జూన్‌ 29 గోల్కొండ బోనాలు ప్రారంభం

తెలంగాణ జానపద సంస్కృతీ ప్రస్థానంలో మూడు పర్వ దినాలలో బోనాలు ఒకటి. మిగిలినవి.. బతుకమ్మ పండుగ, సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర. మొదటి రెండిరటిని ఏటా జరుపుకుంటే మూడవది రెండేళ్లకు ఒకసారి ప్రధాన జాతరగా, ఒక ఏడాది సాధారణంగా నిర్వహిస్తారు. ఆషాఢం రావడంతోనే తెలంగాణలో… ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాలు ఘనంగా జరుగుతాయి.

తెలుగునాట అందునా భాగ్యనగర పరిసర ప్రాంతాల వారికి అత్యంత ప్రధానమైనవి బోనాలు. గోల్కొండను అబుల్‌ హసన్‌ పాలించిన కాలంలో (1675) దక్కన్‌లో బోనాల పండుగ ప్రారంభమైంది. కాకతీయ ప్రభువులు తమ ఇలవేల్పుగా అర్చించిన కాకతీమాతకు ఏటా బోనాలు సమర్పించేవారని, ‘అమ్మ’ ఎదుట అన్నపు రాశులు పోసి, నైవేద్యం సమర్పించి దానిని వితరణ చేసేవారని జయాపసేనాని తన ‘నృత్యగీతావళి’లో పేర్కొన్నాడు. అనంతర కాలంలో ఈ పండుగ క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఏటా ఆషాఢ మాస తొలి ఆదివారం బోనాల జాతర గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం(ఎల్లమ్మ)లో మొదలై, ఆ తరువాత ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ లోని మహంకాళి ఆలయంలో, గన్‌ఫౌండ్రిలో నిర్వహిస్తారు. ఆషాఢంలో చివరిలో గోల్కొండ కోటలో జరిగే బోనం పూజతో జాతర పరిసమాప్త మవుతుంది. ఈ ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా ఉన్న అమ్మవార్ల ఆలయాలలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, పెద్దమ్మతల్లి, అంకాలమ్మ, రేణుకమ్మ, ముత్యాలమ్మలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పిస్తారు. ఘటోత్సవంగా వ్యవహరించే ఎదుర్కోలుతో బోనాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ‘సారె’ సమర్పించేం దుకు పసుపు నీటిలో వేపకొమ్మలను ఉంచి, ఆ పాత్రపై గండా దీపం ఉంచి ఆలయాలకు వెళతారు.

చారిత్రక ఆధారాలను బట్టి కాకతీయులు గోల్కొండ కోటను కట్టక ముందు యాదవ సామాజిక వర్గీయులు అక్కడ మేకలు, గొర్రెలు మేపేవారు. అప్పటికే అక్కడ గల ఆలయం (ఎల్లమ్మ)లో తరచూ బోనాలు సమర్పించేవారు. అనంతర కాలంలో నిర్మితమైన కోటను ‘గొల్లకొండ’గా పిలిచారని, కాలక్రమంలో గోల్కొండగా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఆ కోట ఆవరణలోని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాలు నాడు నిర్మితమైనవే.

బోనమంటే….

అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్నే బోనం అంటారు. ఇది భోజనం మాట నుంచి వచ్చిందని చెబుతారు. వర్షాకాలం ప్రారంభంలో అనారోగ్యాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా కాపాడాలని అమ్మవారిని వేడుకుంటూ నైవేద్యం సమర్పిస్తారు. 1869 ప్రాంతంలో నేటి జంటనగరాల్లోని పలు ప్రాంతాలలో మలేరియా వ్యాధి ప్రబలి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ప్రకృతిని ప్రసన్నం చేసుకొనే క్రమంలో నాటి నుంచి ఈ జాతరను మరింత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ వస్తున్నారు.

బోనపు పాత్ర (కుండ) మానవ శరీరానికి ప్రతీకగా, అందులోని అన్నం జీవశక్తికి సంకేతంగా, దానిపై వెలిగే జ్యోతి మన ఆత్మశక్తికి ప్రతిఫలంగా పెద్దలు చెబుతారు. మట్టికుండలాంటి దేహాన్ని దైవశక్తికి బోనంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం. ప్రకృతి శక్తి వల్ల దక్కిన సస్యాలను, ధాన్యం, శాకాలను ఆ శక్తికే సమర్పించి కృతజ్ఞతలు తెలియచేయడమే బోనాల పండుగ పరమార్థమనీ చెబుతారు.

కొత్త కుండలో బియ్యం,బెల్లం, పాలు, పసుపు కలిపి వండేదే బోనం. బోనం కుండను సున్నం, కుంకుమ, వేపకొమ్మలతో అలంకరించి, దానిపై దీపం (గండాదీపం) వెలిగించి, ఆ కుండ(ల)ను మహిళలు శిరస్సున ధరించి మేళ తాళాలతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా బోనం తలకెత్తుకున్నవారిని అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు దారిపొడవున వారి పాదాలపై నీళ్లు పోస్తుంటారు. బోనం ఎత్తిన నాడు కాని మరునాడు కాని భక్తులు ఇళ్ల వద్ద అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారుచేసి బండిపై ఉంచి ఊరేగింపుగా తీసుకు వెళతారు. దీనినే ‘ఫలహారం బండి’గా పిలుస్తారు. దానిని ఆలయం చుట్టూ తిప్పి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొంత ప్రసాదాన్ని ఇళ్లకు తెచ్చుకొని ఇరుగుపొరుగులకు పంచుకుంటారు.

బోనాల ముగింపు సందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఆకర్షణగా నిలుస్తాయి. నుదుట కుంకుమ, కళ్లకు కాటుక, నోట్లో నిమ్మకాయలు, చేతులలో త్రిశూలం, కొరడా, కాళ్లకు గజ్జెలతో తప్పెట్లకు అనుగుణంగా విన్యాసాలు చేస్తారు. గుమ్మడి, సొరకాయలను వారు పళ్లెంలో ఎత్తి పట్టుకొని తిప్పుతూ బలి ఇస్తారు (పూర్వం జంతుబలులు ఉండేవి. వాటి నిషేధంతో ‘కూష్మాండబలి’… అంటే గుమ్మడి, సొర కాయలను సమర్పిస్తున్నారు). పోతురాజు అమ్మవారికి సోదరుడని, అమ్మవారు ఊరిలో పూజలు అందుకుంటుండగా సోదరుడు ఊరి రక్షణ బాధ్యత వహిస్తాడని భక్తుల విశ్వాసం. జాతర సమయంలో పోతురాజు వేషధారిని అమ్మవారు ఆవహిస్తారని చెబుతారు. సోదరికి తీసుకువెళ్లే ఫలహారం బండ్ల ముందువీరంగం వేస్తూ కదులు తారు. బోనం మరునాడు పూనకం వచ్చిన మహిళలు ఆలయం ఎదుట భవిష్యవాణి చెబుతారు. దీనిని ‘రంగం’ అంటారు. మాతంగి దీక్షలో ఉన్న అవివాహిత అమ్మవారి ఎదుట పచ్చికుండపై నిలు చొని భవిష్యత్‌ పరిణామాలు, విశేషాలను జోస్యంలా చెబుతారు. సాక్షాత్తు అమ్మవారే వారితో చెప్పించి నట్లుగా భావిస్తారు. రంగం ముగిసిన తరువాత పోతురాజులు తాండవంతో ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలతో ప్రదర్శనలిస్తారు.

– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE