జూన్ 27 పూరి రథయాత్ర
సర్వమానవ సమానత్వం, లౌకికతత్వం పూరీధీశుడు జగన్నాథుడి సిద్ధాంతం. ఆయన సన్నిధిలో దర్శనం, అర్చనాదుల్లో హెచ్చు తగ్గులు, మహాప్రసాద స్వీకరణలో తేడాలు ఉండవు. విశ్వరక్షకుడు జగన్నాథుడిని దారుబ్రహ్మ అంటారు. బోయవాడి బాణ ప్రయోగంతో కృష్ణ భగవానుడు అవతారం చాలించినప్పుడు ఆత్మస్వరూప బ్రహ్మ పదార్థాన్ని అవంతీపురాధీశుడు ఇంద్ర ద్యుమ్నుడు దారు విగ్రహంలో నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించాడని పురాణగాథ. ఒడిశాలోని గిరిజన వంశస్థులు దైవపతులుగా స్వామి పూజల్లో పాల్గొంటారు.
దేశంలోని సప్త మోక్షదాయక క్షేత్రాలలో పురుషోత్తమధామం (పూరి) ఒకటి. నీలాచలం, పురుషోత్తమ క్షేత్రంగా వ్యవహరించే దీని ప్రస్తావన మత్స్య, స్కంద, వామన పురాణాల్లో కనిపిస్తుంది. ఆలయంలోని శ్రీపీఠం/రత్నపీఠంపై జగన్నాథుడు `అగ్రజుడు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర, సుదర్శను డితో కొలువుదీరాడు. అర్చనాదుల నుంచి అన్న భోగం వరకు ప్రతి క్రియ, ఉత్సవం ప్రత్యేకమైనవే. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు…’ అని పదకవితా పితామహుడు అన్నమయ్య అన్నట్లు`ఈ క్షేత్రంలో శ్రీవైష్ణవ సంప్రదాయం కొనసాగుతున్నా, ఇక్కడి దైవాన్ని శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవునిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు అర్హర్తగా, ఆలేఖ్యులు శూన్యస్వరూపునిగా అర్చిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ గల పార్శ్వ దేవతల ఆలయాలు, ఆనంద బజార్ (ప్రసాదాల శాల), వంటశాలను కలుపుతూ రేఖ గీస్తే శంఖాకారంలో ఉండడం వల్ల ఈ క్షేత్రానికి శంఖక్షేత్రమని పేరు.
జగన్నాథ రథయాత్ర ప్రపంచలోనే విశిష్ట, అద్భుత ఘట్టం. దాదాపు ఇతర ఆలయాలలో పర్వదినాల్లో, విశేష తిథుల్లో నిర్వహించే ఊరేగింపులో రథంలో ఉత్సవమూర్తులే ఆశీనులై ఉంటారు. ఆ రథాలు కూడా శాశ్వత ప్రాతిపదికమై నిర్మితమై ఉంటాయి. ఈ క్షేత్రంలో అందుకు భిన్నం. ఏ ఏటికాయేడు నిర్మితమయ్యే మూడు రథాలలో మూలవిరాట్టులే కదలి వెళ్లి భక్తకోటికి దర్శనమిస్తారు. రథాల తయారీ ప్రక్రియ అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)నాడు ప్రారంభమై, ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి పూర్తవుతుంది. పాత రథాల కలపను వేలం ద్వారా భక్తులకు విక్రయిస్తారు. అది ఇళ్లలో ఉంటే శుభం కలుగుతుందని వారి విశ్వాసం.
ఇతర క్షేత్రాలలో నిత్య,వార, పక్ష, మాస ప్రాతిపదికగా, ఆలయ సంప్రదాయానుసారం మూలమూర్తికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. జగన్నాథ ‘పరివారం’ మాత్రం ఏడాదికి ఒక్కసారే (జ్యేష్ఠ పౌర్ణమి) స్నానమాడుతుంది. ఆ అభిషేకాన్ని ‘దేవస్నాన పూర్ణిమ’ గా వ్యవహరిస్తారు. సుదర్శనుడు సహా ‘మూర్తిత్రయం’ (జగన్నాథ,బలభద్ర, సుభద్ర)ను పవిత్ర జలాలలో అభిషేకించి ఆ విగ్రహాలను చీకటి మందిరానికి తరలిస్తారు. చన్నీళ్ల స్నానం కారణంగా స్వామి వారు జలుబు, జ్వరం బాధపడతారన్న భావనతో పదిహేను రోజులు పాటు ఆ గదిలో ఉంచి సపర్యలు చేస్తారు. ఆ సమయంలో శ్రీపీఠంలో దేవతా మూర్తుల దర్శనం ఉండదు. ప్రత్యామ్నాయంగా పెద్ద పటాన్ని (పట్టా చిత్ర) ఏర్పాటు చేస్తారు. చీకటిగదిలోని విగ్రహాలకు నిత్య నైవేద్యంగా సమర్పించే పదార్థాలకు బదులుగా, ఆయుర్వేద మూలికలతో చేసిన వాటిని ఆరగింపుచేస్తారు. రథయాత్రకు ముందురోజు (ఆషాఢ శుద్ధ పాడ్యమి) విగ్రహాలను ఆలయంలో పునః ప్రతిష్ఠిస్తారు. అదే ‘నవయవ్వన దర్శనం’. ఆ మరునాడు (విదియ) విగ్రహాలను రథాలపై నందిఘోష (జగన్నాథుడు), తాళధ్వజం (బలభద్రుడు), దేవదళన (సుభద్ర) అలంకరిస్తారు. దీనిని ‘పహాండి’ అంటారు. పూరీ రాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచిన (చేరాపహారా) తర్వాత ప్రారంభయ్యే రథయాత్ర మూడు కిలోమీటర్ల దూరంలోని గుడిరచా (గుడిరచాయాత్ర) మందిరానికి చేరుతుంది. సంతానం లేని ఇంద్రద్యుమ్నుని పట్టమహిషి గుడిరచా దేవి జగన్నాథుడినే కుమారుడిగా అభిమానించింది, దైవంగా భావించింది. ప్రధాన ఆలయం సమీపంలో ఆయన కోసం మందిరం (గుడిరచా మందిరం) కట్టించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి, గుండిచా దేవిని తల్లిగా మన్నించి, ఏడాదిలో కొద్దిరోజులు ఆమె దగ్గర ఉంటానని మాటిచ్చాడు. ఆ ప్రకారం ఆ మందిరానికి చేరడం ఈ యాత్ర ఉద్దేశంగా చెబుతారు. వారం రోజులు అక్కడ బస చేసి దశమి నాడు తిరుగు (బాహుదా యాత్ర) ప్రయాణమవు తాడు. తాళ్లతో కట్టిన ఈ రథాలను లాగేందుకు భక్తజనం ఆనందోత్సాహాలతో పోటీ పడతారు. అది పూర్వజన్మ సుకృతమని, రథం తాడును తాకినా పాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు.
పూరీనాథుడు నైవేద్య ప్రియుడు. ఆయనకు పదుల కొద్దీ రకాల పదార్థాలను నివేదిస్తారు. అన్న ప్రసాదాన్ని కట్టెల పొయ్యిమీద మట్టి కుండలలోనే వండుతారు. కుండ మీద కుండపెట్టి వండడం, అన్నిటిలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషం. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వయంగా వంటలను పర్యవేక్షి స్తారని, అందుకే అవి అంతభోగ్యంగా ఉంటాయని విశ్వాసం. వంటకు ఒకసారి వాడిన పాత్రను మరోసారి ఉపయోగించరు. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని ‘ఒబడా’ అంటారు. దానిని వితరణ చేసే ప్రదేశం ‘ఆనందబజార్’. శ్రీమహావిష్ణువు వేకువజామున రామేశ్వరంలోవ స్నానసంధ్యాదులు ముగించుకొని, బదరీనాథ్‌లో అల్పాహారం, పూరీలో మధ్యాహ్న భోజనం, ద్వారకలో రాత్రి విశ్రాంతి తీసుకుంటాడని ప్రతీతి. అందుకే పూరీలో ప్రసాదాన్ని స్వీకరించడం విశేషంగా పరిగణిస్తారు.
ఆలయ ప్రాకారాన్ని ‘మేఘనాథ ప్రాకారం’, గర్భాలయాన్ని ‘విమాన మండపం’, భక్తులు నిరీక్షించి, దర్శించుకొనే స్థలాన్ని ‘జగమోహన్ మండపం’, ధూపదీప హారతులిచ్చే చోటును ‘భోగమండపం’ అంటారు. ఆలయ శిఖరంపై ఎగురుతూ పతిత పావన పతాకాన్ని ప్రతి ఉదయం మార్చి, కొత్త ధ్వజాన్ని ఎగురవేస్తారు.శంకరభగవత్పాదులు, శ్రీమద్రామానుజులు, శ్రీపాదవల్లభులు, చైతన్య ప్రభువు, గురునానక్, జయదేవ కవీంద్రుడు, తులసీ దాస్, కబీరు లాంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. జయదేవుడు అష్టపదులను ఇక్కడే రాశాడు. స్వామి సదా తమ కళ్లెదుటే ఉండాలని కోరుతూ ఆదిశంకరులు ‘జగన్నాథ స్వామి నయన పథగామీ భవతుమే’ మకుటంతో జగన్నాథాష్టకంలో స్తుతించారు.
‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్!!’
– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్