భారతదేశానికి స్వాతంత్య్రం తమ ఘనతేనన్నది కాంగ్రెస్ భ్రమ. జాతిని నిరంతరాయంగా చేస్తున్న దగా. అంతటి కాంగ్రెస్ తమ జేబు సంస్థ అని గాంధీ-నెహ్రూ కుటుంబ అహంకారం. అందుకే దేశ స్వాతంత్య్రాన్ని ఎప్పుడైనా, ఏ కారణానికైనా కాలరాసే సర్వాధికారాలు తమకు దఖలు పడి ఉన్నాయని ఆ కుటుంబం, కాంగ్రెస్‌ల ప్రగాఢ విశ్వాసం. ప్రధాని పదవి ఆ కుటుంబ జన్మహక్కు అనీ, దేశం కాంగ్రెస్ గుప్పిట్లో మాత్రమే ఇమిడిపోతుందని ఆనాడు రాజ్యమేలిన నిశ్చితాభిప్రాయం. వీటన్నిటి ఫలశ్రుతే 1975 నాటి అత్యవసర పరిస్థితి. ప్రపంచం నిద్రిస్తున్న వేళ భారత్ మేలుకొన్నది అంటూ స్వాతంత్య్రం సిద్ధించిన తొలి ఘడియలలో ప్రథమ ప్రధాని నెహ్రూ పలికిన మాటలు జనం మరవకముందే, కేవలం 28 ఏళ్లకే మళ్లీ ఒకే ఒక్క కలం పోటుతో ఆయన కుమార్తె ఇందిరాగాంధీ దేశాన్ని నియంతృత్వం కింద నిద్రపుచ్చారు. స్వరాజ్య స్పృహ మీద నీళ్లు చల్లారు. అప్పుడప్పుడే జాతి జ్ఞాపకాల నుంచి నిష్క్రమిస్తున్న బ్రిటిష్ పాలనను మరొకసారి రుచి చూపించారు. అక్రమ అరెస్టులు, జైలు గోడల వెనుక ఆక్రందనలు, నడిరోడ్ల మీద లాఠీల తాండవాలు అన్నీ స్వరాజ్య సమరకాలాన్ని పునరావృత్తం చేశాయి. బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు భారతీయ సమాజానికి శతాబ్దాలు గడిచినా వదలని గర్భశోకాన్ని మిగిల్చాయి. నిజమైన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, వారి స్వప్నాలు, ఆ పోరాటం వెనుక ఉన్న ప్రజాస్వామ్య దృష్టి, స్ఫూర్తి నిర్వీర్యం చేసింది ఎమర్జెన్సీ. రాజ్యాంగం ఇస్తే మాత్రమేమిటి! ప్రజలందరి ప్రాథమిక హక్కులన్నీ చచ్చుపడిపోయాయి. న్యాయదేవత కళ్లకు పాత గంతలతో పాటు, నోటికి కొత్తగా తాళం వచ్చింది. రాజ్యాంగ పదవులలో ఉన్న వాళ్ల మీద కోర్టులకెక్కే హక్కే హరించుకుపోయింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమని చెప్పే పత్రికల వెన్నెముక వంగిపోయింది. అలాంటి అత్యవసర పరిస్థితి విధించి అర్ధ శతాబ్దం గడిచింది. ప్రజాస్వామ్య ప్రియులంతా గుర్తు చేసుకోవలసిన సందర్భమిది. చరిత్రను పునర్ లిఖించడం ప్రతితరం బాధ్యత అని విశ్వసించేవారు గమనించవలసిన పరిణామం. విశ్లేషించుకోవడమూ వారి కర్తవ్యమే.
దిరాగాంధీ సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ (1905-1977) అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన ఎమర్జెన్సీ విధించే అధికారాన్ని రాష్ట్రపతికి దాఖలు పరుస్తున్నది. ఇదే నిబంధన కింద ఎక్స్‌టర్నల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. ఆంతరంగిక భద్రతకు విఘాతం వాటిల్లిందని రాష్ట్రపతి విశ్వసిస్తే, ప్రధాని, కేంద్ర క్యాబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు. కానీ, లోక్‌సభకు ఇందిర ఎన్నిక చెల్లదంటూ జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 25న సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టే మంజూరు చేసిన నేపథ్యంలో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), మొరార్జీ దేశాయ్ వంటి విపక్ష ప్రముఖులు ఇందిర పదవిలో కొనసాగరాదన్న నినాదం వినిపించారు. అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ప్రధాని ఇందిర రాజీనామా చేయాలని, ఈ డిమాండ్‌తో దేశంలో ఉద్యమం నిర్వహించాలని అదే రోజున ఢల్లీిలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన గొప్ప బహిరంగ సభలో ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ రాత్రే ఇందిర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది.
జూన్ 25, 1975 నాటికి దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అవి అత్యవసర పరిస్థితి విధించడానికి ఏ పరిస్థితులు ఉండాలో రాజ్యాంగం చెప్పిన స్థాయిలో అవి ఉన్నాయా? ఒకటి న్నర సంవత్సరం క్రితానికి వెళ్లినా అంత తీవ్ర మైన పరిస్థితులుగా కనిపించవు. జనవరి 1,1974న గుజరాత్‌లో విద్యార్థి ఆందోళన మొదలయింది. ఏప్రిల్ 6న జేపీ, ప్రభుత్వం అవినీతిపై ప్రసంగిం చారు. జూలై 29న ఆల్ ఇండియా యూత్ కాన్ఫరెన్స్‌లో, నవంబర్ 19న పట్నా బహిరంగ సభలో జేపీ మాట్లాడారు. 1975 జనవరిలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన జరిగింది. బిహార్‌లోని సమస్తిపూర్ అనే చోట రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా ప్రసంగిస్తున్న సభలో బాంబు పేలింది. కానీ దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేకపోయారు. ఆ ప్రయత్నమే జరగలేదు. జేపీ ప్రారంభించిన సంపూర్ణ విప్లవానికి మద్దతుగా జనవరి 18న పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వహించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. మార్చి 18న అలహాబాద్ హైకోర్టు బోనులో ఇందిరాగాంధీ నిలబడ్డారు. బిహార్‌లో విద్యార్థులు ఆరోజే మూడు కిలోమీటర్ల మేర జనతా మార్చ్ నిర్వహించారు. అవినీతి ఆరోపణలతో ఉన్న చిమన్‌భాయి పటేల్ ప్రభుత్వాన్ని దించి, గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్ ప్రారంభించిన నిరాహార దీక్ష ఏప్రిల్ 13న విరమించారు. ఆయన గాంధేయవాది. ఆ మార్గంలోనే చేశారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిరాగాంధీ సుముఖత వ్యక్తం చేశారు. చిత్రంగా మే 7న మీసా చట్టాన్ని సవరించా లని విపక్షాలు లోక్ సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాయి. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దేశంలో అంతు ర్యద్ధం వంటి తీవ్ర పరిస్థితులు ఉంటేనే అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవాలి. కానీ అవేమీ లేవు. అందుకు ఈ పరిణామాలే నిదర్శనం. అలజడులన్నీ పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని అనుసరించినవే.
అలహాబాద్ హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టేలతో ఇక ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ విపక్షాలు ఉద్యమానికి పథక రచన చేశాయి. జూన్ 25,1975 (సుప్రీంకోర్టు షరతులతో స్టే ఇచ్చిన రోజే) లోక్ సంఘర్ష సమితిని ప్రకటించాయి. దీనికి అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్. కార్యదర్శి నానాజీ దేశ్‌ముఖ్, కోశాధికారి అశోక్ మెహతా. ఆ సాయం త్రమే రామ్‌లీలా మైదానంలో చరిత్రాత్మక బహిరంగ సమావేశం జరిగింది. ఆ రాత్రే సరిగ్గా 11.45 నిమిషాలకు రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకట నపై సంతకం చేశారు (ది జడ్జిమెంట్, కులదీప్‌నయ్యర్). రామ్‌లీలా మైదానంలో జరిగిన సభని, అందులో వినిపించిన కొన్ని మాటలను అడ్డం పెట్టుకుని, దానితోపాటు ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ధోరణులని ఉటంకిస్తూ ఇందిర తరువాత ఎమర్జెన్సీ విధింపును గట్టిగా సమర్థించు కున్నారు. అంటే, ఎమర్జెన్సీ విధింపునకు అలహాబాద్ హైకోర్టు తీర్పు, దీనిపై సుప్రీంకోర్టు స్టే అత్యవసర కారణాలు మాత్రమే.
1974 ప్రారంభం నుంచి దేశంలో ఒకటొక టిగా వచ్చిన మార్పులు, పరిణామాలు, రాజకీయ కేంద్రీకరణలు అంతిమంగా ఇందిరను ఈ అసాధారణ చర్యకు పురికొల్పాయి. 26వ తేదీ ఉదయం ఆరుగంటలకి ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఎమర్జెన్సీ ప్రతి పాదనను లాంఛనంగా ఆమోదించింది. ఒక గంట తరువాత ఆకాశవాణిలో ప్రసంగిస్తూ ఇందిర ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించారు. ఎమర్జెన్సీ సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది. ఆ రాత్రి, నిద్రపోతున్న కాసును లేపి ఆయన చేత్తో సంతకం చేయించి ప్రకటన పని పూర్తి చేసిన వ్యక్తి హోంశాఖ సహాయమంత్రి ఓం మెహతాయే (‘నా జీవిత కథ’ జలగం వెంగళరావు).
నియంతృత్వ స్థాపనే ధ్యేయం?
ఇందిర హయాంలో కాంగ్రెస్ పార్టీ భారత పాలనా వ్యవస్థకు కొత్త స్వరూపం ఇవ్వాలని అనుకున్న మాట నిజం.పైన ఉదహరించిన పరిణా మాలలో అందుకు సంబంధించిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికి చాలా ముందే ప్రచారంలో పెట్టారు. 1973లో సోవియెట్ రష్యా అధ్యక్షుడు లియెనిద్ బ్రెజ్నేవ్ భారత్‌కు వచ్చినప్పుడు మధులిమాయే ఆయనను కలిశారు. ‘ప్రతిపక్షాలు అనేవి ఉంటే ప్రభుత్వానికి ప్రజలకీ మధ్య ఉద్విగ్న భరిత బంధం ఉండదు’ (టైమ్స్ ఆఫ్ ఇండియా, నవంబర్ 30,1973) అన్నాడు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా అదే సమయంలో తరుచు చేసిన ఒక వ్యాఖ్య బాగా ప్రాచు ర్యంలో ఉండేది`ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర. కానీ ఆయన మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని. చరిత్ర కారుడు ఆచార్య శ్రీనాథ్ రాఘవన్ ఇలాంటి విషయాలు తన గ్రంథం (ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ఇండియా)లో చాలా విషయాలు వెల్లడిరచారు. కాంగ్రెస్ నాయకులు, అధికారులు కొందరు అధ్యక్ష తరహా పాలనవైపు దేశాన్ని మళ్లించే ప్రయత్నం చేశారని రాఘవన్ కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇందుకు వారు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి చాల్స్ డీగోల్ (ఫ్రాన్స్). 1975 సెప్టెంబర్‌లో ఇందిర సన్నిహితుడు బీకే నెహ్రూ రాసిన లేఖను మరొక ఉదాహరణగా చూపారు రాఘవన్. ఎమర్జెన్సీ పేరుతో విశేష ప్రజా మద్దతు వచ్చిందని, దీనిని ఉపయోగించుకోవాలని బీకే నెహ్రూ రాశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన అవసరాలకు తగినట్టుగా లేదని కూడా బీకే తేల్చారు. ఏం చేయాలన్నా ఎన్నికల తంతు ఒకటి ఉంటుందని ఆయన బాధపడిపోయారు. బీకే నెహ్రూ ప్రతిపాద నకు అనూహ్యంగా జగ్జీవన్‌రామ్, స్వరణ్ సింగ్‌ల మద్దతు కూడా లభించింది. నాటి రక్షణ మంత్రి బన్సీలాల్ ఇందిరను జీవితకాలపు అధ్యక్షురా లిని (పార్టీకి) చేయాలని అభిప్రాయపడ్డాడు. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కొత్త రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అక్టోబర్ 1976న పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కోణం
చాలా ప్రశ్నలు ఇప్పటికీ సమాధానాల కోసం వేచి ఉన్నాయి. నాటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, ఒత్తిడులు అత్యవసర పరిస్థితి విధింపు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయా? ఇందుకు సంబం ధించి కూడా పలు వాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.
‘శ్రీమతి ఇందిరాగాంధీ సోవియెట్ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్‌లో అసంతృప్తిని ఏ మాత్రం సహించలేరు. అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిని ఇక ఎన్నటికీ తిరిగిరాని విధంగా సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు…’ ఈ వాక్యాలు అకాలీదళ్ ప్రముఖుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా రాసిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్: స్టోరీ ఆఫ్ ఏన్ ఎస్కేప్’ గ్రంథంలోనివి (స్వేచ్ఛ కోసం: ఒక విహంగయాత్ర, అను: డాక్టర్ జె. చెన్నయ్య, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 2003, పే.34). బర్నాలా కూడా అత్యవసర పరిస్థితిలో అరెస్టయి పంజాబ్ జైళ్లలో దుర్భర జీవితం అనుభవించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజన్ మేనన్ ‘ఇండియా అండ్ ది సోవియెట్ యూనియన్:ఏ న్యూ స్టేజ్ ఆఫ్ రిలేషన్స్’ పత్రంలో (1978) రాసిన అంశాలు బర్నాలా అభిప్రాయానికి సమీపంగా ఉంటాయి. ‘ది మిత్రొఖిన్ ఆర్కైవ్స్ 2:ది కేజీబీ అండ్ ది వరల్డ్’ పుస్తకం (రచయిత వాజిలి మిత్రొఖిన్) ప్రకారం ఇందిర హయాంలో కేజీబీ లంచాలు పడేసి కేంద్ర మంత్రుల నుంచి రహస్యాలు కొనుక్కునేది. ఇందులో కేజీబీ జనరల్ ఒలెఫ్ కులుగిన్ చెప్పిన విషయాలు ఎక్కువ. భారత్‌లో కార్యకలాపాల కోసం కులుగిన్‌ను 1970లో ఆ సంస్థ నియమించింది. ‘ఇందిరాగాంధీ 1975లో భారత్‌లో అత్యవసర పరిస్థితిని విధించే టట్టు చేయడంలో మా ఏజెంట్లు విజయవంతంగా పని చేశారు. అదే (అత్యవసర పరిస్థితి) విపక్షాల నాయకులను జైళ్లకు పంపించడానికి ఆమె ప్రభుత్వానికి అధికారం కల్పించింది. పౌర హక్కులను రద్దు చేయడానికీ, పత్రికల మీద 19 మాసాల పాటు సెన్సార్‌షిప్ విధించడానికీ అవకాశం చూపింది’ అని కులుగిన్ చెప్పాడు. ‘ది మిత్రొఖిన్ ఆర్కైవ్స్ 2: ది కేజీబీ అండ్ ది వరల్డ్’ పుస్తకంలోని విషయాల ఆధారంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెస్టెంబర్ 18, 2005లో ఒక లోతైన వార్తా కథనం ప్రచురించింది. కానీ, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌నాయక్ ఉద్యమిస్తే ఆయన మీద దేశ వ్యతిరేక ముద్ర వేశారు ఇందిర. కాబట్టి ఈ ఇద్దరిలో చరిత్ర ఎవరికి పెద్ద పీట వేయాలి?
యూపీఏ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కార్యదర్శి సంజయ్ బారు రాసిన వ్యాసం (జూన్ 6, 2018, డెయిలీ ఓ)లో ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రతిపాదించారు. అవి అత్యవసర పరిస్థితి నేపథ్యంలోనివే. చిలీ పాలకుడు సాల్వెడార్ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది అంటూ క్యూబా అధ్యక్షుడు ఫైడెల్ కాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ అగమేఘాల మీద అత్యవసర పరిస్థితిని విధించారన్న వాదన గురించి కూడా సంజయ్ బారు ప్రస్తావించారు. అత్యవసర పరిస్థితి నేపథ్యం, కాలం ఇలాంటి చారిత్రక వైచిత్రుల సమ్మేళనమే. వీటి మధ్య వినిపించిన ఇందిర ప్రచార సలహాదారు హెచ్‌వై శారదాప్రసాద్ వ్యాఖ్య అద్భుతం. అది, ‘తన ప్రధానమంత్రి పదవి నుంచి తననే కూల్చడానికి ఇందిరాగాంధీ స్వయంగా చేసుకున్న కుట్ర’. మిగతా వాటి కంటే చరిత్రలో నిలిచే వాదన ఇదే అనిపిస్తుంది.
విద్యార్థి ఉద్యమం, విపక్షాలు
విపక్షం బలహీనంగానే ఉన్నా, 1974 ప్రారంభం నుంచి దేశంలో ఇందిరకు ఇబ్బంది కలిగించే వాతావరణం నెలకొనడం మొదలయింది. నగర్వాలా కేసు వంటి వాటితో ఇందిర ప్రతిష్ట కోల్పోయారు. అంతకు ముందువరకు భారతదేశ ప్రగతికి ఆమె ప్రతీక. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాజ్యోతి. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశానికి దిక్కు లేదు. దాదాపు స్థిరపడిపోయిన ఈ అభిప్రాయాలను పటాపంచలు చేయడం ప్రారంభించిన వారు జయప్రకాశ్ నారా యణ్. స్వాతంత్య్రోద్యమం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేపీ ‘సంపూర్ణ విప్లవం’ పిలుపుతో మళ్లీ రాజకీయాలలో ప్రవేశిం చారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలోను, క్విట్‌ఇండియా ఉద్యమంలోను ఒక ఊపు ఊపి స్వాతంత్య్ర భారతదేశంలో పదవీ రాజకీయాలకు దూరంగా పౌనార్ (మహారాష్ట్ర)లోని వినోబా ఆశ్రమంలో గడుపుతున్న జేపీ ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి సంపూర్ణ విప్లవం పిలుపు ఇచ్చారు. రాజకీయ అస్థిరత్వం, రాజకీయ అవినీతి, విలువల పతనం, దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలు, నిరుద్యోగం, డబ్బు సంచుల చుట్టూ పరిభ్రమిస్తున్న ఎన్నికల వ్యవస్థ, విధానం, వీటికి వ్యతిరేకంగా జేపీ ఉద్య మించదలిచారు. ఎనభయ్ సంవత్సరాల వృద్ధా ప్యంలో ఆయనను ఇలాంటి నిర్ణయం తీసుకునేటట్టు చేసినది బిహార్. అది ఆయన స్వరాష్ట్రం.
అరాచక శక్తులకు, వెనకబాటుతనానికి బిహార్ పెట్టింది పేరు. అలాంటి చోట రాజకీయ స్థిరత్వాన్ని, అభివృద్ధిని సాధించడం కాకుండా అందుకు విరు ద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ముఖ్యమంత్రి వ్యవస్థని తోలుబొమ్మలాటకు మించి వినోద భరితం చేసింది. 1967 నుంచి 1971 వరకు అక్కడ పదిమంది ముఖ్యమంత్రులు మారారు. మహామాయా ప్రసాద్‌తో మొదలైన ఈ ప్రహసనానికి బోలా పశ్వాన్‌శాస్త్రి రాకతో తెర పడిరది. ఈ పదిమందిలో సతీశ్ ప్రసాద్‌సింగ్ కేవలం నాలుగు రోజులు సీఎంగా ఉన్నారు. ఈ నాటకానికి ఇక తెరదించమని, అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపించమని, జూన్ 27, 1968న కాంగ్రెస్ నేత ఇందిరకు టెలిగ్రాం విన్నపం పంపినవారు జేపీయే. తరువాత పరిస్థితులు మరింత విషమించాయి. ధరలు అదుపు తప్పాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ స్థితిలో 1973 చివరిలో జేపీ సంపూర్ణ విప్లవం పిలుపుతో ప్రజలను చైతన్యవంతం చేసే కృషి ప్రారంభించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసి, యూత్ ఫర్ డెమోక్రసి సంస్థలు స్థాపించారు. కేంద్రమంత్రులు బిహార్ మంత్రుల అవినీతి చరిత్రలను బహిరంగ సభలలో ఏకరువు పెట్టారు. విశేషమేమిటంటే జేపీ పిలుపునకు బిహార్ మాత్రం వెంటనే స్పందించలేదు. జేపీ ఊహలన్నీ గుజరాత్ విద్యార్థులు స్థాపించిన నవ నిర్మాణ్ సమితి సాగించిన ఉద్యమం ద్వారా అక్కడ నిజం కావడం మొదలయ్యాయి. గుజరాత్ ఉద్యమ ప్రభావంతో బిహార్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు గురించి ఆందోళన మొదలైంది. ఎమ్మెల్యేలను ఘెరావ్ చేసి, నిల్చున్న పాటున రాజీనామాలు చేయించడం కూడా గుజరాత్ ఉద్యమాన్ని చూసి బిహార్ విద్యార్థులు ప్రారంభించారు. చాలాచోట్ల కాల్పులవరకు వెళ్లింది.
గుజరాత్ విద్యార్థులు పెరిగిన మెస్ చార్జీలు తగ్గించాలని, హాస్టళ్లలో వనతులు మెరుగుపరచాలన్న చిన్న చిన్న డిమాండ్లతో ఉద్యమించారు. ప్రభుత్వం దమననీతిని పాటించింది. దీనితో రెచ్చిపోయిన విద్యార్థులు ముందు విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరారు. ఆపై ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ రాజీనామా చేయాలంటూ ఆందోళనను మలుపు తిప్పారు. చివరికి అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలు జరిపించక తప్పలేదు. జూన్, 12, 1975 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఓడిపోయింది. జనమోర్చా అధికారంలోకి వచ్చింది. సరిగ్గా అదే రోజున అలహాబాద్ హైకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి జగ్‌మోహన్ లాల్‌సిన్హా ప్రకటించారు. 1971 నాటి లోకసభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ఆ తీర్పు సారాంశం. ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాని సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలిపివేయకుండా షరతులతో తీర్పుపై స్టే ఇచ్చింది. దీనితో ఇందిర ప్రధాని పదవిలో కొనసాగరాదంటూ ప్రతి విషయాలు జేపీ సారథ్యంలో ఆందోళనకు ఉపక్రమించాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధార్థ శంకర్ రే ఆమెకు సూచించిన మార్గం ఎమర్జెన్సీ.
బోనులో నిలబడిన ప్రధాని
భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో అదొక అపురూప ఘట్టం. అది అలహాబాద్ హైకోర్టు ద్వారా నమోదయింది. ఆ హైకోర్టుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, దేశ ప్రధాని ఎన్నిక చెల్లనేరదని చెప్పిన తొలి కోర్టు అదే. వరసగా రెండు రోజులు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి బోనులో నిలబడిన కోర్టు కూడా అదే. మార్చి 18,19-1975న ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి బోనులో నిలబడ్డారు. కాబట్టి ఆ వ్యాజ్యం కూడా చరిత్రాత్మకమే. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయబరేలీ (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరాగాంధీపై పోటీ చేసిన సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాజ్‌నారాయణ్ దాదాపు లక్ష ఓట్లతో తేడాతో ఓడిపోయారు. కానీ ఇందిర ఎన్నిక చెల్లదని రాజ్‌నారాయణ్ ఏప్రిల్ 24, 1971న పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికలలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆయన ఆరోపణ.1971లో మొదలైన విచారణ 1975 జూన్ రెండోవారంతో పూర్తయింది. ఈ కేసు కోసం ఇందిర స్వయంగా కోర్టుకు హాజరై అందరి మన్ననలు పొందారు.
ఫిబ్రవరి 12, 1975 నుంచి సాక్షుల వాఙ్ములాలు నమోదు చేశారు. ఆ సమయంలో పీఎన్ హక్సర్ (ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు) ఇందిరకు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చారు. ఎల్‌కే అడ్వాణి (నాటి జనసంఘ్ జాతీయ అధ్యక్షుడు), కర్పూరీ ఠాకూర్ (బిహార్ మాజీ ముఖ్యమంత్రి), ఎస్. నిజలింగప్ప (కాంగ్రెస్-ఒ అధ్యక్షుడు) రాజ్‌నారాయణ్ తరఫున సాక్ష్యం ఇచ్చారు. హైకోర్టులో ఎస్‌సీ ఖేర్ ఇందిర తరఫు న్యాయవాది. శాంతిభూషణ్, ఆర్‌సీ శ్రీవాస్తవ రాజ్‌నారాయణ్ న్యాయవాదులు. జూన్ 12న అలహాబాద్ హైకోర్టు కిక్కిరిసిపోయింది. విపక్ష ప్రముఖులు మధులిమాయే, శ్యామ్‌నందన్ మిశ్రా, రబీరేలు సహా ప్రముఖ న్యాయవాదులు కూడా వచ్చారు. రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా జూన్ 12న తీర్పు ప్రకటించారు. తన 258 పేజీల తీర్పుతో సిన్హా ఆమెను రెండు ఆరోపణలపై దోషిగా ప్రకటించారు. ఒకటి- ప్రధానమంత్రి సచివాలయోద్యోగి యశ్‌పాల్ కపూర్‌ను ఇందిర తన గెలుపునకు ఉపయోగించుకున్నారు. రెండు – తన ఎన్నికల ప్రచారానికి ఇందిర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సహాయం తీసుకున్నారు. ఈ అధికార దుర్వినియోగం వల్ల ఇందిర ఎన్నిక చెల్లదని, ఆరేళ్లు ఆమె ఎన్నికలలో పోటీ చేయరాదని సిన్హా తీర్పు చెప్పారు. కానీ, ప్రధాని పదవికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తీర్పు రెండు వారాల వరకు అమలు కాకుండా ఉండే వెసులుబాటును కల్పించారు. అంతవరకు ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చు. అప్పీలు చేసుకోవచ్చు కూడా.
కాగా, సిన్హా తీర్పు ‘టెక్నికల్ గ్రౌండ్స్’తో కూడుకున్నదని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఇందిర తరపు కేసు చేపట్టిన ప్రఖ్యాత న్యాయవాది నాని పాల్కీవాలా సలహా ఇచ్చారు. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పుకు బేషరతుగా నిలిపివేయడానికి ఆ సుప్రీంకోర్టు నిరాకరించింది. కేవలం షరతులతో ఒక స్టే మంజూరు చేసింది. ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చునని, పార్లమెంటు ఉభయసభలలో జరిగే చర్చలలో పాల్గొనవచ్చునని, కానీ సభలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనే హక్కు మాత్రం ఆమెకు లేదని వెకేషన్ జడ్జి వి.ఆర్.కృష్ణయ్యర్ తీర్పునిచ్చారు. తరువాత పాల్కీవాలా తన వకాల్తాను వదులుకున్నారు. ఓటుహక్కులేని ప్రధాని సభలో ఎందుకు అని ప్రతిపక్షం, ప్రధానిగా కొనసాగే హక్కు ఇందిరకు న్యాయస్థానమే ఇచ్చిందని కాంగ్రెస్ పక్షం వాదించాయి. అసలు ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టంగా ప్రకటించాక ఇక ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు ఎక్కడిదని విపక్షం ప్రశ్న.
రాజ్‌నారాయణ్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్ కొడుకు ప్రశాంత్ భూషణ్ రాసిన ‘ది కేస్ దట్ షుక్ ఇండియా: ది వెర్డిక్ట్ దట్ లెడ్ టు ది ఎమర్జెన్సీ’ పుస్తకంలో కొన్ని విషయాలు పొందుపరిచారు. మే 23న కోర్టుకు వేసవి సెలువులు ఇచ్చారు. అప్పటి నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్‌లాల్ సిన్హా మీద చాలా ఒత్తిడులు వచ్చాయి. తీర్పులో ఏమి ఉండబోతున్నాయో కూపీ లాగడానికి సీఐడీలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ తన వంతు ప్రయత్నం చేసింది. సిన్హా వద్ద స్టెనోగా పనిచేసిన మన్నాలాల్ ఇంటికి సీఐడీ గుఢచారులు రెండుసార్లు వెళ్లారు (లాల్‌ను జస్టిస్ సిన్హాయే తీర్పు టైప్ చేసిన తరువాత ఎవరికీ దొరక్కుండా సెలవు మీద పంపేశారని కుల్దీప్‌నయ్యర్ రాశారు). సిన్హా ఇంట్లోనే ఉన్నా, ఉజ్జయిన్‌లో ఉన్న తన అన్నగారి (ప్రొఫెసర్) ఇంటికి వెళ్లారని చెప్పించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటున్న జస్టిస్ విపిన్ సిన్హా (జేఎంఎల్ సిన్హా కుమారుడు, అలహాబాద్ హైకోర్టు జడ్జిగా 2020లో పదవీ విరమణ చేశారు) అనుభవాలు కూడా కాస్త భయం గొలిపేవిగానే ఉన్నాయి. ఆయన అప్పుడు 11వ తరగతి విద్యార్థి. తీర్పు ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తరువాత కూడా చాలా హీనమైన భాషలో ఫోన్‌లో తమ కుటుంబాన్ని దూషించారని ఆయన చెప్పారు.
జస్టిస్ సిన్హా తీర్పుతో ఎందరో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇందిర న్యాయవాది ఖేర్ వెంటనే తన సోదరుని కొడుకు వీఎన్ ఖేర్ (తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు)ను పిలిచి స్టేకు దరఖాస్తు రాయించారు. వీఎన్ ఖేర్ ఆదరాబాదరా చేతితో రాసి ఇచ్చారు. తరువాత జస్టిస్ సిన్హా తాను ఇచ్చిన తీర్పు మీద తానే 20 రోజులు స్టే విధించారు. ఆ దరఖాస్తును టైప్ కూడా చేయించలేనంత తొందరగా న్యాయమూర్తికి సమర్పించారు. జస్టిస్ జేఎంఎల్ సిన్హా 2008లో కన్నుమూశారు.
అర్ధరాత్రి అరెస్టులు
అర్ధరాత్రి రెండు`మూడు గంటల మధ్య జయప్రకాశ్ నారాయణ్‌ను, మొరార్జీ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మదర్లాండ్ (ఇంగ్లీషు) దినపత్రిక ఎడిటర్ కె.ఆర్.మల్కానీని అపుడే అరెస్టు చేశారు. మల్కాని ఇంటిని పోలీసులు చుట్టుముట్టి చాలా హడావిడి చేశారు. (మిడ్‌నైట్ నాక్, మల్కానీ) మరునాడు ఉదయం జనసంఫ్‌ు నాయకులు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణి, మధుదండా వతె, మరికొందరిని బెంగుళూరులో అరెస్టు చేశారు. ఈ అరెస్టులు నిజంగా విశేషమే. పార్టీ ఫిరాయింపుల బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించడానికి పార్లమెంటరీ బృందం తరఫున వెళ్లి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండగానే వాజపేయి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా శాంతిభద్రత లకు విఘాతం కల్గించిన వారిపై ప్రయోగించే ఐ.సి.సి.151 నిబంధనతో అరెస్టు చేశారు. ఇదంతా అడ్వాణి తన జైలు డైరీ ‘ప్రిజనర్స్ స్క్రాప్‌బుక్’లో వర్ణించారు. జూన్ 30, 1975న నాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్‌ను అరెస్టు చేశారు. ఆగస్ట్ 28న నానాజీ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 16న బొంబాయిలో జరిగిన సమావేశంలో సంఘర్ష సమితి కార్యదర్శిగా రవీంద్ర వర్మను నానాజీ స్థానంలో ఎన్నుకున్నారు. వర్మను కూడా ఫిబ్రవరి 12, 1976న అరెస్టు చేశారు. ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్నని, తెన్నేటి విశ్వనాథం, జూపూడి వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తంమీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. లక్షన్నర అని మరో వాదన (జేపీని నవంబర్ 12, 1975న, మొరార్జీని ఫిబ్రవరి 24, 1976న, అటల్ బిహారీ వాజపేయి ఫిబ్రవరి 26, 1976న అస్వస్థత కారణంగా విడుదల చేశారు).
సెన్సార్‌షిప్
ఎమర్జెన్సీ విధించిన తరువాత వెంటనే తీసుకున్న చర్య సెన్సార్‌షిప్. జూన్ 26 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రకటించినదే ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎమర్జెన్సీ తీవ్రత ఎలాంటిదో తెలియకుండా దృష్టి మళ్లించడానికి గొప్పగా ఉపయోగపడిరది. ఇరవై సూత్రాలతోపాటు ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ ప్రవచించిన నాలుగు సూత్రాల ప్రణాళిక కూడా పనిలో పనిగా అమలులోకి వచ్చింది. ఆ సూత్రాలలో ఒకటి కుటుంబ నియంత్రణోద్యమం. ఇదే అంతిమంగా కాంగ్రెస్‌ను అధికారపీఠం నుంచి కూలద్రోయడానికి ఆయుధమైంది. ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని సవరించారు. లోకసభ కాలపరిమితి పెరిగింది. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చామంటూ వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఒక్క ఆంధ్రలోనే 1975 సెప్టెంబర్ నాటికి 1600మంది ఎన్‌జిఓలను బలవంతంగా పదవీవిరమణ చేయించారు. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జలగం సెప్టెంబర్ 20న సెక్రటేరియెట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడిరచారు. ఇలా క్రమశిక్షణ పాటించనందుకు, అసమర్ధత పేరుతోనే ఉద్యోగాల నుంచి పలువురిని తొలగించినట్టు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు చాలా సగర్వంగా పత్రికలకు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్, ఆనందమార్గ్, జామాయతీ ఇస్లాం, సి.పి.ఐ. (ఎం.ఎల్)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. విశేషమేమంటే క్విట్‌ఇండియా నాయిక అరుణా అసఫాలీతో సహా ఎందరో ప్రముఖులు ఇందిర చర్యను ప్రశంసించారు. కాంగ్రెస్ సంగతి సరేసరి.
ఇంతకీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరూ ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? ఇందుకు కారణం ఒక్కటే. ఆగస్ట్ 1,1975న 38వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జూలై 23 రాజ్యసభ, మరునాడు లోక్‌సభ ఆమోదించాయి. కాబట్టి ఎమర్జెన్సీని ఎవరూ కోర్టులలో సవాలు చేయడం నిషేధం. ఆగస్ట్ 16, 1975న 39వ రాజ్యాంగ సవరణ కోసం మరొక బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎంపిక మీద కోర్టులో సవాలు చేయడం నిషేధం.
అయితే ఇందిర రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ నుంచి ప్రతిపక్షాలు వెనక్కు తగ్గలేదు. ఆనాడు 542 మంది సభ్యులున్న లోకసభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవైలోపే. కాని, జూన్ 25, 1975 జె.పి.లోకసంఘర్ష సమితిని ఏర్పాటు చేశారు. దీనికి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు. జనసంఫ్‌ుకు చెందిన నానాజీ దేశముఖ్ కార్యదర్శి ఈ సంస్థ ఆధ్వర్యంలో చెప్పుకోతగిన స్థాయిలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్యోద్యమం జరిగింది. తనకు వ్యతిరేకంగా ఎంత ప్రజాగ్రహం నెలకొని ఉన్నదో ఎన్నికలలో గాని ఇందిరకు తెలియలేదు.
సర్దార్ పటేల్ కుమార్తె మణిబెన్ నాయకత్వంలో సత్యాగ్రహం
జూలై 21-25, 1975 తొలి దశ సత్యాగ్రహాలు పది రోజులు జరిగాయి. రెండో దశ సత్యాగ్రహం నవంబర్ 14, 1975 నుంచి జనవరి 26, 1976 మధ్య జరిగింది. చాందినీ చౌక్ (ఢిల్లీ)లో సత్యాగ్రహం జరిగింది. డిసెంబర్ 12, 1975న దశల వారీగా జరిగిన సత్యాగ్రహం ప్రత్యేకమైనది. అంతా మహిళలే పాల్గొన్న ఈ సత్యాగ్రహంలో సర్దార్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్ (ఎంపీ) పాల్గొన్నారు. నాలుగు బృందాలను వరసగా అరెస్టు చేశారు. అందరినీ జైలుకు పంపినా మణిబెన్‌ను మాత్రం పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఉంచి విడుదల చేశారు. దీనికి నిరసనగా ఆమె ఫిబ్రవరి 5, 1975న పార్లమెంట్‌లో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. సత్యాగ్రహం చేస్తున్నవారు అక్కడ నినాదాలు ఇవ్వడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిరదని, ఆ పరిస్థితులో మణిబెన్‌కు ప్రత్యేక రక్షణ కల్పించవలసి వచ్చినందునే పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు.
జనతా పార్టీ
లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర జనవరి 18,1977న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడిరచారు. అదే రోజున మొరార్జీ, అద్వాణీలు విడుదల అయ్యారు. జనవరి 20, 1977న జనతా పార్టీ ఆవిర్భవించింది. నిజానికి జనతా పార్టీకి 1976లోనే బీజాలు పడ్డాయి. మార్చి 20-21, 1976న బొంబాయిలో విపక్షాల సమావేశం జరిగింది. జనసంఘ్, కాంగ్రెస్-ఒ, భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, ఆర్‌ఎస్‌పీ, ఇంకొందరు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి డీఎంకే ప్రతినిధి, ఆచార్య జేబీ కృపలానీ కూడా హాజరయ్యారు. విపక్షాల విలీనంతో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతున్నదని మే 25న జేపీ ప్రకటించారు. జనవరి 24వ వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలు, జనతాపార్టీగా అవతరిం చాయి. కాంగ్రెస్ (ఒ) జనసంఘ్, భారతీయ లోకసభ, సోషలిస్టు పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయిం చాయి. ఫిబ్రవరి 2న బాబూజగ్జీవన్‌రాం కాంగ్రెస్‌ని, ప్రభుత్వాన్ని విడిచి ఇందిరపై ఆరోపణలు చేయడం ఊహించని పరిణామం. ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీలో కీలకపాత్ర వహించిన వారంతా సంజయ్, బన్సీలాల్, వి.సి.శుక్లా మట్టికరిచారు. వీరితోపాటు ఇందిర కూడా ఓటమి పాలయ్యారు. పదవికి రాజీనామా చేస్తూ ఇందిర ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు ప్రకటించారు. మార్చి 21,1977న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి.జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు. ఎన్నికలు జరిగి, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీదేశాయ్ ప్రధాని పదవి చేపట్టారు. ప్రభుత్వం రెండేళ్లలో కూలిపోయింది.
నమోదు కాని చరిత్ర
చరిత్రకారులదీ, మేధావులదీ మళ్లీ అదే తప్పిదం. స్వాతంత్య్ర పోరాటాన్ని నమోదు చేయడం దగ్గర, నాటి త్యాగాలను అంచనా వేయడం దగ్గర జరిగిన ఘోర తప్పిదం అత్యవసర పరిస్థితిని అక్షరబద్ధం చేయడం దగ్గరా పునరావృత్తమయింది. ఒక కుటుంబానికీ, ఒక రాజకీయ పార్టీకీ ఇష్టం లేనంత మాత్రాన చరిత్ర నమోదు ప్రక్రియ నిలిచిపోదు. ఏవేవో కారణాలతో ప్రత్యక్షసాక్షులు మౌనం దాల్చినా కూడా చరిత్ర మూగబోదు. ఒక చారిత్రక తప్పిదాన్ని తాము సమర్థించిన వాస్తవం బయటకు రాకుండా ఉండేందుకు అసలు ఆ చరిత్రకే పాతర వేద్దామని ఎవరు భావించినా సాధ్యం కాదు. పరిశోధన కన్నా, చారిత్రక సత్యాల కన్నా వాదాలకూ, రాజకీయ విశ్వాసాలకూ పెద్ద పీట వేసే చరిత్రకారుల కలం తడబడినా చరిత్ర మరుగున పడదు. భారతదేశంలో అత్యవసర పరిస్థితి (1975-77) ఘట్టానికీ ఇదే వర్తిస్తుంది. కోర్టులు అభిశంసించినా పదవి వదలని నేతల ఆదేశాలను సైన్యం, పోలీసులు పాటించ రాదంటూ ఒకరిద్దరు విపక్ష నేతలు ఇచ్చిన పిలుపు ఆధారంగా ఎమర్జెన్సీ వికృత విశ్వరూపాన్ని కుదించి చూపేందుకు శతథా ప్రయత్నిస్తున్న నెత్తురు చల్లారిన వ్యక్తులు వర్తమాన సమాజాన్ని దగా చేయడం సరికాదు. జనతా ప్రయోగం విఫలమైనంత మాత్రాన, దేశంలో ప్రజాస్వామ్య దేవతను పునఃప్రతిష్ఠించ డానికి జరిగిన ఉద్యమం వృథా ప్రయత్నంగా పరిగణించడం చరిత్రకు ద్రోహం చేయడమే. ఎమర్జెన్సీ విధించిన శక్తుల వాదనకు వంత పాడినట్టే. ఆ కాలంలో కాంగ్రెస్‌ను దేశ వినాశకారిగా విశ్వసించి తిరగబడిన పార్టీలూ, ధ్వజమెత్తిన వ్యక్తులూ తరువాత ఎమర్జెన్సీని రుద్దిన పార్టీ మోచేతి నీళ్లతో అధికార దాహం తీర్చుకున్నంత మాత్రాన మిగిలిన వారి పోరాటపటిమ చరిత్ర పుటలలో చోటుకు అనర్హమైపోదు. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఆందోళనలో నిశ్చయంగా ఆర్‌ఎస్‌ఎస్‌దే అగ్రస్థానం. సంఘపరివార్ సభ్యుల రాజకీయ వేదిక భారతీయ జనసంఘ్ దే నాయకత్వం. స్వయంసేవకుల త్యాగాలను సాధారణ పౌరులు మన్నించారు, గుర్తించారు. ఆ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిం చిన నిర్మాణాత్మక పాత్ర భారత ప్రజల అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసింది. నాటి సర్‌సంఘచాలక్ దేవరస్ ప్రధానికి రాసిన ఒక లేఖకు వక్రభాష్యం చెప్పి, ఆర్‌ఎస్‌ఎస్ చేసిన పోరాటం మీద, వారి చరిత్ర మీద బురద చల్లడం సాధ్యం కాదు. గాంధీజీ హత్యానంతరం పరమపూజనీయ ఎంఎస్ గోళ్వాల్కర్ నాటి కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరణే దేవరస్ లేఖలోను ప్రతిబింబించింది. అది`మేం ఎన్నికల రాజకీయాలకు దూరం. మా ధ్యేయం హిందూ సమాజ సంఘటన. ఆర్‌ఎస్‌ఎస్ మీద కాంగ్రెస్, సీపీఐ చేస్తూ వచ్చిన దుష్ప్రచారం ఎమర్జెన్సీ విధింపు అనే ఆ రెండు విధ్వంసక శక్తుల చర్యలతోనే పటాపంచలు కావడం గొప్ప చారిత్రక వైచిత్రి. చివరికి సీపీఐ తలదించుకుంది. కలకత్తా డేట్‌లైన్‌తో జూన్ 27, 2015న ది హిందూలో వెలువడిన వార్త ఇందుకు నిదర్శనం. 1975 సమ యంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో పార్టీ విఫలమైందని అత్యవసర పరిస్థితిని సమర్ధిం చడం రాజకీయ తప్పిదమని సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకరరెడ్డి ఇచ్చిన ప్రకటన అది. అది పెద్ద రాజకీయ తప్పిదమేనని మరొక ప్రముఖ సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా కూడా అన్నారు. నిజానికి అలనాటి నాయకుడు చండ్ర రాజేశ్వరరావు తమకు కాంగ్రెస్ ఇవ్వవలసినంత గౌరవం (అత్యవసర పరిస్థితి వంటి పెద్ద నేరాన్ని బాహాటంగా సమర్థించినా) ఇవ్వలేదని వాపోయిన మాట గుర్తుకు తెచ్చుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌కు జాతిలో గౌరవ ప్రతిపత్తులు ఇనుమడిర చడం భరించలేకనే జనతాపార్టీ ప్రయోగాన్ని విచ్ఛిన్నకర శక్తులు భగ్నం చేశాయి. కానీ అంతకంటే ప్రబలమైన జాతీయశక్తి `భారతీయ జనతా పార్టీ` ఆవిర్భావానికి ఆ పరిస్థితులే బాటలు వేశాయి. ఇదొక వైచిత్రి. అత్యవసర పరిస్థితి పరిణామాల అంతిమ ఫలితం బీజేపీ పుట్టుక. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిచేసే పనిలో నిమగ్నమై ఉంది.
– డా. గోపరాజు నారాయణరావు