‘‘వంగమంటే పాకడం’’ అనే సామెత ఉంది. ‘ఎమర్జెన్సీ’ (ఆంతరంగిక అత్యవసర పరిస్థితి) సమయంలో పత్రికల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ‘ఎమర్జెన్సీ’ ప్రకటన వెలువడిన వెంటనే ‘‘ప్రీ సెన్సార్‌షిప్‌ `ముందస్తు ఆంక్షలు’ ప్రారంభమయ్యాయి. ఆ అర్ధరాత్రి సమయంలో పత్రికల ముద్రణాలయాలపై దాడులు జరిపి అప్పటికే అచ్చయిన పత్రికలను స్వాధీనం చేసుకున్నారు. అనేక పత్రికా కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా అత్యధిక శాతం పత్రికలు సంపాదకీయం కాలమ్‌ నిలిపివేశాయి.పాఠకులకు ఆ కాలమ్‌ స్థలంలో తెల్లకాగితం దర్శనమిచ్చింది. ప్రభుత్వం ముందు పత్రికలన్నీ మోకరిల్లాయి.

ఢల్లీి నుండి వెలువడే పత్రికలు దేశంలో ఎమర్జెన్సీ విధించినట్లు ప్రచురించిన ప్పటికీ జాతీయ నాయకులను నిర్బంధించినట్లు ఎక్కడా పేర్కొన లేదు. అయితే ఉమ్మడి రాష్ట్రంలోని ‘ఈనాడు’ దినపత్రిక మాత్రం ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసినట్లు లోపలి పేజీలో చిన్నగా ప్రచురించింది. ఆ పత్రిక వారం రోజుల పాటు సంపాదకీయం రాయకుండా ఖాళీగా వదిలేసింది. జూలై 4వ తేదీన ‘పౌండ్‌ విలువ పతనం’ అంటూ విదేశీ అంశంపై సంపాదకీయం రాసింది. ‘ఆంధ్రప్రభ’ జూన్‌ 27న, ‘ఆంధ్రపత్రిక’ 28,29 తేదీలలో సంపాదకీయాలు ప్రచురించలేదు. క్రమక్రమంగా పత్రికలపై ఆంక్షలు పెరగడం, ప్రభుత్వ అనుకూల వైఖరి అనుసరించని వాటికి ప్రకటనలు నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టారు. అయితే రామనాధ్‌ గోయంకా నిర్వహించే ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆంగ్ల దినపత్రిక మాత్రం తన అస్థిత్వం కోసం కడదాకా పోరాటం కొనసాగించింది. ఇందిర ప్రభుత్వం 20 సూత్రాల కార్యక్రమం ప్రకటించాక దానిని పొగుడుతూ పత్రికలు విశ్లేషణాత్మక కథనాలు ప్రచురించాయి. కానీ, దేశంలో జరుగుతున్న సత్యాగ్రహాలు, పోలీసుల నిర్బంధం, అరెస్టులు తదితర వార్తలు ఏవీ ప్రచురణకు నోచుకోలేదు.

అజ్ఞాత సాహిత్యం – రహస్య పత్రికలు

ఈ నేపథ్యంలో అజ్ఞాత ఉద్యమంలో భాగంగా నాటి ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ కరపత్రాలు, చిన్నచిన్న పుస్తకాలు, రహస్య, వార, పక్ష పత్రికలు వెలువడ్డాయి. గోడ పత్రాలు (వాల్‌పోస్టర్లు), కరపత్రాలు ముద్రించేవారు. ఈ రహస్య సమాచారం కార్యకర్తల ద్వారా రహస్యంగా ప్రజలలో వితరణ జరిగింది. ఎమర్జెన్సీ విధించిన తొలి పది రోజులలోనే కరపత్రాలు ముద్రించే వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంతో సహా దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఎక్కడో ఎవరికీ తెలియని రహస్య స్థావరాలలో (సాధారణంగా విద్యార్థుల గదులలో) సైకిల్‌ స్టైల్‌ మిషన్‌ ద్వారా కరపత్రాలు తయారయ్యేవి. ‘‘కరపత్రంలోని సమాచా రాన్ని ఎవరు అందించారు? ఎవరు సైకిల్‌స్టైలు చేశారు? ఎవరు కాపీలు తీశారు?’’ అంతా చిదంబర రహస్యమే. పోలీసులు ఎవరిని ప్రశ్నించినా తమకు తెలియదని సమాధానమే వచ్చింది.

నెమ్మది నెమ్మదిగా ప్రింటింగ్‌ ప్రెస్‌లను సంప్రదించి కరపత్రాలు ముద్రించటం ప్రారంభ మైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘వందేమాతరం’, ‘ఎక్స్‌రే’ స్వరాజ్య, గర్జనఅజ్ఞాత పక్ష పత్రికలు ప్రారంభ మయ్యాయి. రహస్యంగా ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవస్థ ఏర్పాటు కావడంతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సంగర్ష సమితి కార్యకలాపాలు, సత్యాగ్రహాలు, పోలీసుల దమనకాండ వంటి వార్తల సమాచారం సంబంధిత కార్యకర్తలకు అందేవి. వారు వీటిని తెలుగులోకి అనువదించి ‘వందేమాతరం’ ‘ఎక్స్‌రే’ పత్రికలలో ప్రచురించేవారు. ఈ రెండు పత్రికలు ఎమర్జెన్సీ తొలగించేవరకు కొనసాగాయి. సామాన్య కార్యకర్తలు వాటిని వితరణ చేసేవారు. ఎక్కడా సమాచారం ‘లీక్‌’ కాకుండా అత్యంత జాగరూకతతో ఈ వ్యవస్థ నడిచింది. ఈ అజ్ఞాత సాహిత్య ముద్రణ, వితరణ ఏ విధంగా జరుగు తున్నదో తెలియక సీఐడీ పోలీసులు తలలు పట్టుకునే వారు. కిశోర్‌, బాల స్వయంసేవకులు వార్తాహరులుగా పనిచేసేవారు. మన పొరుగున వున్న తమిళనాడులో అప్పుడు ఎం.కరుణానిధి నేతృత్వం లోని డీఎంకెే అధికారంలో ఉంది. అందుచేత మద్రాసులోని తెలుగు ప్రెస్‌లలో సాహిత్యం, చిన్న చిన్న పుస్తకాల ముద్రణ జరిగేది. ఆ సాహిత్యం తెలుగు రాష్ట్రంలోకి రహస్యంగా ప్రవేశించేది.

అజ్ఞాత ఉద్యమంలో కీలక అంశాలు

–     రహస్య సంఘటనోద్యమం నిర్మాణం, నిర్వహణ

–   దేశమంతటా సంపర్కం నెలకొల్పటం, మెరుపు వేగంతో వార్తలు, సూచనలు పంపటానికి మారు పేర్లు, రహస్య చిరునామాలు, ఫోన్‌ నెంబర్లు సేకరణ, వార్తాహరుల ఎంపిక.

–  ప్రచార విభాగంలో భాగంగా కరపత్రాలు, సాహిత్యం సృష్టించడం, అజ్ఞాత పత్రికల ప్రచురణ, సైక్లోస్టైల్‌, టైపింగ్‌, ప్రింటింగ్‌ ద్వారా సాహిత్య నిర్మాణం.

–     అజ్ఞాత సమావేశాలు ఏర్పాటు, నిధుల సమీకరణ వగైరా.

కీలకమైన కార్యక్రమాలలో కరపత్రాల వితరణ

1975 ఆగష్టు 15వ తేదీన ‘స్వాతంత్య్రానికి సంకెళ్లు’ శీర్షికతో రెండు పేజీల కరపత్రం అచ్చు అయి రాయలసీమలోని అన్ని ముఖ్య కేంద్రాలకు చేరింది. ఆయా స్థలాలలో జాతీయ జెండా ఆవిష్క రణ అనంతరం కార్యకర్తలు ఈ కరపత్రాలు పంపిణీ చేశారు. పోలీసులు విస్మయం చెందారు. కార్యాలయా లకు సిబ్బంది వచ్చేసరికి వారి టేబుళ్లపై రహస్య కరపత్రాలు ఉండేవి. ఒక్కొక్కసారి దినపత్రికల్లో కనిపించేవి. కొద్దిమంది భయపడి వాటిని చింపివేసినా అత్యధికులు వాటిని చదివి రహస్యంగా ఇతర మిత్రు లకు వివరించేరు. కళాశాలల్లో, గ్రంథా లయాలలో, సంతలలో ప్రజలు సందడిగా తిరిగే అన్ని ప్రాంతా లలో కరపత్రాల వితరణ జరిగేది. కొన్ని సందర్భా లలో విదేశీ ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ సదస్సులలో కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సాహిత్యం పంపిణీ చేసేవారు. 1976 జనవరిలో విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యా లయంలో సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ జరిగింది. వారు వసతి చేసిన గదుల్లో రహస్య సమాచారంతో కూడిన కవర్లు దర్శన మిచ్చాయి. అంతా రహస్యంగానే వాటిని చదివి దేశం లోని పరిస్థితిని అర్థం చేసుకున్నారు.

అజ్ఞాత సాహిత్యం ద్వారా దేశ ప్రజలలో చైతన్యం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ప్రజలు ధర్మాన్ని గెలిపించటానికి ‘ఓటు’ అనే అత్యంత శక్తిమంతమైన ఆయుధం ప్రయోగించారు. ఫలితంగా 1977 మార్చిలో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. ఇది ప్రజలు సాధించిన ఘన విజయం.

–  వేదుల నరసింహం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor