అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అంటూ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్వాతంత్య్రాన్ని ఎద్దేవా చేసిన శ్రీశ్రీ, ఆ అర్ధరాత్రి స్వాతంత్య్రాన్ని కూడా 1975లో అర్ధరాత్రే హరిస్తే జేజేలు పలికాడు. ఇదొక వైచిత్రి. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదస్పదమైన కాలమది, ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్సీని విధించారు. 1977 మార్చి ఎన్నికలలో ఆమె ఘోరపరాజయాన్ని చవిచూశారు. ప్రజా స్వామ్య పునరుద్దరణ జరిగింది. ఈ రెండు పరిణామాల మధ్య భారత్ ఒక కొత్త చరిత్రను నమోదు చేసుకుంది.
ఆ కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమోననే అనుమానంతో అనేక సంస్థలను నిషేధించారు. దానిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఒకటి. రాత్రికి రాత్రి ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలకు సీలు వేశారు. దొరికిన సభ్యులందరినీ అరెస్టు చేసి జైళ్లకు పంపారు.
నేను ఆనాడు ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఒక సాధారణ విద్యార్థిని. యూనివర్శిటీ హాస్టల్‌లో ఉన్నాను. అప్పుడు నేను ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసేవాడిని. కారణం వీర్రాజు (నందమూరు). వారి అబ్బాయే డాక్టర్ కేశవరావు. విశాఖలో వివేకానంద మెడికల్ ట్రస్టులో 35 సంవత్సరాలు సేవ చేశారు. విశాఖకు కొత్తవాడిని కావడంతో నన్ను ‘మెసెంజర్’గా నియమించారు. అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా ప్రచురించిన కరపత్రాలను సభ్యుల ఇళ్లకు చేర్చడం నా పని.
ప్రచారక్ భాగయ్య అధ్యక్షతన రహస్య సమా వేశాలు జరిగేవి. చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవి. కొంతకాలం అయ్యాక మీరు సత్యాగ్రహం చేయాలి అని బాంబుపేల్చారు. జైలులో ఉన్న మన సభ్యులను కాపాడుకోవాలి. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలి అన్నారు.డిసెంబరు 1, 1975న, సత్యాగ్రహాలు ప్రారంభమవుతాయయని చూచాయగా చెప్పారు. వాస్తవం కూడా చెప్పారు. సత్యాగ్రహం చేస్తే పోలీస్ వారు కొడతారు, అరెస్ట్ చేస్తారు, జైలులో పెడతారు, చదువులు పాడవుతాయి అని. బృందాల వారీగా సత్యాగ్రహం చేయాలి అని చెప్పారు. మొదటి బృందం నాటి ఎమ్.ఎల్.సి. పీవీ చలపతిరావు భార్య శ్రీమతి రాధ నాయకత్వంలో సత్యాగ్రహం చేసింది. ఆవిడ చిన్న పిల్లాడిని చంకన వేసుకొని సత్యాగ్రహం చేశారు. ఆ చంటివాడే ‘మాధవ్’ (విశాఖ గ్రాడ్యుయేట్స్ కాన్స్టి ట్యూయన్సీ మాజీ ఎమ్.ఎల్.సి.). మా వంతు వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్న 8 మంది విద్యార్థులు ఒక బృందంగా సత్యాగ్రహం చేయాలి. ఉదయమే బాగా టిఫిన్ చేసి సత్యాగ్రహం చేసాం. అరెస్ట్ చేసి విశాఖ 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కొట్టలేదు. మంచి భోజనం పెట్టారు. వారి లాంఛనాలు పూర్తి చేసుకొని మమ్మల్ని డిఫెన్స్ ఇండియా రూల్స్ (డి.ఐ.ఆర్.) నిబంధన కింద విశాఖపట్నం సెంట్రల్ జైలుకు పంపారు.
డిసెంబరు 12, 1975న కేసు వాయిదాకు వచ్చింది. ఫస్ట్ ఇన్ఫ్‌ర్మేషన్ రిపోర్టు (ఎఫ్.ఐ.ఆర్.) అర్టెంట్‌గా ఫైల్ చేయండి. వాళ్ల చదువులు పాడవు తాయి అని పోలీస్ వారికి న్యాయమూర్తి గట్టిగా హెచ్చరించి. 23కు వాయిదా వేశారు. ఆ వాయిదాకు ఎఫ్.ఐ.ఆర్ తయారు చేయలేదు. వెంటనే జడ్జిగారు పూచీకత్తుపై మమ్మల్ని విడుదల చేశారు. ఇక మా జైలు అనుభం.
1)నేర నిరూపణ అయిన ఖైదీలు 2) రిమాండ్ ఖైదీలు (నేరం చేశారన్న అభియోగంతో అరెస్టు చేసిన ఖైదీలు). నేర నిరూపణ అయిన ఖైదీలకు జైలు దుస్తులు ఇస్తారు. ఖైదీలందరికి ఒక గొంగళి, ఒక కంచం, ఒక మగ్గు (జర్మన్ సిల్వర్), రెండు మట్టి కుండలు ఇస్తారు (రాత్రులు మల మూత్ర విసర్జనకు). జైలును వార్డులుగా విభజిస్తారు. ప్రతీ వార్డులో 35 నుండి 40 సెల్స్ (గదులు) ఉంటాయి. ప్రతీ సెల్ లోను ముగ్గురు ఖైదీలు అంతకన్నా ఎక్కువ ఉంటారు. పగలు ఆ వార్డులో తిరగవచ్చును. రాత్రి 8 గం॥లకు సెల్స్ లోపల పెట్టి లాక్ చేస్తారు. ఉదయం 6 గం॥లకు తెరుస్తారు. 6.40 ని॥ టీ. రాత్రి వాడిన మలమూత్ర కుండలను లేవగానే శుభ్రం చేసుకోవాలి. అండమాన్ ప్రోర్ట్‌బ్లయిర్ సెల్యూలర్ జైలు (కాలా పానీ)లో తప్ప తక్కిన జైళ్లలోని సెల్స్, ఫరవాలేదు, విశాలంగా ఉంటాయి.
ఉదయం 8 గం॥లకు టిఫిన్, కప్పుతో కొలిచి. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు భోజనం, షరా మామూలే, కప్పుతో కొలిచి. ఒక కూర, పులుసు. వారానికి ఒకసారి మాంసాహారం. రాత్రి భోజనం 6.30 ని॥ల నుండి 7.30 ని॥ల లోపల పూర్తిచేసి తీరాలి, 8వ గంటకు సెల్‌ను లాక్ చేస్తారు కాబట్టి. ఉదయం సెల్ తీయగానే తలలు లెక్క పెడతారు. సాయంత్రం లాక్ చేయక ముందు తలలు లెక్క పెడతారు. కచ్చితంగా సరిపోవాలి. దాన్ని జైల్లోనే హెడ్ ఆఫీసర్‌కు నివేదిస్తారు.
1977లో ‘అఖిల భారత సైన్స్ కాంగ్రెసు’కు విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చింది. ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించబోతున్నారు. అది సుమారు డిసెంబర్ నెలాఖరు. కాబట్టి మా ఎనిమిది మందిలో ఏడుగురిని కోర్టు గోడలు బయటకు రాగానే పోలీసులు నిర్భంధించి మెయింటినెన్స్ ఆఫ్ ఇంటర్నర్ సెక్యూరిటీ యాక్టు క్రింద అరెస్ట్ చేశారు. మమ్మల్ని ‘మీసా డిటెన్యూస్’ అని పిలిచేవారు. ఇలా నిర్భంధించిన మమ్మల్ని కోర్టుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆ విధంగా 21 మాసాలు మేము ఏడుగురం జైలులోనే మగ్గాం. ఇది రాజకీయ ఖైదు కాబట్టి మంచి ఆహారం, మంచి వసతి, సకల సదుపాయాలు కలుగజేశారు.
జైలులో ఉన్న ప్రముఖుల్లో డా॥ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రొ॥ దుగ్గిరాల విశ్వేశ్వరం, డా॥డి. శివప్రసాద్ , ప్రొ॥ సుందర రామయ్య, డా॥ కూరెళ్ల సంతోష్. వీరంతా ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఆచార్యులే. పిళ్లా రామారావు, కె.బాబూరావ్ ప్రసాద్ (ఈ ఇద్దరు బీవీకే కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్). ఇంకా బీవీకే నుంచే తూరంగి సోమలింగం (హిస్టరీ లెక్చరర్), గొర్తి ప్రభాకర శర్మ (తెలుగు లెక్చరర్), దువ్వూరి సత్య నారాయణమూర్తి(బీవీకే స్టాఫ్) కూడా ఇక్కడే ఉన్నారు.
రాజకీయ నాయకుల్లో తెన్నేటి విశ్వనాథం, రాష్ట్ర మాజీమంత్రి సర్దార్ గౌతు లచ్చన్న, ముప్పవరపు వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబు, ఎన్.ఎస్.ఎన్.రెడ్డి, రౌతు ఆదినారాయణ, దాసరి నరసింగరావు, బాండాడ రాధాకృష్ణ, వెంకటరమణ, కె.ఎస్.ఎ.ఎన్.రాజు కూడా జైలుకు ఎమర్జెన్సీ కారణంగా వచ్చారు. ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్థుల్లో సత్యరావు (మాస్టారు), కొల్లా దశపతిరావు, క్రాలేటి శంకర్రావు, గుంటూరు వెంకటేశ్వరరావు నేతి క్షీర సాగర్, శ్రీరాములు, శివానందకుమార్, జగ్గరాజు, భవానీశంకర్ (పిన్న వయస్కుడు), జగదీష్, గోవిందరావు, డా॥ వడ్డి విజయసారథి, డా॥ వేదుల సత్యనారాయణమూర్తి, డా॥ అయ్యగారి వెంకటేశ్వర రావు, బలరామిరెడ్డి (యూనివర్శిటీ ప్రెసిడెంట్) సింహాద్రిరావు, ఏలూరి సత్యనారాయణ మూర్తి, ఇలా చాలా మందిని విశాఖపట్నంలో నిర్భంధించారు.
ఎంతైనా జైలు చదువుకోవడానికి మంచి ప్రదేశం. ఇక్కడి నుండే పరీక్షలు రాసి ఎర్రంశెట్టి సత్యారావు, శ్రీ కొల్లా దశపతిరావులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. రోజూ వ్యాయామం, మధ్య మధ్య పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానానికి జైలు సూపరింటెండెంట్ కపాడియాను ఆహ్వానించడం ఇవన్నీ జరిగేవి. బయటి విషయాలు, మా విడుదల కోసం జరిగే పోరాటాలు, ఉద్యమాలు ఎప్పటికప్పుడు లోపలికి చేరవేసే ఏర్పాటు కూడా ఉండేది. ప్రభాకర శర్మ ఆ ఏర్పాటు చూసేవారు. ఖైదీలను చూడటానికి వచ్చేవారి జాబితాను ఖైదీలు ఇవ్వాలి. ఆ జాబితా లోని వారిని మాత్రమే ఖైదీని చూడటానికి అంగీకరి స్తారు. సీలు వేసిన తినుబండారాలను లోపలికి అనుమతిస్తారు. సీలు వేయని తినుబండారాలను వారు తిని చూసి, అప్పుడు అనుమతించేవారు.
మొదటి రోజు ‘చామ దుంపల వేపుడు`చారు’ వడ్డించారు. చాలా రుచిగా ఉన్నాయి. సుమారుగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్ క్యాంప్‌లా ఉండేది. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నలుగురు గన్‌మెన్‌లు వాహనం తీసుకుని డైరెక్టుగా విశాఖలోని కె.జి.హెచ్. ఆసుపత్రికి తీసుకువెళ్లి వెయిటింగ్ లేకుండా వైద్యం చేయించి తీసుకువచ్చేవారు. జైలులో పిళ్లా రామారావు, సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యవాహ ఎస్.టి.జి.కృష్ణమాచారి (ఆర్‌ఎస్‌ఎస్ విద్యాశాఖల కార్యదర్శి, మంచి భోజనం పెట్టటంలో ఆయనే సాటి. క్యాంపులలో ఆయనే భోజన వసతి చూసేవారు). తెన్నేటి విశ్వనాథం స్వాతంత్య్ర సమర యోధుడు, విశాఖ ఉక్కు నిర్మాత, మాజీ మంత్రి. ఎన్.ఎస్.ఎన్.రెడ్డి, విశాఖ మేయర్‌గా చేశారు. కంభంపాటి హరిబాబు ప్రస్తుతం ఒరిస్సా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి. వీరంతా మాకు ఆహ్వానం చెప్పడానికి జైలు గేటు దగ్గరకు వచ్చారు. హరిబాబు హార్మోనియం బాగా వాయించేవారు. వారు తలో వాయిద్యం చేతబట్టుకొని మాకు ఆహ్వానం పలికారు. అందరిలో పిన్న వయస్కుడిని నేను. అందుకే అందరూ నన్ను గారాబంగా చూసేవారు. అయితే కొద్దిరోజులకే కర్రా భవానీ శంకర్ (18 ఏళ్లు) అరెస్టయి జైలుకు రావడంతో నా హోదా పోయింది. ఆయనను మేమంతా గారాబం చేసేవాళ్లం.
కృష్ణాష్టమి సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించారు. దానిలో ఒకటి ఈటింగ్ కాంపిటేషన్. రెండు నిమిషాల్లో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటారు. దానిలో ప్రొ॥ దుగ్గిరాల విశ్వేశ్వరం ప్రథమ, కాశింశెట్టి సత్యనారాయణ ద్వితీయ బహుమతులు పొందారు. సూర్య నమస్కారాల పోటీలో కొల్లా దశపతిరావు, కాశింశెట్టి సత్యనారాయణ మిగిలారు. వీరికి బహుమతులు వచ్చాయి. పండగకి స్పెషల్ స్వీట్ ‘‘అరిసెలు’’ వండిరచారు. వీరంతా ఆర్‌ఎస్‌ఎస్ వారు కావడం వల్ల రోజూ ఓ షెడ్యూలు ఉండేది. ఉదయం టిఫిన్లు అయ్యాక వ్యాయామం, సంఘ శాఖ, స్నానాలు, పారాయణం (భగవద్గీత) మధ్యాహ్న భోజనానికి ముందు ఓ గంట విరామం. భోజనానంతరం ఓ గంట తరువాత ఉపన్యాసాలు. వారానికి ఒకసారి ఉపన్యాస పోటీలు. దీనిలో ఎప్పుడు డా॥ వడ్డి విజయసారథికే బహుమతి. సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు ఆటలు, తరువాత స్నానం, భోజనం, 8 గం॥లకు లాకప్, ఇక్కడ విడివిడిగా వీరిని సెల్స్‌లో పెట్టరు. సెల్లారు లాంటి హాల్సు, ఒక్కోదానిలో 10 నుండి 12 మంది వరకు ఉంచేవారు. దీనికి ఎటాచ్డ్ టాయ్‌లెట్స్ ఉండేవి.
బట్టల సబ్బు, సీకాయి సబ్బు, బ్రష్, టూత్‌పేస్ట్, టంగ్‌క్లీనరు, రోజు లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చి ఇస్తారు. (ఎలవెన్స్‌లు ఇచ్చేవారు. దాన్ని నుండి కొన్న భగవద్గీత నేటికి ఉన్నది. 12.09.1976 నాడు కొన్నది). పెన్ను పేపర్లు కూడా సరఫరా చేస్తారు. లోపల దుకాణం ఉంది. బయట నుండి ఆర్టిస్ట్‌లు వచ్చి ఎంటర్‌టైన్‌మెంటు ప్రోగ్రాం ఇస్తారు (నెలకు ఓసారి). మాకు కాలం తెలిసేది కాదు, ఏనాడు ఎవరిలోను అది జైలు, మేము ఖైదీలమన్న భావనే లేదు, జీవితం నాశనమైపోతుందన్న భయం లేదు.
జైలులో ఒకే వార్డులో (రైటిస్టులు, లెఫ్టిస్టులు) రాజకీయ ఖైదీలు అందరూ ఉండేవారు. జైలు సూపరింటెండెంట్ కపాడియా మంచి కృష్ణభక్తుడు, గుజరాతీ. ప్రతివారం తప్పనిసరిగా రౌండ్స్‌కు వచ్చేవారు. సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారు. మా పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి గౌరవంగా పలకరించే వారు. సుబ్రహ్మణ్యశాస్త్రి మా నాయకుడు, ఆయనే మాట్లాడేవారు. మిగిలిన వారంతా ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణతో నిలబడేవారం. సుబ్రహ్మణ్యశాస్త్రి కపాడియాను జేబుతో వేసుకున్నాడు అంటూ లెప్టిస్టులు కొందరు మాటలు తూలుతూ ఉండేవారు అయినా సహించేవారు. లెఫ్టిస్టులు రాచకొండ విశ్వనాథశాస్త్రి, చలసాని ప్రసాద్ మరో 10 మంది వరకు ఉండేవారు. జైలులో కృష్ణాష్టమి వేడుకలు చేసి కపాడియాను ఆహ్వానించాం. ఆయనే ప్రసాదం తీసుకువచ్చి అందరికి పంచారు. లెఫ్టిస్టులు పచ్చి బూతులు తిట్టారు. అన్నీ ‘ల’ కారాలతోనే. తరువాత కపాడియా ఇంట్లో వాళ్లను కూడా, ఇక్కడ రాయడానికి వీల్లేని తిట్లు తిట్టారు.
కపాడియా ఎక్కువ కాలం తెలుగు ప్రాంతంలో పనిచేయడం వల్ల తెలుగు బాగానే వచ్చు. వీళ్లకు ఆయన ఇచ్చిన సమాధానం సినిమా హీరో డైలాగులా పేలింది. ‘మీరు జైలులో ఉన్నారు. మావాళ్లు జైలు ఆవల ఉన్నారు. అది మీకెలా సాధ్యం? ఏది సాధ్యమంటే, నేను జైలు బయట ఉన్నాను, పచ్చి బూతులు తిడుతున్న మీ కుటుంబసభ్యులు జైలు బయటనే ఉన్నారు. కాబట్టి నీవు చెప్పిన మాట నాకు సాధ్యమవుతుంది’ అన్నారు. ఆయనకు వచ్చీరాని తెలుగులో సమయ స్ఫూర్తిగా చురకవేయ గలిగారు. వాళ్ల కార్యక్రమానికి వచ్చాను. మీరు చేస్తే మీ కార్యక్రమానికి వస్తాను అని సర్ది చెప్పారు. అంతేకాని తిట్టకండి అని హెచ్చరించారు. తరువాత రైటిస్ట్‌లను అక్కడే ఉంచి లెఫ్టిస్ట్‌లను వేరే వార్డుకు మార్చారు. మమ్మల్ని 1977 మార్చి తరువాత విడుదల చేశారు. స్వేచ్ఛాజీవుల మయ్యాం, అదే ప్రజాస్వామ్యం. ఆనాడు తెలియలేదు, నేను ఇంత గొప్పవాళ్ల మధ్య జైల్లో గడిపానని.. ఏభై ఏళ్లు కాలగర్భంలో కలిసి పోయాయంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ దేశంలోని అన్ని జైళ్లు ఇలా లేవు. అదొక విషాద చరిత్ర.
– డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు