.
సేవికలంటే – సంఘసేవా పరాయణులు. సహాయమే జీవితంగా గల వనితామతల్లులు. ఉభయ నేతల చిత్తశుద్ధి, సంకల్పదీక్షకు అన్ని విధాలా దోహద పడింది ‘ఆంధ్రమహిళ’ పత్రికే! ఒకరిగా మాలతీ చందూర్ ఉండేవారు. తెలుసు కదా? తెలుగు వారందరికీ సుపరిచితురాలు. మూడు దశాబ్దాలకు పైగా సారస్వత, సమాజసేవిక. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అతివ జీవితాంశాలతో నవలలు వెలయించిన పరిణత మనస్కురాలు. వందలాది పుస్తక సమీక్షలు చేసినవారు. అటువంటి ప్రజ్ఞానిధుల సమన్వయంతో ముందుకు నడిచారు, నడిపించారు దుర్గాబాయమ్మ, సుగుణమణమ్మ. రచనల్లో, సమాజ సేవల పనుల్లో ఇద్దరూ ఇద్దరే. న్యాయం, స్వాతంత్య్రం, పడతుల పురోగమనాన్ని మనసా వాచా కర్మణా కోరుకున్నవారు. వనితావిద్య, సాధికారత – ఈ రెండూ ఆ ఇద్దరి ప్రధాన ఆశయాలు. క్రియాశీలతకు ఏకైక చిరునామా ఆ ఇద్దరిదే.
ఆంధ్ర మహిళసభ భాగ్యనగరంలో ఆరంభమైంది 1957లో. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దా నికి. నగరానికి వచ్చి ప్రారంభించినవారు సుగుణ మణే! మహిళసభను నెలకొల్పిన కొత్తలో దుర్గాబాయి, సుగుణమణి ఎన్నెన్నో వ్యయప్రయాసలు భరించారు. ఎన్నోచోట్ల పర్యటించారు, ఎంతో మందితో సంభాషిం చారు, అనేకమందికి వివరించి చెప్పి వనితాభ్యుద యాన్ని సాకారానికి తేగలిగారు వారు.
ఆంధ్ర మహిళాసభ తమిళ, తెలుగు ప్రాంతా లన్నింటా ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది. బాలానంద సంఘం పేరు ఎంతోమంది వినే ఉంటారు. ఆ సంఘానికి తొలి నేతృత్వం వహించిందీ సుగుణమణి దీక్షాదక్షతలే. ఆ ప్రజ్ఞావంతురాలి సంస్మృతి జులై ఐదోతేదీన. సేవాసంస్థ రామకృష్ణ మఠం నుంచి జీవన సాఫల్యం పురస్కారాన్ని ఆమెకు ప్రకటించి ఇప్పటికి సరిగ్గా పాతికేళ్లు! అంటే రజతోత్సవ సందర్భమన్న మాట. ఎంతగానో అభినందనీయం.
గురుశిష్య బంధానికి ప్రతీకలు దుర్గాబాయి, సుగుణమణి. వీరు ప్రాతఃస్మరణీయులు. సదా ఆదర్శచరితులు. వీరి జీవితాలు ఫలప్రదాలు.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్