‘సరతి చరతీతి సూర్యాః’ అంటుంది సనాతన ధర్మం. సూర్య భగవానుడు సంచార క్రమంలో తన దిక్కును మార్చుకుని ఉత్తరం వైపు పయనం సాగించే ఉత్తరాయణంలోనే యోగా డే జరుపుకుంటాం. ఉష్ణతాపానికి యోగాభ్యాసం విరుగుడు. 47 ముస్లిం దేశాలు సహా ప్రపంచంలోని 193 దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టు, ఖతార్ వంటి దేశాల్లో మహిళలు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తున్నారు. ‘నాసా’ వ్యోమగాములు మొదలు న్యూయార్క్ ఆసుపత్రుల్లో రోగుల వరకూ యోగాను పాటిస్తున్నారు.
కేంద్రం ఆధునిక దౌత్యానికి ప్రాచీన అభ్యాసాన్ని జోడించడంలో భాగంగా యోగాను విశ్వవ్యాప్తం చేసింది. ఇదే ఇప్పుడు ‘గ్లోబల్ యోగా డే’గా మారింది. భారత్ నుంచి బాలీ వరకు, టోక్యో నుంచి టొరంటో వరకూ ప్రతిచోటా యోగా కేంద్రాలు వెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమంగా మారిన యోగా భారీ పరిశ్రమ స్థాయికి ఎదిగి వందల కోట్లు ఆర్జిస్తోంది.
ఈజిప్టు రాజధాని కైరోలోని బరెన్ సౌధం యోగా డే కోసం ముస్తాబవుతోంది. సరిగ్గా 11ఏళ్ల క్రితం యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిని కోరినప్పుడు పశ్చిమ దేశాలు మినహా ముస్లిం దేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత కాలంలో పరిస్థితి మారింది. గల్ఫ్ దేశాల్లో ముస్లిం మహిళలు ప్రత్యేక స్టూడియోలు ఏర్పాటు చేసి మరీ శిక్షణ ఇస్తున్నారు. కైరో నగరంలోని ‘బరోన్ సౌధం’లో ప్రతి ఏటా యోగాడేను ఘనంగా నిర్వహిస్తారు.
భారత్ 2014 సెప్టెంబర్‌లో యోగాను అంతర్జాతీయం చేయాలని ఐక్యరాజ్యసమితి ముందు తీర్మానం ప్రవేశ పెట్టగానే 175 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. గడచిన పుష్కరకాలంలో మరిన్ని దేశాలు యోగాను ఆచరించడం మొదలు పెట్టాయి. అరబ్బు ప్రపంచంలో యోగా సాధన దినచర్యగా మారింది. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా యోగాను ఆచరిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో సూర్యనమస్కారాన్ని మినహాయించి యోగాభ్యాసం చేస్తున్నదాఖలాలు ఉన్నాయి.
ఉగ్రవాదం, యుద్ధంలో ఉన్న లెబనాన్, సిరియా దేశాల ప్రజలు యోగాతో ఒత్తిడిని జయిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెపుతున్నాయి. దుబాయ్, అబూదబి, కైరోల్లో పెద్ద ఎత్తున యోగా స్టూడియోలు వెలుస్తున్నాయి. ఆరంభంలో కొన్ని ముస్లిం దేశాలు యోగాను మతపరమైన వ్యవహారమని భావించాయి. తర్వాత కాలంలో ప్రజల్లో ఆదరణ పెరిగే సరికి మిన్నకుండిపోయాయి.
2023 నుంచి సౌదీ అరేబియాలో యోగాభ్యాసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో మహిళలు యోగాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ‘సౌదీ అరేబియా యోగా స్కూల” పేరిట 2004లోనే శిక్షణకేంద్రం ఏర్పాటు చేశారంటే. ముస్లిం దేశాల్లో యోగాకు పెరుగుతున్న ఆదరణ అర్థమవుతుంది. 2019నాటికే సౌదీ అరేబియా వ్యాప్తంగా 7వందల మంది యోగా టీచర్లు ఉన్నారు.
సౌదీ అరేబియా యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 10వేల మంది విద్యార్థులకు కేవలం ఏడాది వ్యవధిలో యోగా శిక్షణ ఇచ్చారు. టర్కీ, ఇరాన్, కువైట్, ఒమన్ దేశాల్లో దశాబ్ద కాలంగా యోగా కమ్యూనిటీలు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాయి. అమెరికా సహా ఐర్లాండ్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో యోగాభ్యాసం విరివిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 44కోట్ల మంది యోగాను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెపుతు న్నాయి. కెనడాలో 20శాతం ప్రజలు యోగా చేస్తున్నట్టు తెలుస్తోంది.
సింగపూర్ తీర ప్రాంతంలో ప్రతిరోజూ కొన్ని వేల మంది యోగాభ్యాసం చేస్తారు. ఆస్ట్రేలియాలో 12శాతం మంది ప్రజలు యోగా చేస్తారని ‘ది ఆస్ట్రేలియన” పత్రిక ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో పేర్కొంది. వాయవ్య యూరప్ దేశమైన ఐర్లాండ్‌లోని పర్వత ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మరీ యోగా నేర్పిస్తున్నారు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో సుమారు డజనుకు పైగా యోగా శిక్షణ కేంద్రాలున్నాయి. సుమారు ముప్ఫై లక్షల మంది అమెరికన్లు ప్రతిరోజూ యోగా కేంద్రాలకు వెళుతున్నట్టు ‘మై విన్యాసా” వెబ్ సైట్ పేర్కొంది. కాలిఫోర్నియాలో బీచ్ యోగా, న్యూయార్క్‌లో హాట్ యోగా చాలా ప్రసిద్ధి. నిత్యం యుద్ధమైదానాలకు తరలిపోయే అమెరికా సైనికులు, ఉద్యోగ విరమణ చేసిన సైనికులు సమయం దొరికితే యోగా చేస్తున్నారని తెలుస్తోంది.
పశ్చిమ తీరంలోని సాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద ఎత్తున యోగా శిక్షణా కేంద్రాలున్నాయి. మన దేశంలో 13వేల నాలుగు వందల యోగా కేంద్రాలుంటే… అమెరికా వ్యాప్తంగా 24వేల యోగా స్టూడియోలున్నాయి. యూకేలో 4వేల 5వందల కేంద్రాలు, బ్రెజిల్‌లో 3 వేల 336, స్పెయిన్‌లో 2వేల 780, నెదర్లాండ్స్‌లో 1,980, మెక్సికోలో 1,977, ఇటలీలో 1,892, ఫ్రాన్స్‌లో 15వందలు, 1,225 యోగా శిక్షణ కేంద్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 వేల నుంచి లక్ష యోగా కేంద్రాలు న్నాయనేది ఒక అంచనా.
థాయిలాండ్, ఇండోనేసియా, జపాన్ , కొరియా దేశాల్లో ఈ మధ్య కాలంలో యోగాకు ఆదరణ పెరిగింది. తూర్పు ఆసియా దేశాల్లో వందలాది మంది యోగా ట్రయినర్లు స్టూడియోలు నిర్వహిస్తు న్నారు. 35 దేశాల్లోని ఔత్సాహికులు ఆన్ లైన్ యోగా శిక్షణ తీసుకుంటున్నారు. థాయిలాండ్‌లోని బాలీ నగరంలో డజన్ల సంఖ్యలో యోగా స్టూడియో లున్నాయి. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరం యోగా కేంద్రాలకు ప్రసిద్ధి. చైనాలో కోటి మంది యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. 10 శాతం మంది చైనా కుబేరులు యోగాపై ఆసక్తి చూపిస్తున్నారు.
అరవయ్యో దశకం నుంచే విదేశాల్లో యోగాకు ప్రాచుర్యం ఉంది. అయితే గడచిన దశాబ్ద కాలంలో ఇది మరింత విస్తృతమైందంటారు రచయిత డేవిడ్ ఫ్రాలీ. పతంజలి యోగా సూత్రాలను ఇరానియన్ చరిత్రకారుడు ఆల్ బైరూనీ సిర్కా 1050లోనే అనువదించాడు. 19వ శతాబ్దం నాటికి దక్షిణాసియా వ్యాప్తంగా పర్షియా భాషలో యోగా విస్తారమైన సాహిత్యం వచ్చింది. పశ్చిమ దేశాల్లో పెరిగిపోతున్న విశృంఖలతను నివారించడానికి పాఠశాలలు, కళాశాలలు, అసుపత్రులు, జైళ్లలో సైతం యోగా శిక్షణ ఇస్తున్నారు. 2014లో యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ప్రాచీన అభ్యాసంపై ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యంలో అధ్యయనాలు జరిగాయి. సుమారు లక్ష పుస్తకాలు యోగాపై వచ్చాయంటే ప్రాచుర్యం ఏ స్థాయిలో పెరిగిందో అంచనా వేయవచ్చు.
దక్షిణ కొరియాలో అత్యధికంగా 43శాతం మంది మహిళలు యోగా ఆచరిస్తున్నారు. అమెరికా, యూకే, స్పెయిన్ లో 33శాతం మంది మహిళలు, 10శాతం మంది పురుషులు యోగాభ్యాసం చేస్తున్నారు. ‘యోగా అలియన్స” సంస్థ లెక్కల ప్రకారం అమెరికాలో యోగా ట్రయినర్లు 87శాతం మంది మహిళలే అని అంచనా వేసింది. 59శాతం మంది అమెరికా యోగా ట్రయినర్లు ఏడాదికి సగటున 75వేల డాలర్లు సంపాదిస్తున్నట్టు ‘యోగా అలియన్స” అంచనా వేసింది. మరో 30శాతం మంది లక్ష డాలర్లు ఆర్జిస్తున్నారు.
2016 తర్వాత అమెరికాలో యోగాపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియా, యూరప్ మాత్రమే కాదు ఆఫ్రికా దేశాలకూ యోగా వెళ్లింది. టునీషియా, అల్జీరియా, మొరాకో వంటి దేశాలకూ పాకింది. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాల్లో యోగాపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అత్యాధునిక చికిత్సా విధానంగా భావించే అలోపతి సైతం కోవిడ్ సమయంలో నిశ్చేష్టగా మారిన నేపథ్యంలో ప్రాచీన భారతీయ అభ్యాసంపై మక్కువ పెరిగింది.
2012లో 17.8శాతం మంది యోగా ప్రాక్టీషనర్లు ఉంటే 2016లో అదికాస్త 28శాతానికి పెరిగింది. ఏటా అమెరికన్లు యోగాకోసం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు కాగా తలసరి ఖర్చు 63వేల డాలర్లుగా ‘యోగా అలియన్స” సంస్థ అంచనా వేసింది. 2025నాటికి అమెరికా యోగా పరిశ్రమ 27బిలియన్ డాలర్లు ఆర్జించింది.
గడచిన దశాబ్ద కాలంలో యోగా మల్టీ బిలియన్ డాలర్ల బిజినెస్‌గా ఎదిగింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనంగా ఉన్న యోగా, ఇప్పుడు ఫిట్నెస్ ట్రెండ్గా, ఆదాయ వనరుగా ఉపయోగపడుతోంది. ఆన్లైన్ కోర్సులు, శిక్షణా కేంద్రాలు, యోగాలో వాడే వస్తువుల అమ్మకాలతో యోగా ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం యోగా ప్రపంచంలోని టాప్ ఫిట్నెస్ ట్రెండ్స్లో ఒకటిగా మారింది. దీని కారణంగా యోగా రూ.లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యమైంది.
2023లో ప్రపంచ యోగా పరిశ్రమ విలువ సుమారు 107.1 బిలియన్ డాలర్లుగా ఉందని గణాంకాలు చెపుతున్నాయి. 2030 నాటికి యోగా బిజినెస్ సుమారు 9.4శాతం వార్షిక వృద్ధి రేటుతో పురోగమిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 2026 చివరి నాటికి 215 బిలియన్ డాలర్ల నుంచి 370 బిలియన్ డాలర్ల వరకు పైగా చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.
గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ యోగా అడుగు పెట్టింది. ఫలితంగా యోగా కేంద్రంగా వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయి. యోగాశ్రమాలు, ట్రైనింగ్ సెంటర్లు, రిట్రీట్ సెంటర్లంటూ.. యోగాను చాలా మంది అనేక విధాలుగా ఆదాయం వనరుగా మలచుకున్నారు. యోగా శిక్షణ ద్వారా ప్రచారం కల్పిస్తూ ఎఫఎమ్సీజీ కంపెనీలనే స్థాపించారు.
యోగా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు సహా ప్రపంచ వెల్నెస్ రిట్రీట్ బిజినెస్ 2024 నాటికి 225.5 బిలియలన్ డాలర్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఈ ఏడాది చివరి నాటికి 10.5 శాతం సీఏజీఆర్-కాంపౌండ్ యాన్యువల్ గ్రోల్ రేట్ తో 249.59 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే 2029 నాటికి 366.82 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలో నాలుగు వేలకు పైగా యోగా ఆధారిత పరిశ్రమలు, సంస్థలు స్థాపించారు.
ఐక్యరాజ్య సమితి 2015లో యోగాను అంతర్జాతీయ దినంగా ప్రకటించిన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను తమ తమ స్థానిక సంస్కృతులకు, స్థానికతకు అనుగుణంగా మార్చుకుంటూ..సరికొత్త అభ్యసన ప్రక్రియను ఆరంభించాయి. అమెరికాలో హాట్ యోగా, బిక్రం యోగా, బీచ్ యోగా చాలా ప్రసిద్ధి చెందాయి. తూర్పు ఆసియా దేశాలైన చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మంగోలియా, తైవాన్ దేశాల్లో యోగాను మార్షల్ ఆర్ట్స్‌తో సమ్మిళితం చేసే ప్రయత్నం చేసి, ఔత్సాహికులను ఆకర్షిస్తున్నాయి.
ప్రాణాయామాన్ని ‘బ్రీత్ వర్క’పేరిట పరిచయం చేశాయి. ఆగ్నేయాసియా దేశాల్లో సైతం ఇదే తరహాలో యోగాను స్థానికతకు అనుగుణంగా మార్చుకున్నాయి. ఇండోనేసియాలోని బాలీ ద్వీపంలో ‘బాలినీస్ హిందూ ఇజం’లోకి తర్జుమా చేసుకుని బాలినీస్ ఆశ్రమాలను స్థాపించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో యోగాను థెరపీగా చికిత్సా పద్ధతుల్లో వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో విన్యాస యోగా, రిస్టోరేటివ్ యోగాపై అమితమైన ఆసక్తి ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కెనడాలో ‘ఆక్రోయోగా’, ఈజిప్టులో కెనెటిక్ యోగా, యూరప్ లో థెరపీ యోగాలు చాలా ప్రసిద్ధి. విదేశాల్లో నిర్మిస్తున్న యోగా స్టూడియోలకు కోట్లాది రూపాయలు వెచ్ఛిస్తున్నారు.
చిత్తశుద్ధి కోసం పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని, వాక్‌శుద్ధి కోసం పాణిని వ్యాకరణాన్ని, కర్మశుద్ధి కోసం చరకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు ప్రసాదించారు. ఇదే భారతదేశ గొప్పతనం. ప్రాచీన యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పం ఉన్నతమైంది. అయితే అది వ్యాపారంగా మారడం వల్ల విస్తృతి తగ్గుతుంది. యోగా సంస్థలు, ఔత్సాహిక యోగా శిక్షకులు చేసే ప్రయత్నాలు యోగా వ్యాపారీకరణను కొంతమేర నివారిస్తాయి.

ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్