ఎమర్జెన్సీలో జాగృతి
జాతీయ వారపత్రిక ‘జాగృతి’ ప్రస్థానం అత్యవసర పరిస్థితిలో ఎలా ఉంది? ఎమర్జెన్సీకి ప్రధాన శత్రువు పత్రికారంగమే అయిన నేపథ్యంలో ఈ ప్రశ్న తప్పదు. చిన్నదైనా, పెద్దదైనా పత్రిక అంటే చాలు, ఎమర్జెన్సీ తడాఖా ఏమిటో చవిచూశాయి. జాగృతి ఆర్‌ఎస్‌ఎస్ వాణి. ఎమర్జెన్సీ విధించిన ఐదు రోజులకు సంచిక (జూన్ 30,1975) యథావిధిగా వెలువడిరది. మొదటి పేజీయే కాదు, సంపాదకీయ స్థలం కూడా ఖాళీగా వదిలారు. ధైర్యంగా ఎమర్జెన్సీకి నిరసన ప్రకటించారు.
సెన్సార్ కన్ను పడినట్టు ఆ ఖాళీలు వెల్లడిస్తు న్నాయి. అయినా, ‘ప్రధాని పదవి ఊడిపోతే దేశసేవ చేసేదెలా?’ పేరుతో ప్రచురించిన వ్యంగ్య రచన (పోగి) ఎలాగో సెన్సారు కత్తెర నుంచి తప్పించు కుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి మీద వ్యంగ్యబాణమిది. ధనికులు, పేదలు అని కమ్యూనిస్టులు సమాజాన్ని చీల్చి పారేసినట్టు, ఇందిరాగాంధీ దేశ సేవాసంప్రదాయాలు తెలిసిన కుటుంబాలు, తెలియని కుటుంబాలు అని చీల్చారని పోగి అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో, తరువాత చాలామంది పెళ్లి కూడా చేసుకోకుండా దేశం కోసం పాటుపడ్డారు. వారు దేశసేవకుల హోదాకు అర్హులు కారా? అంటే, కారనే చెప్పాలంటారు పోగి. ఎందుకంటే దేశసేవా సంప్రదాయాలు తెలిసిన ‘కుటుంబం’లో పుట్టకపోవడమే వారు చేసిన పాపం. అలాంటి దేశసేవ సంప్రదాయం తెలిసిన కుటుంబంలో పుట్టి, కోర్టు తీర్పు వల్ల పదవి ఊడిపోతే సేవ చేయడం ఎలా అంటూ ముగించారీ వ్యాసం.
నాలుగవ పేజీలో వ్యాసం కత్తెర జాడ లేకుండా పాఠకులకు చేరడం వింతలలో కెల్లా వింత. అది సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టేను ప్రశ్నించింది. ‘ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండవచ్చునని జడ్జి చెప్పవలసిన అవసరం ఏమి వచ్చింది?’ అని ప్రశ్నించిందీ వ్యాసం. వ్యాసకర్త ప్రముఖ న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు గొట్టిపాటి మురళీమోహన్. ‘తాను ఏ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆ సభలో ఓటు వేసే హక్కు లేనప్పుడు ఎవరైనా సభ్యుడిగా ఎలా కొనసాగగలరు?’ అని ప్రశ్నిస్తు ప్రఖ్యాత న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎంసీ చాగ్లా మాటలను కూడా ఇదే పేజీలో ప్రచురించారు. అందుకే ఇది యథాతథంగా ఎలా బయటపడిరదో తెలియదు. ఆరో పేజీలో హరియాణాలో బలవంతపు ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల’ వార్త, ఉత్తరప్రదేశ్‌లో సత్యాగ్రహాల వార్తకు చోటు కల్పించారు. తరువాత ఆగస్ట్ 8, 1975 సంచిక వెలువడిరది. ఇందులో పత్రికా సమస్యల గురించి సంపాదకుల సలహాలకు మంత్రి శుక్లా ఆహ్వానం’ పేరుతో ఒక వార్త ఉంది. సంపాదకీయం ‘కంటక నిర్మూలనం’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటక నిర్మూలన చేపట్టినట్టు (అక్రమ వ్యాపారులు, కల్తీ వ్యాపారులు వగైరాల పనిపట్టడం) వచ్చిన వార్త మీద వ్యాఖ్య ఇది. అసలు కంటకులు అంటే ఎవరో వర్ణించారు తప్ప విశ్లేషణ లేదు.
తరువాత ఆగస్ట్ 15,1975 సంచిక ముఖపత్ర కథనాలు కూడా సెన్సారు కన్ను కప్పి వచ్చినవే. ‘సీపీఐపై అదుపు అవసరం’ అన్న శీర్షికతో వ్యాసం ప్రచురించారు. ‘ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష అవసరం’ అన్న వార్త మరొకటి. ఇది ప్రధాని ఇందిరాగాంధీకి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎన్‌జీ గోరే రాసిన లేఖకు సంబంధించినది. సంపాదకీయం` అంతర్జాతీయ బంగారం మార్కెట్ మీద. అక్టోబర్ 6, 1975 సంచికలో వెలువడిన ‘ఎమర్జెన్సీలో 100 రోజులు/ సమీక్షకిది సమయం’ (మ.రా.వ్యా) వ్యాసం, యథాతథ స్థితిని కొనసాగించడం సరికాదని, ఎమర్జెన్సీలో సాధించినట్టు చెబుతున్న అంశాల మీద, ఇక ముందు అధికార విపక్షాలు కలసి ప్రయాణించడం గురించి చర్చ నిర్వహించాలని ఈ వ్యాసంలో కోరారు. మిగిలిన పత్రికల వలెనే బ్లాక్‌మార్కెటీర్లను, దొంగ వ్యాపారులను ఎమర్జెన్సీ నిరోధించిందన్న అభిప్రాయం వైపు ఒకింత మొగ్గు కూడా ఇందులో కనిపిస్తుంది. మొత్తానికి పత్రికను జూన్ 19, 1976 వరకు నడిపించారని, ఆగస్ట్ 12,1977 నాటి సంచిక ద్వారా తెలుస్తుంది. మళ్లీ కలుద్దామంటూ ఆనాటి పత్రికలో పేర్కొన్నట్టు సంపాదకీయం ప్రస్తావించింది. అదే ఎమర్జెన్సీ ఎత్తేశాక, జాగృతి పునర్దర్శనం సందర్భంగా రాసిన సంపాదకీయం ‘తొలి పలకరింపు’. ఈ సంచికను ఆగస్ట్ 12 సాయంత్రం విజయవాడలో దుర్గాభవన్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. విశాఖకు చెందిన పీవీ చలపతిరావు సభాధ్యక్షులు. సదాలక్ష్మి, పిన్నమనేని లింగయ్యచౌదరి (జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షులు), ప్రముఖ రచయిత భండారు సదాశివరావు, ప్రఖ్యాత రచయిత్రి మాదిరెడ్డి సులోచన వంటివారు పాల్గొన్నారు. తరువాత నుంచి ఎమర్జెన్సీ కథనాలు విశేషంగా వెలువడ్డాయి.
ఎమర్జెన్సీలో పత్రికను మూసివేసినప్పుడు నాటి సంపాదకుడు తూములూరి లక్ష్మీనారాయణ ఆంధ్రపత్రికలో చేరారు. ఉప సంపాదకుడు కందర్ప రామచంద్రరావు ఆంధ్రప్రభలో చేరారు. ఎమర్జెన్సీ తరువాత ఈ వ్యాసకర్త సంపాదకుడిగా జాగృతి తిరిగి వెలువడడం ప్రారంభమైంది.
– పి. వేణుగోపాలరెడ్డి, మాజీ సంపాదకుడు, జాగృతి