ఎమర్జెన్సీ అంటే ఇరవై ఒక్క మాసాల నిర్బంధం మాత్రమే కాదు, నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాలవరకూ వినిపించే మనోరోదన ఉంది. అత్యాచారాలకి ఎమర్జెన్సీ కేరాఫ్ అయిందంటే అతిశయోక్తి కాబోదు. అత్యవసర పరిస్థితి అంటే ` అక్షరాలా పోలీసు రాజ్యమే. మీసా, డీఐఆర్‌ల కింద లక్షమందిని అరెస్టు చేశారు. 25,000 మంది కేవలం ప్రభుత్యోద్యోగులకే బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించారు. ఎంపీ, యు.పి, ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో పోలీస్ లాకప్‌లు నాజీల క్యాంప్‌లుగా మారిపోయాయి. ఒక్క ఆంధ్రలోనే వేయిమంది పోలీసుల చేతిలో జీవితాంతం గుర్తుండే చేదు అనుభవాలు చవిచూశారు. ఇవన్నీ బయటకు తెలిసినా పత్రికలు ప్రచురించే అవకాశం లేకపో యింది. కొన్ని ‘క్రమశిక్షణ’ ఇనపతెర వెనకే ఉండి పోయాయి. 1977 జనవరిలో సెన్సార్‌షిప్ ఎత్తివేసిన తరువాత ఒక్కొక్కటీ దారుణాలు వెలుగు చూశాయి. మొదట ఒక తెలుగు దినపత్రిక భారతదేశంలో పరిస్థితి గురించి ఆమ్నెస్టీ తయారుచేసిన నివేదికను ప్రచురించింది. 1977 మార్చి1న జనతా పార్టీ ప్రచురించిన ఒక పత్రాన్ని పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఎమర్జెన్సీ నీడలో జరిగిన ఘాతుకాలు అందులో జనతాపార్టీ వివరించింది. తరువాత క్రమంగా టర్క్‌మన్ గేట్ (ఢిల్లీ) ఉదంతం, స్నేహలత, లారెన్స్ (కర్ణాటక) నిర్బంధం, రాజన్ అదృశ్యం (కేరళ) ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. ఎమర్జెన్సీలో అరెస్టయిన ప్రముఖ జర్నలిస్టు జి.కె.రెడ్డి వ్రాసిన ‘‘ఈ అత్యాచారాలను క్షమించగలమా?’’ అనే వ్యాసం పాఠకులను కదిలించి వేసింది.
ఢిల్లీ అందాల కోసం అక్కడి మురికివాడ టర్క్‌మన్ గేట్ ప్రాంతాన్ని అతి దారుణంగా ప్రభుత్వం తొలగించింది. 1976 ఏప్రిల్‌లో జరిగిన ఈ సంఘటనలో ఆఖరికి పోలీసు కాల్పులలో మరణిం చిన వారి సంగతిని కూడా ప్రభుత్వం సెన్సార్ చేసింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయబోయిన అధికారులపై మూకుమ్మడిగా ప్రజలు తిరగబడడం, పోలీసులు కాల్పులు జరపడం వంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. కాని, వార్త ఏదీ ప్రచురణకు నోచుకోలేదు.
సంస్కార చిత్రంతో జాతీయ ఖ్యాతి గాంచిన నటి స్నేహలతారెడ్డిని 1976 మే 1న పోలీసులు తీసుకువెళ్లారు. 1977 జనవరిలో విడిచిపెట్టారు. జైలు నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఆమె కన్ను మూసింది. కార్మిక నేత జార్జి ఫెర్నాండెజ్ ఆచూకీ ఆమెకు తెలిసి ఉంటుందని పోలీసుల అనుమానం అంతే. లారెన్స్ ఫెర్నాండెజ్ ఉదంతం ఇంకో విషాదం. జార్జి ఫెర్నాండెజ్ తమ్ముడైనందుకు ఆయన జీవితాంతం జీవచ్ఛవంలా బతకవలసిన స్థాయిలో చిత్రహింసలకు గురయ్యాడు. కేరళలో రాజన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అయితే రాజన్ తండ్రి ప్రొఫెసర్ వారియర్ వేసిన కేసుతో డొంకంతా కదిలింది. రాజన్‌ను లాకప్‌లో చంపేసిన పోలీసులు అతడి శవం కనిపించకుండా చేశారు. దీనిపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కరుణాకరన్ ప్రభుత్వం రాజీనామా చేసింది.
సంజయ్‌గాంధీ ఇందిర రెండవ కుమారుడు. రాజ్యాంగేతర శక్తి అన్న పదానికి మూలపురుషుడు ఇతడేనన్న నమ్మకం ఉండేది. ఇతడు దేశం మీదకు తెచ్చినదే కుటుంబ నియంత్రణ ఉద్యమం (నాస్‌బంది). ఇందిర 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక పేరుతో అత్యాచారాల మీద ముసుగు వేస్తే, సంజయ్ గాంధీ నాలుగు సూత్రాల పథకంతో నేరుగానే ఘోర సంక్షోభానికి కారకుడయ్యాడు. దీనికి ప్రధాని కార్యాలయ ఆమోదం ఉంది గాని, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధం లేకుండానే జరిగింది. ఢిల్లీలో మొదలయిన ఈ దుశ్చర్యను తరువాత దేశ వ్యాప్తంగా అమలు చేశారు. జ్ఞానపీఠ్ గ్రహీత మహాశ్వేతదేవి కథ ‘మకర సవర’ గిరిజన సమాజంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఎంతటి విధ్వంసానికి దారి తీసిందో చెబుతుంది.
ఎనభయ్ సంవత్సరాల వృద్ధులు మొదలుకొని పదిహేనేళ్ల బాలురను సైతం పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు విడిచిపెట్టలేదు. ఈ అంశంపై ‘విశా లాంధ్ర’ ఫిబ్రవరి 10, 1977న రాసిన సంపాద కీయం ఒళ్లు గగుర్పొడిచే రీతిలో సాగింది. గుంటూరులో 42మంది మగపిల్లలకు బలవంతంగా శస్త్ర చికిత్స జరిపారని, అందులో 15 సంవత్సరాల రత్నాకరం అనే బాలుడు ఖమ్మంలోని తన తల్లిదండ్రు లకు సంగతి తెలియజేయడంతో అక్కడ కేసు నమోద యింది. ఈ వార్తను కూడా ఆ పత్రిక ప్రచురించింది.
నిజానికి అది బలవంతపు కుటుంబ నియంత్రణ. ఒక కోటి పదకొండు లక్షల మందికి(ఇండియా టుడే, అక్టోబర్ 25, 2024. డిసెంబర్ 9, 2021 హిందుస్తాన్ టైమ్స్ కూడా ఈ విషయం వెల్లడిరచింది) ఆ పేరుతో శస్త్ర చికిత్సలు చేసినప్పటికీ అసలు ఆ పథకానికి అధికార ముద్ర లేనేలేదు. ఎమర్జెన్సీపై నియమించిన షా కమిషన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. చిత్రం ఏమిటంటే నాజీలు నాలుగు న్నర లక్షల మందికి మాత్రమే కు.ని, ఆపరేషన్‌లు నిర్వహించారు. కు.ని. శస్త్ర చికిత్సలు పేరుతో జరిగిన ఈ అకృత్యంలో సంజయ్, ఇందిర, రాష్ట్రాల నాటి ముఖ్యమంత్రులు కూడా భాగస్వాములే. శస్త్ర చికిత్సలకు దూరంగా ఉంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలలో కోత విధించాయి. పొలాలకు నీటిని నిలిపివేశాయి. ఉద్యోగులకు శస్త్రచికిత్సల లక్ష్యాలు నిర్దేశించి, దానికి చేరకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని కూడా చెప్పేశారు. ప్రభుత్వ బారిన పడకుండా తప్పించుకున్న వారి ఇళ్ల మీద అర్ధరాత్రి దాడులు చేసి, ఈడ్చుకు వెళ్లారు. ఇలాంటి ఆపరేషన్‌ల కారణంగా కొందరు చనిపోయారు కూడా. డబ్బు సరే, కొన్ని చోట్ల స్థలాలు కూడా ఇస్తామని ప్రమాణం చేసి శస్త్ర చికిత్సలు చేశారు. కొందరు ప్రభుత్వో ద్యోగులు పైవారి మెప్పు కోసం కోయించుకున్నారు. జూలై 20, 1976న ఢిల్లీ పోలీసు శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1100 మంది వారి సిబ్బంది స్వచ్ఛందంగా శస్త్ర చికిత్సలు చేయించు కున్నారు. ఆగస్ట్ 2న విడుదలైన బులెటిన్‌లో ఆ సంఖ్య 2000కి చేరింది. ఫలితం – జాతీయ జనాభా విధానం 2000లో అధిక సంతానం అవసరమన్న వాదన చేర్చవలసి వచ్చింది. 1960-70 మధ్య కొన్ని పాశ్చాత్య దేశాలు జనాభా పెరిగితే ఆహార సమస్య ఎదురవుతుందనే పిచ్చి వాదనకు లొంగిపోయి బలవంతపు కుటుంబ నియంత్రణను అమలులోకి తెచ్చారు. ఆయా దేశాలలో బలవంతంగా శస్త్ర చికిత్సలు చేశారు. దాంతో జనాభా సమీకరణలలో తీవ్రమైన అంతరాలు వస్తాయన్న ఇంగితం వారికి లేకపోయింది. నిజానికి ఆ వాదన నమ్మే భారత్ కూడా 1970లలోనే మొదలుపెట్టింది. ఇందుకు ప్రపంచ బ్యాంక్, యూఎన్ పాప్యులేషన్ ఫండ్ వంటి మార్గాల ద్వారా కోట్లాది డాలర్ల నిధులు తీసుకుంది.
ఎమర్జెన్సీ కాలం నాటి అరాచకాలు జాబితా చిన్నదేమీ కాదు. అక్రమ అరెస్టులు, జైలు సరేసరి. ఆంధీ అనే సినిమాను నిషేధించారు. కిస్సా కుర్సికా అనే చిత్రం రీళ్లు ముక్కలు ముక్కలు చేసేశారు. వీటికి పరాకాష్ట మారుతీ కారు తయారు ఉదంతం.
– జాగృతి డెస్క్