స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి విధింపు (జూన్‌ 25, 1975) అతి పెద్ద చారిత్రక తప్పిదం. ఆ తప్పు ఇందిరాగాంధీ చేశారు. అత్యవసర పరిస్థితి విధింపునకు చెప్పిన కారణాలు మొదలు, తరువాత తీసుకున్న ప్రతి చర్య ప్రజాస్వామ్య విరుద్ధమే. భారత స్వాతంత్య్ర సమరం నుంచి వచ్చిన  గొప్ప స్ఫూర్తి అత్యవసర పరిస్థితి విధింపుతో ధ్వంసమైంది. అప్పటి అరెస్టులు, జైలు జీవితం ఎందరినో బాధించాయి. అమాయకులను వేధించాయి. ప్రజాస్వామ్యం నశించిపోయిన దశ ఎలా ఉంటుందో ఆ 21 మాసాలు దేశానికి అనుభవానికి తెచ్చాయి. తెలుగు ప్రాంతంలో మొదట అరెస్టయిన వారిగా రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ యలమంచిలి శివాజీ తన అనుభవాలను జాగృతి ముఖాముఖీలో వెల్లడిరచారు.

జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నారు మీరు. ఆ డబ్బయ్‌ దశకంలోనే దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు నిర్ణయం జరిగింది. అందుకు దారి తీసిన పరిస్థితులు, నేపథ్యం గురించి చాలా కథనాలు ఉన్నాయి. కోణాలు కూడా ఉన్నాయి. నాటి ప్రధాని, అత్యవసర పరిస్థితి విధింపు వంటి తీవ్ర నిర్ణయం తీసుకున్న ఇందిరాగాంధీ, ఆమె కాంగ్రెస్‌ పార్టీ వాదన ప్రకారం విపక్ష ప్రముఖులు హింసకు ప్రేరేపించారు అని. విపక్షాలేమో అసలు అత్యవసర పరిస్థితిని ఏ పరిస్థితులలో విధిస్తారో అవేమీ ఆనాడు దేశంలో లేవని అంటారు. ఇంతకీ ఆ నేపథ్యం ఏమిటి?

1973,1974 చాలా కీలకమైన సంవత్సరాలు. గుజరాత్‌లో, బిహార్‌లో విద్యార్థులు తమ సమస్యల మీద రోడ్డెక్కారు. మెస్‌ ఛార్జీల పెంపు అంశంతో గుజరాత్‌లో మొదలైన అలజడి ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి వ్యవహారాల పట్ల నిరసనగా మారిపోయింది. బిహార్‌లో మార్చి,1974లో ఛాత్ర సంఘర్షణ సమితి ఏర్పడిరది. దీనికి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. తరువాత బిహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ షిండే. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి సమయంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) వైద్యం కోసం పట్నా వచ్చారు. అప్పటికే రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమానికి నాయకత్వం వహించవలసిందిగా విద్యార్థులు ఆయనను కోరారు. మొదట నిరాకరించినా, తరువాత ముందుకు వచ్చారు జేపీ. అదే సంపూర్ణ విప్లవంగా రూపుదిద్దుకుంది. అప్పుడు యంగ్‌టర్క్స్‌గా పేర్గాం చిన చంద్రశేఖర్‌, కృష్ణకాంత్‌, మోహన్‌ ధారియా, రామ్‌ధన్‌ జేపీని ఆహ్వానించి ఉద్యమం గురించి చర్చించారు. చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ సభ్యుడన్న సంగతి ఇక్కడ విస్మరించలేం. అవినీతిలో కూరుకుపోయిన గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మొరార్జీ దేశాయ్‌ మద్దతుగా నిలవడం మరొక అంశం. అవినీతి అంతం కోసం, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి వ్యతిరేకంగా దేశంలో యువతను చైతన్యవంతం చేయడానికి జేపీ దేశయాత్ర చేపట్టారు. ఆయనకు కాశీలో దెబ్బ తగిలింది. ఒరిస్సాలో యూత్‌కాంగ్రెస్‌ అల్లరి చేసింది. తరువాతనే విశాఖపట్నం వచ్చారు. భువనేశ్వర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌ అడ్డం పడ్డారు. జేపీకి తగలవలసిన దెబ్బ ఆయనకు తగిలింది.

జేపీ ఉద్యమం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ఎలా స్పందిం చింది?

సంపూర్ణ విప్లవం అని కదా ఆయన పిలుపు. మార్చి, 1975లో జేపీ విశాఖపట్నం వచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడే ఒక తమాషా జరిగింది. జేపీలో సంస్కరణ ధోరణి ఉండేది. అందుకే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాం అనే వాళ్లు చేతులెత్తండి అన్నారాయన. మూడే చేతులు లేచాయి. హతాశుడయ్యాడు పాపం. వీళ్లతోనా ఉద్యమం అని ఆయన నోటి నుంచి వచ్చేసింది. తరువాత విజయవాడ ముచ్చట. ఇంతకీ జేపీని విజయవాడకు ఆహ్వానించినవారు హేతువాద ఉద్యమ నేత గోపరాజు రామచంద్రరావు (గోరా). ఈయన అంతకు ముందే జేపీ ఉద్యమం సరికాదని ఒక ప్రకటన ఇచ్చేశారు. దీనితో గోరా సభకు జేపీ వెళ్లడం గొట్టిపాటి మురళీమోహన్‌, ఎంవీ రామమూర్తిలకి ఇష్టం లేదు. వీరు తమ అభిప్రాయాన్ని జేపీకి చెప్పేశారు. ఆయన మధ్యేమార్గంగా మేం మాంటి స్సోరి కళాశాలలో ఏర్పాటు చేసిన సభకు మొదట హాజరయ్యారు. నేను, వెంకయ్యనాయుడు కూడా మాట్లాడాం. జేపీ ఉపన్యాసానికి రామమూర్తి అనువాదం. హోరున వర్షం మొదలయింది. జనం చెల్లాచెదురయ్యారు. జేపీ తడిసి పోకుండా కొమరగిరి కృష్ణమోహన్‌రావు ఒక టవల్‌ కప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. లోపాయికారి విషయం. అప్పుడు కేంద్ర  హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. జేపీకి బందోబస్తులో లోటు చేయవద్దని ముందే హెచ్చరికలు పంపారు, పోలీసు శాఖకి. విజయవాడ నుంచి చెన్నై (నాటి మద్రాస్‌) వెళ్లారు జేపీ.

అప్పటి వార్తలను బట్టి యువజన కాంగ్రెస్‌ జేపీ ప్రచారయాత్రలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. భౌతికదాడులూ జరిగాయి. కానీ విపక్ష ప్రముఖులే దేశంలో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదాడి చేయడానికి కారణం ఏమిటి?

జూన్‌ 12, 1975 దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులను హఠాత్తుగా మలుపు తిప్పింది. కాంగ్రెస్‌ పార్టీకీ, ప్రధాని ఇందిరాగాంధీకీ విద్యుదాఘాతం వంటి పరిణామాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రెండోది ప్రజాతీర్పు. అదీ ఆ రోజే వచ్చింది. గుజరాత్‌ ఎన్నికలలో చిమన్‌భాయ్‌ పటేల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. జనతా ఫ్రంట్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికే కాంగ్రెస్‌ అవినీతి వ్యవహారాలు దేశంలో గగ్గోలుగా ఉన్నాయి. అలహా బాద్‌ హైకోర్టు తీర్పు మీద ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ షరతులతో స్టే మాత్రమే వచ్చింది. అదే జూన్‌ 25, 1975. ఇక ఇందిర ప్రధానిగా కొనసాగరాదని ప్రకటిస్తూ విపక్ష ప్రముఖులు ఆ రోజు సాయంత్రమే రామ్‌లీలా మైదానం (ఢల్లీి)లో బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించారు.

ఆ సభలో జేపీ, మొరార్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వివాదాస్పదం అయ్యాయి కదా! ఆ వివాదం ఏమిటండి? దానిని బట్టే అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఇందిర దొరకబుచ్చుకున్నారా?

చట్టం ప్రకారం అధికారంలో ఉండే అర్హత లేనివారు, రాజ్యాంగ బద్ధంగా పదవిని వీడవలసిన వారు ఆదేశాలు ఇస్తే పోలీసులు, సైనికులు పాటించరాదంటూ జేపీ, మొరార్జీ ఇద్దరూ అన్నారని వార్తలు వచ్చాయి. అటువంటివాళ్లు అంత మాట చెప్పకూడదు కదా అన్నదే నాడు వచ్చిన తీవ్ర విమర్శ. ఆ రాత్రే అత్యవసర పరిస్థితి విధించారు.

ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, దేశ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నిక చెల్లదని తీర్పు రావడం నిజంగా సంచలనం. దేశంలో మిగతా ప్రాంతాల వారు ఎలా స్పందించారు?

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జూన్‌ 13న విజయవాడలో నేను ఒక సభ నిర్వహించాను. పాత ఆంధ్రప్రభ కార్యాలయం పక్కనే వేదిక. మరునాడు పెట్టాము. జూన్‌ 13వ తారీకు న్యూ ఇండియా హోటల్‌ దగ్గర పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టాము. మల్లాది సుబ్బమ్మగారు అధ్యక్షులు. న్యూ ఇండియా హోటల్‌ అంటే ఇదివరకు ఆంధ్రప్రభ ఆఫీసు ఉండిరది. కొమరగిరి కృష్ణమోహనరావు, ఎంవీ రామమూర్తి ప్రసంగించారు. ఢల్లీిలో 7,8 పార్టీలు` చరణ్‌సింగ్‌గారి పార్టీ, బిజూ పట్నాయక్‌ పార్టీ, దేవీలాల్‌ హరియాణా విశాల్‌ మంచ్‌, జనసంఫ్‌ు ఇవన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడ్డాయి. జూన్‌ 25న రాంలీలా మైదానంలో వీళ్లంతా ఒక పబ్లిక్‌ ర్యాలీ నిర్వహించారు. అదిచూసిన తరువాత ఎమర్జెన్సీని డిక్లేర్‌ చేసిందామె.

జూన్‌ 25, 1975. ఈ తేదీ చరిత్రను ములుపు తిప్పుతుందని అప్పుడు ఎంతమంది భావించారో తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన తొలి సమాచారం మీకు ఎలా, ఎప్పుడు తెలిసింది?

అంతకు ముందు నాలుగు రోజుల నుంచి నేను విజయ వాడలో ఉన్నాను. ఈయన ఏమైపోయాడో కనపడడం లేదని చెప్పి మా నాన్న వచ్చి నన్ను పట్టుకుని రాత్రికి గుంటూరుకి తీసుకువచ్చారు.

అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతం. చిన్నగా వర్షం పడుతోంది. ఎవరో పట్టాభిపురంలోని మా ఇంటి తలుపు కొట్టారు. తీసి చూస్తే ఇద్దరు ఎస్‌ఐలు, రెండు జీపులలో పోలీసులు. నాకు అరెస్టులేమీ కొత్తకాదు. ప్రత్యేకాంధ్రోద్యమంలో అరెస్టయ్యాను. ఇదేదో అరెస్టు వ్యవహారమే అనిపించింది. నేను ఉదయం తిరిగి రాకపోతే జూపూడి యజ్ఞనారాయణతో చెప్పి సర్చ్‌ వారెంట్‌ ఇప్పించమని ఇంట్లో చెప్పాను. కలెక్టర్‌గారు, ఎస్‌పిగారు అర్జెంట్‌గా తీసుకురమ్మన్నారని పోలీసులు అన్నారు. మమ్మల్నేందుకు తీసుకు రమ్మంటారయ్యా అర్ధరాత్రి అని అడిగాను. తెలియదన్నారు. అరండల్‌ పేట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కొంతసేపటికి కర్లపూడి రాఘవరావుగారిని తీసుకొచ్చారు. అప్పటికి కూడా నాకు అత్యవసర పరిస్థితి విధించిన సంగతి తెలియదు. పోలీసులకీ తెలియదు. కానీ నన్ను అరెస్టు చేసినట్టు హైదరాబాద్‌, ఢల్లీిలకి సమాచారం ఇస్తున్నారని అర్థమైంది. తొలి అరెస్టు నాదే. ఆఖరికి రాజమండ్రి జైలుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. మేం ఆ జైలుకు వెళ్లేసరికే చాలామంది ఉన్నారు. జైలు ‘హౌస్‌ఫుల్‌’ అని పైకి సమాచారం వెళ్లింది. రకరకాల వారంతా` అట్లూరి శ్రీమన్నారాయణ, ఐతా రాములు `సీపీఎంÑ డా. పివీఎన్‌ రాజు, టి. రామాచారి, లక్కరాజు రామనాథం, బొమ్మల శ్రీహరి, బొడ్డు రవీంద్రనాథ్‌, గొట్టిపాటి మురళీమోహన్‌, కొమరగిరి కృష్ణమోహన రావు, జూపూడి యజ్ఞనారాయణ` జనసంఫ్‌ు, వినోద్‌`ఆర్‌ఎస్‌ఎస్‌, తూమాటి బాలకోటేశ్వరరావు, కాతా జనార్దనరావు సోషలిస్టులు. ఎంవిఎస్‌ సుబ్బరాజు` పాత కాంగ్రెస్‌Ñ మాధవ నారాయణ, లక్కలపూడి రామారావు, ప్రకాశ్‌రెడ్డి, రామ్మోహన్‌, సూర్యరావు`ఎం.ఎల్‌. కొంతమంది ఆనంద్‌ మార్గ్‌వారు ఉండేవారు. కొంత మంది స్మగ్లర్స్‌ ఉండేవారు. ఇది రాజమండ్రి జైలు.

ఇంతకీ మీ మీద అభియోగం ఏమిటి?

అదొక పెద్ద ప్రహేళిక. ఎమర్జెన్సీ కాబట్టి ఎందుకు అరెస్టు చేశారో చెప్పక్కరలేదన్నారు. తరువాత చెప్పారు. జూపూడి యజ్ఞనారాయణగారి ఇంట్లో సమావేశమై చెరుకుపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేసి, ఆయుధాలు ఎత్తుకుపోయే కుట్రొకటి చేశామట. మొత్తంగా, జేపీ ఉద్యమం హింసను ప్రేరేపించేదేనని వాళ్ల వాదన. అసలు జేపీ తన ఉద్యమానికంటూ ఒక కార్యాచరణనే ప్రకటించలేదు కదా అన్నాం మేం.

మీతో పాటు ఇంకా జైళ్లలో ఉన్నవారు ఎవరు?

విజయవాడ రైల్వే స్టేషన్‌లోనే జూపూడి యజ్ఞ నారాయణ, బి. సుబ్బారెడ్డి, తూమాటి బాలకోటేశ్వర రావులను మీసా కింద అరెస్టు చేశారని తెలిసింది. వీరిని కూడా రాజమండ్రి తరలిస్తున్నారని సమాచారం కూడా తెలిసింది. కానీ వారిది రోడ్డు మార్గం. మాది రైలుమార్గం. నా జైలు జీవితం ఆరు అరెస్టులు, మూడు విడుదలలు అన్నట్టే జరిగింది. రాజమండ్రి, చంచల్‌గూడ, ముషీరాబాద్‌ జైళ్లలో మొత్తం పది నెలలు. జడ్జి అలా బెయిల్‌ ఇవ్వడం, బయటకు రాగానే పోలీసులు ఇలా అరెస్టు చేయడం. ముషీరాబాద్‌ జైలులో బి. సత్యనారాయణరెడ్డి, వి. రామారావు, వైసి రంగారెడ్డి, డి. సూర్యప్రకాశ్‌రెడ్డి, గౌతు లచ్చన్న, సుంకర సత్యనారాయణ, జీసీ కొండయ్య, తరిమెల నాగిరెడ్డి, ఆయన సోదరుడు రామదాసురెడ్డి ఉండేవారు. అన్నట్టు, ఫ్యాక్షనిస్టుగా వైఎస్‌ రాజారెడ్డి కూడా అప్పుడు ఉన్నారు. చంచల్‌ గూడ జైలులో నాయని నరసింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ఏలే నరేంద్ర, చెరబండరాజు, వరవరరావు, శేషాచారి, ఎం. ఓంకార్‌ ఉండేవారు. న్యాయవాది అయినా కూడా బొజ్జా తారకం కూడా అరెస్టయి ఇక్కడికే వచ్చారు. వరంగల్‌ జైలు నుంచి కోర్టుకు హాజరయ్యే సయమంలో వెంకటనరసయ్య, జక్కా వెంకయ్య వస్తూ ఉండేవారు. బంగారు లక్ష్మణ్‌ కూడా వచ్చేవారు.

ఆనాటి జైలు జీవితంలో మీకున్న కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలు ఏమిటి?

ఒకసారి ఇందిర ఒకమాట అన్నారు. ‘మా నాన్నగారు జైలులో ఉండగానే చాలా రాశారు. ప్రతి నాయకుడు కొంతకాలం జైలులో ఉండడం అవసరమని నాకనిపిస్తుంది అని.’ జైలు అన్నది వేరే అనుభవమే. నా మీద భౌతికంగా ఏమీ దాడి జరగలేదు. విజయవాడలో మొదలైంది జైలు యాత్ర. చుట్టూ పోలీసులు. విజయవాడలోనే ఒక పోలీస్‌ని పిలిచి రూపాయి ఇచ్చి, నాలుగు పత్రికలు తెమ్మని చెప్పాను. తెచ్చాడు. చూద్దును కదా, అన్నీ ఆంధ్ర పత్రికలే. ఇక జైలులో నేను కమ్యూనిటీ రేడియో పెడుతూ ఉండేవాడిని. అది డా. పీవీఎన్‌ రాజుగారికి నచ్చేది కాదు. మిగిలిన వాళ్ల గురించి పట్టదా అని ఆగ్రహించేవారు. చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ (ఈ స్టేషన్‌లో ఉన్నప్పుడే ఆంధ్రపత్రిక సంపాదకుడు శివలెంక రాధాకృష్ణ వచ్చి పరామర్శించి వెళ్లారు) నుంచి నన్ను సి క్లాస్‌ ఖైదీగా పంపేశారు. అంటే దొంగలు, చిల్లర నేరగాళ్లు ఉండేది. ఇక పాయ ఖానాల దగ్గర అనునిత్యం యుద్ధమే. లోపలికి వెళ్లిన వారు కాస్త ఆలస్యం చేస్తే, మేం బయట కడుపు ఉబ్బి చస్తుంటే, లోపల ఆ గాన కచేరీలు ఏమిటి అనేవారు కొందరు కోపంగా. మానసిక స్థితి కూడా మారిపోతూ ఉంటుంది. మొదట ఇందిర మీద ఆగ్రహం కలిగింది. తరువాత అది జైలు అధికారుల మీదకు మళ్లింది. చివరికి కుటుంబం ఎప్పుడు వస్తుందా అని వేచి చూసే దశకు చేరుకుంటాం.

రోజువారీ జీవితం, భోజనవసతి వగైరా ఏమిటి?

మాకు రోజుకు నాలుగున్నర రూపాయలు ఇచ్చేవారు. ఆ పైసలతోనే కొనుక్కోవాలి. జైలు అంటే పెద్ద ఊరు. 15వందలమంది ఉంటారు. పెళ్లాన్ని చంపేసినోడు ఉంటాడు, దొంగలు.. అందరు ఉంటారు కదా. వంట చేయటానికి ఒకరిని ఇచ్చే వారు. బట్టలుతికేవాళ్లను ఒకరిని పెడతారు. అంతా ఈ నాలుగున్నర రూపాయలలోనే. మేమొక 50మంది ఉన్నాం. అందరి డబ్బులు కలిపితే రెండు వందల పాతిక రూపాయలు. ఈ డబ్బులతో రోజు సరుకులు తెప్పించుకోవాలి. వండుకోవాలి. కమ్యూనిటీ రేడియో ఉండేది. దాంట్లో రోజూ ధరవరలు తగ్గాయని చెప్పేవారు. కానీ దుకాణంలో తగ్గేవి కావు. సరుకులు తెచ్చిన వాడిని ఏంట్రా ఇంత రేట్లు రాస్తున్నావు, రేట్లు తగ్గాయని రేడియో చెబుతుంది అనేవాళ్లం. అతడేమో నేను అడిగానండి, అయితే ఆ రేడియోనే అడుగమన్నాడని చెప్పాడు దుకాణదారు అన్నాడు. మాకు నెలకు ఒకటో రెండో కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూలు ఉండేవి. 1975 ప్రాంతంలో జనం దగ్గర డబ్బులు విస్తారంగా లేవు. కుటుంబ సభ్యులు మమ్ములను చూడడానికి రావాలంటే డబ్బులుండేవి కావు. అందుకని హైకోర్టుకు తీసుకెళ్లినప్పుడు బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చి చూసేవారు. తోబుట్టువులు, అమ్మావాళ్లు మా చేతులకు ఉన్న బేడీలు చూసి బావురుమని ఏడిస్తే మాకూ ఏడుపొచ్చేది.

1977 తరువాత భారతదేశం మీద ఎమర్జెన్సీ ప్రభావం ఎంత?

మొదటిగా చెప్పుకోవలసింది ఆంధ్రప్రదేశ్‌ మీద ఎలాంటి ప్రభావం లేదు.ఎమర్జెన్సీ పోరాటం, తరు వాత జనతా పార్టీ నిర్మాణం వంటి పరిణామాలలో ఉన్న బృందాలు ఉన్నాయి కదా – జనసంఘ్, లోక్‌దళ్‌, ఓల్డ్‌ కాంగ్రెస్‌ వంటివి. వాళ్ల స్థిరాభిప్రాయం ఒక్కటే. ఇక ఇందిరాగాంధీ పని అయిపోయింది. భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌ వ్యతిరేక శిబిరానిది.ఆ అధికారం కోసం జరిగే పోరాటంలో ఎవరి వాటా ఎంత? ఎవరి ప్రాధాన్యం ఎంత? అని లెక్కలు వేసుకోవడంలో మునిగిపోయారు. దీనికి ఒక విధమైన నేపథ్యం ఉంది మరి! 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘన విజయం సాధించింది. కానీ ఆమె ఘనత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంటే అంతేవేగంగా ప్రతిష్ట కోల్పోయారామె. ఆఖరికి నగార్వాలా అనేవాడు ఆమె పేర డబ్బులు తీసుకున్నాడంటే కూడా జనం నమ్మే టంతగా ఆమె ప్రతిష్ట పడిపోయింది. ఆ డబ్బులు ఆమె కొట్టేసిందంటే నాకైతే నమ్మశక్యంగా లేదు.

అత్యవసర పరిస్థితి పరిణామాలలో మీకు బాగా నచ్చిన అంశం ఏది?

జైలు జీవితం.

అప్పుడు చూసినవారిలో బాగా నచ్చినవారు?

కొల్లా వెంకయ్య. సీపీఎం నాయకుడు. ఒకసారి ఈయన ఎన్‌.జి. రంగాని ఓడిరచారు.

మొత్తం అత్యవసర పరిస్థితి పరిణామాలలో మీకు రుచించని అంశం?

కాంగ్రెస్‌ వ్యతిరేక శిబిరాన్ని ఏకం చేయలేక పోవడం.

మీరు ప్రధానంగా సోషలిస్ట్‌. వీరి పాత్ర గురించి ఏమంటారు?

తుర్లపాటి సత్యనారాయణ తెలుసు కదా! సోషలిస్ట్‌. ఆయన అన్నమాట చెబుతాను, చాలు. సోషలిస్టులుగా బయలుదేరాం. అన్ని పార్టీలలోను చేరాం. అన్ని పార్టీలనీ చీల్చాం.

About Author

By editor

Twitter
YOUTUBE