సంపాదకీయం లేకుండా ఆంధ్రపత్రిక

ఎమర్జెన్సీకి ప్రధాన శత్రువు పత్రికారంగం. అన్ని వ్యవస్థలలో మాదిరిగానే భారతీయ పత్రికారంగానికి కూడా అణచివేత కొత్త కాదు. అయితే అత్యవసర పరిస్థితి నాటి అనుభవాలు విస్మరించలేనివి. చెరిగిపోనివి. ఎమర్జెన్సీ ప్రకటనలపై రాష్ట్రపతి చేవ్రాలు పడిన జూన్‌ 25, 1975 అర్ధరాత్రే పత్రికారంగానికి ప్రమాద ఘంటికలు వినిపించాయి. దేశరాజధాని ఢల్లీిలో బహదూర్‌షా జాఫర్‌ మార్గ్‌లోనే చాలా పత్రికలు కేంద్రీకృతమైనాయి. ఈ ప్రాంతానికి 25వ తేదీ అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరాని నిలిపివేశారు. అయితే కన్నాటోప్లేస్‌లోని ‘ది స్టేట్స్‌మన్‌, ది హిందుస్తాన్‌ టైమ్స్‌, ది ఎకనామికల్‌ టైమ్స్‌, ది ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలు మాత్రం వెలువడ్డాయి. కన్నాట్‌ ప్లేస్‌ ఢల్లీి కార్పొరేషన్‌ పరిధిలో కాక మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉన్నది. మునిసిపాలిటీకి కరెంట్‌ కట్‌ చేయలేదు. ఇలా కరెంట్‌ కోత నుంచి ఏమరుపాటుగా బయపడిన మరో ఆంగ్ల దినపత్రిక ‘మదర్లాండ్‌’, ఈ పత్రిక ఎడిటర్‌ కెఆర్‌ మల్కానీని అరెస్టు చేశారు. కాని పత్రిక యాజమాన్యం 26న ఒక ప్రత్యేక అనుబంధం ప్రచురించింది. దానిని ప్రజలకు అందించింది. అయితే ‘మదర్లాండ్‌’కు అదే ఆఖరి సంచిక అయింది. ఎమర్జెన్సీ విధింపు, అర్ధరాత్రి అరెస్టులతో చాలా వేడివేడిగా వార్తలు నింపి అనుబంధాన్ని బజారుకు తెచ్చారు. వదంతులతో, పుకార్లతో అసలే ఉత్కంఠతో ఉన్న ప్రజలు ఆ అనుబంధం కోసం ఎగబడ్డారు. పది పైసల అనుబంధంపై ఇరవై రూపాయలకు అమ్మి కొందరు సొమ్ము చేసుకున్నారు. తరువాత పోలీసులు మదర్లాండ్‌ ఆఫీసుకు తాళాలు బిగించారు. ఇలా మధ్యాహ్నం పదకొండు గంటల వేళే ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’, ‘స్టేట్స్‌మన్‌’ పత్రికలు కూడా ఎమర్జెన్సీ విధింపు వార్తలతో ఒక అనుబంధాన్ని తేవడానికి సన్నాహాలు చేశాయి. హిందుస్తాన్‌ టైమ్స్‌ అచ్చయి మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్టేట్స్‌మన్‌ ప్రెస్‌కు ఎక్కుతూ ఉండగా అప్పుడు టెలిప్రింటర్లలో పత్రికలలో సెన్సార్‌షిప్‌ విధించినట్టు ఫ్లాష్‌ న్యూస్‌ వచ్చింది. పైగా అచ్చు చేయబోయే వార్తలను సెన్సార్‌ అధికారికి చూపించా లని కూడా నిబంధన వచ్చింది. స్టేట్స్‌మన్‌ లే అవుట్‌ను ఆదరాబాదరాగా శాస్త్రి భవన్‌లో వేంచిసే ఉన్న సెన్సార్‌ అధికారి దగ్గరకు తీసుకువెళ్లారు. తిరిగి వచ్చిన లే అవుట్‌లో అరెస్టయిన నాయకుల ఫోటోలు, అరెస్టు వార్తలు కొట్టివేసి ఉన్నాయి. ఇంతలో అసలు పత్రికా కార్యాలయానికి విద్యుత్‌ సరఫరాయే నిలిచిపోయింది. ఆ అనుబంధ సంచిక పేజీలు ఎమర్జెన్సీ గుర్తుగా ఉండిపోయాయి. హిందుస్తాన్‌ టైమ్స్‌, జాగ్రత్తపడి మార్కెట్‌లోకి వెళ్లిన తనల అనుబంధాన్ని ఆగమేఘాల మీద ఉపసంహరించుకుంది. అదే రోజు ఉదయం (జూన్‌ 26) ఇందిర ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య విధానాలతో తాను సాధారణ పౌరులకు మేలు చేయాలని భావిస్తూ ఉండగా ప్రతిపక్షాలు, పత్రికలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆ రోజునుంచే ఈ పత్రికలపై సెన్సార్‌షిప్‌ అమలులోకి వచ్చింది. పత్రికలో ప్రభుత్వం మాట వినేటట్టు చూడడానికి బుద్ధిగా నడుచుకునేట్టు చేయడానికి అంతవరకు సమాచార ప్రసార శాఖమంత్రిగా ఉన్న ఐ.కె.గుజ్రాల్‌కు ఉద్వాసన పలికి, ఆయన స్థానంలో వి.సి.శుక్లాను ఇందిర నియమించారు. అసలు భారత ప్రజాస్వామ్యం పత్రికా రంగానికి విపరీతమైన స్వేచ్ఛను కల్పించిందని, పత్రికలు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలలో నమ్మకాన్ని (ప్రభుత్వం పట్ల) హరింప చేస్తున్నాయని ప్రజలు రెచ్చిపోయేట్టు చేసి చట్టాన్ని తమ చేతులలోనికి తీసుకునేలా పత్రికలు పురికొల్పకుండా సెన్సార్‌షిప్‌ను విధించామని ఇందిర చాలా స్పష్టంగా పేర్కొన్నారు. జులై 9, 1975న ఆమె ఈ విధంగా ప్రకటించారు (చు.డిక్లెన్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ఇందిరాగాంధీ, రచయితలు మస్కేకర్‌ అండ్‌ మస్కేకర్‌ 13వ పేజీ) తరువాత ప్రెస్‌ కౌన్సిల్‌ రద్దయింది.

ఎమర్జెన్సీ విధింపును, సెన్సారింగ్‌ను పత్రికలు తొలినాడు తీవ్రంగా విమర్శించాయి. తమ ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ ఎడిటోరియల్‌ కాలమ్స్‌ను ఖాళీగా విడిచాయి. మొదటి పేజీలో సెన్సార్‌ అధికారులు విచక్షణారహితంగా తీసివేసిన వార్తాభాగాలను అలాగే, ఖాళీగా ప్రచురించారు. ఇదే నిరసనను తెలుగు పత్రికలు కూడా ప్రకటించాయి. ఈ వైఖరిపై ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రం వెలుబుచ్చింది కూడా.

ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి విధేయత ప్రకటించడానికి ఇష్టపడని ఏ ప్రచురణను ఎమర్జెన్సీ బతకనివ్వదలుచుకోలేదు. అలాంటి వాటిలో మొదటి పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అసలు వి.సి.శుక్లా సమాచార మంత్రిగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఈ ఆంగ్ల దినపత్రికపై యుద్ధం ప్రారంభించారు. ఎమర్జెన్సీలో ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వర్తించిన వి.కె.నరసింహన్‌ వ్రాసిన ‘డెమాక్రసీ రిడిమ్డ్‌’ పుస్తకంలో ఈ యుద్ధం గురించి వివరించారు. ఆ పత్రికకు విద్యుత్‌ నిలిపివేశారు. ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేశారు. ఢల్లీిలోని ఎక్స్‌ప్రెస్‌ భవంతిని కూల్చడానికి ఉత్తర్వులు తెచ్చారు. ఆఖరికి ఎమర్జెన్సీ మొదటి రోజులో ఎడిటర్‌గా ఉన్న మూల్గామ్‌కర్‌ను పదవీచ్యుతుడిని చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న భగవాన్‌దాస్‌ గోయెంకాను అరెస్టు చేస్తామని ఆయన తండ్రి, ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామ్‌నాథ్‌ను గట్టిగా బెదిరించారు. అచ్చుకు వెళ్లే ప్రతి పేజీని సెన్సార్‌ అధికారులకు చూపాలని డీఐఆర్‌ 48 (1) నిబంధన విధించి ప్రీ సెన్సార్‌షిప్‌ను ప్రయోగించారు. పత్రిక అచ్చుకాకుండా గంటల కొలదీ జాప్యం చేయించారు. దాదాపు ఇదే నిబంధనలతో వేధింపులతో అణచివేతకు గురైన మరో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్‌మెన్‌’ ఆ సమయంలో మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఉన్న సి.ఆర్‌. ఇరానిని లొంగదీయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.

ముంబయి నుంచి ఎ.డి.గొర్వాలో సంపాద కత్వంలో వెలువడే ఆంగ్ల వారపత్రిక ఒపీనియన్‌ పై కూడా ప్రభుత్వం కక్షకట్టింది. పార్లమెంట్‌లో సభ్యులు చేసిన ప్రసంగాలను ప్రచురించాలని గొర్వాలా నిర్ణయించడమే ఆయన చేసిన పాపం. ఒపీనియన్‌ ముద్రించి ఇవ్వడానికి ప్రెస్‌ లేకుండా చేశారు పోలీసులు. అయినా సయిక్లో స్టయిల్డ్‌ పత్రికను ఆయన తెచ్చారు. తరువాత అసలు ఈ పత్రిక ప్రచురణనే ప్రభుత్వం నిషేధించింది. ఢల్లీి నుంచి రమేష్‌ థాపర్‌ వెలువరిస్తున్న ‘సెమినార్‌’ పత్రిక మరింత విషాదం.

1976 జులై 16న సెమినార్‌పై ప్రభుత్వం ప్రీసెన్సార్‌ షిప్‌ను విధించింది. అంటే అచ్చుకాబోతున్న సంచికలో విషయాలని ముందుగా సెన్సార్‌ అధికారులకు చూపించి వారి అనుమతితో ప్రచురించాలి. ఈ నిబంధనని ఆమోదించడం ఇష్టంలేని థాపర్‌ ప్రచురణని స్వయంగా ఆపేశారు. నిఖిల్‌ చక్రవర్తి ఆధ్వర్యంలోని మెయిన్‌ స్ట్రీమ్‌ ఆంగ్ల వారపత్రికది వేరే కథ. ఎమర్జెన్సీలో సీపీఐ ఇందిరను, ఆమె విధానాలను బాహాటంగానే సమర్థించింది. అయితే ఈ పార్టీ విధానాలను మద్దతుపలికే పత్రికగా మెయిన్‌ స్ట్రీమ్‌కు పేరున్నది. కాని పత్రిక ఎమర్జెన్సీ విషయంలో మాత్రం పార్టీ బాణికి తాళం వేయలేదు. సరికదా వ్యతిరేకంగా గళం విప్పింది. సంజయ్‌ని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా వ్రాసిన ‘హైబ్రీడ్‌ పొలిటికల్‌ స్ట్రింగ్‌ చికెన్‌’ ‘గుడ్‌బై ఫిరోజ్‌’, ‘డు వుయ్‌ నీడ్‌ నెహ్రూ టుడే’ వంటి వ్యాసాలు సహజంగానే సర్కార్‌కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ పత్రికను అచ్చువేసే ప్రెస్‌ను జప్తు చేయడం ద్వారా మెయిన్‌ స్ట్రీమ్‌ ఊపిరి తీసేశారు. అయితే ఈ పత్రిక ప్రచురణ నిలిచిపోయిన సంగతని విశాలాంధ్ర తొలిపేజీ వార్తగా ప్రచురించింది.

డిసెంబర్‌ 25 1976న మెయిన్‌స్ట్రీమ్‌ ఆగిపోయింది. తెలుగు సాహిత్య పత్రిక సృజన మూతపడిన సంగతిని కూడా విశాలాంధ్ర ప్రచురించింది. వ్యంగ్య చిత్రాల శంకర్స్‌ వీక్లీది ఇంకో విషాదాంతం. భారతదేశం గర్వించదగిన శంకర్‌ పిళ్లై ఈ పత్రిక అధిపతి, ఎడిటర్‌ కూడా. నవ్వుని, నవ్వి పోవడాన్ని నిషేధించిన వ్యవస్థలో , వాటిని బహిష్కరించిన పాలన బతకలేనంటూ ఈ వీక్లీ 1975 అక్టోబర్‌లో మూతపడిపోయింది.

‘ప్రీ సెన్సార్‌ నిబంధనని అంగీకరించలేని ఈ వినోద, విజ్ఞాన పత్రిక ఆత్మహత్య చేసుకున్నది. 1948 పండిట్‌ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వ్యంగ్య చిత్రాల వీక్లీ ఆయన కుమార్తె ఇందిర హయాంలో అంతమైంది. తన చివరి సంపాద కీయంలో శంకర్‌ చేసిన వ్యాఖ్య అద్భుతమైనది, చిర్మరణీయమైనది. ‘నాగరికతను మరిచిపోయిన సమాజం మాత్రమే నవ్వుని నిషేధిస్తుంది అంటూ శంకర్‌ కలం మూసివేశాడు. వినోబా నడిపే మైత్రి, జె.పి.ఎన్రీమేన్స్‌, పెర్నాండేజ్‌ ప్రతిపక్ష ఎన్నో పత్రికలు శాశ్వతంగానో, తాత్కాలికంగానో ప్రచురణలను నిలిపివేశాయి. తెలుగులో సృజనతోపాటు జాగృతి, పిలుపు, ప్రజా సమస్యలు అనే పత్రికలు ఆగిపోయాయి. (తరువాత మళ్లీ ప్రచురణ ప్రారంభించాయి) పాంచజన్య (యు.పి), మదర్‌ ఇండియా (ముంబయ్‌) భూమిపుత్ర (గుజరాత్‌) తకవాణి (కర్ణాటక), ఆర్గనైజర్‌ (ఢల్లీి) హిమ్మత్‌ (ముంబయ్‌) కేసరి (కేరళ) వంటి ఎన్నో పత్రికలు నిషేధానికి గురయ్యాయి. కె.ఆర్‌. మల్కాని, కులదీప్‌ నయ్యర్‌, రాజేందర్‌పురి వంటి ఎందరో జర్నలిస్టులు అరెస్టయ్యారు. పశ్చిమబెంగాల్‌ నుంచి వెలువడే ఆనందబజార్‌ పత్రికకు చెందిన నిఫీష్‌ డే ను అక్టోబర్‌ 24,1976న అరెస్టుచేసి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.

జూన్‌ 25, 1975 రాత్రి అచ్చుకు పంపడానికి సిద్ధం చేసిన స్టేట్స్‌మన్‌ ఆంగ్ల దినపత్రిక తొలి పేజీ సెన్సార్‌ అధికారుల కారణంగా ఆగిపోయింది. ఇప్పటికీ పత్రిక కార్యాలయంలో గుర్తుగా ఉంది.

ఎమర్జెన్సీ విదేశీ పత్రికా విలేకరులను కూడా విడిచిపెట్టలేదు. 1975 జూన్‌ నాటికి దేశంలో 70మంది విదేశీ పత్రికల విలేకరులు పనిచేస్తున్నారు. ఒక్క అమెరికా మీడియా వారే ఢల్లీిలో 15మంది ఉండేవారు. 25మంది పశ్చిమయూరప్‌వారు, 20మంది తూర్పు యూరప్‌ దేశాల విలేకరులు వ్యతిరేకిస్తే వీరిని అరెస్టు చేయలేరు. కాని దేశం నుంచి బహిష్కరించవచ్చు. వీరిలో వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికకు చెందిన లెనిన్‌ ఎం.సైమన్స్‌ వ్రాసిన వ్యాసం ఒక సంచలనం. ఢల్లీిలో ఒక రాత్రి జరిగిన ఇందులో సంజయ్‌గాంధీ ఇందిరపై చేయి చేసుకున్నాడని సైమన్స్‌ ఆ వ్యాసంలో పేర్కొన్నాడు. (చూ.ది జడ్జిమెంట్‌, కులదీప్‌నయ్యర్‌, పేజీ 53) పీటర్‌ హాజెల్‌ హ్రస్ట్‌ (లండన్‌ టైమ్స్‌) తరెన్‌ జెండిన్స్‌ (న్యూస్‌ వీక్‌) పీటర్‌ గిల్‌ (లండన్‌ డెయిలీ టెలిగ్రాఫ్‌)లకు 24 గంటలలో దేశం విడిచి పొమ్మనిక దశలో తాఖీదులు అందాయి. అయితే విదేశీ పత్రికలు ఏదో మార్గం ద్వారా భారతదేశ వార్తలను ప్రచురించాయి.

అయితే భారతీయ పత్రికలు ఎమర్జెన్సీలో ఇందిర ఇరవై సూత్రాల పట్ల కొన్ని భ్రమలు పెంచుకున్నాయి. క్రమశిక్షణను నిజమని నమ్మి తరువాత చెంపలు వేసుకున్నాయి. తెలుగుపత్రికలు అఞతే. ఎమర్జెన్సీని సమర్థించిన పత్రికలు ఉన్నాయి. మధ్యే మార్గాన్ని అనుసరించినవీ ఉన్నాయి.

సలహా ఎవరిదైనా ఎమర్జెన్సీ ఇందిర వ్యూహమే. ఇది చారిత్రక వాస్తవం. చిత్ర విచిత్రంగా భయానకంగా ప్రచారమైపోతున్న వదంతులను నిరోధించలేకపోవడానికి అసలు జరుగుతున్నదేమిటో తనకు సైతం (ప్రధానికి) తెలియకపోవడానికి మూలం సెన్సార్‌షిప్‌. ఇది కూడా ఆమె చలవే. ఇది ఆమె స్వయంగా అంగీకరించిన సత్యాలే. సెన్సార్‌ షిప్‌ను తొలగించమని జులై 5, 1975న తనను కలిసిన ఇండియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌కు ఆమె చెప్పిన సమాధానమే ఇందుకు నిదర్శనం. (ఆరో తేదీ పత్రికలు ఈ విషయాన్ని వెల్లడిరచాయి) దేశాన్ని రక్షించడానికి సెన్సార్‌షిప్‌ విధించానని ఆమె జర్నలిస్టులకు చెప్పారు కాని జరిగినదేమిటి మారుతికారు ఉదంతం, స్నేహలత విషాదాంతం, పోలీసుల అరాచకాలు, కిస్సా కుర్సీకా, బలవంతపు ఆపరేషన్లు, అరెస్టులు, పోలీసు కాల్పులు, కూల్చివేతలు అన్నీ సెన్సార్‌ ఇనుపతెర వెనుక ఉండిపోయాయి. దీనికంతకూ బాధ్యత ఇందిరదే. మరో కోణం నుంచి ఆమె దేశానికి చేసిన సేవలు, ఆమె కుటుంబం చేసిన సేవలు గొప్పవే కావచ్చు. కాని చారిత్రక వాస్తవం ఇందిరకంటే గొప్పది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE