ఎమర్జెన్సీలో ప్రజల భాగస్వామ్యం గణనీయమైనదని చెప్పారు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు వడ్ల భాగయ్య. ప్రతిపక్షాలు ఏకమై దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజల మధ్య కూడా రాజకీయ ఐక్యతకు దారులు ఏర్పరిచాయని ఆయన అన్నారు. కానీ అంతటి కదలికకు తాత్కాలిక స్ఫూర్తి కారణం కావడం అప్పటి పరిస్థితులలో జరిగిందని కూడా చెప్పారు. ఏమైనా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం నిర్మించడానికి కొంచెం ఆలస్యమైన అత్యవసర పరిస్థితి నేపథ్యంగా పనిచేసిందని భాగయ్య అభిప్రాయపడ్డారు. ఆయన విశాఖ ప్రాంత ప్రచారక్‌గా ఉన్నప్పుడు చేసిన ఇంటర్వ్యూ ఇది.
1975లో దేశ రాజకీయ పరిస్థితులు అత్యవసర పరిస్థితి విధించక తప్పనంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉన్నాయా?
అదంతా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దుష్ప్రచారం మాత్రమే. జేపీ ఉద్యమం నిర్మాణాత్మక మైనది. దేశం పట్ల ప్రేమ ఉన్నవారిలో అత్యధికులు ఆయన వెంట నడిచారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ప్రజలలో ఎంతో ఉత్తేజం కనిపించేది. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, న్యాయస్థానాల పవిత్రతను నిలబెట్టడం గురించి మాట్లాడుతున్న వాళ్లే నాడు జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీడియాను దుర్వినియోగం చేసింది. ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేసి, అధికార పార్టీ మీద కొన్ని భ్రమలు కల్పించింది.
అత్యవసర పరిస్థితి విధింపునకు వెనుక ఉన్న తక్షణ కారణం గురించి మీ అభిప్రాయం ఏమిటి? జస్టిస్ జేఎంఎల్ సిన్హా ఇచ్చిన తీర్పు, ఈ తీర్పు మీద జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఇచ్చిన షరతులతో కూడిన స్టే కారణమనుకోవాలా?
ఈ తీర్పులు ఇందిర రాజకీయ అస్తిత్వానికే ప్రశ్నార్థకంగా మారాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు ఐక్యమవుతూ, తమ ఉద్యమానికి అనుకూలంగా దేశ ప్రజలలో ఏకాభిప్రాయం తీసుకువచ్చాయి. వీటిని అణచివేయడానికే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చట్టాన్ని ఒకరి చేతులలోకి తీసుకోవడం అనే దుష్ట సంప్రదాయం దానితోనే మొదలయింది.
అత్యవసర పరిస్థితి విధింపు కేవలం అభివృద్ధిని ఆశించి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనంటూ ఇచ్చిన వివరణలో వాస్తవం ఉందా?
అసలు ప్రజాస్వామ్యానికి ఏదైనా ముప్పు ఏర్పడితే కదా!
కొన్ని ఆర్థిక లక్ష్యాలను సాధించడానికే అత్యవసర పరిస్థితిని విధించవలసి వచ్చిందని నాటి నాయకులు చెప్పుకున్నారు. 21 నెలల అత్యవసర పరిస్థితి కాలంలో నిజమైన క్రమశిక్షణ గాని, ఆర్థిక పురోభివృద్ధి గాని సాధ్యమైనాయా?
దానిని క్రమశిక్షణ అనుకుంటే, అత్యవసర పరిస్థితి విధించిన తొలి రోజులలోనే కనిపించిందనవచ్చు. తరువాత అసలు దాని జాడే లేదు. ఆర్థిక పురోగతి కూడా అచ్చంగా ఇదే పంథాలో కనిపిస్తుంది. ఆ పేరుతో మొదట కనిపించిన హడావిడి తరువాత లేదు.
పత్రికారంగం గురించి ఒక ప్రశ్న. నాటి ప్రధాని ప్రకటించినట్టు అత్యవసర పరిస్థితి విధించిన సమయానికి భారత పత్రికారంగం ప్రమాదకర పాత్రను పోషిస్తున్నదా?
ఆ మాట పూర్తిగా తప్పు. ఆ సమయానికి చాలా దినపత్రికలు నిష్పాక్షికమైన పంథాలో వెలువడు తుండేవి. న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి, ఆ పోరాటం చేస్తున్నవారికి నాటి వార్తాపత్రికలు మద్దతు ఇచ్చాయి.
సెన్సార్‌షిప్ కారణంగా దేశం మొదటిగా కోల్పోయినదేమిటి? దీనితో కోల్పోయింది భావ ప్రకటనా స్వేచ్ఛ మాత్రమేనా? పత్రికా స్వేచ్ఛ మాత్రమేనా? ఇంకేమైనా కూడా ఉందా? సెన్సార్‌షిప్ కారణంగా మీరు ఎదుర్కొన్న సమస్య ఏది?
వాస్తవం ఏమిటో, కల్పన ఏమిటో తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారింది. చెలరేగిపోతున్న వదంతుల మధ్య సత్యమేదో గ్రహించే అవకాశం మృగ్యమై పోయింది. అత్యవసర పరిస్థితి విధింపుతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఏర్పడిన వాతావరణమిది. మరీ ముఖ్యంగా ప్రజావాణి మూగబోయింది. ఇది ఎంత ప్రమాదకర పరిణామాలకు దారి తీసిందో తరువాత తెలిసివచ్చింది.
పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ఆ రంగంలో సహజంగా ఉంటుందని మనమంతా ఆశించే నిర్మాణాత్మక దృక్పథం 1975 సమయానికి నిజంగా ఉన్నదని భావించవచ్చునా? ఆ నిర్మాణ దృక్పథం, అందులో ఉంటాయనుకునే సమున్నత విలువలు నిజంగానే ఉంటే, అంత దారుణంగా, అంత కర్కశంగా అధికార గణం పత్రికారంగాన్ని అవ మానించగలిగేదేనా? అణచివేయగలిగి ఉండేదా?
పత్రికారంగంలో ఉంటాయని మనమంతా ఆశించే లక్షణాలన్నీ ఆ సమయంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ది స్టేట్స్‌మన్’ ఆనాడు తమకు ఉన్నాయని నిరూపించుకున్నాయి. కానీ కొన్ని పత్రికలు, వార మాసపత్రికల అలా ఉండేందుకు తమవంతు ప్రయత్నం చేశాయి.
అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని రెండవ స్వాతంత్య్ర సమరంగా అభివర్ణిం చారు. ఆ ఉద్యమం పరిధి, ఆశయం, తాత్త్వికతలను సమగ్రంగా పరిశీలిస్తే ఆ మాట అతిశయోక్తి కాదనే నిస్సంశయంగా చెప్పవచ్చు. ప్రజా స్పందన, వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలు వందేమాతరం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలను గుర్తు చేశాయి. కానీ ఆ ఉద్యమం ప్రజల స్మృతిపథం నుంచి అంత వేగంగా ఎలా చెరిగిపోయింది?
1975-1977 మధ్య జరిగిన అత్యవసర పరిస్థితి విధింపు వ్యతిరేకోద్యమంలో ప్రజల భాగస్వామ్యం గణనీయమైనది. కానీ అది తాత్కాలిక స్ఫూర్తితో వచ్చిన ఉత్తేజం. ఆ స్ఫూర్తిని ప్రజానీకంలో స్థిరంగా ఉండిపోయేటట్టు చేయడానికి, ఆ మార్గంలో వారిని చైతన్యవంతులను చేయడానికి మార్గం లేకపోయింది. అంతకు మించిన విషయం` ప్రజల జ్ఞాపకశక్తి కూడా పరిమితమన్న వాస్తవాన్ని గుర్తించాలి. మరొక సత్యం కూడా అంగీకరించాలి. జాతి నిర్మాణం వంటి బాధ్యతలను నిర్వర్తించడానికీ, జాతీయ స్పృహను నిరంతరం కాపాడడానికీ ఉపయోగపడే శాశ్వత వేదిక ఏదీ మన దగ్గర లేదు. అసలు స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్ర మొత్తంలో ఈ వాస్తవాన్ని గమనించవచ్చు కూడా. స్వాతంత్య్ర పోరాటంలోని కొన్ని ఘట్టాలకీ, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరుకు కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, కొన్ని భిన్నమైన అంశాలు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితి కాలం నాటికి పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. సామాజిక పరిస్థితులు మారాయి. పోలీసు యంత్రాంగం, ఉద్యోగస్వామ్యంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రభుత్వం చాలా గుట్టుగా వ్యవహ రించింది. వాస్తవాలను తెలియనివ్వలేదు. నాయకు లను, ఉద్యమకారులను గుట్టుగా అరెస్టు చేసేవారు. కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకులను, ఉద్యమకారులను బహిరంగంగానే అరెస్టు చేశారు.
అత్యవసర పరిస్థితి విధించి రెండు దశాబ్దాలు అవుతున్నది. ఈ కాలం మీద ఆ చర్య మిగిల్చిన జాడ ఏమిటి?
కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయం అది నిర్మించ గలిగింది. దానితో వచ్చిన ఫలితం ఇదే. ఆ ఫలితం ఎలాంటిదో ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది.
అత్యవసర పరిస్థితిని తీవ్రంగా ఎదుర్కొన్నవారు ఆర్‌ఎస్‌ఎస్ వారేనని అంతా అంగీకరిస్తారు. మీరు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు. అప్పుడు మీ అనుభవాలు ఏమిటి?
నేను విశాఖ జిల్లా ప్రచారక్‌గా అప్పుడు పనిచేశాను. విశాఖ వన్ టౌన్‌లో నన్ను అరెస్టు చేశారు. సికింద్రాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉంచారు. అంతకంటే, మీసా కింద, డీఐఆర్ నిబంధనల కింద అరెస్టయిన వారిని దారుణంగా, క్రూరంగా హింసిం చారు. ప్రజలు అత్యవసర పరిస్థితి నాటి వాతావరణా నికి భయపడిన మాట నిజం. అదే సమయంలో వారు తమ దృక్పథాల నుంచి వెనక్కి తగ్గలేదు. ధైర్యసాహసాలను కోల్పోలేదు. జేపీ, మొరార్జీ వంటి స్థాయిని వారు మరచిపోలేదు. కానీ ఈ విషయాలను బయటకు చెప్పడానికి వెనుకాడారు.
విశాఖపట్నం
6-1-1995
(డా. గోపరాజు నారాయణరావు సిద్ధాంత పరిశోధక వ్యాసం
‘ఆంక్షాపర్వం – అత్యవసర పరిస్థితిలో
తెలుగు దినపత్రికల పోరాటం, జంఝాటం’ నుంచి)